సాక్షి, అమరావతి: గతేడాది కంటే ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదైనా భూగర్భజలాల పెరుగుదలలో దేశంలో మన రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. వర్షం తక్కువగా కురిసినా రాష్ట్ర ప్రభుత్వం వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భజలాలుగా మార్చే జలసంరక్షణ చర్యలు మెరుగ్గా చేపట్టడం వల్లే ఇది సాధ్యమైందని కేంద్ర భూగర్భ జలవనరుల మండలి (సీజీడబ్ల్యూబీ) ప్రశంసించింది. దేశంలో ఈ ఏడాది భూగర్భజలాల పరిస్థితిపై సీజీడబ్ల్యూబీ అధ్యయనం చేసింది. అధ్యయనంలో వెల్లడైన అంశాలపై కేంద్ర జల్‌శక్తి శాఖకు ఇటీవల నివేదికను అందించింది. ఆ నివేదికలో ప్రధానాంశాలు ఇవీ..
వరుసగా రెండో ఏడాదీ అగ్రగామిగా రాష్ట్రం
♦ దేశవ్యాప్తంగా 6,553 మండలాలు/బ్లాక్‌లలో భూగర్భజలాల పరిస్థితిపై సీజీడబ్ల్యూబీ అధ్యయనం చేసింది. రాష్ట్రంలో 667 మండలాల్లో అధ్యయనం చేసింది.
♦ నైరుతి, ఈశాన్య రుతుపవనాల వల్ల ఏటా సగటున దేశంలో 1,236.4 మిల్లీమీటర్లు, రాష్ట్రంలో 1,148.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాలి.
♦ ఈ ఏడాది దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం కంటే తక్కువ వర్షం కురిసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 835.03 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 714.88 మిల్లీమీటర్లు కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 14.39 శాతం తక్కువగా నమోదైంది.
♦ వర్షపాతం, జలసంరక్షణ కట్టడాలు, చర్యల వల్ల దేశంలో 2023లో భూగర్భజలాలు 15,861.50 టీఎంసీలు పెరిగాయి. ఇందులో జాతీయ ప్రమాణాల మేరకు 14,382.65 టీఎంసీలు (90.67 శాతం) వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో 8,524.12 టీఎంసీలను (59.26%) ఇప్పటికే వినియోగించుకున్నారు.
♦ రాష్ట్రంలో వర్షపాతం, జలసంరక్షణ చర్యల వల్ల భూగర్భజలాలు ఈ ఏడాది 983.30 టీఎంసీలు పెరిగాయి. ఇందులో 934.21 టీఎంసీలు వాడుకోవచ్చు. అందులో ఇప్పటివరకు 264.18 టీఎంసీలు (28.3 శాతం) మాత్రమే వినియోగించుకున్నారు. ఇటు భూగర్భజలాలు సంరక్షిస్తూ, అటు పొదుపుగా వినియోగించుకుంటూ భూగర్భజలాల పరిరక్షణలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. గతేడాది సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షం కురిసినా భూగర్భజలాలు 982.95 టీఎంసీలే పెరగడం గమనార్హం.
♦ భూగర్భజలాల పరిరక్షణలో గతేడాది మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది కూడా అగ్రగామిగా నిలిచింది.
♦ దేశంలో 2–5 మీటర్ల లోతులోనే పుష్కలంగా భూగర్భజలాలు లభ్యమయ్యే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, అసోం, ఉత్తరప్రదేశ్ (ఉత్తర ప్రాంతం), బిహార్ (ఉత్తర ప్రాంతం) నిలిచాయి. భూగర్భజలమట్టం దారుణంగా 20–40 మీటర్లకు పడిపోయిన రాష్ట్రాల్లో ఢిల్లీ, హరియాణ, పంజాబ్, రాజస్థాన్ ఉన్నాయి.
జలసంరక్షణ చర్యల వల్లే
రాష్ట్రంలో కురిసిన వర్షపాతం కంటే.. ప్రాజెక్టులు, చెక్‌డ్యామ్‌లు, అడవుల్లో కందకాలు తవ్వడం వంటి జలసంరక్షణ చర్యల వల్లే భూగర్భజలాలు అధికంగా పెరుగుతున్నాయి. వర్షాకాలంలో వర్షం వల్ల 316.82 టీఎంసీలు భూగర్భజలాలుగా మారుతుండగా.. జలసంరక్షణ చర్యల వల్ల 351.08 టీఎంసీలు భూగర్భజలాలుగా రూపాంతరం చెందుతున్నాయి. ఇక చలి, వేసవి కాలాల్లో కురిసే వర్షాల వల్ల 30.02 టీఎంసీలు భూగర్భజలాలుగా మారుతుంటే.. జలసంరక్షణ చర్యల వల్ల 285.38 టీఎంసీలు భూగర్భజలాలుగా రూపాంతరం చెందుతున్నాయి.
వ్యవసాయానికే సింహభాగం వినియోగం
రాష్ట్రంలో భూగర్భజలాలను సింహభాగం వ్యవసాయానికే వినియోగిస్తున్నారు. పంటల సాగుకు 227.46 టీఎంసీలను బోరుబావుల ద్వారా రైతులు వాడుకుంటున్నారు. పారిశ్రామిక అవసరాల కోసం 4.94 టీఎంసీలను బోరుబావుల ద్వారా వినియోగించుకుంటున్నారు. గృహ అవసరాల కోసం ప్రజలు 31.78 టీఎంసీలను వాడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment