ముంబై: ప్రపంచ ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ వ్యవస్థలు స్థిరంగా ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. అయితే అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో బ్యాలెన్స్ షీట్స్‌లో ఎట్టి పరిస్థితుల్లో అసమతౌల్యత రాకుండా చూసుకోవాలని సూచించారు. ఇక దేశంలో తీవ్ర ద్రవ్యోల్బణం సమస్య కూడా తగ్గిందని ఆయన వ్యాఖ్యానించారు. డాలర్ పెరిగిన పరిస్థితుల్లో అంతర్జాతీయంగా తోటి కరెన్సీలతో పోల్చితే భారత్ రూపాయి ఒడిదుడుకులు స్వల్పంగానే ఉన్నాయన్నారు.
కొచ్చిలో జరిగిన 17వ కేపీ హోర్మిస్ (ఫెడరల్ బ్యాంక్ వ్యవస్థాపకుడు) స్మారక ఉపన్యాసంలో దాస్ మాట్లాడారు. ప్రపంచ మాంద్యం గురించి కొన్ని నెలల క్రితం తీవ్ర ఆందోళనలు ఉన్నప్పటికీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత దృఢత్వం చూపిందని, క్లిష్టతలను తట్టుకొని నిలబడిందని పేర్కొన్నారు. కఠిన ద్రవ్య పరిస్థితులు తగ్గాయని అన్నారు. జీ20 భారత్ ప్రెసిడెన్సీలో మరింత సమగ్ర ప్రపంచ ఆర్థిక పురోగతి సాధనకు కృషి జరగాలన్నారు. ఆర్థిక సేవలు అందరికీ చేరువకావడం, పర్యావరణ పరిరక్షణ, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పురోగతి ఇందుకు అవసరమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment