రాష్ట్రపతి ఆమోదం: 95% ఉద్యోగాలు స్థానికులకే..  | President RamNath Kovind Accepts Telangana New Zonal System | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి ఆమోదం: 95% ఉద్యోగాలు స్థానికులకే.. 

Published Wed, Apr 21 2021 2:26 AM | Last Updated on Wed, Apr 21 2021 11:02 AM

President RamNath Kovind Accepts Telangana New Zonal System - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 95% స్థానికులతోనే ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమం అయింది. అన్ని రకాల పోస్టుల్లోనూ ఓపెన్‌ కోటా 5 శాతం మాత్రమే ఉండనుంది. ఈ మేరకు రాష్ట్రంలో 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లతో కూడిన కొత్త జోనల్‌ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. పోలీసు విభాగం మినహా ఇతర శాఖలన్నింటికీ ఇది వర్తిస్తుంది. ఇక ముందు కొత్త జోన్ల ప్రకారమే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. నిజానికి 2018లోనే కొత్త జోనల్‌ వ్యవస్థకు ఆమోదం లభించినా.. తర్వాత ప్రభుత్వం మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది, వికారాబాద్‌ జిల్లాను జోగులాంబ జోన్‌ నుంచి చార్మినార్‌ జోన్‌కు మార్చింది. ఈ మార్పులకు కూడా రాష్ట్రపతి ఆమోదం తీసుకోవాల్సి రావడంతో ఇన్నాళ్లు ఆగాల్సి వచ్చింది. తాజాగా రాష్ట్రపతి ఆమోదించడంతో కొత్త జోనల్‌ విధానం అమల్లోకి రానుంది.

ఇప్పటిదాకా చాలా పోస్టులు ఓపెన్‌
రాష్ట్రంలో ఇప్పటివరకు కొన్ని కేటగిరీల్లో 100 శాతం పోస్టులు ఓపెన్‌ కేటగిరీలోనే ఉండటం గమనార్హం. గ్రూప్‌–1లోని డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌ వంటి రాష్ట్రస్థాయి (స్పెసిఫైడ్‌ గెజిటెడ్‌ కేటగిరీ) పోస్టుల్లో 100 శాతం ఓపెన్‌ కోటానే. కొన్ని రాష్ట్రస్థాయి పోస్టుల్లో 50 శాతం ఓపెన్‌ కోటా కిందే ఉన్నాయి. ఈ పోస్టుల కోసం ఇక్కడివారితోపాటు ఇతర రాష్ట్రాల వారూ పోటీపడి, ఉద్యోగాలు దక్కించుకునేవారు. ఇక గ్రూప్‌–1 కేటగిరీలోని మిగతా పోస్టుల్లోనూ కొన్ని మల్టీజోన్, మరికొన్ని జోనల్‌ పోస్టులు ఉండేవి. మల్టీజోన్‌ పరిధిలో 40 శాతం పోస్టులు, జోనల్‌లో 30 శాతం, జిల్లా స్థాయిలో 20 శాతం పోస్టులు ఓపెన్‌ కేటగిరీలో ఉండేవి. వాటిల్లో ఇతర రాష్ట్రాల వారు, ఇతర జోన్ల వారు పోటీపడి ఉద్యోగాలు పొందేవారు. స్థానికులకు అవకాశాలు తక్కువగా ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అమల్లోకి తెస్తున్న కొత్త జోనల్‌ విధానంతో.. ఈ పరిస్థితి పూర్తిగా మారిపోతోంది. జిల్లా పోస్టులతోపాటు 61 కీలక విభాగాల్లోని 95 శాతం పోస్టులు స్థానికులకే దక్కనున్నాయి. 5 శాతం పోస్టులు మాత్రమే ఓపెన్‌ కేటగిరీలో ఉంటాయి.

స్టేట్‌ కేడర్‌ నుంచి మార్చడంతో..
కొత్త జోనల్‌ వ్యవస్థలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 34 రకాల స్టేట్‌ కేడర్‌ (స్పెసిఫైడ్‌ గెజిటెడ్‌ కేటగిరీ) పోస్టులను డైరెక్టు రిక్రూట్‌మెంట్‌ విధానం నుంచి తొలగించి.. మల్టీ జోనల్‌ పరిధిలోకి తెచ్చింది. కొన్ని కేటగిరీల్లో కొత్త జోనల్, జిల్లా విధానం అమల్లోకి వస్తే.. ఆ ఉద్యోగాలు పొందిన వారు సర్వీసు పరంగా నష్టపోకుండా చర్యలు చేపట్టింది. ఆయా పోస్టుల భర్తీ ప్రక్రియను మల్టీ జోనల్‌ స్థాయిలో చేసినా.. పోస్టింగ్‌లు మాత్రం రాష్ట్ర స్థాయి కేడర్‌లో ఇవ్వాలని భావిస్తోంది. తద్వారా కన్‌ఫర్డ్‌ ఐఏఎస్, కన్‌ఫర్డ్‌ ఐపీఎస్‌కు ప్రమోట్‌ అయ్యే వారికి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోంది. ఈ మార్పులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. రాష్ట్ర స్థాయి కేడర్‌ పోస్టుల్లో అత్యధికం పదోన్నతులపైనే భర్తీ కానున్నాయి.

మల్టీజోన్‌ పరిధిలోకి వచ్చే స్టేట్‌ కేడర్‌ పోస్టులు
డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్, రీజనల్‌ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్, కోఆపరేటివ్‌ సొసైటీ డిప్యూటీ రిజిస్ట్రార్, డిస్ట్రిక్ట్‌ పంచాయతీ ఆఫీసర్, డిస్ట్రిక్ట్‌ రిజిస్ట్రార్, డివిజనల్‌ ఫైర్‌ ఆఫీసర్, డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ జైల్స్, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్, గ్రేడ్‌–2 మున్సిపల్‌ కమిషనర్, డిస్ట్రిక్ట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్, డిస్ట్రిక్ట్‌ బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్, డిస్ట్రిక్ట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్, డిస్ట్రిక్ట్‌ ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్, లే సెక్రటరీ అండ్‌ గ్రేడ్‌–2 ట్రెజరర్, అకౌంట్స్‌ ఆఫీసర్‌; అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్, ఎంపీడీవో, లీగల్‌ మెట్రాలజీ అసిస్టెంట్‌ డైరెక్టర్, డీఎస్పీ (కమ్యూనికేషన్స్‌), అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఎండోమెంట్, పాలిటెక్నిక్‌ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, స్టాటిస్టిక్స్‌ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మైన్స్, మెడికల్‌ కాలేజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్, హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్స్‌ మేనేజర్, డిప్యూటీ జనరల్‌ మేనేజర్, ఆయుష్‌ డిపార్ట్‌మెంట్‌ లెక్చరర్స్‌

జోనల్‌ పరిధిలోకి వచ్చే గెజిటెడ్‌ ఆఫీసర్‌ పోస్టులివీ..
గ్రేడ్‌-3 మున్సిపల్‌ కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్, గ్రేడ్‌-2 సబ్‌ రిజిస్ట్రార్, జూనియర్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీసర్, కో-ఆపరేటివ్‌ సబ్‌ రిజిస్ట్రార్, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్, మార్కెటింగ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్, చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు ఆఫీసర్, ఇండస్ట్రీస్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్, అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్, డిప్యూటీ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్, జూనియర్‌ లెక్చరర్, డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్, అగ్రికల్చర్‌ ఆఫీసర్, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్, హార్టికల్చర్‌ ఆఫీసర్, ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్, ఫారెస్టు సెక్షన్‌ ఆఫీసర్, గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీ ట్యూటర్, ఫిజికల్‌ డైరెక్టర్, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ బాయిలర్స్, ఆయుష్‌ మెడికల్‌ ఆఫీసర్‌.

మల్టీజోన్లు.. వాటి పరిధిలోని జోన్లు
మల్టీజోన్‌-1: కాళేశ్వరం-1, బాసర-2, రాజన్న-3, భద్రాద్రి-4
మల్టీజోన్‌-2: యాదాద్రి-5, చార్మినార్‌-6, జోగులాంబ-7 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement