India banking system
-
భారత్ బ్యాంకింగ్ పటిష్టం
ముంబై: ప్రపంచ ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ వ్యవస్థలు స్థిరంగా ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. అయితే అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో బ్యాలెన్స్ షీట్స్‌లో ఎట్టి పరిస్థితుల్లో అసమతౌల్యత రాకుండా చూసుకోవాలని సూచించారు. ఇక దేశంలో తీవ్ర ద్రవ్యోల్బణం సమస్య కూడా తగ్గిందని ఆయన వ్యాఖ్యానించారు. డాలర్ పెరిగిన పరిస్థితుల్లో అంతర్జాతీయంగా తోటి కరెన్సీలతో పోల్చితే భారత్ రూపాయి ఒడిదుడుకులు స్వల్పంగానే ఉన్నాయన్నారు. కొచ్చిలో జరిగిన 17వ కేపీ హోర్మిస్ (ఫెడరల్ బ్యాంక్ వ్యవస్థాపకుడు) స్మారక ఉపన్యాసంలో దాస్ మాట్లాడారు. ప్రపంచ మాంద్యం గురించి కొన్ని నెలల క్రితం తీవ్ర ఆందోళనలు ఉన్నప్పటికీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత దృఢత్వం చూపిందని, క్లిష్టతలను తట్టుకొని నిలబడిందని పేర్కొన్నారు. కఠిన ద్రవ్య పరిస్థితులు తగ్గాయని అన్నారు. జీ20 భారత్ ప్రెసిడెన్సీలో మరింత సమగ్ర ప్రపంచ ఆర్థిక పురోగతి సాధనకు కృషి జరగాలన్నారు. ఆర్థిక సేవలు అందరికీ చేరువకావడం, పర్యావరణ పరిరక్షణ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పురోగతి ఇందుకు అవసరమని పేర్కొన్నారు. -
బ్యాంకింగ్ వ్యవస్థ బాగు... బాగు!
ముంబై: భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ గతంకంటే ప్రస్తుతం ఎంతో మెరుగ్గా ఉందని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ దినేఖ కుమార్ ఖరా తెలిపారు. అలాగే అధిక రుణ వృద్ధిని కొనసాగించే పరిస్థితులు కనబడుతున్నాయని వివరించారు. ఎస్బీఐ నిర్వహించిన ఆర్థిక సదస్సులో ఆయన ఈ మేరకు చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు... ► రుణ అండర్‌రైటింగ్, రిస్క్ దృక్పథం పరిస్థితులకు సంబంధించి బ్యాంకులు మెరుగ్గా ఉన్నాయి. ► బ్యాంకింగ్ రుణ నిర్ణయాల్లో ఇప్పుడు శాస్త్రీయత పెరిగింది. అలాగే బ్యాంకింగ్ వద్ద ప్రస్తుతం తగిన మూలధన నిల్వలు ఉన్నాయి. ► పలు సంవత్సరాలుగా వార్షిక రుణ వృద్ధిని రెండంకెలకు తీసుకువెళ్లేందుకు ఇబ్బంది పడిన బ్యాంకింగ్ వ్యవస్థ నవంబర్ 4తో ముగిసిన పక్షం రోజుల్లో 17 శాతం రుణ వృద్ధిని సాధించింది. ► గతం తరహాలో కాకుండా, కార్పొరేట్లు కూడా తమ బ్యాలెన్స్ షీట్స్‌లో రుణ భారాల సమతౌల్యతను పాటిస్తున్నాయి. ► బ్యాంకింగ్ ఆధారపడే డేటా, రుణ నిర్వహణ, చర్యల వ్యవస్థలో కూడా భారీ మార్పులు వచ్చాయి. దివాలా కోడ్, గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ నెట్వర్క్ డేటా, రేటింగ్స్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అందుతున్న గణాంకాలు, క్రెడిట్ బ్యూరోల రిపోర్టుల వంటి సానుకూల అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. ► 2047 నాటికి (స్వాతంత్య్రం సాధించి 100 సంవత్సరాలు) భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 40 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందన్న అంచనా బ్యాంకింగ్‌సహా అన్ని రంగాలకూ భారీ భరోసాను అందించే అంశం. ► ఈ కాలంలో మౌలిక సదుపాయాల ఆధారిత వృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలి. ప్రస్తుతం అంతంతమాత్రంగా ఉన్న డెట్ మార్కెట్ మరింత పటిష్టం కావాలి. ► భారత్ బ్యాంకింగ్, జీఐఎఫ్‌టీ సిటీ తరహా ప్రత్యామ్నాయ యంత్రాంగాలు రాబోయే కాలంలో భారత్ సమగ్ర వృద్ధికి దోహదపడ్డానికి కీలక పాత్ర పోషించాల్సి ఉంది. భారీ లాభాలు ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిల (ఎన్పీఏ) కట్టడికి తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (2022–23 జూలై–సెప్టెంబర్) 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల నికల లాభం (2021–22 ఇదే కాలంతో పోల్చి) ఇదే 50 శాతం పెరిగి రూ.25,685 కోట్లుగా నమోదయ్యింది. తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాంకింగ్ రంగం లాభాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 9.2 శాతం పెరిగాయి. ఈ మొత్తం రూ.15,306 కోట్లుగా నమోదయ్యింది. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర లాభం 32 శాతం పెరిగి రూ.40,991 కోట్లుగా నమోదయ్యింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.66,539 కోట్లు. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (రూ.31,816 కోట్లు) ఈ పరిమాణం రెట్టింపునకుపైగా పెరిగింది. పలు ప్రభుత్వరంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్‌ను కూడా ప్రకటించాయి. ఎస్బీఐ సహా తొమ్మిది బ్యాంకులు వాటాదారులకు 7,867 కోట్ల రూపాయల డివిడెండ్లను ప్రకటించాయి. -
బ్యాంకింగ్ డిజిటలైజేషన్లో బాలారిష్టాలు
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ డిజిటలైజేషన్ పక్రియ మెరుగుపడుతున్నా, ఇంకా పలు అడ్డంకులు ఉన్నాయని ఎస్అండ్పీ గ్లోబల్ పేర్కొంది. పలు ప్రభుత్వ రంగ, చిన్న ప్రైవేటు రంగ బ్యాంకుల తక్కువ లాభదాయకత, మొండిబకాయిల భారం వంటి అంశాలను ఈ మేరకు విడుదల చేసిన ఒక నివేదికలో ప్రస్తావించింది. ‘రిటైల్ బ్యాంకింగ్‌లో సాంకేతిక పరమైన అవరోధాలు: పెద్ద బ్యాంకుల్లో మారాల్సిన పరిస్థితులు’’ అన్న శీర్షికన విడుదలైన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► భారత్‌లో ప్రధానమైన డిజిటల్ పేమెంట్ వ్యవస్థ– యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వినియోగం భారీగా పెరిగేందుకు కోవిడ్–19 ప్రేరిత అంశాలు దోహదపడుతున్నాయి. 2020 జూన్ నుంచి నవంబర్ మధ్య గత ఏడాది ఇదే కాలంలో పోల్చితే యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీల విలువ దాదాపు రెట్టింపయ్యింది. ► మొబైల్ పేమెంట్ యూజర్లు ఈ–వాలెట్ల నుంచి యూపీఐ వైపునకు మారుతున్నారు. 2020 అక్టోబర్‌లో మొత్తం పేమెంట్స్ మార్కెట్ లావాదేవీల్లో యూపీఐ వాటా 51 శాతం కావడం గమనార్హం. ► ఇదే ధోరణి ఇకముందూ కొనసాగుతుందని భావిస్తున్నాం. స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరగడం, ఇంటర్నెట్ కనెక్టివిటిలో పురోగతి, సాంకేతికతను ఎక్కువగా ఇష్టపడే యువత అధిక సంఖ్యలో ఉండడం ఇందుకు దోహదపడతాయి. ► బ్యాంకింగ్‌లో సాంకేతికత వినియోగం పెరిగేందుకు పలు బ్యాంకులు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ► అయితే మొండిబకాయిల భారం, తక్కువ లాభదాయకత వంటి అంశాలు సాంకేతికతపై బ్యాంకింగ్ వ్యయాలను క్లిష్టతరం చేస్తున్నాయి. కాగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)సహా ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకులు, కొన్ని బ్యాంకింగ్–యేతర ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) బ్యాంకింగ్ విషయంలో సాంకేతిక అవరోధాలను విజవంతంగా అధిగమించగలుగుతున్నాయి. అలాగే పలు ఫైనాన్షియల్ సంస్థలు కస్టమర్లకు సంబంధించి పలు సేవల విషయంలో ఆధునిక సాంకేతికత ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) వినియోగాన్ని ముందుకు తీసుకువెళ్లగలుగుతున్నాయి. ► సాంప్రదాయక బ్యాంకులు, ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీల మధ్య భాగస్వామ్యం మరింత పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో బ్యాంకులు తమ వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేసుకోడానికి మరిన్ని పెట్టుబడులు అవసరం అవుతాయి. -
మాల్యా బ్యాంకుల ఇజ్జత్ తీసేశాడు!
న్యూఢిల్లీ: దేశంలోని 17 ప్రముఖ బ్యాంకులకు రూ. 7వేల కోట్ల వరకు ఎగనామం పెట్టి.. విదేశాల్లో విహరిస్తున్న విజయ్‌మాల్యా వ్యవహారం దేశాన్ని కుదిపేస్తున్నది. ఈ నేపథ్యంలో తీసుకున్న అప్పులకుగాను ఆయన నుంచి ప్రతి పైసాను బ్యాంకులు వసూలు చేయాల్సిందేనని, ఇదే తమ ప్రభుత్వ వైఖరి అని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. విజయ్ మాల్యా వివాదం దేశ బ్యాంకింగ్ వ్యవస్థ ప్రతిష్ఠకు మచ్చగా మిగిలిందని ఆయన పేర్కొన్నారు. ఓ టీవీ చానెల్ సదస్సులో అరుణ్ జైట్లీ గురువారం మాట్లాడారు. మాల్యా నుంచి ప్రతి పైసాను వసూలు చేయాలని బ్యాంకులకు ప్రభుత్వం సూచించిందని చెప్పారు. మాల్యా దివాళాదారుగా తేలిన మరుక్షణపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు బ్యాంకులు మాల్యా ఆస్తుల వేలానికి సిద్ధమయ్యాయి. అయితే ముంబైలో ఆయనకు చెందిన కింగ్‌ఫిషర్ హౌస్ ఈ-వేలానికి పెట్టగా.. దానికి కొనడానికి ఒక్కరూ ముందుకు రాలేదని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.