ఇప్పుడొద్దులే.!  | Chandrababu Canceled Vijayanagaram District Visit | Sakshi
Sakshi News home page

ఇప్పుడొద్దులే.! 

Published Thu, Dec 26 2019 10:16 AM | Last Updated on Thu, Dec 26 2019 1:22 PM

Chandrababu Canceled Vijayanagaram District Visit - Sakshi

సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లాలో అడుగుపెట్టడానికి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ధైర్యం చాలడం లేదా.?రాజధాని విషయంలో తన పార్టీ నేతల్లోనే బిన్న స్వరాలు వినిపిస్తున్న తరుణంలో ఉత్తరాంధ్ర వచ్చేందుకు చంద్రబాబు సంకోచిస్తున్నారా.? అందుకే విజయనగరం పర్యటన రద్దయ్యిందా.? అంటే అవుననే సమాధానం వస్తోంది. అభివృద్ధికి దూరంగా... వెనకబాటుతనంలో మగ్గిపోతున్న విజయనగరం జిల్లాకు అధికారంలో ఉన్నన్నాళ్లూ చంద్రబాబుగానీ, ఆ పార్టీ నేతలు ఏమాత్రం న్యాయం చేయలేదు. దాని పర్యవసానంగానే గత ఎన్నికల్లో జిల్లా ప్రజలు టీడీపీకి చావుదెబ్బ కొట్టారు. జిల్లాలో ని తొమ్మిది అసెంబ్లీ స్థానాలతో పాట విజయనగరం, విశాఖ, అరకు పార్లమెంట్‌ స్థానాలను సైతం వైఎస్సార్‌సీపీకి కట్టబెట్టారు.

టీడీపీలో మహామహులుగా చెప్పుకునే కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు తాను ఓడిపోవడంతో పాటు తన కుమార్తెను కూడా గెలిపించుకోలేకపోయారు. కిశోర్‌ చంద్రదేవ్, ఆర్‌పి భంజ్‌దేవ్‌ లాంటివారు మట్టికరిచారు. శత్రుచర్ల విజయరామరాజు వ్యూహాలు చతికిలపడ్డాయి. బొబ్బిలి రాజులు ఘోర పరాజయాన్ని చవిచూశారు. దీంతో ఎన్నికల తర్వాత జిల్లావైపు చంద్రబాబు కన్నెత్తి చూడలేకపోయారు. ఒక్కసారి కూడా అడుగుపెట్టలేకపోయారు. ఆ పార్టీ నేతలు కూడా జనంలోకి రాలేక సొంత వ్యవహారాలకే పరిమితమైపోయారు.

వికేంద్రీకరణవైపే ఉత్తరాంధ్ర టీడీపీ నేతల మొగ్గు 
కానీ ఎంతకాలం ఇలా జననానికి ముఖం చాటేస్తారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. కనీసం పార్టీ ఉందోలేదో చూసుకోవాలి. దానిలో భాగంగానే జిల్లా సమన్వయకమిటీ సమావేశాలను జనవరి 3, 4 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి జిల్లాలోనూ ఈ సమావేశాలకు చంద్రబాబు హాజరవుతున్నారు. విజయనగరం కూడా ఆయన వస్తారని పార్టీ నేతలు కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఇంతలో రాజధాని వికేంద్రీకరణ అంశం తెరపైకి వచ్చింది. దీనికి వ్యతిరేకంగా ఓవైపు అమరావతిలో రైతుల పేరుతో ఆందోళనలు చేయిస్తున్న టీడీపీలో తాజాగా చీలిక వచ్చింది. టీడీపీ ఉత్తరాంధ్ర నేతలంగా విశాఖలో ఎగ్జిక్యూటివ్‌(పరిపాలన) రాజధాని ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఈ మేరకు టీడీపీ ఉత్తరాంధ్ర నేతలు విశాఖలో సమావేశమై ఒక తీర్మానం కూడా చేశారు.

దానిని చంద్రబాబుకు అందించాలని నిర్ణయించారు. ఇలాంటి సమయంలో ఉత్తరాంధ్రలో పర్యటించడం, అందులోనూ తమ పార్టీకి ఒక్క సీటు కూడా రాని విజయనగరంలో అడుగుపెట్టడం మంచిది కాదని చంద్రబాబు భావించి తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. విశాఖలో పరిపాలన రాజధాని రావడంతో పాటు భోగాపురం విమానాశ్రయానికి కూడా త్వరలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్టు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించినప్పటి నుంచీ జిల్లా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. స్థానిక టీడీపీ నేతలు కూడా తమ ప్రాంతం అభివృద్ధిని వ్యతిరేకిస్తే జనంలో చులకనైపోతామని భయపడుతున్నారు. అందుకే అధినేత పర్యటనలో తాము మనస్పూర్తిగా పాల్గొనలేమనే సంకేతాన్ని ఇప్పటికే అధిష్టానానికి పంపడంతో చంద్రబాబు పర్యటన అర్ధంతరంగా ఆగిపోయింది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement