సాక్షి ప్రత్యేక ప్రతినిధి : తొమ్మిదేళ్ల క్రితం దేశంలోని 25 రంగాల్లోకి ప్రారంభమైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐలు) పర్వం కొనసాగుతూనే ఉంది. అనేక అనుమానాలు వ్యక్తమైనా ఆంక్షలు, అడ్డంకులు ఎదురైనా, కరోనా లాంటి విపత్తులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపివేసినా బలీయమైన ఆర్థిక శక్తిగా ప్రపంచ మార్కెట్ మన్ననలు పొందుతున్న భారత్‌లోకి ఈ పెట్టుబడులు ప్రవాహంలా కొనసాగుతూనే ఉన్నాయి.
కానీ 2022–23 ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఎఫ్‌డీఐలు 20 శాతానికి పైగా తగ్గాయని ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి. 2014లో 45.5 బిలియన్ డాలర్లతో ప్రారంభమైన ఈ పెట్టుబడులు ఒకానొక దశలో 60 బిలియన్ డాలర్ల మార్కు దాటాయి. 2016–17లో 60.22 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కానీ గత ఐదేళ్లుగా ఈ పెట్టుబడుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి.
2018–19 ఆర్థిక సంవత్సరంలో 44.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా, ఆ తర్వాతి ఏడాదిలో 50 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2020–21లో అనూహ్యంగా పెరిగి 2016–17 మార్కుకు దాదాపు సమాంతరంగా 59.6 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆ తర్వాతి ఏడాదిలో (2021–22)లో 58.8 బిలియన్ డాలర్లు నమోదు కాగా, గత మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మాత్రం గణనీయంగా తగ్గిపోయాయని, 46 బిలియన్ డాలర్ల మేరకు మాత్రమే ఎఫ్‌డీఐలు వచ్చాయని ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను విడుదల చేసిన నివేదికలో ఆర్‌బీఐ లెక్కలు వెల్లడించింది.
తయారీ రంగంలో ఎక్కువగా పెట్టుబడులు
2021–22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆర్థిక సేవలు, ఇంధన రంగంలోనే 2022–23లో ఎఫ్‌డీఐలు పెరిగాయి. తయారీ రంగంలో ఈ పెట్టుబడులు ఏకంగా 5 బిలియన్ డాలర్లు తగ్గగా, ఆర్థిక సేవల రంగంలో 2.1 బిలియన్ డాలర్లు పెరిగాయి. కంప్యూటర్ సేవల రంగం 4.4 బిలియన్ డాలర్ల తగ్గుదలను నమోదు చేసుకోగా, కమ్యూనికేషన్ సేవల్లో కూడా 2 బిలియన్ డాలర్ల మేర ఎఫ్‌డీఐలు తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి.
ఇంధన రంగంలో అంతకుముందు ఏడాది (2.2 బిలియన్ డాలర్లు)తో పోల్చుకుంటే గత ఏడాదిలో (3.3 బిలియన్ డాలర్లు) ఎఫ్‌డీఐలు పెరిగాయి. వివిధ దేశాలు మన దేశంలోని పరిశ్రమల్లో పెడుతున్న ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఎక్కువ శాతం తయారీ రంగంలోనే ఉంటున్నాయి. తయారీ రంగంలో ఎఫ్‌డీఐలు అత్యధికంగా 2021–22లో 16.3 బిలియన్ డాలర్లు రాగా, ఆ తర్వాత ఏడాదిలో 11.3 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
అయితే 2022–23లో ఆర్థిక సర్వీసుల రంగంలో విదేశీ పెట్టుబడులు పెరిగాయి. ఈ రంగంలో గత ఏడాది 6.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. కానీ దీనికి ముందు మూడేళ్లు ఇంతకంటే తక్కువగానే పెట్టుబడులు వచ్చాయి.
రియల్ ఎస్టేట్‌లో అంతంతమాత్రమే..
ఆసక్తికరమైన విషయమేమిటంటే మన దేశంలోని రియల్ ఎస్టేట్ రంగంలో ఎఫ్‌డీఐలు పెట్టేందుకు ఇతర దేశాలు పెద్దగా ముందుకు రావడం లేదు. ఈ రంగంలో అత్యధికంగా 2019–20లో 0.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా, గతేడాది అంటే 2022–23లో కేవలం 0.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులే వచ్చాయి.
ఇప్పటివరకు దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చిన జాబితాలో తయారీ, ఆర్థిక సర్విసులు, రియల్ ఎస్టేట్‌తో పాటు కంప్యూటర్ సర్విసులు, రిటైల్–హోల్‌సేల్ వ్యాపారాలు, కమ్యూనికేషన్ సేవలు, ఇంధన, వ్యాపార సేవలు, విద్య–పరిశోధన, రవాణా, నిర్మాణ, హోటళ్లు–రెస్టారెంట్లు, మైనింగ్, ఇతర వ్యాపార రంగాలున్నాయి.
పీఎల్‌ఐ ఇవ్వడం సక్సెస్ కాలేదు– డి.పాపారావు, ఆర్థిక రంగ విశ్లేషకులు
ఆర్థిక వ్యవస్థ గ్లోబల్ గానే స్లో డౌన్‌లో ఉంది. మార్కెట్‌లో డిమాండ్ లేకపోవడం దీనికి ప్రధాన కారణం. దీనికి తోడు ఉత్పత్తి పెరిగే అవకాశాలు లేవు. భారత్‌లో ఎఫ్‌డీఐలు తగ్గడానికి మరో ప్రధాన కారణంకూడా ఉంది. 14 రంగాల్లో ముఖ్యంగా మొబైల్స్, ఎల్రక్టానిక్ పరికరాలు తదితరాల్లో ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సాహకాలు (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్–పీఎల్‌ఐ) ఇవ్వడం అనేది సక్సెస్ కాలేదు.
మౌలికసదుపాయాలు మెరుగు కాకపోవడం, రవాణా సౌకర్యాలు పెరగకపోవడం, లాజిస్టిక్స్ ఖర్చు పెరగడం వంటివి ప్రభావం చూపుతున్నాయి. ఆర్థిక నిపుణులు చెబుతున్న దానిని బట్టి చూసినా మొబైల్స్, ఫార్మా రంగాల్లోనే ఇది విజయవంతమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో వియత్నాం, బంగ్లాదేశ్‌లలో ఎఫ్‌డీఐలు పెరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment