న్యూఢిల్లీ: అమెరికా దిగ్గజ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన సింగిల్ డోస్ కోవిడ్–19 వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి భారత్ అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ శనివారం ట్వట్టర్ ద్వారా వెల్లడించారు. దీంతో కరోనాపై భారత్ చేస్తున్న పోరాటం మరింత బలోపేతమవుతుందని అన్నారు. ‘జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌కి అనుమతినివ్వడంతో మన దేశంలో వ్యాక్సిన్ల సంఖ్య అయిదుకి చేరుకుంది. కోవిడ్–19పై దేశం చేస్తున్న సమష్టి పోరాటానికి ఈ వ్యాక్సిన్ మరింత ఊతమిస్తుంది’’ అని మాండవీయ ట్వీట్ చేశారు.
బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసి పుణేలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్ , స్వదేశీ వ్యాక్సిన్ భారత్ బయోటెక్‌కి చెందిన కొవాగ్జిన్, రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్–వీ అందుబాటులో ఉండగా , ఇటీవల అమెరికాకి చెందిన మోడెర్నా వ్యాక్సిన్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అత్యవసర అనుమతులు మంజూరు చేసింది. ఇప్పుడు ఆ జాబితాలో జాన్సన్ అండ్ జాన్సన్ కూడా చేరింది. శుక్రవారం నాడు జే అండ్ జే కంపెనీ అనుమతి కోసం దరఖాస్తు చేస్తే అదే రోజు డీసీజీఐ అనుమతినిచ్చిందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
కీలక ముందడుగు: జాన్సన్ అండ్ జాన్సన్
కరోనా మహమ్మారిని అరికట్టడంలో ఈ వ్యాక్సిన్‌కు అనుమతులివ్వడం కీలక ముందడుగు అని భారత్‌లోని జాన్సన్ అండ్ జాన్సన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. 18 ఏళ్లు అంతకంటే పై బడిన వారికి జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి భారత్‌లో అనుమతులు లభించాయని ఆ కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న 28 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తుందని ఆయన పేర్కొన్నారు.
గతంలో జే అండ్ జే కంపెనీ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ భారత్‌లో నిర్వహించడానికి దరఖాస్తు చేసుకొని ఆ తర్వాత వెనక్కి తీసుకుంది. అదే సమయంలో వ్యాక్సిన్‌తో నరాలకు సంబంధించిన దుష్ప్రభావాలు వస్తాయని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో ఆ కంపెనీ వెనక్కి వెళ్లింది. ఆ తర్వాత తమ వ్యాక్సిన్‌తో దుష్ప్రభావాలు లేవని పలు అధ్యయనాలు తేల్చిన తర్వాత భారత్‌లో విజయవంతంగా ట్రయల్స్ నిర్వహించి అనుమతులు పొందింది.
ఎన్నెన్నో ప్రత్యేకతలు
జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ చాలా అంశాల్లో ప్రత్యేకత సంతరించుకుంది. అవేంటో చూద్దాం
► ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లన్నీ రెండు డోసులు తీసుకోవాల్సిన అవసరం ఉంటే జాన్సన్ అండ్ జాన్సన్ ఒక్క డోసు (0.5ఎంఎల్) తీసుకుంటే సరిపోతుంది.
► ఈ వ్యాక్సిన్ 85% సామర్థ్యంతో పని చేస్తుందని, అత్యంత సురక్షితమైనదని అమెరికా, దక్షిణాఫ్రికాలో జరిగిన పరిశోధనల్లో తేలింది.
► ఫైజర్, మోడెర్నా మాదిరిగా ఈ వ్యాక్సిన్‌కు అత్యంత శీతల వాతావరణంతో పని లేదు. సాధారణ రిఫ్రిజిరేటర్లలో మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది. దీంతో ఈ వ్యాక్సిన్‌ను కోల్డ్ స్టోరేజీ సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాలకు పంపిణీ చేయవచ్చు.
► అమెరికాలోని ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్‌లో వినియోగించే ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ టీకాలో వాడలేదు. ఆక్స్‌ఫర్డ్–ఆస్ట్రాజెనెకా టీకా మాదిరిగా ఇది ఎడెనోవెక్టర్ వ్యాక్సిన్. కరోనా వైరస్ జన్యువుల్లోని స్పైక్ ప్రొటీన్‌ను ఎడెనోవైరస్‌తో సమ్మేళనం చేసి ఈ టీకాను తయారు చేశారు. ఇది శరీరంలో ప్రవేశించాక రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందించి స్పైక్ ప్రొటీన్‌పై పోరాడడానికి సిద్ధమవుతుంది. దీంతో శరీరంలో యాంటీబాడీలు వచ్చి చేరుతాయి.
► ఈ వ్యాక్సిన్‌కి సంబంధించిన కీలకమైన ఫార్ములా కరోనా వైరస్ బట్టబయలు కావడానికి పదేళ్లకు ముందే అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు. బేత్ ఇజ్రాయెల్ డీకోనెస్ మెడికల్ సెంటర్‌కు చెందిన వైరాలజిస్టు డాన్ బరౌచ్, ఆయన బృందం జన్యుపరంగా మార్పులు చేసుకునే రోగకారకాలను మానవ కణజాలంలోకి ప్రవేశ పెట్టడానికి అవసరమైన వెక్టర్ (వాహకం)ను అభివృద్ధి చేస్తున్నారు. ఆ వాహకాన్నే ఇప్పుడు ఈ వ్యాక్సిన్‌లో వినియోగించారు.
వివాదాలేంటి ?
ఈ వ్యాక్సిన్ చుట్టూ పలు వివాదాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా ఈ వ్యాక్సిన్ వినియోగం మొదలు పెట్టాక ఏప్రిల్‌లో కొందరిలో రక్తం గడ్డ కట్టే సమస్య తలెత్తింది. వ్యాక్సిన్ తీసుకున్న రెండు వారాల్లోనే ఈ దుష్ప్రభావం కనిపించింది. దీంతో కొన్నాళ్లు టీకా పంపిణీని నిలిపి వేశారు. ఆ తర్వాత అమెరికా ప్రభుత్వం విచారించి ఈ వ్యాక్సిన్‌తో జరిగే ప్రయోజనమే అత్యధికమని నిర్ధారించి మళ్లీ పంపిణీని మొదలు పెట్టింది. ఆ తర్వాత అరుదుగా వచ్చే నరాలకు సంబంధించిన వ్యాధి కూడా ఈ టీకా ద్వారా వచ్చే అవకాశం ఉందన్న ప్రమాదఘంటికలు మోగా యి. అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఈ వ్యాక్సిన్ తీసుకున్న 42 రోజుల తర్వాత శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఈ దుష్ప్రభావం కూడా చాలా తక్కువ మందిలో ఉండడంతో టీకా తీసుకోవడానికి ఎలాంటి భయాం దోళనలు అక్కర్లేదని అమెరికా ప్రభుత్వం చెబుతోంది.
డెల్టా వేరియంట్‌ను అడ్డుకోగలదా ?
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా డెల్టా వేరియెంట్‌ను జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ సమర్థవంతంగా అడ్డుకోగలదని దక్షిణాఫ్రికా తాజా సర్వేలో వెల్లడైంది. సిస్నోక్ అనే పేరుతో చేపట్టిన ఈ సర్వేలో డెల్టాతో పాటుగా బీటా వేరియంట్‌పై కూడా ఈ వ్యాక్సిన్ సమర్థంగా పని చేస్తోందని తేలిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో డెల్టా వేరియంట్ సోకితే ఆస్పత్రి చేరే అవసరం 71% మందికి రాదని, అదే బీటా వేరియంట్ అయితే 67% మందికి ఇంట్లోనే వ్యాధి నయం అయిపోతుంది. ఇక మరణాల రేటుని 96% తగ్గిస్తుంది. ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ప్రజలెవరూ ఆస్పత్రిపాలయ్యే అవకాశం ఉండదని, ప్రాణం మీదకి రావడం దాదాపుగా అసంభవమని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ లిండా గెయిల్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment