
రెండో విడత రుణమాఫీకి ఆర్థికశాఖ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: రైతులకు రెండో విడత రుణమాఫీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు వ్యవసాయశాఖ, బ్యాంకర్లు పంపిన ప్రతిపాదనను అంగీకరించింది. వ్యవసాయ సీజన్ ప్రారంభమైనా ఇప్పటికీ రెండో విడత రుణమాఫీ సొమ్ము విడుదలపై సర్కారు నిర్లక్ష్యం వహిస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను పంపడంతో ఆర్థికశాఖ ఆమోదం తెలిపిందని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
ఇదే విషయంపై శుక్రవారం వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సంబంధిత శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారధి, సంచాలకులు ప్రియదర్శిని సహా రాష్ట్రస్థాయి బ్యాంకర్లు, ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మొదటి విడత రుణమాఫీకి సంబంధించిన అంశాలపై సమీక్ష జరిపారు. ఇప్పటివరకు బ్యాంకులు పూర్తిస్థాయిలో వినియోగపత్రాలు (యూసీ) అందజేయకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తంచేసినట్లు తెలిసింది. యూసీలు రాకుంటే రెండో విడత రుణమాఫీ సొమ్ము విడుదల చేయడం సాంకేతిక ఇబ్బందులకు దారితీస్తుందని ఆయన పేర్కొన్నారు.