పలు ద్వైపాక్షిక ఒప్పందాలకూ కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: ‘ప్రధాన మంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్’ (పీఎంజీదిశ) ద్వారా 6 కోట్ల మంది గ్రామీణ కుటుంబాలకు డిజిటల్ అక్షరాస్యత అందించే కార్యక్రమానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ వినియోగాన్ని పెంచే ఉద్దేశంతో రూ.2,351.38 కోట్లతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును 2019 మార్చికల్లా పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ పథకంలో భాగంగా 2.75 కోట్ల మందికి 2017–18లో, 3 కోట్ల మందికి 2018–19లో శిక్షణ అందించనున్నారు. 2.50లక్షల గ్రామపంచాయతీల్లో ఒక్కో గ్రామం నుంచి 200–300 మంది అభ్యర్థులను ఇందుకోసం ఎంపికచేయనున్నారని కేంద్ర ప్రకటన పేర్కొంది.
ఈ కార్యక్రమం ద్వారా మొబైల్ ఫోన్ల ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించటం, డిజిటల్ వాలెట్, మొబైల్ బ్యాంకింగ్, ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థపై పూర్తి అవగాహన కలుగుతుందని ప్రకటన వెల్లడించింది. దీంతోపాటుగా భారత–సెనెగల్ దేశాల మధ్య ఆరోగ్యం, వైద్యం విషయంలో (ఎయిడ్స్ నియంత్రణలో సహకారం, ఆసుపత్రుల నిర్వహణ, డ్రగ్స్–ఫార్మాసూటికల్ ఉత్పత్తులు, ఆసుపత్రుల పరికరాలు, సాంప్రదాయ వైద్యం, వ్యాధులపై నిఘా–తక్షణ ఉపశమనం) చేసుకున్న ఒప్పందాలపై సంతకాలకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత–వియత్నాం మధ్య శాంతియుత అవసరాల కోసం అంతరిక్ష ప్రయోగాల విషయంలో కుదిరిన ఒప్పందాలపైనా కేబినెట్ హర్షం వ్యక్తం చేసింది. బీపీఫ్రాన్స్ (ఫ్రాన్స్ పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు), సాంకేతికాభివృద్ధి బోర్డు (టీడీబీ), శాస్త్ర, సాంకేతిక విభాగాల మధ్య ఒప్పందంపై సంతకాలకూ కేబినెట్ ఆమోదం తెలిపింది.