గత ఐదేళ్లుగా రెవెన్యూ మిగులు సాధించిన మున్సిపల్ కార్పొరేషన్లు
ఆస్తి పన్నుల వసూళ్లలో గణనీయమైన పురోగతి
ప్రజాసేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం
ఆర్‌బీఐ అధ్యయనంలో వెల్లడి
సాక్షి, అమరావతి: సమర్థమైన పాలన వ్యవస్థల ద్వారా గడచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీలు సర్వతోముఖాభివృద్ధి దిశగా దూసుకెళ్లిందని ఆర్‌బీఐ అధ్యయన నివేదిక వెల్లడించింది. ఆర్థిక స్వయం ప్రతిపత్తి, పౌరసేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగిందని, కార్పొరేషన్ల బడ్జెట్‌లో రెవెన్యూ మిగులు సాధించాయని నివేదిక స్పష్టం చేసింది. 2019–2024 వరకు దేశంలోని రాష్ట్రాల్లో 232 మున్సిపల్ కార్పొరేషన్ల ఆరి్థక స్థితిగతులపై ఆర్‌బీఐ అధ్యయనం చేసి నివేదిక రూపంలో విడుదల చేసింది.
2023–24 ఆర్థిక ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ల బడ్జెట్ మొత్తం వ్యయంలో 50 శాతానికిపైగా ఆస్తుల కల్పన (మూలధన)కు వ్యయం చేసినట్లు నివేదిక పేర్కొంది. అలాగే జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మున్సిపల్ కార్పొరేషన్ల బడ్జెట్ల మొత్తం వ్యయంలో ఆస్తుల కల్పన వ్యయం 50 శాతం కన్నా ఎక్కువగానే ఉందని నివేదిక వివరించింది.
కేపిటల్ వాల్యూ విధానంలో పన్ను మార్కెట్ శాతం అంచనాతో ఆస్తి విలువను ప్రాథమికంగా నిర్ధారించడంతో పాటు ఏటా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేస్తోందని, ఈ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణల్లో అమలు చేస్తున్నారని తెలిపింది. అలాగే ఐదేళ్లు రాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ల మూలధన రాబడులు, వ్యయం కూడా పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్లు ఆర్థికంగా స్వయంప్రతిపత్తి సాధించడంతో పట్టణ మౌలిక సదుపాయాలు బాగా పెరిగాయని తెలిపింది.
ఆస్తి పన్నుల వసూళ్లలో గణనీయమైన పురోగతి సాధించిన రాష్ట్రాల మున్సిపల్ కార్పొరేషన్లలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. 2019–20 నుంచి 2023–24 మధ్య రెవెన్యూ వసూళ్లలో ఆస్తి పన్నుల వసూళ్లు పెరిగాయని నివేదిక పేర్కొంది. రాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్‌ల్లో మూల ఆదాయాలను, పన్నేతర ఆదాయాలను గణనీయంగా పెంచుకున్నాయని, దీంతో నీటి సరఫరా సేవలు, పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ అధిక నాణ్యతతో నిర్వహిస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment