రాజన్‌ సూచనలు శిరోధార్యం | Sakshi Editorial Over Raghuram Rajan Suggestions To Indian Banks | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 13 2018 1:21 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

Sakshi Editorial Over Raghuram Rajan Suggestions To Indian Banks

రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ (ఫైల్‌ ఫొటో)

నిజాన్ని నిక్కచ్చిగా చెప్పే అలవాటున్న రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ మరో సారి కుండబద్దలు కొట్టారు. బ్యాంకుల మొండి బకాయిలకు మూలాలు ప్రభుత్వ నిర్ణయాల్లో, తీరు తెన్నుల్లో ఉన్నాయని వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్నాయి గనుక సహజంగానే అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ పార్లమెంటరీ కమిటీకి రాజన్‌ ఇచ్చిన నోట్‌ను తమకనుకూలంగా మలచుకునే ప్రయత్నాన్ని ప్రారంభించాయి. అత్యధిక శాతం మొండి బకాయిలకు 2006–08 మధ్యనే బీజం పడిందని నివేదికలో ఆయనన్న మాటలను ఆసరా చేసుకుని కాంగ్రెస్‌పై బీజేపీ దాడి ప్రారంభించగా... కొంపముంచే ఆస్కారమున్న ఎగవేతదార్ల జాబితాను ప్రధాని కార్యాలయానికి (పీఎంఓ) పంపానని ఆయన చెప్పడాన్ని కాంగ్రెస్‌ ఎత్తిచూపింది.

ఆ జాబితాపై మోదీ సర్కారు దృష్టి పెట్టి ఉంటే ఎగవేతదార్లు దేశం విడిచి పారిపోయే పరిస్థితి ఏర్పడి ఉండేది కాదని ఆ పార్టీ అంటోంది. ఆ రెండు పార్టీలూ ఇలా పరస్పర విమర్శలకు దిగడంలో వింతేమీ లేదు. అయితే రఘురాం రాజన్‌ చెప్పిన అంశాలు అనేకం ఉన్నాయి. పాలనా వ్యవస్థలో నిర్ణయ ప్రక్రియ మంద గిస్తున్న వైనం అందులో ప్రధానమైనది. అలాగే వివిధ బ్యాంకుల చీఫ్‌లు రిటైరైన చాన్నాళ్లకుగానీ వారి స్థానంలో కొత్తవారిని నియమించకపోవటాన్ని, తిరిగొస్తాయో రావో తెలియకుండా రుణ మేళాలు నిర్వహిస్తున్న తీరును కూడా ఆయన తప్పుబట్టారు. ఇవి గత యూపీఏ ప్రభుత్వానికీ, ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వానికీ కూడా సమంగా వర్తిస్తాయి.  

బొగ్గు గనుల కేటాయింపులో లేదా మరే ఇతరచోట్లనో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చేసరికి ప్రభుత్వ యంత్రాంగం స్తంభించిపోతోంది. ఆరోపణల అతీగతీ తేలడానికి ఏళ్లూ పూళ్లూ పడుతుంటే, కొత్తగా ఏ నిర్ణయం తీసుకోవటానికైనా వివిధ శాఖలు జంకుతున్నాయి. ఆ నిర్ణ యాలపై కూడా భవిష్యత్తులో ఆరోపణలు వెల్లువెత్తి దర్యాప్తు మొదలుపెడితే చిక్కుల్లో పడతామన్న భయాందో ళనలు నిర్ణయరాహిత్యానికి దారితీస్తున్నాయి. పర్యవసానంగా ప్రాజెక్టులన్నీ ఎక్కడిక క్కడ ఆగిపోతు న్నాయి.

ఉత్పాదన ప్రారంభం కాకపోవడంతో తీసుకున్న అప్పులకు కనీసం వడ్డీలు కూడా చెల్లించ లేని స్థితి ఏర్పడుతోంది. ఫలితంగా అప్పులిచ్చిన బ్యాంకులు కుదేలవుతున్నాయి. ఇది ఒక పార్శ్వం కాగా, మరొకటి బ్యాంకుల సోమరితనం. తమను రుణం అడుగుతున్న సంస్థ పని తీరు, అది ప్రతిపా దిస్తున్న ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలు, మార్కెట్‌లో దానికుండే విజయావకాశాలు సొంతంగా మదింపు వేసుకోకుండా ఆ సంస్థకు ప్రమోటర్‌గా వ్యవహరించే బ్యాంకు ఇస్తున్న నివేదికను విశ్వసించి రుణాలి వ్వడానికి ఉబలాటపడుతున్నాయి.

ముందూ మునుపూ ఆ సంస్థ వైఫల్యం చెందితే రుణం వసూలు కాక లబోదిబో మంటున్నాయి. రఘురామ్‌ రాజన్‌ 2006–08 కాలాన్ని ప్రస్తావించి చెప్పారుగానీ నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ తదితరుల ఉదంతాలు గమనిస్తే అవి అనంతరకాలం కూడా కొనసా గాయని అర్ధమవుతుంది. కేవలం బ్యాంకుల అసమర్ధతే ఇందుకు కారణమని చెప్పటం అర్ధసత్యమే అవుతుంది. బ్యాంకుల్లో కీలక స్థానాల్లో ఉన్నవారి అవినీతి కూడా ఇందుకు దోహదపడుతోంది. సాధా రణ పౌరులు రుణం కోసం వెళ్లినప్పుడు  సవాలక్ష ప్రశ్నలు వేసి, ఇచ్చే రుణానికి రకరకాల హామీలు కోరే బ్యాంకులు బడా పారిశ్రామికవేత్తల ముందు మాత్రం మోకరిల్లుతాయి. అప్పు తీసుకున్న సంస్థ తిరిగి చెల్లిస్తున్నట్టు రికార్డుల్లో కనిపించటం కోసం వాటికి తిరిగి అప్పులిచ్చి జమ రాసుకుంటున్నారు. ఇదంతా ఎప్పటికో బద్దలయ్యాక అందరూ చేతులెత్తేస్తున్నారు. చివరకు పాలనాపరంగా తమ అస మర్ధత ఎక్కడ బయటపడుతుందో నన్న భయంతో ప్రభుత్వాలు బ్యాంకులకు వేలాది కోట్ల రూపా యలు తరలించి గండం నుంచి గట్టెక్కుతున్నాయి. 

ప్రభుత్వ రంగ బ్యాంకుల బోర్డుల్లో వృత్తిగత నిపుణులు లేకపోవడాన్ని, వాటి సారథులు రిటైరై నప్పుడు వారి స్థానంలో కొత్తవారిని నియమించకపోవడాన్ని కూడా రాజన్‌ ప్రస్తావించారు. ఈ రెండు సమస్యలూ కూడా కీలకమైనవి. అధికారంలో ఉండేవారు తమకనుకూలమైనవారితో బోర్డుల్ని నింపేస్తున్నాయి. ఫలితంగా బ్యాంకుల్లో రాజకీయ జోక్యం పెరుగుతోంది. అసంబద్ధ నిర్ణ యాలు బ్యాంకుల్ని ముంచేస్తున్నాయి. ఎగవేతదార్లకు రాజకీయ నేతలతో ఉండే పరిచయాల వల్ల వారికి సులభంగా కొత్త రుణాలు వస్తున్నాయి. బోర్డులు పటిష్టంగా ఉంటే ఈ బాపతువారి ఆట కడుతుంది. 2014లో రఘురామ్‌ రాజన్‌ రిజర్వ్‌బ్యాంక్‌ గవర్నర్‌గా ఉండగా బ్యాంకింగ్‌ రంగ నిపు ణుడు పీజే నాయక్‌ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. బోర్డుల గురించి అది విలువైన సూచ నలు చేసింది.

షేర్‌ హోల్డర్లు ఎన్నుకునే ఇండిపెండెంట్‌ డైరెక్టర్లు బోర్డులో ఉండాలని సూచించింది. వారిని ప్రభుత్వమే నియమించే ప్రస్తుత విధానాన్ని రద్దు చేయాలని కోరింది. బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 50 శాతానికి మించరాదన్న దాని సిఫార్సు జాతీయ బ్యాంకుల పరోక్ష ప్రైవేటీకరణకు దారి తీస్తుందన్న విమర్శలొచ్చినా బోర్డుల్లో వృత్తిరంగ నిపుణులుండాలని, నిర్ణయాలకు వారిని బాధ్యుల్ని చేయాలని నాయక్‌ కమిటీ చేసిన సిఫార్సు విలువైనది. కానీ నాలుగేళ్లు గడుస్తున్నా ఆ కమిటీ సిఫార్సుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఇక బ్యాంకు సార థులుగా ఉండేవారి రిటైర్మెంట్‌ ఎప్పుడో ప్రభుత్వానికి అవగాహన ఉంటుంది. కనుక చాలా ముందుగానే వారి వారసుల్ని నిర్ణయించవచ్చు. ఇందులో ఎంతో జాప్యం చోటుచేసుకుంటోంది. ఫలితంగా పాలన కుంటుపడుతోంది. కీలక నిర్ణయాలన్నీ వాయిదా పడుతున్నాయి.

ఈ పరిస్థితి మరెంతకాలమో కొనసాగరాదన్న రాజన్‌ సూచన గమనించదగ్గది. బీజేపీ సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషి ఆధ్వర్యంలోని పార్లమెంటరీ కమిటీ నిక్కచ్చిగా మాట్లాడే రాజన్‌ను మొండి బకా యిలపై అభిప్రాయాలు కోరడం మంచిదైంది. ఆయన చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసు కుంటే మన బ్యాంకుల పనితీరు గణనీయంగా మెరుగుపడుతుంది. అంతేతప్ప రాజకీయ పక్షాల పరస్పర విమర్శల వల్ల దేశానికి ఒరిగేది శూన్యం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement