జెట్ ఎయిర్‌వేస్ లిక్విడేషన్‌కు సుప్రీం కోర్టు ఉత్తర్వులు
జేకేసీ ఇన్వెస్ట్ చేసిన రూ. 200 కోట్ల జప్తునకు ఆదేశాలు
న్యూఢిల్లీ: ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్ దివాలా పరిష్కార ప్రక్రియలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కంపెనీని లిక్విడేట్ చేయాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే, పరిష్కార ప్రణాళిక నిబంధనలను పాటించనందుకు గాను జలాన్ కల్రాక్ కన్సార్షియం (జేకేసీ) ఇన్వెస్ట్ చేసిన రూ. 200 కోట్ల మొత్తాన్ని జప్తు చేయాలని సూచించింది.
ఇక రూ. 150 కోట్ల పర్ఫార్మెన్స్ గ్యారంటీని క్లెయిమ్ చేసుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సారథ్యంలోని కన్సార్షియానికి అనుమతినిచ్చింది. రాజ్యాంగంలోని 142 ఆరి్టకల్ కింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా బెంచ్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. తాజా పరిణామాలతో పాతికేళ్ల పైగా సాగిన జెట్ ఎయిర్‌వేస్ ప్రస్థానం ముగిసినట్లేనని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.
ఎన్‌సీఎల్‌ఏటీకి అక్షింతలు..
జేకేసీ సమర్పించిన పనితీరు ఆధారిత బ్యాంక్ గ్యారంటీని (పీబీజీ) పాక్షిక చెల్లింపు కింద సర్దుబాటు చేసేందుకు నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) అనుమతించడాన్ని సుప్రీం కోర్టు ఆక్షేపించింది. దివాలా కోడ్ (ఐబీసీ) సూత్రాలకు విరుద్ధంగా పేమెంట్ నిబంధనలను పూర్తిగా పాటించకుండానే ముందుకెళ్లేందుకు జేకేసీకి వెసులుబాటునిచ్చినట్లయిందని వ్యా ఖ్యానించింది.
జెట్ ఎయిర్‌వేస్ పరిష్కార ప్రణాళిక ఆమోదం పొంది అయిదేళ్లు గడిచినా కూడా కనీస పురోగతి కూడా లేదని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దివాలా కేసుల విషయంలో ఈ తీర్పు ఓ ’కనువిప్పు’లాంటిదని, ఆర్థికాంశాలకు సంబంధించి ఇచ్చిన హామీలను సకాలంలో తీర్చాల్సిన అవసరాన్ని ఈ ఉత్తర్వులు స్పష్టం చేస్తాయని పేర్కొంది.
1992లో ప్రారంభం..
ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు సేల్స్ ఏజంటుగా వ్యవహరించిన నరేశ్ గోయల్ 1992లో జెట్ ఎయిర్‌వేస్‌ను ప్రారంభించారు. తొలుత ముంబై–అహ్మదాబాద్ మధ్య ఎయిర్ ట్యాక్సీ సర్వీసుగా కంపెనీ కార్యకలాపాలు మొదలుపెట్టింది. ఒక దశలో జెట్ ఎయిర్‌వేస్‌కి 120 పైగా విమానాలు ఉండేవి.
ఇదీ చదవండి: అనిల్ అంబానీకి షాక్!.. రిలయన్స్ పవర్‌పై మూడేళ్ళ నిషేధం
1,300 మంది పైలట్లు, 20,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉండేవారు. అయితే, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో 2019లో కంపెనీ తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేసింది. అప్పటికి జెట్ ఎయిర్‌వేస్ వివిధ బ్యాంకులకు రూ. 8,500 కోట్ల రుణాలతో పాటు పలువురు వెండార్లు, ప్యాసింజర్లకు ఇవ్వాల్సిన రీఫండ్‌లు, ఉద్యోగుల జీతాలకు సంబంధించి వేల కోట్ల రూపాయలు బాకీ పడింది.
దీంతో 2019 జూన్‌లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) జెట్ ఎయిర్‌వేస్‌పై దివాలా పిటీషన్‌ను విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో దివాలా పరిష్కార ప్రక్రియ కింద 2021లో కంపెనీని జేకేసీ దక్కించుకుంది. 2024 నుంచి కార్యకలాపాలు పునఃప్రారంభించనున్నట్లు కూడా జెట్ ఎయిర్‌వేస్ ప్రకటించింది. అయితే, నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన మొత్తాన్ని జేకేసీ సకాలంలో చెల్లించకపోవడంతో వివాదం చివరికి సుప్రీం కోర్టుకు చేరింది.
గురువారం బీఎస్‌ఈలో జెట్ ఎయిర్‌వేస్ షేరు ధర 5 శాతం లోయర్ సర్క్యూట్‌తో 34.04 వద్ద క్లోజయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment