దివాలా తీసిన విమాన కంపెనీకి మళ్లీ రెక్కలు | Jet Airways: NCRT Restart Approves Consortium | Sakshi
Sakshi News home page

జెట్‌.. సెట్‌.. టేకాఫ్‌! దివాలా విమాన కంపెనీకి మళ్లీ రెక్కలు

Published Wed, Jun 23 2021 12:14 AM | Last Updated on Wed, Jun 23 2021 12:16 AM

Jet Airways: NCRT Restart Approves Consortium - Sakshi

ముంబై: ఆర్థిక సంక్షోభంతో దివాలా తీసిన ప్రైవేట్‌ రంగ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌.. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ ఎగిరేందుకు మార్గం దాదాపు సుగమమైంది. జలాన్‌ కల్రాక్‌ కన్సార్షియం సమర్పించిన పరిష్కార ప్రణాళికకు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) మంగళవారం ఆమోదముద్ర వేసింది. జూన్‌ 22 నుంచి 90 రోజుల్లోగా దీన్ని అమలు చేయాల్సి ఉంటుందని ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్‌ ఆదేశించింది. ఒకవేళ గడువు పొడిగించాల్సిన అవసరం వస్తే ట్రిబ్యునల్‌ను జలాన్‌ కల్రాక్‌ కన్సార్షియం మరోసారి ఆశ్రయించవచ్చని మౌఖికంగా పేర్కొంది. అటు విమానాశ్రయాల్లో స్లాట్‌ల కేటాయింపు అంశాన్ని ప్రభుత్వం లేదా సంబంధిత నియంత్రణ సంస్థ పరిశీలించాల్సి ఉంటుందని ఎన్‌సీఎల్‌టీ తెలిపింది. మరోవైపు ఎన్‌సీఎల్‌టీ రాతపూర్వక ఆదేశాలు వచ్చాక తదుపరి ప్రక్రియపై నిర్ణయం తీసుకోనున్నట్లు జలాన్‌ కల్రాక్‌ కన్సార్షియం పేర్కొంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ను తిరిగి పునరుద్ధరించేందుకు సంబంధిత వర్గాలందరితో కలిసి పనిచేస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో అంతా సవ్యంగా జరిగితే ఈ ఏడాది ఆఖరు నాటికి జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కాగలవని కంపెనీ పరిష్కార నిపుణుడు, గ్రాంట్‌ అండ్‌ థార్న్‌టన్‌ భారత్‌ పార్ట్‌నర్‌ ఆశీష్‌ ఛాచ్రియా ఆశాభావం వ్యక్తం చేశారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ దివాలా ప్రక్రియ ప్రారంభమయ్యాక రెండేళ్ల నుంచి కంపెనీ వ్యవహారాలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. ‘రెండేళ్ల మా శ్రమకు ఫలితం దక్కింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ 2.0 పునరుద్ధరణకు ఎన్‌సీఎల్‌టీ ఉత్తర్వులు తోడ్పడతాయి‘ అని ఆయన పేర్కొన్నారు.

కీలకంగా స్లాట్లు..
రెండేళ్ల క్రితం కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోయిన తర్వాత జెట్‌కి ఉన్న స్లాట్లు ఇతర ఆపరేటర్లకు దక్కాయి. కంపెనీ సర్వీసులు పునఃప్రారంభం కావడానికి ఇవి కీలకంగా ఉండనున్నాయి. ఇదే విషయాన్ని ఆశీష్‌.. ఎన్‌సీఎల్‌టీ దృష్టికి తీసుకెళ్లారు. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ), పౌర విమానయాన శాఖ (ఎంవోసీఏ) దీనిపై తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరారు. అయితే, గత చరిత్ర ఆధారంగా జెట్‌ ఎయిర్‌వేస్‌కు స్లాట్లను కేటాయించడం కుదరదని, నిర్దిష్ట మార్గదర్శకాలకు లోబడే కేటాయింపు ఉంటుందని ఎన్‌సీఎల్‌టీకి దాఖలు చేసిన సంయుక్త అఫిడవిట్‌లో డీజీసీఏ, ఎంవోసీఏ స్పష్టం చేశాయి. మరోవైపు స్లాట్ల అంశం ఎప్పటికి పరిష్కారమవుతుందన్నది చెప్పడం కష్టం అయినప్పటికీ.. నిర్దేశిత గడువులోగా ఒక కొలిక్కి రాగలదని ఆశిస్తున్నట్లు ఆశీష్‌ పేర్కొన్నారు. పలు విమానాశ్రయాలు సామర్థ్యాన్ని విస్తరించుకుంటున్న నేపథ్యంలో తగు స్థాయిలో స్లాట్లు అందుబాటులో ఉండవచ్చని ఆయన తెలిపారు.

రూ. 8,000 కోట్ల బకాయిలు
బ్యాంకులకు  రూ. 8,000 కోట్ల పైచిలుకు బాకీపడిన జెట్‌ కార్యకలాపాలు 2019 ఏప్రిల్‌ నుంచి నిలిచిపోవడం తెలిసిందే. కంపెనీ కార్యకలాపాలు పునఃప్రారంభించే దిశగా జలాన్‌ కల్రాక్‌ కన్సార్షియం సమర్పించిన పరిష్కార ప్రణాళికను గతేడాది అక్టోబర్‌లో రుణదాతల కమిటీ (సీవోసీ) ఆమోదించగా, తాజాగా ఎన్‌సీఎల్‌టీ కూడా ఓకే చెప్పింది. బ్రిటన్‌కు చెందిన కల్రాక్‌ క్యాపిటల్, యూఏఈకి చెందిన వ్యాపారవేత్త మురారి లాల్‌ జలాన్‌ కలిసి ఈ కన్సార్షియం ఏర్పాటు చేశారు.

షేరు జూమ్‌.. 
పరిష్కార ప్రణాళికకు ఎన్‌సీఎల్‌టీ ఆమోదముద్ర వేసిందన్న సానుకూల వార్తతో జెట్‌ షేరు మంగళవారం 5 శాతం (అప్పర్‌ సర్క్యూట్‌) ఎగిసింది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో రూ. 99.45 వద్ద ముగిసింది. మరోవైపు, రెండేళ్ల క్రితం కార్యకలాపాలు నిలిచిపోయినప్పట్నుంచీ జెట్‌ షేరు ధర దాదాపు సగానికి పైగా పడిపోయింది. సర్వీసుల నిలిపివేతకు ఒక్క రోజు ముందు 2019 ఏప్రిల్‌ 16న బీఎస్‌ఈలో షేరు రూ. 241.85 వద్ద క్లోజయ్యింది. ఆ తర్వాత పరిణామాలతో ఒకదశలో సుమారు రూ. 59కి కూడా పడిపోయింది. ప్రస్తుతం రూ. 99.45 వద్దకు తిరిగి కోలుకుంది. రెండేళ్లలో కంపెనీ మార్కెట్‌ విలువ సుమారు రూ. 1,617 కోట్ల మేర హరించుకుపోయింది. తాజా పరిణామాలతో మంగళవారం ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సుమారు రూ. 1,130 కోట్లుగా ఉంది.

జెట్‌ ఎయిర్‌వేస్‌ సంక్షోభం ఇలా..
లీజుకు తీసుకున్న నాలుగు బోయింగ్‌ విమానాలతో, జెట్‌ ఎయిర్‌వేస్‌ 1993లో ఎయిర్‌ ట్యాక్సీ ఆపరేటరుగా సర్వీసులు ప్రారంభించింది. ఆ తర్వాత 1995లో పూర్తి స్థాయి షెడ్యూల్‌ క్యారియర్‌గా మారింది. 2004 మార్చిలో చెన్నై నుంచి కొలంబోకు ఫ్లయిట్‌తో అంతర్జాతీయంగా సర్వీసులు ప్రారంభించింది. 
2019 ఏప్రిల్‌ 17: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న కారణంగా కార్యకలాపాలు నిలిపివేసింది. ఎస్‌బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియం .. ఎన్‌సీఎల్‌టీలో జూన్‌ 19న కంపెనీపై దివాలా పిటిషన్‌ దాఖలు చేసింది.  
2020 మార్చి 13: టేకోవర్‌ చేసేందుకు బిడ్డర్లు ఎవరూ రాకపోవడంతో పరిష్కార ప్రక్రియకు మరింత సమయం ఇవ్వాలని ఎన్‌సీఎల్‌టీని జెట్‌ కోరింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉన్న ప్రాపర్టీని విక్రయించి, కొన్ని రుణాలను సెటిల్‌ చేసుకునేందుకు జూన్‌లో కంపెనీకి ఎన్‌సీఎల్‌టీ అనుమతులు ఇచ్చింది.
2020 అక్టోబర్‌ 17: జలాన్‌ కల్రాక్‌ కన్సార్షియం పరిష్కార ప్రణాళికను రుణదాతల కమిటీ (సీవోసీ) ఆమోదించింది. గత చరిత్ర ఆధారంగా స్లాట్లను కూడా మళ్లీ కేటాయించాలని ఎన్‌సీఎల్‌టీని కన్సార్షియం కోరింది. 
2021 ఫిబ్రవరి 21: జలాన్‌ కల్రాక్‌ కన్సార్షియం అభ్యర్థ్ధనపై స్పందించేందుకు డీజీసీఏకి ఎన్‌సీఎల్‌టీ మరింత సమయం ఇచ్చింది. స్లాట్ల విషయంలో తామేమీ భరోసా ఇవ్వలేమని మార్చిలో డీజీసీఏ తెలియజేసింది. కంపెనీ గత చరిత్ర ఆధారంగా స్లాట్లు కేటాయించలేమని జూన్‌ 3న ఎన్‌సీఎల్‌టీకి డీజీసీఏ, ఎంవోసీఏ తెలియజేశాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement