పదోన్నతులకు పాలకమండలి ఆమోదం
పదోన్నతులకు పాలకమండలి ఆమోదం
Published Thu, Aug 4 2016 1:18 AM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో కెరీర్ అడ్వాన్స్ స్కీం కింద పలువురికి అసోసియేట్, ప్రొఫెసర్ పదోన్నతులకు ఎట్టకేలకు పాలకమండలి ఆమోదం లభించింది. ఎస్కేయూ పాలకమండలి సమావేశం బుధవారం ఎస్కేయూ వీసీ ఆచార్య కే.రాజగోపాల్ అధ్యక్షతన హైదరాబాద్‌లో జరిగింది. సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో పలు అంశాలపై కీలక చర్చ జరిగింది. ఎజెండాలో చేర్చిన అంశాలపై జరిగిన చర్చలో అభిప్రాయభేదాలు తలెత్తాయి. ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల నియామకం, దూరవిద్య విభాగంలో నిబంధనలకు విరుద్ధంగా అధ్యయన కేంద్రాల మంజూరు, టెండర్లు లేకుండా నామినేషన్ పద్దతిలో అభివృద్ధిపనులు వంటి అంశాలపై వాడీవేడి చర్చ జరిగినట్లు తెలిసింది. పత్రికల్లో వచ్చిన కథనాలపై కూడా సమగ్రంగా విశ్లేషణ జరిగినట్లు సమాచారం. సాక్షిలో ఈ అంశాలన్నింటిపై అనేక కథనాలు వచ్చాయి. వీటిన్నింటిపై పాలకమండలి సమావేశంలో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో రెక్టార్ ఆచార్య జి. శ్రీధర్ , రిజిస్ట్రార్ ఆచార్య వెంకటరమణ, పాలకమండలి సభ్యులు ఆచార్య ఏ. మల్లిఖార్జున రెడ్డి, ఆచార్య ఫణీశ్వరరాజు, నాగజ్యోతిర్మయి, విజయారావు, ఆచార్య సుధాకర్ బాబు, ఎం. రామయ్య, ప్రిన్సిపల్ సెక్రెటరీ సుమిత్రా దావ్రా, ఫైనాన్స్ అదనపు సెక్రెటరీ సుబ్రమణ్యం పాల్గొన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పాలకమండలిలో చర్చించిన అంశాలిలా ఉన్నాయి.
∙ఇంజనీరింగ్, ఫార్మసీ , బీఈడీ కళాశాలలో అడ్‌హాక్ కాంట్రాక్టు బేసిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్, ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి సమగ్రంగా చర్చించిన అనంతరం కమిటీ వేసిన తరువాత ఎంత మంది అవసరం అవుతారో వారిని భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
∙8 అసిస్టెంట్, 21 అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రీవైజ్డ్ పేస్కేలు, అరియర్స్ ఇవ్వాలనే ప్రతిపాదనకు హైకోర్టులో ఉన్న కేసులు సాకుగా చూపించి తిరస్కరించారు.
∙డాక్టర్ నరేంద్ర మద్దు అమెరికాకు వెళ్లడానికి రామన్ ఫెలోషిప్ ప్రాజెక్టుకు వెళ్లడానికి అనుమతి నిరాకరణ.
∙ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల ఏజెన్సీ ఏడాది సమయం పూర్తయిన వెంటనే ఈ– ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లు అప్పగించాలని నిర్ణయం.
∙దూరవిద్య విభాగంలో నూతనంగా డెబ్ (డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో) నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన నూతన అధ్యయన కేంద్రాల రద్దు చేస్తున్నట్లు వర్సిటీ ఉన్నతాధికారులు సమావేశంలో పేర్కొన్నారు.
Advertisement
Advertisement