సాక్షి, అమరావతి: రాష్ట్రానికి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయంటూ ప్రభుత్వ పెద్దలు జనం చెవుల్లో పువ్వులు పెడుతున్నారు. మరోవైపు వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) ఆకర్శించడంలో ఆంధ్రప్రదేశ్ వెనుకంజలోనే ఉంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఎఫ్‌డీఐలు ఏకంగా 43 శాతం మేర తగ్గిపోయాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను రాబట్టుకోవడంలో పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు ఊహించని విధంగా ముందుకు దూసుకెళ్తున్నాయి. ఎఫ్‌డీఐల విషయంలో ఏడాది కాలంలోనే కర్ణాటక 300 శాతం, తమిళనాడు 56 శాతం వృద్ధి సాధించడం గమనార్హం.
భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) తాజాగా ఈ గణాంకాలను వెల్లడించింది. 2017–18లో వివిధ రాష్ట్రాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ఆర్‌బీఐ ఒక నివేదిక రూపొందించింది. దీన్ని రెండు రోజుల క్రితం పార్లమెంట్‌కు సమర్పించింది. విదేశీ పెట్టుబడులను ఆకర్శిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక అభివృద్ధి బోర్డు(ఈడీబీ) పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. సులభతర వాణిజ్యంలో మొదటి ర్యాంకు సాధించామని దేశ విదేశాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయినప్పటికీ విదేశీ పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్‌పై ఆసక్తి చూపకపోవడం అధికార వర్గాలను కలవరపరుస్తోంది.
సంప్రదింపులతోనే సరి
భారీగా పెట్టుబడులు సాధించుకోస్తామంటూ గత నాలుగేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా అధికార యంత్రాంగం పలు దేశాల్లో పర్యటించింది. 40 దేశాల నుంచి రూ.లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రాబోతున్నాయంటూ టీడీపీ ప్రభుత్వం ఊదరగొట్టింది. అయితే, సంప్రదింపులు జరిపిన విదేశీ పెట్టుబడిదారులు ఏపీలో పరిశ్రమలు స్థాపించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. వారంతా పొరుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టారు. 2017–18లో కర్ణాటక రాష్ట్రానికి 2.13 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అధికంగా వచ్చాయి.
మొత్తం ఎఫ్‌డీఐలు 8.58 బిలియన్ డాలర్లకు చేరాయి. తమిళనాడులో ఎఫ్‌డీఐలు 3.47 బిలియన్ డాలర్లకు చేరాయి. తమిళనాడులో రాజకీయ అనిశ్చితి కొనసాగినప్పటికీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగడం విశేషం. ఆంధ్రప్రదేశ్ మాత్రం గతేడాదితో పోలిస్తే 43 శాతం ఎఫ్‌డీఐలను కోల్పోయింది. రాష్ట్రానికి గతేడాది 3.37 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా, ఈ ఏడాది 1.25 బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి.
‘హోదా’ లేదనే పెట్టుబడులు వెనక్కి
విశాఖపట్నంలో 2015లో రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక భాగస్వామ్య సదస్సును భారీ ఎత్తున నిర్వహించింది. ముఖ్యమంత్రి, ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు కలిసి రూ.కోట్లు పెట్టి ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలు చేశారు. విదేశీ పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తొలుత కొందరు ముందుకొచ్చారు.
కానీ, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను గమనించిన తర్వాత వెనుకడుగు వేశారు. అనుమతుల మంజూరీలో అవినీతి వల్లే వారు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల కూడా పెట్టుబడిదారులు ఏపీపై ఆసక్తి చూపడం లేదు. మెరుగైన మౌలిక వసతులు, మార్కెటింగ్ సదుపాయాలున్న పొరుగు రాష్ట్రాలపై దృష్టి పెట్టారు.
మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం..
‘‘కర్ణాటక, తమిళనాడు, హైదరాబాద్ ప్రాంతాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాయి. అందుకే పెట్టుబడిదారులు అటువైపు ఆకర్శితులవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పు డిప్పుడే మౌలిక వసతుల కల్పన జరుగుతోంది. పెట్టుబడిదారులు అభివృద్ధి చెందిన ప్రాంతాలకే వెళ్తారు. ఎఫ్‌డీఐలను ఆకర్శించేందుకు మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం. – కృష్ణకిషోర్, సీఈవో, ఈడీబీ
Comments
Please login to add a commentAdd a comment