సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత మూడేళ్లుగా అభివృద్ధి వ్యయం పెరుగుతుండగా వడ్డీల చెల్లింపుల వ్యయం తగ్గుతున్నట్లు రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) అధ్యయన నివేదిక వెల్లడించింది. రాష్ట్రాల ఆర్థిక వ్యవహారాలు, బడ్జెట్లపై నివేదిక విడుదల చేసిన ఆర్బీఐ 2021–22 నుంచి 2023–24 వరకు ప్రధాన ఆర్థిక సూచికలను ఇందులో పొందుపరిచింది. సామాజిక సేవలు, ఆర్థిక సేవల వ్యయం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొంది. సామాజిక, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన కార్యకలాపాలపై నేరుగా చేసే వ్యయాన్ని అభివృద్ధి వ్యయంగా నిర్వచించింది. వ్యవసాయం, ఆరోగ్యం, విద్యపై చేసే ఖర్చును అభివృద్ధి వ్యయంగా ఉదహరించింది.
జీతభత్యాలు భారీగానే..
► ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా మూడేళ్లుగా సామాజిక రంగ వ్యయం పెరుగుతోంది. సామాజిక సేవలు, గ్రామీణాభివృద్ధి, ఆహార నిల్వలు, గిడ్డంగులు ఈ కోవలోకి వస్తాయి. ఇదే సమయంలో ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం, నీటి సరఫరా, పారిశుద్ధ్య రంగాల కోసం వెచ్చించే వ్యయం కూడా పెరుగుతోంది.
► 2021–22లో మొత్తం వ్యయంలో అభివృద్ధి వ్యయం రూ.1.19 లక్షల కోట్లు ఉండగా 2023–24 నాటికి రూ.1.92 లక్షల కోట్లకు పెరిగింది.
► వడ్డీ చెల్లింపులు పెరుగుతున్నాయనే వాదనల్లో నిజం లేదు. రెవెన్యూ రాబడిలో వడ్డీ చెల్లింపుల శాతం తగ్గుతోంది.
► ఏపీలో వేతనాలు, జీతాలు చెల్లింపులు గత ఐదేళ్లుగా పెరుగుతూనే ఉన్నాయి. ఉద్యోగులకు పీఆర్‌సీ అమలుతో పాటు చిరు ఉద్యోగుల వేతనాలను పెంచడంతో వేతనాలు, జీతాల వ్యయం పెరుగుతున్నట్లు సూచికలు వెల్లడిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment