Balance sheet
-
జనాదరణ పథకాలకు ఆర్బీఐ డబ్బు
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ వి. ఆచార్య తన పుస్తకం కొత్త ఎడిషన్ ‘ముందు మాట’గా రాసిన కొన్ని అంశాలు తాజాగా ఆసక్తికరంగా మారాయి. ‘‘ 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు 2018లో ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ నుంచి జనాదరణ పథకాల వ్యయాలకు రూ. 2 నుంచి 3 లక్షల కోట్లను పొందాలని కేంద్ర ప్రభుత్వంలోకి కొందరు చేసిన ప్లాన్ (రైడ్)ను సెంట్రల్ బ్యాంక్ ప్రతిఘటించింది. ఇది స్పష్టంగా ప్రభుత్వం– ఆర్బీఐ మధ్య విభేదాలకు దారితీసింది. సెంట్రల్ బ్యాంక్‌కు సంబంధిత ఆదేశాలు జారీ చేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టంలోని ఎన్నడూ ఉపయోగించని సెక్షన్ 7ను అమలు చేయాలని ఆలోచించే స్థాయికి పరిస్థితి వెళ్లింది’’ అని రాసిన అంశాలు ఆసక్తికరంగా మారాయి.‘క్వెస్ట్ ఫర్ రీస్టోరింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇన్ ఇండియా’ శీర్షికతో ప్రజల ముందు ఉంచిన తన పుస్తకం తాజా ఎడిషన్ ముందు మాటలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘కేంద్ర ఆర్థిక లోటు భర్తీకి బ్యాక్‌డోర్ మానిటైజేషన్’’ అని ఆయన ఈ వ్యవహారాన్ని అభివరి్ణంచడం గమనార్హం. 2017 జనవరి 20వ తేదీ నుంచి 2019 జూన్ వరకూ దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు విరాల్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో ఆయన డిప్యూటీ గవర్నర్‌గా మానిటరీ పాలసీ, ఫైనాన్షియల్ మార్కెట్లు, ఫైనాన్షియల్ స్థిరత్వం–రిసెర్చ్ విభాగం ఇన్చార్జ్గా వ్యవహరించారు. ఆరు నెలల ముందుగానే ఆయన అప్పట్లో రాజీనామా చేశారు. విరాల్ రాసిన అంశాల్లో కొన్ని... ► ఆర్బీఐ ప్రతి సంవత్సరం తన లాభంలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి అందజేస్తుంది. 2016 డిమోనిటైజేషన్‌కు ముందు మూడేళ్లలో ప్రభుత్వానికి రికార్డు లాభాలను బదిలీ చేసింది. ► నోట్ల రద్దు సంవత్సరంలో కరెన్సీ ముద్రణకు అయ్యే ఖర్చును కేంద్రానికి చేసిన బదిలీల నుంచి మినహాయించింది. ఫలితంగా 2019 ఎన్నికలకు ముందు ప్రభుత్వ నిధుల అవసరాలు మరింత పెరిగాయి. ఈ మొత్తాలను ఆర్బీఐ నుంచి పొందాలని బ్యూరోక్రాట్లు కొందరు ప్రయతి్నంచారు. ► స్వల్పకాలిక ప్రజాకర్షక వ్యయాల కోసం సెంట్రల్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌పై దాడి చేసే ప్రణాళికలను పదేపదే ప్రతిపాదించినప్పుడు.. సహేతుకమైన సంస్థలతో కూడిన ప్రజాస్వామ్యయుతంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ను కలిగి ఉన్న దేశంలోని ఏ ప్రభుత్వమైనా బలీయమైన ప్రతిఘటనను ఎదుర్కొనకుండా ముందుకు సాగలేదు. ఇలాంటి సందర్భాలే ఒక సహేతుక వ్యవస్థ ఏర్పాటుకు దారితీస్తాయి. ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ల నుండి ప్రభుత్వానికి భవిష్యత్తులో బదిలీల కోసం సహేతుకమైన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడానికి మాజీ గవర్నర్ బిమల్ జలాన్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు కావడం ఇలాంటిదే. ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ నుంచి భారీ నిధులు పొందాలని భావించిన వ్యక్తుల్లో పలువురిని ప్రభుత్వం పక్కన బెట్టడం కూడా జరిగింది. 2018లోనే ‘విరాల్’ వెల్లడి.. నిజానికి 2018 అక్టోబర్ 26న ఏడీ ష్రాఫ్ స్మారక ఉపన్యాసం సందర్భంగానే విరాల్ ‘కేంద్రం– ఆర్బీఐ మధ్య విభేదాల విభేదాల అంశాన్ని మొదటిసారి సూచనప్రాయంగా ప్రస్తావించారు. తాజాగా అందుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించారు. ‘‘కేంద్ర బ్యాంకు స్వాతం్రత్యాన్ని గౌరవించని ప్రభుత్వాలు తక్షణం లేదా అటు తరువాత ఆర్థిక మార్కెట్ల ఆగ్రహానికి గురవడం ఖాయం. ఆయా పరిణామాలు ఆర్థిక అనిశి్చతికి, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ దెబ్బతినే ప్రమాదానికి దారితీస్తాయి’’ అని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. ఉర్జిత్ పటేల్ రాజీనామా ఇందుకేనా..? తాజా అంశాలను విశ్లేíÙస్తే...సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా 2018 డిసెంబర్లో ఉర్జిత్ పటేల్ రాజీనామాకు.. తాజాగా విరాల్ లేవనెత్తిన అంశానికీ ఏదైనా సంబంధం ఉందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అప్పట్లో ఉర్జిత్ పటేల్ ‘‘వ్యక్తిగత కారణాలతో’’ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ బాధ్యతలకు రాజీనామా చేశారు. అప్పట్లో కేంద్రం–ఆర్బీఐ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయన్న వార్తలు గుప్పుమన్నప్పటికీ దీనికి స్పష్టమైన కారణాలు తెలియలేదు. మూడేళ్ల పదవీ కాలం ముగిసేలోగా తన బాధ్యతలను మధ్యలోనే వదిలేసిన గవర్నర్‌గా పనిచేసిన అరుదైన సందర్భం ఆయనది. -
రుణ రహితంగా ఐటీసీ హోటల్స్!
కోల్‌కత: హోటల్స్ వ్యాపారం బలమైన బ్యాలెన్స్ షీట్‌తోపాటు రుణ రహితంగా ఉంటుందని ఐటీసీ లిమిటెడ్ సీఎండీ సంజీవ్ పురి గురువారం తెలిపారు. కొత్త సంస్థ ఉనికిలోకి వచ్చినప్పుడు అవసరమైన రుణం, ఈక్విటీ లేదా వ్యూహాత్మక పెట్టుబడిదారుల నుండి మూలధనాన్ని సమీకరించగలదని అన్నారు. అటువంటి మూలధనం ఎప్పుడు అవసరమో నిర్ణయించడం కొత్త సంస్థ బోర్డుకి సంబంధించినదని కాన్ఫరెన్స్ కాల్ సందర్భంగా విశ్లేషకులతో ఆయన ఈ విషయాలను చెప్పారు. నూతన కంపెనీ ద్వారా హోటల్స్ వ్యాపారంలో పెట్టుబడులను కొనసాగిస్తామని వెల్లడించారు. అపార అవకాశాలతో ఇది సరైన సమయం. కొత్త కంపెనీ వృద్ధి బాట పట్టడంలో సహాయపడటానికి ఐటీసీ సంస్థాగత బలాల మద్దతు ఉంటుందని సంజీవ్ పురి వివరించారు. హోటల్స్ వ్యాపారాన్ని ఒక కొత్త సంస్థగా విడదీయడానికి జూలై 24న ఐటీసీ బోర్డు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ప్రతిపాదిత నూతన కంపెనీలో ఐటీసీ నేరుగా 40 శాతం ఈక్విటీని కలిగి ఉంటుంది. మిగిలిన 60 శాతం కంపెనీ వాటాదారుల సొంతం అవుతుంది. -
బ్యాలన్స్‌షీట్ పటిష్టంగా ఉంది.. ఇన్వెస్టర్లకు అదానీ గ్రూప్ భరోసా
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ బ్యాలన్స్‌షీట్ అత్యంత పటిష్టంగా ఉన్నట్లు తాజాగా స్పష్టం చేసింది. గ్రూప్‌లోని వివిధ బిజినెస్‌లను వృద్ధి బాటలో కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించింది. తద్వారా బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్‌పట్ల ఇన్వెస్టర్లకు విశ్వాసాన్ని పెంపొందించేందుకు చూస్తోంది. ఇటీవల యూఎస్ షార్ట్‌సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ ఆరోపణల కారణంగా గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీలలో అమ్మకాలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. దీంతో గత మూడు వారాల్లో గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)కు 125 బిలియన్ డాలర్లమేర కోత పడింది. అయితే గ్రూప్ లోని ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ ఈ ఏడాది మూడో త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో షేరు తిరిగి బలాన్ని పుంజుకోవడం గమనార్హం! అంతర్గత నియంత్రణలు, నిబంధనల అమలు, కార్పొరేట్ గవర్నెన్స్ వంటి అంశాలపై నమ్మకంగా ఉన్నట్లు కంపెనీ ఫలితాల విడుదల సందర్భంగా గ్రూప్ సీఎఫ్‌వో జుగెషిందర్ సింగ్ స్పష్టం చేశారు. ఈ బాటలో.. తగినన్ని నగదు నిల్వలు కలిగి ఉన్నట్లు, రుణాల రీఫైనాన్స్ సామర్థ్యాలను కలిగి ఉన్నట్లు గ్రూప్ విడిగా తెలియజేసింది. తాత్కాలికమే.. అదానీ గ్రూప్ బ్యాలన్స్‌షీట్ అత్యంత పటిష్టంగా ఉన్నట్లు సింగ్ తాజాగా పేర్కొన్నారు. పరిశ్రమలోనే అత్యున్నత అభివృద్ధి సామర్థ్యాలను కలిగి ఉన్నట్లు తెలియజేశారు. మెరుగైన కార్పొరేట్ గవర్నెన్స్, పటిష్ట క్యాష్‌ఫ్లో, హామీగల ఆస్తులున్నట్లు వివరించారు. ప్రస్తుత మార్కెట్ ఒకసారి నిలకడను సాధిస్తే తిరిగి తమ క్యాపిటల్ మార్కెట్ వ్యూహాలను సమీక్షించనున్నట్లు వెల్లడించారు. వాటాదారులకు అత్యుత్తమ రిటర్నులు అందించగల బిజినెస్‌లను కొనసాగించడానికి కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు. -
విజయ డయాగ్నోస్టిక్స్ లాభం రూ. 28 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో విజయ డయాగ్నోస్టిక్స్ లాభం స్వల్పంగా పెరిగి రూ. 27.7 కోట్లుగా నమోదైంది. గత క్యూ2లో ఇది రూ. 26.4 కోట్లు. మరోవైపు ఆదాయం రూ. 113.1 కోట్ల నుంచి రూ. 112.1 కోట్లుగా నమోదైంది. వార్షిక ప్రాతిపదికన కోవిడ్‌యేతర పరీక్షలపరమైన ఆదాయం 22 శాతం పెరగ్గా, కోవిడ్ టెస్టులపరమైన ఆదాయం (ఆర్టీ–పీసీఆర్, యాంటీబాండీ పరీక్షలు) 70% క్షీణించినట్లు సంస్థ తెలిపింది. ఇటీవలే ఐపీవోకి వచ్చి న విజయ డయాగ్నోస్టిక్స్.. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో కొత్తగా 5 సెంటర్స్ ఏర్పాటు చేసినట్లు సంస్థ సీఈవో సుప్రీతా రెడ్డి తెలిపారు. -
ఇక ఆర్ఐఎల్ మరింత స్పీడ్
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) బ్యాలెన్స్‌షీట్ మరింత పటిష్టపడినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ ముకేశ్ అంబానీ స్పష్టం చేశారు. ఇటీవల కొత్త రికార్డులు నెలకొల్పుతూ భారీ స్థాయిలో నిధుల సమీకరణ చేపట్టడంతో లిక్విడిటీ పెరిగినట్లు తెలియజేశారు. తద్వారా అత్యధిక వృద్ధిని సాధిస్తున్న జియో, రిటైల్, ఆయిల్ టు కెమికల్(ఓటూసీ) విభాగాల వృద్ధి ప్రణాళికలకు మద్దతు లభించనున్నట్లు పేర్కొన్నారు. ఆర్ఐఎల్ విడుదల చేసిన తాజా వార్షిక నివేదిక ప్రకారం టెలికం, డిజిటల్ బిజినెస్‌ల విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌తోపాటు.. రిటైల్ విభాగంలోనూ మైనారిటీ వాటాల విక్రయం ద్వారా దాదాపు రూ. 2 లక్షల కోట్లను సమీకరించింది. అంతేకాకుండా రైట్స్ ఇష్యూ ద్వారా మరో రూ. 53,124 కోట్లు సమకూర్చుకున్నట్లు ముకేశ్ తెలిపారు. వెరసి భారీ లిక్విడిటీతో పటిష్టమైన బ్యాలెన్స్‌షీట్.. వేగవంత వృద్ధిలో ఉన్న జియో, రిటైల్, ఓటూసీల ప్రణాళికలకు అండగా నిలవనున్నట్లు పేర్కొన్నారు. నిధుల సమీకరణ ఇలా: గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో ఆర్ఐఎల్ రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 53,124 కోట్లు సమీకరించింది. ఇది గత దశాబ్ద కాలంలో నాన్‌ఫైనాన్షియల్ రంగ సంస్థ చేపట్టిన అతిపెద్ద ఇష్యూగా నిలిచింది. ఇదేవిధంగా మైనారిటీ వాటాల విక్రయం ద్వారా జియో ప్లాట్‌ఫామ్స్‌కు రూ. 1,52,056 కోట్లు, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ విభాగానికి రూ. 47,265 కోట్లు చొప్పున లభించాయి. ఈ కంపెనీల్లో అంతర్జాతీయ దిగ్గజాలు ఫేస్బుక్, గూగుల్ వంటివి వ్యూహాత్మక ఇన్వెస్టర్లుగా చేరినట్లు ముకేశ్ పేర్కొన్నారు. జియోలో 33.7%, రిటైల్‌లో 15% చొప్పున వాటాలు విక్రయించింది. ఇంధన రిటైలింగ్ బిజినెస్‌లో గ్లోబల్ దిగ్గజం బీపీ 49% వాటాకు రూ. 7,629 కోట్లు ఇన్వె స్ట్ చేసినట్లు ప్రస్తావించారు. దీంతో దేశంలోనే గరిష్ట స్థాయిలో రూ. 2,60,074 కోట్లు(36 బిలియన్ డాలర్లు) సమీకరించగలిగినట్లు వివరించారు. ఈ బాటలో ఓటూసీలో 20 శాతం వాటాను సౌదీ అరామ్కోకు విక్రయించే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశారు. ఈ వాటా ద్వారా 15 బిలియన్ డాలర్లను సమకూరవచ్చని అంచనా. ఈ నేపథ్యంలో గడువు(2021 మార్చి)కంటే ముందుగానే ఆర్ఐఎల్ నికర రుణరహిత కంపెనీగా ఆవిర్భవించినట్లు చెప్పారు. గతేడాది ఆర్బీఐ నుంచి అనుమతులు పొందడం ద్వారా 7.8 బిలియన్ డాలర్ల విదేశీ మారక దీర్ఘకాలిక రుణాలను ముందస్తుగా చెల్లించినట్లు వెల్లడించారు. ఇది దేశీ కార్పొరేట్ రుణాలకు సంబంధించి అత్యధిక ప్రీపేమెంట్‌గా పేర్కొన్నారు. ఎన్ఎస్ఈలో రిలయన్స్ షేరు దాదాపు 2 శాతం లాభపడి రూ. 2,207 వద్ద ముగిసింది. దేశీ 5జీ ప్లాట్‌ఫాంపై జియో కసరత్తు డిజిటల్ ప్లాట్‌ఫాంలు, దేశీయంగా అభివృద్ధి చేసిన 5జీ ఆర్ఏఎన్ ప్లాట్‌ఫాంను వేగవంతంగా అందుబాటులోకి తెచ్చేందుకు టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. తదుపరి 30 కోట్ల మంది మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు, 5 కోట్లకు పైగా ఫైబర్ హోమ్స్, 5 కోట్ల పైచిలుకు లఘు, చిన్న మధ్య తరహా సంస్థలకు సరిపడేంత స్థాయిలో నెట్వర్క్ సామర్థ్యాన్ని సాధించినట్లు ముకేశ్ అంబానీ చెప్పారు. చిప్సెట్ తయారీ దిగ్గజం క్వాల్‌కామ్‌తో కలిసి భారత్‌లో 5జీ సొల్యూషన్స్‌ను విజయవంతంగా పరీక్షించినట్లు, 1జీబీపీఎస్ మైలురాయిని అధిగమించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రపంచ డిజిటల్ విప్లవంలో భారత్ ముందు వరుసలో ఉందని అంబానీ వివరించారు. ప్రతి ఇంటికీ, కార్యాలయానికి వేగవంతమైన ఇంటర్నెట్, డిజిటల్ సర్వీసులు అందించేలా రాబోయే కొన్ని సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా భారీ వైర్‌లైన్ నెట్వర్క్ నిర్మించడంపై జియో ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. -
ఆర్బీఐ ఆదేశాలు వెంటనే అమలు చేయండి
ముంబై: మహమ్మారి కరోనా విసురుతున్న సవాళ్లను ఎదుర్కొనడంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల ప్రకటించిన చర్యలను వేగవంతంగా అమలు చేయాలని గవర్నర్ శక్తికాంత దాస్ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎండీలు, సీఈఓలను బుధవారం ఆదేశించారు. అలాగే ఒడిదుడుకులను తట్టుకునేలా బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ల పటిష్టతపైనా దృష్టి సారించాలని వీడియో కాన్ఫరెన్స్‌లో పిలుపునిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆర్బీఐ ఇందుకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా సవాళ్లు, రుణ లభ్యతపై చర్చ ప్రకటన ప్రకారం, దేశ ప్రస్తుత ద్రవ్య– ఆర్థిక పరిస్థితులు, చిన్న రుణ గ్రహీతలు అలాగే లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)సహా వివిధ రంగాలకు రుణ లభ్యత, కోవిడ్ రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్ వంటి అంశాలు వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చకు వచ్చాయి. ద్రవ్య పరపతి విధాన నిర్ణయ ఫలాల బదలాయింపు, కోవిడ్ సవాళ్లను ఎదుర్కొనడానికి ఆర్బీఐ తీసుకున్న విధాన నిర్ణయాల అమలుపైనా చర్చ జరిగింది. ప్రస్తుత ఆరోగ్య సంక్షోభ పరిస్థితుల్లో బ్యాంకులు పోషిస్తున్న క్రియాశీల పాత్రను తన ప్రారంభోపన్యాసంలో గవర్నర్ ప్రశంసించారు. డిప్యూటీ గవర్నర్లు ఎంకే జైన్, ఎం రాజేశ్వరరావు, మైఖేల్ డీ పాత్ర, టీ రవి శంకర్ తదితర సీనియర్ ఆర్బీఐ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కరోనా కష్టకాలాన్ని ఎదుర్కొనే క్రమంలో మే నెల మొదటి వారంలో ఆర్బీఐ పలు చర్యలను ప్రకటించిన నేపథ్యంలో తాజా సమావేశం జరిగింది. వ్యక్తులు, చిన్న సంస్థలకు రుణాల పునరుద్ధరణ, రుణ పునర్వ్యవస్థీకరణ, వైద్య, ఆరోగ్య రంగానికి రూ.50,000 కోట్లు, టీకాల తయారీ, ఆస్పత్రులు, ల్యాబ్‌లకు రుణాలు, రాష్ట్రాల ఓవర్‌డ్రాఫ్ట్ నిబంధనలు సరళతరం, రూ.35వేల కోట్లతో జీ–సెక్‌ల కొనుగోలు వంటి పలు చర్యలు వీటిలో ఉన్నాయి. -
ఐసీఐసీఐ లాంబార్డ్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ వాటా విక్రయం
దేశీయ ప్రైవేట్ రంగఐసీఐసీఐ బ్యాంక్ తన జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్‌లో 3.96శాతం వాటాను విక్రయించింది. ఈ వాటా విక్రయం మొత్తం రూ.2250 కోట్లుగా ఉంది. వీలు చిక్కిన ప్రతిసారీ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌ను బలోపేతం చేయడాన్ని పరిశీస్తామని త్రైమాసిక ఫలితాల విడుదల సందర్భంగా ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కోంది. అందులో భాగంగా తన ఇన్సూరెన్స్ సంస్థలో 3.96 వాటాను విక్రయించినట్లు తెలుస్తోంది. ‘‘ఇందుకు ముందు బోర్డు సమావేశంలో తీసుకున్న తీర్మానానికి అనుగుణంగా నేడు ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్‌లో మొత్తంలో వాటాలో 3.96శాతానికి సమానమైన 1.8కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించడమైంది. ఈ వాటా అమ్మకం ద్వారా మొత్తం రూ.2250 కోట్లను సమీకరణ చేస్తున్నాము.’’ అని ఎక్చ్సేంజ్‌లకు ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. ఈ అమ్మకంతో ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ హోల్డరింగ్ ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 51.9శాతానికి దిగివస్తుంది. బీఎస్ఈ గణాంకాల ప్రకారం మార్చి 31నాటికి ఇన్సూరెన్స్ కంపెనీలో బ్యాంక్ 55.86శాతం వాటాను కలిగి ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ కోవిడ్-19 ప్రభావంతో ఈ మార్చి క్వార్టర్లో ప్రోవిజన్లకు రూ.2,725 కోట్లను కేటాయించింది. ఆర్బీఐ ఏప్రిల్ 17 నాడు ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం బ్యాంక్ చేసిన కేటాయింపు అవసరం కంటే ఎక్కువగా ఉన్నాయి. వాటా విక్రయ వార్తల నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం గం.2:30ని.లకు ఐసీఐసీఐ బ్యాంక్ షేరు 2శాతం లాభంతో రూ.359 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయానికి ఐసీఐసీఐ లాంబార్డ్ షేరు మునుపటి ముగింపు(రూ.1276.50)తో పోలిస్తే 1.50శాతం నష్టంతో రూ.1,259.00 వద్ద ట్రేడ్ అవుతోంది. -
వచ్చే ఆరు నెలలు కీలకం
దేశీయ ఆర్థిక సేవల రంగంలో తీవ్రమైన లిక్విడిటీ (నిధుల లభ్యత) సమస్య నెలకొందన్నారు ప్రముఖ వ్యాపారవేత్త, కోటక్ మహీంద్రా బ్యాంకు అధినేత ఉదయ్ కోటక్. దేశీయ ఆర్థిక సేవల రంగం ఇప్పటికే సవాళ్లతో కూడిన కాలంలో ప్రయాణం చేస్తోందని, రానున్న రెండు త్రైమాసికాల పాటు ఇవే పరిస్థితులు ఉంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. క్లిష్ట సమయాల్లో నిలదొక్కుకునేందుకు బ్యాలన్స్ షీట్లు బలంగా ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ‘‘ఆర్థిక సేవల రంగంలో ఎన్నో సవాళ్లతో కూడిన కాలం మధ్యలో ఉన్నాం. ఈ రంగంలోని భిన్న విభాగాలు ఏ విధంగా రూపుదిద్దుకుంటాయనే విషయంలో వచ్చే కొన్ని నెలలు ఎంతో కీలకం’’ అని కోటక్ మహీంద్రా బ్యాంకు మార్చి త్రైమాసికం ఫలితాల ప్రకటన సందర్భంగా మీడియాతో ఉదయ్ కోటక్ అన్నారు. యస్ బ్యాంకు కొత్త సీఈవో రవనీత్ గిల్ బ్యాంకు రుణ పుస్తకంలో స్టాండర్డ్ ఆస్తుల్లో (ప్రామాణిక రుణాలు) రూ.10వేల కోట్లు ఎన్పీఏలుగా రానున్న త్రైమాసికాల్లో మారే రిస్క్ ఉందంటూ, రూ.2,100 కోట్ల మేర కంటింజెన్సీ ప్రొవిజన్ పేరుతో పక్కన పెట్టేసిన విషయం తెలిసిందే. దీంతో యస్ బ్యాంకు చరిత్రలో మొదటి సారి ఓ త్రైమాసికంలో రూ.1,500 కోట్ల నష్టాన్ని ప్రకటించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కోటక్ లిక్విడిటీపై చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం నెలకొంది. బ్యాలన్స్ షీట్లకే పరీక్ష ‘‘ఫైనాన్షియల్ కంపెనీల బ్యాలన్స్ షీట్లు నాణ్యంగా ఉంచుకోవాల్సిన కీలకమైన సమయం. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కు అసలైన పరీక్ష బ్యాలన్స్ షీటే’’ అని ఉదయ్ కోటక్ వ్యాఖ్యానించారు. మార్కెట్లు లాభాలపై దృష్టి పెట్టడం కాకుండా ఆయా సంస్థలు క్లిష్ట సమయాల్లో నిలబడగలిగే బలమైన బ్యాలన్స్ షీట్లతో ఉన్నాయా అన్నదే చూడాలన్నారు. నోట్ల రద్దుతో ఎక్కువగా ప్రయోజనం పొందింది ఆర్థిక సేవల రంగమేనని, భారీ స్థాయిలో నిధులు బ్యాంకుల్లోకి, బీమా సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్‌లోకి ప్రవేశించినట్టు చెప్పారు. అయితే, ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే ఈ నిధులు ద్రవ్యత్వం లేని ఆస్తులైన భూములు, రియల్ ఎస్టేట్‌వైపు వెళ్లిపోయాయన్నారు. దీన్ని అవివేకంగా ఉదయ్ కోటక్ అభివర్ణించారు. ఒక్కసారి నిధుల లభ్యత కఠినంగా మారితే ఈ తరహా ఆస్తులకు మరింత ఇబ్బంది (వెంటనే నగదుగా మార్చుకోలేని పరిస్థితులు) ఏర్పడుతుందన్నారు. ఆర్థిక రంగాన్ని కల్లోల పరిస్థితుల నుంచి సురక్షిత జలాల వైపు తీసుకెళ్లేందుకు విధాన నిర్ణేతలు, ప్రాక్టీషనర్లు దృఢంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యలను ఎదుర్కొంటున్న వాటికి మూలనిధులను అందించడం లేదా కన్సాలిడేషన్ ఉత్తమ పరిష్కారంగా సూచించారు. -
యస్ బ్యాంక్ లాభాలకు గండి !
న్యూఢిల్లీ: యస్ బ్యాంక్ ఆస్తి, అప్పుల పట్టీ (బ్యాలన్స్ షీట్) ప్రక్షాళన ఆ బ్యాంక్ లాభదాయకతపై తీవ్రంగానే ప్రభావం చూపనున్నదని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ, మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ హెచ్చరించింది. ఈ ప్రభావం ఏడాది నుంచి ఏడాదిన్నర కాలం వరకూ ఉంటుందని పేర్కొంది. ఒత్తిడిలో ఉన్న రుణాలు బ్యాంక్ వద్ద దాదాపు 8 శాతంగా ఉన్నాయని, వీటికి కేటాయింపుల కారణంగా 12–18 నెలల పాటు బ్యాంక్ లాభదాయకతపై ప్రభావం పడుతుందని వివరించింది. తొలి త్రైమాసిక నష్టాలు... గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ఈ బ్యాంక్ ఇటీవలే వెల్లడించింది. గత క్యూ4లో ఈ బ్యాంక్‌కు రూ.1,507 కోట్ల నికర నష్టాలొచ్చాయి. బ్యాంక్ ఆరంభమైన 2004 నుంచి చూస్తే, ఇదే తొలి త్రైమాసిక నష్టం. అయితే పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే బ్యాంక్‌కు లాభాలే వచ్చాయి. రిటర్న్ ఆన్ అసెట్ మాత్రం 1.4 శాతం నుంచి 0,5 శాతానికి తగ్గింది. సమీప భవిష్యత్తులో బలహీనతలున్నప్పటికీ, కొత్త అధినేత నాయకత్వం బ్యాంక్‌కు సానుకూలాంశమేనని మూడీస్ పేర్కొంది. గతంలో బ్యాంక్ రుణ వృద్ధి సగటున 34 శాతంగా ఉందని, అయితే రానున్న మూడేళ్లలో ఈ బ్యాంక్ రుణ వృద్ధి 20 – 25 శాతం రేంజ్‌లోనే ఉండగలదని ఈ సంస్థ అంచనా వేస్తోంది. రిటైల్ రుణాలు, ఎస్ఎమ్ఈ సెగ్మెంట్ రుణాలపై ఈ బ్యాంక్ మరింతగా దృష్టిసారించాలని సూచించింది. అలాగే కార్పొరేట్ రుణాలను తగ్గించుకోవాలని కూడా పేర్కొంది. ఫలితాలు నిరాశపరచడంతో యస్ బ్యాంక్ షేర్ భారీగా పతనమైంది. బీఎస్ఈలో 29 శాతం నష్టంతో రూ.168 వద్ద ముగిసింది. -
నూతన అకౌంటింగ్ స్టాండర్డ్‌ను నోటిఫై చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: నూతన అకౌంటింగ్ స్టాండర్డ్ ‘ఐఎన్డీ ఏఎస్ 116’ను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. కంపెనీల్లో లీజుల వివరాలను వెల్లడించడం, బ్యాలన్స్ షీట్ల వివరాల వెల్లడిలో పారదర్శకతను తీసుకువచ్చేందుకు ఇది సాయపడుతుందని భావిస్తున్నారు.. విమానాలను లీజులపై తీసుకుని నడిపే ఏవియేషన్ సహా పలు రంగాలపై ఈ నూతన అకౌంటింగ్ ప్రమాణాలు గణనీయమైన ప్రభావం చూపనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఐఎన్డీ ఏఎస్ 116 అమల్లోకి వస్తుందని కేంద్రం తెలిపింది. -
తీరని బాకీ
‘నమస్తే సర్, నేను ఆడిటర్ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. మీ లాస్ట్ ఇయర్ బాలెన్స్ షీట్ కాపీ మీ ఫైల్లో మిస్ అయ్యింది. మీ దగ్గరుంటే మెయిల్ చేస్తారా. అలాగే ఈ సంవత్సరం బ్యాడ్ డెట్స్ కి ప్రొవిజిన్ ఏమైనా ఉంచాలా అని సర్ అడగమన్నారు‘ . ఆదివారం పొద్దున్న కాఫీ తాగుతూ పేపర్ చదువుతూ ఉండగా వచ్చిన ఫోనది. ‘ఓకే కాపీ ఇప్పుడే మెయిల్ చేస్తాను. ఎప్పటి లాగే బ్యాడ్ డెట్స్‌కి ప్రొవిజిన్ అవసరం లేదని ఆడిటర్ గారికి చెప్పండి‘ అన్నాను మొదటి విషయం కొంచెం విసుగ్గా చివరి విషయం కొంచెం గర్వంగా చెబుతూ. ఫోన్లో డేటా అంతా వెతికితే దొరికింది లాస్ట్ ఇయర్ బాలెన్స్ షీట్. స్టాక్, క్యాష్, బ్యాంకు బాలెన్స్, గుడ్ విల్, షాపు మార్కెట్ వేల్యూ లాంటివి కలిపితే రెండు కోట్ల నికర ఆస్తి. ఆ ఫిగర్ చూస్తే కలిగే ఆనందం కన్నా, బ్యాడ్ డెట్స్ (రానిబాకీలు) దగ్గర ఉండే సున్నా చూస్తే నాకెక్కువ ఆనందం. ఫార్మా స్టాకిస్టుగా బిజినెస్ మొదలు పెట్టి దాదాపు పదేళ్లు కావస్తోంది. ఇరవై లక్షలతో మొదలుపెట్టిన వ్యాపారం, డైటింగ్‌లో ఉన్న మెడికల్ ఎథిక్స్ సాక్షిగా, నాలాంటి వాళ్ళ లైఫ్ స్టైల్ డిసీజెస్ పుణ్యమా అని పదేళ్లలో పదింతలైంది. సాధారణంగా రిటైలర్స్‌కి క్రెడిట్ బేసిస్‌లో స్టాక్ సప్లై చెయ్యాలి. కానీ నేను కేవలం మొనోపలీ ఉన్న కంపెనీ మందులే డీల్ చేస్తాను. కొంచెం మార్జిన్ తక్కువైనా సరే. అందుచేత రిటైలర్స్‌కి అరువు ఇవ్వను. ఇచ్చినా ఎక్కువ రోజులు ఇవ్వను. పాత బాకీ తీరిస్తే కానీ స్టాక్ పంపను. కొత్తలో కొంచెం ఇబ్బంది పడినా వాళ్ళూ అలవాటు పడిపోయారు. నేను కూడా కంపెనీలకి అరువు పెట్టను. ’అప్పు, అబద్ధం కలిసి జీవిస్తాయి’ అన్న ఫ్రాన్స్ వ రెబ్లే మాటల్ని నేను గట్టిగా నమ్ముతాను. ఆడిటర్ ఆఫీస్‌కి మెయిల్ చేసి, ఆదివారం కావడంతో సంచి తీసుకుని పక్కనే ఉన్న రైతు బజార్ కి కూరలకి బయలుదేరాను. ‘‘బాబూ, వంకాయలెలాగ? ‘‘అడిగా . ‘నల్లవి కిలో పదహారు, తెల్లవి పద్దెనిమిది సారూ’ అన్నాడతను జాగా నా చేతికిస్తూ. ‘‘ఇదిగో తెల్లొంకాయలు ఓ పావు ఇయ్యి’’ అంటూ జాగాలో ఏరిన వంకాయలు ఆ రైతుకిచ్చా. ‘‘సారూ చిల్లర ఐదు రూపాయలుండాల’’ అంటూ పావుకి కొంచెం ఎక్కువగా ఉన్న వంకాయలు నా సంచీలో పోశాడా రైతు ఊడిపోయిన తన ఐ.డి కార్డుని తిరిగి చొక్కాకి తగిలించుకుంటూ. అది మా ఇంటికి దగ్గరలో ఉన్న రైతు బజార్. ఆరోజు ఆదివారం కావడంతో రైతుబజారంతా రద్దీగా ఉంది. కూరలెప్పుడూ ఇంటిపక్కనుండే బడ్డీ కొట్లో నా భార్యే కొంటుంది. మూడు రోజులనుంచి ఆ షాప్ తెరవటం లేదు. అందుకని ఆదివారం కదా అని నేనే రైతు బజార్‌కి బయలుదేరా. నా భార్య చెప్పిన ప్రకారం ఆ బడ్డీ కొట్లో కిలో అరవైకి తక్కువ ఏ కూరా ఉండదు. అవే కూరలు రైతు బజార్ లో పన్నెండు నుంచి ఇరవై నాలుక్కి మించి లేవు ఒక్క ఆగాకరకాయే కిలో ఏభై. అది బయట నూట ఇరవయ్యట. ఇలా కృష్ణదేవరాయల కాలంలా ఓ నూట ఏభై రూపాయలతో దాదాపు సంచి నిండిపోయింది మొత్తం తిరిగేసరికి. బయటకి వెళుతూ ఉంటే ఓ చోట జనం బాగా మూగి, ఒంగుని ఉన్నారు. ఏంటో చూద్దామని దగ్గరకి వెళ్ళాను. తన శరీరంలాగే ముడతలు పడిన నేత చీర, ముక్కుకి చేతి కడియమంత రింగు, పౌర్ణమి వెన్నెలలా తెల్లని జుట్టు, సాయంత్రం జెండాలా వంగిన నడుముతో ఓ అవ్వ చింత చిగురు అమ్ముతోంది. మొత్తం కలిపి ఆమె దగ్గర ఓ కేజీ, కేజిన్నర ఉంటుంది. వంద గ్రాములు ఇరవై రూపాయలట. కాటా పక్కనే న్యూస్ పేపర్ లో సిటీ ఎడిషన్‌ని ఒక్కో పేజీ రెండు ముక్కలు చేస్తోంది. అంతమంది ఆ కొద్దిపాటి చింత చిగురికీ పోటీ పడుతున్నందుకు అదే నేనైతే ఇరవై కాస్తా ఏభై చేద్దును. డిమాండ్ అండ్ సప్లై గురించి తెలియని ఆమె మాత్రం తూకం ఎక్కడా తగ్గకుండా, అలా అని మరీ ఎక్కువ మొగ్గకుండా చూసుకోవటంలో బిజీగా ఉంది. ఆమెకి షాపు దొరకలేదులా ఉంది ఓ చోట ఎండలో నేలమీదే అమ్ముతోంది. వీరుణ్ణి జోకొట్టే చీకటి పిరికివాణ్ణి భయపెట్టినట్టు, తీవ్రమైన ఎండ ఆమెనేం చేయలేక తన ప్రతాపమంతా మా మీద చూపిస్తోంది. ఒక్కొక్కరికీ వంద గ్రాములు తూచి పేపర్ లో పొట్లంగట్టి ఇస్తోంది. పేపర్లు అయిపోతే పక్కనే ఉన్న దుకాణం వాళ్ళని బతిమాలి అడిగి తెచ్చుకుంటోంది. ఎవరో అడిగారు ‘ఏమ్మా అందరిలాగే నువ్వుకూడా పోలిథిన్ కవర్లు పెట్టుకోవచ్చు కదా. ఈ పేపర్లు ఎంతకని చింపుతావు?’’ అని. దానికి ఆ అవ్వ నెమ్మదిగా ఆగి ఆగి ఆయాసంతో చెబుతోంది. తనది దగ్గర్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతమట. ఇంతకుముందు తనకి ఓ ఆవు ఉండేదట. అది ఉన్నపళంగా చచ్చిపోయిందట. పశువుల డాక్టర్ చూసి, వాళ్ళ వూరు విహారానికి వచ్చిన వాళ్ళు తిని పడేసిన పాలిథిన్ కవర్లు తినటం వల్ల చచ్చిపోయిందని చెప్పాడట. అప్పటినుంచి ఇలా తను మోయగలిగే బరువున్న చింతచిగురు కోసి పల్లెవెలుగు బస్సులో వచ్చి ఇక్కడ రైతుబజార్లో అమ్ముకుని పొట్ట పోసుకుంటోందట. ఎవరూ లేరా అని మరొకరడిగిన ప్రశ్నకి ఓ కొడుకుండేవాడని చెప్పింది. అలా చెప్పినప్పుడు ప్రస్తుతం తన ఒంటరితనాన్ని సూచించేలా ఆమె కళ్ళల్లో తడి. ఆమె కాలికున్న వెండి కడియం జీవితంలో ఆమె మోసిన బరువులకి ప్రతీకలా ఉంది. పగిలిన పాదాలు ఆమె లెక్కలేనన్నిసార్లు ఎక్కి దిగిన కొండదారులకి నిలువుటద్దంలా ఉన్నాయి. వెరసి అలసిన అనుభవంలా, అలలు లేని అర్ణవంలా ఉందా ఎనభైఏళ్ళ అవ్వ. ఇంతలో ఎవరో అడిగారు. ‘‘అవ్వా, ఇది ఎలా వండాలి’’? అని. ఆమె మొహం చేటంతయ్యింది. బోసి నోరుతో చేసే పని ఆపేసి చెప్పటం మొదలు పెట్టింది. పెసరపప్పుతో కలిపి వండి, వెల్లుల్లి పాయల పోపు పెట్టి, నెయ్యితో తింటే భలే రుచిగా ఉంటుందట. అలాగే మాంసంతో కూడా కలిపి వండుకోవచ్చట. అలా చెబుతున్నపుడు ఆమె కళ్ళల్లో రిటైర్ అయిపోయిన మాస్టారిని తిరిగి పాఠం చెప్పమన్నప్పుడు కలిగే ఆనందం. చివరకి నా వంతు వచ్చింది. నేనూ ఓ వందగ్రాముల పొట్లం తీసుకుని, జేబులో ఉన్న చిల్లరంతా అయిపోగా పర్సులోంచి ఐదొందల నోటు తీసిచ్చా. ‘‘సిల్లర నేదు బాబూ, మార్చి ఇవ్వు’’ అంటూ నా పెద్ద నోటు నాకు తిరిగిచ్చేసి నా తర్వాత వాళ్లకి తూకం వెయ్యటం మొదలు పెట్టింది. ‘రేయ్ ఈరోజు సోమవారం కదా, పార్సెల్ ఆఫీస్ కి స్టాక్ వచ్చిందో లేదో ఫోన్ చేసి కనుక్కో’ అని కుర్రాడికి చెప్తూ, ‘చెప్పండి మాస్టారు, లిస్ట్ తెచ్చారా’ అన్నాను ఎదురుగా ఉన్న పెద్దాయన్ని. అప్పటికే ఇద్దరు మెడికల్ రిప్రజెంటేటివ్‌లు, మరో ఇద్దరు మెడికల్ షాపు వాళ్ళతో షాపు బిజీ గా ఉంది. ‘ఆ ఏం లేదు సర్, ముందు వాళ్ళ పని చూడండి‘ అన్నాడతను వినయంగా. ఆయన పేరు రామారావు. ప్రతీ నెలా ఓ.టి.సి మెడిసిన్స్, సింపుల్ యాంటీ బయోటిక్స్, మల్టీ విటమిన్ టేబ్లెట్లు లాంటివి ఓ ఐదువేల రూపాయలకి కొంటూ ఉంటాడు. మామూలుగా అయితే మేం రిటైల్ సేల్స్ చెయ్యకూడదు. ఓ డాక్టర్ గారి రిఫరెన్స్ ద్వారా పరిచయం అయ్యాడు. రిటైల్ షాపుల కంటే కొంచెం ఎక్కువ డిస్కౌంట్ ఇస్తామని ఇక్కడ కొంటూ ఉంటాడు. బహుశా చుట్టుపక్కల పల్లెటూర్లో ఓ చిన్న కిరాణా కొట్లో పెట్టి అమ్ముకుంటాడేమో. అందరినీ డిస్పోజ్ చేసి ఆయన కేసి తిరిగి అడిగా. ‘‘మాస్టారూ చెప్పండి ఏమిటి సంగతి’’ అని. ఎప్పటి లాగే ఆయన ఓ చీటీ ఇచ్చాడు. ఆ చీటీ మా కుర్రాడికి ఇచ్చి అవేవో చూసి ఇమ్మన్నా. అప్పుడతను నెమ్మదిగా, కొంచెం మొహమాటంగా అన్నాడు ‘సర్, ఈ అమౌంట్ నెక్ట్స్ట్మంత్ వచ్చినప్పుడు ఇవ్వొచ్చా, కొంచెం డబ్బులు అవసరం’’. అప్పుడు చూశాను అతనివైపు నిశితంగా. నెరిసిన తల, నలిగిన చొక్కా, కాలికి హవాయి చెప్పులు, ఓ పాత స్కూటరు, చూడగానే చిక్కిపోయిన సిబిల్ స్కోర్లా ఉన్నాడు. పైగా ఇలాంటి వాళ్ళ సంగతి నాకు కాకపోయినా, మా బిజినెస్ లో ఉన్నవాళ్ళకి అలవాటే. ఓ ఏడాది అలవాటుగా కొంటారు. మరోచోట కొంచెం ఎక్కువ డిస్కౌంట్ రాగానే, చివరగా ఏడాది పరిచయాన్ని నమ్మకంగా మార్చి అప్పు అడిగి మరింక కనబడరు. ఎన్ని వినలేదు. అయినా నన్ను అప్పు అడగటం అంటే నిప్పులో తడి, నీటిలో పొడి వెతకటమే. ‘మాస్టారూ, మాది హోల్ సేల్ బిజినెస్. ఇక్కడ రిటైల్‌గా మీకు పదిహేడు పర్సెంట్ డిస్కౌంట్‌తో మందులు అమ్మటమే ఎక్కువ. దానికి తోడు అప్పంటే కష్టం సర్. పైగా ఈ ఏడు బిజినెస్ అంతగా లేదు. ఏమీ అనుకోకండి. పేమెంట్ చేసి మందులు తీసికెళ్ళండి’ అంటూ అప్పటికే అలవాటు ప్రకారం మా కుర్రాడు ప్యాక్ చేసిన మందుల్ని నా కౌంటర్ వెనకాల పెట్టేసా. అతను మారు మాట్లాడకుండా, ‘‘సారీ సర్, ఇదిగో డబ్బులు. కొంచెం అర్జెంటు అవసరం పడి అడిగాను’’ అంటూ జేబులోంచి డబ్బులు తీసిచ్చి, మందులు తీసికెళ్ళాడు. వలని తప్పించుకున్న చేపలా విజయగర్వంతో ఆ డబ్బుని క్యాష్ కౌంటర్లో పెట్టుకున్నా. ఆ మర్నాడు యథావిధిగా ఉదయం తొమ్మిదింటికి భోజనానికి కూర్చున్నాను. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌కి బదులు లంచ్ చేసి ఇంటి కిందనే ఉన్న షాపుకి వెళ్ళటం నా అలవాటు. కంచంలో చింత చిగురు పప్పు. అచ్చం అవ్వ చెప్పినట్టే వెల్లుల్లిపాయల పోపుపెట్టి, నెయ్యి కలుపుకుని తింటే నిజంగానే చాలా రుచిగా ఉంది. అప్పుడు గుర్తొచ్చింది నాకు ఆ అవ్వకి నేను ఇరవై రూపాయలు బాకీ ఉన్న సంగతి. చిల్లర మార్చి ఇమ్మన్న తరువాత ఆ విషయమే మర్చి పోయాను. భోజనం అవగానే షాపుకి వెళ్లకుండా నేరుగా రైతు బజార్ కి వెళ్ళాను. నా షాపుకి మూడు షాపుల అవతలే రైతు బజార్. అంతా వెతికా. ఎక్కడా అవ్వ కనబడలేదు. బహుశా వెళ్లిపోయిందో లేక అసలు రాలేదో, సరే వచ్చే ఆదివారం తప్పకుండా వెళ్లి ఇచ్చేయాలి అనుకుని, షాపు కి వచ్చా. నా షాపు కి ఆనుకుని ఓ చిన్న టీ కొట్టుంది. అప్పుడప్పుడు రైతులు అక్కడకి వచ్చి టీ తాగుతూ ఉండటం చూశా. ఎవరో ఓ ఇద్దరు రైతుల్లా ఉన్నారు. కూర్చుని టీ తాగుతున్నారు. అప్పుడే అక్కడకి వచ్చిన రామారావుని చూసి వాళ్లిద్దరూ లేచి నించుని విష్ చేశారు. వాళ్లంతా ఏదో మాట్లాడుకున్నారు. కాసేపటికి రామారావు అక్కడనించి వెళ్ళిపోయాడు. పోనీ వీళ్ళకేమైనా అవ్వ విషయం తెలుస్తుందేమోనని వాళ్ళని దగ్గరకి పిలిచా. వచ్చారు. ‘‘ఏవయ్యా రైతు బజార్లో ఓ అవ్వ చింత చిగురు అమ్ముతూ ఉంటుంది. ఈరోజు వచ్చినట్టు లేదు. మీకేమైనా తెలుసా’’ అని అడిగా. ‘ఆ అవ్వ నిన్ననే పోయిందయ్యా, మా వూరే, ఆదివారం సులువుగానే తిరిగింది. మాతోబాటే వచ్చి, యాపారం అయిపోగానే బస్సులో వచ్చేసింది. రాత్రికి బాగా జొరం వచ్చింది. తెల్లవారి ఆసుపత్రికి తీసుకెళ్లటం కొంచెం ఆలీసం అయ్యింది. ఆ ముసలి పానం తట్టుకోలేకపోయిందయ్యా. ఇప్పుడు మాటాడాం కదయ్యా, ఆ బాబు ప్రతీ నెలా మా ఊరొచ్చి జొరానికీ, బలానికి మందులు పంచుతా ఉంటాడయ్యా. నిన్న కూడా ఆ బాబు కి ఫోన్ జేశాము. వొచ్చి ఆసుపత్రి కి తీసుకు పోతానన్నాడు. ఆ అయ్య వచ్చే కాడికి అవ్వ పానాలొగ్గేసింది. ఆసుపత్రికి తోల్క పోడానికి డబ్బులు కూడా తెచ్చినాడు. లెక్క కూడ్డానికి కూసింత లేటైనాదంట పాపం. ఆ డబ్బే అవ్వని దానపర్చటానికి(దహనానికి) పనికొచ్చినాయి. అదే ఆ బాబు, మేము బాదపడతా వుండాము’ అన్నారు ఇద్దరూ మార్చి మార్చి చెబుతూ. ఇంతలో నా ఫోన్లో జీమెయిల్ మెసేజ్. ఓపెన్ చేసి చూస్తే ఆడిటర్ పంపిన ఈ ఏడు బ్యాలెన్స్ షీట్. రెండు కోట్ల ఐదువేల ఇరవై రూపాయల నికర ఆస్తి. ఎప్పటిలాగే రానిబాకీలు సున్నా. బహుశా ఆ అవ్వకి కూడా బ్యాలెన్స్ షీట్ వేసే అలవాటుంటే అందులో బ్యాడ్ అండ్ డౌట్ ఫుల్ డెట్స్ లో నా పేరుండేదేమో. మిన్ను విరగలేదు. మన్ను పెగల్లేదు. నా చూపు మాత్రం నేలని దాటి పాతాళాన్ని తాకింది. ఎవరో నా నెత్తిమీద సుత్తితో కొట్టి మరీ నన్ను కుదించినట్టయింది. అరవై ఏళ్ళ వయసులో రామారావు చేసే సేవ బ్యాలెన్స్ షీట్లని దాటేసింది. నన్నడిగితే అప్పు తప్పకుండా పుడుతుందన్న ఐదున్నర అడుగుల అతని నమ్మకం ఏడడుగుల ఏరై నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. అతనడిగింది పెద్ద మొత్తమేమీ కాదు. నేనిచ్చినంత మాత్రాన ఆ అవ్వ ప్రాణాలు నిలబడతాయనీ కాదు. కనీసం గోటితో పోయేచోట కూడా తోటి వారిని నమ్మలేని నా అతి జాగ్రత్త నన్ను దోషిగా నిలబెట్టింది. ‘చిల్లర మార్చి ఇవ్వు బాబూ ‘అన్న ఎనభై ఏళ్ళ అవ్వ నమ్మకం నింగికి నిచ్చెనేసింది. వందేళ్ల చింత చెట్టు ఇంకా చిగురిస్తూనే ఉంది. నా టేబుల్ మీదున్న బోన్సాయ్ మొక్క నన్ను వెక్కిరిస్తోంది. - ఉమా మహేష్ ఆచాళ్ళ ∙ -
అనుబంధ బ్యాంకుల విలీనంతో..త్వరలోమెగాఎస్బీఐ!
♦ ప్రతిపాదనను ఆమోదిస్తామని చెప్పిన ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ♦ ఎన్పీఏల పరిష్కారమే తొలి ప్రాధాన్యమని స్పష్టీకరణ ♦ ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థల అధిపతులతో సమావేశం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో ఐదు అనుబంధ బ్యాంకులు సహా భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంఐ) విలీన ప్రక్రియ ఖాయమని కేంద్రం స్పష్టం చేసింది. దీన్ని త్వరలో ఆమోదించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంచేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని పటిష్ఠపరచటం, వాటి మొండి బకాయిల సమస్యల్ని పరిష్కరించటం, వాటికి సాధికారత కల్పించటం లక్ష్యాలుగా కేంద్రం పనిచేస్తున్నట్లు చెప్పారాయన. సోమవారమిక్కడ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల సీఎండీలతో బ్యాంకింగ్ రంగ త్రైమాసిక పనితీరును ఆయన సమీక్షించారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హాతో సహా పలువురు సీనియర్ అధికారులతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఎప్పటిలోగా ఎస్బీఐ విలీన ప్రక్రియకు ఆమోద ముద్ర వేస్తారు?’’ అని అడిగిన ప్రశ్నకు జైట్లీ సమాధానమిస్తూ... ‘త్వరలో ఈ నిర్ణయం తీసుకుంటామని భావిస్తున్నాం’ అన్నారు. విలీనమైతే... అంతర్జాతీయ బ్యాంకుగా!! విలీన ప్రతిపాదనలో ఉన్న బ్యాంకుల్లో భారతీయ మహిళా బ్యాంకుతో పాటు ఎస్బీఐకి చెందిన 5 అనుబంధ బ్యాంకులు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్లు ఉన్నాయి. వీటిల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్లు స్టాక్మార్కెట్లో లిస్టయ్యాయి. 2008లో ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్రను తొలిసారిగా విలీనం చేసుకుంది. రెండేళ్ల తరువాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ విలీనమైంది. ప్రస్తుతం ఎస్బీఐ బ్యాంక్ బ్యాలెన్స్‌షీట్ పరిమాణం రూ.28 లక్షల కోట్లు. ఈ విలీనాలు పూర్తయితే 50 కోట్ల కస్టమర్లతో ఎస్బీఐ బ్యాంకు పరిమాణం రూ.37 లక్షల కోట్లకు చేరుతుంది. రుణ సమీకరణ వ్యయం బాగా తగ్గుతుందని ఇప్పటికే ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. మొత్తంమీద ఈ విలీనం జరిగితే 22,500 బ్రాంచీలు, 58,000 ఏటీఎంల నెట్‌వర్క్‌తో ఎస్బీఐ అంతర్జాతీయ స్థాయి బ్యాంకుగా మారుతుంది. ప్రస్తుతం ఎస్బీఐకి 36 దేశాల్లో 191 విదేశీ కార్యాలయాలున్నాయి. దేశంలో 16,500 బ్రాంచీలున్నాయి. విలీన ప్రక్రియకు రూ.3,000 కోట్లు ఖర్చవుతుందని భట్టాచార్య తెలిపారు. అయితే ఉద్యోగ సంఘాలు ఈ ప్రతిపాదనకు తీవ్ర అభ్యంతరం చెబుతున్నాయి. బ్యాంకుల విలీనాలే ప్రభుత్వం విధానం: సమావేశం సందర్భంగా విలేకరులతో మాట్లాడిన జైట్లీ... బ్యాంకింగ్‌లో విలీనమే ప్రభుత్వ విధానమన్నారు. బడ్జెట్లోనూ ఇదే విషయాన్ని చెప్పామని గుర్తుచేశారు. ‘‘తొలి ప్రాధాన్యత మొండిబకాయిల సమస్య పరిష్కారమే. ఆ తర్వాతే విలీనాలను పరిశీలిస్తాం. మొండిబకాయిలకు భారీ ప్రొవిజనింగ్ కేటాయించాల్సి రావడం వల్ల దాదాపు 12 బ్యాంకులకు రూ.18,000 కోట్ల నష్టాలొచ్చాయి. కాబట్టి బడ్జెట్లో కేటాయించిన రూ.25,000 కోట్ల మూలధనానికి అదనంగా మరింత ఇవ్వటానికి మేం సిద్ధంగా ఉన్నాం. మొత్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.1.40 లక్షల కోట్ల నిర్వహణా లాభాలను ఆర్జించాయి. ఇది బ్యాంకింగ్ సత్తాకు నిదర్శనం. మొండిబకాయిల సమస్యపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చేసే సిఫారసులను కేంద్రం పరిశీలిస్తుంది’’ అని జైట్లీ వివరించారు. త్వరలో అమల్లోకి రానున్న దివాలా చట్టం మొండి బకాయిల సమస్య పరిష్కారంలో కీలకపాత్ర పోషిస్తుందని ఆయన తెలియజేశారు. కేబినెట్ నోట్ సిద్ధం! ఉన్నతస్థాయి వర్గాల సమాచారం ప్రకారం- ఎస్బీఐ విలీన ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే కేబినెట్ నోట్ సిద్ధమైంది. ఈ నెల చివర్లో కేబినెట్ చర్చించి సానుకూల నిర్ణయం తీసుకునే వీలుంది. లిస్టయిన ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల విలీన ప్రతిపాదన కూడా కొన్నాళ్లుగా అధికార వర్గాల పరిశీలనలో ఉంది. న్యూ ఇండియా అస్యూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియెంటల్ ఇన్సూరెన్స్, యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్‌లు ఇందులో ఉన్నాయి. -
ధనికులపై ఎల్వీబీ దృష్టి
హెచ్ఎన్ఐ ఖాతాదారులకు వ్యక్తిగత అధికారి హైదరాబాద్‌లో హెచ్ఎన్ఐ లాంజ్ కొత్తగా మారో 100 శాఖలు, 200 ఏటీఎంల ఏర్పాటు వచ్చే ఏడాది వ్యాపారంలో 20 శాతం వృద్ధి అంచనా లక్ష్మీ విలాస్ బ్యాంక్ సీవోవో విద్యాసాగర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాత తరం లక్ష్మీ విలాస్ బ్యాంక్... కొత్త ప్రైవేటు బ్యాంకులకు దీటైన పోటీ ఇవ్వటానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. దీన్లో భాగంగా వేగంగా శాఖల్ని విస్తరించటం... కొత్త పథకాలను ప్రవేశపెట్టడంపై దృష్టిసారిస్తోంది. ముఖ్యంగా అధికాదాయ వర్గాల వారిని ఆకర్షించడానికి ప్రత్యేక ఆఫర్లతో పాటు వారికోసం ప్రత్యేక శాఖలను కూడా ఏర్పాటుచేసే ఆలోచనలో ఉంది. టేకోవర్ల ముప్పు నుంచి తప్పించుకోవడానికి సొంతంగా బలపడటంపై దృష్టి పెడుతున్నామంటున్న బ్యాంక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ విద్యాసాగర్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ... వ్యాపార విస్తరణ ఈ ఏడాది వ్యాపారంలో 18 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం. డిసెంబర్ నాటికి బ్యాంకు వ్యాపార పరిమాణం సుమారు రూ.34,000 కోట్లకు చేరింది. ఇది మార్చి నాటికి రూ.38,000 కోట్లకు చేరుతుంది. వచ్చే ఏడాది కనీసం 20 శాతం వృద్థి శాతాన్ని అంచనా వేస్తున్నాం. ప్రస్తుతం దక్షిణాది పాత తరం ప్రైవేటు బ్యాంకుగా ఉన్న ముద్రను చెరిపి కొత్తతరం ప్రైవేటు బ్యాంకుగా తీర్చిదిద్దే పనిలో ఉన్నాం. ఇందులో భాగంగా దేశవ్యాప్త విస్తరణపై దృష్టి సారించాం. గత రెండేళ్ళలో కొత్తగా 110 శాఖలను ఏర్పాటు చేయడం ద్వారా మొత్తం శాఖల సంఖ్య 400కి చేరింది. వచ్చే 12 నెలల కాలంలో కొత్తగా మరో 100 శాఖలను ఏర్పాటు చేయడంతో పాటు ఏటీఎంల సంఖ్యను 800 నుంచి 1,000కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎలాంటి మార్పులంటే... అధికాదాయ వర్గాల వారిని ఆకర్షించడానికి ‘క్రౌన్’ పేరుతో కొత్త సేవలను ప్రారంభించాం. ఈ ఖాతాదారులకు ఏటీఎంల విత్‌డ్రాయల్స్, డెబిట్ కార్డులలతో పాటు, రూ.25 లక్షల ప్రమాద బీమా రక్షణ కల్పిస్తున్నాం. దేశవ్యాప్తంగా 40 శాఖల్లో ఈ ఖాతాదారులకు సేవలను అందించడం కోసం ప్రత్యేకంగా అధికారులను ఏర్పాటు చేశాం. బెంగళూరు శాఖలో క్రౌన్ లాంజ్‌ను ఏర్పాటు చేశాం. త్వరలోనే హైదరాబాద్ సహా 5 నగరాల్లో ఈ లాంజ్‌లను ఏర్పాటు చేస్తాం. వీటి తర్వాత హెచ్ఎన్ఐల కోసం ప్రత్యేకంగా క్రౌన్ శాఖనే ఏర్పాటు చేస్తాం. ఇవికాక సేవింగ్స్ ఖాతాలో రూ.లక్షపైన ఉన్న మొత్తానికి 5 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నాం. ప్రస్తుతం కరెంట్, సేవింగ్స్ (కాసా) డిపాజిట్లు 14 శాతంగా ఉన్నాయి. మార్చినాటికి ఇవి 18 శాతానికి చేరుతాయని అంచనా వేస్తున్నాం. బడ్జెట్ తరవాతే వడ్డీ రేట్లపై స్పష్టత... బడ్జెత్ తర్వాత కానీ వడ్డీరేట్ల తగ్గింపుపై స్పష్టత రాదు. ప్రస్తుత సంకేతాలను బట్టి చూస్తే వడ్డీరేట్లు మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాత రుణాలకు వడ్డీరేట్ల తగ్గింపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తగ్గించే ఆలోచనలోనే ఉన్నాం. ప్రస్తుతం బేస్ రేట్ 11.25 శాతంగా ఉంది. నిధుల కొరత లేదు... ప్రస్తుతానికి నిధుల కొరత లేదు. ఈ మధ్యనే రూ.460 కోట్లు సేకరించాం. రుణాలకు డిమాండ్ బాగా పెరిగి వృద్ధి బాగుంటే అప్పుడు అదనపు నిధులు అవసరమవుతాయి. ఆ సమయంలో నిధులను ఏ మార్గంలో సేకరించాలన్న విషయాన్ని పరిశీలిస్తాం. ప్రస్తుతం బాసెల్ 3 నిబంధనల కింద సీఏఆర్ 12.47 శాతంగా ఉంది. పోటీని తట్టుకుంటేనే... పేమెంట్ బ్యాంకులు, కొత్త బ్యాంకులు రావడం వల్ల బ్యాంకింగ్ రంగంలో పోటీతత్వం పెరుగుతుంది. ఈ పోటీని తట్టుకుంటేనే నిలబడంగలం. అందుకే కొన్ని పెద్ద బ్యాంకులు వ్యూహాత్మకంగా చిన్న బ్యాంకులను టేకోవర్ చేస్తున్నాయి. ప్రస్తుతం టేకోవర్లపై మేం ఎవరితోనూ చర్చలు జరపడం లేదు. పుకార్లకు అడ్డుకట్ట పడాలంటే బ్యాలెన్స్‌షీట్‌ను పటిష్టం చేసుకోవాలి. ఇప్పుడు మా దృష్టంతా ఎన్పీఏలను తగ్గించుకొని బ్యాలెన్స్ షీట్ మెరుగుపర్చుకోవడంపైనే ఉంది. మార్చి నాటికి స్థూల ఎన్పీఏలను 3 శాతం కిందకు, నికర ఎన్పీఏలను 2 శాతం కిందకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. డిసెంబర్ నాటికి స్థూల ఎన్పీఏలు 3.4 శాతం, నికర ఎన్పీఏలు 2.37 శాతంగా ఉన్నాయి. -
బ్యాంకు ఖాతాల్లేకపోవడం సిగ్గుచేటు
పుణే: భారతీయుల్లో చాలా మందికి బ్యాంకులు అందుబాటులో లేకపోవడం సిగ్గుచేటని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. కేవైసీ ప్రమాణాల్లో అధికారుల జోక్యాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పారు. శుక్రవారం పుణెలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్ సదస్సులో రాజన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భద్రతాపరమైన అంశాల్లో రాజీపడకుండానే బ్యాంకులను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేవిధంగా కేవైసీ ప్రమాణాలను మెరుగుపర్చవచ్చా అని ఆయన ప్రశ్నించారు. ‘పదవీ విరమణ తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడిన ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు బ్యాంకు అకౌంటు ప్రారంభించడంలో సమస్యలు ఎదుర్కొన్నారు. నివాస ధ్రువీకరణ పత్రాలు సమర్పించలేకపోవడంతో ఆయనకు చిక్కులు ఎదురయ్యాయి. బ్యాంకు ఖాతా ప్రారంభించడంలోనూ, ఇతర ద్రవ్య లావాదేవీల్లోనూ కేవైసీ (మీ ఖాతాదారును తెలుసుకోండి) ప్రమాణాలను కఠినతరం చేసిన దువ్వూరికే ఇలాంటి అనుభవం ఎదురవడం ఆశ్చర్యకరం. ఆర్బీఐ మాజీ ఉన్నతాధికారే బ్యాంకు అకౌంటును ప్రారంభించలేకపోయారంటే వ్యవస్థలోనే లోపం ఉందని భావించాలి...’ అని రాజన్ వ్యాఖ్యానించారు. దేశ జనాభా 123 కోట్లుండగా కేవలం 35 కోట్ల మందికే బ్యాంకు ఖాతాలున్నాయని ఈ సదస్సులో ప్రసంగించిన కోటక్ మహీంద్రా బ్యాంక్ వైస్ చైర్మన్ ఉదయ్ కోటక్ తెలిపారు. మొండిబకాయిలపై...: అంతకంతకూ పెరిగిపోతున్న మొండిబకాయిల(ఎన్పీఏ) సమస్యను పరిష్కరించేందుకు సరైన మార్గాలు వెతకాలే తప్ప పైపై మెరుగులు దిద్దేందుకు ప్రయత్నించరాదని బ్యాంకులకు రాజన్ సూచించారు. వరుసగా మూడేళ్లు కట్టకపోయినంత మాత్రాన సదరు రుణాలను మొండిబకాయిలుగా లెక్కించకుండా, మరికొంత సమయం ఇవ్వాలంటూ బ్యాంకులు, కార్పొరేట్ల నుంచి తమకు అభ్యర్థనలు వచ్చినట్లు ఆయన చెప్పారు. ‘రుణం తీసుకున్న వారు నేడు కట్టకపోతే.. రేపు కూడా కట్టలేకపోవచ్చు. ఈ సమస్యను పరిష్కరించాలంటే.. సదరు రుణాన్ని ఏ విధంగా మళ్లీ రాబట్టుకోవచ్చన్న దానిపై దృష్టి పెట్టాలి’ అని చెప్పారు. బ్యాంకుల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) డిసెంబర్ క్వార్టర్లో ఆల్‌టైమ్ గరిష్టమైన 5 శాతం పైకి పెరిగిన సంగతి తెలిసిందే. వాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు బ్యాంకింగ్ లెసైన్సులు రాని సంస్థలపై రాజన్ వ్యాఖ్య పుణే: బ్యాంకింగ్ లెసైన్సుల కోసం 25 దరఖాస్తులు రాగా రెండు సంస్థలకు మాత్రమే వాటిని జారీచేయడాన్ని రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ సమర్థించుకున్నారు. దరఖాస్తు చేసిన సంస్థల్లో కొన్ని ప్రత్యేక సేవల (డిఫరెన్షియేటెడ్) బ్యాంకులుగా మెరుగ్గా పనిచేస్తాయని ఎంపిక కమిటీ భావించిందని చెప్పారు. ఆర్బీఐ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్ (ఎన్ఐబీఎం) వార్షిక సదస్సు సందర్భంగా శుక్రవారం పుణెలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘దరఖాస్తుల జాబితాను మేం సమగ్రంగా పరిశీలించాం. బిమల్ జలాన్ కమిటీ, ఆర్బీఐ సంతృప్తి వ్యక్తం చేసిన జాబితా ఇది. ప్రస్తుతం లెసైన్సులు లభించని వారు మేం మళ్లీ లెసైన్సుల జారీని ప్రారంభించినపుడు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తాం. అంతేకాదు, ప్రత్యేక సేవల బ్యాంకింగ్ లెసైన్సులను కూడా సృష్టిస్తాం. పూర్తి లెసైన్సు కంటే ప్రత్యేక సేవల లెసైన్సును అభ్యర్థించడం కొందరు దరఖాస్తుదారులకు మంచిది కావచ్చు..’ అని ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యానించారు. మౌలిక సౌకర్యాల ప్రాజెక్టులకు ఫైనాన్స్ చేసే ఐడీఎఫ్సీ, కోల్‌కతాకు చెందిన బంధన్ సంస్థలకు రిజర్వు బ్యాంకు ఇటీవల బ్యాంకింగ్ లెసైన్సులు మంజూరు చేసిన సంగతి విదితమే. ఇండియా పోస్ట్‌కు లెసైన్సు ఇవ్వదలచుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా సంప్రదించడం మంచిదని బిమల్ జలాన్ కమిటీ పేర్కొందని రాజన్ చెప్పారు.