సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలపై వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. విచారణకు హాజరు కావాలంటూ మంగళగిరి పోలీసులు ఇచ్చిన నోటీసులపై ఆయన స్పందించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అబద్ధాన్ని అయినా చంద్రబాబు నిజంగా మల్చుతారని.. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారంటూ ధ్వజమెత్తారు
‘‘మాకు న్యాయ స్థానాలపై విశ్వాసం ఉంది. నేను విదేశానికి వెళ్లానని తెలిసి లుకౌట్ నోటీసు ఇచ్చారు. అక్టోబర్ 7న విదేశానికి వెళ్తే 10న నోటీసు ఇచ్చారు. 2021లో టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగితే ఇప్పుడు మళ్లీ కొత్తగా మాకు నోటీసులు పంపుతున్నారు. కేసు ముగిసే సమయానికి నోటీసులు ఏంటి?. ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా? అరాచకానికి హద్దు లేదా?’’ అంటూ సజ్జల నిప్పులు చెరిగారు.
‘‘అధికారం ఉందని తప్పుడు కేసులు పెడుతున్నారు. దానిపై మేము న్యాయం కోర్టుకు వెళ్తాం. ఎల్లోమీడియా తప్పుడు వార్తలు రాస్తోంది. మీ పెండ్యాల శ్రీనివాసరావు, ఇతర నేతల్లాగా నేనేమీ పారిపోవడం లేదు. కానీ లుకౌట్ నోటీసులు పేరుతో హడావుడి చేస్తున్నారు. ఎప్పుడో మూడేళ్ల క్రితం జరిగిన టీడీపీ ఆఫీసు మీద దాడి కేసును ఇప్పుడు బయటకు తీశారు. అసలు ఆ దాడి జరగడానికి కారణం ఏంటో కూడా అందరికీ తెలుసు
..టీడీపీ నేతలు సీఎం జగన్ ని దారుణంగా దూషించారు. సుప్రీంకోర్టు నాకు ఇంటీరియమ్ ప్రొడక్ట్ ఇచ్చింది. అది కూడా సెప్టెంబర్ 20నే ఇచ్చినా కూడా ఇప్పుడు నాకు నోటీసులు ఎలా ఇస్తారు?. చేతిలో అధికారం ఉందని ఎలాగైనా నోటీసులు ఇస్తారా?. దీన్ని బరితెగింపు అనాలా? పొగరు అనాలా? ఇంకేమైనా అనాలా?. అసలు రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తోందా?. ఏమాత్రం బేస్‌లేని విషయాలలో కూడా నోటీసులు ఇచ్చి ఏం చేయాలనుకుంటున్నారు?. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ అటాచ్‌మెంట్ చేసిందంటే చంద్రబాబు తప్పుడు పని చేసినట్టు నిర్ధారణ అయింది. అందుకే ఆస్తుల అటాచ్‌మెంట్ జరిగింది. కానీ చంద్రబాబుకు క్లీన్ చిట్ అని ఎలా రాస్తారు? అంతకన్నా బరితెగింపు ఉంటుందా?’’ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు.
ఇదీ చదవండి: ఏపీ ప్రజల కళ్లల్లో కూటమి ‘ఇసుక’!
‘‘అలా తప్పుడు ప్రచారం చేసి జనాన్ని నమ్మించగలరేమోగానీ కోర్టును నమ్మించలేరు. జత్వానీ కేసులో కూడా నన్ను ఇలాగే ఇరికించారు. ఏదోలాగా కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. పట్టాభి ఉద్దేశపూర్వకంగా వైఎస్ జగన్‌ని దూషించారు. అప్పుడు టీడీపీ ఆఫీస్‌పై గొడవ జరిగింది. వైఎస్ జగన్ మీద కూడా తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారు. ఎలాంటి నేరం జరగకపోయినా జరిగినట్టుగా క్రియేట్ చేసి కేసులు పెడుతున్నారు. బోట్లతో ప్రకాశం బ్యారేజిని కూల్చాలని ప్లాన్ చేశారని కూడా కేసులు పెట్టారు. అలాంటి వారికి న్యాయంతో పనిలేదు. ఏదోలా కేసులలో ఇరికించాలనే లక్ష్యంగా పని చేస్తున్నారు. పార్టీలో యాక్టివ్‌గా ఉన్న వారందరినీ టార్గెట్ చేసి భయపెట్టాలని చూస్తున్నారు. కోర్టుల్లో న్యాయ పోరాటం చేస్తాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment