Johnson & Johnson Company
-
భారత్‌లో లైన్ క్లియర్.. జాన్సన్ – జాన్సన్ వచ్చేస్తోంది
న్యూఢిల్లీ: అమెరికా దిగ్గజ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన సింగిల్ డోస్ కోవిడ్–19 వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి భారత్ అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారం ట్వట్టర్ ద్వారా వెల్లడించారు. దీంతో కరోనాపై భారత్ చేస్తున్న పోరాటం మరింత బలోపేతమవుతుందని అన్నారు. ‘జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌కి అనుమతినివ్వడంతో మన దేశంలో వ్యాక్సిన్ల సంఖ్య అయిదుకి చేరుకుంది. కోవిడ్–19పై దేశం చేస్తున్న సమష్టి పోరాటానికి ఈ వ్యాక్సిన్ మరింత ఊతమిస్తుంది’’ అని మాండవీయ ట్వీట్ చేశారు. బ్రిటన్‌కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసి పుణేలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్ , స్వదేశీ వ్యాక్సిన్ భారత్ బయోటెక్‌కి చెందిన కొవాగ్జిన్, రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్–వీ అందుబాటులో ఉండగా , ఇటీవల అమెరికాకి చెందిన మోడెర్నా వ్యాక్సిన్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అత్యవసర అనుమతులు మంజూరు చేసింది. ఇప్పుడు ఆ జాబితాలో జాన్సన్ అండ్ జాన్సన్ కూడా చేరింది. శుక్రవారం నాడు జే అండ్ జే కంపెనీ అనుమతి కోసం దరఖాస్తు చేస్తే అదే రోజు డీసీజీఐ అనుమతినిచ్చిందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కీలక ముందడుగు: జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా మహమ్మారిని అరికట్టడంలో ఈ వ్యాక్సిన్‌కు అనుమతులివ్వడం కీలక ముందడుగు అని భారత్‌లోని జాన్సన్ అండ్ జాన్సన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. 18 ఏళ్లు అంతకంటే పై బడిన వారికి జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి భారత్‌లో అనుమతులు లభించాయని ఆ కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న 28 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తుందని ఆయన పేర్కొన్నారు. గతంలో జే అండ్ జే కంపెనీ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ భారత్‌లో నిర్వహించడానికి దరఖాస్తు చేసుకొని ఆ తర్వాత వెనక్కి తీసుకుంది. అదే సమయంలో వ్యాక్సిన్‌తో నరాలకు సంబంధించిన దుష్ప్రభావాలు వస్తాయని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో ఆ కంపెనీ వెనక్కి వెళ్లింది. ఆ తర్వాత తమ వ్యాక్సిన్‌తో దుష్ప్రభావాలు లేవని పలు అధ్యయనాలు తేల్చిన తర్వాత భారత్‌లో విజయవంతంగా ట్రయల్స్ నిర్వహించి అనుమతులు పొందింది. ఎన్నెన్నో ప్రత్యేకతలు జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ చాలా అంశాల్లో ప్రత్యేకత సంతరించుకుంది. అవేంటో చూద్దాం ► ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లన్నీ రెండు డోసులు తీసుకోవాల్సిన అవసరం ఉంటే జాన్సన్ అండ్ జాన్సన్ ఒక్క డోసు (0.5ఎంఎల్) తీసుకుంటే సరిపోతుంది. ► ఈ వ్యాక్సిన్ 85% సామర్థ్యంతో పని చేస్తుందని, అత్యంత సురక్షితమైనదని అమెరికా, దక్షిణాఫ్రికాలో జరిగిన పరిశోధనల్లో తేలింది. ► ఫైజర్, మోడెర్నా మాదిరిగా ఈ వ్యాక్సిన్‌కు అత్యంత శీతల వాతావరణంతో పని లేదు. సాధారణ రిఫ్రిజిరేటర్లలో మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది. దీంతో ఈ వ్యాక్సిన్‌ను కోల్డ్ స్టోరేజీ సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాలకు పంపిణీ చేయవచ్చు. ► అమెరికాలోని ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్‌లో వినియోగించే ఎంఆర్ఎన్ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ టీకాలో వాడలేదు. ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా టీకా మాదిరిగా ఇది ఎడెనోవెక్టర్ వ్యాక్సిన్. కరోనా వైరస్ జన్యువుల్లోని స్పైక్ ప్రొటీన్‌ను ఎడెనోవైరస్తో సమ్మేళనం చేసి ఈ టీకాను తయారు చేశారు. ఇది శరీరంలో ప్రవేశించాక రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందించి స్పైక్ ప్రొటీన్‌పై పోరాడడానికి సిద్ధమవుతుంది. దీంతో శరీరంలో యాంటీబాడీలు వచ్చి చేరుతాయి. ► ఈ వ్యాక్సిన్‌కి సంబంధించిన కీలకమైన ఫార్ములా కరోనా వైరస్ బట్టబయలు కావడానికి పదేళ్లకు ముందే అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు. బేత్ ఇజ్రాయెల్ డీకోనెస్ మెడికల్ సెంటర్‌కు చెందిన వైరాలజిస్టు డాన్ బరౌచ్, ఆయన బృందం జన్యుపరంగా మార్పులు చేసుకునే రోగకారకాలను మానవ కణజాలంలోకి ప్రవేశ పెట్టడానికి అవసరమైన వెక్టర్ (వాహకం)ను అభివృద్ధి చేస్తున్నారు. ఆ వాహకాన్నే ఇప్పుడు ఈ వ్యాక్సిన్‌లో వినియోగించారు. వివాదాలేంటి ? ఈ వ్యాక్సిన్ చుట్టూ పలు వివాదాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా ఈ వ్యాక్సిన్ వినియోగం మొదలు పెట్టాక ఏప్రిల్‌లో కొందరిలో రక్తం గడ్డ కట్టే సమస్య తలెత్తింది. వ్యాక్సిన్ తీసుకున్న రెండు వారాల్లోనే ఈ దుష్ప్రభావం కనిపించింది. దీంతో కొన్నాళ్లు టీకా పంపిణీని నిలిపి వేశారు. ఆ తర్వాత అమెరికా ప్రభుత్వం విచారించి ఈ వ్యాక్సిన్‌తో జరిగే ప్రయోజనమే అత్యధికమని నిర్ధారించి మళ్లీ పంపిణీని మొదలు పెట్టింది. ఆ తర్వాత అరుదుగా వచ్చే నరాలకు సంబంధించిన వ్యాధి కూడా ఈ టీకా ద్వారా వచ్చే అవకాశం ఉందన్న ప్రమాదఘంటికలు మోగా యి. అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఈ వ్యాక్సిన్ తీసుకున్న 42 రోజుల తర్వాత శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఈ దుష్ప్రభావం కూడా చాలా తక్కువ మందిలో ఉండడంతో టీకా తీసుకోవడానికి ఎలాంటి భయాం దోళనలు అక్కర్లేదని అమెరికా ప్రభుత్వం చెబుతోంది. డెల్టా వేరియంట్‌ను అడ్డుకోగలదా ? ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా డెల్టా వేరియెంట్‌ను జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ సమర్థవంతంగా అడ్డుకోగలదని దక్షిణాఫ్రికా తాజా సర్వేలో వెల్లడైంది. సిస్నోక్ అనే పేరుతో చేపట్టిన ఈ సర్వేలో డెల్టాతో పాటుగా బీటా వేరియంట్‌పై కూడా ఈ వ్యాక్సిన్ సమర్థంగా పని చేస్తోందని తేలిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో డెల్టా వేరియంట్ సోకితే ఆస్పత్రి చేరే అవసరం 71% మందికి రాదని, అదే బీటా వేరియంట్ అయితే 67% మందికి ఇంట్లోనే వ్యాధి నయం అయిపోతుంది. ఇక మరణాల రేటుని 96% తగ్గిస్తుంది. ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ప్రజలెవరూ ఆస్పత్రిపాలయ్యే అవకాశం ఉండదని, ప్రాణం మీదకి రావడం దాదాపుగా అసంభవమని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ లిండా గెయిల్ వెల్లడించారు. -
జాన్సన్ అండ్ జాన్సన్ టీకాతో డెల్టా వేరియంట్‌కు చెక్..!
న్యూజెర్సీ: కరోనా సెకండ్ వేవ్‌లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమైన డెల్టా వేరియంట్‌పై తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి. అతి వేగంగా కరోనా మహమ్మారిని వ్యాప్తి చేసే డేల్టా వేరియంట్‌పై జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికాలోని ఓ లాబోరేటరీలో జరిపిన అధ్యయనంలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. జాన్సన్ అండ్ జాన్సన్ టీకా సింగల్ డోసు.. డెల్టా వేరియంట్‌ను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తుందని గుర్తించారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి మెరుగవుతుందని, వ్యాక్సిన్ ప్రభావం దాదాపు 8 నెలల పాటు ఉంటుందని, ఆతర్వాత మరోసారి సింగిల్ బూస్టర్ డోస్ తీసుకుంటే సరిపోతుందని స్పష్టమైంది. SARS-CoV-2 వేరియంట్లపై జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని, యాంటీ బాడీలు త్వరగా ఉత్పత్తి చేసి డెల్టా వేరియంట్‌ను నిర్వీర్యం చేస్తుందని రిపోర్టులో వెల్లడించారు. జాన్సన్ అండ్ జాన్సన్ టీకా దక్షిణాఫ్రికాలో గుర్తించిన బీటా (B.1.351) వేరియంట్ కంటే డెల్టా వేరియంట్‌పై మరింత ప్రభావం చూపుతుందని అధ్యయనంలో స్పష్టమైంది. ఈ టీకా తీసుకున్న 85 శాతం మందిలో వైరస్ ప్రాణాంతకంగా మారకుండా ప్రభావం చూపుతుంది. తమ వ్యాక్సిన్ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో మెరుగైన ఫలితాలు రాబట్టిందని జాన్సన్ అండ్ జాన్సన్ ఎండీ పాల్ స్టాఫెల్స్ తెలిపారు. క్లినికల్ డేటా సమాచారం మేరకే సింగిల్ డోస్ వ్యాక్సిన్ ప్రభావంపై ఓ అంచనాకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ 8 నెలలపాటు కచ్చితంగా రక్షణ కల్పిస్తుందని శాస్త్రీయమైన ఆధారాలున్నాయని తెలిపారు. తమ వ్యాక్సిన్ డెల్టాతో పాటు మరికొన్ని కరోనా వేరియంట్లపై భారీ స్థాయిలో ప్రభావం చూపుతుందని వెల్లడించారు. ఈ సింగిల్ డోసు వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అమెరికాలో ఫిబ్రవరి 27న ఆమోదం లభించిందని, మార్చి 11న యూరోపియన్ కమిషన్ కండీషనల్ మార్కెటింగ్‌కు అనుమతి పొందిందని పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ వినియోగానికి భారత ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉందని తెలిపారు. -
‘జాన్సన్’ టీకా ప్రయోగానికి బ్రేక్
న్యూ బ్రన్స్విక్: జాన్సన్ అండ్ జాన్సన్ కోవిడ్–19 వ్యాక్సిన్ ప్రయోగం చివరి దశలో అర్ధాంతరంగా నిలిపివేశారు. వ్యాక్సిన్ ప్రయోగంలో పాల్గొన్న వ్యక్తి అనారోగ్యం పాలయ్యారు. అయితే అనారోగ్యానికి కారణం వ్యాక్సిన్ సంబంధితమేనా అనేదానిపై కంపెనీ పరిశీలిస్తోంది. అనారోగ్యం పాలవడం, ప్రమాదాలు జరగడం, కొన్నిసార్లు దుర్ఘటనలు జరగడం, ఏ వ్యాక్సిన్ అభివృద్ధిలో నైనా ఊహించిన పరిణామాలేనని, ప్రత్యేకించి, భారీ స్థాయిలో అధ్యయనాలు జరుపుతున్నప్పుడు ఇవి మామూలేనని కంపెనీ పేర్కొంది. అమెరికాలో వ్యాక్సిన్ ప్రయోగాలు చివరి దశలో ఉండగా, ఇలా సాంకేతిక సమస్యలు తలెత్తటంతో వ్యాక్సిన్ ప్రయోగం నిలిచిపోవడం ఇది రెండోసారి. భారీ స్థాయిలో జరిగే వైద్యపరమైన అధ్యయనాల్లో తాత్కాలిక విరామాలు సర్వసాధారణం. ఔషధాన్ని పరీక్షించే సమయంలో ఏవైనా తీవ్ర, అనూహ్య అనారోగ్య పరిణామాలు సంభవిస్తే కంపెనీలు వాటిని పరిశోధించాల్సి ఉంటుంది. పదివేల మందిపై ఇటువంటి వ్యాక్సిన్ ప్రయోగాలు జరిపితే, వారిలో కొందరికి అనారోగ్య సమస్యలు తలెత్తడం యాధృచ్చికమే. వ్యాక్సిన్ ప్రయోగించిన మహిళకు తీవ్రమైన న్యూరోలాజికల్ సమస్యలు ఉత్పన్నమవడంతో, ఆస్ట్రాజెనికా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు సంయుక్తంగా తయారు చేస్తోన్న కోవిడ్ వ్యాక్సిన్ చివరి దశ ప్రయోగాన్ని సైతం అమెరికాలో నిలిపివేశారు. అయితే వేరే ప్రాంతంలో ఈ ప్రయోగాన్ని కొనసాగిస్తున్నారు. -
‘తయారీ’లో పెట్టుబడులకు ప్రాధాన్యత
* ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధం: కేటీఆర్ * జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ప్రతినిధులతో భేటీ సాక్షి, హైదరాబాద్: తయారీ రంగంలో పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. ఈ రంగంలో వచ్చే పెట్టుబడులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హెల్త్‌కేర్ రంగంలో పేరొందిన జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సీనియర్ ఉపాధ్యక్షురాలు క్యాతీ వెంగల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం మంత్రి కేటీఆర్‌తో సచివాలయంలో సమావేశమైంది. తెలంగాణ ప్రత్యేకతలు, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ విధానాలపై ఈ సందర్భంగా మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం ప్రత్యేకతలతో పాటు.. ప్రభుత్వం దూరదృష్టితో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. హెల్త్ కేర్, బయో టెక్నాలజీ, లైఫ్ సెన్సైస్ రంగాల్లో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ.. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. రాష్ట్రం ఇప్పటికే ఫార్మా, హెల్త్ కేర్, మెడికల్ టూరిజం రంగాలకు కేంద్ర బిందువుగా ఉందని.. ఈ రంగాల్లో విస్తరించాల్సిందిగా సంస్థ ప్రతినిధులను కేటీఆర్ కోరారు. పారిశ్రామిక విధానం టీఎస్-ఐపాస్‌లోని ప్రత్యేకతలను వివరించారు. ఫార్మాసిటీతో పాటు మెడికల్ డివెజైస్ పార్కులో పెట్టుబడులు, జాన్సన్ అండ్ జాన్సన్‌కు చెందిన జే ల్యాబ్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి కేటీఆర్ ప్రతిపాదించారు. రెండేళ్లలో అంతర్జాతీయ సంస్థల నుంచి తెలంగాణకు పెట్టుబడులు వస్తున్న విషయాన్ని తాము గమనిస్తున్నామని వ్యాఖ్యానించిన క్యాతీ వెంగల్.. మెడికల్ డివెజైస్ పార్కులో పెట్టుబడులకు ఆసక్తి చూపారు. సమావేశానికి ముందు మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులోని జాన్సన్ అండ్ జాన్సన్ ప్రాంగణాన్ని సందర్శించిన మంత్రి కేటీఆర్.. క్యాతీ వెంగల్తో కలసి మొక్కలు నాటారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, టీఎస్ఐఐసీ ఎండీ వెంకట నర్సింహారెడ్డి పాల్గొన్నారు. -
సీఎం పర్యటన షెడ్యూలు ఖరారు
* 18న మధ్యాహ్నం ఒంటిగంటకు కొత్తూరులో జన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ప్రారంభం * సీఎం పర్యటనను విజయవంతం చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం మహబూబ్‌నగర్ టౌన్: ఈనెల 18న సీఎం కేసీఆర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లుచేయాలని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి రెవెన్యూ సమావేశ మందిరంలో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 18న మధ్యాహ్నం ఒంటిగంటకు కొత్తూర్ మండలానికి ముఖ్యమంత్రి చేరుకుని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీని ప్రారంభిస్తారని వెల్లడించారు. అనంతరం జడ్చర్ల పోలేపల్లి సెజ్‌లోని హెటిరో కంపెనీలోని ఓ యూనిట్, అలాగే సబ్‌స్టేషన్, బీటీరోడ్డును ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అనంతరం అడ్డాకల్ మండలం మూసాపేట్‌లోని కోజెంట్ గ్లాస్ కంపెనీలోని ఓ నూతన యూనిట్‌ను ప్రారంభించి తిరిగి హైదారాబాద్‌కు సాయంత్రం 5:55 గంటలకు వెళ్తారని వివరించారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. 24నుంచి బతుకమ్మ సంబరాలు ప్రభుత్వం తరఫున నిర్వహించనున్న బతుకమ్మ సంబరాలను ఈనెల 24నుంచి వచ్చే నెల 2వ తేదీవరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లుచేయాలని కోరారు. 23లోగా పాఠశాలల విద్యార్థులచే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 24న గ్రామ, 25న మండల, 28న డివిజన్, 30న జిల్లా స్థాయిలో ఉత్సవాలను జరిపించాలని కోరారు. మండలానికి తహశీల్దార్లు, డివిజన్‌కు ఆర్డీఓలు ఉత్సవాలను పర్యవేక్షించాలన్నారు. జిల్లాస్థాయిలో డీఆర్డీఏ పీడీ, డ్వామా పీడీ, జెడ్పీ సీఈఓల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించాలని కోరారు. ఇందుకోసం ఒక మానిటరింగ్ కమిటీని నియమించుకోవాలని సూచించారు. ఈ పోటీల్లో ప్రతిభచూపిన వారిలో ప్రథమ బహుమతి కింద రూ.వెయ్యి, రెండో బహుమతి రూ.500, మూడో బహుమతి రూ.300 చొప్పున అందజేస్తామన్నారు. సమావేశంలో జేసీ ఎల్.శర్మన్, డీఆర్ఓ రాంకిషన్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.