పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు కేబినెట్ ఓకే
♦ 2017 సెప్టెంబర్‌కల్లా ఏర్పాటు
♦ 650 బ్రాంచీలతో కార్యకలాపాలు
న్యూఢిల్లీ: పోస్టాఫీసు పేమెంట్ బ్యాంక్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 2017 సెప్టెంబర్ నాటికి దేశ వ్యాప్తంగా 650 బ్రాంచీలతో ఈ బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. దాదాపు రూ.800 కోట్ల కార్పస్‌తో పోస్టాఫీసు పేమెంట్ బ్యాంక్ ఏర్పాటవుతుందని బుధవారం నాడు టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. ఇందులో రూ.400 కోట్ల ఈక్విటీకాగా, రూ.400 కోట్లు గ్రాంట్. దేశంలో మొత్తం 1.54 లక్షల పోస్టాఫీసులు ఉన్నాయి. ఇందులో 1.39 లక్షల పోస్టాఫీసులు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి. పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటు వల్ల గ్రామీణ ప్రాంతాలకు ఆర్థిక అనుసంధానం జరుగుతుందని భావిస్తున్నట్లు రవి శంకర్ ప్రసాద్ వెల్లడించారు.
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిర్వహించే ఈ బ్యాంక్, పటిష్ట స్థాయి నిర్వహణకు అన్ని ప్రయత్నాలూ జరుగుతున్నట్లు మంత్రి తెలిపారు. పోస్టల్ శాఖ, వ్యయ నిర్వహణ శాఖ, ఆర్థిక సేవల శాఖల సహా పలు ఇతర ప్రభుత్వ శాఖలు సైతం బ్యాంక్ సక్రమ నిర్వహణలో భాగస్వామ్యం అవుతాయని అన్నారు. పోస్టాఫీసులకు సంబంధించి కోర్ బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ను పెంపొందించే క్రమంలో 2017 మార్చి నాటికి ‘గ్రామీణ డాక్ సేవకులు’ అందరికీ ఐపాడ్, స్మార్ట్‌ఫోన్లు అందించే విషయమై అధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. పోస్టాఫీసుల కోర్ బ్యాంకింగ్ నెట్‌వర్క్ ఇప్పటికే బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకన్నా అధికంగా ఉంది. ఎస్‌బీఐ 1,666 కోర్ బ్యాంకింగ్ బ్రాంచీలు కలిగివుండగా, పోస్టాఫీసులకు సంబంధించి ఈ సంఖ్య 22,137గా ఉంది.