ఉదయం 8 గంటలకు అల్పాహారం, రాత్రి 8 గంటలకు రాత్రి భోజనం మంచిదంటున్న శాస్త్రవేత్తలు
హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని ప్రభావితం చేస్తున్న భోజన సమయాలు
ఫ్రాన్స్‌లోని యూనివర్సిటీ సోర్బోన్ ప్యారిస్ నోర్డ్ అధ్యయనంలో వెల్లడి
సాక్షి, అమరావతి: సరైన సమయానికి ఆహారం తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులను నివారించవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఉదయం 8 గంటలకు అల్పాహారం.. రాత్రి 8 గంటలకు చివరి భోజనం తీసుకోవడాన్ని తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. ఫ్రాన్స్‌లోని వర్సిటీ సోర్బన్ ప్యారిస్ నోర్డ్ అధ్యయనంలో భోజన సమయాలకు, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాలకు మధ్య గుట్టును నిర్ధారించింది.
ముఖ్యంగా కార్డియోవాసు్కలర్ డిసీజెస్ (సీవీడీ)లో భాగంగా కొరోనరీ హార్ట్ డిసీజ్, సెరెబ్రోవాసు్కలర్ డిసీజ్, రుమాటిక్ హార్ట్ డిసీజ్ ప్రమాదాలను అరికట్టడానికి క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు మేలైన మార్గమని సూచిస్తోంది. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురించిన ఈ ఫ్రెంచ్ అధ్యయనం ప్రకారం రాత్రిపూట ఎక్కువసేపు ఉపవాసంతో ఉంటే హృదయ సంబంధ వ్యాధుల ప్రభావాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు కనుగొన్నారు.
ఇందుకు నిద్రవేళకు దగ్గరగా భారీ భోజనాన్ని తగ్గించాలని హెచ్చరిస్తున్నారు. ఖాళీ కడుపు.. శరీరంలోని వివిధ అవయవాల సిర్కాడియన్ లయలను సరి చేస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా రక్తపోటు నియంత్రణ వంటి కార్డియోమెటబాలిక్ పనితీరును ప్రభావితం చేస్తుంది. ఈ సిర్కాడియన్ రిథమ్ శరీరంలోని అంతర్గత గడియారంగా పని చేస్తుంది.
లేటుగా తింటే చేటే..
అల్పాహారం దాటవేయడం, రోజులో మొదటి ఆహారాన్ని ఆలస్యంగా తీసుకోవడంతో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధ్యయనం వెల్లడించింది. ఉదాహరణకు ఉదయం 8 గంటలకు తినేవారి కంటే 9 గంటలకు అల్పాహారం చేసే వ్యక్తికి హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం 6 శాతం ఎక్కువ. ఆలస్యంగా రాత్రి 8 గంటలకు బదులు 9 గంటలకు తినడం వల్ల ముఖ్యంగా మహిళల్లో పోలిస్తే స్ట్రోక్ వంటి సెరెబ్రోవాసు్కలర్ వ్యాధి వచ్చే ప్రమాదం 28 శాతం పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు.
రాత్రిపూట ఎక్కువ సేపు ఉపవాస సమయం ఉంటే సెరెబ్రోవాసు్కలర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చని, ఉదయం ప్రారంభ భోజనం మెరుగైన ఇన్సులిన్ సెన్సిటివిటీని, ఇన్‌ఫ్లమేషన్‌ను నివారించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందని గుర్తించారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడం ద్వారా కాలక్రమేణా హృదయనాళ వ్యవస్థపై ఒత్తిడి తగ్గి గుండె పనితీరు మెరుగుపడుతుందని చెబుతున్నారు. భోజనం చేసే సమయం నిద్ర నాణ్యతను కూడా ప్రభావతం చేయడం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పొంచి ఉంటుందని పేర్కొన్నారు.
ఐదో వంతు భారత్‌లోనే..
ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 నివేదిక ప్రకారం హృదయ సంబంధ వ్యాధుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 1.80 కోట్ల మరణాలు నమోదైతే.. ఇందులో ఐదో వంతు భారత్ నుంచే ఉన్నాయి. ముఖ్యంగా భారతీయ యువతలో గుండె సంబంధిత మరణాలు ఎక్కువయ్యాయి. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అధ్యయనంలోనూ భారత్‌లో ఒక లక్ష జనాభాకు 272 మంది హృదయ సంబంధ మరణాలు రేటు ఉంది. ఇది ప్రపంచ సగటు 235 కంటే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment