‘నమస్తే సర్, నేను ఆడిటర్ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. మీ లాస్ట్ ఇయర్ బాలెన్స్ షీట్ కాపీ మీ ఫైల్‌లో మిస్ అయ్యింది. మీ దగ్గరుంటే మెయిల్ చేస్తారా. అలాగే ఈ సంవత్సరం బ్యాడ్ డెట్స్ కి ప్రొవిజిన్ ఏమైనా ఉంచాలా అని సర్ అడగమన్నారు‘ . ఆదివారం పొద్దున్న కాఫీ తాగుతూ పేపర్ చదువుతూ ఉండగా వచ్చిన ఫోనది. ‘ఓకే కాపీ ఇప్పుడే మెయిల్ చేస్తాను. ఎప్పటి లాగే బ్యాడ్ డెట్స్‌కి ప్రొవిజిన్ అవసరం లేదని ఆడిటర్ గారికి చెప్పండి‘ అన్నాను మొదటి విషయం కొంచెం విసుగ్గా చివరి విషయం కొంచెం గర్వంగా చెబుతూ. ఫోన్‌లో డేటా అంతా వెతికితే దొరికింది లాస్ట్ ఇయర్ బాలెన్స్ షీట్. స్టాక్, క్యాష్, బ్యాంకు బాలెన్స్, గుడ్ విల్, షాపు మార్కెట్ వేల్యూ లాంటివి కలిపితే రెండు కోట్ల నికర ఆస్తి. ఆ ఫిగర్ చూస్తే కలిగే ఆనందం కన్నా, బ్యాడ్ డెట్స్ (రానిబాకీలు) దగ్గర ఉండే సున్నా చూస్తే నాకెక్కువ ఆనందం. ఫార్మా స్టాకిస్టుగా బిజినెస్ మొదలు పెట్టి దాదాపు పదేళ్లు కావస్తోంది. ఇరవై లక్షలతో మొదలుపెట్టిన వ్యాపారం, డైటింగ్‌లో ఉన్న మెడికల్ ఎథిక్స్ సాక్షిగా, నాలాంటి వాళ్ళ లైఫ్ స్టైల్ డిసీజెస్ పుణ్యమా అని పదేళ్లలో పదింతలైంది. సాధారణంగా రిటైలర్స్‌కి క్రెడిట్ బేసిస్‌లో స్టాక్ సప్లై చెయ్యాలి. కానీ నేను కేవలం మొనోపలీ ఉన్న కంపెనీ మందులే డీల్ చేస్తాను. కొంచెం మార్జిన్ తక్కువైనా సరే. అందుచేత రిటైలర్స్‌కి అరువు ఇవ్వను. ఇచ్చినా ఎక్కువ రోజులు ఇవ్వను. పాత బాకీ తీరిస్తే కానీ స్టాక్ పంపను. కొత్తలో కొంచెం ఇబ్బంది పడినా వాళ్ళూ అలవాటు పడిపోయారు. నేను కూడా కంపెనీలకి అరువు పెట్టను. ’అప్పు, అబద్ధం కలిసి జీవిస్తాయి’ అన్న ఫ్రాన్స్ వ రెబ్లే మాటల్ని నేను గట్టిగా నమ్ముతాను. ఆడిటర్ ఆఫీస్‌కి మెయిల్ చేసి, ఆదివారం కావడంతో సంచి తీసుకుని పక్కనే ఉన్న రైతు బజార్ కి కూరలకి బయలుదేరాను.
‘‘బాబూ, వంకాయలెలాగ? ‘‘అడిగా . ‘నల్లవి కిలో పదహారు, తెల్లవి పద్దెనిమిది సారూ’ అన్నాడతను జాగా నా చేతికిస్తూ. ‘‘ఇదిగో తెల్లొంకాయలు ఓ పావు ఇయ్యి’’ అంటూ జాగాలో ఏరిన వంకాయలు ఆ రైతుకిచ్చా. ‘‘సారూ చిల్లర ఐదు రూపాయలుండాల’’ అంటూ పావుకి కొంచెం ఎక్కువగా ఉన్న వంకాయలు నా సంచీలో పోశాడా రైతు ఊడిపోయిన తన ఐ.డి కార్డుని తిరిగి చొక్కాకి తగిలించుకుంటూ. అది మా ఇంటికి దగ్గరలో ఉన్న రైతు బజార్. ఆరోజు ఆదివారం కావడంతో రైతుబజారంతా రద్దీగా ఉంది. కూరలెప్పుడూ ఇంటిపక్కనుండే బడ్డీ కొట్లో నా భార్యే కొంటుంది. మూడు రోజులనుంచి ఆ షాప్ తెరవటం లేదు. అందుకని ఆదివారం కదా అని నేనే రైతు బజార్‌కి బయలుదేరా. నా భార్య చెప్పిన ప్రకారం ఆ బడ్డీ కొట్లో కిలో అరవైకి తక్కువ ఏ కూరా ఉండదు. అవే కూరలు రైతు బజార్ లో పన్నెండు నుంచి ఇరవై నాలుక్కి మించి లేవు ఒక్క ఆగాకరకాయే కిలో ఏభై. అది బయట నూట ఇరవయ్యట. ఇలా కృష్ణదేవరాయల కాలంలా ఓ నూట ఏభై రూపాయలతో దాదాపు సంచి నిండిపోయింది మొత్తం తిరిగేసరికి. బయటకి వెళుతూ ఉంటే ఓ చోట జనం బాగా మూగి, ఒంగుని ఉన్నారు. ఏంటో చూద్దామని దగ్గరకి వెళ్ళాను.
తన శరీరంలాగే ముడతలు పడిన నేత చీర, ముక్కుకి చేతి కడియమంత రింగు, పౌర్ణమి వెన్నెలలా తెల్లని జుట్టు, సాయంత్రం జెండాలా వంగిన నడుముతో ఓ అవ్వ చింత చిగురు అమ్ముతోంది. మొత్తం కలిపి ఆమె దగ్గర ఓ కేజీ, కేజిన్నర ఉంటుంది. వంద గ్రాములు ఇరవై రూపాయలట. కాటా పక్కనే న్యూస్ పేపర్ లో సిటీ ఎడిషన్‌ని ఒక్కో పేజీ రెండు ముక్కలు చేస్తోంది. అంతమంది ఆ కొద్దిపాటి చింత చిగురికీ పోటీ పడుతున్నందుకు అదే నేనైతే ఇరవై కాస్తా ఏభై చేద్దును. డిమాండ్ అండ్ సప్లై గురించి తెలియని ఆమె మాత్రం తూకం ఎక్కడా తగ్గకుండా, అలా అని మరీ ఎక్కువ మొగ్గకుండా చూసుకోవటంలో బిజీగా ఉంది. ఆమెకి షాపు దొరకలేదులా ఉంది ఓ చోట ఎండలో నేలమీదే అమ్ముతోంది. వీరుణ్ణి జోకొట్టే చీకటి పిరికివాణ్ణి భయపెట్టినట్టు, తీవ్రమైన ఎండ ఆమెనేం చేయలేక తన ప్రతాపమంతా మా మీద చూపిస్తోంది. ఒక్కొక్కరికీ వంద గ్రాములు తూచి పేపర్ లో పొట్లంగట్టి ఇస్తోంది. పేపర్లు అయిపోతే పక్కనే ఉన్న దుకాణం వాళ్ళని బతిమాలి అడిగి తెచ్చుకుంటోంది. ఎవరో అడిగారు ‘ఏమ్మా అందరిలాగే నువ్వుకూడా పోలిథిన్ కవర్లు పెట్టుకోవచ్చు కదా. ఈ పేపర్లు ఎంతకని చింపుతావు?’’ అని. దానికి ఆ అవ్వ నెమ్మదిగా ఆగి ఆగి ఆయాసంతో చెబుతోంది. తనది దగ్గర్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతమట. ఇంతకుముందు తనకి ఓ ఆవు ఉండేదట. అది ఉన్నపళంగా చచ్చిపోయిందట. పశువుల డాక్టర్ చూసి, వాళ్ళ వూరు విహారానికి వచ్చిన వాళ్ళు తిని పడేసిన పాలిథిన్ కవర్లు తినటం వల్ల చచ్చిపోయిందని చెప్పాడట. అప్పటినుంచి ఇలా తను మోయగలిగే బరువున్న చింతచిగురు కోసి పల్లెవెలుగు బస్సులో వచ్చి ఇక్కడ రైతుబజార్‌లో అమ్ముకుని పొట్ట పోసుకుంటోందట. ఎవరూ లేరా అని మరొకరడిగిన ప్రశ్నకి ఓ కొడుకుండేవాడని చెప్పింది. అలా చెప్పినప్పుడు ప్రస్తుతం తన ఒంటరితనాన్ని సూచించేలా ఆమె కళ్ళల్లో తడి. ఆమె కాలికున్న వెండి కడియం జీవితంలో ఆమె మోసిన బరువులకి ప్రతీకలా ఉంది. పగిలిన పాదాలు ఆమె లెక్కలేనన్నిసార్లు ఎక్కి దిగిన కొండదారులకి నిలువుటద్దంలా ఉన్నాయి. వెరసి అలసిన అనుభవంలా, అలలు లేని అర్ణవంలా ఉందా ఎనభైఏళ్ళ అవ్వ. ఇంతలో ఎవరో అడిగారు. ‘‘అవ్వా, ఇది ఎలా వండాలి’’? అని. ఆమె మొహం చేటంతయ్యింది. బోసి నోరుతో చేసే పని ఆపేసి చెప్పటం మొదలు పెట్టింది. పెసరపప్పుతో కలిపి వండి, వెల్లుల్లి పాయల పోపు పెట్టి, నెయ్యితో తింటే భలే రుచిగా ఉంటుందట. అలాగే మాంసంతో కూడా కలిపి వండుకోవచ్చట. అలా చెబుతున్నపుడు ఆమె కళ్ళల్లో రిటైర్ అయిపోయిన మాస్టారిని తిరిగి పాఠం చెప్పమన్నప్పుడు కలిగే ఆనందం. చివరకి నా వంతు వచ్చింది. నేనూ ఓ వందగ్రాముల పొట్లం తీసుకుని, జేబులో ఉన్న చిల్లరంతా అయిపోగా పర్సులోంచి ఐదొందల నోటు తీసిచ్చా. ‘‘సిల్లర నేదు బాబూ, మార్చి ఇవ్వు’’ అంటూ నా పెద్ద నోటు నాకు తిరిగిచ్చేసి నా తర్వాత వాళ్లకి తూకం వెయ్యటం మొదలు పెట్టింది.
‘రేయ్ ఈరోజు సోమవారం కదా, పార్సెల్ ఆఫీస్ కి స్టాక్ వచ్చిందో లేదో ఫోన్ చేసి కనుక్కో’ అని కుర్రాడికి చెప్తూ, ‘చెప్పండి మాస్టారు, లిస్ట్ తెచ్చారా’ అన్నాను ఎదురుగా ఉన్న పెద్దాయన్ని. అప్పటికే ఇద్దరు మెడికల్ రిప్రజెంటేటివ్‌లు, మరో ఇద్దరు మెడికల్ షాపు వాళ్ళతో షాపు బిజీ గా ఉంది. ‘ఆ ఏం లేదు సర్, ముందు వాళ్ళ పని చూడండి‘ అన్నాడతను వినయంగా. ఆయన పేరు రామారావు. ప్రతీ నెలా ఓ.టి.సి మెడిసిన్స్, సింపుల్ యాంటీ బయోటిక్స్, మల్టీ విటమిన్ టేబ్లెట్లు లాంటివి ఓ ఐదువేల రూపాయలకి కొంటూ ఉంటాడు. మామూలుగా అయితే మేం రిటైల్ సేల్స్ చెయ్యకూడదు. ఓ డాక్టర్ గారి రిఫరెన్స్ ద్వారా పరిచయం అయ్యాడు. రిటైల్ షాపుల కంటే కొంచెం ఎక్కువ డిస్కౌంట్ ఇస్తామని ఇక్కడ కొంటూ ఉంటాడు. బహుశా చుట్టుపక్కల పల్లెటూర్లో ఓ చిన్న కిరాణా కొట్లో పెట్టి అమ్ముకుంటాడేమో. అందరినీ డిస్పోజ్ చేసి ఆయన కేసి తిరిగి అడిగా. ‘‘మాస్టారూ చెప్పండి ఏమిటి సంగతి’’ అని. ఎప్పటి లాగే ఆయన ఓ చీటీ ఇచ్చాడు. ఆ చీటీ మా కుర్రాడికి ఇచ్చి అవేవో చూసి ఇమ్మన్నా. అప్పుడతను నెమ్మదిగా, కొంచెం మొహమాటంగా అన్నాడు ‘సర్, ఈ అమౌంట్ నెక్ట్స్‌ట్‌మంత్ వచ్చినప్పుడు ఇవ్వొచ్చా, కొంచెం డబ్బులు అవసరం’’. అప్పుడు చూశాను అతనివైపు నిశితంగా. నెరిసిన తల, నలిగిన చొక్కా, కాలికి హవాయి చెప్పులు, ఓ పాత స్కూటరు, చూడగానే చిక్కిపోయిన సిబిల్ స్కోర్‌లా ఉన్నాడు. పైగా ఇలాంటి వాళ్ళ సంగతి నాకు కాకపోయినా, మా బిజినెస్ లో ఉన్నవాళ్ళకి అలవాటే. ఓ ఏడాది అలవాటుగా కొంటారు. మరోచోట కొంచెం ఎక్కువ డిస్కౌంట్ రాగానే, చివరగా ఏడాది పరిచయాన్ని నమ్మకంగా మార్చి అప్పు అడిగి మరింక కనబడరు. ఎన్ని వినలేదు. అయినా నన్ను అప్పు అడగటం అంటే నిప్పులో తడి, నీటిలో పొడి వెతకటమే.
‘మాస్టారూ, మాది హోల్ సేల్ బిజినెస్. ఇక్కడ రిటైల్‌గా మీకు పదిహేడు పర్సెంట్ డిస్కౌంట్‌తో మందులు అమ్మటమే ఎక్కువ. దానికి తోడు అప్పంటే కష్టం సర్. పైగా ఈ ఏడు బిజినెస్ అంతగా లేదు. ఏమీ అనుకోకండి. పేమెంట్ చేసి మందులు తీసికెళ్ళండి’ అంటూ అప్పటికే అలవాటు ప్రకారం మా కుర్రాడు ప్యాక్ చేసిన మందుల్ని నా కౌంటర్ వెనకాల పెట్టేసా. అతను మారు మాట్లాడకుండా, ‘‘సారీ సర్, ఇదిగో డబ్బులు. కొంచెం అర్జెంటు అవసరం పడి అడిగాను’’ అంటూ జేబులోంచి డబ్బులు తీసిచ్చి, మందులు తీసికెళ్ళాడు. వలని తప్పించుకున్న చేపలా విజయగర్వంతో ఆ డబ్బుని క్యాష్ కౌంటర్‌లో పెట్టుకున్నా. ఆ మర్నాడు యథావిధిగా ఉదయం తొమ్మిదింటికి భోజనానికి కూర్చున్నాను. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌కి బదులు లంచ్ చేసి ఇంటి కిందనే ఉన్న షాపుకి వెళ్ళటం నా అలవాటు. కంచంలో చింత చిగురు పప్పు. అచ్చం అవ్వ చెప్పినట్టే వెల్లుల్లిపాయల పోపుపెట్టి, నెయ్యి కలుపుకుని తింటే నిజంగానే చాలా రుచిగా ఉంది. అప్పుడు గుర్తొచ్చింది నాకు ఆ అవ్వకి నేను ఇరవై రూపాయలు బాకీ ఉన్న సంగతి. చిల్లర మార్చి ఇమ్మన్న తరువాత ఆ విషయమే మర్చి పోయాను. భోజనం అవగానే షాపుకి వెళ్లకుండా నేరుగా రైతు బజార్ కి వెళ్ళాను. నా షాపుకి మూడు షాపుల అవతలే రైతు బజార్. అంతా వెతికా. ఎక్కడా అవ్వ కనబడలేదు. బహుశా వెళ్లిపోయిందో లేక అసలు రాలేదో, సరే వచ్చే ఆదివారం తప్పకుండా వెళ్లి ఇచ్చేయాలి అనుకుని, షాపు కి వచ్చా.
నా షాపు కి ఆనుకుని ఓ చిన్న టీ కొట్టుంది. అప్పుడప్పుడు రైతులు అక్కడకి వచ్చి టీ తాగుతూ ఉండటం చూశా. ఎవరో ఓ ఇద్దరు రైతుల్లా ఉన్నారు. కూర్చుని టీ తాగుతున్నారు. అప్పుడే అక్కడకి వచ్చిన రామారావుని చూసి వాళ్లిద్దరూ లేచి నించుని విష్ చేశారు. వాళ్లంతా ఏదో మాట్లాడుకున్నారు. కాసేపటికి రామారావు అక్కడనించి వెళ్ళిపోయాడు. పోనీ వీళ్ళకేమైనా అవ్వ విషయం తెలుస్తుందేమోనని వాళ్ళని దగ్గరకి పిలిచా. వచ్చారు. ‘‘ఏవయ్యా రైతు బజార్లో ఓ అవ్వ చింత చిగురు అమ్ముతూ ఉంటుంది. ఈరోజు వచ్చినట్టు లేదు. మీకేమైనా తెలుసా’’ అని అడిగా. ‘ఆ అవ్వ నిన్ననే పోయిందయ్యా, మా వూరే, ఆదివారం సులువుగానే తిరిగింది. మాతోబాటే వచ్చి, యాపారం అయిపోగానే బస్సులో వచ్చేసింది. రాత్రికి బాగా జొరం వచ్చింది. తెల్లవారి ఆసుపత్రికి తీసుకెళ్లటం కొంచెం ఆలీసం అయ్యింది. ఆ ముసలి పానం తట్టుకోలేకపోయిందయ్యా. ఇప్పుడు మాటాడాం కదయ్యా, ఆ బాబు ప్రతీ నెలా మా ఊరొచ్చి జొరానికీ, బలానికి మందులు పంచుతా ఉంటాడయ్యా. నిన్న కూడా ఆ బాబు కి ఫోన్ జేశాము. వొచ్చి ఆసుపత్రి కి తీసుకు పోతానన్నాడు. ఆ అయ్య వచ్చే కాడికి అవ్వ పానాలొగ్గేసింది. ఆసుపత్రికి తోల్క పోడానికి డబ్బులు కూడా తెచ్చినాడు. లెక్క కూడ్డానికి కూసింత లేటైనాదంట పాపం. ఆ డబ్బే అవ్వని దానపర్చటానికి(దహనానికి) పనికొచ్చినాయి. అదే ఆ బాబు, మేము బాదపడతా వుండాము’ అన్నారు ఇద్దరూ మార్చి మార్చి చెబుతూ. ఇంతలో నా ఫోన్‌లో జీమెయిల్ మెసేజ్. ఓపెన్ చేసి చూస్తే ఆడిటర్ పంపిన ఈ ఏడు బ్యాలెన్స్ షీట్. రెండు కోట్ల ఐదువేల ఇరవై రూపాయల నికర ఆస్తి. ఎప్పటిలాగే రానిబాకీలు సున్నా. బహుశా ఆ అవ్వకి కూడా బ్యాలెన్స్ షీట్ వేసే అలవాటుంటే అందులో బ్యాడ్ అండ్ డౌట్ ఫుల్ డెట్స్ లో నా పేరుండేదేమో. మిన్ను విరగలేదు. మన్ను పెగల్లేదు. నా చూపు మాత్రం నేలని దాటి పాతాళాన్ని తాకింది. ఎవరో నా నెత్తిమీద సుత్తితో కొట్టి మరీ నన్ను కుదించినట్టయింది. అరవై ఏళ్ళ వయసులో రామారావు చేసే సేవ బ్యాలెన్స్ షీట్లని దాటేసింది. నన్నడిగితే అప్పు తప్పకుండా పుడుతుందన్న ఐదున్నర అడుగుల అతని నమ్మకం ఏడడుగుల ఏరై నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. అతనడిగింది పెద్ద మొత్తమేమీ కాదు. నేనిచ్చినంత మాత్రాన ఆ అవ్వ ప్రాణాలు నిలబడతాయనీ కాదు. కనీసం గోటితో పోయేచోట కూడా తోటి వారిని నమ్మలేని నా అతి జాగ్రత్త నన్ను దోషిగా నిలబెట్టింది.
‘చిల్లర మార్చి ఇవ్వు బాబూ ‘అన్న ఎనభై ఏళ్ళ అవ్వ నమ్మకం నింగికి నిచ్చెనేసింది. వందేళ్ల చింత చెట్టు ఇంకా చిగురిస్తూనే ఉంది. నా టేబుల్ మీదున్న బోన్సాయ్ మొక్క నన్ను వెక్కిరిస్తోంది.
- ఉమా మహేష్ ఆచాళ్ళ ∙
తీరని బాకీ
Published Sun, Mar 17 2019 12:47 AM | Last Updated on Sun, Mar 17 2019 12:47 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment