
సాక్షి, అమరావతి: వికేంద్రీకరణపై వైఖరేమిటో చెప్పాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. కనీసం ఒకే రాజధాని అమరావతి కేంద్రీకృతంగా ఎందుకు ఉండాలో చెప్పాలని నిలదీశారు. ‘కర్నూలులో చంద్రబాబు విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నాం. రాయలసీమలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు సిద్ధం. అసెంబ్లీలో చర్చిద్దాం రండి. మీ బండారం బయటపెడతాం’ అంటూ ప్రతి సవాల్ విసిరారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సజ్జల ఇంకా ఏమన్నారంటే..
ప్రజలను తిట్టడానికి ఏం హక్కుంది బాబూ?
► తమ ఆకాంక్షల మేరకు న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటు చేయడంపై మీ వైఖరేమిటని ప్రశ్నించిన ప్రజలకు సమాధానం చెప్పకుండా వారిని తిట్టే హక్కు చంద్రబాబుకు ఎవరు ఇచ్చారు?
► పట్టాభి నుంచి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు వరకూ ప్రజలపై బూతులతో ఎదురు దాడికి దిగుతున్నారు. టీడీపీ అంటే తిట్లు, దూషణలు, పచ్చిబూతుల పార్టీగా నిరూపించుకుంటున్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలని చంద్రబాబు అంటే.. ప్రజలకు ఇవే చివరి ఎన్నికలని ఎల్లో మీడియా చెబుతోంది. ఇది ఆఖరిఛాన్స్.. లేకపోతే నాశనం అవుతారని ప్రజలకు శాపం పెడతారా?
ప్రజల ఆకాంక్షల మేరకే వికేంద్రీకరణ
► 1937లో శ్రీబాగ్ ఒడంబడిక కుదిరినప్పటి నుంచే వికేంద్రీకరణ డిమాండ్ ఉంది. రాష్ట్ర విభజన తర్వాత వికేంద్రీకరణపై విస్తృతమైన చర్చ జరిగింది. శ్రీకృష్ణ కమిషన్, శివరామకృష్ణన్ కమిటీలు వికేంద్రీకరణ ఆవశ్యకతను నొక్కిచెప్పినా నాటి సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. సరైన రోడ్డు సౌకర్యం లేని ప్రాంతంలో రాజధాని పెట్టారు.
► అక్కడ రాజధాని నిర్మించాలంటే ఏళ్లపాటు రాష్ట్ర బడ్జెట్‌ను మొత్తం అక్కడే వెచ్చించాల్సి ఉంటుంది. ఇది మిగతా ప్రాంతాలకు అన్యాయం చేయడమే. అందువల్లే రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశాన్ని అమరావతి ప్రాంతం ప్రజలకు చెబుతున్నాం. అక్కడా బైపాస్ రోడ్డు నిర్మిస్తూ, కరకట్ట రోడ్డును అభివృద్ధి చేస్తున్నాం. సీఎం వైఎస్ జగన్ ఎన్నడూ అమరావతిలోనే రాజధాని రావాలని కోరలేదు.
బాబుకూ ఆ కోరిక ఉందేమో!
► మొన్న ఇప్పటంలో ఇళ్లు కూల్చకున్నా, కూల్చినట్లు చెప్పు చూపుతూ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వైఎస్సార్‌సీపీ నేతలపై రెచ్చిపోయారు. కర్నూలులో తనను నిలదీసిన ప్రజలపై ఆగ్రహంతో ఊగిపోతూ తనకు సభ్యత ఉంది కాబట్టే చెప్పు చూపించడం లేదని జనంపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. అంటే పవన్ కళ్యాణ్ అసభ్యంగా వ్యవహరించాడని చంద్రబాబు ఒప్పుకున్నట్లే. లేదంటే తనకూ ఆ కోరిక ఉందని బహిర్గతం చేసినట్లే. ‘ఇదేం ఖర్మ’ అంటూ ప్రజలు టీడీపీని తిరస్కరించారనే విషయాన్ని గుర్తుంచుకోండి.
► రాష్ట్రంలోని అన్ని చిట్‌ఫండ్ కంపెనీలలో స్టాంపులు, రిజిస్ట్రేషన్‌లు, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగాల అధికారులు దాడులు చేస్తే.. తమపై ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతోందని ‘ఈనాడు’ రామోజీరావు అనడం హేయం.
Comments
Please login to add a commentAdd a comment