Financial systems
-
చేలకు డబ్బులు కాయాలి!
ప్రపంచంలోని 54 ప్రధాన ఆర్థిక వ్యవస్థలు వ్యవసాయ ఉత్పత్తిదారుకు సబ్సిడీ మద్దతును రూపొందించినట్లు ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) తాజా ప్రపంచ విశ్లేషణ చూపిస్తోంది. భారతదేశం విషయానికి వస్తే మాత్రం, రైతులు తమ నష్టాలను పూడ్చుకోవడానికి తగిన బడ్జెట్ మద్దతు లేకుండా ఉన్నారు. 2000 సంవత్సరం నుండి భారతీయ రైతులు ఏటా నష్టాలను చవిచూస్తూనే ఉన్నారని ఈ నివేదిక పేర్కొంది. కాబట్టి, మన వ్యవసాయ రంగ విధానాలపై పునరాలోచన అవసరం. సమాజంలోని ఇతర వర్గాలతో ఆదాయ సమానత్వాన్ని తీసుకురావాలంటే వ్యవసాయ రంగంలో జీవనోపాధి సమస్యను పరిష్కరించి, రైతులు ఆదాయాన్ని పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది.భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానికి ఉన్న ముఖ్యమైన పాత్రను నొక్కి చెప్పడం ద్వారానే గత 25 సంవత్సరాలుగా, దాదాపు ప్రతి ఆర్థిక మంత్రీ తన బడ్జెట్ సమర్పణను ప్రారంభిస్తూ వస్తున్నారు. ‘కిసాన్ కీ ఆజాదీ’నుండి దేశ ఆర్థిక వ్యవస్థ జీవనాధారం వరకు, బడ్జెట్ ప్రతిపాదనలదృష్టిని ఎత్తిపట్టడానికి అనేక విశేషణాలను ఉపయోగిస్తూ వచ్చారు. వ్యవసాయ ఆదాయాన్ని పెంచడం గురించి అరుణ్ జైట్లీ మాట్లాడారు. ప్రభుత్వ ఐదు ప్రాధాన్యాలలో దాన్ని అగ్రస్థానంలో ఉంచారు. నిర్మలా సీతారామన్ కూడా వ్యవసాయానికి తగిన గుర్తింపును కల్పించారు. ఆమె పేర్కొన్న తొమ్మిది ప్రాధాన్యాలలో వ్యవసాయ ఆదాయ పెంపు దల అగ్రస్థానంలో ఉంది. దాదాపు ప్రతి బడ్జెట్లోనూ ఇలా వ్యవసాయానికి ఊతమివ్వడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఇప్పటికే మార్పు వచ్చి ఉండాలి. అయితే దీనిపై నిశితంగా దృష్టి సారించినప్పటికీ ఒక్కసారి కూడా వ్యవసాయం పునరుద్ధరణ మార్గం పట్టినట్లు కనిపించలేదు. ఎందుకంటే అధిక ధరలు లభిస్తాయనీ, రైతుల ఆదాయం పెరుగుతుందనే ఆశాభావంతో పంటల ఉత్పాదకత పెంపుదల గురించి అంతర్లీనంగా ఉద్ఘాటిస్తున్నప్పటికీ దేశంలో వ్యవసాయ కష్టాలు మరింత పెరిగాయి. విజయవంతమైన హరిత విప్లవం తర్వాత కూడా వ్యవసాయ కుటుంబానికి నెలవారీ సగటు ఆదాయం దాదాపు రూ. 10,218 గానే ఉంటు న్నప్పుడు, బడ్జెట్లో ఇంత మద్దతు ఉన్నప్పటికీ వ్యవసాయంలో తీవ్రమైన సంక్షోభాన్ని కొట్టిపారేయలేము.వాస్తవాలు ఎలా ఉన్నాయో చూద్దాం. కర్ణాటకలో, అధికారిక అంచనా ప్రకారం గత 15 నెలల్లో 1,182 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మహారాష్ట్రలో ఈ సంవత్సరం జనవరి–జూన్ మధ్య 1,267 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారు, విదర్భలోని ఒక్క అమరావతి డివిజ¯Œ లోనే 557 కేసులు నమోదయ్యాయి. రైతుల ఆత్మహత్యలు కొత్త విషయం కాదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా సంకలనం గత 27 ఏళ్లలో రైతుల ఆత్మహత్యల సంఖ్యను చూపిస్తోంది. ఈ కాలం వ్యవసాయానికి సంబంధించి 25 సంవత్సరాల బడ్జెట్ హామీలకు సమానంగా ఉంది. 1995–2014 మధ్య కాలంలో 2,96,438 మంది సాగుదారులు తీవ్రాతితీవ్రమైన ఆత్మహత్యా సదృశ చర్యలకు పాల్పడ్డారు. 2014 నుండి 2022 వరకు 1,00,474 మంది రైతుల ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. సరళంగా చెప్పాలంటే, వ్యవసాయాన్ని మలుపు తిప్పుతామని వార్షిక బడ్జెట్లు వాగ్దానం చేస్తూ ఉన్న సమయంలోనే 1995–2022 మధ్య దాదాపు నాలుగు లక్షల మంది రైతులు తమ జీవితాలను ముగించారు. అంటే బడ్జెట్ కేటాయింపులకు, కొనసాగుతున్న వ్యవసాయ సంక్షోభానికి మధ్య అసమతుల్యత అత్యంత స్పష్టంగా ఉంది.తెలంగాణ ఇప్పుడు వ్యవసాయ రుణమాఫీ రెండో దశను పూర్తి చేసుకుంది. ఇది 6.4 లక్షల మంది రైతులకు రూ. 6,198 కోట్ల బకాయి రుణాలను మాఫీ చేసింది. అప్పుల్లో ఉన్న సాగుదారుల్లో ప్రతి ఒక్కరికి రూ. 1.5 లక్షల మాఫీ లభిస్తుంది. మొదటి దశలో 11.34 లక్షల మంది రైతులకు రూ. 6,190 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ నెల 15న ప్రారంభం కానున్న మూడో దశలో 17.75 లక్షల మంది రైతులకు రూ. 12,224 కోట్ల రుణమాఫీ అందనుంది. రాష్ట్రంలో మొత్తం 35.5 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తున్నా రన్నమాట. అయితే దీనర్థం పెరుగుతున్న వ్యవసాయ రుణాలు ఇతర రాష్ట్రాల్లో సమస్యాత్మకం కావని కాదు.ప్రపంచంలోని 54 ప్రధాన ఆర్థిక వ్యవస్థలు వ్యవసాయ ఉత్పత్తి దారుకు సబ్సిడీ మద్దతును రూపొందించినట్లు ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) తాజాప్రపంచ విశ్లేషణ చూపిస్తోంది. భారతదేశం విషయానికి వస్తే, రైతులు తమ నష్టాలను పూడ్చుకోవడానికి తగిన బడ్జెట్ మద్దతు లేకుండా ఉన్నారు. 2000 సంవత్సరం నుండి భారతీయ రైతులు ఏటా నష్టా లను చవిచూస్తూనే ఉన్నారని ఈ నివేదిక పేర్కొంది. సుదీర్ఘంగా కొనసాగుతున్న ఇన్ని నష్టాల నుండి మరే ఇతర రంగం అయినా బయటపడుతుందా?మనం ఈ విశ్లేషణా పద్ధతిని తప్పుబట్టినప్పటికీ, ఉత్పాదకతకు, ఉత్పత్తిని పెంచడం కోసం సాంకేతికతకు మద్దతు ఇవ్వడం లేదా ఇతర పథకాలకు డబ్బును నింపడం వల్ల రైతుల ఆదాయం పెరగదు అనేది వాస్తవం. ఇది ఎక్కడా జరగలేదు. ఓఈసీడీ అధ్యయనమే ఇందుకు నిదర్శనం.దీనినే నేను ’వయా బటిండా’ విధానం అని పిలుస్తాను. ఇన్ పుట్ సప్లయర్లు లేదా టెక్నాలజీ ప్రదాతల ద్వారా వ్యవసాయ ఆదా యాన్ని పెంచడానికి బదులుగా, ప్రత్యక్ష ప్రయత్నం ఎందుకు చేయ లేరు? ఇలాంటి పరోక్ష ప్రయత్నం గతంలో పని చేయలేదు. భవి ష్యత్తులో కూడా పని చేయదు. రైతులు అట్టడుగు స్థానంలో ఉన్న సమయంలోనే ఇన్పుట్ సప్లయర్లు లాభాల్లో ఎలా దూసుకు పోతు న్నారో అనేక అధ్యయనాలు చూపించాయి. సప్లయ్ చెయిన్ల విషయంలో కూడా అంతిమ లాభాలలో పెంపకందారుల వాటా దాదాపు 5–10 శాతం లేదా అంతకంటే తక్కువగానే ఉంటోంది. 2021లో స్ట్రాబెర్రీలను, రాస్బెర్రీలను మార్కెటింగ్ చేయడం ద్వారా రిటైల్ లాభాలు 27 పెన్నీల వరకు పెరిగాయని, కానీ రైతుల వాటా 3.5 పెన్నీలు మాత్రమే అని బ్రిటన్‌లో ఒక అధ్యయనం తెలిపింది. వినియో గదారులు ఆధారపడిన ఆరు రోజువారీ అవసరాలకు గానూ, రిటైల్ లాభంలో కేవలం 1 శాతం మాత్రమే రైతులకు లభిస్తుందని ఇంతకు ముందు అధ్యయనాలు చూపించాయి. అందువల్ల, తాజా బడ్జెట్లో పేర్కొన్నట్లుగా, ప్రాథమిక ఉత్పత్తిదారు అయిన రైతు వాటాకు హామీ ఇచ్చినప్పుడు మాత్రమే సరఫరా గొలుసులను బలోపేతం చేయడం అనేది దోహదకారిగా ఉంటుంది.దేశంలోని దాదాపు సగం జనాభా వ్యవసాయ రంగంలో నిమ గ్నమై ఉంటున్నప్పుడు, వ్యవసాయానికి మొత్తం బడ్జెట్లో కేవలం 3.15 శాతం మాత్రమే కేటాయిస్తే, అసాధారణంగా ఏమీ ఆశించలేం. ఈ సంవత్సరం వ్యవసాయ బడ్జెట్ రూ. 1.52 లక్షల కోట్లు, అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు దాదాపు రూ. 26,000 కోట్లు పెరిగి, ముందుగా సూచించినట్లుగా ప్రణాళికేతర వ్యయాన్ని కవర్ చేస్తుంది. వ్యవసాయం కోసం బడ్జెట్లో ప్రధానమంత్రి కిసాన్ పథకా నికి రూ. 60,000 కోట్లు కేటాయించారు, ఇది భూమిని కలిగి ఉన్న ప్రతి రైతుకు నెలవారీ రూ. 500లను అందిస్తుంది, ఇక మిగిలింది వ్యవసాయానికి రూ. 92,000 కోట్లు. గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం కేవలం రూ. 3,268గా ఉందని 2022–23 గృహæ వినియోగ వ్యయం మనకు చెప్పడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. వ్యవసాయం లాభసాటిగా లేకపోతే, గ్రామీణ వ్యయం ఇప్పటికీ తక్కువగానే ఉంటుంది.కాబట్టి, వ్యవసాయంపై పునరాలోచన అవసరం. సమాజంలోని ఇతర వర్గాలతో ఆదాయ సమానత్వాన్ని తీసుకురావడానికి మొదట జీవనోపాధి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతుల ఆదాయం, సంక్షేమం కోసం జాతీయ కమిష¯Œ ను ఏర్పాటు చేయాలనేది నా సూచన. ఈ కమిషన్ నిర్దిష్ట కాల వ్యవధిలో వ్యవ సాయ ఆదాయాన్ని పెంచడానికి నిర్దిష్ట మార్గాలతో ముందుకు రావాలి. కనీస మద్దతు ధర కోసం చట్టపరమైన విధానాన్ని నిర్ధారించడం ద్వారా దీన్ని ప్రారంభించాలి.వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులుఈ–మెయిల్: hunger55@gmail.com -
ఓపీఎస్‌తో అధోగతే..
సాక్షి, అమరావతి: దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న జాతీయ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్) నుంచి ప్రభుత్వోద్యోగులు పాత పెన్షన్ స్కీముకు (ఓపీఎస్) మారితే రాష్ట్రాలు అథోగతి పాలవుతాయని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధ్యయన నివేదిక ఆందోళన వ్యక్తంచేసింది. ఇదే జరిగితే భవిష్యత్తు తరాల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని.. వారి ప్రయోజనాల విషయంలో రాజీపడటమేనని ఆర్బీఐ నివేదిక హెచ్చరించింది. ఇటీవల కొన్ని రాష్ట్రాలు ఎన్పీఎస్ నుంచి ఓపీఎస్‌కు మారుతామని చెబుతున్న నేపథ్యంలో.. వివిధ రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితులు, ప్రస్తుత ఉద్యోగుల పెన్షన్ భారం, ఓపీఎస్‌కు మారితే భవిష్యత్‌లో పెరిగే పెన్షన్ల వ్యయం, తద్వారా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను బేరీజు వేస్తూ ఆర్బీఐ తన అధ్యయన నివేదికను విడుదల చేసింది. ఓపీఎస్‌కు వెళ్లడమంటే ఆర్థిక సంస్కరణల్లో వెనుకడుగు వేయడమేనని తేల్చిచెప్పింది. అలాగే, ఓపీఎస్‌కు మారడంవల్ల రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై పెనుభారం పడుతుందని పేర్కొంది. అదే జరిగితే రాష్ట్రాల మొత్తం పెన్షన్ భారం 2023 మార్చి చివరి నుంచి 2084 మార్చి చివరి వరకు సగటున 4.5 రెట్లు పెరుగుతుందని ఆర్బీఐ నివేదిక స్పష్టంచేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇది 4.3 రెట్లు ఉంటుందని తెలిపింది. దీర్ఘకాలిక వృద్ధిపై తీవ్ర ప్రభావం.. మరోవైపు.. 2022 నవంబర్ నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి ఎన్పీఎస్ ఉద్యోగుల సంఖ్య 50 లక్షలు ఉందని, వీరి ఎన్పీఎస్ కంట్రిబ్యూషన్ కార్పస్ ఫండ్ రూ.2.5 లక్షల కోట్లు ఉందని ఆ నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో వీరి సంఖ్య రెండున్నర లక్షలు ఉందని.. ఇప్పటికే ఏపీ సొంత రెవెన్యూ రాబడిలో పెన్షన్లకు 24 శాతం వ్యయమవుతోందని, ఓపీఎస్‌కు మారితే పెన్షన్ల వ్యయం భారీగా పెరుగుతుందని నివేదిక వెల్లడించింది. ఇది మూలధన వ్యయాన్ని తగ్గిస్తూ దీర్ఘకాలిక వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని.. భవిష్యత్తు తరాల ప్రయోజనాలకు తీరని నష్టం కలిగిస్తుందని కూడా ఆర్బీఐ హెచ్చరించింది. ప్రస్తుతం ఎన్పీఎస్ విధానంలో ఉద్యోగులు రిటైరయ్యాక చివరిగా తీసుకున్న జీతంలో 50 శాతం పెన్షన్ పొందుతారని, డియర్నెస్ రిలీఫ్ రివిజన్ల ప్రయోజనాన్ని కూడా పొందుతారని తెలిపింది. అయితే, ఉద్యోగులకు ఓపీఎస్ విధానం ఆకర్షణీయంగా ఉండవచ్చుగానీ ప్రభుత్వాల మీద అపారమైన ఆర్థిక భారాన్ని కలిగిస్తుందని, తద్వారా భవిష్యత్ సంవత్సరాల్లో ప్రభుత్వ పెన్షన్ బాధ్యతలను మరింత పెంచుతుందని నివేదిక స్పష్టంచేసింది. ఓపీఎస్‌కు మారితే మొత్తం రాష్ట్రాల పెన్షన్ భారం 2040 నుంచి 2060 వరకు భారీగా పెరుగుతుందని, ఇది దేశ జీడీపీలో 0.9 శాతానికి చేరుకుంటుందని ఆర్బీఐ నివేదిక పేర్కొంది. భవిష్యత్తులో పెన్షన్లు చెల్లించడమే కష్టం.. ఇక ఎన్పీఎస్ నుంచి ఓపీఎస్‌కు మారితే మొత్తం రాష్ట్రాల పెన్షన్ల వ్యయం 2023 నుంచి పెరగడం ప్రారంభమై 2045 నాటికి లక్ష కోట్లకు చేరుతుందని, 2057 సంవత్సరం నాటికి రూ.1.80 లక్షల కోట్లకు పెరుగుతుందని.. ఇది రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలకు పెనుభారం కానుందని ఆ నివేదిక తెలిపింది. భవిష్యత్‌లో పెన్షన్లను చెల్లించడమే చాలా కష్టతరం కావచ్చునని వ్యాఖ్యానించింది. అంతేకాక.. ఓపీఎస్‌కు వెళ్తే భవిష్యత్ తరాల ప్రయోజనాల విషయంలో రాజీపడటమే అవుతుందని, ఇది రాష్ట్రాలకు మంచిది కాదని ఆర్బీఐ అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం 2019 ఏప్రిల్ 1 నుంచి ఎన్పీఎస్ ఉద్యోగుల పెన్షన్ కంట్రిబ్యూషన్‌ను 14 శాతానికి పెంచిందని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 14 శాతానికి పెంచాల్సి ఉందని తెలిపింది. -
భారత్ బ్యాంకింగ్ పటిష్టం
ముంబై: ప్రపంచ ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ వ్యవస్థలు స్థిరంగా ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. అయితే అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో బ్యాలెన్స్ షీట్స్‌లో ఎట్టి పరిస్థితుల్లో అసమతౌల్యత రాకుండా చూసుకోవాలని సూచించారు. ఇక దేశంలో తీవ్ర ద్రవ్యోల్బణం సమస్య కూడా తగ్గిందని ఆయన వ్యాఖ్యానించారు. డాలర్ పెరిగిన పరిస్థితుల్లో అంతర్జాతీయంగా తోటి కరెన్సీలతో పోల్చితే భారత్ రూపాయి ఒడిదుడుకులు స్వల్పంగానే ఉన్నాయన్నారు. కొచ్చిలో జరిగిన 17వ కేపీ హోర్మిస్ (ఫెడరల్ బ్యాంక్ వ్యవస్థాపకుడు) స్మారక ఉపన్యాసంలో దాస్ మాట్లాడారు. ప్రపంచ మాంద్యం గురించి కొన్ని నెలల క్రితం తీవ్ర ఆందోళనలు ఉన్నప్పటికీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత దృఢత్వం చూపిందని, క్లిష్టతలను తట్టుకొని నిలబడిందని పేర్కొన్నారు. కఠిన ద్రవ్య పరిస్థితులు తగ్గాయని అన్నారు. జీ20 భారత్ ప్రెసిడెన్సీలో మరింత సమగ్ర ప్రపంచ ఆర్థిక పురోగతి సాధనకు కృషి జరగాలన్నారు. ఆర్థిక సేవలు అందరికీ చేరువకావడం, పర్యావరణ పరిరక్షణ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పురోగతి ఇందుకు అవసరమని పేర్కొన్నారు. -
వృద్ధి పరుగు ఇక గ్యారంటీ
* మేక్ ఇన్ ఇండియాపై టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ * అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఉద్యోగులకు సూచన న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంతో రాబోయే సంవత్సరాల్లో ఇక వృద్ధి మళ్లీ పరుగులు పెట్టగలదని టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఆశాభావం వ్యక్తం చేశారు. భౌగోళిక..రాజకీయ పరిస్థితులు సంక్లిష్టంగానూ, అనూహ్యంగానూ మారిపోతున్న తరుణంలో అనేక అవకాశాలు తెరపైకి వస్తున్నాయన్నారు. అయితే, దానికి సమానంగా అనేక సవాళ్లు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల తీసుకుంటున్న విధానపరమైన చర్యలు, వ్యూహాత్మకంగా అనుసరిస్తున్న మార్గం..ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంతో వృద్ధి మళ్లీ పుంజుకోగలదని ఆయన తెలిపారు. బుధవారం గ్రూప్‌లోని 5.82 లక్షల మంది ఉద్యోగులకు పంపిన నూతన సంవత్సర సందేశంలో మిస్త్రీ ఈ విషయాలు పేర్కొన్నారు. గడచిన ఏడాదిపై సింహావలోకనం చేస్తూ.. అంతర్జాతీయంగా ప్రధాన మార్కెట్లలో రెండు భిన్నమైన వృద్ధి ధోరణులు కనిపిస్తున్నాయని మిస్త్రీ వివరించారు. అమెరికా, బ్రిటన్ వంటి కొన్ని దేశాలు మెల్లగా రికవరీ సంకేతాలు కనపరుస్తుండగా.. చైనా, యూరప్ వంటి భారీ ఆర్థిక వ్యవస్థలు అంచనాలను అందుకోలేకపోయాయని ఆయన తెలిపారు. టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలి .. ఎప్పటికప్పుడు కస్టమర్ల అవసరాలు మారిపోతుండటంతో.. గ్రూప్ సంస్థలన్నీ కొంగొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలని, తదనుగుణమైన సేవలు అందించాలని ఉద్యోగులకు మిస్త్రీ సూచించారు. ప్రస్తుతం డిజిటల్ రంగంలోనూ, భౌతికంగానూ కొత్త టెక్నాలజీలు.. అత్యంత వేగంగా వ్యాపార ముఖ చిత్రాన్ని మార్చివేస్తున్నాయని చెప్పారు. కాబట్టి డిజిటైజేషన్, బిగ్ డేటా అనలిటిక్స్ మొదలైన వాటిపై అవగాహన మరింత పెంచుకోవాలని.. నవకల్పనలపై దృష్టి సారించాలని మిస్త్రీ తెలిపారు. ఇందుకోసం గ్రూప్ కూడా పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై మరింత ఇన్వెస్ట్ చేయడం కొనసాగిస్తుందని వివరించారు. ప్రస్తుతం పోటీ కారణంగా మార్జిన్లపై ఒత్తిడి పెరిగిపోతున్నందున.. గ్రూప్ కంపెనీలు పరస్పరం అనుభవాలను పంచుకోవడంతో పాటు అంతర్జాతీయంగా పాటిస్తున్న ఉత్తమ విధానాల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. టార్గెట్ 2025 .. కస్టమర్ల జీవన విధానాలను మెరుగుపర్చేందుకు కట్టుబడి ఉన్న తమ నిబద్ధతతో వచ్చే పదేళ్లలో ప్రపంచ జనాభాలో 25 శాతం మందికి చేరువ కాగలమని 2025 నాటికి టాటా గ్రూప్ నిర్దేశించుకున్న లక్ష్యాలను మిస్త్రీ తెలిపారు. ఫలితంగా అంతర్జాతీయంగా 25 అత్యంత ప్రశంసనీయ కార్పొరేట్ బ్రాండ్స్‌లో ఒకటిగా టాటా గ్రూప్ ఎదగగలదని ధీమా వ్యక్తం చేశారు. అప్పటికి ప్రపంచంలోనే 25 అత్యంత విలువైన కంపెనీలతో పోల్చతగిన మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించగలమన్నారు. దీన్ని సాకారం చేసుకోవాలంటే టాటా గ్రూప్‌లోని ప్రతి కంపెనీ కూడా కస్టమర్ ప్రధానంగా ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించాల్సి ఉంటుందని తెలిపారు. 2014లో టాటా బ్రాండ్ అత్యంత విలువైన బ్రాండ్లలో 34వ స్థానాన్ని దక్కించుకుందని, అంతర్జాతీయంగా 60 గ్లోబల్ సంస్థలకు పోల్చతగిన మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉందని వివరించారు. మరోవైపు మహిళా ఉద్యోగుల సాధికారతకు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని..ఇందులో భాగంగానే టాటా లీడ్ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. దీంతో రాబోయే సంవత్సరాల్లో గ్రూప్‌లో నాయకత్వ స్థానాల్లో మహిళల సంఖ్య మరింత పెరగగలదని మిస్త్రీ చెప్పారు. గ్రూప్‌లోని 1,40,000 మహిళా ఉద్యోగులు సంస్థ ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతున్నారని కితాబిచ్చారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లోనూ కంపెనీ ఉద్యోగులు మరింత చురుగ్గా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.