Groundwater conservation
-
భూగర్భజల పరిరక్షణలో ఏపీ టాప్
-
భూగర్భజల పరిరక్షణలో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: గతేడాది కంటే ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదైనా భూగర్భజలాల పెరుగుదలలో దేశంలో మన రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. వర్షం తక్కువగా కురిసినా రాష్ట్ర ప్రభుత్వం వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భజలాలుగా మార్చే జలసంరక్షణ చర్యలు మెరుగ్గా చేపట్టడం వల్లే ఇది సాధ్యమైందని కేంద్ర భూగర్భ జలవనరుల మండలి (సీజీడబ్ల్యూబీ) ప్రశంసించింది. దేశంలో ఈ ఏడాది భూగర్భజలాల పరిస్థితిపై సీజీడబ్ల్యూబీ అధ్యయనం చేసింది. అధ్యయనంలో వెల్లడైన అంశాలపై కేంద్ర జల్‌శక్తి శాఖకు ఇటీవల నివేదికను అందించింది. ఆ నివేదికలో ప్రధానాంశాలు ఇవీ.. వరుసగా రెండో ఏడాదీ అగ్రగామిగా రాష్ట్రం ♦ దేశవ్యాప్తంగా 6,553 మండలాలు/బ్లాక్‌లలో భూగర్భజలాల పరిస్థితిపై సీజీడబ్ల్యూబీ అధ్యయనం చేసింది. రాష్ట్రంలో 667 మండలాల్లో అధ్యయనం చేసింది. ♦ నైరుతి, ఈశాన్య రుతుపవనాల వల్ల ఏటా సగటున దేశంలో 1,236.4 మిల్లీమీటర్లు, రాష్ట్రంలో 1,148.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాలి. ♦ ఈ ఏడాది దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం కంటే తక్కువ వర్షం కురిసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 835.03 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 714.88 మిల్లీమీటర్లు కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 14.39 శాతం తక్కువగా నమోదైంది. ♦ వర్షపాతం, జలసంరక్షణ కట్టడాలు, చర్యల వల్ల దేశంలో 2023లో భూగర్భజలాలు 15,861.50 టీఎంసీలు పెరిగాయి. ఇందులో జాతీయ ప్రమాణాల మేరకు 14,382.65 టీఎంసీలు (90.67 శాతం) వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో 8,524.12 టీఎంసీలను (59.26%) ఇప్పటికే వినియోగించుకున్నారు. ♦ రాష్ట్రంలో వర్షపాతం, జలసంరక్షణ చర్యల వల్ల భూగర్భజలాలు ఈ ఏడాది 983.30 టీఎంసీలు పెరిగాయి. ఇందులో 934.21 టీఎంసీలు వాడుకోవచ్చు. అందులో ఇప్పటివరకు 264.18 టీఎంసీలు (28.3 శాతం) మాత్రమే వినియోగించుకున్నారు. ఇటు భూగర్భజలాలు సంరక్షిస్తూ, అటు పొదుపుగా వినియోగించుకుంటూ భూగర్భజలాల పరిరక్షణలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. గతేడాది సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షం కురిసినా భూగర్భజలాలు 982.95 టీఎంసీలే పెరగడం గమనార్హం. ♦ భూగర్భజలాల పరిరక్షణలో గతేడాది మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది కూడా అగ్రగామిగా నిలిచింది. ♦ దేశంలో 2–5 మీటర్ల లోతులోనే పుష్కలంగా భూగర్భజలాలు లభ్యమయ్యే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, అసోం, ఉత్తరప్రదేశ్ (ఉత్తర ప్రాంతం), బిహార్ (ఉత్తర ప్రాంతం) నిలిచాయి. భూగర్భజలమట్టం దారుణంగా 20–40 మీటర్లకు పడిపోయిన రాష్ట్రాల్లో ఢిల్లీ, హరియాణ, పంజాబ్, రాజస్థాన్ ఉన్నాయి. జలసంరక్షణ చర్యల వల్లే రాష్ట్రంలో కురిసిన వర్షపాతం కంటే.. ప్రాజెక్టులు, చెక్‌డ్యామ్‌లు, అడవుల్లో కందకాలు తవ్వడం వంటి జలసంరక్షణ చర్యల వల్లే భూగర్భజలాలు అధికంగా పెరుగుతున్నాయి. వర్షాకాలంలో వర్షం వల్ల 316.82 టీఎంసీలు భూగర్భజలాలుగా మారుతుండగా.. జలసంరక్షణ చర్యల వల్ల 351.08 టీఎంసీలు భూగర్భజలాలుగా రూపాంతరం చెందుతున్నాయి. ఇక చలి, వేసవి కాలాల్లో కురిసే వర్షాల వల్ల 30.02 టీఎంసీలు భూగర్భజలాలుగా మారుతుంటే.. జలసంరక్షణ చర్యల వల్ల 285.38 టీఎంసీలు భూగర్భజలాలుగా రూపాంతరం చెందుతున్నాయి. వ్యవసాయానికే సింహభాగం వినియోగం రాష్ట్రంలో భూగర్భజలాలను సింహభాగం వ్యవసాయానికే వినియోగిస్తున్నారు. పంటల సాగుకు 227.46 టీఎంసీలను బోరుబావుల ద్వారా రైతులు వాడుకుంటున్నారు. పారిశ్రామిక అవసరాల కోసం 4.94 టీఎంసీలను బోరుబావుల ద్వారా వినియోగించుకుంటున్నారు. గృహ అవసరాల కోసం ప్రజలు 31.78 టీఎంసీలను వాడుకుంటున్నారు. -
భూగర్భ జలాల సంరక్షణలో ఏపీ ఆదర్శం
సాక్షి, విశాఖపట్నం: భూగర్భ జలాల సంరక్షణలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ రోల్ మోడల్‌గా నిలిచిందని కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కాడా) స్పెషల్ కమిషనర్ పీఎస్ రాఘవయ్య వెల్లడించారు. రాష్ట్రంలో సమీకృత సాగునీరు, వ్యవసాయ అభివృద్ధి పరివర్తన పథకం సత్ఫలితాలిస్తోందని చెప్పారు. విశాఖలో జరుగుతున్న ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజి (ఐసీఐడీ) రెండోరోజు సదస్సు లో రాఘవయ్య వ్యవసాయ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. రాష్ట్రంలో సుమారు 40 వేల చిన్న తరహా సాగునీటి చెరువులున్నాయన్నారు. వీటిలో వెయ్యి చెరువుల ఆధునికీకరణ చేపడుతున్నామని.. ఇందులో భాగంగా చెరువుల లోతు, వాటి గట్లను పటిష్టం చేయడంతోపాటు వీటి కింద పంట కాలువలను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచ బ్యాంకు రూ.1,600 కోట్ల నిధులను ఇందుకు సమకూర్చిందని రాఘవయ్య చెప్పారు. ప్రస్తుతం 568 చెరువుల ఆధునికీకరణ జరుగుతోందని, 102 చెరువుల పనులు పూర్తయ్యాయని, ఇప్పటివరకు రూ.219 కోట్లు ఖర్చుచేశామని ఆయన వివరించారు. 2025 నాటికి వెయ్యి చెరువుల అభివృద్ధి.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలవల్ల చెరువులను వాస్తవ స్థితికి తీసుకురావడం,పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందించడం, ఎక్కువ పంటలు పండించడం, అధిక దిగుబడులు సాధించడం, వైవిధ్య పంటల సాగువైపు రైతులను మళ్లించడం, మేలైన వ్యవసాయ పద్ధతులను పాటించడం వంటి మంచి ఫలితాలు సాధిస్తున్నామని రాఘవయ్య వివరించారు. ఒడిశా, మహారాష్ట్రల్లో అమలవుతున్నా అక్కడ మందకొడిగా సాగుతోందన్నారు. ఇక ఈ పథకం కింద రాష్ట్రంలో ఎంపిక చేసిన వెయ్యి చెరువుల ఆధునికీకరణ పనులను 2025 అక్టోబరు నాటికి పూర్తిచేస్తామని చెప్పారు. -
నీటి పొదుపుతోనే భవితకు భరోసా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పెరుగుతున్న నీటి అవసరాల నేపథ్యంలో భూగర్భ జల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. నీటిని పొదుపుగా వాడుకుంటేనే భవిష్యత్ తరాలకు అందించగలమన్నారు. మురుగు నీటిని శుద్ధి చేయడం ద్వారా తిరిగి సాగునీటికి, పరిశ్రమలకు అందించేలా రీ సైక్లింగ్ ప్రక్రియ చేపడుతున్నామన్నారు. చెరువులు, కుంటలను సంరక్షిస్తూ నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో డ్యామ్‌ల పరిరక్షణకు ప్రధాని మోదీ సూచనల మేరకు ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. గురువారం విశాఖపట్నంలో 25వ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ కాంగ్రెస్ (ఐసీఐడీ) సదస్సును సీఎం జగన్‌తో కలసి ఆయన ప్రారంభించారు. అతి సుందరమైన విశాఖ నగరం దీనికి వేదిక కావడం ఎంతో సంతోషకరమన్నారు. ఐసీఐడీ కాంగ్రెస్‌కు ఆతిథ్యమిచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి షెకావత్ ఏమన్నారంటే.. 140 బిలియన్ డాలర్ల వ్యయం వ్యవసాయ రంగంలో నీటి కొరతను అధిగమించేందుకు బహుళ విధానాలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి సాగునీటి రంగంలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. అయితే సరైన ప్రణాళిక లేకుంటే వ్యవసాయ ఉత్పాదకత దెబ్బతినడంతో పాటు కరువు పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో సాగునీటికి అనుబంధంగా ఉన్న అన్ని విభాగాలను 2019లో ప్రధాని మోదీ జలశక్తి శాఖ ఆదీనంలోకి తెచ్చారు. 2024 నాటికి సాగునీరు, పారిశుధ్య రంగాలపై 140 బిలియన్ డాలర్లను వెచ్చించాలని నిర్ణయించాం. దేశంలో సాగు విస్తీర్ణం గత 75 ఏళ్లలో మూడింతలు పెరిగి 140 మిలియన్ హెక్టార్లకు చేరింది. దిగుమతి చేసుకునే దశ నుంచి ఈ రోజు తిండిగింజల్లో మిగులు దేశంగా మారడంలో సాగునీటి రంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. 54 ప్రాజెక్టులు.. నీటి వనరులను అవసరాల మేరకు వినియోగించుకునేందుకు నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. దేశంలో 1971లో 111 బిలియన్ క్యూబిక్ మీటర్ల సామర్థ్యం ఉండగా నేడు 250 బిలియన్ క్యూబిక్ మీటర్లకు చేరింది. 2023 మార్చిలో ప్రధాని మోదీ 54 ప్రాజెక్టులను ప్రారంభించి అదనంగా 25 లక్షల హెక్టార్లకు సాగునీటిని అందించడం ద్వారా రెండు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చారు. గత రెండు దశాబ్దాల్లో పట్టణీకరణ, జనాభా పెరుగుదల నేపథ్యంలో దేశంలో తలసరి నీటి లభ్యత 20 శాతం తగ్గింది. 2050 నాటికి మరో 20 శాతం తగ్గనుందని అంచనాలున్నాయి. నీటి వినియోగాన్ని ప్రణాళికాబద్ధంగా చేపట్టేందుకు 2022లో బ్యూరో ఆఫ్ వాటర్ ఎఫిషియన్సీని నియమించాం. 48,500 కి.మీ. మేర మంచినీటి పైపులైన్ ఏర్పాటు చేశాం. తద్వారా 28,000 హెక్టార్ల భూ సేకరణను తగ్గించాం. నీటి శుద్ధిపై దృష్టి నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవడంలో భాగంగా మురుగు నీటిని శుద్ధి చేసి తిరిగి వాడుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ నీటిని సాగునీటికి, పరిశ్రమలకు ఉపయోగించుకోవడంపై దృష్టి సారించాం. ఇందుకోసం దేశవ్యాప్తంగా వాటర్ రీ–సైక్లింగ్‌ను ప్రోత్సహిస్తున్నాం. అమెరికా, చైనా కలిపి వినియోగిస్తున్న భూగర్భ నీటి వనరుల కంటే మనం ఎక్కువగా వినియోగిస్తున్నాం. ప్రపంచంలోనే భూగర్భ జలాలను అధికంగా వినియోగిస్తున్న దేశాల్లో మనం ముందు వరుసలో ఉన్నాం. భూగర్భ జలాలను పెంచేందుకు వీలుగా మొత్తం 2.4 మిలియన్ చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని గుర్తించాం. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలను పెంచేందుకు మ్యాపింగ్ పూర్తి చేశాం. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు 2019లో జలశక్తి అభియాన్ పథకాన్ని ప్రధాని ప్రారంభించారు. పూడిక తొలగించి వర్షపు నీటిని ఒడిసిపట్టుకునేందుకు 10 వేల మిలియన్ పనులను పూర్తి చేశాం. నదుల అనుసంధానం.. జూన్ నుంచి సెప్టెంబరు వరకు వర్షాలు కురిసే సమయంలో సాధ్యమైనంత నీటిని ఒడిసి పట్టుకునేందుకు నదుల అనుసంధానాన్ని ప్రారంభించాం. నీటి లభ్యత ఎక్కువ ఉన్న ప్రాంతాల నుంచి తక్కువ ఉన్న చోట్లకు తరలించే ప్రయత్నం చేస్తున్నాం. సాగునీటి రంగం రాష్ట్ర పరిధిలోది కావడం వల్ల వాటి సహకారం ఎంతో అవసరం. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయు) చేసుకున్నాయి. కెన్, బెత్వా నదుల అనుసంధానంతో మిలియన్ హెక్టార్లకు సాగునీటితోపాటు వెనుకబడిన బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని 6.2 మిలియన్ జనాభాకు తాగునీరు లభించనుంది. డ్యామ్‌ల రక్షణకు ప్రత్యేక చర్యలు దేశంలో జలాశయాల నిర్మాణం ఎప్పటి నుంచో ఉంది. కావేరి నదిపై చోళుల కాలంలో 2 వేల ఏళ్ల క్రితం నిరి్మంచిన కళ్లాని డ్యామ్ ఇప్పటికీ ఉంది. దేశంలో మొత్తం 6,000 భారీ డ్యామ్‌లున్నాయి. 2020లో డ్యాం సేఫ్టీ చట్టాన్ని తీసుకొచ్చాం. ప్రపంచబ్యాంకు సహకారంతో 1.2 బిలియన్ డాలర్లతో దేశవ్యాప్తంగా 736 డ్యాంల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. మొదటి దశలో ఏడు రాష్ట్రాల్లో 223 డ్యామ్‌ల హైడ్రలాజికల్, స్ట్రక్చరల్, ఆపరేషనల్ రక్షణ చర్యలను పరిశీలించాం. డ్యామ్‌ల రక్షణతో పాటు నీటి వనరుల వినియోగంపై ఐసీఐడీ చర్చించి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే సూచనలు చేస్తుందని భావిస్తున్నా. నదీ జలాలతో ‘జల్ భరో’ విశాఖ ఐసీఐడీ సదస్సు సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ నదుల నుంచి సేకరించిన జలాలను మట్టి కుండల్లో నింపి ‘జల్ భరో’ పేరుతో ఒకే చోట చేర్చారు. కేంద్ర మంత్రి షెకావత్, ముఖ్యమంత్రి జగన్, మంత్రులు అంబటి రాంబాబు, అమర్నాథ్, విడదల రజని మట్టి కుండల్లో ఉన్న నీటిని తరలించి ఒక చోట చేర్చారు. 25 ఐసీఐడీ అంతర్జాతీయ కాంగ్రెస్ యాబ్‌స్ట్రాక్ట్ వాల్యూమ్‌తో పాటు హిస్టారికల్ వాటర్ సస్టైనబులిటీ, వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ వాల్యూమ్‌ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. సదస్సులో తొలి రోజు సంప్రదాయేతర నీటి వనరులు, రైతు సాధికారత, సుస్థిర లక్ష్యాలు, వ్యవసాయ రంగంలో నీటి వనరుల వినియోగం తదితర అంశాలపై వివిధ దేశాలకు చెందిన ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. 56 దేశాలు... 147 పరిశోధన పత్రాలు 1950లో ఏర్పడిన ఐసీఐడీ పరిశోధనలను మనం వినియోగించుకుంటున్నాం. 74 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఎంతో సహకరిస్తోంది. 2025 నాటికి పెరగనున్న 9.8 బిలియన్ జనాభాకు అనుగుణంగా నీటి వనరులను వాడుకోవడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంపై సదస్సులో చర్చించాలి. నీటి వినియోగంపై 56 దేశాలకు చెందిన ప్రతినిధులు 147 పరిశోధన పత్రాలను సమర్పిస్తారు. సమస్యను పరిష్కరించేందుకు ఇవి ఎంతో దోహదం చేస్తాయని విశ్వసిస్తున్నాం. ఈ సదస్సుకు సుందర నగరం విశాఖ కేంద్రం కావడం ఎంతో సంతోషంగా ఉంది. –ప్రొఫెసర్ డాక్టర్ రగబ్, ఐసీఐడీ ప్రెసిడెంట్ పర్యావరణ సమతుల్యతపై దృష్టి నీటి వనరులను పొదుపుగా వాడుకునేందుకు ఈ సమావేశాలు ఎంతో ఉపయోగపడతాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తిండి గింజల ఉత్పత్తిని పెంచడంతో పాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి. –కుశ్వందర్ వోహ్రా, ఐసీఐడీ వైస్ ప్రెసిడెంట్ -
తమ్ముళ్లు మన్ను తిన్నారు!
గర్నెపూడి(సత్తెనపల్లి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమంపై ఆదిలోనే నీలి నీడలు కమ్ముకున్నాయి. భూగర్భ జలాల పరిరక్షణకు చెరువులను అభివృద్ధి చేసుకుని పూడిక మట్టితో కరకట్టల బలోపేతం, పంట పొలాలు, సామాజిక అవసరాలకు వినియోగించు కోవాలని ఇప్పటికే శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు సూచనలు చేశారు. ఆ సూచనలను తెలుగు తమ్ముళ్లు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ప్రతి నీటి బొట్టును వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం నీరు-చెట్టు కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా పూడిక తీత చేసి గట్లు, చెరువులను అభివృద్ధి చేయాలన్నది ఈ కార్యక్రమం ముఖ్యఉద్దేశం. అయితే పనులు చేపట్టిన తమ్ముళ్లు మట్టిని సైతం అమ్ముకుంటున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా మా కెందుకులే అని మిన్నకుంటున్నారు తప్ప పట్టించుకోవడం లేదు. సత్తెనపల్లి మండలం గర్నెపూడి గ్రామంలో ఐదు ఎకరాల చెరువును నీరు-చెట్టు కార్యక్రమం కింద అభివృద్ధి చేసేందుకు ఇటీవల పనులు ప్రారంభించారు. ఇక్కడ పనులు ప్రారంభం కావడంతో తమ్ముళ్లకు ఎక్కడా లేని ఆశలు పుట్టుకొచ్చాయి. ట్రక్కు మట్టిని రూ. 300లు చొప్పున 250 ట్రక్కులను ఇప్పటికే విక్రయించారు. ఆ ఆదాయాన్ని గ్రామ పంచాయతీకి జమ చేయకుండా సర్పంచ్, కార్యదర్శికి తెలియకుండానే అన్ని పనులు జరిపించేస్తున్నారు. పంచాయతీకి సీనరేజీ కూడా జమ చేయడం లేదు. దీనిపై సర్పంచ్ బోగాల బాపిరెడ్డి ఇదేమిటని మాట్లాడితే తాము చేసేది చూస్తుండటం తప్ప మరేమీ మాట్లాడవద్దని, ఎక్కువ చేస్తే చెక్ పవర్ కూడా ఉండదంటూ హెచ్చరికలు చేశారు. జరుగుతున్న అన్యాయంపై ఎంపీటీసీ ఓబయ్య, ఉప సర్పంచ్ బిళ్లా సుజాతలు గ్రామ కార్యదర్శికి ఫిర్యాదు చేయగా తాను సెలవులో ఉన్నానని తప్పుకున్నారు. ఎంపీడీవో పి.శ్రీనివాస్ పద్మాకర్‌కు ఫిర్యాదు చేయగా పనులకు ఆటంకం కల్గించవద్దని, ప్రస్తుతం తాను సెలవులో ఉన్నానని సమాధానం ఇచ్చారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్ర వారం చెరువు స్థలంలో మట్టి తీయకుండా పొక్లయిన్‌ను అడ్డుకున్నారు. తమ పనులకు అడ్డు రావద్దంటూ టీడీపీ నాయకులు వాగ్వివాదానికి దిగారు. కొద్ది సేపు ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. ఎమ్మెల్యే వద్ద తేల్చుకుంటామంటూ తమ్ముళ్లు సత్తెనపల్లి చేరుకున్నారు. దీనిపై సర్పంచ్ బాపిరెడ్డి, ఎంపీటీసీ ఓబయ్య మాట్లాడుతూ నీరు-చెట్టు కార్యక్రమం కింద చెరువుల అభివృద్ధి సర్పంచ్ చేపడతారని తొలుత చెప్పారని, కేవలం తాము వైఎస్సార్సీపీ అనే ఉద్దేశంతో తెలుగు తమ్ముళ్లకు అవకాశం ఇచ్చారన్నారు. అయినప్పటికీ మట్టి అక్రమంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసు కోవడంతోపాటు ప్రజాప్రయోజనాలకు చెరువు మట్టి ఉపయోగపడేలా చూడాలని, పంచాయతీకి ఆదాయం వచ్చేలా చూడాలన్నారు. చివరకు మట్టి అక్రమ విక్రయాలను వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకోవడంతో పనులు నిలిచిపోయాయి.