Reserve Bank of India Governor
-
రూ.50 నోట్లపై గవర్నర్ సంతకం మార్పు
ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ స్థానంలో 2024 డిసెంబర్లో బాధ్యతలు స్వీకరించిన ప్రస్తుత గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కొత్త రూ.50 నోట్లను జారీ చేసే ప్రణాళికలను ప్రకటించారు. మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం ఉన్న నోట్లు చట్టబద్ధంగా యథావిధిగా చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. కొత్త నోట్లు మహాత్మా గాంధీ ఇమేజ్‌తో కొత్త సిరీస్‌లోని రూ.50 నోట్లనే పోలి ఉంటాయని ఆర్బీఐ పేర్కొంది. కేవలం శక్తికాంత దాస్ సంతకం స్థానంలో కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం మాత్రమే మారుతుందని స్పష్టం చేసింది.శక్తికాంత దాస్ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా 2024 డిసెంబర్లో బాధ్యతలు చేపట్టారు. 56 సంవత్సరాల మల్హోత్రా కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) నుంచి కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పట్టభద్రుడయ్యారు. అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ పట్టా పొందారు. 1990 బ్యాచ్ రాజస్తాన్ కేడర్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. 33 సంవత్సరాలకు పైగా తన కెరీర్లో విద్యుత్, ఫైనాన్స్, పన్నులు, సమాచార సాంకేతికత, గనులుసహా పలు రంగాలలో కీలక బాధ్యతలు నిర్వహించారు.ఇదీ చదవండి: ప్రముఖ బ్యాంక్‌పై ఆర్బీఐ ఆంక్షలు ఎత్తివేతగవర్నర్గా బాధ్యతలు స్వీకరించేకంటే ముందు వరకు ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి (రెవెన్యూ)గా కీలక బాధ్యతల్లో ఉన్నారు. అంతక్రితం ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగంలో కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వ స్థాయిలలో ఆర్థిక, పన్నుల విషయంలో ఆయనకు విస్తృత అనుభవం ఉంది. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధాన రూపకల్పనలో అయన కీలక పాత్ర పోషించారు. -
ఫైనాన్స్ డిజిటలైజేషన్‌తో కొత్తతరం బ్యాంకింగ్
ముంబై: ఫైనాన్స్‌లో డిజిటలైజేషన్ తదుపరి తరం బ్యాంకింగ్ సంస్కరణలకు మార్గం సుగమం చేస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. తక్కువ వ్యయాలతో అందరికీ ఫైనాన్షియల్ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ఫైనాన్స్ డిజిటలైజేషన్ దోహదపడుతుందని వివరించారు. 2023–24 కరెన్సీ అండ్ ఫైనాన్స్ రిపోర్ట్ (ఆర్సీఎఫ్)లో ఆయన ముందుమాట రాస్తూ, ఫ్లాగ్షిప్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వినియోగదారుల రిటైల్ చెల్లింపుల విధానాన్ని విప్లవాత్మకంగా మార్చిందని పేర్కొన్నారు. ఈ కామర్స్ విభాగ పురోగతినీ ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. లావాదేవీలను వేగవంతంగా, ఎటువంటి ఇబ్బందులూ లేకుండా తేలిగ్గా నిర్వహించేలా చేసిందని గవర్నర్ చెప్పారు. డిజిటల్ కరెన్సీ రంగంలో ఈ– రూపాయి, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల(సీబీడీసీ) ప్రయోగాత్మక అమల్లో రిజర్వ్ బ్యాంక్ ముందంజలో ఉందని అన్నారు. ఓపెన్ క్రెడిట్ ఎనేబుల్మెంట్ నెట్వర్క్, డిజిటల్ కామర్స్ కోసం ఓపెన్ నెట్వర్క్, ఫ్రిక్షన్‌లెస్ క్రెడిట్ కోసం పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫారమ్ వంటి కార్యక్రమాలతో డిజిటల్ రుణ వ్యవస్థ శక్తివంతంగా మారుతోందన్నారు. బ్యాంకులు అలాగే నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో (ఎన్బీఎఫ్సీ) లెండింగ్ సరీ్వస్ ప్రొవైడర్లుగా ఫిన్‌టెక్‌లు సహకరిస్తున్నాయని అన్నారు. ఇదే సమయంలో ఇప్పుడు డిజటలైజేషన్ ఎదుర్కొంటున్న సైబర్ సెక్యూరిటీ, డేటా గోప్యత, డేటా బయాస్, వెండర్, థర్డ్–పార్టీ రిస్‌్కలు వంటి సవాళ్లను పరిష్కరించాల్సి ఉందని ఆర్బీఐ గవర్నర్ అన్నారు. మరోవైపు డిజిటల్ విప్లవంలో భారత్ ముందంజలో ఉందని నివేదిక పేర్కొంది. భారత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పదో వంతు వాటా కలిగి ఉందని 2026 నాటికి ఇది ఐదవ వంతుగా పురోగమిస్తుందని నివేదిక అంచనావేసింది. ఆర్బీఐ ప్రస్థానంపై వెబ్ సిరీస్ రిజర్వ్ బ్యాంక్ తన తొంభై ఏళ్ల ప్రస్థానంపై అయిదు ఎపిసోడ్ల వెబ్ సిరీస్‌ను రూపొందించడంపై కసరత్తు చేస్తోంది. ఒక్కో ఎపిసోడ్ 25–30 నిమిషాల నిడివితో ఈ సిరీస్ సుమారు మూడు గంటలు ఉంటుంది. దీన్ని జాతీయ టీవీ ఛానల్స్, ఓటీటీ ప్లాట్‌ఫాంలలో ప్రసారం చేసే యోచన ఉన్నట్లు సిరీస్ నిర్మాణానికి టెండర్లను ఆహ్వానిస్తూ జారీ చేసిన పత్రంలో ఆర్బీఐ తెలిపింది. ఎకానమీలో రిజర్వ్ బ్యాంక్ ప్రాధాన్యత, దాని కార్యకలాపాలు మొదలైన వాటి గురించి అవగాహన కలిగించే విధంగా ఈ సిరీస్ ఉంటుంది. 1935లో ఏర్పాటైన ఆర్బీఐ ఈ ఏడాది ఏప్రిల్‌లో 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. -
ఆహార ధరలు ఇంకా తీవ్రమే..
న్యూఢిల్లీ: తక్షణం వడ్డీరేటు సరళతరం అయ్యే అవకాశం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ తెలిపారు. వినియోగ ధరల సూచీ ఆధారిత (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2 ప్లస్‌తో ఆరు శాతానికి కట్టడి చేయాలన్న కేంద్రం నిర్దేశం... ప్రస్తుతం 6 శాతం దిగువనే ఉన్న పరిస్థితి (మేలో ఏడాది కనిష్ట స్థాయిలో 4.75 శాతం)ని ఆయన ప్రస్తావిస్తూ, ‘‘ప్రస్తుత ద్రవ్యోల్బణం–4 శాతం లక్ష్యం మధ్య ఉన్న అంతరాన్ని బట్టి వడ్డీ రేటుపై వైఖరిని మార్చడం చాలా ముందస్తు చర్య అవుతుంది’’ అని ఉద్ఘాటించారు. రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యం 4 శాతమేనని పలు సందర్భాల్లో ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పొంచి ఉన్నాయని కూడా ఆయన పలు సందర్భాల్లో ప్రస్తావించారు. ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణంపై గవర్నర్ ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. జూన్ 2023 నుండి వరుసగా 11వ నెలలో ప్రధాన ద్రవ్యోల్బణం తగ్గింది. సేవల ద్రవ్యోల్బణం చారిత్రక కనిష్ట స్థాయిలకు దిగివచి్చంది. వస్తు ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఇచి్చన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యాంశాలు.. → మనం స్థిరమైన ప్రాతిపదికన 4 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం వైపునకు వెళ్లినప్పుడు వడ్డీరేటు వైఖరిలో మార్పు గురించి ఆలోచించే విశ్వాసం మనకు లభిస్తుంది. → ద్రవ్యోల్బణం ప్రయాణం అంచనాలకు తగ్గట్టుగానే పురోగమిస్తున్నది. అయితే పూర్తి 4 శాతం దిశగా ప్రయాణం అత్యంత కష్టతరమైన అంశం. ఇందుకు పలు అడ్డంకులు ఉన్నాయి. → మార్చి–మే మధ్య తయారీ, ఫ్యూయల్ అండ్ లైట్ ద్రవ్యోల్బణం తగ్గింది. అయితే ఆహార ద్రవ్యోల్బణం విషయలో ఇంకా ఆందోళనలు ఉన్నాయి. కూరగాయలుసహా పలు నిత్యావసరాల వస్తువుల ద్రవ్యోల్బణం స్పీడ్ రెండంకెలపైనే ఉంది. → స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విషయానికి వస్తే పలు అంశాలు వృద్ధికి దోహదపడే విధంగా తమ పాత్రను పోషిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో వృద్ధి వేగం చాలా బలంగా ఉంది. ఇది మొదటి త్రైమాసికంలో బలంగా కొనసాగుతుందని భావిస్తున్నాం. జూన్ పాలసీ సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను ఆర్బీఐ క్రితం 7 శాతం నుంచి 7.2 శాతానికి పెంచడం ఇక్కడ గమనార్హం. ఇదే జరిగితే దేశం వరుసగా నాలుగు సంవత్సరాల్లో 7 శాతం ఎగువన వృద్ధి సాధించినట్లు అవుతుంది. పాలసీ విధానం పునరుద్ఘాటన ఇంటర్వ్యూలో గవర్నర్ పాలసీ విధాన సమీక్ష అంశాలను పునరుద్ఘాటించడం గమనార్హం. ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షకు సంబంధించి జూన్ 5 నుంచి 7వ తేదీ మధ్య మూడు రోజుల పాటు సమావేశమైన ఆరుగురు సభ్యుల ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లో మెజారిటీ 4 శాతం దిగువకు రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడే తన ప్రధాన లక్ష్యంగా పేర్కొంటూ వరుసగా ఎనిమిదవసారి కీలక రేటు– రెపోను (6.5 శాతం) యథాతథంగా ఉంచింది. అయితే వడ్డీ రేటును తగ్గించాలని గత సమీక్షలో అభిప్రాయపడిన వారు ఒకరే ఉండగా ఈసారి అది ఇద్దరికి పెరిగింది. వీరిలో ఎంపీసీ ఎక్స్టర్నల్ సభ్యులు జయంత్ వర్మతో ఆషిమా గోయల్ కూడా ఉన్నారు. అయితే ఆర్బీఐ ఎంపీసీ మెజారిటీ సభ్యులు –ఎటువంటి అనిశ్చితి లేకుండా ద్రవ్యోల్బణం దిగువబాటనే కొనసాగుతుందన్న భరోసా వచ్చే వరకూ– వేచిచూసే ధోరణి పాటించాలని అభిప్రాయపడ్డారు. బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటుగా వ్యవహరిస్తారు. బ్యాంకింగ్ వ్యవస్థలో వడ్డీ రేట్లు ప్రధానంగా దీనిపై ఆధారపడి ఉంటాయి. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ దీన్ని యథాతథంగా కొనసాగిస్తోంది. కాగా, వృద్ధికి విఘాతం కలగకుండా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయగలిగిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, ఆహార ధరలపరంగా ద్రవ్యోల్బణం మళ్లీ ఎగిసే రిసు్కలను ఎంపీసీ నిశితంగా పరిశీలిస్తోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పాలసీ సమీక్ష సందర్భంగా చెప్పారు. ధరలు నిలకడగా ఉండే విధంగా స్థిరత్వాన్ని సాధించగలిగితేనే అధిక వృద్ధి సాధనకు పటిష్టమైన పునాదులు వేయడానికి సాధ్యపడగలదని ఆయన పేర్కొ న్నారు. ద్రవ్యోల్బణం భయాలు ఇంకా పొంచే ఉన్నాయని ఎంపీసీలోని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2024–25లో 4.5 శాతం ఉంటుందన్నది ఆర్బీఐ పాలసీ అంచనా. క్యూ1 (ఏప్రిల్–జూన్) 4.9 శాతం, క్యూ2లో 3.8 శాతం, క్యూ3 లో 4.6 శాతం, క్యూ4లో 4.5 శాతం రిటైల్ ద్రవ్యో ల్బణం ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. ఆహార ధరల తీవ్రతవల్లే రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం దిగువకు రావడం లేదని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష పేర్కొంది. మేలో ఏడాది కనిష్ట స్థాయిలో 4.75 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయినప్పటికీ, ఆర్బీఐ గవర్నర్ పేర్కొంటున్న లక్ష్యం కన్నా 75 బేసిస్ పాయింట్లు అధికం. -
2023–24లో 8% వృద్ధి: శక్తికాంతదాస్
న్యూఢిల్లీ: భారత్ మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8 శాతం వరకూ ఆర్థిక వృద్ధిని నమోదుచేసుకునే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన మూడవ త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్) చక్కటి వృద్ధి అవకాశాలకు భరోసా ఇస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో ఇస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్ ఎకానమీ మూలాలు పటిష్టంగా ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ధరల కట్టడి ఆర్బీఐ ప్రధాన ప్రాధాన్యతగా పేర్కొన్నారు. భారత్ జీడీపీ అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో అంచనా (దాదాపు 7 శాతం)లను మించి 8.4 శాతంగా నమోదయ్యింది. అంతకుముందు రెండు త్రైమాసికాలకు సంబంధించి (ఏప్రిల్–సెపె్టంబర్) తొలి వృద్ధి అంకెలు వరుసగా 7.8 శాతం (క్యూ1), 7.6 శాతాలుగా (క్యూ2)నమోదయ్యాయి. అయితే ఈ అంకెలను ఎగువముఖంగా 8.2 శాతం, 8.1 శాతాలుగా జాతీయ గణాంకాల కార్యాలయం సవరించింది. దీనితో 2023 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ఎకానమీ 8.2 శాతం పురోగమించినట్లు కేంద్ర గణాంకాల కార్యాలయం పేర్కొంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి 7.3 శాతం. -
సదా అప్రమత్తంగా ఉండండి
ముంబై: బ్యాంకింగ్ రంగంలో ఎల్లప్పుడూ అన్ని అంశాలపై అప్రమత్తతతో ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ సూచించారు. ఉదాసీనతకు చోటులేకుండా సవాళ్ల పట్ల జాగరూకత వహించాలన్నారు. పటిష్ట బ్యాంకింగ్‌కు సంబంధించి నిరంతర పరస్పర చర్యల్లో భాగంగా గవర్నర్ కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఎండీ, సీఈఓలతో సమావేశమయ్యారు. ఫైనాన్షియల్ విధుల నిర్వహణలో భారత్ బ్యాంకింగ్ చక్కటి పురోగతి సాధించిందని ఈ సందర్భంగా అన్నారు. అయితే చక్కటి బ్యాలెన్స్ సీట్స్ నిర్వహణ, వ్యక్తిగత రుణాలపై పర్యవేక్షణ, సహ–రుణ మార్గదర్శకాలను పాటించడం, ఎన్బీఎఫ్సీ రంగానికి నిధుల అందజేత, ద్రవ్య లభ్యత సవాళ్లు, ఐటీ– సైబర్ సెక్యూరిటీ, పాలనా వ్యవహారాల పటిష్ట నిర్వహణ, డిజిటల్ మోసాల నివారణ వంటి అంశాలపై అన్ని సమయాల్లో అప్రమత్తత పాటించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ఖాతాదారుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రాముఖ్యత ఇవ్వాలని పేర్కొంటూ... ఫైనాన్షియల్ వ్యవస్థ రక్షణ, స్థిరత్వలో ఇది కీలకమని అన్నారు. ఆర్బీఐ ఫిన్‌టెక్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడానికి, డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లకు మరింత ప్రోత్సాహాన్ని అందించడానికి బ్యాంకులకు తగిన ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఈ సమావేశాలకు డిప్యూటీ గవర్నర్లు ఎం రాజేశ్వర్‌రావు, స్వామినాథన్సహా నియంత్రణ, పర్యవేక్షణ కార్యక్రమాల ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కూడా హాజరయ్యారు. -
ఇప్పుడు 7.2 శాతం.. వచ్చేది 7 శాతం!
దావోస్: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం, ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే 2024–25 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధిని నమోదుచేసుకోగలదన్న విశ్వాసాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ వ్యస్తం చేశారు. ఆర్బీఐ పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం దిగివస్తుందన్న భరోసాను ఇచ్చారు. గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) 2023–24 జీడీపీ అంచనాలు 7 శాతంకన్నా... వ్యక్తిగతంగా దాస్ అంచనా 20 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) అధికంగా గమనార్హం. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సీఐఐ వార్షిక సమావేశంలో ‘అధిక వృద్ధి తీరు–తక్కువ స్థాయిలో ఇబ్బందులు: ది ఇండియా స్టోరీ’ అనే అంశంపై దాస్ మాట్లాడుతూ, వృద్ధి స్పీడ్ తక్కువగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలకు సంబంధించి ద్రవ్యోల్బణం ప్రమాదం ఇటీవల తగ్గుముఖం పట్టిందని అన్నారు. ఇది భవిష్యత్ వృద్ధి పటిష్టతకు సంకేతమని పేర్కొన్నారు. సమావేశంలో ఇంకా ఆయన ఏమన్నారంటే... ► ఇటీవలి సంవత్సరాలలో భారత్ ప్రభుత్వం చేపట్టిన పటిష్ట నిర్మాణాత్మక సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థ మధ్య, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను పెంచాయి. ► సవాలుతో కూడిన ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలోనూ భారత్... పటిష్ట వృద్ధి, స్థిరత్వ బాటన పయనిస్తోంది. ► ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికంగా మెరుగైన పరిస్థితులు, మార్కెట్ల సానుకూల వాతావారణం ఉన్నప్పటికీ, భౌగోళిక ఇబ్బందులు, వాతావరణ మార్పులు ఆందోళనకు కారణమవుతున్నాయి. ► బలమైన దేశీయ డిమాండ్‌తో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. ఇటీవలి ప్రపంచ అనిశ్చితి పరిణామాల నుంచి భారత్ మరింత బలంగా బయటపడింది. ► అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనగలిగిన స్థాయిలో భారత్ చెల్లింపుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దేశానికి తగిన స్థాయిలో విదేశీ మారకద్రవ్య నిల్వలు ఉన్నాయి. ► 2022 మే నుంచి ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గుతూ వచి్చంది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానం, ద్రవ్య లభ్యత నిర్వహణా పరిస్థితులు ఇందుకు దోహదపడ్డాయి. (2022 మే నుంచి బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో రేటు 2.5 శాతం పెరిగి 6.5 శాతానికి చేరిన సంగతి తెలిసిందే.) సరఫరాల వైపు సమస్యలు కూడా తొలిగిపోతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం కీలకపాత్ర పోషిస్తోంది. ► వచ్చే ఏడాది సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుందని భావిస్తున్నా. ప్రభుత్వ నిర్దేశాలకు అనుగుణంగా ఆర్బీఐ 4 శాతం లక్ష్యాన్ని త్వరగా చేరుకోగలదనే విశ్వాసంతో ఉంది. -
RBI Governor Shaktikanta Das: అధికరేటు ఎప్పటివరకో... కాలమే చెప్పాలి
న్యూఢిల్లీ: భారత్‌లో వడ్డీరేట్లు కొంతకాలం అధిక స్థాయిలోనే ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఎంతకాలం ఈ స్థితి కొనసాగుతుందన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉందని ఆయన అన్నారు. కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్, 2023లో ఆయన ఈ మేరకు ఒక ప్రసంగం చేస్తూ, ద్రవ్యోల్బణం కట్టడిలో ఉండడానికి సెంట్రల్ బ్యాంక్ జాగరూకతతో వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ఈ అంశాన్ని ‘ఏకాగ్రతకు సంబంధించి అర్జునిడి కన్ను’’తో పోల్చారు. భారత్‌లో ద్రవ్యోల్బణానికి సంబంధించి ‘అంతర్జాతీయ ఇంధన ధరలే’ ప్రధాన సవాలుగా పేర్కొన్నారు. ఇజ్రాయిల్–గాజా సంఘర్షణ అమెరికాసహా ఇతర ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ సంక్షోభ సమయాల్లోనూ భారత్ పటిష్ట ఆర్థిక పరిస్థితులను కలిగి ఉందని ఆయన భరోసా ఇచ్చారు. భారత్ రూపాయి విలువ డాలర్ మారకంలో తీవ్ర ఒడిదుడుకులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. రూ. 2,000 నోట్లు తిరిగి వస్తున్నాయని పేర్కొన్నారు. వ్యవస్థలో రూ. 10,000 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని, ఆ మొత్తం కూడా తిరిగి వస్తుందని అంచనా వేస్తున్నామని వివరించారు. ఇదిలావుండగా, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని గవర్నర్ నేతృత్వంలో ఈ నెల మొదట్లో జరిగిన ఆరుగురు సభ్యుల ద్వైమాసిక ద్రవ్యపరపతి కమిటీ విధాన సమీక్ష నిర్ణయించినట్లు ఆ భేటీకి సంబంధించి తాజాగా వెలువడిన మినిట్స్ పేర్కొంది. ఫిబ్రవరి తర్వాత వరుసగా నాలుగు సమీక్షా సమావేశాల్లో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను ఆర్బీఐ యథాతథంగా 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణంపై రాజీలేని వైఖరి అవలంభిస్తామని తద్వారా కమిటీ స్పష్టం చేస్తోంది. -
స్వీయ నియంత్రణ సంస్థ ఏర్పాటు అవశ్యం
ముంబై: ఫిన్‌టెక్ (ఫైనాన్షియల్ టెక్నాలజీ) కంపెనీలు పరిశ్రమ క్రమమైన వృద్ధి కోసం స్వీయ నియంత్రణా సంస్థ (ఎస్ఆర్ఓ– సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్)ను ఏర్పాటు చేసుకోవావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ విజ్ఞప్తి చేశారు. ‘‘ఫిన్‌టెక్ ప్లేయర్లు దేశీయ చట్టాలకు అనుగుణంగా తమ పరిశ్రమలో చక్కటి నియమ నంబంధనావళిని ఏర్పరచుకోవాలి. గోప్యత, డేటా రక్షణ నిబంధనలను పటిష్టం చేసుకోవాలి’’ అని దాస్ పేర్కొన్నారు. దీనితోపాటు నైతిక వ్యాపార పద్ధతులను అనుసరించడం, ధరలో పారదర్శకత పాటించడం, ప్రమాణాలను పెంపొందించడం కీలకమని, దీనికి ఫిన్‌టెక్ సంస్థలు తమ వంతు కృషి చేయాలని ఇక్కడ జరుగుతున్న గ్లోబల్ ఫిన్‌టెక్ ఫీస్ట్ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఏదైనా కంపెనీ ముఖ్యంగా ఫిన్‌టెక్ ప్లేయర్ల మన్నికైన, దీర్ఘకాలిక విజయానికి సుపరిపాలన నిబంధనావళి కీలకమైన అంశమని అన్నారు. ఫిన్‌టెక్ రంగ ఆదాయాలు 2030 నాటికి 200 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయన్న అంచనాలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. సీబీడీసీ పురోగతి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీపై (సీబీడీసీ) పురోగతి గురించి దాస్ మాట్లాడుతూ, పైలట్ ప్రాజెక్ట్ అమలు సందర్భంగా తలెత్తుతున్న సమస్యల పరిష్కారం జరుగుతోందని తెలిపారు. సీబీడీసీ రిటైల్ పైలట్ ప్రాజెక్ట్ ప్రస్తుతం 26 నగరాల్లోని 13 బ్యాంకుల ద్వారా నిర్వహించడం జరుగుతోందన్నారు. 2023 ఆగస్టు 31 నాటికి దాదాపు 1.46 మిలియన్ల వినియోగదారులు, 0.31 మిలియన్ల వ్యాపారులు ప్రస్తుతం పైలట్‌లో భాగమయ్యారని దాస్ తెలిపారు. యూపీఐ క్యూఆర్ కోడ్లతో సీబీడీసీ పూర్తి ఇంటర్–ఆపరేబిలిటీని కూడా ఆర్బీఐ ప్రారంభించినట్లు తెలిపారు. 2023 డిసెంబర్ నాటికి రోజుకు 10 లక్షల సీబీడీసీ లావాదేవీలను లక్ష్యంగా చేసుకోవడం జరిగిందని పేర్కొన్న ఆయన, కొత్త వ్యవస్థ విశ్లేషణ, అమలుకు తగిన డేటా పాయింట్లను ఈ లావాదేవీలు అందిస్తాయన్న భరోసాను ఇచ్చారు. ఇదిలావుండగా కార్యక్రమంలో ఫిన్‌టెక్ కన్వర్జెన్స్ కౌన్సిల్ కో–ఛైర్మన్ శ్రీనివాస్ జైన్ మాట్లాడుతూ, వీలైనంత త్వరగా ఒక స్వయం రెగ్యులేటరీ వ్యవస్థను రూపొందించుకోడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. -
సెంట్రల్ బ్యాంకుల గవర్నర్లలో శక్తి కాంతదాస్
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ ప్రపంచవ్యాప్తంగా టాప్ సెంట్రల్ బ్యాంకర్‌గా ర్యాంక్ పొందారు. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్లోబల్ ఫై నాన్స్ మ్యాగజైన్ ఆయనకు ఈ ప్రతిష్టాత్మక ర్యాంకును అందించింది. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ప్రచురించిన గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్, 2023లో దాస్ ‘ఏ ప్లస్’ రేటింగ్ పొందారు. ‘ఏ ప్లస్’ రేటింగ్ పొందిన ముగ్గురు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల జాబితాలో దాస్ అగ్రస్థానంలో ఉన్నారు. దాస్ తర్వాతి వరుసలో స్విట్జర్లాండ్ గవర్నర్ థామస్ జె జోర్డాన్, వియత్నాం సెంట్రల్ బ్యాంక్ చీఫ్ న్గుయెన్ థి హాంగ్ ఉన్నారు. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ప్రకటన ప్రకారం ద్రవ్యో ల్బ ణం నియంత్రణ, ఆర్థిక వృద్ధి లక్ష్యాలు, కరెన్సీ స్థిరత్వం, వడ్డీ రేటు నిర్వహణలో విజయం తత్సంబంధ అంశాల స్కేల్‌పై ఆధారపడి సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లకు ‘ఏ’ నుంచి ‘ఎఫ్’ వరకూ ర్యాంకులను ఇవ్వడం జరుగుతుంది. ‘ఏ ప్లస్’ అద్భుత పనితీరు ను ప్రతిబింబిస్తే, పూర్తి వైఫల్యాన్ని ‘ఎఫ్’ సూచిస్తుంది. రెండవ ప్రతిష్టాత్మక గుర్తింపు లండన్ సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్, 2023 జూన్‌లో దాస్‌కు ’గవర్నర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ప్రదానం చేసిన నేపథ్యంలోనే ఆయనకు తాజాగా మరో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించడం గమనార్హం. ద్రవ్యోల్బణంపై పోరు, డిమాండ్ పెరుగుదల, సప్లై చైన్‌కు అంతరాయం కలగకుండా చర్యలు వంటి పలు సవాళ్ల పరిష్కారానికి ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రభుత్వాలూ తమ సెంట్రల్ బ్యాంక్‌ల వైపు చూసినట్లు మ్యాగజైన్ పేర్కొంది. ‘ఏ’ గ్రేడ్ పొందిన సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లలో బ్రెజిల్‌కు చెందిన రాబర్టో కాంపోస్ నెటో, ఇజ్రాయెల్‌కు చెందిన అమీర్ యారోన్, మారిషస్‌కు చెందిన హర్వేష్ కుమార్ సీగోలం, న్యూజిలాండ్‌కు చెందిన అడ్రియన్ ఓర్ ఉన్నారు. కొలంబియాకు చెందిన లియోనార్డో విల్లార్, డొమినికన్ రిపబ్లిక్కు చెందిన హెక్టర్ వాల్డెజ్ అల్బిజు, ఐస్లాండ్కు చెందిన అస్గీర్ జాన్సన్, ఇండోనేíÙయాకు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ పెర్రీ వార్జియో ‘ఏ’ మైనస్ గ్రేడ్ పొందిన గవర్నర్లలో ఉన్నారు. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ 1994 నుంచి గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్‌ను ప్రచురిస్తోంది. యూరోపియన్ యూనియన్, ఈస్టర్న్ కరీబియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ సెంట్రల్ ఆఫ్రికన్ స్టేట్స్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ సహా 101 దేశాలు, భూభాగాలు, జిల్లాల గ్రేడ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లకు వారి పనితీరు ఆధారంగా ర్యాంకుల ప్రకటన జరుగుతోంది. -
ఆహార ధరల పెరుగుదలే ప్రధాన ఆందోళన
ముంబై: ఆహార ధరల పెరుగుదలే వ్యవస్థలో ప్రధాన ఆందోళనకర అంశమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన (ఎంపీసీ) కమిటీ అభిప్రాయపడింది. ఈ పరిస్థితిలో కఠిన ద్రవ్య విధానవైపే మొగ్గుచూపాలని ప్రస్తుతానికి బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో (6.5 శాతం) యథాతథంగానే కొనసాగించాలని ఎండీ పాత్ర, శశాంక భిడే, అషిమా గోయల్, జయంత్ ఆర్ వర్మ, రాజీవ్ రంజన్‌లతో సహా మొత్తం ఆరుగురు సభ్యులు ఓటు వేశారు. ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకూ జరిగిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష మినిట్స్ గురువారం విడుదలయ్యాయి. ‘మా పని (ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం) ఇంకా ముగియలేదు. కూరగాయలు తదితర ఆహార పదార్థాల ధరల ప్రాతిపదికన మొదటి రౌండ్ ద్రవ్య విధాన నిర్ణయాలు ఉంటాయి. అదే సమయంలో, విస్తృత ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ద్రవ్యోల్బణం అంచనాలు, ఆందోళనల ప్రాతిపదికన రెండవ–రౌండ్ ప్రభావాన్ని ముందస్తుగా తొలగించడానికి మేము సిద్ధంగా ఉండాలి. దీనికి తక్షణం కఠిన విధానమే సరైందని కమిటీ భావిస్తోంది’’ అని దాస్ సమావేశంలో అభిప్రాయపడ్డారు. 2022 నుంచి 250 బేసిస్ పాయింట్లు పెంపు ఉక్రేయిన్‌పై రష్యా యుద్ధం, క్రూడ్ ధరల తీవ్రత, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగ అదుపులోనికి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో ఈ నెల సమీక్షసహా గడచిన మూడు సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్బీఐ పెద్దపీట వేసింది. అయితే ద్రవ్యోల్బణం భయాలు తొలగిపోలేదని, అవసరమైతే కఠిన ద్రవ్య విధానానికే (రేటు పెంపు) మొగ్గుచూపుతామని కూడా ఆయా సందర్భాల్లో స్పష్టం చేస్తూ వచి్చంది. ఇదే విషయాన్ని ఈ నెల తాజా సమీక్షా సమావేశం అనంతరం కూడా ఆర్బీఐ గవర్నర్ పునరుద్ఘాటించారు. తాజాగా వెలువడిన మినిట్స్ కూడా ఇదే విషయాన్ని సూచించింది. అంచనాలకు అనుగుణంగానే... ఆర్బీఐ ఆందోళనకు అనుగుణంగానే పాలసీ తదనంతరం వెలువడిన జూలై నెల ద్రవ్యోల్బణం తీవ్ర రూపం దాల్చడం గమనార్హం. ఆర్బీఐ కీలక ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో ఏకంగా 7.44 శాతంగా (2022 ఇదే నెల ధరలతో పోల్చి ధరల పెరుగుదల) నమోదయ్యింది. గడచిన 15 నెలల్లో ఈ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. సూచీలో కీలక విభాగాలైన కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల ధరలు తీవ్రంగా పెరగడం దీనికి కారణం. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం ప్లస్ లేదా మైనస్‌తో 4 శాతం వద్ద ఉండాలి. అంటే అప్పర్ బ్యాండ్‌లో 6 శాతం అధిగమిస్తే... దానిని ఎకానమీలో డేంజర్ బెల్సా్గ పరిగణించాల్సి ఉంటుంది. జూలైలో అంకెలు ఈ స్థాయిని అధిగమించడం గమనార్హం. 2022 జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.71 శాతం ఉంటే, ఈ ఏడాది జూన్‌లో 4.87గా నమోదయ్యింది. జూలైలో మళ్లీ తీవ్ర రూపం దాలి్చంది. వినియోగ ధరల సూచీలో కీలక విభాగాలు చూస్తే.. ఒక్క ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం జూలైలో 11.51%గా నమోదయ్యింది. జూన్‌లో ఈ రేటు 4.55%. జూలై 2022లో ఈ రేటు 6.69%గా ఉంది. ఒక్క కూరగాయల ధరలు జూలై లో ఏకంగా 37.43% ఎగశాయి. తృణ ధాన్యాలు, సంబంధిత ఉత్పత్తుల ధరలు 13 శాతం పెరిగాయి. కీలక అంచనాలు ఇవీ... వృద్ధి తీరు: 2023–24లో దేశ జీడీపీ 6.5 శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనావేస్తుండగా, క్యూ1లో 8%, క్యూ2లో 6.5%, క్యూ3లో 6%, క్యూ4లో 5.7 శాతంగా అంచనా. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6%గా అంచనా. ద్రవ్యోల్బణం ధోరణి: 2023–24లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని అంచనావేస్తుండగా, క్యూ2లో 6.2%, క్యూ3లో 5.7%, క్యూ4లో 5.2 శాతంగా అంచనా. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో అంచనా 5.2 శాతం. -
హౌసింగ్, బ్యాంకింగ్, విదేశీ వాణిజ్యం సంస్కరణలు అవశ్యం
న్యూఢిల్లీ: గృహనిర్మాణ రంగం, బ్యాంకింగ్, విదేశీ వాణిజ్యానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి పరిశ్రమల సంస్థ– పీహెచ్‌డీసీసీఐ కీలక సిఫారసులు చేసింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్‌కు ఒక నివేదికను సమరి్పంచింది. గవర్నర్‌ను కలిసిన బృందానికి పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ సాకేత్ దాలి్మయా నేతృత్వం వహించారు. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ప్రపంచ ఆర్థిక సవాళ్లు, కొనసాగుతున్న మహమ్మారి ప్రభావం నేపథ్యంలో వృద్ధిని ఉత్తేజపరిచేందుకు గృహనిర్మాణ రంగ వడ్డీ రేట్లను తగ్గించాల్సిన అవసరం ఉంది. తక్కువ వడ్డీరేట్లు రేట్లు పెట్టుబడులను ప్రోత్సహిస్తాయి. వినియోగాన్ని పెంచుతాయి, పోటీతత్వాన్ని పెంపొందించడానికి దోహదపడతాయి. సవాళ్లను ఎదుర్కొంటున్న పరిశ్రమకు చేయూతను అందిస్తాయి. ► ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడంలో, తగిన లిక్విడిటీని నిర్వహించడంలో (ద్రవ్య లభ్యత) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రయత్నాలను మేము అర్థం చేసుకున్నాము. అభినందిస్తున్నాము. అయితే ఇదే సమయంలో వడ్డీ రేట్ల తగ్గింపూ చాలా అవసరం. మా పరిశ్రమకు చాలా అవసరమైన ప్రోత్సాహాన్ని ఇది అందిస్తుందని మేము నమ్ముతున్నాము. ► ఎగుమతి రియలైజేషన్ ప్రయోజన కోడ్ల సరిదిద్దడం, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఇన్పుట్ ప్రయోజనాల రక్షణ సహా బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన అనేక సమస్యల పరిష్కరించాల్సి ఉంది. ► విదేశీ సంస్థల కొనుగోళ్ల మాదిరిగానే రూపాయి రుణాలను ఉపయోగించి భారతదేశంలో ఇప్పటికే ఉన్న యూనిట్లు/కంపెనీలను కొనుగోలు చేయడానికి అనుమతించాలి. ప్రస్తుతం, భారతదేశంలో ప్రస్తుతం ఉన్న ఏ యూనిట్/కంపెనీని కొనుగోలు చేయడానికి భారతీయ రూపాయిలో బ్యాంక్ రుణం వీలు కల్పించడంలేదు. అయితే భారతదేశం వెలుపల ఏదైనా యూనిట్/కంపెనీని కొనుగోలు చేయడానికి మాత్రం ఇది అందుబాటులో ఉంది. ► విదేశీ వాణిజ్యం విషయానికి వస్తే... ఎగుమతి ఆదాయం నుండి విదేశీ బ్యాంకు చార్జీలను రికవరీ చేయడం, విదేశీ కరెన్సీలో ప్రీ–షిప్మెంట్ క్రెడిట్‌ను సరళీకరించడం (పీసీఎఫ్సీ) వంటివి ఉన్నాయి. ► లఘు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) బకాయిల వర్గీకరణకు సంబంధించి 90 రోజుల పరిమితిని 180 రోజులకు పెంచాలి. తద్వారా ఆయా కంపెనీలు వాటి వర్కింగ్ క్యాపిటల్‌ను వ్యాపార కార్యకలాపాలకు తగిన విధంగా> వినియోగించి సమస్యల నుంచి బయటపడే వీలుంటింది. రుణ వాయి దాల చెల్లింపులకు వర్కింగ్ క్యాపిటల్‌ను వినియోగించుకోవాల్సిన దుస్థితి తొలగిపోతుంది. -
ఎకానమీపై ప్రభావం.. చాలా స్వల్పం
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థపై రూ. 2,000 నోట్ల ఉపసంహరణ ప్రభావం ‘‘చాలా చాలా స్వల్పం’’గానే ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. చలామణీలో ఉన్న కరెన్సీలో వీటి వాటా 10.8 శాతమేనని (విలువపరంగా రూ. 3.6 లక్షల కోట్లు) వెల్లడించారు. కరెన్సీ నిర్వహణ కార్యకలాపాల్లో భాగంగానే ఉపసంహరణ ప్రక్రియను చేపట్టినట్లు సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇంతకు ముందు 2013–14లో కూడా ఈ తరహా ప్రక్రియ నిర్వహించినట్లు, అప్పట్లో 2005కు పూర్వం ముద్రించిన నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించినట్లు ఆయన వివరించారు. స్వచ్ఛ నోట్ల విధానంలో భాగంగానే తాజాగా రూ. 2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు చెప్పారు. ‘‘చలామణీలో ఉన్న కరెన్సీలో రూ. 2,000 నోట్ల వాటా కేవలం 10.8 శాతమే కాబట్టి ఎకానమీపై దీని ప్రభావం చాలా చాలా తక్కువగానే ఉంటుంది. పైగా ఈ నోట్లను లావాదేవీల్లో ఎక్కువగా ఉపయోగించడం లేదని మా పరిశీలనలో తేలింది. కాబట్టి ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావమేమీ ఉండదు’’ అని ఆయన వివరించారు. ప్రస్తుతానికి రూ. 2,000 నోట్ల చెల్లుబాటు యథాప్రకారంగానే కొనసాగుతుందన్న దాస్.. డిపాజిట్ చేసేందుకు, మార్చుకునేందుకు నిర్దేశించిన సెప్టెంబర్ 30 తర్వాత కూడా చెల్లుబాటవడంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దానిపై అప్పుడు తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. 10 నోట్లను మాత్రమే మార్చుకునేందుకు అవకాశం కల్పించడం వెనుక హేతుబద్ధతపై స్పందిస్తూ 2014 జనవరిలో కూడా దాదాపు ఇదే విధానం పాటించినట్లు దాస్ చెప్పారు. ఇక రూ. 1,000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టడంపై బదులిస్తూ.. అది ఊహాజనిత ప్రశ్న అని, ప్రస్తుతం అలాంటి ప్రతిపాదనేదీ లేదని స్పష్టం చేశారు. పుష్కలంగా నిధులు.. ద్రవ్య నిర్వహణపై ఉపసంహరణ ప్రభావాన్ని ప్రస్తావిస్తూ.. ప్రజల నుంచి నిధులకు ఉండే డిమాండ్‌ను బట్టి ఇది ఉంటుందన్నారు. ‘‘కొంత మొత్తం బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ అవుతుంది. మరికొంత మొత్తాన్ని మార్చుకుంటారు. మార్చుకున్న కరెన్సీ అంతా తిరిగి ప్రజల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఖాతాల్లో డిపాజిట్ అయిన మొత్తాలను మాత్రం కస్టమర్లు బ్యాంకులోనే అట్టే పెట్టుకోవడమో లేదా తమ అవసరాల కోసం వెనక్కి తీసుకోవడమో జరగొచ్చు. ఏదైనా బ్యాంకింగ్ వ్యవస్థలో పుష్కలంగా నిధులు అందుబాటులో ఉన్నాయి’’ అని దాస్ చెప్పారు. ప్రస్తుత నిబంధనలే కొనసాగింపు... వ్యవస్థలోకి నల్లధనం వచ్చే అవకాశాలపై స్పందిస్తూ.. ఖాతాలో డిపాజిట్ చేయాలన్నా, నోట్లను మార్చుకోవాలన్నా ప్రస్తుతం నిర్దిష్ట ప్రక్రియ ఉందని దాస్ చెప్పారు. దాన్నే కొనసాగించాలని బ్యాంకులకు సూచించామని, అదనంగా కొత్త నిబంధనలేమీ పెట్టలేదని తెలిపారు. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం రూ. 50,000 దాటి నగదు డిపాజిట్ చేస్తే పాన్ తప్పనిసరిగా చూపాల్సి ఉంటుందన్నారు. ఇక ఈ కసరత్తుతో కరెన్సీ నిర్వహణ వ్యవస్థపై పడే ప్రభావాలకు సంబంధించిన ప్రశ్నలకు స్పందిస్తూ.. మన వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉందని శక్తికాంత దాస్ తెలిపారు. తోటి దేశాలతో పోలిస్తే డాలరుతో భారత కరెన్సీ మారకం ఒడిదుడుకులకు లోనవడం చాలా తక్కువేనని చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధం, సంపన్న దేశాల్లో కొన్ని బ్యాంకుల మూసివేతతో అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో సంక్షోభాలు తలెత్తినప్పటికీ భారతీయ కరెన్సీ స్థిరంగా నిల్చుందని దాస్ తెలిపారు. అప్పుడేం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేను ప్రస్తుతం రూ. 2,000 నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటవడం కొనసాగుతుందని దాస్ చెప్పారు. ఎన్ని నోట్లు తిరిగి వస్తాయో వేచిచూడాల్సి ఉంటుందన్నారు. ‘‘ఇప్పటికైతే చాలా మటుకు నోట్లు తిరిగి వచ్చేస్తాయనే అనుకుంటున్నాం. ఎన్ని వస్తాయన్నది చూడాలి. సెప్టెంబర్ 30 (మార్చుకునేందుకు, డిపాజిట్ చేసేందుకు ఆఖరు తేది) దగ్గరయ్యే కొద్దీ తగిన నిర్ణయాలు తీసుకుంటాం. దాని గురించి ఇప్పుడే నేను ఊహాజనిత సమాధానాలు ఇవ్వలేను’’ అని దాస్ వ్యాఖ్యానించారు. నోట్ల మార్పిడికి, బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేసేందుకు బోలెడంత సమయం ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. విదేశీ పర్యటనల్లో ఉన్న వారు, వర్క్ వీసాలతో విదేశాల్లో ఉన్న వారు ఎదుర్కొనే సమస్యలను కూడా తాము పరిగణనలోకి తీసుకున్నామని, ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ కలుగకుండా ఈ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడటమే తమ ప్రధాన ఉద్దేశమని దాస్ వివరించారు. నీరు, నీడ కల్పించండి.. రూ. 2,000 నోట్లను మార్చుకునేందుకు లేదా డిపాజిట్ చేసేందుకు వచ్చే కస్టమర్లకు తగు సౌకర్యాలు కల్పించాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. వేసవిని దృష్టిలో పెట్టుకుని ఎండలో పడిగాపులు కాసే పరిస్థితి రాకుండా తగు నీడ, తాగడానికి నీరు వంటి సదుపాయాలు అందించాలని పేర్కొంది. నోట్ల మార్పిడి, డిపాజిట్ల డేటాను రోజువారీ రికార్డులను నిర్వహించాలని ఒక నోటిఫికేషన్లో సూచించింది. 2016లో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు నోట్లను మార్చుకునేందుకు చాంతాడంత లైన్లలో నిలబడి పలువురు మరణించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆర్బీఐ సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పీఎస్బీ చీఫ్‌లతో భేటీ.. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) చైర్మన్లు, డైరెక్టర్లతో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం సమావేశమయ్యారు. బ్యాంకుల్లో గవర్నెన్స్, నైతిక విలువలు తదితర అంశాలపై చర్చించారు. -
భారత్ బ్యాంకింగ్ పటిష్టం
ముంబై: ప్రపంచ ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ వ్యవస్థలు స్థిరంగా ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. అయితే అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో బ్యాలెన్స్ షీట్స్‌లో ఎట్టి పరిస్థితుల్లో అసమతౌల్యత రాకుండా చూసుకోవాలని సూచించారు. ఇక దేశంలో తీవ్ర ద్రవ్యోల్బణం సమస్య కూడా తగ్గిందని ఆయన వ్యాఖ్యానించారు. డాలర్ పెరిగిన పరిస్థితుల్లో అంతర్జాతీయంగా తోటి కరెన్సీలతో పోల్చితే భారత్ రూపాయి ఒడిదుడుకులు స్వల్పంగానే ఉన్నాయన్నారు. కొచ్చిలో జరిగిన 17వ కేపీ హోర్మిస్ (ఫెడరల్ బ్యాంక్ వ్యవస్థాపకుడు) స్మారక ఉపన్యాసంలో దాస్ మాట్లాడారు. ప్రపంచ మాంద్యం గురించి కొన్ని నెలల క్రితం తీవ్ర ఆందోళనలు ఉన్నప్పటికీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత దృఢత్వం చూపిందని, క్లిష్టతలను తట్టుకొని నిలబడిందని పేర్కొన్నారు. కఠిన ద్రవ్య పరిస్థితులు తగ్గాయని అన్నారు. జీ20 భారత్ ప్రెసిడెన్సీలో మరింత సమగ్ర ప్రపంచ ఆర్థిక పురోగతి సాధనకు కృషి జరగాలన్నారు. ఆర్థిక సేవలు అందరికీ చేరువకావడం, పర్యావరణ పరిరక్షణ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పురోగతి ఇందుకు అవసరమని పేర్కొన్నారు. -
‘అనిశ్చితి పరిస్థితులు ఉన్నప్పటికీ.. భారత్ తట్టుకుని నిలబడుతోంది’
న్యూఢిల్లీ: వృద్ధి, ద్రవ్యోల్బణం, కరెన్సీ అస్థిరతలకు సంబంధించి తాజా గణాంకాలు ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థను అధ్వాన్నంగా ఉన్నాయని సూచిస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఎక్కువ కాలం అధిక వడ్డీ రేట్ల వ్యవస్థ కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయని కూడా పేర్కొన్నారు. ఫిక్స్డ్ ఇన్కమ్ మనీ మార్కెట్ అండ్ డెరివేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఫిమ్డా), ప్రైమరీ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (పీడీఏఐ) వార్షిక సమావేశం శుక్రవారం దుబాయ్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ► అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితులు ఉన్నప్పటికీ, ఈ ఒడిదుడుకులను భారత్ తట్టుకుని నిలబడగలుగుతోంది. ► దేశంలో ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్‌లోటు వంటి స్థూల ఆర్థిక అంశాలు ఎకానమీ పటిష్టతను సూచిస్తున్నాయి. ► మన ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా, స్థిరంగా ఉంది. బ్యాంకులు, కార్పొరేట్లు సంక్షోభానికి ముందు కంటే మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. బ్యాంక్ రుణం రెండంకెలలో పెరుగుతోంది. ఒక చీకటి ప్రపంచంలో మనం ఒక ప్రకాశవంతమైన ప్రదేశాన్ని చూస్తున్నాము. రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్, డిసెంబర్లలో అదుపులోనికి వచ్చింది. ► ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ అనిశ్చితితో ఉన్నప్పటికీ, ఆర్థిక మార్కెట్లు అస్థిరంగా ఉన్నప్పటికీ, భౌగోళిక రాజకీయ పరిస్థితి ఉద్రిక్తంగా కొనసాగుతున్నప్పటికీ మనం ఆశావాదంతో, విశ్వాసంతో వాటిని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాము. -
బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టం ఆర్బీఐ గవర్నర్
ముంబై: అంతర్జాతీయ ప్రతికూలతల వల్ల ఎదుదయ్యే ఎటువంటి సవాళ్లనైనా తట్టుకొనగలిగే శక్తి సామర్థ్యాలను భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ, ఫైనాన్షియల్ మార్కెట్లు కలిగి ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. ఫిక్స్డ్ ఇన్కమ్ మనీ మార్కెట్ అండ్ డెరివేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఫిమ్డా) వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తూ, అంతర్జాతీయ ఒత్తిడులను తట్టుకునేలా అధిక ఫారెక్స్ నిల్వల (26 ఆగస్టు నాటికి 561 బిలియన్ డాలర్లు) పరిస్థితిని పొందడానికి అలాగే భారత్ బ్యాంకింగ్ పటిష్టతకు కేంద్రం, సెంట్రల్ బ్యాంక్ తగిన అన్ని చర్యలూ తీసుకున్నట్లు తెలిపారు. ద్రవ్యోల్బణం దిగివస్తుంది... దేశంలో ద్రవ్యోల్బణం భయాలు క్రమంగా వచ్చే త్రైమాసికాల్లో తగ్గుతాయని అన్నారు. ఇక దేశీయ కరెన్సీ రూపాయి పతనంపై ప్రస్తుతం ఆందోళన చెందాల్సింది ఏమీ లేదని కూడా ఉద్ఘాటించారు. డాలర్ మారకంలో భారత్ కరెన్సీ పతనం విషయంలో పలు వర్థమాన దేశాల కరెన్సీలతో పోల్చితే భారత్ రూపాయి పరిస్థితి మెరుగ్గా ఉందని అన్నారు. అలాగే పలు దేశాల కరెన్సీలతో పోల్చితే రూపాయి విలువ బలపడిందనీ పేర్కొన్నారు. కరెన్సీ తీవ్ర ఒడిదుడుకుల నిరోధానికి తగిన అన్ని చర్యలూ సెంట్రల్ బ్యాంక్ తీసుకుంటుందని అన్నారు. ఇక దేశ పురోగతి, ద్రవ్యోల్బణం కట్టడికి తగిన ద్రవ్య పరపతి విధానాన్ని ఆర్బీఐ అనుసరిస్తుందని పేర్కొన్నారు. సావరిన్ గ్రీన్ బాండ్ల జారీపై ప్రభుత్వం– సెంట్రల్ బ్యాంక్ చర్చలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. రుణ మేళాలతో మొండి బాకీల భారం బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆందోళన ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్వహించే ’రుణ మేళా’లను వ్యతిరేకిస్తున్నట్లు మహారాష్ట్ర స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఎంఎస్బీ ఈఎఫ్) ప్రకటించింది. ఇలాంటి కార్యక్రమాల్లో సరైన మదింపు లేకుండా ఇచ్చే రుణాలు.. మొండిపద్దులుగా పేరుకుపోయే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. రుణగ్రహీతలు ఈ తరహా లోన్లను తిరిగి చెల్లించడాన్ని మానేస్తున్న ట్లు గత అనుభవాలు చెబుతున్నాయని పేర్కొంది. రుణాల రికవరీ ప్రక్రియలో ఏ రాజకీయ పార్టీ కూడా సహకరించదని, ఎన్నికల సమయంలో మాత్రం ఓటర్లను ఆకట్టుకునేందుకు రుణాల మాఫీ డిమాండ్‌ను తెరపైకి తెస్తుంటాయని ఎంఎస్‌బీఈఎఫ్ వ్యాఖ్యానించింది. మొండిబాకీల ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులను సంక్షోభంలోకి నెట్టి, దాన్ని సాకుగా చూపి ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది. -
క్రిప్టో కరెన్సీతో ముమ్మాటికీ ప్రమాదమే
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలు ఆర్థిక వ్యవస్థకు ముమ్మాటికీ ప్రమాదమేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టంచేశారు. అంతర్లీనంగా ఎటువంటి పటిష్టతా లేకుండా కేవలం విశ్వాసం, ఊహాగానాల ఆధారంగా విలువను పొందే ఏ ఇన్స్ట్రమెంటైనా అది చివరకు తీవ్ర అనిశ్చితికే దారితీస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఆర్బీఐ గురువారం విడుదల చేసిన 25వ ఫైనాన్షియల్ స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) విడు దల సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► అంతర్జాతీయంగా అధిక ద్రవ్యోల్బణం కొనసాగే అవకాశం ఉంది. రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతల ప్రభా వం ఎకానమీలపై ఉంటుంది. కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, భారత్ ఎకానమీ రికవరీ బాటలో పయనిస్తోంది. ఎటువంటి సవాళ్లనైనా తట్టుకోడానికి వీలుగా బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు పటిష్ట మూలధనాన్ని కొనసాగిస్తున్నాయి. ► 2021లో అంతర్జాతీయ వాణిజ్య పరిమాణం 10.1 శాతం పెరిగితే 2022లో ఇది 5 శాతానికి పడిపోతుందని అంచనా. ► దేశీయంగా బ్యాంకింగ్ మొండిబకాయిల నిష్పత్తి మార్చిలో ఆరేళ్ల కనిష్టం 5.9 శాతానికి పడిపోయింది. 2023 మార్చి నాటికి మొండిబకాయిలు 5.3 శాతానికి దిగివస్తాయని భావిస్తున్నాం. ► రూపాయి తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొనడానికి ఆర్బీఐ తగిన అన్ని చర్యలూ తీసుకుంటుంది. దీర్ఘకాలంలో రూపాయి స్థిరత్వం ఆర్బీఐ లక్ష్యం. ► మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో భారత్ విదేశీ రుణ భారం 47.1 బిలియన్ డాలర్లు పెరిగి, 620.7 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే జీడీపీ నిష్పత్తిలో చూస్తే 2021 మార్చిలో 21.2%గా ఉంటే, 2022 మార్చిలో 19.9%కి తగ్గింది. ► పరిశ్రమకు రుణ వృద్ధి మే 2022లో 8.7 శాతానికి పెరిగింది. వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలకు సంబంధించి ఈ రేటు 11.8 శాతం పెరిగింది. పరిశ్రమకు రుణ వృద్ధి 2021 మేలో కేవలం 0.2 శాతం కావడం గమనార్హం. ► అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్జీఎస్) వినియోగంలో ప్రైవేట్ రంగ బ్యాంకులు... ప్రభుత్వ రంగ సంస్థల కంటే ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. -
ఆర్బీఐ కీలక నిర్ణయం, ప్రముఖులు ఏమంటున్నారంటే!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనూహ్యరీతిలో వడ్డీరేట్ల షాక్ ఇచ్చింది. కీలకమైన రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ సందర్భంగా రెపోరేటు ఎందుకు పెంచుతున్నామనే కారణాల్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వివరించారు. ►పెరుగుతున్న ద్రవ్యోల్బణం, భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, అధిక ముడి చమురు ధరలు, ప్రపంచవ్యాప్తంగా వస్తువుల కొరత, సప్లై చైన్‌లో సమస్యలు, భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. ►భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరిగిన వస్తువుల ధరల కారణంగా ద్రవ్యోల్బణానికి సంబంధించి ఎకానమీ అంతర్జాతీయంగా సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆయా అంశాల పట్ల జాగరూకత అవసరం. ద్రవ్యోల్బణం సవాళ్లు కొనసాగే అవకాశం ఉంది. ►ఈ రోజు రెపో రేటును పెంచాలనే నిర్ణయం మే 2020 తరువాత తొలి ‘యూ’ టర్న్‌గా పరిగణించవచ్చు. గత నెలలో మేము సరళతర ద్రవ్య విధానాన్ని క్రమంగా ఉపసంహరించుకునే వైఖరిని వ్యక్తపరిచాము. ఆ చర్యకు అనుగుణంగానే నేటి చర్యను చూడాలి. ►ద్రవ్య విధాన చర్య ద్రవ్యోల్బణం పెరుగుదలను నియంత్రించడం, ద్రవ్యోల్బణ అంచనాలను అదుపులోనికి తేవడం లక్ష్యంగా ఉందని నేను స్పష్టం చేయదలచుకున్నాను. అధిక ద్రవ్యోల్బణం వృద్ధికి హానికరం. ►ఆగస్ట్ 2018 తర్వాత పాలసీ రేటును పెంచడం ఇదే మొదటిసారి. ఇది కార్పొరేట్లకు, వ్యక్తులకు రుణ వ్యయాలను పెంచే అవకాశం ఉంది. తాజా ఆశ్చర్యకరమైన పెంపు మే 2020నాటి కోవిడ్ సవాళ్లను ఎదుర్కొనడానికి తీసుకున్న పాలసీ చర్యకు (రేటును 4 శాతం కనిష్టానికి తగ్గించడం) భిన్నమైనది. ►ద్రవ్యోల్బణం లక్ష్యంలోనే ఉండేలా చూసుకోవడానికి సరళతర ద్రవ్య విధానాన్ని ఉపసంహరించుకుంటూనే, అదే సమయంలో అవసరమైతే సరళతరం వైపు మొగ్గుచూపే అవకాశాలవైపు దృష్టి సారించడాన్ని ఆర్బీఐ కొనసాగిస్తుంది. ►దేశీయ సరఫరాల పరిస్థితి బాగున్నప్పటికీ, అంతర్జాతీయంగా గోధుమల కొరత.. దేశీయ గోధుమ ధరలపై ప్రభావం చూపుతోంది. ఇది ద్రవ్యోల్బణం సవాళ్లను పెంచుతోంది. ►రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఆంక్షల నేపథ్యంలో వంట నూనెల ధరలు పెరగవచ్చు. ఇటీవలి వాణిజ్య ఒప్పందాలు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు భారతదేశానికి మంచి మార్కెట్ అవకాశాలను తెస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల భౌగోళిక పరిస్థితుల్లోనూ భారత్ స్థిరంగా, సవాళ్లను తట్టుకోగలిగిన స్థాయిలో నిలబడుతోంది. ద్రవ్యోల్బణంపై సీరియస్ ద్రవ్యోల్బణాన్ని ఆర్బీఐ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తాజా పాలసీ స్పష్టం చేస్తోంది. ద్రవ్యోల్బణం సమస్య వేళ్లూనుకునే పరిస్థితిని తలెత్తబోనీయమని స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు దీనిని అర్థం చేసుకోవచ్చు. ఈ తరహా నిర్ణయం ఎకానమీ దీర్ఘకాలిక ప్రయోజనాలకు బలాన్నిస్తుంది. తాజా నిర్ణయంతో బ్యాంకింగ్ డిపాజిట్, రుణ రేట్లు క్రమంగా పెరుగుతాయి. – ఉదయ్ కోటక్, ప్రముఖ బ్యాంకర్ హౌసింగ్‌కు ప్రతికూలమే... రెపో రేటు దిగువ స్థాయిలో ఉంటే, రియల్టీకి అది మేలు చేస్తుంది. మహమ్మారి సమయంలో సరళతర విధానం హౌసింగ్ రంగానికి సానుకూలత అందించింది. తాజా ఆర్బీఐ నిర్ణయం రియల్టీని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నిర్ణయం వినియోగదారుల కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. హౌసింగ్ డిమాండ్‌కు ఇది ప్రతికూలమే. – హర్ష్ వర్దన్ పటోడియా, క్రెడాయ్ ప్రెసిడెంట్ బిజినెస్ సెంటిమెంట్‌కు దెబ్బ రెపో రేటు, సీఆర్ఆర్ పెంపు ఒకవైపు బిజినెస్ సెంటిమెంట్‌ను, మరోవైపు కొనుగోలుదారు వినియోగ శక్తిని దెబ్బతీస్తుం ది. కరోనా వైరస్ ప్రభావాల నుంచి ఇప్పటికీ తేరుకోని ఎకానమీపై తాజా ఆర్బీఐ నిర్ణయం ప్రతికూల ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. వ్యవస్థలో ఎటువంటి ద్రవ్య లభ్యతకు తగిన చర్యలు తీసుకుంటామన్న ఆర్బీఐ ప్రకటన హర్షణీయం.–ప్రదీప్ ముల్తానీ, పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ ఆటోకు బ్రేకులు... ఆటోమొబైల్ రంగంలో రుణాలు వ్యయభరితం అవుతాయి. అధిక వెయిటింగ్ పిరియడ్ వల్ల పాసింజర్ వాహన విక్రయాలపై తక్షణ ప్రభావం ఉండకపోవచ్చు. కానీ, ద్విచక్ర వాహన రంగం మాత్రం రేటు పెంపు ప్రభావాన్ని ఎదుర్కొంటుంది. అధిక ఇంధన ధరలకుతోడు తాజా రెపో రేటు పెంపు ప్రభావం చూపుతాయి – వికేశ్, గులాటి, ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ చదవండి👉నాలుగేళ్ల తర్వాత..ఆర్బీఐ భారీ షాక్!, సామాన్యులపై వడ్డీరేట్ల పిడుగు! -
ఏ సవాలునైనా తట్టుకోగలం
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ ఏ సవాలునైనా తట్టుకోగల స్థితిలో ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సమస్యలూ రాకుండా ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం పరిణామాలతో క్రూడ్ ఆయిల్ ఇతర కీలక కమోడిటీ ధరలు తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ వ్యవస్థకు ఈ భరోసాను కల్పించడం గమనార్హం. భారత పరిశ్రమల సమాఖ్య– సీఐఐ నిర్వహించిన ఒక పారిశ్రామిక సమావేశంలో గవర్నర్ ప్రసంగంలో ముఖ్యాంశాలు... ► మార్చి 2020లో మహమ్మారి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసినప్పటి నుండి సెంట్రల్ బ్యాంక్ ఆర్థిక వ్యవస్థలోకి రూ. 17 లక్షల కోట్లను పంప్ చేసింది. ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ సవాళ్లు తలెత్తకుండా తగిన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటుంది. ► అవసరమైన పరిస్థితుల్లో ఆర్బీఐ లిక్విడిటీ చర్యల ఉపసంహరణ ప్రక్రియను చాలా సజావుగా నిర్వహిస్తుంది. ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక రంగాల అవసరాలను తీర్చే విషయంలో తగినంత ద్రవ్య లభ్యత కొనసాగుతుంది. ► బ్యాంకింగ్ వ్యవస్థ ఇప్పుడు గణనీయంగా మెరుగుపడింది. మూలధన నిష్పత్తి 16 శాతంగా ఉంది. స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏ) రికార్డు స్థాయిలో 6.5 శాతానికి పడిపోయాయి. ► యుద్ధంతో తీవ్ర సవాళ్లు తలెత్తినప్పటికీ అధిక ఫారెక్స్ నిల్వలు, తక్కువ కరెంట్ అకౌంట్ లోటు ఆర్థిక వ్యవస్థను మెరుగ్గా స్థితిలో ఉంచుతోంది. ► దేశంలోకి వచ్చీ–పోయే నిధుల మధ్య నికర వ్యత్యాసాన్ని ప్రతిబింబించే క్యాడ్ (కరెంట్ అకౌంట్ లోటు)ను నిర్వహించగలిగిన సత్తా దేశానికి ఉంది. ఇందుకు సంబంధించి ఎటుంటి సవాళ్లు ఎదురైనా భారత్ తగిన విధంగా ఎదుర్కొనగలుగుతుంది. ► భారతదేశం ఆంక్షలను ఎదుర్కొంటుందని భయపడాల్సిన పనిలేదు. ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనే విధంగా ఆర్బీఐ ఫారెక్స్ నిల్వలు (దాదాపు 630 బిలియన్ డాలర్లపైన) తగిన విధంగా చక్కని వైవిధ్యభరిత స్థాయిలో ఉన్నాయి. ► ఆర్బీఐ విదేశీ కరెన్సీ అసెట్స్‌లో అమెరికా డాలర్లు మెజారిటీని కలిగి ఉండగా, ఆరు నెలల క్రితం ఇతర కరెన్సీలలో తన అసెట్స్‌ను విస్తరించాలని ఆర్బీఐ నిర్ణయించింది. ► భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది. ఆర్బీఐ ట్రాక్ చేసే దాదాపు 60 హై–ఫ్రీక్వెన్సీ సూచికలు ఈ విషయాన్ని సూచిస్తున్నాయి. స్టాగ్ఫ్లేషన్ భయాలు అక్కర్లేదు.. సరళతర ద్రవ్య విధానానికి తిలోదకాలిచ్చే అంచనాలను ఆర్బీఐ వ్యతిరేకిస్తుంది. వృద్ధికి తోడ్పాటు కోసం తగిన అన్ని చర్యలనూ ఆర్బీఐ తీసుకుంటుంది. వరుసగా రెండు నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం నిర్ధేశిత ఆర శాతం స్థాయిని దాటినప్పటికీ ఇది తగ్గుముఖం పడుతుందని మేము విశ్వసిస్తున్నాము. ధరల స్థిరత్వం, దానిని అదుపులో ఉంచడం సెంట్రల్ బ్యాంక్ ప్రధాన కర్తవ్యం. దీనిని ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవడం జరుగుతుంది. ఇక భారతదేశానికి స్టాగ్ఫ్లేషన్ అవకాశం లేదు. ఆర్బీఐ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం)కు ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం (జనవరిలో 6.01 శాతం, ఫిబ్రవరిలో 6.07 శాతం) ఆరు స్థాయిలోనే కొనసాగుతుందని భావించవద్దు. ఇది దిగివస్తుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో విశ్లేషకులు, నిపుణులు రేట్ల పెంపు, సరళతర ద్రవ్య విధానం నుంచి సెంట్రల్ బ్యాంక్ వైదొలడం వంటి అంచనాల నేపథ్యంలో దాస్ ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. యుద్ధం, క్రూడ్ ధరల తీవ్రత కొనసాగితే, దేశంలో స్టాగ్ఫ్లేషన్ (ఎకానమీలో స్తబ్దతతో కూడిన పరిస్థితి. ధరల తీవ్రత వల్ల వృద్ధి మందగమనం, తీవ్ర నిరుద్యోగం వంటి సవాళ్లు తలెత్తడం) సవాళ్లు తలెత్తే అవకాశం ఉందని బహుళజాతి బ్యాంకింగ్ సేవల దిగ్గజ సంస్థ– మోర్టాన్ స్టాన్లీ ఇటీవలే అంచనావేసిన సంగతి తెలిసిందే. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో జనవరి–మార్చి త్రైమాసికంలో సగటున 5.7 శాతంగా ఉంటుందని, ఆర్థిక సంవత్సరం మొత్తంలో 5.3 శాతంగా కొనసాగుతుందని, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.5 శాతానికి దిగివస్తుందని ఆర్బీఐ ఫిబ్రవరి మొదట్లో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా అంచనావేసింది. ఈ నేపథ్యంలో వృద్ధి రికవరీ, పటిష్టత లక్షంగా అవసరమైనంతకాలం ‘సరళతర’ విధానాన్నే అనుసరించడం ఉత్తమమని పరపతి విధాన కమిటీ మెజారిటీ అభిప్రాయపడింది. రెపో యథాతథ కొనసాగింపునకు ఆరుగురు సభ్యులు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. వృద్ధే లక్ష్యంగా వరుసగా పది ద్వైమాసిక సమావేశాల నుంచి ఆర్బీఐ రెపో రేటును యథాతథంగా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం దాటిపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. -
దేశంలో క్రిప్టో చట్టబద్ధత ఖాయం!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత్‌దాస్ నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నప్పటికీ, క్రిప్టో కరెన్సీకి చట్ట బద్ధత కల్పించడానికే కేంద్రం మొగ్గుచూపుతున్నట్లు మరోసారి స్పష్టం అయ్యింది. క్రిప్టో కరెన్సీని పన్ను పరిధిలోకి తీసుకువచ్చి, లాభాలపై పన్నులు విధించడంపై కేంద్రం దృష్టి సారించినట్లు స్వయంగా రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఆదాయపు పన్ను చట్టాల్లో మార్పులు తీసుకురావడానికి సిద్ధమవుతోందని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారని భావిస్తున్న 2022–23 బడ్జెట్లోనే ఈ మేరకు ప్రతిపాదనలు ఉంటాయని ఆయన సూచించారు. క్రిప్టో కరెన్సీని కొందరు అసెట్‌గా భావిస్తున్నారని అన్నారు. తద్వారా వచ్చే ఆదాయంపై ఇప్పటికే కొంత మంది క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లిస్తున్నారని తరుణ్ బజాజ్ తెలిపారు. ఇతర కొన్ని సేవల తరహాలోనే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కూడా క్రిప్టోకి వర్తిస్తుందని చట్టం ‘చాలా స్పష్టంగా‘ చెబుతోందని వివరించారు. ‘‘క్రిప్టోపై పన్ను అంశాలపై మేము దృష్టి సారిస్తాము. ఇప్పటికే ప్రజలు దానిపై పన్నులు చెల్లిస్తున్నారని నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ కొనుగోళ్ల పరిమాణం నిజంగానే చాలా పెరిగింది. ఈ అంశంపై పన్నులకు సంబంధించి కొన్ని చట్టపరమైన మార్పులు తీసుకురాగలమా లేదా అని చూద్దాం. అయితే ఇది బడ్జెట్ నాటికి సిద్ధం అవుతుంది. మనం ఇప్పటికే బడ్జెట్‌కు దగ్గరగా ఉన్నాము. బడ్జెట్లో ప్రతిపాదనలను ప్రవేశపెట్టే విషయాన్ని పరిశీలించాలి’’ అని బజాజ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. క్రిప్టో ట్రేడింగ్ విషయంలో టీసీఎస్ (మూలం వద్ద పన్ను వసూలు) విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు ఏమి జరుగుతుందో చూడాల్సి ఉందని ఆయన అన్నారు. వేగంగా పరిణామాలు... క్రిప్టో కరెన్సీపై దేశంలో నియంత్రణకానీ, నిషేధంకానీ లేవు. ఈ వర్చువల్ కరెన్సీల వల్ల ఫైనాన్షియల్, ఆర్థిక వ్యవస్థలకు తీవ్ర విఘాతమని ఆర్బీఐ గవర్నర్ నుంచి ప్రకటనల నేపథ్యంలో మీడియాలో దీనికి అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రకటనలు వెలువడుతున్నాయి. సినీ స్టార్ నుంచి క్రీడాకారుల వరకూ క్రిప్టోకు సానుకూలంగా ప్రచారం చేస్తున్నారు. క్రిప్టోకరెన్సీ పెట్టుబడిపై భారీ రాబడులు వస్తాయంటూ తప్పుదారి పట్టించే ప్రకటనలు వస్తున్నాయన్న ఆందోళనల మధ్య స్వయంగా ప్రధానమంత్రి మోదీ ఈ అంశంపై సమావేశం నిర్వహించడం గమనార్హం. మరోవైపు క్రిప్టోపై నిషేధం తగదని, దీనిపై నియంత్రణ మాత్రమే ఉండాలని బీజేపీ నాయకుడు జయంత్ సిన్హా నేతృత్వంలోని జరిగిన తాజా పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో కూడా అభిప్రాయాలు వ్యక్తమవడం గమనార్హం. ఆయా అంశాల నేపథ్యంలో క్రిప్టో కరెన్సీని నిబంధనలతో అనుమతించాలని కేంద్రం భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఈ నెల 29వ తేదీ నుంచీ ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల్లోనే కేంద్రం బిల్లు పెట్టడానికి కసరత్తు జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. వర్చువల్ కరెన్సీలకు సంబంధించి సేవలను అందించకుండా బ్యాంకులుసహా తన నియంత్రిత సంస్థలను అన్నింటిపైనా నిషేధం విధిస్తూ, 2018 ఏప్రిల్ 6వ తేదీన ఆర్బీఐ జారీ చేసిన ఒక సర్క్యులర్‌ను 2021 మార్చి 4వ తేదీన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి ఇక్కడ గమనించాల్సిన మరో అంశం. -
ధరల స్పీడ్ కట్టడికి కేంద్రం చర్యలు దోహదం
ముంబై: పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు నిర్ణయం ద్రవ్యోల్బణం కట్టడి విషయంలో సానుకూల అంశమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ఆహార ద్రవ్యోల్బణం ప్రస్తుతం కట్టడిలోనే ఉన్నప్పటికీ, మొత్తంగా అన్ని విభాగాలూ చూస్తే, ద్రవ్యోల్బణం పెరుగుదల కనబడుతోందని ఆయన అన్నారు. అయితే సరఫరాల సమస్య భారత్‌లో ద్రవ్యోల్బణం తీవ్రతకు కారణమని వివరించారు. ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందన్నారు. పప్పు దినుసులు, వంట నూనెల వంటి నిత్యావసరాల విషయంలో సరఫరాల సమస్యలను తొలగించంతోపాటు, పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం ఇటీవల తగ్గించడం ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉండడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం కదలికలను ఆర్బీఐ జాగ్రత్తగా పరిశీలిస్తోందని పేర్కొన్నారు. బిజినెస్ స్టాండర్డ్ నిర్వహించిన బీఎఫ్ఎస్ఐ సదస్సులో ఆయన ఈ మేరకు ఒక కీలక ప్రసంగం చేశారు. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలుచేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం) నిర్ణయానికి కీలకమైన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2–6 శాతం మధ్య ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటున 5.3 శాతంగా ఉంటుందన్నది ఆర్బీఐ అంచనా. దీనివల్ల సామాన్యునిపై ధరల భారం తీవ్రత తగ్గుతుంది. దీనికితోడు తక్కువ స్థాయిలో వడ్డీరేట్లు కొనసాగడం వల్ల వ్యవస్థలో వినియోగం పెరుగుదలకు, డిమాండ్ పునరుద్ధర ణకు దోహదపడుతుంది. ఇక రిటైల్ ద్రవ్యోల్బణం రెండు, మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 5.1 శాతం, 4.5 శాతం, 5.8 శాతంగా నమోదవుతుందన్నది ఆర్బీఐ అంచనా. 2022–23 క్యూ1లో 5.2 శాతం నమోదవుతుందని భావిస్తోంది. క్రిప్టో కరెన్సీలపై ఆందోళన బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలపై గవర్నర్ మరోసారి తన ‘‘తీవ్ర ఆందోళన’’ను వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ స్థిరత్వం కోణంలో పరిశీలిస్తే, రెగ్యులేటర్‌గా తమకు క్రిప్టో కరెన్సీలపై ఆందోళన ఉందని వివరించారు. క్రిప్టో మార్కెట్లో పాల్గొనే వారి సంఖ్యను భారీగా పెంచి చూపిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా అన్నారు. అయితే పరిమాణం పరంగా సంఖ్య పెరుగుతోందని మాత్రం అంగీకరించారు. క్రిప్టో మార్కెట్లో ఎక్కువ మంది పెట్టుబడిదారులు రూ. 1,000 లేదా రూ. 2,000 వంటి కనీస మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టారని గవర్నర్ తెలిపారు. క్రిప్టోకరెన్సీలపై కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ సవివరమైన నివేదికను సమర్పించిందని, ఇది ప్రభుత్వ క్రియాశీల పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు. క్రిప్టో ఇండస్ట్రీని రెగ్యులేట్ చేయాలని ప్రభుత్వ నిర్ణయించినట్లయితే, ఆ విధులను ఆర్బీఐ నిర్వహి స్తుందా? అన్న ప్రశ్నపై వ్యాఖ్యానించడానికి గవర్నర్ నిరాకరించారు. ఈ ఏడాది మేల్లో కూడా దాస్ క్రిప్టో కరెన్సీ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ద్రవ్య స్థిరత్వానికి ప్రతికూలమని పేర్కొన్నారు. ప్రభుత్వం, ఆర్బీఐ ఫైనాన్షియల్ స్థిరత్వానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. క్రిప్టో కరెన్సీని నిబంధనలతో అనుమతించాలని కేంద్రం భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పెట్టడానికి కసరత్తు జరుగు తోందని ఈ వార్తల కథనం. ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీలపై దాస్ తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యత నెలకొంది. -
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్ పదవీకాలం పొడిగింపు
న్యూఢిల్లీ: ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత్ దాస్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఆయనను ఈ పదవికి పునర్నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆయన 2024 డిసెంబర్ వరకు పదవిలో కొనసాగనున్నారు. కాగా, శక్తికాంత్ దాస్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా 2018 డిసెంబర్ 12వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగారు. 2021 డిసెంబర్లో ఆయన పదవీ కాలం ముగియాల్సి ఉంది. శక్తికాంత్‌దాస్ పదవీకాలం ముగియడానికి నెలన్నర రోజుల ముందే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఒడిషాకు చెందిన శక్తికాంతదాస్ 1980వ బ్యాచ్‌లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. తమిళనాడు కేడర్‌ను ఎంచుకున్న ఆయన ఆ రాష్ట్రంలో వివిధ పదవులు చేపట్టారు. ఐఏఎస్ అధికారిగా రిటైరయిన తర్వాత 15వ ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా కొనసాగారు. జీ 20 కూటమిలో ఇండియా తరఫున కీలక భూమిక నిర్వహించారు. చదవండి: (రజనీకాంత్ ఆరోగ్యంపై స్పందించిన భార్య లతా) -
ఆర్థిక పురోగతిలో ‘ఆడిట్’కు కీలకపాత్ర
న్యూఢిల్లీ: దేశ ఫైనాన్షియల్ స్థిరత్వం, ఆర్థిక పురోగతిలో ఖచ్చితత్వం కలిగిన, విశ్లేషణాత్మక ఆడిట్ నివేదికల పాత్ర ఎంతో ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ఆయా అంశాలు వ్యవస్థల పట్ల ప్రజలలో విశ్వాసాన్ని నింపుతాయని అన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ ఆడిట్ అండ్ అకౌంట్స్ (ఎన్‌ఏఏఏ) అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ రంగంలో సుపరిపాలనకు ఆడిటింగ్ ఒక మూలస్తంభమని అన్నారు. ‘‘ఉద్దేశించిన ఫలితాలను సాధించడంలో భాగంగా ప్రజా వనరులు బాధ్యతాయుతంగా, సమర్ధవంతంగా నిర్వహించబడుతున్నాయా లేదా అనే అంశంపై నిష్పాక్షిక అంచనాలకు రావడం అవసరం. ఈ దిశలో న్యాయమైన, నిష్పాక్షికమైన ఆడిట్ పాత్ర ఎంతో ఉంటుంది. ఇది ఆయా వర్గాల్లో విశ్వాసాన్ని నింపుతుంది’’ అని దాస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయన ప్రసంగంలో మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► అంతర్జాతీయంగా చూస్తే, సమీకృత ఆర్థిక వ్యవస్థలో న్యాయమైన,నిష్పక్షపాతమైన ఆడిట్ అనేది కేవలం దేశీయంగా కీలక పాత్ర పోషించే అంశమే కాదు.ప్రపంచ వేదికపై దేశ ఖ్యాతిని,విశ్వసనీయతను పెంపొందించడానికి ఇది ఒక సాధనం. ► ఫైనాన్షియల్ మార్కెట్ల సంక్లిష్టత, సమర్థవంతమైన వనరుల కేటాయింపు, ప్రజల నుంచి సుపరిపాలనపై ఏర్పడుతున్న అధిక అంచనాలు ఇక్కడ ప్రస్తావించుకోదగిన అంశాలు. ఈ నేపథ్యంలో ఆడిట్ పాత్ర ఎంతో కీలకంగా మారింది. ► భారతదేశం వేగంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాం.ఈ విషయంలో భాగస్వాములందరికీ ఆర్థిక పనితీరుపై భరోసాను కల్పించడానికి ఆడిటర్ల నైపుణ్యం, ఈ వ్యవస్థలో పటిష్టత అవసరం. ► కేవలం అందుబాటులో ఉన్న సాక్ష్యాలు, సమాచారం ఆధారంగా ఆర్థిక నిర్ణయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సరికాని డేటా వల్ల తగిన నిర్ణయాలను తీసుకోలేం. ► ఇక్కడ బ్యాంకింగ్ రంగాన్నే ఒక ఉదాహరణగా తీసుకుందాం. సరికాని, తప్పుదోవ పట్టించే ఆర్థిక నివేదికల ఆధారంగా బ్యాంక్ రుణ మంజూరీలు చేసినట్లయితే, రుణగ్రహీత కంపెనీ చివరకు దానిని తిరిగి చెల్లించలేకపోతుంది. రుణదాతకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి మిగులుతుంది. దీనికితోడు అర్హత కలిగిన కంపెనీలకు రుణం ఇవ్వడానికీ బ్యాంకింగ్ తదుపరి వెనుకడుగు వేస్తుంది. తనకు వచ్చిన నష్టాన్ని భర్తీ చేసుకోడానికి ఇతరులపై బ్యాంకులు వడ్డీభారాన్ని వేయకా తప్పనిసరి పరిస్థితి ఉంటుంది. వెరసి ఇదంతా ఆర్థిక వ్యవస్థ తిరోగమనానికి దారితీస్తుంది. ► ఆడిట్ నాణ్యత, పటిష్టత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల ఆడిట్‌ను మెరుగుపరచడానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)తో ఆర్బీఐ సంప్రదింపులు జరిపి అనేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరిలో వాణిజ్య బ్యాంకుల కోసం రిస్క్ ఆధారిత అంతర్గత ఆడిట్ వ్యవస్థను బలోపేతం చేశాం. ఏప్రిల్‌లో బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో (ఎన్బీఎఫ్సీ) చట్టబద్ధమైన ఆడిటర్ల నియామకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఆధునికీకరణ జరిగింది. రదర్శకత, వివేకవంతమైన వ్యాపార వ్యూహం, సమర్థవంతమైన రిస్క్ మేనేజ్మెంట్ లక్ష్యాలుగా ఈ చర్యలను తీసుకున్నాం. ► ఆడిట్లో అంతర్జాతీయ ప్రమాణాలు మరింత పటిష్టం చేయడానికి ఈ రంగంలో ప్రముఖులు, నిపుణులతో పాటు ఫైనాన్షియల్ రంగంలోని నియంత్రణ సంస్థలు, పర్యవేక్షకులు కలిసి పనిచేయాలి. బలమైన,అందరికీ చేరువచేసే ఆర్థిక రంగాన్ని నిర్మించడానికి,సుపరిపాలనకు,నైతిక విధానాల పరిపుష్టికి చురుకైన చర్యలు తీసుకోవాలి. -
మౌలిక, విద్య, ఆరోగ్య రంగాలపై దృష్టి అవశ్యం
న్యూఢిల్లీ: భారత్ సమగ్ర, సుస్థిర అభివృద్ధికి, చిన్న పట్టణాల్లో ఉపాధి కల్పనకు మౌలిక, విద్య, ఆరోగ్య సంరక్షణా రంగాలతోపాటు డిజిటల్ ఎకానమీకి ఊపును ఇవ్వడానికి మరింత కృషి జరగాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ సూచించారు. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) 48వ నేషనల్ మేనేజ్మెంట్ సదస్సును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్బీఐ గవర్నర్ మాట్లాడారు. ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే... గతం భవిష్యత్తుకు బాట కావాలి మహమ్మారి నుంచి కోలుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో సంక్షోభానికి దారితీసిన పరిస్థితులను సమీక్షించుకోవాలి. పటిష్టమైన, సమగ్రమైన, స్థిరమైన వృద్ధికి పరిస్థితులను సృష్టించుకోవాలి. సంక్షోభం కలిగించిన నష్టాన్ని పరిమితం చేయడం మొదటి అడుగు మాత్రమే. భవిష్యత్తులో ఇటువంటి సవాళ్లను ఎదుర్కొని, సుస్థిర వృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నం పక్కా ప్రణాళికకు అనుగుణంగా ఉండాలి. మధ్యకాలిక పెట్టుబడులు, పటిష్ట ఫైనాన్షియల్ వ్యవస్థలు, వ్యవస్థాగత సంస్కరణల ప్రాతిపదికన స్థిర వృద్ధి ప్రణాళికలను రూపొందించాలి. ఈ దిశలో విద్యా, ఆరోగ్యం, నూతన ఆవిష్కరణలు, భౌతిక, డిజిటల్ ఇన్‌ఫ్రాలపై మరిన్ని పెట్టుబడులు అవసరం. పోటీని, ఇందుకు సంబంధించి చైతన్యాన్ని పెంపొందించడానికి ప్రోత్సహించడానికి అలాగే మహమ్మారి ప్రేరిత అవకాశాల నుండి ప్రయోజనం పొందడానికి కార్మిక, ఉత్పత్తి మార్కెట్లలో మరింత సంస్కరణలను తీసుకుని రావాలి. గిడ్డంగి, వ్యవ‘సాయం’ కీలకం గిడ్డంగి, సరఫరా చైన్ల పటిష్టత, వ్యవసాయం ప్రత్యేకించి ఉద్యానవన రంగం విలువల పెంపునకు కృషి తత్సంబంధ మౌలిక సదుపాయాల కల్పన చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు, సమగ్రాభివృద్ధికి ఎంతో అవసరం. కొన్ని రంగాల కోసం ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత పథకం (పీఐఎల్) తయారీ రంగాన్ని ప్రోత్సహించడంలో ఒక ముఖ్యమైన చొరవ. దీనివల్ల ప్రయోజనాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. ప్రైవేటు వినయోగం పెరగాలి కరోనా మహమ్మారి అటు అభివృద్ధి చెందుతున్న, చెందిన దేశాలలో పేదలపై తీవ్ర ప్రభావం చూపింది. మహమ్మారి సవాళ్లు తొలగిపోయిన తర్వాత సుస్థిర పురోభివృద్ధిని సాగించేలా మన ప్రయత్నం ఉండాలి. మహమ్మారి సవాళ్ల నేపథ్యంలో పడిపోయిన ప్రైవేటు వినియోగం పునరుద్ధరణ జరగాల్సి ఉంది. వృద్ధిలో ఈ విభాగం ప్రాధాన్యత ఎంతో ఉంది. ప్రస్తుతం ప్రపంచాభివృద్ధికి దేశాల మధ్య సమన్వయ సహకారం అవసరం అన్న అంశాన్ని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వ్యాక్సినేషన్ పురోగతిపై అన్ని దేశాలు పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉంది. మహమ్మారి తర్వాత ప్రపంచాన్ని కలుపుకుని పోవడం ఒక పెద్ద సవాలే. ఆటోమేషన్ వల్ల ఉత్పాదకత లాభం జరుగుతుంది. అయితే ఇది కార్మిక మార్కెట్లో మందగమనానికి దారితీసే అవకాశం ఉంది. ఈ సందర్భంలో శ్రామిక శక్తికి కీలక నైపుణ్యం, శిక్షణ అవసరం. బిలియన్ డాలర్(రూ. 7,300 కోట్లు) విలువను అందుకున్న స్టార్టప్‌లు (యూనికార్న్) 60కు చేరడం ఈ విషయంలో భారత్ పోటీ తత్వాన్ని తెలియజేస్తున్నాయి. డిజిటల్, ఈ–కామర్స్, ఫార్మా వెలుగులు భారత్ డిజిటల్ రంగంలో దూసుకుపోతోంది. ఇదే ధోరణి కొనసాగే వీలుంది. క్లౌడ్ కంప్యూటింగ్, కస్టమర్ ట్రబుల్షూటింగ్, డేటా అనలటిక్స్, వర్క్‌ప్లేస్ ట్రాన్స్ఫార్మేషన్, సప్లైచైన్ ఆటోమేషన్, 5జీ మోడరనైజేషన్, సైబర్ సెక్యూరిటీలో సామర్థ్యాల పెంపు వంటి విభాగాల్లో డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉంది. దేశంలో భారీగా విస్తరిస్తున్న రంగాల్లో ఈ–కామర్స్ ఒకటి. వృద్ధి చెందుతున్న మార్కెట్, ఇంటర్నెట్ సదుపాయాల విస్తరణ, స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరగడం, కోవిడ్ సవాళ్ల నేపథ్యంలో వినియోగదారు ప్రాధాన్యతల్లో మార్పు వంటి అంశాలు ఈ–కామర్స్ పురోగతికి దోహదపడుతున్నాయి. డిజిటల్ రంగం పురోగగతికి కేంద్రం డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్–అప్ ఇండియా, స్కిల్ ఇండియా, ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటు వంటి ఎన్నో చర్యలను తీసుకుని వచి్చంది. దేశంలో పురోగమిస్తున్న రంగాల్లో ఔషధ విభాగం ఒకటి. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ అభివృద్ధి ద్వారా భారత్ ఈ విషయంలో తన సత్తా చాటింది. ఇంకా గవర్నర్ ఏమన్నారంటే... è గ్లోబల్ వ్యాల్యూ చైన్‌లో భారత్ వాటా గణనీయంగా పెరుగుతోంది. ఇది దేశీయ లఘు, మధ్య చిన్న తరహా పరిశ్రమలకు లాభించే అంశం. è ఎగుమతుల రంగం పురోగమిస్తోంది. 2030 నాటికి బారత్ ఇంజనీరింగ్ ఎగుమతుల లక్ష్యం 200 బిలియన్ డాలర్లు. దీని లక్ష్య సాధనకు కృషి జరగాలి. è దేశంలో ఎకానమీ పురోగతిలో బ్యాంకింగ్ పాత్ర కీలకం. ఇటీవల కాలంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలూ ఈ విషయంలో పురోగమిస్తున్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. -
ఆర్బీఐ ఆదేశాలు వెంటనే అమలు చేయండి
ముంబై: మహమ్మారి కరోనా విసురుతున్న సవాళ్లను ఎదుర్కొనడంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల ప్రకటించిన చర్యలను వేగవంతంగా అమలు చేయాలని గవర్నర్ శక్తికాంత దాస్ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎండీలు, సీఈఓలను బుధవారం ఆదేశించారు. అలాగే ఒడిదుడుకులను తట్టుకునేలా బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ల పటిష్టతపైనా దృష్టి సారించాలని వీడియో కాన్ఫరెన్స్‌లో పిలుపునిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆర్బీఐ ఇందుకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా సవాళ్లు, రుణ లభ్యతపై చర్చ ప్రకటన ప్రకారం, దేశ ప్రస్తుత ద్రవ్య– ఆర్థిక పరిస్థితులు, చిన్న రుణ గ్రహీతలు అలాగే లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)సహా వివిధ రంగాలకు రుణ లభ్యత, కోవిడ్ రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్ వంటి అంశాలు వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చకు వచ్చాయి. ద్రవ్య పరపతి విధాన నిర్ణయ ఫలాల బదలాయింపు, కోవిడ్ సవాళ్లను ఎదుర్కొనడానికి ఆర్బీఐ తీసుకున్న విధాన నిర్ణయాల అమలుపైనా చర్చ జరిగింది. ప్రస్తుత ఆరోగ్య సంక్షోభ పరిస్థితుల్లో బ్యాంకులు పోషిస్తున్న క్రియాశీల పాత్రను తన ప్రారంభోపన్యాసంలో గవర్నర్ ప్రశంసించారు. డిప్యూటీ గవర్నర్లు ఎంకే జైన్, ఎం రాజేశ్వరరావు, మైఖేల్ డీ పాత్ర, టీ రవి శంకర్ తదితర సీనియర్ ఆర్బీఐ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కరోనా కష్టకాలాన్ని ఎదుర్కొనే క్రమంలో మే నెల మొదటి వారంలో ఆర్బీఐ పలు చర్యలను ప్రకటించిన నేపథ్యంలో తాజా సమావేశం జరిగింది. వ్యక్తులు, చిన్న సంస్థలకు రుణాల పునరుద్ధరణ, రుణ పునర్వ్యవస్థీకరణ, వైద్య, ఆరోగ్య రంగానికి రూ.50,000 కోట్లు, టీకాల తయారీ, ఆస్పత్రులు, ల్యాబ్‌లకు రుణాలు, రాష్ట్రాల ఓవర్‌డ్రాఫ్ట్ నిబంధనలు సరళతరం, రూ.35వేల కోట్లతో జీ–సెక్‌ల కొనుగోలు వంటి పలు చర్యలు వీటిలో ఉన్నాయి. -
‘సెకండ్ వేవ్’తో వృద్ధికి సమస్య లేదు!
ముంబై: భారత్‌ను ప్రస్తుతం భయాందోళనలకు గురిచేస్తున్న కరోనా ‘సెకండ్ వేవ్’ వల్ల ఆర్థిక వృద్ధి రికవరీ బాటకు ఎటువంటి ఢోకా ఉండబోదన్న విశ్వాసాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం వ్యక్తంచేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2021–22) భారత్ 10.5 శాతం వృద్ధిని సాధిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆర్బీఐ గత నెల అంచనాలను తగ్గించాల్సి వస్తుందని తాను భావించడం లేదని అన్నారు. కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళనకరమైన అంశమే అయినప్పటికీ, దేశ వ్యాప్త లాక్డౌన్ల పరిస్థితి మళ్లీ తలెత్తుతుందని భావించనక్కర్లేదని అన్నారు. ఒక మీడియా గ్రూప్ ఏర్పాటు చేసిన ఎకనమిక్ సదస్సునుద్దేశించి చేసిన ప్రసంగంలో శక్తికాంతదాస్ బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ నుంచి బ్యాంకింగ్ రంగంలో సంస్కరణల వరకూ పలు అంశాలపై మాట్లాడారు. ఆయనేమన్నారంటే... బాండ్ ఈల్డ్స్‌పై రుణ సమీకరణ ఎఫెక్ట్ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారీ రుణ సమీకరణ ప్రణాళిక బాండ్ ఈల్డ్స్ (వడ్డీ) పెరుగుదలకు ప్రధాన కారణం. ఈ కారణంగానే 2020–21 ఆర్థిక సంవత్సరం చివరి దఫా రూ.20,000 కోట్ల బెంచ్‌మార్క్ బాండ్ వేలాన్ని ఈ నెల 22వ తేదీన కేంద్రం రద్దు చేసింది. ఆర్బీఐ–బాండ్ మార్కెట్ మధ్య ఎలాంటి ఘర్షణాత్మక పరిస్థితి లేదు. క్రిప్టోకరెన్సీలపై ఆందోళన బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలపై ఆర్బీఐ ఆందోళన చెందుతోంది. ఇదే విషయాన్ని కేంద్రానికీ తెలియజేసింది. క్రిప్టోకరెన్సీలపై ఆర్బీఐ–ప్రభుత్వం మధ్య వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయని భావించడంలేదు. ఫైనాన్షియల్ స్థిరత్వ పటిష్టతకు ప్రభుత్వం, ఆర్బీఐ కట్టుబడి ఉన్నాయి. క్రిప్టోకరెన్సీపై ప్రభుత్వం, సెంట్రల్ బ్యాంక్ త్వరలో ఒక నిర్ణయానికి వస్తాయి. బ్యాంకుల ప్రైవేటీకరణపై కేంద్రంతో చర్చలు మరిన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ యత్నాల విషయంలో ఆర్బీఐ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. ఈ ప్రక్రియ కొనసాగుతుంది. బ్యాంకింగ్ పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇందుకు పటిష్ట మూలధనం అవసరం. నైతిక విలువలతో కూడిన పాలనా వ్యవస్థలు ఉండాలి. నాలుగు కేటగిరీల్లో వచ్చే దశాబ్ద కాలంలో విభిన్న బ్యాంకింగ్‌రంగాన్ని భారత్ చూడబోతోంది. పోటీతత్వం, సామర్థ్యం వంటి అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది. భవిష్యత్ నాలుగు రకాల బ్యాంకులను చూస్తే... మొదటిగా పెద్ద బ్యాంకులు దేశీయంగా, అంతర్జాతీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తాయి. రెండవది... మధ్య తరహా బ్యాంకులు దేశ వ్యాప్తంగా ఆర్థి క సేవలు అందిస్తాయి. మూడవ బ్యాంకింగ్ విభాగంలో చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు చిన్న రుణ గ్రహీతల అవసరాలను నెరవేర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక నాల్గవ రకం బ్యాంకింగ్‌లో డిజిటల్ ప్లేయర్స్ ఉంటాయి. ప్రత్యక్షంగాకానీ, బ్యాంకుల ద్వారాకానీ, ఏజెంట్లు, సంఘాల ద్వారాకానీ కస్టమర్‌కు ఇవి సేవలను అందిస్తాయి. సామర్థ్యం, పోటీతత్వం ప్రధాన అంశాలుగా బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు పేమెంట్ బ్యాంకులకు లైసెన్సింగ్ విధానం తీసుకురావడం ఒక కీలకమైన అడుగు. -
పెట్రో సెగతో ధరల మంట!
ముంబై: పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో పన్ను తగ్గింపునకు కేంద్ర, రాష్ట్రాల సమన్వయ చర్య అవసరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ గురువారం పేర్కొన్నారు. తగ్గింపు విషయంలో ఆచితూచి నిర్ణయాలు అవసరమని అన్నారు. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలకు ఆదాయ పరమైన ఒత్తిడులు ఉన్న విషయాన్నీ ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కోవిడ్–19 ప్రేరిత సవాళ్లను ఎదుర్కొనడంసహా, పలు అభివృద్ధి కార్యకలాపాలకు ప్రభుత్వాలు భారీ వ్యయాలు చేయాల్సిన తక్షణ అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. బొంబాయి చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ‘‘ప్రభుత్వాల రెవెన్యూ ఇబ్బందులు ఒత్తిడులను పూర్తిగా అర్థం చేసుకోవాల్సిందే. అయితే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ద్రవ్యోల్బణం పెరుగుదలకు కూడా దారితీస్తుంది. ప్రత్యేకించి ఉత్పత్తి రంగంపై ప్రతికూలత చూపుతుంది’’ అని అన్నారు. ఏఆర్‌సీలపై ప్రత్యేక దృష్టి మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్యల గురించి ఆర్బీఐ గవర్నర్ ప్రస్తావిస్తూ, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీల (ఏఆర్‌సీలు) విషయంలో నియంత్రణా యంత్రాంగాన్ని మరింత పటిష్టవంతం చేయడంపై సెంట్రల్ బ్యాంక్ దృష్టి సారిస్తున్నట్లు వివరించారు. ఎన్పీఏల సమస్య పరిష్కారం విషయంలో ఏఆర్‌సీలే కీలకమన్న సంగతిని ఈ సందర్భంగా ప్రస్తావించారు. బ్యాంకింగ్ రంగానికి దన్నుగా మొండి బకాయిల నిర్వహణకు 2021–22 బడ్జెట్లో ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రతిపాదించిన ఆస్తుల (రుణాల) పునర్ నిర్మాణ కంపెనీ(ఏఆర్సీ) ఏర్పాటును ప్రస్తావిస్తూ, ప్రస్తుత అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీల క్రియాశీలతకు ఎటువంటి అంతరాయం కలగని రీతిలోనే ప్రతిపాదిత ఏఆర్సీ ఏర్పాటు ఉంటుందని తెలిపారు. మొండి బకాయిల సమస్యను ఎలా ఎదుర్కొనాలన్న అంశంపై బ్యాంకింగ్‌లో అవగాహన, చైతన్యం పెరుగుతున్నట్లు గవర్నర్ తెలిపారు. బ్యాంకులు ఎన్పీఏలకు సంబంధించి తగిన కేటాయింపులు జరుపుతున్నాయని పేర్కొన్నారు. అలాగే పర్యవేక్షణ విధానాలకు ఆర్బీఐ మరింత పదును పెట్టినట్లు పేర్కొన్నారు. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఎన్పీఏల విషయంలో బ్యాంకింగ్ అంతర్గత అంశాలనూ ఆర్బీఐ పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. లిక్విడిటీ చర్యల వల్ల ఇబ్బంది లేదు అసెట్ పర్చేజింగ్సహా వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పెంపునకు తీసుకుంటున్న చర్యలు ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్‌పై ప్రతికూల ప్రభావం చూపు తుందన్న అంచనాలు సరికాదన్నారు. ఇటువంటి ఇబ్బంది ఏదీ తలెత్తబోదని ఆయన స్పష్టంచేస్తూ, సెంట్రల్ బ్యాంకింగ్ మౌలిక సూత్రాల విషయంలో రాజీ ఉండబోదని అన్నారు. ఎటువంటి రిస్క్ సమస్యలు లేని సావరిన్ (ప్రభుత్వ) బాండ్ల కొనుగోలుకు మాత్రమే సెంట్రల్ బ్యాంక్ ‘అసెట్ పర్చేజ్’ కార్యక్రమం పరిమితమవుతుందని స్పష్టం చేశారు. డిజిటల్ కరెన్సీపై త్వరలో మార్గదర్శకాలు డిజిటల్ (క్రిప్టో) కరెన్సీకి సంబంధించి పలు అంశాల్లో ఆర్బీఐలో అంతర్గతంగా పటిష్ట మదింపు జరుగుతోందని అన్నారు. త్వరలో ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను, ప్రతిపాదిత పత్రాలను సెంట్రల్ బ్యాంక్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. క్రిప్టో కరెన్సీ గురించి శక్తికాంతదాస్ మాట్లాడుతూ, ఆర్బీఐకి ఈ అంశంపై పలు ఆందోళనలు ఉన్నాయన్నారు. ఆయా అంశాలను కేంద్రంతో చర్చించినట్లు వెల్లడించారు. ఎగుమతులు పెంచాలి... దేశ ఎగుమతుల పెంపుపై ప్రత్యేక దృష్టి అవసరమని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. అలాగే వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను (ఎఫ్‌టీఏ) వ్యూహాత్మక ప్రాముఖ్యతనూ ప్రస్తావించారు. దేశీయంగా పటిష్టతేకాకుండా, అంతర్జాతీయంగా అవకాశాలను అందిపుచ్చుకోడానికి కూడా ఎఫ్‌టీఏలు దోహదపడతాయని అన్నారు. బ్రెగ్జిట్ అనంతర పరిస్థితుల నేపథ్యలో బ్రిటన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లతో వేర్వేరు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల బహుళవిధ ప్రయోజనాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. -
‘మొండి’ భారం రెట్టింపు!
ముంబై: కోవిడ్–19 ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో భారత్ బ్యాంకింగ్‌పై మొండిబకాయిల (ఎన్పీఏ) భారం తీవ్రతరం కానుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైవార్షిక ద్రవ్య స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) పేర్కొంది. ఎన్పీఏలకు సంబంధించి కనిష్ట ప్రభావం మేరకు చేసినా, మొత్తం రుణాల్లో మొండిబకాయిల భారం సెప్టెంబర్ నాటికి 13.5 శాతానికి చేరుతుందని సోమవారం నాడు వెలువడిన నివేదిక పేర్కొంది. ప్రభావం తీవ్రంగా ఉంటే ఏకంగా ఇది 14.8 శాతానికి ఎగసే అవకాశం ఉందని తెలిపింది. ఇదే జరిగితే గడచిన 25 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత తీవ్ర మొండిబకాయిల భారం బ్యాంకింగ్‌పై ఉంటుంది. 2020 సెప్టెంబర్ నాటికి బ్యాంకింగ్‌పై ఎన్పీఏ భారం 7.5 శాతం. అప్పటి నుంచీ చూస్తే, కనీసమయినా ఎన్పీఏలు 600 బేసిస్ పాయింట్లు (6 శాతం) అయినా పెరుగుతుందన్నమాట. నివేదిక ప్రకారం... ► ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మొండిబకాయిలు 2021 సెప్టెంబర్ నాటికి కనీస స్థాయిలో 9.7– 16.2% శ్రేణిలో ఉండే వీలుంది. ప్రైవేటు బ్యాంకింగ్ విషయంలో ఈ శ్రేణి 4.6–7.9% శ్రేణిలో ఉండవచ్చు. ఫారిన్ బ్యాంకుల విషయంలో ఈ శ్రేణి 2.5–5.4% శ్రేణిలో ఉండే వీలుంది. ► ఇక తీవ్ర స్థాయిల్లో పీఎస్బీ, ప్రైవేట్, ఫారిన్ బ్యాంకుల విషయంలో ఎన్పీఏలు వరుసగా 17.6 శాతం, 8.8 శాతం, 6.5 శాతం శ్రేణిలో ఉండే అవకాశం ఉంది. మరింత స్పష్టత అవసరం! ఎన్పీఏల విషయలో నిజానికి మరింత స్పష్టత రావాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ క్షీణతలోకి జారిపోవడం, ఉపాధి అవకాశాలు కోల్పోవడం, రుణాలు తీర్చడంలో ఆలస్యం లేదా మొత్తంగా విఫలంకావడం వంటి ఎన్నో అంశాలు దీనికి కారణంగా ఉన్నాయి. ఈఎంఐల చెల్లింపులపై మారటోరియం, అసెట్ వర్గీకరణలో యథాతథ స్థితి, రుణ పునర్ వ్యవస్థీకరణ, తాజా రుణాల పరిస్థితి, కొన్ని అకౌంట్లను మొండిబకాయిలుగా ప్రకటించవద్దంటూ అక్టోబర్ 3న సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల వంటి ఎన్నో అంశాలూ మొండిబకాయిలపై ఇంకా స్పష్టత లేకుండా చేస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ పరిస్థితి, రుణాలు ఎన్పీఏలుగా మారే అకాశాలు, లాభదాయకత, మూలధనం సహా బ్యాంకులు సమర్పించిన తత్సబంధ గణాంకాల ప్రాతిపదికన తాజా ‘స్ట్రెస్ టెస్ట్’ అంచనాలను వెలువరిస్తున్నట్లు నివేదిక తెలిపింది. 1996–1997లో బ్యాంకింగ్‌పై ఎన్పీఏ భారం 15.7%. గడచిన ఏడాది జూలైలో ఆర్బీఐ ఎఫ్ఎస్ఆర్ను ఆవిష్కరించింది. 2021 మార్చి నాటికి ఎన్పీఏలు 12.5 –14.7% శ్రేణిలో ఉంటాయని అప్పట్లో నివేదిక పేర్కొంది. వ్యవస్థలోకి రూ.2లక్షల కోట్లు... బ్యాంకింగ్‌లో మరింత ద్రవ్య లభ్యతకు (లిక్విడిటీ) వీలు కల్పిస్తూ రెపో చర్యలకు ఆర్బీఐ శ్రీకారం చుడుతోంది. రానున్న పక్షం రోజుల్లో రూ. 2 లక్షల కోట్ల రివర్స్ రెపో లావాదేవీల ద్వారా రూ.2 లక్షల కోట్లను బ్యాంకింగ్ వ్యవస్థలోకి విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. బ్యాంకింగ్ వ్యాపార నమూనా మారాలి... నియంత్రణాపరంగా ఇచ్చిన వెసులుబాటును వెనక్కు తీసుకుంటే, ఇది బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్లపై అలాగే మూలధనంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. తగిన లిక్విడిటీ, ఫైనాన్షియల్ పరిస్థితులు బ్యాంకుల ద్రవ్య ప్రమాణాలను ప్రస్తుతం నిలబెడుతున్నాయి. అయితే గణాంకాలనులోతుగా విశ్లేషిస్తే, ఒత్తిడి తీవ్రను గుర్తించవచ్చు. మూలధనాన్ని పెంచుకోడానికి ప్రస్తుత పరిస్థితులను బ్యాంకులు అనుకూలంగా మలచుకోవాలి. అలాగే తమ వ్యాపార నమూనాలను మార్చుకోవాలి. ఈ చర్యలు భవిష్యత్ భద్రతకు భరోసాను అందిస్తాయి. కేంద్రం ఆదాయాలు తగ్గుతుండడం, మార్కెట్ నుంచి మరిన్ని రుణ సమీకరణకు (2020–21లో రూ.7 లక్షల కోట్ల రుణ సమీకరణ బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకోగా దానిని రూ.12 లక్షల కోట్లకు సవరించడం జరిగింది) ప్రభుత్వం ఇష్టపడకపోవడం వంటి అంశాలు బ్యాంకులపై భవిష్యత్తులో మూలధన సంబంధ ఒత్తిడులను పెంచే అవకాశం ఉంది. ఫైనాన్షియల్ అసెట్స్‌లో విలువల అసమతౌల్యతలు ఫైనాన్షియల్ స్థిరత్వానికి ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది. ఆయా పరిస్థితులన్నింటినీ గమనంలోకి తీసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా తట్టుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి. – ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ‘నివేదికలో ముందుమాట’ -
సరళతర విధానాలను వెనక్కుతీసుకోలేం!
ముంబై: కరోనా మహమ్మారి సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి గడచిన తొమ్మిది నెలలుగా తీసుకున్న లిక్విడిటీ (వ్యవస్థలో ద్రవ్య లభ్యత) తదితర సరళతర ద్రవ్య విధానాలను ఇప్పుడే వెనక్కు తీసుకోలేమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత్‌దాస్ స్పష్టం చేశారు. ఇటువంటి నిర్ణయాల వల్ల ఎటువంటి ఫలితం లభించకపోగా, ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న రికవరీ, వృద్ధి ధోరణులకు విఘాతం కలుగుతుందని ఆయన అన్నారు. డిసెంబర్ 2వ తేదీ నుంచి 4వ తేదీవరకూ మూడు రోజుల పాటు జరిగిన ఆర్బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) కీలక సమావేశాల మినిట్స్ శుక్రవారం విడుదలయ్యాయి. దీనిప్రకారం, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం) తగ్గించనప్పటికీ, వృద్ధికి దోహపడే అన్ని చర్యలనూ తీసుకోవాలని సమావేశం అభిప్రాయపడింది. క్యూ3, క్యూ4 కాలాల్లో ద్రవ్యోల్బణం వరుసగా 6.8 శాతం, 5.8 శాతానికి దిగివస్తుందని అంచనావేసింది. ఈ అంచనాల నేపథ్యంలో సరళతర వడ్డీరేట్ల విధానమే కొనసాగించడం జరుగుతుందని స్పష్టం చేసింది. రెపో రేటు తగ్గించడం కష్టమే: నోమురా కాగా, కీలక రెపో రేటు 2021లోనూ తగ్గించడం కష్టమని జపాన్ బ్రోకరేజ్ దిగ్గజం– నోమురా శుక్రవారంనాటి తన తాజా నివేదికలో అభిప్రాయపడింది. ద్రవ్యోల్బణం ఇప్పటికీ తీవ్రంగా ఉందని పేర్కొన్న నోమురా, ఇదే తీవ్రత కొనసాగే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. పైగా ద్రవ్యోల్బణం సమీప కాలంలో పెరిగే అవకాశాలూ లేకపోలేదని విశ్లేషించింది. ఇదే జరిగితే, 2022లో వడ్డీరేట్ల పెంపునకే ఆర్బీఐ పాలసీ కమిటీ మొగ్గుచూపే అవకాశం ఉందని అభిప్రాయపడింది. అక్టోబర్‌లో 7.6 శాతం ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 6.93 శాతానికి తగ్గింది. అయితే ఇది కూడా ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న స్థాయి కన్నా అధికం కావడం గమనార్హం. దీనిప్రకారం ద్రవ్యోల్బణం 2–6 శాతం మధ్య ఉండాలి. పీఎమ్‌సీ బ్యాంకులో పెట్టుబడులకు నాలుగు ఆఫర్లు పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకు (పీఎమ్‌సీ బ్యాంకు)లో పెట్టుబడులు పెట్టేందుకు నాలుగు సంస్థల నుంచి ప్రతిపాదనలు వచ్చినట్టు ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. బ్యాంకుపై విధించిన ఆంక్షలను మార్చి 31 వరకు పొడిగించింది. బహుళ రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పీఎమ్‌సీ బ్యాంకులో 2019 సెప్టెంబర్‌లో స్కామ్ వెలుగులోకి రావడంతో ఆర్బీఐ పలు ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. బ్యాంకు పునర్నిర్మాణానికి అవసరమైన పెట్టుబడులను అందించేందుకు ఆసక్తి వ్యక్తీకరణలను గత నెలలో ఆహ్వానించగా.. నాలుగు ప్రతిపాదనలు వచ్చాయని, వాటిని పరిశీలిస్తున్నట్టు ఆర్బీఐకి పీఎమ్‌సీ బ్యాంకు సమాచారం ఇచ్చినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఆర్థిక పరిస్థితిని సమీక్షించిన ఆర్బీఐ బోర్డ్ ఆర్బీఐ 586వ సెంట్రల్ బోర్డ్ సమావేశం శుక్రవారం నాడు ముంబైలో జరిగింది. మహమ్మారి ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లు, భారత్‌పై దీని ప్రభావం, ఆర్థిక వ్యవస్థపై ఉద్దీపన, ద్రవ్య పరపతి విధాన చర్యల ఫలితాలపై గవర్నర్ నేతృత్వంలోని జరిగిన ఈ సమావేశం దృష్టి సారించింది. 2019–20లో భారత్ బ్యాంకింగ్ ధోరణి, పురోగతిపై ఒక ముసాయిదా నివేదికను కూడా చర్చించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్, ఆర్థిక సేవల కార్యదర్శి దేబాషిస్ పాండా, డిప్యూటీ గవర్నర్లతోపాటు బోర్డ్ డైరెక్టర్లు, సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
అంచనాలకు మించి రికవరీ
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ రికవరీ తొలి అంచనాలకన్నా పటిష్టంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. అయితే కరోనా కేసుల పెరుగుదలే వృద్ధికి ప్రతికూలమనీ ఆయన అన్నారు. రెండవ త్రైమాసిక (జూలై–సెప్టెంబర్) గణాంకాలు . శుక్రవారం (27వ తేదీ) వెలువడుతుండడం, క్యూ2లో క్షీణ రేటు ‘సింగిల్’ డిజిట్‌లోనే (10 శాతంలోపే) ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో గవర్నర్ తాజా వ్యాఖ్యలు చేశారు. కరోనా ప్రేరిత సమస్యలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 23.9 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. విదేశీ మారకానికి సంబంధించి భారత్ డీలర్ల సంఘం (ఎఫ్ఈడీఏఐ) వార్షిక దినోత్సవం సందర్భంగా గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే... ► వృద్ధి రికవరీకి సంబంధించి.. పండుగ సీజన్ అనంతరం డిమాండ్ కొనసాగడం, పెరుగుతున్న కరోనా కేసులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వ్యాక్సిన్ అందుబాటు విషయంలో మార్కెట్ పునఃమదింపు ఎలా ఉంటుం దన్నదీ పరిశీలించాల్సిన ముఖ్యాంశాల్లో ఒకటి. ► తొలి త్రైమాసికంలో భారీ క్షీణత అనంతరం, క్యూ2లో ఆర్థిక క్రియాశీలత ఊహించినదానికన్నా వేగంగా ఉంది. రికవరీలో పటిష్టత నమోదైంది. ► గత కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం లక్ష్యాలను మించి (ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4 శాతం వద్ద రిటైల్ ద్రవ్యోల్బణం ఉండాలన్నది ఆర్బీఐకి కేంద్రం నిర్దేశం) ఉంటోందన్న ఆందోళనలు ఉన్నాయి. ఈ అంశాన్ని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) జాగ్రత్తగా పరిశీలించి రేటు కోతకు సంబంధించి తగిన నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రస్తుత ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు తాత్కాలికమైనవనీ, ధరల తీవ్రత క్రమంగా తగ్గుతుందని అక్టోబర్ పరపతి సమీక్ష అభిప్రాయపడింది. అందువల్ల ఆర్థిక వ్యవస్థ, రేట్ల కోత అంశాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సరళతర విధానాన్నే పాటించాలనీ నిర్దేశించుకుంది. ► తగిన స్థాయిలో విదేశీ మారకద్రవ్య నిల్వలు ఉండడం భారత్‌కు ప్రస్తుతం కలిసి వస్తున్న అంశం. నవంబర్ 13 నాటికి భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు 572.7 బిలియన్ డాలర్లకు చేరాయి. ఏడాది దిగుమతులకు ఇవి సరిపోతాయి. ► 2020 తరహా సంవత్సరాన్ని మనం ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ అవకాశాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. యూరోప్‌లోని కొన్ని అభివృద్ధి చెందిన దేశాలూ ఈ సమస్యను ఎదుర్కొం టున్నాయి. ప్రపంచ వృద్ధికి ప్రతికూలాంశమిది. ► మార్కెట్లపై మహమ్మారి పలు విధాలుగా ప్రతికూల ప్రభావాలు చూపింది. ఆర్థిక మందగమనం, ద్రవ్య లభ్యత, కమర్షియల్ పేపర్, కార్పొరేట్ బాండ్ మార్కెట్ క్షీణత, రూపాయి విలువ వంటి ఎన్నో అంశాల్లో ప్రతికూలతలు ఏర్పాడ్డాయి. -
రూపాయికి ‘శక్తికాంత్’ బలం
ముంబై: కరోనా నేపథ్యంలో ఏర్పడిన తీవ్ర ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనడంలో తమ వద్ద ఉన్న అస్త్రాలు అయిపోలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ చేసిన ప్రకటన భారత కరెన్సీ– రూపాయికి బలాన్ని ఇచ్చింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ ఒకేరోజు 48 పైసలు బలపడింది. 73.82 వద్ద ముగిసింది. దేశంలోకి కొనసాగుతున్న విదేశీ నిధుల ప్రవాహం, దేశీయ సానుకూల ఈక్విటీ మార్కెట్, ఆరు కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్ బలహీనత వంటి అంశాలూ రూపాయి సెంటిమెంట్‌ను బలపరిచాయని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. 74.30 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. 73.81–74.36 శ్రేణిలో కదలాడింది. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). -
అందరివాడు... దాస్
న్యూఢిల్లీ: దేశీ బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా శక్తికాంత దాస్ బాధ్యతలు చేపట్టి సంవత్సరమవుతోంది. గతేడాది డిసెంబర్ 12న ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ అర్ధంతరంగా నిష్క్రమించిన తర్వాత అనూహ్యంగా ఆ స్థానంలో దాస్ నియమితులయ్యారు. బ్యూరోక్రాట్ స్థాయి నుంచి స్వతంత్ర ప్రతిపత్తి గల ఆర్బీఐ 25వ గవర్నర్‌గా ఎదిగారాయన. 1980 బ్యాచ్ తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారి అయిన దాస్.. గతంలో కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సహా పలు హోదాల్లో సేవలు అందించారు. అందరినీ కలుపుకుపోవడం, అందరూ తమ అభిప్రాయాలు తెలిపేందుకు అవకాశమివ్వడం .. దాస్ స్టయిల్ అంటారు ఆయన్ను గురించి తెలిసినవారు. ప్రభుత్వానికి నిధుల బదిలీ, మొండిబాకీల పరిష్కారానికి కొత్త విధానం ప్రవేశపెట్టడం మొదలుకుని వరుసగా పలు దఫాలు కీలక రేట్లను తగ్గించడం దాకా ఈ ఏడాది కాలంలో ఆర్బీఐ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. బ్యాంకింగ్ రంగంలో సంక్షోభాలు, మందగిస్తున్న ఆర్థిక వృద్ధి తదితర సవాళ్ల మధ్య దాస్ సారథ్యంలో ఆర్బీఐ పనితీరును ఒకసారి సింహావలోకనం చేస్తే .. ► ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే క్రమంలో ఆర్బీఐ 2019 ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా అయిదు విడతల్లో 135 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించింది. ఆగస్టులో అసాధారణంగా 35 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అయితే, కచ్చితంగా మరో విడత రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలను తల్లకిందులు చేస్తూ నవంబర్‌లో నిర్ణయం తీసుకోవడం అందర్నీ విస్మయపర్చింది. ► స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి అంచనాలను కూడా మొత్తం మీద 240 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ► ఆర్బీఐ వద్ద ఎంత మేర నిధులు ఉండాలన్న వివాదాస్పద చర్చకు ముగింపునిచ్చి, కేంద్రానికి రూ. 1,76,051 కోట్ల మేర మిగులు నిధులను రిజర్వ్ బ్యాంక్ బదలాయించింది. ► చిన్న, మధ్యతరహా సంస్థలకు ఊరటనిస్తూ వన్ టైమ్ రుణ పునర్వ్యవస్థీకరణ వెసులుబాటు కల్పించింది. ► సత్వర దిద్దుబాటు చర్యలకు (పీసీఏ) సంబంధించిన ఆంక్షలు ఎదుర్కొంటున్న 11 బ్యాంకుల్లో నుంచి మూడు బ్యాంకులను (బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్) బైటికి తెచ్చింది. ► సంస్కరణలపరంగా చూస్తే.. ద్రవ్య పరపతి విధానాల ప్రయోజనాలు సత్వరం బదిలీ అయ్యేలా... బ్యాంకులు రుణాలకు సంబంధించి రెపో ఆధారిత ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ విధానానికి మళ్లేలా దాస్ కృషి చేశారు. ► రోజంతా చెల్లింపుల వ్యవస్థలు పనిచేసేలా చూసేందుకు నెఫ్ట్ సదుపాయం 24 గంటలూ అందుబాటులో ఉండేలా ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఇది 2020 జనవరి నుంచి అమల్లోకి వస్తోంది. ఆర్బీఐదే తుది నిర్ణయం.. ఆర్బీఐ, ప్రభుత్వం మధ్య చాలా విషయాలపై విస్తృతంగా చర్చలు జరుగుతాయి. కానీ, అంతిమంగా నిర్ణయం తీసుకునేది రిజర్వ్ బ్యాంకే. నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్బీఐకి 100 శాతం పైగా స్వయం ప్రతిపత్తి ఉంది. ఇందులో ఎవరి జోక్యం ఉండదు. – శక్తికాంత దాస్, గవర్నర్, ఆర్బీఐ అందర్నీ ఒకే తాటిపైకి తెచ్చారు నిబద్ధత, పారదర్శకత, నిజాయితీ గల వ్యక్తి శక్తికాంత దాస్. ప్రభుత్వాన్ని, వ్యవస్థను ఒకే తాటిపైకి తేవడంలోనూ, బోర్డును సమగ్రంగా తీర్చిదిద్దడంలోను అన్ని విధాలా సఫలీకృతమయ్యారు. – సచిన్ చతుర్వేది, ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సభ్యుడు -
పరిశ్రమలపై ఆర్బీఐ గవర్నర్ దృష్టి
ముంబై: దేశ స్థూల ఆర్థిక పరిస్థితులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ మరింత దృష్టి సారిస్తున్నారు. ఆర్థికాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన గురువారం పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ట్వీట్లో దాస్ ఈ వివరాలను వెల్లడించారు. నవంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి కేవలం అరశాతంగా నమోదయిన నేపథ్యంలో గవర్నర్ పారిశ్రామిక బృందాలతో భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. డిసెంబర్ రిటైల్ (2.19%), టోకు ధరలు (3.80%) తగ్గిన పరిస్థితుల్లో ఆర్బీఐ రెపో రేటును (ప్రస్తుతం 6.5%) తగ్గించాలని ఇప్పటికే పారిశ్రామిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. పాలసీ విధానాలు, తీసుకునే నిర్ణయాల విషయంలో ఆర్బీఐ తమ వాదనలకు ప్రాధాన్యమివ్వడం లేదని కూడా పలు సందర్భాల్లో పారిశ్రామిక ప్రతినిధుల నుంచి విమర్శ వస్తోంది. కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ద్రవ్య పరపతి విధాన కమిటీ ఫిబ్రవరి 7వ తేదీన ద్వైమాసిన ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించనున్న సంగతి తెలిసిందే. వరుస సమావేశాలు... ఆర్బీఐ గవర్నర్‌గా డిసెంబర్ 12న బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండుసార్లు ప్రభుత్వ బ్యాంకర్లతో, ఒకసారి ప్రైవేటు బ్యాంకర్లతో ఆర్బీఐ గవర్నర్ సమావేశమయ్యారు. లిక్విడిటీ (ద్రవ్యలభ్యత), చిన్న పరిశ్రమలకు రుణ లభ్యతసహా దిద్దుబాటు చర్యల పరిధిలో (పీసీఏ) ఉన్న 11 బ్యాంకులపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అటు తర్వాత లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ), నాన్– బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులతో కూడా భేటీ అయ్యారు. ఎంఎస్ఎంఈ ప్రతినిధులతో సమావేశం అనంతరం ఈ రంగం అభివృద్ధిపై సలహాలకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మాజీ చైర్మన్ యూకే సిన్హా నేతృత్వంలో ఆరుగురు సభ్యుల నిపుణుల కమిటీనీ ఏర్పాటు చేయడం గమనార్హం. ఎంఎస్ఎంఈలకు సంబంధించి రూ.25 కోట్ల వరకూ రుణం ఉండి, చెల్లించలేకపోతున్న రుణాన్ని, ఒకేసారి పునర్వ్యవస్థీకరించడానికి కూడా ఆర్బీఐ అనుమతించింది. -
రిజర్వ్ బ్యాంకుకే ‘కన్నం’ వేస్తున్నారు!
సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా అస్తవ్యస్తంగా అగమ్యగోచరంగానే ఉంది. కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు. ఖాళీ అవుతున్న ఉద్యోగాలే భర్తీ కావడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టయిన చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. జాతీయ స్థూల ఉత్పత్తిలో (జీడీపీ) ఆర్థిక ద్రవ్యలోటు 3.3 శాతాన్ని మించరాదంటూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఇప్పటికీ అది 3.6 శాతానికి చేరుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అది మరింత పెరిగే ప్రమాదం ఉంది. పరోక్ష పన్నుల వసూళ్లు లక్షిత వసూళ్లకు అంతనంత దూరంలోనే ఉన్నాయి. ఇక జీఎస్టీ వసూళ్లలో లక్ష్యాన్ని అందుకోవాలంటే ఈ డిసెంబర్ నెల నుంచి 2019, మార్చి నెల వరకు 45 శాతం వసూళ్లు జరగాలి. లక్షిత జీఎస్టీ వసూళ్లలో గత ఎనిమిది నెలల్లో జరిగిన వసూళ్లు 55 శాతం అన్నమాట. ఈ నాలుగు నెలల్లో మిగతా 45 శాతం వసూళ్లు చేయడం దాదాపు అసాధ్యం. దేశంలోని 11 భారత ప్రభుత్వరంగ బ్యాంకులు పూర్తిగా దివాలా తీశాయి. వాస్తవానికి వీటిని ఎప్పుడో మూసివేయాలి. కానీ 2017, ఏప్రిల్ ఒకటవ తేదీన తీసుకొచ్చిన ‘ప్రాప్ట్ కరెక్టివ్ ఆక్షన్ (పీఏసీ)’ కింద ఈ బ్యాంకులను నెట్టుకొస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో పేరుకుపోయిన 12 లక్షల కోట్ల రూపాయల మొండి బకాయిల్లో 90 శాతం బకాయిలు ప్రభుత్వరంగ బ్యాంకులవే. ఇప్పటికే కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసినా, నూతన సిబ్బంది నియామకాలను నిలిపివేసినా పరిస్థితి మెరుగుపడలేదు. రుణాల మాఫీ కోసం, సరైన గిట్టుబాటు ధరల కోసం దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేసినప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా రైతుల రుణాల మాఫీకి మోదీ ప్రభుత్వం సాహసించలేకపోయిందంటే దేశ ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా లేదా దారణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే వచ్చే ఏడాది, అంటే 2019, మేలోగా సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పటి వరకు మార్కెట్కుగానీ, వినియోగదారుడికిగానీ నగదు కొరత రాలేదు. దేశ ఆర్థిక పరిస్థితి ఇలాగే ఉంటే సరిగ్గా ఎన్నికల సమయానికి నగదు కొరత పరిస్థితి కూడా వస్తుంది. అందుకనే నరేంద్ర మోదీ ప్రభుత్వం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) రిజర్వ్ నిధుల మీద కన్నేసింది. రిజర్వ్ బ్యాంక్ వద్ద రిజర్వ్ నిధులు 9.6 లక్షల కోట్ల రూపాయలు ఉండగా, ఆపధర్మ నిధి కింద 3.6 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఏ ప్రభుత్వానికి ఇవ్వలేదు దేశంలోని బంగారం, ఫారెక్స్ నిల్వలు పడిపోయినప్పుడల్లా వాటి నిర్దేశిత స్థాయిని కొనసాగించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఈ రిజర్వ్ నిధులను విడుదల చేస్తుంది. ఇక ఆపధర్మ నిధిని అనుకోకుండా భవిష్యత్తులో వచ్చే అవసరాల కోసం వాడాలని ఏర్పాటు చేసుకొంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1949లో రిజర్వ్ బ్యాంకును జాతీయం చేయగా, ఈ ఆపధర్మ నిధిని 1950లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో ఎన్నో ప్రభుత్వాలు మారినా ఏ ప్రభుత్వం కూడా ఆపధర్మ నిధులను అడగలేదు. ఆర్బీఐ ఇవ్వలేదు. ఉర్జిత్ పటేల్‌పై అదే ఒత్తిడి ఆర్బీఐ ఆపధర్మ నిధి నుంచి మూడు లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం గతకొంత కాలం నుంచి మొన్నటివరకు ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న ఉర్జిత్ పటేల్‌పై ఒత్తిడి చేస్తూ వచ్చింది. తమ మాట వినకపోతే ఆర్బీఐ చట్టంలోని ఏడో షెడ్యూల్ కింద ప్రభుత్వం స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వస్తుందని కూడా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఉర్జిత్‌కు హెచ్చరిక కూడా చేశారు. ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని రక్షించడం కోసం గతంలో ఏ ప్రభుత్వం ఈ షెడ్యూల్‌ను ఉపయోగించలేదు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ బోర్డు సభ్యులు రెండు, మూడు సార్లు సమావేశమై ప్రభుత్వ ప్రతిపాదన గురించి చర్చించారు. ప్రభుత్వానికి సానుకూలంగా నిర్ణయం తీసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. కాకపోతే వ్యక్తిగత కారణాలపై రాజీనామా చేస్తున్నానని చెప్పుకున్నారు. మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీ కాలాన్ని పొడిగించకుండా ఉర్జిత్ పటేల్‌ను కోరి తెచ్చుకున్నందుకు ఆయనకు ఆ మాత్రం కృతజ్ఞత ఉండాల్సిందే. కానీ రెండు లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వానికి ఇచ్చేంత కృతజ్ఞత చూపలేకపోయారు. ఓ ఆర్థిక నిపుణుడిగా దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఆయనకు తెలుసు కనుక. కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ ఎవరు? ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో 25వ గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను తీసుకొచ్చారు. ఆయన రఘురామ్ రాజన్, ఉర్జిత్ పటేల్‌లాగా ఆర్థికవేత్త కాదు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్. ప్రస్తుత 15వ ఆర్థిక సంఘంలో సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా ఐఏఎస్ ఆఫీసర్‌ను నియమించడం ఇదే కొత్తకాదు. గతంలో 14 మంది ఐఏఎస్–ఐసీఎస్ ఆఫీసర్లు పనిచేశారు. వారిలో ఎక్కువమంది ఆర్థిక వేత్తలే. 1990లో ఎస్. వెంకటరామన్ తర్వాత చదువురీత్యా ఆర్థిక వేత్తకానీ వ్యక్తిని తీసుకరావడం ఇదే మొదటిసారి. కొత్త గవర్నర్ ప్రభుత్వం మాట వింటారా? అక్షరాలా వింటారు. ఎందుకంటే పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల ఏర్పడిన సంక్షోభంలో ఎప్పటికప్పుడు కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ అడుగడుగున సమర్థిస్తూ వచ్చిందీ ఈ శక్తికాంత దాసే. అయినా ఆయన ఇప్పటికీ పెద్ద నోట్లను రద్దు చేయడం తప్పుకాదంటారు. అసలేం అవుతుంది ? మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఆర్బీఐని దేవురించాల్సిన పరిస్థితి రావడానికి ప్రధాన కారణం పెద్ద నోట్ల రద్దు, ఆ తర్వాత తెచ్చిన జీఎస్టీనే. ఈ విషయాన్ని మోదీ ప్రభుత్వం ఎప్పటికీ అంగీకరించదు. పెద్ద నోట్ల రద్దు సందర్భంగా మోదీ పక్షాన నిలిచిన శక్తికాంత దాస్, ఇప్పుడు కూడా ఆయన పక్షానే నిలిచి సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రెండు, మూడు రోజుల్లోనే ఈ నిర్ణయం వెలువడవచ్చు! ఆ నిర్ణయం వల్ల 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ పార్టీ గట్టెక్కవచ్చు. కానీ ఐదేళ్లకాలంలోనే జింబాబ్వే, అర్జెంటీనా, వెనిజులాలో తలెత్తిన ఆర్థిక, సామాజిక, రాజకీయ సంక్షోభాలు భారత్‌కు కూడా తప్పకపోవచ్చు. ఆ మూడు దేశాల్లో ఆర్థిక వ్యవస్థను సరిదిద్దేందుకు ప్రభుత్వాలు సెంట్రల్ బ్యాంకులను (మన రిజర్వ్ బ్యాంక్‌కు సమానం) స్వాధీనం చేసుకున్న పర్యవసానంగా సామాజిక, రాజకీయ సంక్షోభాలు తలెత్తాయి. -
విద్యా రుణాలకు వెనుకంజ
న్యూఢిల్లీ: విద్యారుణాల మంజూరు విషయంలో చొరవ చూపాలంటూ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. బ్యాంకులు మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. మొండి బకాయిలు పెరిగిపోతుండటంతో రుణాలివ్వడాన్ని తగ్గించుకుంటున్నాయి. గతేడాది విద్యా రుణాలివ్వడంలో 14 శాతం వృద్ధి ఉండగా.. ఈసారికి ఇది 9 శాతానికి తగ్గిపోవడం దీనికి నిదర్శనం. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం.. జూన్ 30 నాటికి బ్యాంకులు విడుదల చేసిన విద్యారుణాలు రూ. 55,500 కోట్ల మేర ఉన్నాయి. క్రితం సంవత్సరంతో పోలిస్తే ఈ పెరుగుదల 9 శాతం మాత్రమే. అయితే, గ తేడాది జూన్ నాటికి విద్యారుణాలు వార్షిక ప్రాతిపదికన 14 శాతం మేర పెరగడం గమనార్హం. విద్యారుణాలు విడుదల చేయడంలో బ్యాంకుల వెనుకంజను ఇది తెలియజేస్తోంది. ఎడ్యుకేషనల్ లోన్లకు సంబంధించి రుణ హామీ ఫండ్‌ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. ఇది ఇంతవరకూ సాకారం కాలేదని బ్యాంకర్లు అంటున్నారు. ఇదిగానీ ఏర్పాటైతే.. దాదాపు రూ. 7.5 లక్షల దాకా తనఖా లేకుండా రుణాలు ఇవ్వడం సాధ్యపడుతుంది. విద్యా రుణాలకు డిమాండ్.. బ్యాంకులు ప్రస్తుతం ఎక్కువగా మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులకు రుణాలిస్తున్నాయి. కోర్సును బట్టి వడ్డీ రేటు 11.5 శాతం నుంచి 13 శాతం దాకా ఉంటోంది. మధ్యతరగతికి చెందిన విద్యార్థులు ఉన్నత విద్య, విదేశీ చదువులపై మరింతగా ఆసక్తి కనపరుస్తుండటంతో విద్యా రుణాలకు డిమాండ్ భారీగానే ఉంటోంది. గత పదేళ్ల వ్యవధిలో విద్యా రుణాలు గణనీయంగా పెరిగాయి. 2003లో బ్యాంకులు రూ. 2,870 కోట్ల మేర ఎడ్యుకేషన్ లోన్లు ఇవ్వగా.. ప్రస్తుతం ఇది అనేక రెట్లు పెరిగిపోయింది. అవాన్సీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ అంచనాల ప్రకారం .. భారత్‌లో ఏటా దాదాపు రూ. 80,000 కోట్ల మేర విద్యారుణాలు అవసరం అవుతుండగా .. అందులో సుమారు రూ. 60,000 కోట్లు మాత్రమే విడుదలవుతున్నాయి. ఇందులో అత్యధికంగా 90-95 శాతం రుణాలను బ్యాంకులు ఇస్తుండగా .. మిగతా మొత్తాలను క్రెడిలా (హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో భాగం) వంటి చిన్నపాటి ఆర్థిక సంస్థలు సమకూరుస్తున్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే .. విద్యారుణాలు ఇచ్చే విషయంలో దక్షిణాది బ్యాంకులు ముందుంటున్నాయి. తగ్గుతున్న ఉద్యోగావకాశాలతో దెబ్బ.. ఎడ్యుకేషన్ లోన్లకు సంబంధించి బ్యాంకులు వెనుక ంజ వేస్తుండటానికి అనేక కారణాలు ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో రుణాలు తీసుకున్న విద్యార్థులు కనిపించకుండా పోతున్నారని, వారిని వెతికి పట్టుకుని, ఇచ్చిన రుణాన్ని రాబట్టడం కష్టతరమవుతోందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. పెపైచ్చు.. దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులు సైతం.. ఎగవేతలకు కారణమవుతున్నాయి. కొత్తగా డిగ్రీ పట్టా పుచ్చుకుని కాలేజి నుంచి బైటికి వచ్చేవారికి ఉద్యోగావకాశాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కొన్ని బ్యాంకుల మొండి బకాయిల నిష్పత్తి ఏకంగా 7 శాతం దాకా ఉన్నాయి. -
ఆర్బీఐ గవర్నర్‌గా రఘురామ్ రాజన్
రిజర్వు బ్యాంకు నూతన గవర్నర్‌గా రఘురామ్ జి రాజన్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆమోదముద్ర వేశారు. ప్రస్తుత గవర్నర్ దువ్వూరి సుబ్బారావు స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. దువ్వూరి ఐదేళ్ల పదవీ కాలం సెప్టెంబర్ 4తో ముగియనుంది. ఆర్బీఐ గవర్నర్ పదవిలో రఘురామ్ జి రాజన్ మూడేళ్ల పాటు కొనసాగుతారని అధికార ప్రకటనలో తెలిపారు. రాజన్ ప్రస్తుతం ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఉన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆయనను గతేడాది ఆగస్టులో ఈ పదవిలో నియమించింది. గతంలో ఐఎంఎఫ్‌లో ముఖ్య ఆర్థికవేత్తగా పనిచేశారు. ప్రధానికి గౌరవ ఆర్థిక సలహాదారుగానూ కొనసాగుతున్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్ పలు సవాళ్లు ఎదుర్కొనున్నారు. రూపాయి పతనం, రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదల, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఐఐటీ-అహ్మదాబాద్, ఐఐటీ-ఢిల్లీ పూర్వ విద్యార్థి అయిన రాజన్ 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందుగా ఊహించారు.