న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) బ్యాలెన్స్‌షీట్ మరింత పటిష్టపడినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ ముకేశ్ అంబానీ స్పష్టం చేశారు. ఇటీవల కొత్త రికార్డులు నెలకొల్పుతూ భారీ స్థాయిలో నిధుల సమీకరణ చేపట్టడంతో లిక్విడిటీ పెరిగినట్లు తెలియజేశారు. తద్వారా అత్యధిక వృద్ధిని సాధిస్తున్న జియో, రిటైల్, ఆయిల్ టు కెమికల్(ఓటూసీ) విభాగాల వృద్ధి ప్రణాళికలకు మద్దతు లభించనున్నట్లు పేర్కొన్నారు.
ఆర్‌ఐఎల్ విడుదల చేసిన తాజా వార్షిక నివేదిక ప్రకారం టెలికం, డిజిటల్ బిజినెస్‌ల విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌తోపాటు.. రిటైల్ విభాగంలోనూ మైనారిటీ వాటాల విక్రయం ద్వారా దాదాపు రూ. 2 లక్షల కోట్లను సమీకరించింది. అంతేకాకుండా రైట్స్ ఇష్యూ ద్వారా మరో రూ. 53,124 కోట్లు సమకూర్చుకున్నట్లు ముకేశ్ తెలిపారు. వెరసి భారీ లిక్విడిటీతో పటిష్టమైన బ్యాలెన్స్‌షీట్.. వేగవంత వృద్ధిలో ఉన్న జియో, రిటైల్, ఓటూసీల ప్రణాళికలకు అండగా నిలవనున్నట్లు పేర్కొన్నారు.
నిధుల సమీకరణ ఇలా: గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో ఆర్‌ఐఎల్ రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 53,124 కోట్లు సమీకరించింది. ఇది గత దశాబ్ద కాలంలో నాన్‌ఫైనాన్షియల్ రంగ సంస్థ చేపట్టిన అతిపెద్ద ఇష్యూగా నిలిచింది. ఇదేవిధంగా మైనారిటీ వాటాల విక్రయం ద్వారా జియో ప్లాట్‌ఫామ్స్‌కు రూ. 1,52,056 కోట్లు, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ విభాగానికి రూ. 47,265 కోట్లు చొప్పున లభించాయి. ఈ కంపెనీల్లో అంతర్జాతీయ దిగ్గజాలు ఫేస్‌బుక్, గూగుల్ వంటివి వ్యూహాత్మక ఇన్వెస్టర్లుగా చేరినట్లు ముకేశ్ పేర్కొన్నారు. జియోలో 33.7%, రిటైల్‌లో 15% చొప్పున వాటాలు విక్రయించింది.
ఇంధన రిటైలింగ్ బిజినెస్‌లో గ్లోబల్ దిగ్గజం బీపీ 49% వాటాకు రూ. 7,629 కోట్లు ఇన్వె స్ట్ చేసినట్లు ప్రస్తావించారు. దీంతో దేశంలోనే గరిష్ట స్థాయిలో రూ. 2,60,074 కోట్లు(36 బిలియన్ డాలర్లు) సమీకరించగలిగినట్లు వివరించారు. ఈ బాటలో ఓటూసీలో 20 శాతం వాటాను సౌదీ అరామ్‌కోకు విక్రయించే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశారు. ఈ వాటా ద్వారా 15 బిలియన్ డాలర్లను సమకూరవచ్చని అంచనా. ఈ నేపథ్యంలో గడువు(2021 మార్చి)కంటే ముందుగానే ఆర్‌ఐఎల్ నికర రుణరహిత కంపెనీగా ఆవిర్భవించినట్లు చెప్పారు. గతేడాది ఆర్‌బీఐ నుంచి అనుమతులు పొందడం ద్వారా 7.8 బిలియన్ డాలర్ల విదేశీ మారక దీర్ఘకాలిక రుణాలను ముందస్తుగా చెల్లించినట్లు వెల్లడించారు. ఇది దేశీ కార్పొరేట్ రుణాలకు సంబంధించి అత్యధిక ప్రీపేమెంట్‌గా పేర్కొన్నారు.
ఎన్‌ఎస్‌ఈలో రిలయన్స్ షేరు దాదాపు 2 శాతం లాభపడి రూ. 2,207 వద్ద ముగిసింది.
దేశీ 5జీ ప్లాట్‌ఫాంపై జియో కసరత్తు
డిజిటల్ ప్లాట్‌ఫాంలు, దేశీయంగా అభివృద్ధి చేసిన 5జీ ఆర్‌ఏఎన్ ప్లాట్‌ఫాంను వేగవంతంగా అందుబాటులోకి తెచ్చేందుకు టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. తదుపరి 30 కోట్ల మంది మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు, 5 కోట్లకు పైగా ఫైబర్ హోమ్స్, 5 కోట్ల పైచిలుకు లఘు, చిన్న మధ్య తరహా సంస్థలకు సరిపడేంత స్థాయిలో నెట్‌వర్క్ సామర్థ్యాన్ని సాధించినట్లు ముకేశ్ అంబానీ చెప్పారు. చిప్‌సెట్ తయారీ దిగ్గజం క్వాల్‌కామ్‌తో కలిసి భారత్‌లో 5జీ సొల్యూషన్స్‌ను విజయవంతంగా పరీక్షించినట్లు, 1జీబీపీఎస్ మైలురాయిని అధిగమించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రపంచ డిజిటల్ విప్లవంలో భారత్ ముందు వరుసలో ఉందని అంబానీ వివరించారు. ప్రతి ఇంటికీ, కార్యాలయానికి వేగవంతమైన ఇంటర్నెట్, డిజిటల్ సర్వీసులు అందించేలా రాబోయే కొన్ని సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా భారీ వైర్‌లైన్ నెట్‌వర్క్ నిర్మించడంపై జియో ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment