
ముంబై: మహమ్మారి కరోనా విసురుతున్న సవాళ్లను ఎదుర్కొనడంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల ప్రకటించిన చర్యలను వేగవంతంగా అమలు చేయాలని గవర్నర్ శక్తికాంత దాస్ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎండీలు, సీఈఓలను బుధవారం ఆదేశించారు. అలాగే ఒడిదుడుకులను తట్టుకునేలా బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ల పటిష్టతపైనా దృష్టి సారించాలని వీడియో కాన్ఫరెన్స్‌లో పిలుపునిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆర్‌బీఐ ఇందుకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది.
కరోనా సవాళ్లు, రుణ లభ్యతపై చర్చ
ప్రకటన ప్రకారం, దేశ ప్రస్తుత ద్రవ్య– ఆర్థిక పరిస్థితులు, చిన్న రుణ గ్రహీతలు అలాగే లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ)సహా వివిధ రంగాలకు రుణ లభ్యత, కోవిడ్ రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్ వంటి అంశాలు వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చకు వచ్చాయి. ద్రవ్య పరపతి విధాన నిర్ణయ ఫలాల బదలాయింపు, కోవిడ్ సవాళ్లను ఎదుర్కొనడానికి ఆర్‌బీఐ తీసుకున్న విధాన నిర్ణయాల అమలుపైనా చర్చ జరిగింది. ప్రస్తుత ఆరోగ్య సంక్షోభ పరిస్థితుల్లో బ్యాంకులు పోషిస్తున్న క్రియాశీల పాత్రను తన ప్రారంభోపన్యాసంలో గవర్నర్ ప్రశంసించారు. డిప్యూటీ గవర్నర్లు ఎంకే జైన్, ఎం రాజేశ్వరరావు, మైఖేల్ డీ పాత్ర, టీ రవి శంకర్ తదితర సీనియర్ ఆర్‌బీఐ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కరోనా కష్టకాలాన్ని ఎదుర్కొనే క్రమంలో మే నెల మొదటి వారంలో ఆర్‌బీఐ పలు చర్యలను ప్రకటించిన నేపథ్యంలో తాజా సమావేశం జరిగింది. వ్యక్తులు, చిన్న సంస్థలకు రుణాల పునరుద్ధరణ, రుణ పునర్‌వ్యవస్థీకరణ, వైద్య, ఆరోగ్య రంగానికి రూ.50,000 కోట్లు, టీకాల తయారీ, ఆస్పత్రులు, ల్యాబ్‌లకు రుణాలు, రాష్ట్రాల ఓవర్‌డ్రాఫ్ట్ నిబంధనలు సరళతరం, రూ.35వేల కోట్లతో జీ–సెక్‌ల కొనుగోలు వంటి పలు చర్యలు వీటిలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment