విశాఖ ఎంపీ సీటుపై వదిన–మరిది డ్రామా! | Chandrababu and Purandeswari Drama On Visakha MP Seat | Sakshi
Sakshi News home page

విశాఖ ఎంపీ సీటుపై వదిన–మరిది డ్రామా!

Published Wed, Mar 13 2024 3:55 AM | Last Updated on Wed, Mar 13 2024 10:17 AM

Chandrababu and Purandeswari Drama On Visakha MP Seat - Sakshi

రెండేళ్లుగా అక్కడ పనిచేస్తున్న జీవీఎల్‌కు పురందేశ్వరి చెక్‌..

పూర్వపు టీడీపీ నేత సీఎం రమేష్‌ కోసం పట్టుబడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు

తనకు సీటు రాకపోతే తీవ్ర పరిణామాలుంటాయని లోకేశ్‌ తోడల్లుడు భరత్‌ హెచ్చరిక

చివరకు రమేష్‌ కోసం అనకాపల్లి ఎంపీ సీటు ఇప్పించేందుకు కసరత్తు

వెనుకనుండి చక్రం తిప్పుతున్న చంద్రబాబు

బీజేపీ సీట్ల కేటాయింపు తీరుపై 

కమల దళంలో తీవ్ర అసంతృప్తి

పురంధేశ్వరి వ్యవహార సరళిపైనా విమర్శలు

అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్న శ్రేణులు.. నడ్డాకు లేఖ

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ ఎంపీ సీటు విషయంలో అటు టీడీపీ ఇటు బీజేపీ పెద్ద డ్రామానే నడిపిస్తున్నాయి. పొత్తులు కడుతూనే వెనకాల నుంచి ఏ పార్టీ నుంచి ఎవరు పోటీచేయాలో నిర్ణయిస్తూ చక్రం తిప్పుతున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి తమ పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారని బీజేపీ నేతలు వాపోతున్నారు. అలాగే, విశాఖ ఎంపీ సీటు కోసం గత రెండేళ్లుగా పనిచేస్తున్న జీవీఎల్‌కు చెక్‌పెడుతూ పూర్వాశ్రమంలో టీడీపీలో పనిచేసిన సీఎం రమేష్‌కు ఆ స్థానం కేటాయించేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి  పట్టుబట్టడం ఆ పార్టీలో చర్చనీయాంశమవుతోంది.

మరోవైపు.. చంద్రబాబు కుటుంబానికే చెందిన భరత్‌ కాస్తా తనకు సీటు ఇవ్వకపోతే ఏమైనా చేసుకుంటానని.. దానికి మీదే బాధ్యత అని హెచ్చరించడంతో సీఎం రమేష్‌కు అనకాపల్లి సీటును కేటాయించేలా పురందేశ్వరి చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో గతంలో టీడీపీలో కీలకంగా వ్యవహరించి అప్పట్లో తనకు అనుకూలంగా ఉన్న వారికే ఇప్పుడు బీజేపీ సీట్లను  కేటాయించేలా చక్రం తిప్పడంలో వదినకు మరిది (చంద్రబాబు) కూడా మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు.. తనకు విశాఖ ఎంపీ సీటు కేటాయించకపోతే ఏ అఘాయిత్యానికి పాల్పడినా అందుకు మీరే బాధ్యులవుతారంటూ టీడీపీ నేత, లోకేశ్‌ తోడల్లుడు భరత్‌ స్పష్టంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో అనకాపల్లి ఎంపీ సీటును సీఎం రమేష్‌కు కేటాయించేందుకు వీలుగా.. అందుకు జనసేన త్యాగం చేసేలా వదిన, మరిది చక్రం తిప్పుతున్నట్లు బీజేపీ శ్రేణులే అనుమానిస్తున్నాయి. మరోవైపు.. జనసేన నేతలు కూడా తమ పార్టీకి మొదట్లో ఇచ్చిన అరకొర సీట్లను సైతం అధినేత పవన్‌ వదలుకోవడాన్ని వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. 

మళ్లీ పాత రోజులే!
మరోవైపు.. బీజేపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. గతంలో పార్టీలో ఉన్న ఒక వృద్ధ నేత రాజకీయాలకు దూరంగా ఉండడంతో రాష్ట్రంలో బీజేపీ స్వయంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని భావించామని.. కానీ, ఇప్పుడు పురందేశ్వరి రూపంలో మళ్లీ పార్టీని బొందలో పెట్టే కార్యక్రమం నడుస్తోందని ఆ పార్టీ శ్రేణులు బహిరంగంగానే పార్టీ కార్యాలయంలో వ్యాఖ్యానిస్తున్నారు.

పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా వలస నేతలకు సీట్లను కేటాయించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానానికి చెప్పేందుకు కొద్దిమంది సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ వ్యవహారాలను అలాంటి వారికి అప్పగిస్తే తిరిగి పార్టీని నామరూపాలు లేకుండా చేస్తారనే విషయాన్ని వివరించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు వీరు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు లేఖ కూడా రాశారు.

జీవీఎల్‌కు పురందేశ్వరి చెక్‌!
ఇక విశాఖపట్నం ఎంపీ సీటు కోసం రెండేళ్లుగా జీవీఎల్‌ ప్రయత్నిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఇక్కడ పలు కార్యక్రమాలు చేపట్టారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం తన వంతు యత్నించారు. స్థానికంగా ఆయా వర్గాల్లో తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం చేశారు. ఒకవైపు స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణపై కేంద్రం ముందడుగులు వేస్తుంటే.. కార్మికుల్లో వ్యతిరేకత రాకుండా వారితో చర్చలు జరిపి.. మధ్యేమార్గాలను సూచించాలంటూ సమావేశాలను నిర్వహించారు.

ఈ పరిస్థితుల్లో జీవీఎల్‌కు సీటు రాకుండా పురందేశ్వరి చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. వెనుకనుండి కథ మొత్తం చంద్రబాబు నడిపించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొన్నటివరకు జీవీఎల్‌ వైజాగ్‌లో ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా తమ అనుకూల మీడియాలో రాకుండా టీడీపీ నేతలు జాగ్రత్తపడ్డారు. అంతేకాక.. జీవీఎల్‌కు వ్యతిరేకంగా కథనాలను కూడా ప్రచురించారు. ఇప్పుడు ఏకంగా సీటు రాకుండా చేయడంతో జీవీఎల్‌ వర్గం కూడా మండిపడుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement