బ్యాంకు ఖాతాల్లేకపోవడం సిగ్గుచేటు | Rajan talks tough on NPAs | Sakshi
Sakshi News home page

బ్యాంకు ఖాతాల్లేకపోవడం సిగ్గుచేటు

Published Sat, Apr 5 2014 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 5:35 AM

బ్యాంకు ఖాతాల్లేకపోవడం సిగ్గుచేటు

బ్యాంకు ఖాతాల్లేకపోవడం సిగ్గుచేటు

పుణే: భారతీయుల్లో చాలా మందికి బ్యాంకులు అందుబాటులో లేకపోవడం సిగ్గుచేటని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. కేవైసీ ప్రమాణాల్లో అధికారుల జోక్యాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పారు. శుక్రవారం పుణెలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ సదస్సులో రాజన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భద్రతాపరమైన అంశాల్లో రాజీపడకుండానే బ్యాంకులను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేవిధంగా కేవైసీ ప్రమాణాలను మెరుగుపర్చవచ్చా అని ఆయన ప్రశ్నించారు.

‘పదవీ విరమణ తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడిన ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు బ్యాంకు అకౌంటు ప్రారంభించడంలో సమస్యలు ఎదుర్కొన్నారు. నివాస ధ్రువీకరణ పత్రాలు సమర్పించలేకపోవడంతో ఆయనకు చిక్కులు ఎదురయ్యాయి. బ్యాంకు ఖాతా ప్రారంభించడంలోనూ, ఇతర ద్రవ్య లావాదేవీల్లోనూ కేవైసీ (మీ ఖాతాదారును తెలుసుకోండి) ప్రమాణాలను కఠినతరం చేసిన దువ్వూరికే ఇలాంటి అనుభవం ఎదురవడం ఆశ్చర్యకరం. ఆర్‌బీఐ మాజీ ఉన్నతాధికారే బ్యాంకు అకౌంటును ప్రారంభించలేకపోయారంటే వ్యవస్థలోనే లోపం ఉందని భావించాలి...’ అని రాజన్ వ్యాఖ్యానించారు. దేశ జనాభా 123 కోట్లుండగా కేవలం 35 కోట్ల మందికే బ్యాంకు ఖాతాలున్నాయని ఈ సదస్సులో ప్రసంగించిన కోటక్ మహీంద్రా బ్యాంక్ వైస్ చైర్మన్ ఉదయ్ కోటక్ తెలిపారు.

 మొండిబకాయిలపై...: అంతకంతకూ పెరిగిపోతున్న మొండిబకాయిల(ఎన్‌పీఏ) సమస్యను పరిష్కరించేందుకు సరైన మార్గాలు వెతకాలే తప్ప పైపై మెరుగులు దిద్దేందుకు ప్రయత్నించరాదని బ్యాంకులకు రాజన్ సూచించారు. వరుసగా మూడేళ్లు కట్టకపోయినంత మాత్రాన సదరు రుణాలను మొండిబకాయిలుగా లెక్కించకుండా, మరికొంత సమయం ఇవ్వాలంటూ బ్యాంకులు, కార్పొరేట్ల నుంచి తమకు అభ్యర్థనలు వచ్చినట్లు ఆయన చెప్పారు. ‘రుణం తీసుకున్న వారు నేడు కట్టకపోతే.. రేపు కూడా కట్టలేకపోవచ్చు. ఈ సమస్యను పరిష్కరించాలంటే.. సదరు రుణాన్ని ఏ విధంగా మళ్లీ రాబట్టుకోవచ్చన్న దానిపై దృష్టి పెట్టాలి’ అని చెప్పారు.  బ్యాంకుల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) డిసెంబర్ క్వార్టర్‌లో ఆల్‌టైమ్ గరిష్టమైన 5 శాతం పైకి పెరిగిన సంగతి తెలిసిందే.
 
 వాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు
 బ్యాంకింగ్ లెసైన్సులు రాని సంస్థలపై రాజన్ వ్యాఖ్య
 పుణే: బ్యాంకింగ్ లెసైన్సుల కోసం 25 దరఖాస్తులు రాగా రెండు సంస్థలకు మాత్రమే వాటిని జారీచేయడాన్ని రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ సమర్థించుకున్నారు. దరఖాస్తు చేసిన సంస్థల్లో కొన్ని ప్రత్యేక సేవల (డిఫరెన్షియేటెడ్) బ్యాంకులుగా మెరుగ్గా పనిచేస్తాయని ఎంపిక కమిటీ భావించిందని చెప్పారు. ఆర్‌బీఐ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐబీఎం) వార్షిక సదస్సు సందర్భంగా శుక్రవారం పుణెలో ఆయన మీడియాతో మాట్లాడారు.

‘దరఖాస్తుల జాబితాను మేం సమగ్రంగా పరిశీలించాం. బిమల్ జలాన్ కమిటీ, ఆర్‌బీఐ సంతృప్తి వ్యక్తం చేసిన జాబితా ఇది. ప్రస్తుతం లెసైన్సులు లభించని వారు మేం మళ్లీ లెసైన్సుల జారీని ప్రారంభించినపుడు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తాం. అంతేకాదు, ప్రత్యేక సేవల బ్యాంకింగ్ లెసైన్సులను కూడా సృష్టిస్తాం. పూర్తి లెసైన్సు కంటే ప్రత్యేక సేవల లెసైన్సును అభ్యర్థించడం కొందరు దరఖాస్తుదారులకు మంచిది కావచ్చు..’ అని ఆర్‌బీఐ గవర్నర్ వ్యాఖ్యానించారు. మౌలిక సౌకర్యాల ప్రాజెక్టులకు ఫైనాన్స్ చేసే ఐడీఎఫ్‌సీ, కోల్‌కతాకు చెందిన బంధన్ సంస్థలకు రిజర్వు బ్యాంకు ఇటీవల బ్యాంకింగ్ లెసైన్సులు మంజూరు చేసిన సంగతి విదితమే. ఇండియా పోస్ట్‌కు లెసైన్సు ఇవ్వదలచుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా సంప్రదించడం మంచిదని బిమల్ జలాన్ కమిటీ పేర్కొందని రాజన్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement