‘తయారీ’లో పెట్టుబడులకు ప్రాధాన్యత
* ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధం: కేటీఆర్
* జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ప్రతినిధులతో భేటీ
సాక్షి, హైదరాబాద్: తయారీ రంగంలో పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. ఈ రంగంలో వచ్చే పెట్టుబడులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హెల్త్‌కేర్ రంగంలో పేరొందిన జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సీనియర్ ఉపాధ్యక్షురాలు క్యాతీ వెంగల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం మంత్రి కేటీఆర్‌తో సచివాలయంలో సమావేశమైంది. తెలంగాణ ప్రత్యేకతలు, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ విధానాలపై ఈ సందర్భంగా మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
రాష్ట్ర పారిశ్రామిక విధానం ప్రత్యేకతలతో పాటు.. ప్రభుత్వం దూరదృష్టితో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. హెల్త్ కేర్, బయో టెక్నాలజీ, లైఫ్ సెన్సైస్ రంగాల్లో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ.. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. రాష్ట్రం ఇప్పటికే ఫార్మా, హెల్త్ కేర్, మెడికల్ టూరిజం రంగాలకు కేంద్ర బిందువుగా ఉందని.. ఈ రంగాల్లో విస్తరించాల్సిందిగా సంస్థ ప్రతినిధులను కేటీఆర్ కోరారు. పారిశ్రామిక విధానం టీఎస్-ఐపాస్‌లోని ప్రత్యేకతలను వివరించారు. ఫార్మాసిటీతో పాటు మెడికల్ డివెజైస్ పార్కులో పెట్టుబడులు, జాన్సన్ అండ్ జాన్సన్‌కు చెందిన జే ల్యాబ్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి కేటీఆర్ ప్రతిపాదించారు.
రెండేళ్లలో అంతర్జాతీయ సంస్థల నుంచి తెలంగాణకు పెట్టుబడులు వస్తున్న విషయాన్ని తాము గమనిస్తున్నామని వ్యాఖ్యానించిన క్యాతీ వెంగల్.. మెడికల్ డివెజైస్ పార్కులో పెట్టుబడులకు ఆసక్తి చూపారు. సమావేశానికి ముందు మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులోని జాన్సన్ అండ్ జాన్సన్ ప్రాంగణాన్ని సందర్శించిన మంత్రి కేటీఆర్.. క్యాతీ వెంగల్‌తో కలసి మొక్కలు నాటారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకట నర్సింహారెడ్డి పాల్గొన్నారు.