తరతరాల వెనుకబాటు తనాన్ని కూకటివేళ్లతో పెకిలించే గొప్ప నిర్ణయం... ఉత్తరాంధ్ర ప్రజల కష్టాలకు చరమగీతం పాడే చారిత్రక చట్టం... పురుడుపోసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సాహసోపేత పాలనా వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదం లభించింది. ఇకపై విశాఖపట్నం రాష్ట్ర పరిపాలనా రాజధానిగా మారనుంది. ఫలితంగా ఉత్తరాంధ్రలో విశాఖను ఆనుకుని ఉన్న విజయనగరం జిల్లాకే ప్రధానంగా ప్రయోజనం చేకూరనుంది. ఈ విషయం తెలిసి జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, మేధావులు, ప్రజలు... ఒకరేమిటి... జిల్లా అభివృద్ధిని కాంక్షించే ప్రతిఒక్కరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఒకప్పుడు విజయనగర వైభవాన్ని చూసి ప్రపంచం మొత్తం నోరెళ్లబెట్టి చూసేది. ఇక్కడి విశేషాలను విని ఆశ్చర్యపడేది. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారు, శ్రీరాముడు కొలువైన రామతీర్థం దేవస్థానం, తాటి పూడి రిజర్వాయర్, శంబర పోలమాంబ జాతర, విజయనగరం రాజకోట వంటి ఎన్నో అద్భుతాలు ఈ జిల్లాలో కొలువై ఉన్నాయి. గురజాడ అప్పారావు, ద్వారం వెంకటస్వామినాయుడు, ఆదిభట్ల నారాయణదాసు, కోడిరామ్మూర్తి, డి.వై. సంపత్‌కుమార్, సర్ విజ్జి, పి.సుశీల వంటి ప్రముఖులెందరికో జన్మనిచ్చిన నేల ఇది. కానీ కొన్ని దశాబ్దాలుగా జిల్లా వెనుకబాటుతనంతో వైభవాన్ని కోల్పోయింది. పాలకుల నిర్లక్ష్యం, ఉపాధి అవకాశాల కొరతతో ఎంతోమంది పేదరికంలో మగ్గిపోతున్నారు. ఉత్తరాంధ్రలో పరిపాలనా రాజధానిని ఏర్పాటు చేయడం వల్ల ఈ సమస్యలు రూపుమాపే అవకాశం లభించనుంది. విజయనగరం జిల్లాకు మరలా పూర్వవైభవం రానుంది.
పరిమిత వనరులతోనే అద్భుతాలు
తూర్పున శ్రీకాకుళం, దక్షిణం, పశ్చిమాన విశాఖపట్నం జిల్లాలు, వాయువ్యంలో ఒడిశా రాష్టం, ఆగ్నేయంలో బంగాళాఖాతం సరిహద్దులుగా 1979లో శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లోని కొంత ప్రాంతాన్ని కలుపుకుని విజయనగరం జిల్లా ఏర్పడింది. జిల్లా మొత్తం విస్తీర్ణం 6539 చదరపు కిలోమీటర్లు. 23.44 లక్షల మంది జనాభా ఉన్నారు. నేటికీ అక్షరాస్యత శాతం తక్కువగానే ఉంటోంది. ప్రస్తుతం అది 58.89 శాతం మాత్రమే. 68 శాతం వ్యవసాయాధారితమైన విజయనగరం జిలాలను విజయనగరం, బొబ్బిలి రెవెన్యూ డివిజన్లుగా విభజించారు. పార్వతీపురం డివిజన్ గిరిజన గ్రామాలతో కలిపి ఐటీడీఏలో ఉంది. జిల్లాలో మొత్తం 34 మండలాలు, 920 పంచాయతీలు, 1582 గ్రామాలు, విజయనగరం కార్పొరేషన్, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం పురపాలక సంఘాలు, నెల్లిమర్ల నగర పంచాయతీలున్నాయి. 51 బ్యాంకులు, 67 తపాలా కార్యాలయాలు, 66 కళాశాలలు, 16 మోడల్ స్కూళ్లు, 78 ఎన్జీఓలు, 103 హాస్పిటళ్లు ప్రజలకు సేవలందిస్తున్నాయి. గడచిన రెండేళ్లలో పోష¯ణ్ అభియాన్, గ్రామస్వరాజ్ అభియాన్, కృషి కళ్యాణ్ అభియాన్ జాతీయ అవార్డులను జిల్లా సొంతం చేసుకుంది. ఇటీవల మూడు స్కోచ్ అవార్డులను దక్కించుకుంది. పరిమిత వనరులతోనే ఇంతటి ఘనత సాధించిన జిల్లాకు మరింత ఆసరా లభిస్తే అద్భుతాలు సాధిస్తుంది.
జంటనగరాలుగా విజయనగరం, విశాఖ ఉత్తరాంధ్ర అభివద్ధి కోసం విశాఖపట్నంలో పరిపాలనా రాజధానిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభు త్వం సంకల్పించింది. ఈ ప్రక్రియ పూర్తవడంతో మొదటగా లాభపడుతున్నది మన విజయనగరం జిల్లానే. విశాఖ–విజయనగరం మధ్య దూరం చాలా తక్కువ. యాభై కిలోమీటర్లు నాన్‌స్టాప్ బస్సులో ప్రయాణిస్తే గంటంపావులో విశాఖలో ఉంటాం. ఇప్పటికే ఈ రెండు నగరాల మధ్య అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి.
విద్య, వ్యాపార సంస్థలు వెలిశాయి. రాజధాని వస్తే ఇవి మరింతగా పెరుగుతాయి. విశాఖ ప్రజల దాహార్తిని విజయనగరంలోని తాటిపూడి రిజర్వాయర్ తీరుస్తోంది. సీఎం క్యాంప్ ఆఫీసుతోపాటు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు విజయనగరం సరిహద్దులను ఆనుకుని ఉన్న రుషికొండ, భీమిలి, తరగపువలస, మధురవాడ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే పలు రాష్ట్ర స్థాయి కార్యాలయాలను విజయనగరంలోనూ ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదు. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణం శరవేగంగా పూర్తవుతోంది. విశాఖ మెట్రోరైలును కూడా భోగాపురం వరకూ పొడిగించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇవన్నీ జరిగితే విశాఖపట్నం –విజయనగరం జిల్లాలు జంటనగరాలుగా అవతరిస్తాయి.
జాతీయ స్థాయి విద్యా, వ్యాపార సంస్థలు వస్తాయి. రాజధాని స్థాయి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రజల జీవన ప్రమాణం, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఇప్పుడు ఇవే అంశాలు జిల్లా ప్రజలను ఆనందంలో ముంచెత్తుతున్నాయి. రాజధాని సమీప జిల్లా వాసులుగా మారుతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజలు, ఇంతటి వరాన్ని తమకు అందించిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డికి మనసారా కృతజ్ఞతలు చెబుతున్నారు.
శ్రావణ శుక్రవారం రోజున మంచి కానుక
మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో విశాఖపట్నంలో పరిపాలన రాజధాని వచ్చింది. ఉత్తరాంధ్ర ప్రజలకు శ్రావణ శుక్రవారం రోజున గవర్నర్ మంచి కానుక ఇచ్చారు. స్వాతంత్య్రం వచ్చిన దగ్గరనుంచీ నేటివరకూ వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంత రూపురేఖలు త్వరలో మారిపోతాయి. విశాఖపట్నంలో పరిపాలన రాజధాని పెట్టడం వల్ల ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఎన్నో దశాబ్దాల తర్వాత ఈ ప్రాంత ప్రజలకు మంచి భరోసా లభించింది. గవర్నర్‌కు, ముఖ్యమంత్రి ఇక్కడి ప్రజల తరుపున కృతజ్ఞతలు చెబుతున్నాను.
– బొత్స సత్యనారాయణ, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి
ఉత్తరాంధ్రవాసుల అదృష్టం
మూడు రాజధానుల ఆలోచన వచ్చిన వెంటనే అమలు చేయడానికి చర్యలు తీసుకోవడం ఉత్తరాంధ్ర ప్రజల అదృష్టం. ఇంతవరకు వచ్చిన నాయకులు వట్టిమాటలు చెప్పి ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఉత్తరాంధ్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. హైదరాబాద్ నగరాన్నే అభివృద్ధి చేసి మిగిలిన ప్రాంతాలను వదిలేసిన నాయకులనే చూశాం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందేలా ముఖ్యమంత్రి నిర్ణయం ముదావహం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటారు.
– పాముల పుష్పశ్రీవాణి, డిప్యూటీ సీఎం
అన్ని ప్రాంతాల అభివృద్ధికి అవకాశం...
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో మూడు రాజధానుల ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి జరగాలన్న ఉద్దేశంతో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ ఆమోదించడం శుభపరిణామం. విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా ఉండటం వల్ల వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధికి అవకాశం ఉంటుంది. బోగాపురం ఎయిర్‌పోర్టు, ఫిషింగ్ హార్బర్, గిరిజన యూనివర్శిటీ రావడం వల్ల నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధికి కొదవుండదు.
– బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం ఎంపీ
వెనుకబాటు ఉండదు
విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని చేయడం ఉత్తరాంధ్ర ప్రజల పూర్వ జన్మసుకృతం. అత్యంత వెనకబడిన ప్రాంతంగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఇది గొప్ప వరం. పేదరికం, వలసలు ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్రలోనే ఉపాధి మెరుగవుతుంది. వలస బాధ ఉండదు. ఉత్తరాంధ్ర ప్రజల తరపున సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ణతలు.
– శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, వైఎస్సార్‌సీపీ అరకు పార్లమెంటరీజిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment