టీడీపీ నేత కిమిడి కళావెంకటరావు ఇంట చంద్రబాబు చిచ్చు
పురందేశ్వరితో కలిసి ఆడిన ఆటలో పావుగా కళా
ఎచ్చెర్లలో ‘తమ’ నాయకుడికి టికెట్ కోసం పురందేశ్వరి, బాబు స్కెచ్
ఎచ్చెర్లలో వెంకటరావు పనికిరాడంటూ ముద్ర
గంటా వద్దన్న చీపురుపల్లి టికెట్ కళాకు ఆఫర్
సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు కుటుంబంలో చంద్రబాబు చిచ్చు రగిల్చారు. సొంత పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆడుతున్న రాజకీయ ఆటలో కళా వెంకటరావు పావుగా మారారు. తూర్పు కాపు (బీసీ) సామాజికవర్గం నుంచి ఉత్తరాంధ్రలో వేగంగా ఎదిగిన ఆయన ఇప్పుడు టికెట్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సిన దుస్థితి.
గంటా శ్రీనివాసరావు వద్దు వద్దంటున్న చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్లాలని వెంకటరావుకు చంద్రబాబు ఆఫర్ ఇస్తూనే, మరోవైపు అక్కడ టీడీపీ జిల్లా అధ్యక్షుడి హోదాలో టికెట్‌పై ఆశలు పెట్టుకున్న కళా సోదరుడి కుమారుడైన కిమిడి నాగార్జున ఆశలపై నీళ్లు చల్లారు. విదేశాల్లో ఉద్యోగం వదులుకొని వచ్చి 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా, మళ్లీ చీపురుపల్లిలో పార్టీని బతికించేందుకు ఐదేళ్లుగా కృషి చేస్తే తుదకు కరివేపాకులా తీసిపారేస్తున్నారంటూ నాగార్జున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విజయనగరం లోక్‌సభ ఆశ చూపించి
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కళా వెంకటరావు ఎచ్చెర్ల నియోజకవర్గాన్నే నమ్ముకున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో టీడీపీ నుంచి గెలిచి మంత్రిగా పనిచేశారు. సహచర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ నారా లోకేశ్‌కు సన్నిహితుడిగా ఉత్తరాంధ్రలో చక్రం తిప్పారు. అయితే, ఆయన ఎచ్చెర్ల నియోజకవర్గంలో పనికిరాడంటూ టీడీపీ అధిష్ఠానమే ఇప్పుడు ముద్ర వేస్తోంది.
ఇందుకు ఐవీఆర్‌ఎస్ సర్వే కారణం చూపిస్తోంది. చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అవకాశం కల్పిస్తారంటూ లీకులు ఇచ్చింది. అక్కడ వెంకటరావు సోదరుడు, ప్రస్తుత నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి కిమిడి నాగార్జున టికెట్ ఆశిస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు చీపురుపల్లికి వెంకటరావును పేరును తేవడంతో కిమిడి కుటుంబంలో అగ్గిరాజుకుంది. తీవ్ర అసంతృప్తికి లోనైన నాగార్జున పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నెల కిందటి వరకు నాగార్జున, మూడు రోజుల కిందటి వరకు గంటా శ్రీనివాసరావు, తాజాగా కళా వెంకటరావు.. ఇలా రోజుకో పేరును టీడీపీ అధిష్టానం తెరమీదకు తెస్తుండడంతో కార్యకర్తలు నిరాశలో ఉన్నారు. దీన్ని చక్కదిద్దడానికి కళా వెంకటరావు పేరు విజయనగరం ఎంపీ అభ్యర్థిగా పరిశీలిస్తున్నట్టు తాజాగా లీకులు ఇస్తున్నారు.
ఫలించిన పురందేశ్వరి స్కెచ్
నడికుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్) ఇటీవలి వరకూ ఎచ్చెర్లలో గ్రామస్థాయి నాయకుడు. చంద్రబాబు సొంత సామాజికవర్గం నేత కావడంతో 2014–19 మధ్య కాస్త హవా చూపించారు. ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానంపై కన్నేసిన ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకొని, పురందేశ్వరి పంచన చేరారు. ఆమె చలువతో విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షుడి పదవీ దక్కించుకున్నారు. ఇక్కడ బలమైన కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన రెడ్డి పావనిని తప్పించి మరీ ఈశ్వరరావుని జిల్లా అధ్యక్షుడిని చేశారు.
ప్రస్తుత ఎన్నికల్లో ఎచ్చెర్ల టికెట్ నేరుగా ఎన్‌ఈఆర్‌కు ప్రకటించకుండా నెమ్మదిగా స్కెచ్ అమలుచేశారు. తొలుత శ్రీకాకుళం అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ కోటాలో చూపించారు. అక్కడ గుండ లక్ష్మీదేవి కుటుంబం ఆందోళన చేయడంతో అది టీడీపీకే ఇచ్చేసి పొరుగున ఉన్న ఎచ్చెర్ల బీజేపీ కోటాలో వేసేశారు. తద్వారా ఎచ్చెర్ల టికెట్ తనదేనని ధీమాగా ఉన్న కిమిడి కళావెంకటరావు ఆశలపై నీళ్లు చల్లేశారు. ఇప్పుడు ఎన్‌ఈఆర్‌ను రంగంలోకి తెస్తున్నారు.
బాబు పితలాటకంతో నాగార్జున బలి
చంద్రబాబు, పురందేశ్వరి పెట్టిన పితలాటకంతో చీపురుపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి కిమిడి నాగార్జున బలవుతున్నారు. ఆయన తల్లి కిమిడి మృణాళిని 2014లో చీపురుపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండేళ్లు మంత్రిగా కూడా పనిచేశారు. ఆ సమయంలో విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటున్న నాగార్జున రాజకీయాలపై ఆసక్తితో ఇక్కడకు వచ్చి టీడీపీలో చేరారు. 2019లో ఓడిపోయారు. అయినప్పటికీ నాగార్జునకు భవిష్యత్ ఉందని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. తీరా ఎన్నికలు వచ్చే సరికి నాగార్జున పనికిరాడంటూ చంద్రబాబు ముద్ర వేసేశారు.
Comments
Please login to add a commentAdd a comment