సాక్షి, అమరావతి: దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న జాతీయ పెన్షన్ స్కీం (ఎన్‌పీఎస్) నుంచి ప్రభుత్వోద్యోగులు పాత పెన్షన్ స్కీముకు (ఓపీఎస్) మారితే రాష్ట్రాలు అథోగతి పాలవుతాయని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధ్యయన నివేదిక ఆందోళన వ్యక్తంచేసింది. ఇదే జరిగితే భవిష్యత్తు తరాల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని.. వారి ప్రయోజనాల విషయంలో రాజీపడటమేనని ఆర్బీఐ నివేదిక హెచ్చరించింది.
ఇటీవల కొన్ని రాష్ట్రాలు ఎన్‌పీఎస్ నుంచి ఓపీఎస్‌కు మారుతామని చెబుతున్న నేపథ్యంలో.. వివిధ రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితులు, ప్రస్తుత ఉద్యోగుల పెన్షన్ భారం, ఓపీఎస్‌కు మారితే భవిష్యత్‌లో పెరిగే పెన్షన్ల వ్యయం, తద్వారా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను బేరీజు వేస్తూ ఆర్బీఐ తన అధ్యయన నివేదికను విడుదల చేసింది. ఓపీఎస్‌కు వెళ్లడమంటే ఆర్థిక సంస్కరణల్లో వెనుకడుగు వేయడమేనని తేల్చిచెప్పింది. అలాగే, ఓపీఎస్‌కు మారడంవల్ల రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై పెనుభారం పడుతుందని పేర్కొంది. అదే జరిగితే రాష్ట్రాల మొత్తం పెన్షన్ భారం 2023 మార్చి చివరి నుంచి 2084 మార్చి చివరి వరకు సగటున 4.5 రెట్లు పెరుగుతుందని ఆర్బీఐ నివేదిక స్పష్టంచేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇది 4.3 రెట్లు ఉంటుందని తెలిపింది.
దీర్ఘకాలిక వృద్ధిపై తీవ్ర ప్రభావం..
మరోవైపు.. 2022 నవంబర్ నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి ఎన్‌పీఎస్ ఉద్యోగుల సంఖ్య 50 లక్షలు ఉందని, వీరి ఎన్‌పీఎస్ కంట్రిబ్యూషన్ కార్పస్ ఫండ్ రూ.2.5 లక్షల కోట్లు ఉందని ఆ నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో వీరి సంఖ్య రెండున్నర లక్షలు ఉందని.. ఇప్పటికే ఏపీ సొంత రెవెన్యూ రాబడిలో పెన్షన్లకు 24 శాతం వ్యయమవుతోందని, ఓపీఎస్‌కు మారితే పెన్షన్ల వ్యయం భారీగా పెరుగుతుందని నివేదిక వెల్లడించింది. ఇది మూలధన వ్యయాన్ని తగ్గిస్తూ దీర్ఘకాలిక వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని.. భవిష్యత్తు తరాల ప్రయోజనాలకు తీరని నష్టం కలిగిస్తుందని కూడా ఆర్బీఐ హెచ్చరించింది.
ప్రస్తుతం ఎన్‌పీఎస్ విధానంలో ఉద్యోగులు రిటైరయ్యాక చివరిగా తీసుకున్న జీతంలో 50 శాతం పెన్షన్ పొందుతారని, డియర్‌నెస్ రిలీఫ్ రివిజన్‌ల ప్రయోజనాన్ని కూడా పొందుతారని తెలిపింది. అయితే, ఉద్యోగులకు ఓపీఎస్ విధానం ఆకర్షణీయంగా ఉండవచ్చుగానీ ప్రభుత్వాల మీద అపారమైన ఆర్థిక భారాన్ని కలిగిస్తుందని, తద్వారా భవిష్యత్ సంవత్సరాల్లో ప్రభుత్వ పెన్షన్ బాధ్యతలను మరింత పెంచుతుందని నివేదిక స్పష్టంచేసింది. ఓపీఎస్‌కు మారితే మొత్తం రాష్ట్రాల పెన్షన్ భారం 2040 నుంచి 2060 వరకు భారీగా పెరుగుతుందని, ఇది దేశ జీడీపీలో 0.9 శాతానికి చేరుకుంటుందని ఆర్బీఐ నివేదిక పేర్కొంది.
భవిష్యత్తులో పెన్షన్లు చెల్లించడమే కష్టం..
ఇక ఎన్‌పీఎస్ నుంచి ఓపీఎస్‌కు మారితే మొత్తం రాష్ట్రాల పెన్షన్ల వ్యయం 2023 నుంచి పెరగడం ప్రారంభమై 2045 నాటికి లక్ష కోట్లకు చేరుతుందని, 2057 సంవత్సరం నాటికి రూ.1.80 లక్షల కోట్లకు పెరుగుతుందని.. ఇది రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలకు పెనుభారం కానుందని ఆ నివేదిక తెలిపింది. భవిష్యత్‌లో పెన్షన్లను చెల్లించడమే చాలా కష్టతరం కావచ్చునని వ్యాఖ్యానించింది. అంతేకాక.. ఓపీఎస్‌కు వెళ్తే భవిష్యత్ తరాల ప్రయోజనాల విషయంలో రాజీపడటమే అవుతుందని, ఇది రాష్ట్రాలకు మంచిది కాదని ఆర్బీఐ అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం 2019 ఏప్రిల్ 1 నుంచి ఎన్‌పీఎస్ ఉద్యోగుల పెన్షన్ కంట్రిబ్యూషన్‌ను 14 శాతానికి పెంచిందని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 14 శాతానికి పెంచాల్సి ఉందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment