NPAs
-
మొండిబకాయిలు రూ.3 లక్షల కోట్లు..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం (సెప్టెంబర్ 30) ముగిసే నాటికి రూ.3,16,331 కోట్లుగా నమోదయినట్లు ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభకు తెలిపారు. మొత్తం రుణాల్లో ఇది 3.09 శాతమని వివరించారు.ప్రైవేటు రంగ బ్యాంకుల విషయంలో ఎన్పీఏలు రూ.1,34,339 కోట్లని తెలిపారు. మొత్తం రుణాల్లో ఇది 1.86 శాతంగా వివరించారు. ఇంకా ఆయన పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవి... 2024 మార్చి 31 నాటికి 580 మంది ప్రత్యేక రుణగ్రహీతలు (వ్యక్తులు, విదేశీ రుణగ్రహీతలు మినహా), ఒక్కొక్కరు రూ. 50 కోట్ల కంటే ఎక్కువ రుణ బకాయిలను కలిగి ఉన్నారు. వీరిని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా వర్గీకరించాయి.ప్రస్తుత దివాలా కేసుల తీరిది... మొత్తం 1,963 సీఐఆర్‌పీ (కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్) కేసులు కొనసాగుతున్నాయి. వాటిలో 1,388 కేసులు నిర్దేశిత (కేసుల పరిష్కారానికి) 270 రోజుల కాల పరిమితిని మించిపోయాయి. ఈ ఏడాది సెప్టెంబరు వరకు దివాలా చట్టం కింద 1,068 కేసుల పరిష్కారం అయ్యాయి. తద్వారా బ్యాంకింగ్ సుమారు రూ. 3.55 లక్షల కోట్లను రికవరీ చేసింది. బ్యాంకులతో సహా రుణదాతల మొత్తం క్లెయిమ్ రూ. 11.45 లక్షల కోట్లు కాగా, మొత్తం లిక్విడేషన్ విలువ రూ. 2.21 లక్షల కోట్లు. -
వసూలు అవ్వకపోయినా.. తగ్గిన ‘పారుబాకీలు’! ఎలాగంటే..
దేశీయంగా బ్యాంకుల స్థూల పారు బాకీలు(గ్రాస్ ఎన్పీఏలు) గత పదేళ్లలో కనిష్ఠ స్థాయికి చేరినట్లు ఇటీవల భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. కొన్నేళ్లుగా బ్యాంకింగ్ రంగ ఆర్థిక స్థితి మెరుగైందన్నది కాదనలేని సత్యం. కానీ అందుకు చాలామార్పులు తీసుకురావాల్సి వచ్చింది. డిపాజిట్‌దారుల నుంచి డబ్బు తీసుకుని, వారికి చెల్లించే వడ్డీకన్నా కాస్త ఎక్కువకు రుణగ్రహీతలకు అప్పులు ఇచ్చి లాభాలు ఆర్జించడమే బ్యాంకుల ప్రధాన వ్యాపారం. అప్పులు తీసుకున్నవారు వాటిని సక్రమంగా తిరిగి చెల్లించకపోతే పారు బాకీలు (ఎన్పీఏలు) ఎక్కువై బ్యాంకులు నష్టాలపాలవుతాయి. భారతీయ బ్యాంకులు 2014-15 నుంచి రూ.14.56 లక్షల కోట్ల పారు బాకీలను రద్దు చేశాయని కేంద్రం ఇటీవల పార్లమెంటులో తెలిపింది. అందులో రూ.7.40 లక్షల కోట్లు భారీ పరిశ్రమలకు, బడా సర్వీసు కంపెనీలకు ఇచ్చినవే. గడచిన మూడేళ్లలో బ్యాంకులు పారుబాకీల కింద చూపిన రూ.5.87 లక్షల కోట్లలో 19శాతాన్ని అంటే, 1.09 లక్షల కోట్ల రూపాయలను మాత్రమే తిరిగి వసూలు చేయగలిగాయని రిజర్వు బ్యాంకు తెలిపింది. గత పదేళ్లలో బ్యాంకుల పారుబాకీలు బాగా తగ్గినట్లు రిజర్వు బ్యాంకు తాజాగా వెల్లడించింది. అయితే, భారీ కంపెనీలకు ఇచ్చిన రుణాలు తిరిగి వసూలు కాక నష్టాలపాలైన బ్యాంకులను మళ్ళీ నిలబెట్టడానికి క్యాపిటల్ మానిటైజేషన్ పేరుతో బడ్జెట్లలో వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు కేటాయించడం ఆనవాయితీగా మారింది. ఇదీ చదవండి: ఎక్కువ పన్నులు కట్టాలంటున్న బిల్ గేట్స్! ఎందుకు..? ఇలా 2016-21 మధ్య కేంద్రం దాదాపు రూ.3.10 లక్షల కోట్లు ఇచ్చింది. 2022-23, 2023-24 బడ్జెట్లలో మాత్రమే కేటాయింపులు జరపలేదు. ఈసారి బడ్జెట్లో పరిస్థితి ఎలాఉండబోతుందో చూడాలని నిపుణులు చెబుతున్నారు. -
‘బ్యాడ్ బ్యాంక్’లు మంచివే..?
రూ.లక్ష లేదా రెండు లక్షల రూపాయలు బ్యాంకులు అప్పుగా ఇవ్వాలంటే సవాలక్ష పత్రాలు అడిగి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తాయి. కానీ కార్పొరేట్లు అప్పుకోసం బ్యాంకులకు వెళితే మర్యాదలు చేసిమరీ కోరి అప్పిస్తాయి. కానీ లక్షల్లో అప్పుతీసుకునే సామాన్యులే నెల కిస్తీలు సవ్యంగా చెల్లిస్తారు. కోట్లల్లో అప్పులు తీసుకునే కొందరు కార్పొరేట్లు, ఇతరులు పూర్తిగా చెల్లించేవరకు అనుమానమే. అలా తీసుకున్న అప్పు చెల్లించకుండా బ్యాంకుల వద్ద పోగవుతున్న నిరర్ధక ఆస్తుల(తిరిగి చెల్లించని అప్పులు) చిట్టా 2019 వరకు ఏకంగా రూ.9,33,779 కోట్లుగా ఉందని కేంద్ర మంత్రి కరాద్ తెలిపారు. బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు(ఎన్పీఏలు) రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం (పీఎంఈజీపీ) కింద ఇచ్చిన లోన్లను కలుపుకొని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్పీఏలు) 2019 మార్చి 31 నాటికి రూ.9,33,779 కోట్లుగా రికార్డయ్యాయని కేంద్ర మంత్రి కరాద్ ఇటీవల పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇది బ్యాంకుల అడ్వాన్స్‌ల్లో 9.07 శాతానికి సమానం. ద్రవ్యోల్బణం కారణంగా పరిస్థితులు దిగజారితే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ మరింత పెరగొచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోంది. ఇదే జరిగితే భారత బ్యాంకింగ్ రంగం తీవ్ర సంక్షోభంలోకి జారిపోయే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థకు బ్యాంకింగ్ రంగ సంక్షోభం పెను సవాల్‌గా పరిణమించే అవకాశం ఉంది. ఈ సమస్య పరిష్కారానికి నిపుణులు చూపిస్తున్న మార్గమే బ్యాడ్ బ్యాంక్. బ్యాడ్ బ్యాంక్ అంటే.. సాధారణంగా వాణిజ్య బ్యాంకులు వాటి రుణాలపై వచ్చే వడ్డీ ఆధారంగా మనుగడ సాగిస్తుంటాయి. బ్యాంకులు ఇచ్చే రుణాల ఫలితంగా కొత్త పరిశ్రమలు పుట్టుకొచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. తద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. ఒకవేళ అవే రుణాలు నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ)గా అంటే.. మొండి బకాయిలుగా మారితే బ్యాంకింగ్ వ్యవస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో బ్యాడ్ బ్యాంక్‌ల పేరిట ఓ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. వివిధ వాణిజ్య బ్యాంకుల్లో ఎటూ తేలకుండా ఉండిపోయిన ఎన్పీఏలను దీనికి బదిలీ చేస్తారు. ఏమిటి లాభం.. బ్యాడ్ బ్యాంకుల ఏర్పాటు వల్ల ఆయా ఖాతాల నుంచి రుణాలను రికవరీ చేయడం, రుణాలు తీసుకున్న సంస్థలతో చర్చలు జరపడం, లేదా ఈ మొండి బకాయిలను ఎలా తిరిగి రాబట్టాలో వంటి అంశాలపై బ్యాడ్ బ్యాంక్ దృష్టి సారిస్తుంది. ఎన్పీఏ ఖాతాలు బ్యాడ్ బ్యాంక్‌కు వెళ్లడంతో వాణిజ్య బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లో వాటి ప్రస్తావన ఉండదు. ఫలితంగా బ్యాంకు పనితీరు మెరుగుపడుతుంది. బ్యాంకు మూలధనం, డిపాజిట్లు పెరిగి బ్యాంకు అభివృద్ధికి బాటలు పడతాయి. ఏఆర్సీ ఉండగా బ్యాడ్ బ్యాంక్ ఎందుకు? బ్యాంకులు తమ వద్ద ఉన్న ఎన్పీఏలను క్లియర్ చేసుకునేందుకు ‘అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ’(ఏఆర్సీ)లను ఆశ్రయిస్తుంటాయి. ఏఆర్‌సీలు బ్యాంకుల వద్ద చౌకగా ఎన్పీఏలను కొని వాటి ఆర్థిక కార్యకలాపాలు సాగిస్తుంటాయి. అలా బ్యాంకులు ఏఆర్సీలకు ఎంతో కొంతకు ఎన్పీఏలను అమ్మడం వల్ల నష్టాలను మూటగట్టుకుంటాయి. బ్యాడ్ బ్యాంకు కూడా దాదాపు ఏఆర్సీ లాంటిదే. కానీ, బ్యాడ్ బ్యాంక్‌లకు వాణిజ్య బ్యాంకులు ఎన్పీఏలను విక్రయించవు. కేవలం బదిలీ మాత్రమే చేస్తాయి. తద్వారా సాధారణ బ్యాంకులు వాటి ప్రధాన కార్యకలాపాలపై దృష్టి సారించే అవకాశం ఏర్పడుతుంది. ఇక బ్యాడ్ బ్యాంకు ఎన్పీఏలపై పనిచేసి తిరిగి వాటిని ఎలా రాబట్టాలి... అందుకు ఉన్న వెసులుబాట్లపై దృష్టి సారిస్తుంది. రుణగ్రహీతల చెల్లింపు సామర్థ్యాన్ని అంచనా వేసి వీలైనంత మొత్తాన్ని రాబట్టేందుకు కృషి చేస్తాయి. దీని ఏర్పాటు ఇలా.. ఎన్పీఏల సమస్యను పరిష్కరించేందుకు 2017 ఆర్థిక సర్వే ‘పబ్లిక్ సెక్టార్ అసెట్ రిహాబిలిటేషన్ ఏజెన్సీ(పారా)’ను ఏర్పాటు చేయాలని అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్‌కు ప్రతిపాదించింది. దీనికి ప్రతిరూపమే బ్యాడ్ బ్యాంక్. అప్పటి నుంచి బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుపై చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో పేరుకుపోయిన నిరర్థక ఆస్తుల (ఎన్పీఏలు) ప్రభావం బ్యాంకులపై పడకుండా ఉండాలంటే ప్రభుత్వం చాలా బ్యాడ్ బ్యాంకుల్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) పేర్కొంది. ప్రముఖులు ఏమంటున్నారంటే.. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగంలో బ్యాడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయడాన్ని ఆయన రాసిన ‘ఐ డూ వాట్ ఐ డూ’ పుస్తకంలో వ్యతిరేకించారు. ప్రభుత్వానికి చెందిన ఓ ఖజానా నుంచి రుణాలను మరో ఖజానాను మార్చడం తప్ప పెద్దగా మార్పేమీ ఉండదని వ్యాఖ్యానించారు. కేవలం ప్రభుత్వ బ్యాంకులు వసూలు చేసే అసమర్థత మాత్రమే బ్యాడ్ బ్యాంకులకు బదిలీ అవుతుందని విమర్శించారు. అయితే బ్యాడ్ బ్యాంకులు ఏర్పాటు చేయాలనుకుంటే ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించాలని ‘ఇండియన్ బ్యాంక్స్: ఏ టైం టు రిఫార్మ్’ పుస్తకంలో రాజన్ సూచించారు. అప్పుడు ఎన్పీఏలను బ్యాడ్ బ్యాంకులకు తరలించాలన్నారు. మరోవైపు, ప్రముఖ వ్యాపారవేత్త ఉదయ్ కోటక్ బ్యాడ్ బ్యాంక్ ప్రతిపాదనపై ఓ సందర్భంలో అఇష్టతను చూపించారు. రికవరీలు భారీగా చేయగలిగితే తప్ప వీటివల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చునని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఎస్బీఐ మాజీ ఛైర్మన్ రజనీష్ కుమార్ బ్యాడ్ బ్యాంక్ ప్రతిపాదనను బలంగా సమర్థించారు. ఇదీ చదవండి: కస్టమర్లకు రూ.5800 కోట్లు చెల్లించనున్న గూగుల్.. ఎందుకంటే.. పెట్టుబడిదారీ వ్యవస్థను సమర్థిస్తున్నవారే బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు ప్రతిపాదనను సమర్థిస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు. ఎగవేతదార్లకు అండగా నిలవడమే దీని లక్ష్యమని ఆరోపిస్తున్నారు. ప్రత్యేక బ్యాంక్ ఏర్పాటు చేయడం కంటే ఎగవేతదార్లపై చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం చేతిలో బ్యాడ్ బ్యాంక్ కీలుబొమ్మగా మారితే ఇప్పటికే రుణాలు ఎగ్గొట్టిన కార్పొరేట్లకు మేలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. -
ప్రభుత్వ బ్యాంక్ ‘స్వీట్’ ఐడియా! మిఠాయిలిచ్చి ప్రేమగా అడుగుదాం..
మొండి బకాయిలను రికవరీ చేసే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్ (UCO Bank) సరికొత్త ఆలోచన చేసింది. ప్రతి శాఖలోని టాప్ 10 డిఫాల్టర్లకు 'స్వీట్ ప్యాకెట్లు' పంపాలని నిర్ణయించింది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. వాళ్లూ ఒకప్పుడు విలువైన కస్టమర్లే ప్రస్తుతం డిఫాల్టర్‌గా మారినవాళ్లు ఒకప్పుడు విలువైన కస్టమర్ అనే విషయాన్ని బ్యాంకు మరచిపోదని యూకో బ్యాంక్ జనరల్ మేనేజర్ (రికవరీ) ధీరజ్ పట్వర్ధన్ అన్ని జోనల్ హెడ్లకు జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఇదీ చదవండి: రూ.2వేల నోట్లు మార్చడానికి కిరాయి మనుషులు.. ఆర్బీఐ ఆఫీస్ వద్ద హల్చల్! కాబట్టి, అటువంటి కస్టమర్లతో "సరైన అనుసంధానం"తో వారికి, బ్యాంకుకు మధ్య ఏర్పడిన అంతరాన్ని తగ్గించవచ్చని ఆయన అన్నారు. దీనివల్ల బ్యాంక్ పట్ల సానుభూతి, సామరస్యం పెరుగుతాయని, కొంత మంది రుణగ్రహీతలు తమ బకాయిలు సెటిల్ చేయడానికి ముందుకు వస్తారని వివరించారు. స్వీట్లిచ్చి దీపావళి శుభాకాంక్షలు దీనికి సంబంధించి యూకో బ్యాంక్ జారీ సర్కులర్‌ను ప్రముఖ బ్యాంకింగ్ కాలమిస్ట్ తమల్ బందోపాధ్యాయ తన ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. ప్రతి బ్రాంచ్‌లోని టాప్ 10 ఎన్పీఏ రుణగ్రహీతలకు స్వీట్ ప్యాకెట్లను పంపిణీ చేయాలని, బ్రాంచ్ హెడ్లు వారిని వ్యక్తిగతంగా కలుసుకుని, దీపావళి శుభాకాంక్షలు తెలియజేయాలని సర్క్యులర్‌లో బ్యాంక్ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: ప్రైవేటు బ్యాంకుల్లో ఎక్కువగా ఉద్యోగ వలసలు.. ఆర్బీఐ డేగకన్ను! గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ. 124 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం రూ. 223 కోట్లకు పెరిగి 80.80 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 1,650 కోట్ల నుంచి 21.78 శాతం పెరిగి రూ. 2,009 కోట్లకు చేరుకున్నట్లు యూకో బ్యాంక్ పేర్కొంది. బ్యాంక్ ఎన్పీఏ రుణాలు ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 4.48 శాతంగా ఉన్నాయి. ఇవి మార్చిలో 4.78 శాతం కాగా గతేడాది ఇదే త్రైమాసికంలో 7.42 శాతంగా ఉన్నాయి. Wonderful idea. UCO Bank plans to celebrate Diwali, greeting top ten #NPA borrowers of every branch with sweets. @UCOBankOfficial @ChairmanIba @ChiefIba pic.twitter.com/HZJMenPnz5 — Tamal Bandyopadhyay (@TamalBandyo) November 2, 2023 -
తొమ్మిదేళ్లలో ఖాతాల్లోంచి రూ.14.56 లక్షల కోట్ల రద్దు!
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ 2014–15 నుంచి గడచిన తొమ్మిది ఆర్థిక సంవత్సరాల్లో రూ.14,56,226 కోట్ల మొండి బకాయిలను మాఫీ (రైటాఫ్) చేశాయని ప్రభుత్వం సోమవారం పార్లమెంటుకు తెలియజేసింది. ఇందులో భారీ పరిశ్రమలు, సేవల రంగం వాటా రూ. 7,40,968 కోట్లని ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ ఒక లోక్‌సభలో ఇచి్చన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. రైటాఫ్ అంటే ఖాతాలు, లెక్కల నుంచి మొండిబకాయిలను తొలగించడం. అయితే అటువంటి ఖాతాదారులపై చట్టబద్ధమైన, రికవరీకి సంబంధించిన చర్యలు కొనసాగుతాయి. ఆయా అంశాలకు సంబంధించి ఆర్బీఐ నుంచి అందిన తాజా గణాంకాలను ఉటంకిస్తూ, కరాద్ లోక్‌సభలో చేసిన లిఖితపూర్వక ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు.. ► 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ రంగ బ్యాంకుల నికర రైటాఫ్ రుణాలు రూ.73,803 కోట్లు. ► 2017–18 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు రంగ బ్యాంకుల స్థూల రుణాల్లో నికర రైటాఫ్‌లు 1.25 శాతం. 2022–23లో ఇది 1.57 శాతంగా ఉంది. ప్రభుత్వం రంగ బ్యాంకుల విషయంలో ఈ అంకెలు వరుసగా 2 %, 1.12 శాతాలుగా ఉన్నాయి. ► మొండిబకాయిలు దిగిరావడానికి ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లు సమగ్ర చర్యలు తీసుకుంటున్నాయి. ఫలితంగా 2018 మార్చి 31 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు రూ.8.96 లక్షల కోట్లు ఉంటే, 2023 మార్చి 31వ తేదీ నాటికి ఈ విలువ రూ.4.28 లక్షల కోట్లకు తగ్గింది. గత తొమ్మిది ఆర్థిక సంవత్సరాల్లో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (ఎస్సీబీలు)రూ. 10,16,617 కోట్ల మొత్తాన్ని రికవరీ చేశాయి. ► రుణగ్రహీతల డేటాను సేకరించడం, నిర్వహించడం, ప్రచురించడం కోసం ఆర్బీఐ ఏర్పాటు చేసిన సెంట్రల్ రిపోజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ (సీఆర్‌ఐఎల్‌సీ)డేటా ప్రకారం, 2023 మార్చి 1వ తేదీ నాటికి రూ. 1,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ బకాయి ఉన్న మొత్తం రూ. 1,03,975 కోట్లు. ► రూ. 5 కోట్లు అంతకంటే ఎక్కువ రుణం తీసుకున్న సంస్థలు ఏదైనా డిఫాల్ట్ అయితే, బ్యాంకులు ఈ సమాచారాన్ని ప్రతి వారం సీఆర్‌ఐఎల్‌సీకి నివేదించాలి. ► షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లు, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లలో రూ.20 కోట్లకు పైగా ఉన్న ఎన్పీఏలు గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో తగ్గుదలని నమోదు చేసుకున్నాయి. పటిష్ట రికవరీ చర్యలు... రుణ నిష్పత్తిని తగ్గించడంలో సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రస్ట్ యాక్ట్, 2002 సవరణ కీలక పాత్ర పోషిస్తోంది. డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ (డీఆర్టీ) ఆర్థిక అధికార పరిధిని రూ. 10 లక్షల నుండి రూ. 20 లక్షలకు పెంచడం వల్ల అవి అధిక–విలువ కేసులపై దృష్టి సారించేందుకు వీలు కలిగింది. ఇది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు అధిక రికవరీకి దోహదపడింది. రూ. 500 కోట్లకు పైగా ఒత్తిడిలో ఉన్న ఆస్తులను పరిష్కరించే లక్ష్యంతో నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్‌ను (ఎన్ఏఆర్సీఎల్) కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి కరాద్ వివరించారు. ఒత్తిడితో ఉన్న రుణ ఆస్తులను స్వా«దీనం చేసుకునేందుకు రుణ సంస్థలకు ఎన్‌ఆర్‌సీఎల్ జారీ చేసిన సెక్యూరిటీ రసీదులకు మద్దతుగా రూ. 30,600 కోట్ల వరకు గ్యారెంటీని పొడిగించడానికి ప్రభుత్వం ఆమోదించిందని ఆయన చెప్పారు. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు ఎటువంటి అదనపు సౌలభ్యతలను మంజూరు చేయడం లేదు. వారి యూనిట్ ఐదేళ్లపాటు కొత్త వెంచర్లను నిర్వహించకుండా నిషేధం కూడా ఉంది. ఉద్దేశపూర్వక డిఫాల్టర్లు లేదా కంపెనీలు నిధుల సమీకరణకు క్యాపిటల్ మార్కెట్లనూ ఎంచుకోడానికి వీలుండకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. వాటి ప్రమోటర్లు, డైరెక్టర్లు ఉద్దేశపూర్వక ఎగవేతదారులతో కలిసి నిధులను సేకరించేందుకు వీలుండదు. అంతేకాకుండా, ఒత్తిడికి గురైన ఆస్తులను ముందస్తుగా గుర్తించడం, నివేదించడం, సమయానుకూలంగా పరిష్కరించడం కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను అందించడానికి 2019లో ఆర్బీఐ ప్రుడెన్షియల్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ స్ట్రెస్డ్ అసెట్స్‌ను విడుదల చేసింది. ఒత్తిడిలో ఉన్న రుణాలకు సంబంధించి రిజల్యూషన్ ప్లాన్‌ను ముందస్తుగా అనుసరించిన బ్యాంకర్లకు ప్రో త్సాహకాలను కూడా అందించడం జరుగుతోంది. పీఎంఎంవై దేశ వ్యాప్త అమలు ఇదిలావుండగా, 2015 ఏప్రిల్ 8వ తేదీన ప్రారంభించిన ప్రధాన్ మంత్రి ముద్రా యోజనను దేశ వ్యాప్తంగా పటిష్టంగా అమలు చేస్తున్నట్లు మరో సమాధానంలో మంత్రి కరాద్ పేర్కొన్నారు. 2023 జూన్ 30 నాటికి ఈ పథకం కింద రుణగ్రహీతలకు దాదాపు రూ. 24.34 లక్షల కోట్ల రుణాల మంజూరు జరిగినట్లు వివరించారు. -
అన్ సెక్యూర్డ్ రుణాలకే ఎక్కువ డిమాండ్
ముంబై: క్రెడిట్ కార్డులపై వసూలు కాని రుణాలు (ఎన్పీఏలు) 0.66 శాతం పెరిగి మార్చి నాటికి 2.94 శాతానికి చేరాయి. క్రెడిట్‌కార్డ్, వ్యక్తిగత రుణాల వాటా వేగంగా పెరుగుతున్నట్టు క్రెడిట్ సమాచార కంపెనీ ‘ట్రాన్స్‌యూనియన్ సిబిల్’ తెలిపింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. రక్షణలేని రుణాలు పెరిగిపోతుండడంపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో సిబిల్ నివేదిక విడుదల కావడం గమనార్హం. మూడు నెలలకు మించి చెల్లింపులు లేని రుణాలను ఎన్పీఏలుగా పరిగణిస్తుంటారు. ఇలా క్రెడిట్ కార్డులపై మూడు నెలలకు పైగా చెల్లింపులు చేయని రుణాల వాటా గత ఆర్థిక సంవత్సరంలో 0.66 శాతం పెరిగినట్టు, వ్యక్తిగత రుణాల్లో ఎన్పీఏలు 0.04 శాతం పెరిగి 0.94 శాతంగా ఉన్నట్టు సిబిల్ తెలిపింది. ఇక క్రెడిట్ కార్డ్ రుణాలు గత ఆర్థిక సంవత్సరంలో 34 శాతం పెరగ్గా, వ్యక్తిగత రుణాలు సైతం 29 శాతం వృద్ధిని చూసినట్టు పేర్కొంది. ప్రాపర్టీపై ఇచ్చే రుణాలు (ఎల్ఏపీ) 38 శాతం పెరిగి అత్యంత వేగంగా వృద్ధి చెందిన రిటైల్ రుణ విభాగంగా ఉన్నట్టు వివరించింది. సాధారణంగా చిన్న వ్యాపార సంస్థలు తమ స్వల్పకాల నిధుల అవసరాల కోసం ప్రాపర్టీపై రుణాలను తీసుకుంటూ ఉంటాయి. గృహ రుణాలపై రేట్ల ప్రభావం గృహ రుణాలు గత ఆర్థిక సంవత్సరంలో 14 శాతమే వృద్ధి చెందాయి. వడ్డీ రేట్లు పెరగడంతో ఈ విభాగంలో రుణాల వృద్ధి తక్కువగా నమోదైంది. మరీ ముఖ్యంగా ఈ ఏడాది జనవరి–మార్చి మూడు నెలల కాలాన్ని పరిశీలించినట్టయితే విలువ పరంగా ఫ్లాట్‌గా ఉంటే, సంఖ్యా పరంగా 11 శాతం తగ్గినట్టు సిబిల్ నివేదిక స్పష్టం చేసింది. ప్రాపర్టీ రేట్లతోపాటు, గృహ రుణాలపైనా రేట్లు పెరగడం ఈ పరిస్థితికి కారణంగా పేర్కొంది. ఆస్తుల నాణ్యతపై పడే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని, కొత్త కస్టమర్లకు (అప్పటి వరకు రుణం తీసుకోని వారు) రుణాల విషయంలో రుణదాతలు దూరంగా ఉంటున్నట్టు తెలిపింది. మార్చితో ముగిసిన మూడు నెలల్లో అలాంటి కొత్త కస్టమర్లకు జారీ చేసిన రుణాల వాటా 16 శాతంగానే ఉందని, క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 19 శాతంగా ఉన్నట్టు వివరించింది. -
మోసాలు, ఎగవేతలపై వేగంగా స్పందించాలి
న్యూఢిల్లీ: నిరర్థక ఆస్తులను (ఎన్పీఏలు) తగ్గించుకునేందుకు మోసాలు, ఉద్దేశ పూర్వక రుణ ఎగవేత కేసుల్లో వేగవంతంగా వ్యవహరించాలని ప్రభుత్వరంగ బ్యాంక్‌లకు (పీఎస్‌బీలు) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. వృద్ధి మార్గాన్ని ఇదే మాదిరిగా ఇకముందూ కొనసాగించాలని సూచించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పీఎస్‌బీలు 2021–22 వరకు క్రితం ఆరేళ్లలో రూ.11.17 లక్షల కోట్ల ఎన్పీఏలను మాఫీ చేశాయి. నాలుగేళ్ల కాలం పాటు ఎన్పీఏలుగా కొనసాగి, వాటికి నూరు శాతం కేటాయింపులు చేసిన వాటిని బ్యాంక్‌లు మాఫీ చేసి, బ్యాలన్స్ షీట్ల నుంచి తొలగిస్తుంటాయి. అయినా కానీ, ఆ తర్వాత కూడా వాటి వసూలుకు ప్రయత్నాలు కొనసాగిస్తుంటాయి. ఇటీవలే పీఎస్‌బీల చీఫ్‌లతో ఆర్థిక మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. సైబర్ భద్రత రిస్‌్కలను అధిగమించేందుకు, బలమైన రిస్క్ నిర్వహణ విధానాలను అనుసరించాలని కూడా ఆర్థిక మంత్రి కోరారు. బలమైన అంతర్గత ఆడిట్ కార్యాచరణను అనుసరించాలని సూచించారు. ప్రభుత్వరంగ బ్యాంక్‌లు రుణాలు, తక్కువ వ్యయ డిపాజిట్ల విషయంలో క్రమంగా తమ మార్కెట్ వాటాను కోల్పోతుండడం తదితర సవాళ్లు కూడా ప్రస్తావనకు వచ్చాయి. నికర వడ్డీ మార్జిన్లపైనా ఆందోళన వ్యక్తమైనట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. అధిక ఈల్డ్ వచ్చే రుణ విభాగాలపై దృష్టి సారించాలని, ఫీజులు పెంచడం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవాలన్న సూచన వచి్చనట్టు తెలిపాయి. -
పారదర్శకంగా ఎన్పీఏల గుర్తింపు
న్యూఢిల్లీ: వసూలు కాని రుణాన్ని నిరర్థక ఆస్తిగా (ఎన్పీఏలు) గుర్తించే విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని ప్రభుత్వరంగ బ్యాంక్‌లను (పీఎస్‌బీలు) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. అలాగే, బలమైన రిస్క్ నిర్వహణ విధానాలను అనుసరించాలని సూచించారు. వృద్ధి, లాభదాయకత విషయంలో ఇక ముందూ మంచి పనితీరు చూపించాలని కోరారు. ఆర్థిక మంత్రి అన్ని పీఎస్‌బీల సీఈవోలతో ఢిల్లీలో గురువారం సమావేశమయ్యారు. పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి, స్టాండప్ ఇండియా, ప్రధానమంత్రి ముద్రా యోజన, అటల్ పెన్షన్ యోజన, అత్యవసర రుణ వితరణ పథకం తదితర కేంద్ర ప్రభుత్వ పథకాల పరిధిలో నిర్ధేశించిన లక్ష్యాలను ప్రభుత్వరంగ బ్యాంక్‌లు ఏ మేరకు చేరాయన్నది మంత్రి పరిశీలించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. రుణ వితరణలో వృద్ధి, ఆస్తుల నాణ్యత, తదుపరి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యంక్‌ల నిధుల అవసరాలను సమీక్షించినట్టు తెలిపాయి. రుణాల పంపిణీ, లాభదాయకత, ఆస్తుల నాణ్యత, క్యాపిటల అడెక్వెసీ తదితర గణాంకాలన్నీ పీఎస్‌బీల పనితీరు ఎంతో మెరుగుపడినట్టు తెలియజేస్తుండడాన్ని మంత్రి పరిగణనలోకి తీసుకున్నట్టు పేర్కొన్నాయి. త్వరలో గ్రామీణ బ్యాంక్‌ల వంతు.. ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌ల పనితీరును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి త్వరలోనే సమీక్షించనున్నారు. ఇందుకోసం గ్రామీణ బ్యాంక్‌ల అధినేతలతో ఆమె భేటీ కానున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రుణ అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుండడం తెలిసిందే. సాగు రంగం, దాని అనుబంధ విభాగాలకు కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ)ల జారీని ఆర్థిక మంత్రి సమీక్షించనున్నట్టు ఆ వర్గాలు చెప్పాయి. వీలైనంత ఎక్కువ సంఖ్యలో రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాలు అందేలా చూడాలన్నది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లక్ష్యంగా ఉంది. బలహీనంగా ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లకు నిధుల అవసరాలను కూడా మంత్రి పరిశీలించనున్నారు. టెక్నాలజీ పెంపు, ఎప్పీఏల తగ్గింపు విధానాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. -
దశాబ్ద కనిష్టానికి మొండి బాకీలు
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల స్థూల మొండి బాకీలు (ఎన్పీఏ) దశాబ్ద కనిష్ట స్థాయి అయిన 3.8 శాతానికి తగ్గే అవకాశాలు ఉన్నాయి. చివరిసారిగా 2014 మార్చి త్రైమాసికంలో ఈ స్థాయి ఎన్పీఏలు నమోదయ్యాయి. ఈమధ్యే ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో ఇవి 5.9 శాతం నుంచి 4.2 శాతానికి దిగి వచ్చి ఉంటాయన్న అంచనాలు నెలకొన్నాయి. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఈ విషయాలు వెల్లడించింది. అధిక విలువ గల కార్పొరేట్ రుణ పద్దులకు సంబంధించిన ఎన్పీఏల పరిస్థితి మెరుగుపడుతున్నట్లు తెలిపింది. ఈ విభాగంలో స్థూల ఎన్పీఏలు 2 శాతం దిగువకు తగ్గవచ్చని పేర్కొంది. కార్పొరేట్లు తమ రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రీ–పేమెంట్ సహా పలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక రిస్కు నిర్వహణ, అండర్‌రైటింగ్‌ను పటిష్టం చేసుకోవడం తదితర అంశాలు కూడా బ్యాంకులు.. మొండిబాకీలను తగ్గించుకోవడానికి తోడ్పడుతున్నాయి. రిటైల్ విభాగంలో తనఖా లేని రుణాల మంజూరు పెరుగుతున్నప్పటికీ.. మొత్తం రుణాల పోర్ట్‌ఫోలియోలో వాటి వాటా చాలా తక్కువే ఉంటుందని క్రిసిల్ డిప్యుటీ చీఫ్ రేటింగ్ ఆఫీసర్ కృష్ణన్ సీతారామన్ చెప్పారు. బ్యాంకింగ్ రంగం మొత్తం రుణాల్లో రిటైల్ రుణాలు 26 శాతంగా ఉంటాయని.. వీటిలో సగం గృహ రుణాలు, నాలుగో వంతు వాటా వాహన రుణాలది ఉంటుందని తెలిపారు. అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు, వ్యక్తిగత రుణాలు మొదలైన అన్నింటి వాటా రిటైల్ పోర్ట్‌ఫోలియోలో నాలుగో వంతుగా ఉంటుందన్నారు. నెమ్మదించనున్న వడ్డీ మార్జిన్లు.. వడ్డీ రేట్ల పెంపుదలతో గత ఆర్థిక సంవత్సరం ఆసాంతం పెరుగుతూ వచ్చిన నికర వడ్డీ మార్జిన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో నెమ్మదించవచ్చని సీతారామన్ తెలిపారు. అంతర్జాతీయంగా బ్యాంకింగ్ సంక్షోభ పరిస్థితులు ఎలా ఉన్నా దేశీ బ్యాంకింగ్ రంగం ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొనగలదని పేర్కొన్నారు. భారత్‌లో వడ్డీ రేట్ల పెంపు తక్కువ స్థాయిలో ఉండటం, రికార్డు కనిష్ట స్థాయికి తగ్గుతున్న మొండి బాకీలతో బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లు ఆరోగ్యకరంగా ఉండటం తదితర అంశాలు ఇందు కు దోహదపడగలవని సీతారామన్ వివరించారు. గత ఆర్థిక సంవత్సరం తరహాలోనే ఈసారీ రుణ వృద్ధి 15 శాతం స్థాయిలో కొనసాగవచ్చని పేర్కొన్నారు. అసెట్ క్వాలిటీపై ఆందోళన తగ్గుతున్న నేపథ్యంలో నిర్వహణలో ఉన్న ఆస్తుల పరిమాణం (ఏయూఎం) పెరగవచ్చని తెలిపారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల ఏయూఎం 13–14 శాతం పెరగవచ్చని సీతారామన్ వివరించారు. -
పదేళ్ల కనిష్టానికి బ్యాంకుల ఎన్పీఏలు
న్యూఢిల్లీ: దేశ బ్యాంకింగ్ రంగం ఎన్పీఏలు (వసూలు కాని రుణాలు) 2024 మార్చి నాటికి 4 శాతంలోపునకు దిగొస్తాయని అసోచామ్–క్రిసిల్ అధ్యయన నివేదిక తెలిపింది. ఇది దశాబ్ద కనిష్ట స్థాయి అని పేర్కొంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 0.90 శాతం తగ్గి స్థూల ఎన్‌పీలు 5 శాతంలోపుగా ఉండొచ్చని అంచనా వేసింది. కరోనా మహమ్మారి అనంతరం ఆర్థిక రంగ కార్యకలాపాలు కోలుకోవడం, రుణాల్లో అధిక వృద్ధి ఎన్పీఏలు తగ్గేందుకు అనుకూలించినట్టు వివరించింది. ప్రధానంగా కార్పొరేట్ రుణాల వైపు ఎంతో పురోగతి ఉన్నట్టు తెలిపింది. కార్పొరేట్ రుణాల్లో స్థూల ఎన్పీఏలు 2024 మార్చి నాటికి 2 శాతంలోపు ఉంటాయని పేర్కొంది. 2018 మార్చి నాటికి కార్పొరేట్ ఎన్పీఏలు 16 శాతంగా ఉన్నట్టు గుర్తు చేసింది. ‘‘ఇటీవలి సంవత్సరాల్లో బ్యాంకులు తమ పుస్తకాలను ప్రక్షాళన చేసుకున్నాయి. రిస్క్ నిర్వహణ, అండర్ రైటింగ్‌ను బలోపేతం చేసుకున్నాయి. ఈ చర్యల నేపథ్యంలో క్రెడిట్ ప్రొఫైల్ మెరుగ్గా ఉన్న రుణ గ్రహీతలకు బ్యాంకులు ప్రాధాన్యం ఇవ్వడం మొదలు పెట్టాయి. కార్పొరేట్ రుణ ఆస్తుల నాణ్యత అదే పనిగా మెరుగు పడుతూ రావడం అన్నది బ్యాంకుల రుణాల నాణ్యతను తెలియజేస్తోంది’’అని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ వివరించారు. బహుళ బ్యాలన్స్‌షీట్ సమస్య దాదాపుగా పరిష్కారమైనట్టేనని, రుణాల వృద్ధి గణనీయంగా మెరుగుపడడం మొదలైనట్టు చెప్పారు. అంతర్జాతీయ సవాళ్ల మధ్య మన బ్యాంకింగ్ రంగం ఎంతో బలంగా ఉన్నట్టు సూద్ గుర్తు చేశారు. కరోనా వల్ల ఎక్కువగా దెబ్బతిన్న ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి రుణాల్లో ఎన్పీఏలు.. 2022 మార్చి నాటికి ఉన్న 9.3 శాతం నుంచి 2024 మార్చి నాటికి 10–11 శాతానికి పెరుగుతాయని ఈ నివేదిక తెలిపింది. -
విద్యా రుణాల్లోనూ ఎన్పీఏల వాత
న్యూఢిల్లీ: ఉన్నత విద్య కల సాకారానికి సాయపడే విద్యా రుణాలకు సంబంధించి బ్యాంకుల్లో అప్రమత్త ధోరణి పెరుగుతోంది. ఎందుకంటే విద్యా రుణాల్లో ఎగవేతలు 8 శాతానికి చేరాయి. దీంతో తాజా విద్యా రుణాల మంజూరులో ఆచితూచి అడుగులు వేసేలా బ్యాంకుల ధోరణిలో మార్పు కనిపిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు ఇచ్చిన మొత్తం విద్యా రుణాల్లో ఎగవేతలు (మొండి బకాయిలు/ ఎన్పీఏలు) ఈ ఏడాది జూన్ చివరికి 7.82 శాతానికి పెరిగిపోయాయి. వసూలు కావాల్సిన విద్యా రుణాల మొత్తం రూ.80వేల కోట్లుగా ఉంది. ఎన్పీఏలు పెరిగిపోయినందున బ్యాంకు శాఖల వారీగా అప్రమత్త విధానాన్ని అనుసరిస్తున్నట్టు ఓ ప్రభుత్వరంగ బ్యాంకు సీనియర్ అధికారి వెల్లడించారు. దీనివల్ల నిజాయితీ రుణ కేసుల్లోనూ మరింత పరిశీలన అవసరపడుతుందని, ఇది జాప్యానికి దారితీయవచ్చన్నారు. విద్యా రుణాల్లో జాప్యాన్ని నివారించడానికి, విద్యా రుణాల పోర్ట్‌ఫోలియో సమీక్షపై ఇటీవలే ప్రభుత్వరంగ బ్యాంకులతో కేంద్ర ఆర్థిక శాఖ సమావేశాన్ని నిర్వహించడం గమనార్హం. విద్యా రుణాల్లో ఇటీవలి కాలంలో ఎన్పీఏలు గణనీయంగా పెరిగిపోవడం అన్నది ఆందోళనకర అంశమని, దేశంలో ఉన్నత విద్యకు మద్దతుగా బ్యాంకుల రుణ వితరణకు ఇది విఘాతమని ఆర్బీఐ ఇటీవలి బులెటిన్ సైతం పేర్కొంది. ఉపాధి అవకాశాల్లేమి వల్లే.. మన దేశంలో 90 శాతం మేర విద్యా రుణాలను ప్రభుత్వరంగ బ్యాంకులే అందిస్తున్నాయి. ప్రైవేటు రంగ బ్యాంకులు కేవలం ఏడు శాతం, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 3 శాతం చొప్పున వాటాను 2020 మార్చి నాటికి కలిగి ఉన్నాయి. ఉద్యోగ మార్కెట్లోకి వస్తున్న పట్టభద్రుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధి అవకాశాల కల్పన లేదని రీసర్జంట్ ఇండియా ఎండీ జ్యోతి ప్రకాష్ పేర్కొన్నారు. ఇది విద్యా రుణ ఎగవేతలు పెరిగేందుకు కారణంగా అభిప్రాయపడ్డారు. దీంతో బ్యాంకులు విద్యా రుణాల విషయంలో అప్రమ్తతంగా వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా రూ.7.5 లక్షల వరకు రుణాలను (హామీ/తాకట్టు ఉన్నవి, లేనివి) ఇవ్వడానికి వెనుకాడున్నట్టు పేర్కొన్నారు. నూతన విద్యా పాలసీని సమర్థంగా అమలు చేయడం, కనీస నైపుణ్యాలు, ఉపాధి కల్పన చర్యలు భాగస్వాములు అందరికీ మేలు చేస్తాయన్నారు. విద్యా రుణాలకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ రూపొందించిన నమూనాను బ్యాంకులు అనుసరిస్తున్నాయి. దీని కింద రూ.4 లక్షల వరకు విద్యా రుణాలకు ఎటువంటి తాకట్టు అవసరం లేదు. రూ.7.5 లక్షల వరకు రుణాలకు మూడో పార్టీ నుంచి గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. -
తగ్గిన ఎంఎస్ఎంఈ ఎన్పీఏలు
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభంతో ఒక్కసారిగా పెరిగిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈల) నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) క్రమేపీ తగ్గుముఖం పడుతున్నాయి. లాక్డౌన్ తర్వాత రాష్ట్రంలో రికార్డుస్థాయికి చేరిన ఎంఎస్ఎంఈల నిరర్థక ఆస్తుల విలువ పరిస్థితులు చక్కబడటంతో క్రమేపీ దిగివస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల ఎంఎస్ఎంఈ ఖాతాలను పరిశీలిస్తే 2020 సెప్టెంబర్ నాటికి రూ.4,098 కోట్లుగా ఉన్న నిరర్థక ఆస్తుల విలువ 2021 సెప్టెంబర్ నాటికి రూ.7,005 కోట్లకు చేరాయి. ఆ తర్వాత నుంచి కోవిడ్ తగ్గుముఖం పట్టడం, ఆర్థిక వ్యవస్థ గాడినపడుతుండటంతో క్రమేపీ ఎంఎస్ఎంఈల నిరర్థక ఆస్తులు తగ్గుముఖం పట్టాయి. గత ఆరునెలల్లో ఈ రంగానికి చెందిన ఎన్పీఏలు రూ.1,002 కోట్లు తగ్గాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో రూ.7,005 కోట్లుగా ఉన్న ఎన్పీఏల విలువలీ ఏడాది మార్చి నాటికి రూ.5,982 కోట్లకు తగ్గింది. మార్చి నాటికి రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు 17,19,611 రుణ ఖాతాలను కలిగి ఉండగా మొత్తం రుణవిలువ రూ.69,361 కోట్లుగా ఉంది. గత ఆరునెలల్లో బ్యాంకులు ఎంఎస్ఎంఈలకు రూ.1,05,028 కోట్ల విలువైన రుణాలను మంజూరు చేయగా ఇదే సమయంలో రూ.1,002 కోట్ల ఎన్పీఏలు తగ్గినట్లు బ్యాంకు అధికారులు పేర్కొన్నారు. సెప్టెంబర్ నాటికి మొత్తం రుణాల్లో ఎన్పీఏల వాటా 10.54 శాతంగా ఉంటే అది మార్చి నాటికి 8.62 శాతానికి తగ్గింది. ఎంఎస్ఎంఈల వృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారిస్తుండటంతో రానున్న కాలంలో వీటి నిరర్థక ఆస్తుల విలువ మరింత తగ్గే అవకాశం ఉందంటున్నారు. -
ఎన్ఏఆర్సీఎల్ జారీ చేసే సెక్యూరిటీ రిసిప్ట్స్‌కు కేంద్రం గ్యారంటీ
-
ఎన్ఏఆర్సీఎల్ జారీ చేసే సెక్యూరిటీ రిసిప్ట్స్‌కు కేంద్రం గ్యారంటీ
ఎన్ఏఆర్సీఎల్ రూ.30,600 కోట్ల వరకు జారీ చేసే సెక్యూరిటీ రిసిప్ట్స్‌కు ప్రభుత్వం గ్యారంటీగా ఉండే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం సెప్టెంబర్ 16న ఆమోదం తెలిపింది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఎన్ఏఆర్సీఎల్(నేషనల్ అసెట్ రీకన్ స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్) జారీ చేసే సెక్యూరిటీ రిసిట్స్‌కు సావరిన్(ప్రభుత్వ) గ్యారంటీ లభించనుంది. మొండిబకాయిలకి సంబంధించి ఆమోదిత విలువలో 15 శాతం ఎన్ఏఆర్సీఎల్ నగదు రూపంలో చెల్లిస్తుంది. మిగిలిన 85 శాతం ప్రభుత్వ హామీతో కూడిన సెక్యూరిటీ రిసిప్ట్స్ ఉంటాయని కేంద్రం పేర్కొంది. గత ఆరు ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు రూ.5,01,479 కోట్లు రికవరీ చేసినట్లు ఆర్ధిక మంత్రి తెలిపారు. ఇందులో రూ.3.1 లక్షల కోట్లు 2018 మార్చి నుంచి రికవరీ చేయబడ్డాయి. ఏదైనా ఎన్పీఏ కొనుగోలుకు సంబంధించి ప్రవేశ విలువలో నష్టం జరిగితే ప్రభుత్వ హామీ భరోసాగా ఉంటుంది అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి మీడియాతో మాట్లాడుతూ.."ఎన్పీఏలను నిర్వహించడం కోసం మేము ఇండియా డెట్ రిజల్యూషన్ కంపెనీ లిమిటెడ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ కంపెనీలో పీఎస్బిలు, ప్రభుత్వ యాజమాన్యంలోని ఆర్థిక సంస్థలు 49% వాటాను కలిగి ఉంటాయి. అలాగే, ప్రైవేటు రంగ బ్యాంకులు కూడా వాటాను కలిగి ఉంటాయని" ఆమె తెలిపారు. (చదవండి: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫెస్టివల్ బొనాంజా ఆఫర్లు..!) "మొండిబకాయిలకి సంబంధించి బ్యాంకులకు 15 శాతం నగదు చెల్లింపు చేయనున్నాము. 85 శాతం ప్రభుత్వ హామీతో కూడిన సెక్యూరిటీ రిసిప్ట్స్ జారీ చేస్తాము. ఆ బ్యాంకులకు బ్యాక్ స్టాప్ గ్యారెంటీ ఉంటుంది" అని ఆమె తెలిపింది. భద్రతా రసీదులు బ్యాక్ స్టాప్ నిధులను అందిస్తాయని, ఐదేళ్లపాటు మాత్రమే బాగుంటుందని సీతారామన్ తెలిపారు. ఆర్థిక సేవల కార్యదర్శి దేబాషిష్ పాండా మాట్లాడుతూ.. ఎన్ఏఆర్సీఎల్ ను ఇప్పటికే ఒక సంస్థగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తొలి దశలో రూ.90,000 కోట్ల విలువైన ఎన్పీఏలను ఎన్ఏఆర్సీఎల్ కు బదిలీ చేస్తామని ఆయన చెప్పారు. -
కెనరా బ్యాంక్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ సంస్థ కెనరా బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో స్టాండెలోన్ నికర లాభం మూడు రెట్లు ఎగసి రూ. 1,177 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 406 కోట్లు మాత్రమే ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం స్వల్పంగా బలపడి రూ. 21,210 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం సైతం నామమాత్ర వృద్ధితో రూ. 6,147 కోట్లయ్యింది. అయితే ఇతర ఆదాయం 67 శాతంపైగా జంప్‌చేసి రూ. 4,438 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 0.13 శాతం నీరసించి 2.71 శాతంగా నమోదయ్యాయి. ఎన్పీఏలు తగ్గాయ్: క్యూ1లో కెనరా బ్యాంక్ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 8.84% నుంచి 8.5%కి తగ్గాయి. నికర ఎన్పీఏలు 3.95% నుంచి 3.46%కి వెనకడుగు వేశాయి. మొత్తం ప్రొవిజన్లు 18 శాతం పెరిగి రూ. 4,574 కోట్లకు చేరాయి. ఫలితాల నేపథ్యంలో షేరు ఎన్ఎస్ఈలో 1.4 శాతం పుంజుకుని రూ. 149 వద్ద ముగిసింది. -
యాక్సిస్ బ్యాంకు లాభంలో 94 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: యాక్సిస్ బ్యాంకు లాభం జూన్ క్వార్టర్లో రెట్టింపైంది. స్టాండలోన్‌గా నికర లాభం 94 శాతం పెరిగి రూ.2,160 కోట్లుగా నమోదైంది. ఇతర ఆదాయం పుంజుకోవడం, మొండి బకాయిలకు (ఎన్పీఏలు) కేటాయింపులు తగ్గడం లాభాల్లో వృద్ధికి దారితీసింది. బ్యాంకు స్టాండలోన్ ఆదాయం రూ.19,592 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో యాక్సిస్ బ్యాంకు రూ.1,112 కోట్ల లాభాన్ని, రూ.19,032 కోట్ల ఆదాయాన్ని నమోదు చేయడం గమనార్హం. 2021 మార్చి త్రైమాసికంలో (సీక్వెన్షియల్‌గా) ఆదాయం రూ.20,162 కోట్లతో పోలిస్తే తగ్గింది. లాభం కూడా మార్చి త్రైమాసికంలో ఉన్న రూ.2,677 కోట్లతో పోలిస్తే క్షీణించింది. వడ్డీ ఆదాయం జూన్ త్రైమాసికంలో రూ.16,003 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి రూ.16,445 కోట్లతో పోలిస్తే క్షీణించింది. బ్యాంకు రుణాలు 12% వృద్ధి చెందాయి. ఆస్తుల నాణ్యత రుణ ఆస్తుల నాణ్యత కాస్త మెరుగుపడింది. స్థూల ఎన్పీఏలు 3.85 శాతం, నికర ఎన్పీఏలు 1.20 శాతంగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో స్థూల ఎన్పీఏలు 4.72%, నికర ఎన్పీఏలు 1.23% చొప్పున ఉండడం గమనార్హం. ఎన్పీఏలకు, కంటింజెన్సీలకు రూ.3,532 కోట్లను పక్కన పెట్టింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కేటాయింపులు రూ.4,416 కోట్లుగా ఉన్నాయి. -
‘మొండి’ భారం రెట్టింపు!
ముంబై: కోవిడ్–19 ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో భారత్ బ్యాంకింగ్‌పై మొండిబకాయిల (ఎన్పీఏ) భారం తీవ్రతరం కానుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైవార్షిక ద్రవ్య స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) పేర్కొంది. ఎన్పీఏలకు సంబంధించి కనిష్ట ప్రభావం మేరకు చేసినా, మొత్తం రుణాల్లో మొండిబకాయిల భారం సెప్టెంబర్ నాటికి 13.5 శాతానికి చేరుతుందని సోమవారం నాడు వెలువడిన నివేదిక పేర్కొంది. ప్రభావం తీవ్రంగా ఉంటే ఏకంగా ఇది 14.8 శాతానికి ఎగసే అవకాశం ఉందని తెలిపింది. ఇదే జరిగితే గడచిన 25 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత తీవ్ర మొండిబకాయిల భారం బ్యాంకింగ్‌పై ఉంటుంది. 2020 సెప్టెంబర్ నాటికి బ్యాంకింగ్‌పై ఎన్పీఏ భారం 7.5 శాతం. అప్పటి నుంచీ చూస్తే, కనీసమయినా ఎన్పీఏలు 600 బేసిస్ పాయింట్లు (6 శాతం) అయినా పెరుగుతుందన్నమాట. నివేదిక ప్రకారం... ► ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మొండిబకాయిలు 2021 సెప్టెంబర్ నాటికి కనీస స్థాయిలో 9.7– 16.2% శ్రేణిలో ఉండే వీలుంది. ప్రైవేటు బ్యాంకింగ్ విషయంలో ఈ శ్రేణి 4.6–7.9% శ్రేణిలో ఉండవచ్చు. ఫారిన్ బ్యాంకుల విషయంలో ఈ శ్రేణి 2.5–5.4% శ్రేణిలో ఉండే వీలుంది. ► ఇక తీవ్ర స్థాయిల్లో పీఎస్బీ, ప్రైవేట్, ఫారిన్ బ్యాంకుల విషయంలో ఎన్పీఏలు వరుసగా 17.6 శాతం, 8.8 శాతం, 6.5 శాతం శ్రేణిలో ఉండే అవకాశం ఉంది. మరింత స్పష్టత అవసరం! ఎన్పీఏల విషయలో నిజానికి మరింత స్పష్టత రావాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ క్షీణతలోకి జారిపోవడం, ఉపాధి అవకాశాలు కోల్పోవడం, రుణాలు తీర్చడంలో ఆలస్యం లేదా మొత్తంగా విఫలంకావడం వంటి ఎన్నో అంశాలు దీనికి కారణంగా ఉన్నాయి. ఈఎంఐల చెల్లింపులపై మారటోరియం, అసెట్ వర్గీకరణలో యథాతథ స్థితి, రుణ పునర్ వ్యవస్థీకరణ, తాజా రుణాల పరిస్థితి, కొన్ని అకౌంట్లను మొండిబకాయిలుగా ప్రకటించవద్దంటూ అక్టోబర్ 3న సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల వంటి ఎన్నో అంశాలూ మొండిబకాయిలపై ఇంకా స్పష్టత లేకుండా చేస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ పరిస్థితి, రుణాలు ఎన్పీఏలుగా మారే అకాశాలు, లాభదాయకత, మూలధనం సహా బ్యాంకులు సమర్పించిన తత్సబంధ గణాంకాల ప్రాతిపదికన తాజా ‘స్ట్రెస్ టెస్ట్’ అంచనాలను వెలువరిస్తున్నట్లు నివేదిక తెలిపింది. 1996–1997లో బ్యాంకింగ్‌పై ఎన్పీఏ భారం 15.7%. గడచిన ఏడాది జూలైలో ఆర్బీఐ ఎఫ్ఎస్ఆర్ను ఆవిష్కరించింది. 2021 మార్చి నాటికి ఎన్పీఏలు 12.5 –14.7% శ్రేణిలో ఉంటాయని అప్పట్లో నివేదిక పేర్కొంది. వ్యవస్థలోకి రూ.2లక్షల కోట్లు... బ్యాంకింగ్‌లో మరింత ద్రవ్య లభ్యతకు (లిక్విడిటీ) వీలు కల్పిస్తూ రెపో చర్యలకు ఆర్బీఐ శ్రీకారం చుడుతోంది. రానున్న పక్షం రోజుల్లో రూ. 2 లక్షల కోట్ల రివర్స్ రెపో లావాదేవీల ద్వారా రూ.2 లక్షల కోట్లను బ్యాంకింగ్ వ్యవస్థలోకి విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. బ్యాంకింగ్ వ్యాపార నమూనా మారాలి... నియంత్రణాపరంగా ఇచ్చిన వెసులుబాటును వెనక్కు తీసుకుంటే, ఇది బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్లపై అలాగే మూలధనంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. తగిన లిక్విడిటీ, ఫైనాన్షియల్ పరిస్థితులు బ్యాంకుల ద్రవ్య ప్రమాణాలను ప్రస్తుతం నిలబెడుతున్నాయి. అయితే గణాంకాలనులోతుగా విశ్లేషిస్తే, ఒత్తిడి తీవ్రను గుర్తించవచ్చు. మూలధనాన్ని పెంచుకోడానికి ప్రస్తుత పరిస్థితులను బ్యాంకులు అనుకూలంగా మలచుకోవాలి. అలాగే తమ వ్యాపార నమూనాలను మార్చుకోవాలి. ఈ చర్యలు భవిష్యత్ భద్రతకు భరోసాను అందిస్తాయి. కేంద్రం ఆదాయాలు తగ్గుతుండడం, మార్కెట్ నుంచి మరిన్ని రుణ సమీకరణకు (2020–21లో రూ.7 లక్షల కోట్ల రుణ సమీకరణ బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకోగా దానిని రూ.12 లక్షల కోట్లకు సవరించడం జరిగింది) ప్రభుత్వం ఇష్టపడకపోవడం వంటి అంశాలు బ్యాంకులపై భవిష్యత్తులో మూలధన సంబంధ ఒత్తిడులను పెంచే అవకాశం ఉంది. ఫైనాన్షియల్ అసెట్స్‌లో విలువల అసమతౌల్యతలు ఫైనాన్షియల్ స్థిరత్వానికి ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది. ఆయా పరిస్థితులన్నింటినీ గమనంలోకి తీసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా తట్టుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి. – ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ‘నివేదికలో ముందుమాట’ -
ఆ ఖాతాలకు సుప్రీం రక్షణ
న్యూఢిల్లీ: ఆగస్ట్ 31 వరకు నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్పీఏ)గా గుర్తించని ఖాతాలకు సుప్రీం కోర్టు రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఆ ఖాతాలను తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ‘ఎన్పీఏ’లుగా ప్రకటించవద్దని బ్యాంకులను ఆదేశించింది. కోవిడ్–19 కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రుణగ్రహీతలకు ఊరట కల్పించేందుకు ఉద్దేశించిన మారటోరియం సమయంలోనూ.. రుణ వాయిదాలపై బ్యాంకులు వడ్డీ విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లకు సంబంధించి జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం పై ఆదేశాలిచ్చింది. కనీసం 2 నెలల పాటు ఏ ఖాతాను కూడా ఎన్పీఏగా నిర్ధారించబోమని బ్యాంక్స్ అసోసియేషన్ తెలిపింది. ఆర్థిక రంగానికి బ్యాంకింగ్ వ్యవస్థ వెన్నెముక వంటిదని, కరోనా కారణంగా అన్ని రంగాలు కుదేలై ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వివరించారు. ఆర్థిక రంగ పునరుత్తేజాన్ని రుణాల వడ్డీ మాఫీ నిర్ణయం దెబ్బతీస్తుందన్న విషయం ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందిన విషయమన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. తమ ఆందోళన అంతా వడ్డీపై వడ్డీకి సంబంధించి అని స్పష్టం చేసింది. వాదనల అనంతరం తదుపరి విచారణను 10కి వాయిదా వేసింది. మారటోరియం సందర్భంగా ఇన్స్టాల్మెంట్ చెల్లింపులను వాయిదా వేసుకున్న ఖాతాలపై వడ్డీ మాఫీ ఆర్థిక విధానాలకు వ్యతిరేకమని గతంలో కేంద్రం తెలిపింది. -
రూ.8.4 లక్షల కోట్ల రుణాల పునర్వ్యవస్థీకరణ
ముంబై: ఒక్కసారి రుణ పునర్వ్యవస్థీకరణకు అనుమతిస్తూ ఆర్బీఐ ఇటీవల పరపతి విధాన కమిటీ భేటీలో నిర్ణయం తీసుకోగా.. ఈ కారణంగా బ్యాంకులు సుమారు రూ.8.4 లక్షల కోట్ల మేర రుణాలను పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉందని ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది. వ్యవస్థలోని మొత్తం రుణాల్లో ఇది 7.7 శాతం అవుతుందని పేర్కొంది. ఒకవేళ రుణాల పునరుద్ధరణకు అవకాశం లేకపోతే ఈ రూ.8.4 లక్షల కోట్ల రుణాల్లో సుమారు 60 శాతానికి పైగా ఎన్ పీఏలుగా మారొచ్చని అంచనాకు వచ్చింది. పునర్ వ్యవస్థీకరణ బ్యాంకుల లాభాలను కాపాడుతుందని, చేయాల్సిన కేటాయింపులు తగ్గుతాయని పేర్కొంది. కరోనా కారణంగా లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఆర్బీఐ ఇప్పటికి రెండు విడతల పాటు మొత్తం ఆరు నెలలు (2020 మార్చి నుంచి ఆగస్ట్) రుణ చెల్లింపులపై మారటోరియం (విరామం)కు అవకాశం ఇచ్చింది. మూడో విడత మారటోరియం కాకుండా పునర్ వ్యవస్థీకరణకు అవకాశం ఇవ్వాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చేసిన వినతుల నేపథ్యంలో ఆర్బీఐ ఈ దిశగా నిర్ణయం ప్రకటించడం గమనార్హం. అన్నిరంగాలకు చెందిన అన్ని రుణాలకు కాకుండా పునర్ వ్యవస్థీకరణ విషయంలో ఒక్కో ఖాతాను విడిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆర్బీఐ సూచించింది. గత సంక్షోభ సమయాల్లో మాదిరిగా కాకుండా ఈ విడత కార్పొరేట్, నాన్ కార్పొరేట్, చిన్న వ్యాపార సంస్థలు, వ్యవసాయ రుణాలు, రిటైల్ రుణాలకు ఈ విడత పునర్ వ్యవస్థీకరణలో అధిక వాటా ఉండనుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తెలిపింది. ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలో పునర్వ్యవస్థీకరించిన రుణాల్లో 90 శాతం కార్పొరేట్ రుణాలేనని పేర్కొంది. ఈ విడత (ఆగస్ట్ తర్వాత) పునర్వ్యస్థీకరణ రుణాల్లో రూ.2.1 లక్షల కోట్లు నాన్ కార్పొరేట్ విభాగాల నుంచే ఉంటాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ పేర్కొంది. కార్పొరేట్ లో ఎక్కువ రిస్క్ కార్పొరేట్ విభాగంలో రూ.4 లక్షల కోట్ల రుణాలు కరోనా ముందు నుంచే ఒత్తిడిలో ఉన్నాయని, ఇవి మరో రూ.2.5 లక్షల కోట్ల మేర పెరగనున్నాయని ఇండియా రేటింగ్స్ అంచనాగా ఉంది. ‘‘కార్పొరేట్ విభాగంలో పునర్ వ్యవస్థీకరించే రుణాల మొత్తం రూ.3.3 లక్షల కోట్ల నుంచి రూ.6.3 లక్షల కోట్ల వరకు ఉంటాయి. బ్యాంకులు అనుసరించే విధానాలపై ఈ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఈ విభాగంలోని రుణాల్లో 53 శాతం అధికరిస్క్ తో కూడినవే. మరో 47 శాతం రుణాలకు మధ్యస్థ రిస్క్ ఉంటుంది. రియల్ ఎస్టేట్, ఎయిర్ లైన్స్, హోటల్స్, విచక్షణారహిత వినియోగ రంగాల్లో ఎక్కువ రుణాలను పునరుద్ధరించాల్సి రావచ్చు. అయితే విలువ పరంగా మౌలిక సదుపాయాలు, విద్యుత్, నిర్మాణ రంగానికి చెందిన రుణాలు ఎక్కువగా ఉండొచ్చు. నాన్ కార్పొరేట్ విభాగంలో పునరుద్ధరించాల్సిన రుణాల్లో సగం ఎంఎస్ఎంఈ విభాగం నుంచి ఉంటాయి. మొత్తం మీద బ్యాంకింగ్ రంగంలో కేటాయింపులు 16–17 శాతం తగ్గుతాయి’’అని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ తన నివేదికలో వివరించింది. -
బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభం మూడింతలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(2020–21, క్యూ1)లో రూ.844 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.243 కోట్లతో పోలిస్తే మూడు రెట్లకు పైగా ఎగబాకింది. ప్రధానంగా మొండిబకాయిల(ఎన్పీఏ)కు సంబంధించి ఒత్తిళ్లు! తగ్గుముఖం పట్టడం లాభాల జోరుకు దోహదం చేసింది. కాగా, క్యూ1లో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.11,527 కోట్ల నుంచి రూ.11,942 కోట్లకు వృద్ధి చెందింది. స్థూల ఎన్పీఏలు ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 13.91 శాతానికి దిగొచ్చాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 16.5 శాతంగా ఉన్నాయి. నికర ఎన్పీఏలు సైతం 5.79 శాతం నుంచి 3.58 శాతానికి తగ్గుముఖం పట్టాయి. దీంతో ఎన్పీఏలకు సంబంధించిన కేటాయింపులు క్యూ1లో రూ.767 కోట్లకు పరిమితం అయ్యాయి. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ కేటాయింపులు రూ.1,873 కోట్లుగా నమోదయ్యాయి. ఫలితాల నేపథ్యంలో బీఓఐ షేరు ధర సోమవారం బీఎస్ఈలో ఒకానొక దశలో 6.5 శాతం ఎగబాకి రూ.50.15 స్థాయిని తాకింది. చివరకు 2 శాతం లాభంతో రూ.48 వద్ద స్థిరపడింది. -
మొండి బాకీలపై ఉర్జిత్ పటేల్ పుస్తకం
ముంబై: బ్యాంకింగ్ మొండి బాకీల సమస్యపై రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాసిన పుస్తకం ఈ నెలాఖరులో విడుదల కానుంది. దీన్ని ప్రచురించిన హార్పర్‌కోలిన్స్ ఇండియా ఈ విషయం వెల్లడించింది. ‘ఓవర్‌డ్రాఫ్ట్– భారత్‌లో పొదుపు చేసే వర్గాలను కాపాడటం’ పేరిట పటేల్ ఈ పుస్తకం రాశారు. ఎన్పీఏలు పేరుకుపోవడానికి కారణాలు, పరిస్థితి చక్కదిద్దడానికి ఆర్బీఐ గవర్నర్ హోదాలో పటేల్ చేసిన ప్రయత్నాలు తదితర అంశాలను ఇందులో పొందుపర్చారు. ఆయన పదవీకాలంలోనే పెద్ద నోట్ల రద్దు అమలైంది. అయితే, కొన్ని అంశాలపై ప్రభుత్వంతో విభేదాల నేపథ్యంలో 2018 డిసెంబర్లో ఆయన అనూహ్యంగా పదవికి రాజీనామా చేశారు. కానీ, ఇటీవలే ఎన్ఐపీఎఫ్పీ చైర్మన్‌గా గత నెలలో నియమితులయ్యారు. -
బ్యాంకులకు ‘కరోనా’ స్ట్రెస్ టెస్టులు
ముంబై: కరోనా వైరస్ పరిణామాలతో మందగమన పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో మొండిబాకీల స్థాయిని మదింపు చేసేందుకు బ్యాంకులు స్ట్రెస్ టెస్టులు నిర్వహించాయి. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియేనని, ఆర్బీఐ ప్రత్యేకంగా బ్యాంకులకు ఆదేశాలివ్వాల్సిన అవసరం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆఖరు త్రైమాసికం కూడా ముగియడంతో ఆర్థికపరమైన ఒత్తిళ్ల గురించి ఒక అవగాహన కోసం ఈ సమీక్షల నిర్వహణ శ్రేయస్కరమని పేర్కొన్నాయి. అసెట్ క్వాలిటీ దిగజారే అవకాశమున్న కేసులను ముందుగా గుర్తించేందుకు, ఒకవేళ పరిస్థితి చేయి దాటితే సమకూర్చుకోవాల్సిన మూలధనం తదితర అంశాలపై ఒక అంచనాకు వచ్చేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. దీనివల్ల మేనేజ్మెంట్కు, నియంత్రణ సంస్థకు ఆయా బ్యాంకుల ఆర్థిక స్థితిగతుల గురించి ముందస్తుగా ఒక అవగాహన ఉంటుంది. మొండిబాకీలను సకాలంలో గుర్తించడం ద్వారా మెరుగ్గా ఉన్న పద్దులపై ప్రతికూల ప్రభావాలు పడకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు బ్యాంకులకు ఈ స్ట్రెస్ టెస్ట్ తోడ్పడుతుందని కేపీఎంజీ ఇండియా పార్ట్నర్ (ఫైనాన్షియల్ సర్వీసెస్ అడ్వైజరీ) సంజయ్ దోషి తెలిపారు. బ్యాంకింగ్ వ్యవస్థ స్థాయిలో నెలకొన్న ఒత్తిళ్ల గురించి తెలియజేసేందుకు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఏటా రెండు సార్లు ఆర్థిక స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) విడుదల చేస్తుంది. గతేడాది డిసెంబర్లో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2019 సెప్టెంబర్‌లో 9.3 శాతంగా ఉన్న బ్యాంకుల స్థూల మొండిబాకీల నిష్పత్తి 2020 సెప్టెంబర్ నాటికి 9.9 శాతానికి పెరగనుంది. మొండిబాకీలు పెరుగుతుండటం, రుణ వృద్ధి తగ్గుతుండటం, స్థూల ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు తదితర అంశాలు ఇందుకు కారణం కాగలవని ఆర్బీఐ నివేదికలో పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల మొండిబాకీల (జీఎన్‌పీఏ) నిష్పత్తి 2019 సెప్టెంబర్‌లో 12.7%గా ఉండగా.. 2020 సెప్టెంబర్ నాటికి 13.2%కి పెరగవచ్చని అంచనా వేసింది. అలాగే ప్రైవేట్ బ్యాంకుల జీఎన్‌పీఏ నిష్పత్తి 3.9 శాతం నుంచి 4.2 శాతానికి పెరగవచ్చని పేర్కొంది. -
ఎన్పీఏ భయాలతో బ్యాంక్ నిఫ్టీలో భారీ షార్ట్స్..!
ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ వచ్చేవారంలో తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ఆప్షన్ ముగింపు తేది గురువారం మే 28న) ఉండటంతో హెవీ కాల్ సెల్లింగ్ ఉండవచ్చని వారు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద వచ్చేవారంలో ఇండెక్స్ 8శాతం పరిధి డౌన్‌సైడ్ ట్రెండ్‌లో ట్రేడ్ అవ్వొచ్చని మార్కెట్ విశ్లేషకుడు రామ్ సహల్ అంటున్నారు. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ వచ్చే వారంలో 16580-18020 రేంజ్లో కదలాడే అవకాశం ఉంది. లాక్ డౌన్ కొనసాగింపు దృష్ట్యా ఆర్బీఐ ఈఎంఐలపై మరో 3నెలల పాటు తాత్కలిక నిషేధాన్ని పొడిగించింది. దీంతో భవిష్యత్తులో బ్యాంకుల ఎన్పీఏలు మరింత పెరగవచ్చనే అంచనాలతో ఫైనాన్షియల్ రంగంలో బలహీనత నెలకొని ఉంది. ఇండెక్స్ అంతర్లీన వాల్యూ శుక్రవారం 2.6శాతం పడిపోయి 17279 చేరుకోవడంతో బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎఫ్అండ్ఓ కాంట్రాక్టు 65శాతం పెరిగి 649113 చేరుకుంది. ఇండెక్స్ ధర 17286 పడిపోవడంతో వచ్చే నెల కాంటాక్టు 33శాతం పెరిగింది. ఇది ప్రతికూలతకు సంకేతమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇండెక్స్ 18500 కీలక స్థాయిని బ్రేక్ చేసినప్పటి నుంచి భారీ పతనాలను చవిచూస్తుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ డెరివేటివ్స్ హెచ్ అమిత్ గుప్తా తెలిపారు. -
పీఎన్బీ మొండిబాకీ లెక్కల్లో వ్యత్యాసాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) దాదాపు రూ. 2,617 కోట్ల మేర మొండిబాకీలు తక్కువగా చూపినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆడిట్లో వెల్లడైంది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్బీఐ లెక్కల ప్రకారం పీఎన్బీ స్థూల మొండిబాకీలు (ఎన్పీఏ) రూ. 81,089.70 కోట్లుగా ఉన్నాయి. కానీ పీఎన్బీ రూ. 78,472 కోట్లు మాత్రమే ఎన్పీఏలుగా చూపించింది. దీంతో ఆర్బీఐ, పీఎన్బీ లెక్కల మధ్య రూ. 2,617 కోట్ల వ్యత్యాసం (డైవర్జెన్స్) వచ్చింది. ఇక నికర ఎన్పీఏలు రూ. 30,038 కోట్లుగా ఉన్నట్లు పీఎన్బీ చూపగా, ఆర్బీఐ ఆడిట్ ప్రకారం రూ. 32,655 కోట్లుగా ఉన్నాయి. దీంతో నికర ఎన్పీఏలకు సంబంధించి కూడా డైవర్జెన్స్ రూ. 2,617 కోట్లుగా ఉన్నట్లు పీఎన్బీ వెల్లడించింది. మరోవైపు మొండిబాకీలకు కేటాయింపుల విషయంలో కూడా రూ. 2,091 కోట్ల మేర వ్యత్యాసం నమోదైంది. రూ. 50,242 కోట్ల మేర ప్రొవిజనింగ్ చేయాల్సి ఉండగా.. రూ. 48,151 కోట్లు మాత్రమే పీఎన్బీ కేటాయించింది. 2018–19 ఆర్థిక ఫలితాల్లో పీఎన్బీ రూ. 9,975 కోట్ల నష్టాన్ని ప్రకటించగా.. ఆర్బీఐ లెక్కించిన విధంగా ప్రొవిజనింగ్ చేసి ఉంటే నష్టాలు రూ. 11,336 కోట్లుగా ఉండేవి. దాదాపు రూ. 14,000 కోట్ల నీరవ్ మోదీ స్కామ్ నుంచి బైటపడేందుకు నానా తంటాలు పడుతున్న పీఎన్బీకి ఇతరత్రా మొండిబాకీలు భారంగా మారుతున్నాయి. -
ముద్రా రుణాలను జాగ్రత్తగా పరిశీలించాలి
ముద్ర రుణాల్లో పెరుగుతున్న మొండిబకాయిలపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి ముద్ర యోజన (పిఎంఎంవై) కింద అనధికారిక రుణాలను విస్తరిస్తున్న బ్యాంకులు ఈ రుణాలను మరింత అప్రమత్తంగా పరిశీలించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ ఎం.కె.జైన్ సూచించారు. ముద్రా పథకం కింద ఇచ్చిన రుణాలను ప్రస్తావిస్తూ బ్యాంకులు మదింపు దశలో రుణాలు తిరిగి చెల్లించే సామర్థ్యంపై దృష్టి పెట్టాలి, జాగ్రత్తగా పర్యవేక్షించాలన్నారు. ముద్ర రుణాల ద్వారా చాలా కుటుంబాలను పేదరికంనుంచి బయటకు తెచ్చేందుకు చేసిన ప్రయత్నం. కానీ మొండిబకాయిలు పెరిగిపోతున్నాయని జైన్ వ్యాఖ్యానించారు. వీరికి రుణాలు ఇచ్చేసమయంలోనే బ్యాంకులు రీపేమెంట్‌కు సంబంధించి సరైన అంచనాలు వేసుకోవాలన్నారు. కాగా కార్పొరేట్యేతర, వ్యవసాయేతర చిన్న,సూక్ష్మ సంస్థలకు రూ .10 లక్షల వరకు రుణాలు అందించడానికి పిఎంఎంవై 2015, ఏప్రిల్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఈ పథకం కింద ఎస్సీలు, ఎస్టీలు సహా 3.27 కోట్ల మంది స్వల్ప, చిన్న పారిశ్రామికవేత్తలకు రూ .7.28 లక్షల కోట్ల రుణాలు పంపిణీ చేసినట్లు డేటా ద్వారా తెలుస్తోంది. -
రూ. 3640 కోట్ల ఎన్పీఏల వేలం
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి భారీగా నిరర్ధక ఆస్తులను వేలం వేయనుంది. రూ.2,337.88 కోట్ల విలువైన నిరర్థక ఆస్తులను వేలం వేస్తున్నట్లు ప్రకటించింది.ఆరు ఖాతాలకు చెందిన నిరర్థక ఆస్తుల వేలాన్ని మార్చి 26న నిర్వహించనున్నట్టు తెలిపింది. అలాగే 100 శాతం క్యాష్ బేసిస్‌లో ఉంటుందని తెలిపింది. ఆమేరకు ఎస్బీఐ వెబ్సైట్లో వేలం నోటీసును జారీ చేసింది. ఇండియన్ స్టీల్ కార్పొరేషన్ (రూ.939 కోట్లు) , జై బాలాజీ ఇండస్ట్రీస్ ( రూ.859 కోట్లు) కొహినూర్ ప్లానెట్ ప్లానెట్ కన్స్ట్రక్షన్ (రూ. 207.77 కోట్లు), మిట్టల్ కార్పొరేషన్ (రూ.116.34 కోట్లు), ఎంసిఎల్ గ్లోబల్ స్టీల్ (రూ. 100.18 కోట్లు), శ్రీ వైష్ణవ్ ఇస్పాత్ (82.52 కోట్లు), గతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ (42.86 కోట్లు) ఉన్నాయి. కాగా గతవారమే రూ.1,307.27 కోట్ల నిరర్థక ఆస్తులను వేలం వేయనున్నట్టు వెల్లడించింది. ఈ వేలం 22న వేలం వేయనున్నట్టు ఎస్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం వేలం విలువ రూ.3640 కోట్లకు చేరింది. -
ఎస్బీఐ, ఓబీసీ మొండిబాకీల విక్రయం
న్యూఢిల్లీ: సుమారు రూ. 5,740 కోట్ల బాకీలను రాబట్టుకునే క్రమంలో వాటికి సంబంధించిన మొండిపద్దులను విక్రయించడంపై ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) దృష్టి సారించాయి. సుమారు రూ. 4,975 కోట్ల రికవరీకోసం అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు (ఏఆర్సీ), ఆర్థిక సంస్థల నుంచి బిడ్లు ఆహ్వానిస్తూ ఎస్బీఐ ప్రకటన విడుదల చేసింది. వీటిలో సింహభాగం వాటా (సుమారు రూ. 4,667 కోట్లు) చిన్న, మధ్య తరహా సంస్థలదే ఉంది. ఎక్కువగా రూ. 50 కోట్ల దాకా బాకీపడిన సంస్థలు దాదాపు 281 దాకా ఉన్నాయి. మరోవైపు, 13 ఖాతాల నుంచి రూ. 764.44 కోట్లు రాబట్టుకునేందుకు ఓబీసీ కూడా బిడ్లను ఆహ్వానించింది. విక్రయించబోయే ఖాతాల్లో మిట్టల్ కార్పొరేషన్ (రూ. 207 కోట్లు), జయస్వాల్ నెకో ఇండస్ట్రీస్ (రూ. 157 కోట్లు) మహాలక్ష్మి టీఎంటీ (రూ. 78 కోట్లు) మొదలైనవి ఉన్నాయి. ఎస్బీఐ ఖాతాలకు సంబంధించి ఈ–బిడ్డింగ్ ఫిబ్రవరి 27న, ఓబీసీ ఖాతాలకు ఫిబ్రవరి 25న జరగనుంది. -
1.16 లక్షల కోట్ల రికవరీపై చేతులెత్తేసిన బ్యాంకులు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ 16 బ్యాంకులు కలిసి పేరుకుపోయిన రూ 1.16 లక్షల కోట్ల రుణ బకాయిలను రాబట్టలేక చేతులెత్తేశాయి. డెట్ రికవరీ ట్రిబ్యునల్, దివాలా చట్టం 2016 వంటి పలు యంత్రాంగాల ద్వారా ఈ రుణ మొత్తాలను వసూలు చేయలేకపోయిన బ్యాంకులు చివరి అస్త్రంగా వీటిని అసెట్ రీకన్స్ర్టక్షన్ కంపెనీ (ఏఆర్సీ)లకు అమ్ముకుని చేతులు దులుపుకున్నాయి. రుణాలను వేగంగా రికవరీ చేసేందుకు ప్రభుత్వం పకడ్బందీగా తీసుకువచ్చిన దివాలా చట్టం 2016 కింద రుణ రికవరీ ప్రక్రియ జాప్యం జరుగుతుండటంతో బ్యాంకులు మొండి బకాయిలను తెగనమ్మి బ్యాలెన్స్ షీట్లను ప్రక్షాళన చేసుకునేందుకు మొగ్గుచూపుతున్నాయి. గత వారం ఎస్బీఐ ఎస్సార్ స్టీల్‌కు ఇచ్చిన రూ 15,000 కోట్ల రుణాలను 18 శాతం రాయితీతో విక్రయించి మార్కెట్ వర్గాలను విస్మయానికి లోనుచేసింది. డిస్కాంట్‌కు తాము రుణాలను విక్రయించినా బ్యాంకుకు రూ 9,500 కోట్ల నగదు లభించిందని, ఇది ఇతరులకు రుణాలు ఇచ్చేందుకు వెసులుబాటు కలిగిస్తుందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. రుణాలు పేరుకుపోతే దానికి కేటాయింపులూ పెరుగుతాయని, మూలధనం ఎక్కువకాలం నిలిచిఉండటం మంచిదికాదని ఆయన చెప్పుకొచ్చారు. 62 ఖాతాలకు చెందిన రూ 27,953 కోట్ల రుణాలను ఎస్బీఐ వేలం ప్రక్రియలో అమ్మకానికి ఉంచింది. ఈ తరహా రుణాలను కొనుగోలు చేసేందుకు డచ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెడ్జ్ ఫండ్స్‌లు ఆసక్తి చూపుతున్నాయి. ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం రూ 29,801 కోట్ల రుణాలను అమ్మకానికి పెట్టగా, కెనరా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, దేనా బ్యాంక్‌లూ నిరర్ధక ఆస్తుల విక్రయానికి మొగ్గుచూపుతున్నాయి. -
ఎన్పీఏల సమస్యను అధిగమించే స్థాయికి బ్యాంకులు
న్యూయార్క్: భారత బ్యాంకులు మొండి బకాయిల (ఎన్పీఏలు) సమస్యను అధిగమించే స్థాయికి వచ్చేశాయని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. సెప్టెంబర్ త్రైమాసికంలో వస్తున్న ఫలితాలను బట్టి బ్యాంకులు తిరిగి లాభాల్లోకి వస్తున్నట్టు అర్థమవుతోందన్నారు. ఎక్కువగా స్టీల్, విద్యుత్ రంగాలకు ఇచ్చిన రుణాల రూపంలో ఇది ఉందని, అయితే, ఎక్కువ శాతం ప్రభావం ముగిసిందని చెప్పారాయన. ‘‘ప్రభుత్వరంగ బ్యాంకులు, కొన్ని ప్రైవేటు బ్యాంకులు ఆస్తుల నాణ్యత సవాలును ఎదుర్కొంటున్నాయి. గత మూడు సంవత్సరాలుగా ఇది కొనసాగింది. కానీ, ఈ సమస్య విషయంలో చివరి దశలో ఉన్నాం’’ అని కుమార్ తెలిపారు. విద్యుత్ రంగానికి సంబంధించి ఎన్పీఏలను బ్యాంకులు ఇప్పటికీ పరిష్కరించుకునే స్థితిలో లేవన్నారు. అయితే, దివాలా బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) బ్యాంకులకు మేలు చేస్తున్నదని, ప్రస్తుతం ఓ పరిష్కారం అనేది అందుబాటులో ఉందని చెప్పారాయన. బ్యాంకులకు, రుణదాతలకు ఐబీసీ అన్నది మంచి సాధనంగా పేర్కొన్నారు. చమురు ధరలు స్థిరపడితే, రూపాయి కూడా కుదురుకుంటుందని చెప్పారు. ‘‘దేశీయంగా ఆర్థిక రంగం మంచి పనితీరులో ఉంది. కానీ పెరుగుతున్న చమురు ధరలు అతిపెద్ద అవరోధంగా తయారయ్యాయి. ఎందుకంటే ఇది దేశ కరెంటు ఖాతా లోటుపై పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తుంది’ అని ఆయన అన్నారు. -
ఎన్పీఏల నుంచి ఎన్‌బీఎఫ్‌సీల వరకూ...
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డ్ మంగళవారం పలు కీలక అంశాలను సమీక్షించింది. మొండిబకాయిలు (ఎన్పీఏ) సహా బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌లో సంక్షోభం నేపథ్యంలో ఎన్బీఎఫ్సీలు ఎదుర్కొంటున్న లిక్విడిటీ సమస్యలను కూడా 18 మంది సభ్యుల బోర్డ్ సమావేశం చర్చించింది. గవర్నర్ ఉర్జిత్ పటేల్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎస్సీ గార్గ్, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌కుమార్‌సహా బోర్డ్‌లోని పలువురు సమావేశంలో పాల్గొన్నారు. నవంబర్ మొదటివారంలో మరోసారి బోర్డ్ సమావేశం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది,. పేటీఎం లాంటి ఆన్లైన్ చెల్లింపుల వ్యవస్థకు ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ ఉండాలన్న కేంద్రం ఆలోచనను ఆర్బీఐ బహిరంగంగానే వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో తాజా సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. -
రూపాయి పతనం, మొండిబకాయిలతో ఇబ్బందే
న్యూఢిల్లీ: అంతకంతకూ పడిపోతున్న రూపాయి విలువ, బ్యాంకుల్లో మొండిబకాయిలు పేరుకుపోతుండటం ఆందోళన కలిగించే అంశాలేనని ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ పేర్కొన్నారు. కేంద్రంలోని మోదీ సర్కారు పనితీరుపై మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. పాలనపరమైన లోపాలు, పలు రాష్ట్రాల్లో ప్రజా ఆందోళనలు, లౌకికవాదాన్ని దెబ్బతీసేవిధంగా చేస్తున్న ప్రకటనలతో దేశం సతమతమవుతోందని జలాన్ వ్యాఖ్యానించారు. అయితే, మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు కీలక సంస్కరణలు ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూర్చుతాయన్నారు. ప్రధానంగా వస్తు–సేవల పన్ను(జీఎస్టీ), దివాలా చట్టం, ప్రభుత్వ పథకాలకు నగదు బదిలీ వంటివి ఇందులో ప్రధానమైనవని చెప్పారు. ‘వర్ధ మాన దేశాలన్నింటికెల్లా మన ఆర్థిక వృద్ధి రేటు అత్యధిక స్థాయిలో ఉండటం, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం కచ్చితంగా సానుకూల అంశాలే. అయితే, వ్యవసాయోత్పత్తులకు మద్దతు ధరల పెంపు విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఆహా రోత్పత్తుల ధరలు పెరిగి గ్రామీణ, చిన్న పట్టణాల్లో పేద ప్రజలపై తీవ్ర ప్రభావానికి దారితీస్తుంది. ఇక రూపాయి పతనం వల్ల పెద్ద ముప్పేమీ లేనప్పటికీ.. గత కొద్ది నెలల్లో కరెన్సీ విలువ తీవ్రం గా పడిపోవడం అనేది ఆందోళనరమైన అంశమే. మొండిబకాయిల సమస్యకు ఆర్బీఐ చర్యలు, దివాలా చట్టంతో తగిన పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నా. ఎయిరిండియా ప్రైవేటీకరణకు మరికొంత సమయం పట్టొచ్చు’ అని జలాన్ పేర్కొన్నారు. -
రద్దు చేస్తే.. హక్కులు వదులుకున్నట్టు కాదు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు వసూలు కాని మొండి బకాయిలను (ఎన్పీఏలు) మాఫీ చేస్తుండడాన్ని (రైటాఫ్) కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమర్థించుకున్నారు. ఇలా చేయడం ఎన్పీఏలపై హక్కులు వదులుకోవడానికి దారితీయదన్నారు. బ్యాంకులు తమ బ్యాలన్స్ షీట్లను ప్రక్షాళించుకోవడానికి, పన్ను ప్రయోజనం పొందడానికి వీలు పడుతుందని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) రూ.36,551 కోట్ల ఎన్పీఏలను వసూలు చేసినట్టు చెప్పారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఇలా వసూలైన మొత్తం ఎన్పీఏలు రూ.74,562 కోట్లుగా ఉన్నాయని తెలియజేశారు. బీజేపీ పాలనలోని నాలుగు సంవత్సరాల్లో 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.3.16 లక్షల కోట్ల ఎన్పీఏలను మాఫీ చేశాయని, అదే సమయంలో రూ.44,900 కోట్ల మేర రద్దు చేసిన రుణాలను రికవరీ చేశాయని వచ్చిన వార్తలపై జైట్లీ ఫేస్బుక్లో స్పందించారు. ‘‘ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగానే సాంకేతికపరమైన రైటాఫ్‌లను బ్యాంకులు చేస్తుంటాయి. ఎన్పీఏల మాఫీ అన్నది బ్యాంకులు తమ బ్యాలన్స్ షీట్లను ప్రక్షాళించేందుకు తరచుగా చేసే పనే. ఇది పన్ను పరంగా ప్రయోజనం కలిగిస్తుంది. అయినప్పటికీ ఇది ఏ రుణంపైనా హక్కులు వదిలేసుకోవటానికి దారితీయదు. రుణాల రికవరీని బ్యాంకులు కఠినంగా కొనసాగిస్తూనే ఉంటాయి’’ అని జైట్లీ వివరించారు. డీమోనిటైజేషన్, రూ.3.16 లక్షల కోట్ల ఎన్పీఏల మాఫీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించడంతో జైట్లీ ఇలా స్పందించారు. మాఫీ చేసినప్పటికీ, రుణాలు తీసుకున్న వారిపై తిరిగి చెల్లించాల్సిన బాధ్యత ఉంటుందని జైట్లీ స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీఎస్బీలకు రూ.1,81,034 కోట్ల రికవరీ లక్ష్యాన్ని విధించినట్టు జైట్లీ తెలిపారు. సెప్టెంబర్ జీఎస్టీ వసూళ్లలో స్వల్ప వృద్ధి! వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు సెప్టెంబర్‌లో స్వల్పంగా పెరిగి రూ.94,442 కోట్లుగా నమోదయ్యాయి. ఆగస్టులో ఈ వసూ ళ్లు రూ.93,960 కోట్లు. అయితే పండుగల సీజన్ వల్ల సెప్టెంబర్ తరువాతి నెలల్లో ఈ వసూళ్లు మరింత పెరుగుతాయన్న అంచనాలున్నాయి. 67 లక్షల వ్యాపార వర్గాల నుంచి సెప్టెంబర్‌లో తాజా డిపాజిట్లు వచ్చినట్లు ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. విడివిడిగా చూస్తే.. సెంట్రల్ జీఎస్టీ వాటా రూ.15,318 కోట్లు. స్టేట్ జీఎస్టీ వాటా రూ.21,061 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ వాటా రూ.50,070 కోట్లు (దిగుమతులపై రూ. 25,305కోట్లు కలిపి), సెస్ రూ.7,993 కోట్లు . ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటున నెలకు లక్ష కోట్ల జీఎస్టీ వసూళ్లు జరగాలన్నది కేంద్రం లక్ష్యమైనా ఏప్రిల్ మినహా మరే నెలలో ఇది సాధ్యపడలేదు. -
మొండిబాకీలు తగ్గాయ్..
ముంబై: గడిచిన ఏడాది కాలంగా మొండిబాకీలు గణనీయంగా తగ్గాయని, అసెట్ క్వాలిటీ అంచనాలు స్థిర స్థాయిలోనే ఉన్నాయని ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ వెల్లడించింది. ‘గడిచిన కొద్ది రోజులుగా బ్యాంకు అసెట్ క్వాలిటీ గురించి కొన్ని నిరాధార ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చిన సంగతి మేనేజ్మెంట్ దృష్టికి వచ్చింది. అయితే, అలాంటి పరిస్థితేమీ లేదని అసెట్ క్వాలిటీ స్థిరంగానే ఉందని యాజమాన్యం స్పష్టం చేయదల్చుకుంది‘ అని స్టాక్ ఎక్సే్చంజీలకు బ్యాంకు తెలియజేసింది. ఇక లిక్విడిటీ కూడా తగినంత స్థాయిలోనే ఉందని, ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి లిక్విడిటీ కవరేజీ నిష్పత్తి 101 శాతంగా ఉందని పేర్కొంది. సెప్టెంబర్ 30 నాటికి స్థూల మొండిబాకీలు 1.82 శాతం నుంచి 1.35 శాతానికి తగ్గినట్లు వివరించింది. అదే సమయంలో రుణాలు 61.5 శాతం వృద్ధితో రూ. 2.40 లక్షల కోట్లకు చేరినట్లు, డిపాజిట్లు 41 శాతం పెరుగుదలతో రూ. 2.23 లక్షల కోట్లకు పెరిగినట్లు యస్ బ్యాంక్ పేర్కొంది. వరుసగా రెండేళ్ల పాటు దాదాపు రూ.10,000 కోట్ల మొండిబాకీలను (ఎన్పీఏ) వెల్లడించకుండా కప్పిపెట్టి ఉంచిందంటూ యస్ బ్యాంక్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆక్షేపించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు బ్యాంక్ ఎండీ, సీఈవో రాణా కపూర్ పదవీ కాలాన్ని 2019 జనవరికి మాత్రమే కుదించింది. ఈ పరిణామాల దరిమిలా బ్యాంకు షేరు దాదాపు 40 శాతం మేర పతనమైంది. అటు యస్ బ్యాంక్ డెట్ సాధనాలను ప్రత్యేక పరిశీలనలో ఉంచినట్లు కేర్ రేటింగ్స్ వెల్లడించింది. త్వరలోనే సెర్చి కమిటీ... రాణా కపూర్ స్థానంలో కొత్త సీఈవోను అన్వేషించేందుకు ఏర్పాటు చేస్తున్న సెర్చి(అన్వేషణ) కమిటీలో ఇద్దరు బయటి వ్యక్తులు సభ్యులుగా ఉంటారని, అక్టోబర్ 7 నాటికల్లా వీరిని ఖరారు చేయడం జరుగుతుందని యస్ బ్యాంక్ వెల్లడించింది. అంతర్జాతీయ లీడర్షిప్ అడ్వైజరీ సంస్థ ఈ కమిటీకి సహాయ సహకారాలు అందిస్తుందనికూడా పేర్కొంది. సంస్థలో ఉద్యోగులతో పాటు బయటి వారిని కూడా సీఈవో పదవి కోసం పరిశీలించనున్నట్లు బ్యాంకు తెలియజేసింది. దీర్ఘకాలిక వారసత్వ ప్రణాళికను సిద్ధం చేసుకునే క్రమంలో బ్యాంక్ ఇప్పటికే ఇద్దరు సీనియర్ గ్రూప్ ప్రెసిడెంట్స్ రజత్ మోంగా, ప్రళయ్ మోండాల్‌ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ప్రమోట్ చేసింది. ఇందుకోసం ఆర్బీఐ అనుమతులు కోరినట్లు యస్ బ్యాంక్ పేర్కొంది. కాగా, సోమవారం యస్ బ్యాంక్ షేరు బీఎస్ఈలో దాదాపు 9.68 శాతం పెరిగి రూ.201.20 వద్ద ముగిసింది. -
బ్యాంకుల చీఫ్‌లతో నేడు జైట్లీ భేటీ
న్యూఢిల్లీ: వార్షిక ఆర్థిక పనితీరు సమీక్షలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) చీఫ్‌లతో భేటీ కానున్నారు. మొండిబాకీలను తగ్గించుకోవడానికి తీసుకుంటున్న చర్యల పురోగతితో పాటు పలు అంశాలు ఇందులో చర్చకు వస్తాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. రుణ వృద్ధి, బాకీల రికవరీకి తీసుకుంటున్న చర్యలు, చట్టపరంగా ప్రభుత్వం అందించే తోడ్పాటు మొదలైనవి కూడా చర్చించే అవకాశం ఉందని వెల్లడించాయి.మొండిబాకీలను రాబట్టేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న బ్యాంకులు.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇప్పటికే రూ. 36,551 కోట్లు రాబట్టాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో వసూలైన మొండిబాకీలతో పోలిస్తే ఇది 49 శాతం అధికం. మూడు పీఎస్‌బీలను (బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా, దేనా బ్యాంక్) విలీనం చేయాలంటూ ప్రత్యామ్నాయ యంత్రాంగం సిఫార్సు చేసిన నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. 2017–18లో పీఎస్‌బీల నష్టాలు రూ. 87,357 కోట్ల పైచిలుకు నమోదయ్యాయి. 21 పీఎస్బీల్లో రెండు మాత్రమే (ఇండియన్ బ్యాంక్, విజయా బ్యాంక్) లాభాలు ప్రకటించాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు లిక్విడిటీ కోసం చర్యలు: జైట్లీ నిధుల కష్టాల వార్తలతో ఆర్థిక సంస్థల షేర్లు కుప్పకూలుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇన్వెస్టర్లకు భరోసానిచ్చే ప్రయత్నం చేశారు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ), మ్యూచువల్ ఫండ్స్‌కి తగింత లిక్విడిటీ ఉండేలా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. సోమవారం స్టాక్ మార్కెట్ ప్రారంభం కావడానికి ముందు.. మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్లో ఈ మేరకు ట్వీట్ చేశారు. రుణాలు బాకీ పడిన ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూప్‌తో పాటు లిక్విడిటీ సమస్యల వార్తలతో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ డీహెచ్ఎఫ్ఎల్ షేర్లు కుప్పకూలడం.. వాటితో పాటు మార్కెట్లు పతనం అవుతుండటం తెలిసిందే. -
ఎన్‌బీఎఫ్‌సీలకు ఇక మొండి బండ
సాక్షి, బిజినెస్ విభాగం : లిక్విడిటీ సమస్య కారణంగా భారీగా నష్టపోతున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలపై (ఎన్బీఎఫ్సీ) మరో పిడుగు పడటానికి సిద్ధంగా ఉంది. ఇప్పటిదాకా బ్యాంకులను వణికించిన మొండి బకాయిల సమస్య ఇప్పుడు బ్యాంకేతర ఆర్థిక సంస్థలపై (ఎన్బీఎఫ్సీ– నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ) కూడా గట్టిగానే ప్రభావం చూపించనున్నదనేది నిపుణుల మాట. దీనికి ప్రధాన కారణం... కొత్త అకౌంటింగ్ నిబంధనలు. పాత అకౌంటింగ్ పద్ధతిలో బకాయిలు మొండి బకాయిలుగా మారేంత వరకూ వేచి చూసి అప్పుడు కేటాయింపులు జరిపాల్సి ఉండేది. కానీ కొత్తగా అమల్లోకి రానున్న ‘ద ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్’ (ఇండ్ యాజ్) ప్రకారం భవిష్యత్తులో మొండి బకాయిలుగా మారనున్న బకాయిలను ఇప్పుడే గుర్తించి... రాబోయే నష్టాలకు ముందుగానే కేటాయింపులు జరపాల్సి ఉంటుంది. బ్యాంకులకైతే ఈ ఇండ్ యాజ్ నిబంధనలను పాటించడానికి ఆర్బీఐ మరో ఏడాది దాకా వెసులుబాటునిచ్చింది. ఎన్‌బీఎఫ్‌సీలకు మాత్రం ఈ జూన్ క్వార్టర్ నుంచే ఈ కొత్త నిబంధనలు అమలు కానున్నాయి. ఈ జూన్ క్వార్టర్ నుంచి ఇండి యాజ్ అమల్లోకి రానుండటంతో, ఈ ఏడాది జూన్– సెప్టెంబర్ క్వార్టర్, గత ఏడాది ఇదే క్వార్టర్ల మధ్య వచ్చే అసెస్మెంట్ తేడాలను కూడా ఎన్బీఎఫ్సీలు వెల్లడించాల్సి ఉంటుంది. మొత్తం మీద కొత్త అకౌంటింగ్ నిబంధనల ప్రకారం భవిష్యత్తులో మొండి బకాయిలయ్యే వాటికి ఎన్బీఎఫ్సీలు చేయాల్సిన కేటాయింపులు కనీసం రూ.3,400 కోట్ల మేర ఉండొచ్చని అంచనాలున్నాయి. ఇది ఎన్‌బీఎఫ్‌సీలకు మరింత అదనపు భారం కానుంది. ఇండ్ యాజ్ ఎందుకు ? ఇప్పటివరకూ కంపెనీలన్నీ గ్యాప్ (జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపుల్స్) ప్రమాణాలను పాటిస్తున్నాయి. 2008 నాటి ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు కంపెనీలన్నీ, ముఖ్యంగా ఆర్థిక రంగానికి చెందిన కంపెనీలన్నీ తీవ్ర సంక్షోభానికి గురయ్యాయి. భవిష్యత్తులో అలాంటి తీవ్ర పరిణామాలు తలెత్తకుండా ఉండటానికి గాను ‘ద ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్’ (ఇండ్ యాజ్) అందుబాటులోకి తెచ్చారు. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్డాండర్డ్స్కు అనుగుణంగా ఇండ్ యాజ్ నిబంధనలను రూపొందించారు. ఈ నిబంధనల కారణంగా మొండి బకాయిలకు కేటాయింపులు అధికంగా జరపాల్సి ఉంటుంది. దీంతో ఆయా కంపెనీల లాభదాయకత దెబ్బతింటుంది. ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ (ఈసీఎల్) విధానంలో రుణ నష్ట కేటాయింపులు జరపాల్సి ఉంది. 10 శాతం నెట్‌వర్త్ ఆవిరి.... ఈ కొత్త నిబంధనల కారణంగా ఎన్‌బీఎఫ్‌సీల నెట్‌వర్త్ కనీసం 10 శాతం హరించుకుపోతుందని నిపుణులంటున్నారు. అయితే విభిన్న రకాల రుణాలిచ్చే కంపెనీలకు మాత్రం ఒకింత ఊరట లభిస్తుందని వారి అంచనా. పాత అకౌంటింగ్ నిబంధన ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో ఎల్ అండ్ టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ కంపెనీ కేటాయింపులు రూ.1,200 కోట్లుగా ఉన్నాయి. కొత్త అకౌంటింగ్ నిబంధనల ప్రకారం ఈ కేటాయింపులు రూ.1,800 కోట్లకు పెరగనున్నాయి. ఈ భారం మహీంద్రా అండ్ మహీంద్రాపై రూ.1,357 కోట్లు, బజాజ్ ఫైనాన్స్‌పై రూ.270 కోట్ల మేర ఉండొచ్చని అంచనాలున్నాయి. టాప్ టెన్ ఎన్బీఎఫ్సీల్లో ఆరింటిపై ఈ కొత్త అకౌంటింగ్ నిబంధనల భారం ఉండనున్నదని నిపుణులు చెబుతున్నారు. అయితే రిజర్వ్ నిధులకు సంబంధించి కొత్త అకౌంటింగ్ విధానాలు ఎన్బీఎఫ్సీలపై సానుకూల ప్రభావం చూపించనుండటం ఒకింత ఊరటనిచ్చే విషయమనేది వారి మాట. అయితే అంచనా రుణనష్టాలు ఎంతనేది ఇప్పటికైతే స్పష్టత లేదు. ఏం మార్పులు వస్తాయంటే... ♦ పాత ఖాతా నిబంధనల నుంచి కొత్త ఖాతా నిబంధనలకు మారే దశలో నిర్వహణ లాభం తక్కువగా ఉంటుంది. ♦ మొండి బకాయిలకు కేటాయింపులు ముందే జరపాల్సి ఉంటుంది ♦ ఎసాప్స్ జారీ కారణంగా సిబ్బంది వ్యయాలు పెరుగుతాయ్ ♦ పన్ను వ్యయాలూ పెరుగుతాయ్ ఎన్‌బీఎఫ్‌సీల జోరుకు కళ్లెం...? నెలవారీ క్రమబద్ధంగా వేతనం రాని వ్యక్తులు, అల్పాదాయ వర్గాల వ్యక్తులు, చిన్న వ్యాపార సంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లోని వ్యక్తులకు బ్యాంక్‌లు రుణాలివ్వవు. ఇలాంటి వారికి రుణాలివ్వడం ద్వారా ఎన్బీఎఫ్సీలు గత రెండేళ్లలో మంచి వృద్ధి సాధించాయి. మరోవైపు మొండి బకాయిల సమస్యతో బ్యాంక్ షేర్లు కుదేలవడంతో పలువురు ఇన్వెస్టర్లు ఈ ఎన్బీఎఫ్సీ షేర్లవైపే మొగ్గు చూపారు. బజాజ్ ఫైనాన్స్, కెన్‌ఫిన్ హోమ్స్, ఎస్కేఎస్ మైక్రోఫైనాన్స్ కంపెనీలు మంచి లాభాలు సాధించాయి. తాజాగా లిక్విడిటీ ఆందోళనలు వ్యక్తం కావడంతో ఈ షేర్లు ఇటీవల బాగా నష్టపోయాయి. తాజాగా ఇండ్ యాజ్ నిబంధనల కారణంగా చాలా ఎన్‌బీఎఫ్‌సీల ప్రభ మసకబారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
మొండిబాకీల విక్రయంలో ఎస్బీఐ
న్యూఢిల్లీ: సుమారు రూ. 3,900 కోట్ల మేర మొండిబాకీలను రాబట్టుకునే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరో 8 నిరర్ధక ఆస్తులను (ఎన్పీఏ) విక్రయించనుంది. ఇందుకోసం అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు (ఏఆర్సీ), ఆర్థిక సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. ఎనిమిది ఖాతాల్లో అత్యధికంగా కోల్‌కతాకు చెందిన రోహిత్ ఫెరో టెక్ రూ. 1,320 కోట్లు బాకీ పడింది. మిగతా లిస్టులో ఇండియన్ స్టీల్ కార్పొరేషన్ (రూ. 929 కోట్లు), జై బాలాజీ ఇండస్ట్రీస్ (రూ. 859 కోట్లు), మహాలక్ష్మి టీఎంటీ (రూ. 410 కోట్లు), ఇంపెక్స్ ఫెర్రో టెక్ (రూ. 201 కోట్లు), కోహినూర్ స్టీల్ (రూ. 111 కోట్లు), మోడర్న్ ఇండియా కాన్‌కాస్ట్ (రూ. 71 కోట్లు), బల్లార్పూర్ ఇండస్ట్రీస్ (రూ. 47 కోట్లు) ఉన్నాయి. ఆసక్తి వ్యక్తీకరణ పత్రం సమర్పించి, నిర్దిష్ట ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత బిడ్డింగ్ చేసే సంస్థలు ఆయా సంస్థల ఆస్తులను మదింపు చేసుకోవాలని ఎస్బీఐ సూచించింది. ఈ పద్దుల విక్రయానికి సెప్టెంబర్ 26న ఈ–బిడ్డింగ్ జరుగుతుందని తమ వెబ్సైట్లో ఉంచిన ప్రకటనలో పేర్కొంది. గత నెలలోనే ఎస్బీఐ సుమారు రూ.2,490 కోట్ల బకాయిలకు సంబం ధించి రెండు ఖాతాలను (బాంబే రేయాన్ ఫ్యాషన్స్, శివమ్ ధాతు ఉద్యోగ్) అమ్మకానికి ఉంచింది. -
మరో ఏడాది పాటు అధిక కేటాయింపులే
ముంబై: మొండిబాకీలకు 2019–20 ఆర్థిక సంవత్సరం దాకా బ్యాంకులు అధిక కేటాయింపులు కొనసాగించాల్సిన పరిస్థితి తప్పకపోవచ్చని రేటింగ్స్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు 3 శాతం దాకా ప్రొవిజనింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపింది అర్ధ సంవత్సర అంచనాల నివేదికలో ఇండియా రేటింగ్స్ వివరించింది. దీర్ఘకాలికంగా పేరుకుపోయిన మొండిబాకీలు, 2016 ఆర్థిక సంవత్సరంలో అసెట్ క్వాలిటీ సమీక్ష అనంతరం నాన్ కార్పొరేట్ ఖాతాల్లో పెరుగుతుండటమే ఇందుకు కారణమని వివరించింది. ప్రైవేట్ రంగ బ్యాంకులు, ప్రభుత్వ రంగంలో ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడాల పరిస్థితి స్థిరంగా కొనసాగనుండగా.. మిగతా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల అవుట్‌లుక్ ప్రతికూలంగా ఉండనుందని పేర్కొంది. కార్పొరేట్ రుణాల విభాగంలో ఒత్తిడి దాదాపు గరిష్ట స్థాయికి చేరగా .. నాన్–కార్పొరేట్ రుణాల్లో అసెట్ క్వాలిటీపరమైన ఒత్తిళ్లు క్రమంగా ఎగుస్తున్నాయని వివరించింది. -
రాజన్ సూచనలు శిరోధార్యం
నిజాన్ని నిక్కచ్చిగా చెప్పే అలవాటున్న రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మరో సారి కుండబద్దలు కొట్టారు. బ్యాంకుల మొండి బకాయిలకు మూలాలు ప్రభుత్వ నిర్ణయాల్లో, తీరు తెన్నుల్లో ఉన్నాయని వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్నాయి గనుక సహజంగానే అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీకి రాజన్ ఇచ్చిన నోట్‌ను తమకనుకూలంగా మలచుకునే ప్రయత్నాన్ని ప్రారంభించాయి. అత్యధిక శాతం మొండి బకాయిలకు 2006–08 మధ్యనే బీజం పడిందని నివేదికలో ఆయనన్న మాటలను ఆసరా చేసుకుని కాంగ్రెస్‌పై బీజేపీ దాడి ప్రారంభించగా... కొంపముంచే ఆస్కారమున్న ఎగవేతదార్ల జాబితాను ప్రధాని కార్యాలయానికి (పీఎంఓ) పంపానని ఆయన చెప్పడాన్ని కాంగ్రెస్ ఎత్తిచూపింది. ఆ జాబితాపై మోదీ సర్కారు దృష్టి పెట్టి ఉంటే ఎగవేతదార్లు దేశం విడిచి పారిపోయే పరిస్థితి ఏర్పడి ఉండేది కాదని ఆ పార్టీ అంటోంది. ఆ రెండు పార్టీలూ ఇలా పరస్పర విమర్శలకు దిగడంలో వింతేమీ లేదు. అయితే రఘురాం రాజన్ చెప్పిన అంశాలు అనేకం ఉన్నాయి. పాలనా వ్యవస్థలో నిర్ణయ ప్రక్రియ మంద గిస్తున్న వైనం అందులో ప్రధానమైనది. అలాగే వివిధ బ్యాంకుల చీఫ్‌లు రిటైరైన చాన్నాళ్లకుగానీ వారి స్థానంలో కొత్తవారిని నియమించకపోవటాన్ని, తిరిగొస్తాయో రావో తెలియకుండా రుణ మేళాలు నిర్వహిస్తున్న తీరును కూడా ఆయన తప్పుబట్టారు. ఇవి గత యూపీఏ ప్రభుత్వానికీ, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వానికీ కూడా సమంగా వర్తిస్తాయి. బొగ్గు గనుల కేటాయింపులో లేదా మరే ఇతరచోట్లనో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చేసరికి ప్రభుత్వ యంత్రాంగం స్తంభించిపోతోంది. ఆరోపణల అతీగతీ తేలడానికి ఏళ్లూ పూళ్లూ పడుతుంటే, కొత్తగా ఏ నిర్ణయం తీసుకోవటానికైనా వివిధ శాఖలు జంకుతున్నాయి. ఆ నిర్ణ యాలపై కూడా భవిష్యత్తులో ఆరోపణలు వెల్లువెత్తి దర్యాప్తు మొదలుపెడితే చిక్కుల్లో పడతామన్న భయాందో ళనలు నిర్ణయరాహిత్యానికి దారితీస్తున్నాయి. పర్యవసానంగా ప్రాజెక్టులన్నీ ఎక్కడిక క్కడ ఆగిపోతు న్నాయి. ఉత్పాదన ప్రారంభం కాకపోవడంతో తీసుకున్న అప్పులకు కనీసం వడ్డీలు కూడా చెల్లించ లేని స్థితి ఏర్పడుతోంది. ఫలితంగా అప్పులిచ్చిన బ్యాంకులు కుదేలవుతున్నాయి. ఇది ఒక పార్శ్వం కాగా, మరొకటి బ్యాంకుల సోమరితనం. తమను రుణం అడుగుతున్న సంస్థ పని తీరు, అది ప్రతిపా దిస్తున్న ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలు, మార్కెట్లో దానికుండే విజయావకాశాలు సొంతంగా మదింపు వేసుకోకుండా ఆ సంస్థకు ప్రమోటర్‌గా వ్యవహరించే బ్యాంకు ఇస్తున్న నివేదికను విశ్వసించి రుణాలి వ్వడానికి ఉబలాటపడుతున్నాయి. ముందూ మునుపూ ఆ సంస్థ వైఫల్యం చెందితే రుణం వసూలు కాక లబోదిబో మంటున్నాయి. రఘురామ్ రాజన్ 2006–08 కాలాన్ని ప్రస్తావించి చెప్పారుగానీ నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ తదితరుల ఉదంతాలు గమనిస్తే అవి అనంతరకాలం కూడా కొనసా గాయని అర్ధమవుతుంది. కేవలం బ్యాంకుల అసమర్ధతే ఇందుకు కారణమని చెప్పటం అర్ధసత్యమే అవుతుంది. బ్యాంకుల్లో కీలక స్థానాల్లో ఉన్నవారి అవినీతి కూడా ఇందుకు దోహదపడుతోంది. సాధా రణ పౌరులు రుణం కోసం వెళ్లినప్పుడు సవాలక్ష ప్రశ్నలు వేసి, ఇచ్చే రుణానికి రకరకాల హామీలు కోరే బ్యాంకులు బడా పారిశ్రామికవేత్తల ముందు మాత్రం మోకరిల్లుతాయి. అప్పు తీసుకున్న సంస్థ తిరిగి చెల్లిస్తున్నట్టు రికార్డుల్లో కనిపించటం కోసం వాటికి తిరిగి అప్పులిచ్చి జమ రాసుకుంటున్నారు. ఇదంతా ఎప్పటికో బద్దలయ్యాక అందరూ చేతులెత్తేస్తున్నారు. చివరకు పాలనాపరంగా తమ అస మర్ధత ఎక్కడ బయటపడుతుందో నన్న భయంతో ప్రభుత్వాలు బ్యాంకులకు వేలాది కోట్ల రూపా యలు తరలించి గండం నుంచి గట్టెక్కుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల బోర్డుల్లో వృత్తిగత నిపుణులు లేకపోవడాన్ని, వాటి సారథులు రిటైరై నప్పుడు వారి స్థానంలో కొత్తవారిని నియమించకపోవడాన్ని కూడా రాజన్ ప్రస్తావించారు. ఈ రెండు సమస్యలూ కూడా కీలకమైనవి. అధికారంలో ఉండేవారు తమకనుకూలమైనవారితో బోర్డుల్ని నింపేస్తున్నాయి. ఫలితంగా బ్యాంకుల్లో రాజకీయ జోక్యం పెరుగుతోంది. అసంబద్ధ నిర్ణ యాలు బ్యాంకుల్ని ముంచేస్తున్నాయి. ఎగవేతదార్లకు రాజకీయ నేతలతో ఉండే పరిచయాల వల్ల వారికి సులభంగా కొత్త రుణాలు వస్తున్నాయి. బోర్డులు పటిష్టంగా ఉంటే ఈ బాపతువారి ఆట కడుతుంది. 2014లో రఘురామ్ రాజన్ రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్‌గా ఉండగా బ్యాంకింగ్ రంగ నిపు ణుడు పీజే నాయక్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. బోర్డుల గురించి అది విలువైన సూచ నలు చేసింది. షేర్ హోల్డర్లు ఎన్నుకునే ఇండిపెండెంట్ డైరెక్టర్లు బోర్డులో ఉండాలని సూచించింది. వారిని ప్రభుత్వమే నియమించే ప్రస్తుత విధానాన్ని రద్దు చేయాలని కోరింది. బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 50 శాతానికి మించరాదన్న దాని సిఫార్సు జాతీయ బ్యాంకుల పరోక్ష ప్రైవేటీకరణకు దారి తీస్తుందన్న విమర్శలొచ్చినా బోర్డుల్లో వృత్తిరంగ నిపుణులుండాలని, నిర్ణయాలకు వారిని బాధ్యుల్ని చేయాలని నాయక్ కమిటీ చేసిన సిఫార్సు విలువైనది. కానీ నాలుగేళ్లు గడుస్తున్నా ఆ కమిటీ సిఫార్సుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఇక బ్యాంకు సార థులుగా ఉండేవారి రిటైర్మెంట్ ఎప్పుడో ప్రభుత్వానికి అవగాహన ఉంటుంది. కనుక చాలా ముందుగానే వారి వారసుల్ని నిర్ణయించవచ్చు. ఇందులో ఎంతో జాప్యం చోటుచేసుకుంటోంది. ఫలితంగా పాలన కుంటుపడుతోంది. కీలక నిర్ణయాలన్నీ వాయిదా పడుతున్నాయి. ఈ పరిస్థితి మరెంతకాలమో కొనసాగరాదన్న రాజన్ సూచన గమనించదగ్గది. బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఆధ్వర్యంలోని పార్లమెంటరీ కమిటీ నిక్కచ్చిగా మాట్లాడే రాజన్‌ను మొండి బకా యిలపై అభిప్రాయాలు కోరడం మంచిదైంది. ఆయన చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసు కుంటే మన బ్యాంకుల పనితీరు గణనీయంగా మెరుగుపడుతుంది. అంతేతప్ప రాజకీయ పక్షాల పరస్పర విమర్శల వల్ల దేశానికి ఒరిగేది శూన్యం. -
అతి విశ్వాసమే మొండిబాకీలకు కారణం
న్యూఢిల్లీ: బ్యాంకర్లు అతినమ్మకంతో వ్యవహరించడం, ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ మందగించడంతో పాటు ఆర్థిక వృద్ధి ఒక మోస్తరు స్థాయికి పరిమితం కావడమే మొండిబాకీలు(ఎన్పీఏ) పేరుకుపోవడానికి ప్రధాన కారణాలని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. మురళీ మనోహర్ జోషి సారథ్యంలోని పార్లమెంటరీ కమిటీకి పంపిన నోట్లో ఈ మేరకు వివరించారు. బొగ్గు గనుల కేటాయింపులు మొదలైన వాటిపై అనుమానాలు, విచారణనెదుర్కొనాల్సి రావొచ్చన్న భయాలతో.. అప్పట్లో యూపీఏ, ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వాల్లో నిర్ణయాల ప్రక్రియ మందగించిందని రాజన్ పేర్కొన్నారు.ఫలితంగా ప్రాజెక్టులు నిల్చిపోయి వాటి వ్యయాలు పెరిగిపోవడం, రుణాలపై వడ్డీలు చెల్లించలేని పరిస్థితి తలెత్తిందన్నారు. దేశంలో విద్యుత్ కొరత నెలకొన్నప్పటికీ పలు విద్యుత్ ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉండటం.. ప్రభుత్వ నిర్ణయాల ప్రక్రియ ఇప్పటికీ వేగం అందుకోలేదనడానికి నిదర్శనమన్నారు. రాజన్ 2016 సెప్టెంబర్ దాకా మూడేళ్లపాటు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా సేవలందించారు. మొండిబాకీల సమస్యను ముందుగా గుర్తించి, పరిష్కార ప్రయత్నాలు చేశారంటూ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఆయన్ను ప్రశంసించిన నేపథ్యంలో ఎన్పీఏల అంశాన్ని సంక్షిప్తంగా వివరించాలంటూ రాజన్‌ను పార్లమెంటరీ కమిటీ కోరింది. దీని ప్రకారమే ఆయన తాజా నోట్ రూపొందించారు. 2006–08లో బీజం.. చాలామటుకు మొండిబాకీలకు 2006–08 మధ్య కాలంలో బీజం పడిందని ఆయన చెప్పారు. అప్పట్లో విద్యుత్ ప్లాంట్ల వంటి ఇన్ఫ్రా ప్రాజెక్టులు సకాలంలో, నిర్దేశిత బడ్జెట్లో పూర్తయిపోవడం.. ఆర్థిక వృద్ధి పటిష్టంగా ఉండటం తదితర సానుకూల ధోరణులతో బ్యాంకులు అత్యంత ఆశావాదంతో వ్యవహరించి రుణాలిచ్చేశాయని ఆయన పేర్కొన్నారు. ‘బ్యాంకులు ఇలాంటి సందర్భాల్లోనే తప్పులు చేస్తుంటాయి. గత కాలపు వృద్ధిని, పనితీరును భవిష్యత్‌కు కూడా అన్వయించుకుని .. ప్రమోటర్ల వాటా తక్కువ ఉన్న ప్రాజెక్టులకు కూడా భారీగా రుణాలిచ్చేందుకు సిద్ధమవుతుంటాయి. సొంతంగా తాము ప్రాజెక్టులను మదింపు చేయకుండా.. ప్రమోటర్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నివేదిక ఆధారంగా కూడా కొన్నిసార్లు బ్యాంకులు రుణాలిచ్చాయి. మీకు ఎంత కావాలో చెప్పండి రుణమిస్తాం అంటూ బ్యాంకులు తన వెంట పడుతున్నాయంటూ ఒక ప్రమోటర్ స్వయంగా నాతో చెప్పడం దీనికి ఉదాహరణ‘ అని రాజన్ పేర్కొన్నారు. అయితే, చారిత్రకంగా చూస్తే ఆ స్థాయి వృద్ధి దశలో ఉన్న చాలామటుకు దేశాల్లో ఇలాంటి అసంబద్ధ ధోరణులు సర్వసాధారణమేనని ఆయన వివరించారు. ఎన్పీఏ సమస్యకు కొంత అవినీతి కూడా కారణమై ఉండొచ్చని రాజన్ చెప్పారు. అయితే అతివిశ్వాసం, చేతగానితనం, అవినీతి అన్నింటినీ వేర్వేరుగా చూసి.. ప్రత్యేకంగా ఇదే కారణమని చెప్పలేమని పేర్కొన్నారు. ‘ఈ బాకీల్లో కొన్నింటికి సంబంధించి బ్యాంకర్లు అతివిశ్వాసంతో వ్యవహరించారని, స్వతంత్రంగా మదింపు చేయలేదన్నది సుస్పష్టం. ఇందుకోసం ఎస్బీఐ క్యాప్స్, ఐడీబీఐ బ్యాంక్ వంటి వాటిపైనే ఎక్కువగా ఆధారపడ్డారు. ఇలా కీలకమైన విశ్లేషణలను అవుట్సోర్సింగ్ చేయడమనేది వ్యవస్థాగతమైన బలహీనతే. దీనివల్ల వర్గాలు ప్రభావితం చేసే అవకాశాలు పెరుగుతాయి‘ అని ఆయన పేర్కొన్నారు. మళ్లీ ఇలాంటివి తలెత్తకూడదంటే.. ఎన్పీఏల సమస్య మళ్లీ తలెత్తకూడదంటే.. తీసుకోతగిన చర్యలు కొన్నింటిని రాజన్ సూచించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) గవర్నెన్స్‌ను, ప్రాజెక్టుల మదింపు ప్రక్రియను మెరుగుపర్చాలని, ఎప్పటికప్పుడు ఆయా రుణాలను పర్యవేక్షిస్తుండాలని పేర్కొన్నారు. అలాగే పీఎస్‌బీలను ప్రభుత్వానికి దూరంగా ఉంచడం, రికవరీ ప్రక్రియను పటిష్టపర్చడం తదితర చర్యలు తీసుకోవాలని తెలిపారు. పీఎంవోకు ఫ్రాడ్ కేసుల లిస్టు.. ఎన్పీఏలతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థలో మోసాల పరిమాణం భారీగా పెరుగుతోందని రాజన్ పేర్కొన్నారు. ఫ్రాడ్ కేసుల విషయంలో బ్యాంకులు, దర్యాప్తు సంస్థల మధ్య సమన్వయం కోసం తన హయాంలో ప్రత్యేకంగా మానిటరింగ్ సెల్ కూడా ఏర్పాటు చేయడంతో పాటు కనీసం ఒకరిద్దరిపైనైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో హై ప్రొఫైల్ కేసుల జాబితాను ప్రధాని కార్యాలయానికి (పీఎంవో)కి కూడా పంపినట్లు ఆయన వివరించారు. అయితే, ఈ విషయంలో ఏదైనా పురోగతి ఉందా లేదా అన్నది తనకు తెలియదని, దీనిపై సత్వరం దృష్టి పెట్టాల్సిన అవసరం మాత్రం ఉందని రాజన్ చెప్పారు. పీఎస్బీల్లో ఆర్బీఐ నామినీ ఉన్నంత మాత్రాన అవి పూర్తిగా రిజర్వ్ బ్యాంక్ అజమాయిషీలోనే ఉందనుకోవడం అపోహేనని ఆయన పేర్కొన్నారు. కేవలం నిబంధనలకు అనుగుణంగా ఆయా బ్యాంకులు ప్రక్రియలు పాటిస్తున్నాయా లేదా అన్నది మాత్రమే నామినీలు చూస్తారే తప్ప.. వాణిజ్య రుణాల వ్యవహారాల్లో వారికి పెద్దగా అనుభవమేమీ ఉండదని రాజన్ తెలిపారు. -
రాజన్‌పై మరోసారి ఆరోపణల వెల్లువ
న్యూఢిల్లీ : ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అందరికి సుపరిచితమే. ఆయన పనితీరుపై ఓ వైపు నుంచి ఆరోపణలు, విమర్శలు వచ్చినా.. మరోవైపు భేష్ అన్నవారు ఉన్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా రెండో సారి రాజన్‌ను కొనసాగించాలని మద్దతు కూడా తెలిపారు. కానీ రాజన్ ముక్కుసూటితనం, ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు రెండో సారి ఆయనకు ఆర్బీఐ గవర్నర్ పదవి వరించకుండా పోయింది. తాజాగా రఘురామ్ రాజన్ మరోసారి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వృద్ధి రేటు పడిపోవడానికి కారణం రాజన్ అప్పట్లో తీసుకొచ్చిన విధానాలేనని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ఆరోపించారు. బ్యాంకింగ్ రంగంలోని ఎన్పీఏలు పెరగడంతో, వృద్ధి రేటు పడిపోయిందని కుమార్ అన్నారు. 2015 చివరి క్వార్టర్ నుంచి 2016 వరకు వృద్ధి రేటు క్షీణించిందని చెప్పారు. దీనికి గల కారణం రఘురామ్ రాజన్ అనుసరించిన విధానాలేనని, పెద్ద నోట్ల రద్దు కాదని వ్యాఖ్యానించారు. ఎన్పీఏలను గుర్తించడానికి ఆర్బీఐ కొత్త మెకానిజం తీసుకొచ్చిందని, ఆ మెకానిజంతో మొండిబకాయిలు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పారు. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఎన్పీఏలు 4 లక్షల కోట్ల రూపాయలుంటే, 2017 మధ్యకు ఇవి రూ.10.5 లక్షల కోట్లకు పెరిగినట్టు తెలిపారు. ఇక అప్పటి నుంచి పెరుగుతూనే ఉన్నాయన్నారు. కొన్ని కేసుల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల పరిశ్రమ క్రెడిట్ కూడా కిందకి పడిపోయిందన్నారు. కొన్నేళ్లలో నెగిటివ్ వృద్ధి కూడా నమోదైందని తెలిపారు. అయితే వృద్ది రేటు నెమ్మదించడానికి, పెద్ద నోట్ల రద్దుకు ఎలాంటి సంబంధం లేదని కుమార్ తేల్చేశారు. ఇక స్థూల తరహా పరిశ్రమ తీసుకున్నా.. వృద్ధి రేటు ఒక శాతం మేర పడిపోయిందని, కొన్ని నెలలు రెండున్నర శాతం తగ్గిందని, మరికొన్ని త్రైమాసికాలు నెగిటివ్ కూడా నమోదైందని చెప్పారు. పెద్ద నోట్ల రద్దుపై ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన రిపోర్టుపై స్పందిస్తూ... డిమానిటైజేషన్‌ను బ్లాక్‌మనీ, బినామీ లావాదేవీలను నిర్మూలించడానికి తీసుకొచ్చామని పునరుద్ఘాటించారు. -
ఇన్ఫ్రా, విద్యుత్ కంపెనీలకు రుణాలు వద్దు..
ముంబై: మౌలిక సదుపాయాల (ఇన్ఫ్రాస్ట్రక్చర్) ప్రాజెక్టులు, ముఖ్యంగా విద్యుత్ రంగానికి బ్యాంకులు రుణసాయం నిలిపివేయాలని ప్రభుత్వరంగ అగ్రగామి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అభిప్రాయపడింది. గత దశాబ్దకాలంలో ఈ రంగానికి మంజూరు చేసిన రుణాల్లో అధిక భాగం మొండి బకాయిలుగా (ఎన్పీఏలు) మారడం వంటి భయానక అనుభవాన్ని ఇందుకు కారణంగా పేర్కొంది. ఆర్బీఐ మార్గదర్శకాల నేపథ్యంలో విద్యుత్ రంగానికి సంబంధించి రూ.1.7 లక్షల కోట్ల ఎన్పీఏలను దివాలా చర్యల కోసం బ్యాంకులు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు (ఎన్సీఎల్టీ) నివేదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాంకులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ఇన్ఫ్రా ప్రాజెక్టులకు రుణాలను నిలిపివేయాల్సి రావచ్చని ఎస్బీఐ ఎండీ దినేష్‌కుమార్ ఖరా మీడియాతో అన్నారు. దేశ ఆర్థిక వృద్ధికి కీలకమైన ఇన్ఫ్రా రంగానికి నిధుల సాయం అవసరాల నేపథ్యాన్ని గుర్తు చేస్తూ, బ్యాంకులకు ఇప్పుడు ఈ రంగం ‘అంటరానిదా’ అన్న ప్రశ్నకు... కేవలం విద్యుత్ రంగానికే అది వర్తిస్తుందని ఖరా బదులిచ్చారు. తన మాటల్ని సవరించి రోడ్డు ప్రాజెక్టులకు రుణాలిచ్చేందుకు సుముఖంగానే ఉన్నామని చెప్పారు. రిస్క్ నివారణను సరైన చర్యలు తీసుకుంటే అన్ని రంగాలకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు సిద్ధమేనని తేల్చి చెప్పారు. అయితే, విద్యుత్ రంగానికి సంబంధించి ఇంధన సరఫరా ఒప్పందాలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పరంగా సమస్యలు ఉన్నాయని గుర్తు చేశారు. మరో ఎండీ పీకే గుప్తా మాట్లాడుతూ... ఫిబ్రవరి 12 నాటి ఆర్బీఐ ఎన్పీఏల సత్వర గుర్తింపు ఉత్తర్వుల కారణంగా బ్యాంకులకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యుత్ ప్రాజెక్టుల ఎన్పీఏలను ఎన్సీఎల్టీకి నివేదించితే సహజంగానే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దుకు దారితీస్తుందని, అది బ్యాంకులను బలహీనపరుస్తుందని చెప్పారు. బ్యాంకులకు మరింత సమయం ఇస్తే ఎన్సీఎల్టీకి వెళ్లకుండా పరిష్కార ప్రణాళిక కనుగొనేందుకు అవకాశం ఉంటుందన్నారు. -
ఐసీఐసీఐ బ్యాంక్ : తెరపైకి వచ్చిన మరో వివాదం
ముంబై : వీడియోకాన్ రుణ కేసుతో ఇప్పటికే తీవ్ర చిక్కుల్లో పడిన ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐ మరో వివాదంలో కూరుకుపోతోంది. వీడియోకాన్ రుణ కేసు వివాదంతో ఈ బ్యాంక్ సీఈవో చందాకొచ్చర్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. తాజాగా రుణాల రైటాఫ్ ఇష్యూ తెరపైకి వచ్చింది. ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజ్మెంట్ 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.5000 కోట్ల నుంచి రూ.5600 కోట్ల వరకు అనుమానస్పద కార్పొరేట్ రుణాలను రైటాఫ్ చేసినట్టు వెల్లడైంది. టెక్నికల్‌గా ఈ రైటాఫ్‌లు, అకౌంటింగ్ పాలసీని మారడం వల్లనే సాధ్యపడుతుందని మింట్ రిపోర్టు చేసింది. రుణాలను రైటాఫ్ చేసేందుకు అకౌంటింగ్ పాలసీని మారుస్తూ కొత్త అకౌంటింగ్ పాలసీని తీసుకొచ్చేందుకు బ్యాంక్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఆమోదించారని, అయితే ఆ విషయాన్ని బ్యాంక్ వాటాదారులకు, ప్రజలకు తెలుపలేదని మింట్ రిపోర్టు వెల్లడించింది. ఇది అకౌంటింగ్ స్టాండర్డ్(ఏఎస్) నిబంధనలకు తూట్లు పొడిచినట్టే అవుతుందని తెలిసింది. వీడియోకాన్ రుణ వివాద కేసులో సీఈవో చందా కొచర్‌పై జరుగుతున్న విచారణ నేపథ్యంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీఈవోపై విచారణతో పాటు బ్యాంక్ అంతకముందు జరిపిన డీలింగ్స్‌ను దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంక్ అకౌంటింగ్ పాలసీ మార్పు విషయం వెలుగులోకి వచ్చింది. 2016-2017 ఆర్థిక సంవత్సరంలో మొండిబకాయిల రేషియోను తక్కువగా చూపించేందుకు బ్యాంకు కొత్త అకౌంటింగ్ పాలసీని తీసుకొచ్చిందని ఆ న్యూస్‌పేపర్ వివరించింది. 2017 ఆర్థిక సంవత్సరంలో ఐసీఐసీఐ బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ)లు 7.89 శాతంగా ఉన్నాయి. ఒకవేళ కొత్త అకౌంటింగ్ పాలసీ తీసుకురాకపోతే, ఆ ఎన్పీఏలు 8.5 శాతానికి పైన ఉండేవని పేర్కొంది. అయితే ఏ లిస్టెడ్ కంపెనీ అయినా.. బ్యాంక్ అయినా.. తన అకౌంటింగ్ అకౌంటింగ్ స్టాండర్డ్(ఏఎస్) నిబంధనలను ఉల్లంఘించకుండా.. కచ్చితంగా అనుసరించాల్సి ఉంటుందని ఓ సీనియర్ రెగ్యులేటరీ అధికారి చెప్పారు. అకౌంటింగ్ పాలసీలో ఏదైనా మార్పులు చేపట్టాల్సి వస్తే, కచ్చితంగా ప్రజలకు, వాటాదారులకు ఈ నిర్ణయాన్ని తెలుపాల్సి ఉంటుందని తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలన్నా, డిస్‌ఇన్వెస్టింగ్ చేయాలన్నా ప్రజలకు, వాటాదారులకు తెలుపాల్సిన బాధ్యత బ్యాంక్ బోర్డుపై ఉందన్నారు. కానీ ఐసీఐసీఐ బ్యాంక్ 2017 ఏప్రిల్ 7న ఆమోదించిన కొత్త అకౌంటింగ్ పాలసీపై ఎవరికి తెలుపలేదని వెల్లడించారు. అయితే అకౌంటింగ్ పాలసీ మార్చిన విషయాన్ని తెలుపకుండా.. చందా కొచ్చర్ కేవలం రైటాఫ్ విషయాన్ని మాత్రమే 2017 ఏప్రిల్ 7న జరిగిన బోర్డు మీటింగ్ నోట్లో పేర్కొన్నారు. -
రుణాల్లో 15 శాతం మొండివే!
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ మొండి బకాయిలు (ఎన్పీఏ) 2017–18 ఆర్థిక సంవత్సరం నాటికి మొత్తం రుణాల్లో 14.6 శాతానికి చేరాయి. ఆర్బీఐ గణాంకాలను ఉటంకిస్తూ పార్లమెంటులో ఆర్థికశాఖ సహాయమంత్రి శివ్ ప్రతాప్ శుక్లా ఈ అంశంపై ఒక ప్రకటన చేశారు. దీనిప్రకారం 28%మొండిబకాయిలతో ఐడీబీఐ మొదటి స్థానంలో నిలిచింది. ఎన్‌పీఏల్లో 90% 4,387 బడా రుణ బకాయిదారుల అకౌంట్లకు సంబంధించినవేనన్నారు. వీటి విలువ రూ.8.6 లక్షల కోట్లని తెలిపారు. మార్చి 2014లో ఎన్పీఏలు రూ.2.51 లక్షల కోట్లయితే, 2018 మార్చి చివరకు రూ.9.62 లక్షల కోట్లకు చేరాయి. కాగా ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాలపై తగిన సలహాలు ఇవ్వాలని ఆర్బీఐకి కేంద్రం కోరినట్లు కూడా మంత్రి వివరించారు. బ్యాంకులపై ఆర్బీఐకి అధికారాలు... బ్యాంకింగ్‌కు సంబంధించి ఏర్పడే విభిన్న పరిస్థితులను ఎదుర్కొనడానికి తగిన అధికారాలు అన్నీ రిజర్వ్ బ్యాంక్‌కు ఉన్నాయని మంత్రి శుక్లా పార్లమెంటుకు ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ‘‘అధికారులను ప్రశ్నించవచ్చు. ప్రత్యేక ఆడిట్‌ను నిర్వహించవచ్చు. బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వవచ్చు’’ అని తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల హోల్–టైమ్ డైరెక్టర్ల నియామకాలుసైతం ఆర్బీఐతో సంప్రతింపులతోనే జరుగుతున్నాయి’’ అని మంత్రి వివరించారు. ఇటీవల ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పార్లమెంటరీ స్థాయి సంఘం (ఫైనాన్స్) ముందు మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఆర్బీఐకి మరిన్ని అధికారాలు కావాలని పేర్కొన్న సంగతి తెలిసిందే. రూ.4,300 కోట్ల బినామీ ఆస్తుల జప్తు ఆదాయపు పన్ను శాఖ జూన్ 30వ తేదీ నాటికి రూ.4,300 కోట్ల విలువపైన బినామీ ఆస్తులను జప్తు చేసినట్లు ఆర్థికశాఖ సహాయమంత్రి శివ్ ప్రతాప్ శుక్లా రాజ్యసభలో ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. బినామీ ఆస్తులు కూడగట్టే వారిపై చర్యలకు కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఐటీ శాఖ ప్రత్యేకంగా 24 బినామీ గుర్తింపు, నిరోధక విభాగాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్‌అండ్‌టీలపై ఫిర్యాదులు ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం– ఐసీఐసీఐ బ్యాంక్, ఇంజనీరింగ్ సంస్థ– లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ)పై సీరియస్ ఫ్రాడ్ ఇన్విస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ)కు ఫిర్యాదులు అందినట్లు రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో కార్పొరేట్ వ్యవహారాల మంత్రి పీపీ చౌదరి వెల్లడించారు. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీపై కూడా ఎస్‌ఎఫ్‌ఐఓకు ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. అయితే ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్‌అండ్‌టీపై ఫిర్యాదుల వివరాలను ఆయన వెల్లడించలేదు. గడచిన ఐదేళ్లలో 29 లిస్టెడ్ కంపెనీలను కేంద్రం ఎస్‌ఎఫ్‌ఐఓకు రిఫర్ చేసిందన్నారు. వీటిలో నాలుగింటిలో విచారణ పూర్తయ్యిందని, ప్రాసిక్యూషన్స్ ఫైల్ అయ్యాయని వివరించారు. విదేశీ కంపెనీల నుంచిపెరుగుతున్న పన్ను వసూళ్లు 2017–18 అసెస్మెంట్ ఇయర్లో విదేశీ కంపెనీల నుంచి రూ.27,561 కోట్ల పన్ను వసూళ్లు జరిగినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. 2016–17 ఇదే కాలంలో ఈ వసూళ్ల పరిమాణం రూ.24,541 కోట్లని ఈ సందర్భంగా వివరించారు. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
మూడు మొండి పద్దుల విక్రయంలో పీఎన్బీ
న్యూఢిల్లీ: దాదాపు రూ. 136 కోట్ల మొండి బాకీలను రాబట్టుకునే క్రమంలో 3 నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ)ను విక్రయించే దిశగా ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) చర్యలు చేపట్టింది. ఈ ఖాతాల కొనుగోలుకు అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు/ఎన్బీఎఫ్సీలు/ఇతర బ్యాంకులు/ఆర్థిక సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. అమ్మకానికి ఉంచిన ఎన్‌పీఏల్లో గ్వాలియర్ ఝాన్సీ ఎక్స్‌ప్రెస్ వేస్ (రూ. 55 కోట్లు బాకీ), ఎస్వీఎస్ బిల్డ్‌కాన్ ప్రైవేట్ లిమిటెడ్ (రూ. 50 కోట్లు), శివ టెక్స్‌ఫ్యాబ్స్ (రూ.31.06 కోట్లు) ఉన్నాయి. జూలై 20న ఈ ఖాతా ల విక్రయానికి ఈ–బిడ్డింగ్ జరుగుతుందని పీఎన్బీ తెలిపింది. పీఎన్బీ ఇటీవల ఏప్రిల్‌లో కూడా మూడు ఎన్పీఏ ఖాతాల వేలానికి బిడ్లు ఆహ్వానించింది. ఈ ఖాతాల్లో మీరట్‌కి చెందిన శ్రీ సిద్ధబలి ఇస్పాత్ లిమిటెడ్ (రూ.165.30 కోట్లు), చెన్నై సంస్థ శ్రీ గురుప్రభ పవర్ (రూ.31.52 కోట్లు), ముంబైకి చెందిన ధరమ్‌నాథ్ ఇన్వెస్ట్మెంట్ (రూ.17.63 కోట్లు) ఉన్నాయి. గతేడాది డిసెంబర్ ఆఖరు నాటికి బ్యాంకింగ్ వ్యవస్థలో ఎన్పీఏలు రూ. 8.31 లక్షల కోట్లుగా ఉన్న సంగతి తెలిసిందే. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏకంగా రూ. 87,357 కోట్ల మేర నష్టాలు ప్రకటించాయి. నీరవ్ మోదీ కుంభకోణంతో దెబ్బతిన్న పీఎన్బీ అత్యధికంగా రూ. 12,283 కోట్ల నష్టం నమోదు చేసింది. -
ఎన్సీఎల్టీ కేసుల నుంచి రూ. 3,000 కోట్ల రికవరీ
కోల్‌కతా: జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కి సిఫార్సు చేసిన పలు మొండి ఖాతా కేసుల నుంచి దాదాపు రూ. 3,000 కోట్లు రికవర్ కాగలవని ఆశిస్తున్నట్లు ప్రభుత్వ రంగ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఎండీ పవన్ బజాజ్ తెలిపారు. ఇప్పటిదాకా 40 కేసులను ఎన్సీఎల్టీకి సిఫార్సు చేశామని, దాదాపు రూ. 580 కోట్లు రికవర్ అయ్యిందని బ్యాంక్ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. ప్రస్తుతం ఎన్సీఎల్టీ వద్ద ఉన్న కేసులన్నీ.. సెటిల్మెంట్ తుదిదశలో ఉన్నాయని బజాజ్ చెప్పారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి యూబీఐ స్థూల నిరర్ధక ఆస్తుల (జీఎన్‌పీఏ) పరిమాణం 24 శాతంగా ఉందని తెలిపారు. కరెంటు అకౌంటు, సేవింగ్స్ అకౌంటు నిష్పత్తి అధికంగానే ఉన్న నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తగినంత స్థాయిలో లిక్విడిటీ ఉందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో యూబీఐ రూ. 220 కోట్ల నికర నష్టం నమోదు చేసిందని, వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి మళ్లీ లాభాల్లోకి మళ్లగలదని ఆయన వివరించారు. రూ.1,500 కోట్లు సమీకరిస్తాం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.1,500 కోట్ల నిధులు సమీకరించనున్నది. ఒకటి లేదా అంతకు మించిన విడతల్లో ఈక్విటీ షేర్ల జారీ ద్వారా ఈ పెట్టుబడులు సమీకరిస్తామని యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. శుక్రవారం జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారులు ఈ మేరకు తమ ఆమోదాన్ని తెలిపారని బ్యాంక్ పేర్కొంది. ప్రభుత్వం ఇచ్చే నిధులకు ఇది అదనమని వివరించింది. ఈ పెట్టుబడుల వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ 0.3 శాతం నష్టంతో రూ.11.05 వద్ద ముగిసింది. -
ఎల్ఐసీ మెడకు ‘మొండి’బండ!
షేర్లు.. బంగారం.. డిపాజిట్లు... ఇలా ఎందులోనైనా ఎవరైనా లాభాలను ఆశించే పెట్టుబడి పెడతారు! అయితే, లాభాల మాట దేవుడెరుగు... నష్టాలొస్తున్నా పదేపదే వాటిలోనే పెట్టుబడి పెట్టేవారినేమంటారు? మన దేశంలోనైతే ‘ఎల్ఐసీ’ అంటారేమో!! ఈ ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఇప్పుడు సర్కారుకు ఆపద్బాంధవుడిగా మారింది. తీవ్రమైన మొండిబాకీలతో కుదేలైన ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లలో ఎల్ఐసీ పెట్టిన పెట్టుబడులన్నీ నష్టాలనే మిగులుస్తున్నాయి. అయినా, ఎక్కడా వెనక్కి తగ్గకుండా నష్టాల ప్రయాణంలో మరింత కూరుకుపోతుండటం ఒక్క ఎల్ఐసీకే చెల్లుతుందేమో. వేల కోట్ల రూపాయల మొండిబాకీలతో గుదిబండగా మారిన ఐడీబీఐ బ్యాంకులో రూ.13 వేల కోట్ల పెట్టుబడులకు ఎల్ఐసీ సిద్ధం కావడం ఇందుకు నిదర్శనం. ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండిబాకీలను భరించే ‘బ్యాడ్’ బ్యాంక్‌గా ఎల్ఐసీ మారుతోందన్నది కొంత మంది విశ్లేషకుల మాట!! సాక్షి, బిజినెస్ విభాగం : స్టాక్ మార్కెట్లో ఎల్ఐసీ జోరుగానే పెట్టుబడులు పెడుతూ ఉంటుంది. కొన్నింటిపై లాభాలు కూడా దండిగానే వస్తున్నాయి. అయితే, ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్బీ) షేర్లలో వెచ్చించిన ఇన్వెస్ట్మెంట్లు మాత్రం ఎల్ఐసీ జేబుకు చిల్లుపెడుతూనే ఉన్నాయి. గడిచిన రెండున్నరేళ్లలో మొత్తం 21 పీఎస్బీలకు గాను 18 పీఎస్బీల్లో చేసిన పెట్టుబడులపై ఎల్ఐసీ భారీస్థాయిలోనే నష్టాలను మూటగట్టుకోవడం గమనార్హం. ఈ 21 పీఎస్బీల్లో ఎల్ఐసీకి 1 శాతం కంటే ఎక్కువ వాటానే ఉంది. 2015 డిసెంబర్ నాటి షేర్ల ధరలతో పోలిస్తే... కేవలం 3 ప్రభుత్వ బ్యాంకుల్లో పెట్టుబడులు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి. వీటిలో ఇండియన్ బ్యాంక్(షేరు 168 శాతం పెరిగింది), విజయా బ్యాంక్(43 శాతం అప్), ఎస్బీఐ(4 శాతం అప్) ఉన్నాయి. ఆర్బీఐ మేలుకొలిపినా... 2015 డిసెంబర్ నుంచి చూస్తే... ఎల్ఐసీ ఇప్పటివరకూ పీఎస్బీ షేర్లలో చేసిన పెట్టుబడుల విలువ 8 శాతం పైగానే హరించుకుపోయింది. ఈ పీఎస్బీలన్నీ మొండిబకాయిల(ఎన్పీఏ) ఊబిలో కూరుకుపోయి తీవ్రమైన నష్టాలను మూటగట్టుకుంటుండంతో వాటి షేర్ల విలువలు రోజురోజుకూ కుదేలైపోతున్నాయి. అయినాసరే ఎల్ఐసీ మాత్రం కొత్తగా వాటి షేర్లను కొనుగోలు చేస్తూనే ఉంది. విచిత్రం ఏంటంటే... మొండి బకాయిలపై ఆర్బీఐ కొరడా ఝుళిపించడం మొదలెట్టిన తర్వాత(2015 ద్వితీయార్థం నుంచి) కూడా పీఎస్బీ షేర్లలో ఎల్ఐసీ కొత్తగా పెట్టుబడులు పెట్టడం!! అప్పటినుంచి చూస్తే దేనా బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర షేర్ల విలువలు 60 శాతంపైగా పడిపోయాయి. మొత్తం 9 ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్ల ధరలు 50 శాతంపైగా క్షీణించగా... ఆరు బ్యాంకుల షేర్ల విలువ 30–50 శాతం మేర పతనమైంది. ఎల్ఐసీ పెట్టుబడులపై ఆధారపడొద్దని, బ్యాంకింగ్ వ్యవస్థకు ఇది మంచిదికాదంటూ ఆర్బీఐ చాన్నాళ్ల క్రితమే హెచ్చరించడం గమనార్హం. కాగా, మొండిబకాయిలు తారస్థాయికి ఎగబాకిన 11 బ్యాంకులను ఆర్బీఐ దిద్దుబాటు చర్యల్లో భాగంగా(పీసీఏ) తన పర్యవేక్షణలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీటి ఎన్పీఏలు రూ.10,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్ల స్థాయిలో ఉన్నాయి. అంటే ఇవి కొత్తగా రుణాలివ్వడం ఇతరత్రా అంశాలపై ఆర్బీఐ ఆంక్షలు కొనసాగుతాయి. ఈ 11 బ్యాంకు షేర్లలో ఎల్ఐసీ భారీగానే పెట్టుబడులు పెట్టింది. ఎల్ఐసీకి 10 శాతంపైగా వాటా ఉన్న ఆరు ప్రభుత్వ బ్యాంకుల మొండిబకాయిలు... వ్యవస్థలోని మొత్తం ఎన్‌పీఏల్లో 8 శాతానికి సమానం. అంటే.. ఈ మొండిబకాయిలన్నీ ఒకరకంగా ఎల్ఐసీ మెడకు చుట్టుకున్నట్లే!! ఎస్బీఐలో అత్యధిక పెట్టుబడి... ఈ ఏడాది మార్చి నాటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)షేర్లలో ఎల్ఐసీకి రూ.22,770 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. అయితే, వాటా పరంగా చూస్తే పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) టాప్‌లో ఉంది. ఇందులో ఎల్ఐసీకి అత్యధికంగా 14.2 శాతం వాటా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో కార్పొరేషన్ బ్యాంక్(ఎల్ఐసీ వాటా 13 శాతం), అలహాబాద్ బ్యాంక్(12.4 శాతం వాటా) ఉన్నాయి. ఇక ఐడీబీఐ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల్లో కూడా 10 శాతం పైగానే వాటాలు ఎల్ఐసీకి ఉండటం గమనార్హం. 2015 డిసెంబర్ నాటికి మొత్తం బ్యాంకింగ్ షేర్లలో ఎల్ఐసీ పెట్టుబడుల విలువ రూ.78,000 కోట్లు. ఇందులో పీఎస్‌బీల వాటా రూ.42,480 కోట్లు కాగా, ప్రైవేటు బ్యాంకుల వాటా రూ.35,520 కోట్లు. ఈ ఏడాది మార్చి నాటికి బ్యాంకుల్లో ఎల్ఐసీ పెట్టుబడి విలువ రూ.92,730 కోట్లకు ఎగబాకింది. అయితే, పీఎస్బీల్లో వాటాలను పెంచుకున్నప్పటికీ.. వాటి విలువ రూ.38,830 కోట్లకు పడిపోగా, ప్రైవేటు బ్యాంకుల్లో పెట్టుబడుల విలువ మాత్రం రూ.53,900 కోట్లకు చేరడం గమనార్హం. వాస్తవానికి మొత్తం ఎల్ఐసీ పెట్టుబడుల్లో పీఎస్‌బీల వాటా చాలా తక్కువనే చెప్పాలి. 2017 డిసెంబర్ నాటికి ఎల్ఐసీ తనదగ్గరున్న పాలసీదారుల నిధుల్లో రూ.15.4 లక్షల కోట్లను ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడిగా పెట్టింది. ఇక షేర్లలో రూ.4.8 లక్షల కోట్లు, డిబెంచర్లు–బాండ్లలో రూ.76,100 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. ప్రైవేటు బ్యాంకులతో లాభాలు... ప్రభుత్వ బ్యాంకు షేర్లలో చేతులుకాల్చుకుంటున్న ఎల్ఐసీకి ప్రైవేటు బ్యాంకులు మాత్రం ఆదుకుంటుండటం విశేషం. ఎల్ఐసీకి ఒక శాతం కంటే అధికంగా వాటా ఉన్న 9 ప్రైవేటు బ్యాంకుల్లో పెట్టుబడులన్నీ ప్రస్తుతం లాభాల్లోనే ఉన్నాయి. 2015 డిసెంబర్ నుంచి చూస్తే... ప్రైవేటు బ్యాంకుల్లో ఇన్వెస్ట్మెంట్ విలువ 50 శాతం మేర ఎగబాకింది. ఇందులో హెచ్డీఎఫ్సీ బ్యాంక్(షేరు ధర 95 శాతం వృద్ధి), యస్ బ్యాంక్(134 శాతం అప్) ప్రధానంగా ఉన్నాయి. బ్యాడ్ బ్యాంకా.. ఎందుకు ఎల్ఐసీ ఉందిగా! పీఎస్‌బీల మొండిబకాయిల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఒక అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ(దీన్నే బ్యాడ్ బ్యాంక్‌గా పేర్కొంటున్నారు) ఏర్పాటు చేయాలంటూ తాజాగా ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇవ్వడం తెలిసిందే. అయితే, ఇలాంటి బ్యాంకులన్నింటిలో మెజారిటీ వాటాను ఎల్ఐసీ చేత కొనిపించి.. చేతులుదులుపుకుంటే సరిపోయేదానికి మళ్లీ బ్యాడ్ బ్యాంక్ పేరుతో కొత్తగా ఒక సంస్థను ఏర్పాటు చేయడమెందుకంటూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నవారు కూడా ఉన్నారు. ఎందుకంటే మొండిబాకీలతో చతికిలపడిన ఐడీబీఐ బ్యాంక్‌లో ఇప్పుడు 51% మెజారిటీ వాటాను ఎల్ఐసీకి కట్టబెట్టేందుకు(దాదాపు రూ.13,000 కోట్లు పెట్టుబడి పెట్టించేందుకు) చకచకా పావులు కదుపుతుండటమే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. ఎల్ఐసీ చేసే ఈ పెట్టుబడి కూడా నిరర్థకంగా మారుతుందని... ఉద్యోగ సంఘాలు లబోదిబోమంటున్నా ప్రభుత్వం ముందుకే వెళ్తోంది. ఎల్ఐసీ కోసం తాజాగా బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ ప్రత్యేకంగా పెట్టుబడి పరిమితి నిబంధనలను కూడా సవరించింది(15 శాతం నుంచి 51 శాతానికి). కాగా, 2015–16 నుంచి 2017–18 మధ్య ఐడీబీఐ బ్యాంక్ రూ.13,396 కోట్ల నికర నష్టాలను మూటగట్టుకుంది. రూ.55,000 కోట్ల ఎన్పీఏలతో కుదేలైంది. మరో రూ.60,000 కోట్ల రుణాలు ఎన్పీఏలుగా మారే ప్రమాదం ఉంది. ఇంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్న బ్యాంకు షేరు ఇప్పట్లో కోలుకోవడం కష్టమే. అయినా, కూడా ఎల్ఐసీకి మెజారిటీ వాటా కట్టబెట్టేందుకు ప్రభుత్వం పావులు కదుపుతుండటాన్ని నిపుణులు తప్పుబడుతున్నారు. ఐడీబీఐ డీల్‌కు పార్లమెంట్ ఆమోదం అక్కర్లేదు! ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్ఐసీ ప్రతిపాదిత 51 శాతం మెజారిటీ వాటా కొనుగోలు విషయంలో ఎల్ఐసీ చట్టంలో సవరణ, పార్లమెంట్ ఆమోదం అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇది ఫైనాన్షియల్ ఒప్పందం అయినందున చట్టంలో మార్పులు చేయనక్కర్లేదని, అయితే, దీనికి కేబినెట్ ఆమోదంతో పాటు ఇతర నియంత్రణ సంస్థల అనుమతి తీసుకోవా ల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఎల్ఐసీకి ఐడీబీఐ బ్యాంక్ తాజాగా ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన షేర్లను జారీ చేస్తుంది. ఎల్ఐసీ వెచ్చించే రూ.10,000–13,000 కోట్ల మూలధన నిధులతో ఆ సంస్థ వాటా 51 శాతానికి చేరుతుంది. ఈ నిధులు ప్రభుత్వ ఖజానాకు చేరవు. మరోపక్క, ప్రభుత్వ వాటా ఇప్పుడున్న 80.96% నుంచి 51% దిగువకు తగ్గుతుంది. ఈ డీల్‌తో ఐడీబీఐ బ్యాంక్ ప్రభుత్వ రంగ హోదాను కోల్పోయి ప్రైవేటు బ్యాంకు అవతారమెత్తుతుంది. ఎల్ఐసీకి అనుబంధ సంస్థగా మారుతుంది. కాగా, ఈ డీల్‌తో బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టాలన్న ఎల్ఐసీ చిరకాల కోరిక నెరవేరుతుందన్నది మరికొందరి వాదన. మరోపక్క, ఈ డీల్‌ను ఐడీబీఐ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రైవేటు బ్యాంకుగా మార్చేందుకే ఈ చర్యలని ధ్వజమెత్తాయి. బ్యాంకులో ప్రభుత్వ వాటాను 51% కంటే దిగువకు తగ్గించుకోబోమంటూ మోదీ సర్కారు పార్లమెంటులో ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కుతోందని ఐడీబీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ విఠల్ కోటేశ్వర రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి తమ డిమాండ్లను నివేదించినట్లు ఆయన వెల్లడించారు. -
‘బ్యాడ్ బ్యాంక్’కు బ్యాంకర్ల సై
ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థలో భారీగా పేరుకుపోతున్న మొండిబాకీల సమస్య పరిష్కారం కోసం ప్రత్యేకంగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) లేదా అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్సీ)ని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు బ్యాంకర్ల నుంచి మద్దతు లభించింది. వ్యావహారికంగా ’బ్యాడ్ బ్యాంక్’ కింద పరిగణిస్తున్న ఈ సంస్థ సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు ఏర్పాటైన సునీల్ మెహతా కమిటీ ఇందుకు సంబంధించిన నివేదికను కేంద్ర ఆర్థిక శాఖకు సోమవారం సమర్పించింది. ఇప్పటికే బ్యాంకులు ప్రమోట్ చేస్తున్న అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఆర్సిల్ కింద ఈ తరహా ఏఎంసీని ఏర్పాటు చేయొచ్చని పేర్కొంది. అలాగే, ఇందులో వెలుపలి నిపుణులను నియమించాలని ఇందులో సిఫార్సు చేసింది. అలాగే కొన్ని వర్గాలు సూచిస్తున్నట్లుగా.. దీని ఏర్పాటుకు ప్రజాధనం లేదా విదేశీ మారక నిల్వల నిధులను వినియోగించుకోవడం కాకుండా బ్యాంకులు, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి నిధులను సమకూర్చుకోవాలని సిఫార్సు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏఎంసీ పనితీరు ఇలా.. కమిటీ సిఫార్సుల ప్రకారం చూస్తే ప్రతిపాదిత నేషనల్ ఏఎంసీ పనితీరు ఇలా ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ♦ బ్యాంకుల నుంచి కొనుగోలు చేసే మొండి ఖాతాలను మదింపు చేసిన తర్వాత నేషనల్ ఏఎంసీ నిర్దిష్ట ధరను ఖరారు చేస్తుంది. ♦ సదరు అసెట్‌కి సంబంధించి ముందస్తుగా 15 శాతం మొత్తాన్ని బ్యాంకులకు చెల్లిస్తుంది. ♦ ఆ తర్వాత అసెట్ విక్రయానికి ప్రైవేట్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు, అసెట్ ఫండ్స్ మొదలైన వాటి నుంచి స్విస్ చాలెంజ్ పద్ధతిలో బిడ్లు ఆహ్వానిస్తుంది. ♦ ఒకవేళ ప్రైవేట్ సంస్థ గానీ బిడ్ దక్కించుకున్న పక్షంలో.. నేషనల్ ఏఎంసీ ముందస్తుగా బ్యాం కులకు ఇచ్చిన 15% మొత్తాన్ని కూడా దానికి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా వేలంలో ప్రైవేట్ బిడ్డరు ఎవరూ ముందుకు రాని పక్షంలో బ్యాంకులకు ఇవ్వాల్సిన మిగతా 85% మొత్తాన్ని ఏఎంసీనే చెల్లించేస్తుంది. ♦ ఆ తర్వాత బ్యాంకుల నుంచి తీసుకున్న అసెట్స్‌ను నిపుణుల పర్యవేక్షణలో క్రమానుగతంగా విక్రయించి నిధులు రాబట్టుకుంటుంది. గుదిబండలా మొండిబాకీలు .. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బాకీలు 11.6 శాతానికి ఎగిశాయి. ఇవి వచ్చే మార్చి నాటికి 12.2 శాతానికి ఎగియొచ్చంటూ ఆర్థిక స్థిరత్వ నివేదికలో రిజర్వ్ బ్యాంక్ అంచనా వేస్తోంది. సుమారు రూ. 11 లక్షల కోట్ల పైగా పేరుకుపోయిన మొండిబాకీల్లో.. భూషణ్ స్టీల్, అలోక్ ఇండస్ట్రీస్, ఎస్సార్ స్టీల్ వంటి కేవలం 40 కంపెనీల వాటానే దాదాపు 40 శాతం పైచిలుకు ఉంది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు కఠినతరం చేయడంతో వీటి నుంచి బకాయిలు రాబట్టుకునే ప్రక్రియ కొనసాగుతోంది. మొండి బాకీల సమస్యను వేగవంతంగా పరిష్కరించే దిశగా స్వతంత్ర అసెట్ మేనేజ్మెంట్ సంస్థలను (ఏఎంసీ), స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి పియుష్ గోయల్ వెల్లడించారు. రూ. 500 కోట్ల పైబడిన నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) పరిష్కారానికి ఏఎంసీ లేదా ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌ను నెలకొల్పాలంటూ సునీల్ మెహతా కమిటీ సిఫార్సు చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ కోవకి చెందిన ఖాతాలు దాదాపు 200 పైచిలుకు ఉన్నాయి. ఈ సంస్థలు బ్యాంకులకు సుమారు రూ. 3.1 లక్షల కోట్లు బాకీపడ్డాయి. మెహతా కమిటీ నిర్దిష్టంగా బ్యాడ్ బ్యాంక్‌ను సిఫార్సు చేయలేదని, ఏఎంసీ ఏర్పాటే ప్రతిపాదించిందని మంత్రి తెలిపారు. కమిటీ సిఫార్సుల ప్రకారం రూ. 50 కోట్ల దాకా మొండిబాకీలపై స్టీరింగ్ కమిటీలు, రూ. 50 కోట్ల నుంచి రూ. 500 కోట్ల దాకా బాకీలపై అంతర్‌బ్యాంకుల కమిటీలు నిర్ణయాలు తీసుకుంటాయి. -
బ్యాడ్ బ్యాంకుపై త్వరలోనే నివేదిక: ఎస్బీఐ చైర్మన్
ముంబై: మొండిబకాయిల పరిష్కారానికి బ్యాడ్ బ్యాంకు ఏర్పాటుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్యానల్ త్వరలోనే నివేదిక అందించనుందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. ప్రభుత్వ రంగంలో బ్యాడ్‌బ్యాంకు ఏర్పాటుకు సూచనలను తెలియజేసేందుకు గాను పీఎన్బీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సునీల్ మెహతా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీలో రజనీష్ కుమార్‌తోపాటు బ్యాంకు ఆఫ్ బరోడా ఎండీ పీఎస్ జయకుమార్ సభ్యులుగా ఉన్నారు. ఈ ఏడాది జూన్ 8న ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆదేశించారు. ఎన్పీఏ సత్వర పరిష్కారానికి గాను బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు సాధ్యా సాధ్యాలపై కమిటీ సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. ‘‘ప్రభుత్వం ఇచ్చిన గడువు దాటిపోయింది. అయితే, 99 శాతం పని పూర్తయింది. దీనికి ముగింపు ఇచ్చి త్వరలోనే ఆర్థిక శాఖకు నివేదిక అందజేస్తాం’’ అని రజనీష్ కుమార్ తెలిపారు. -
రాహుల్‌కు జైట్లీ కౌంటర్..
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం రైతులను విస్మరించి బడా పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యం ఇస్తోందన్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపణలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తోసిపుచ్చారు. రైతులను నిర్లక్ష్యం చేస్తూ పారిశ్రామికవేత్తలకు ప్రధాని నరేంద్ర మోదీ రాయితీలు ఇస్తున్నారన్న రాహుల్ వ్యాఖ్యలను జైట్లీ తిప్పికొట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీలు రైతులను పట్టించుకోవడం లేదని రాహుల్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని జైట్లీ అన్నారు. పారిశ్రామికవేత్తల రుణాలను ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేయలేదని, రాహుల్ చేసిన వ్యాఖ్యలు సత్యదూరమని స్పష్టం చేశారు. బ్యాంకులకు బకాయిపడ్డ వారిపై ప్రధాని నరేంద్ర మోదీ తీసుకువచ్చిన దివాలా చట్టం కింద తదుపరి చర్యలు చేపట్టం జరుగుతుందని చెప్పారు. పారిశ్రామికవేత్తలు బకాయిలుపడ్డ రుణాలన్నీ యూపీఏ హయాంలో ఇచ్చినవేనని జైట్లీ గుర్తుచేశారు. భారీగా రుణాలు తీసుకుని విదేశాలకు పారిపోయిన ఇద్దరు డైమండ్ వ్యాపారులకు ప్రధాని రూ 35,000 కోట్ల రుణాలు ఇచ్చారని రాహుల్ చేసిన ఆరోపణలు అవాస్తవాలన్నారు. యూపీఏ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలను ఎన్డీఏ హయాంలో వెలుగులోకి తెచ్చామన్నారు. -
మొండిబాకీలు మరింత పెరుగుతాయ్..
ముంబై: దేశీ బ్యాంకింగ్ వ్యవస్థలో స్థూల మొండిబాకీలు (జీఎన్‌పీఏ) ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 11.5 శాతానికి చేరొచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇవి 11.2 శాతంగా ఉన్నాయి. 2017 మార్చి 31తో ముగిసిన సంవత్సరంలో రూ. 8 లక్షల కోట్లుగా (ఇచ్చిన రుణాల్లో 9.5 శాతం)గా ఉన్న జీఎన్‌పీఏలు గత ఆర్థిక సంవత్సరంలో 10.3 లక్షల కోట్లకు (11.2 శాతం) చేరాయి. ఈసారి 11.5 శాతానికి చేరిన తర్వాత నుంచి జీఎన్‌పీఏలు క్రమంగా తగ్గుముఖం పట్టగలవని క్రిసిల్ పేర్కొంది. మొండిబాకీలు, ప్రొవిజనింగ్ వ్యయాలు భారీగా ఎగియడంతో గత ఆర్థిక సంవత్సరం బ్యాంకింగ్ వ్యవస్థలో ఏకంగా రూ. 40,000 కోట్ల పైచిలుకు నష్టాలు నమోదయ్యాయి. దివాలా చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత.. ఫిబ్రవరిలో రిజర్వ్ బ్యాంక్ వివిధ రుణ పునర్వ్యవస్థీకరణ పథకాలను ఉపసంహరించడం కూడా.. మొండిబాకీల్లో అయిదో వంతుకు కారణమయ్యాయని క్రిసిల్ వివరించింది. మరోవైపు, ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) .. బాసెల్ త్రీ నిబంధనలను పాటించాలంటే అదనపు మూలధనం కోసం కేంద్రంపైనే ఎక్కువగా ఆధారపడాల్సి రావొచ్చని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం నష్టాలు ఊహించిన దానికి మించిన నేపథ్యంలో.. కేంద్రం ప్రకటించిన రూ. 2.1 లక్షల కోట్ల అదనపు మూలధనం నిధులు పీఎస్‌బీల అవసరాలకు సరిపోకపోవచ్చని క్రిసిల్ తెలిపింది. తగ్గనున్న ఎన్పీఏలు.. ఎన్పీఏల పెరుగుదల గరిష్ట స్థాయికి చేరిందని, ఇక మెల్లగా తగ్గుముఖం పట్టవచ్చనేది క్రిసిల్ అంచనా. ఎన్పీఏల నుంచి రికవరీలు మెరుగ్గా ఉండటం, ప్రొవిజనింగ్ తగ్గే అవకాశాలు మొదలైనవి బ్యాంకులకు సానుకూలాంశాలుగా పేర్కొంది. స్పెషల్ మెన్షన్ అకౌంట్2 కింద వర్గీకరించిన 60–90 రోజుల మేర బకాయిల పరిమాణం గత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి సుమారు సగం తగ్గి 0.8%కి చేరింది. అంతక్రితం ఏడాది ఇది 2 శాతంగా నమోదైంది. ఎన్పీఏలుగా మారే అవకాశాలు ఉన్న రుణాలు తగ్గుతున్నాయనడాన్ని తాజా పరిణామం సూచిస్తోందని క్రిసిల్ తెలిపింది. ఇక, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) విచారణ జరుపుతున్న మొండి బాకీ కేసుల నుంచి కూడా బ్యాంకులకు మెరుగ్గానే రికవరీ కాగలదని అంచనా వేస్తున్నట్లు క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ కృష్ణన్ సీతారామన్ తెలిపారు. ఎన్సీఎల్టీ ముందున్న మొత్తం 3.3 లక్షల కోట్ల రుణాలకు సంబంధించిన కేసుల్లో సుమారు పావు వంతు కేసులు ఉక్కు సంస్థలవే ఉన్నాయి. ఉక్కు రంగం పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో వేలంలో ఈ సంస్థలపై మంచి ఆసక్తి వ్యక్తమవుతుండటం సానుకూల అంశమని కృష్ణన్ చెప్పారు. -
మరో ‘మెగా’ బ్యాంకింగ్ విలీనం!!
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో పెరిగిపోతున్న మొండిబాకీల సమస్యకి అడ్డుకట్ట వేసే దిశగా ప్రభుత్వం మరిన్ని చర్యలపై దృష్టి సారిస్తోంది. నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసే అవకాశాలు పరిశీలిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ), ఐడీబీఐ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ విలీనం గానీ సాకారమైన పక్షంలో ఏకంగా రూ. 16.58 లక్షల కోట్ల అసెట్స్‌తో దేశీయంగా రెండో అతి పెద్ద బ్యాంకు ఏర్పాటు కాగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. బలహీన బ్యాంకులు అనవసర వ్యయాలను తగ్గించుకోవడానికి, నష్టాల్లోని శాఖలను మూసివేయడానికి ఈ విలీనం తోడ్పడగలదని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు వివరించాయి. ఆయా బ్యాంకుల ఖాతాల్లో పెరిగిపోతున్న మొండిబాకీలను కట్టడి చేసేందుకు కూడా ఇది దోహదపడగలదని ప్రభుత్వం భావిస్తోంది. మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2017–18)లో ఈ నాలుగు బ్యాంకుల నికర నష్టాలు ఏకంగా రూ. 21,646.38 కోట్ల మేర ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ గ్రూప్‌నకు చెందిన అయిదు అనుబంధ బ్యాంకులను, భారతీయ మహిళా బ్యాంకును గతేడాది ఏప్రిల్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (ఎస్బీఐ) ప్రభుత్వం విలీనం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అదే కోవలో ఈ నాలుగు బ్యాంకులను కూడా కలపాలన్న ప్రతిపాదనలు పరిశ్రమలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఐడీబీఐ బ్యాంక్‌లో వాటాల విక్రయ యోచన ఒకవైపు నాలుగు ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై కసరత్తు చేస్తూనే మరోవైపు ఐడీబీఐ బ్యాంకులో 51% వాటాల విక్రయ అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. సుమారు రూ. 9,000–10,000 కోట్లకు ఈ వాటాలు కొనుగోలు చేసే వ్యూహాత్మక భాగస్వామి కోసం అన్వేషిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లకు వాటాల విక్రయించే రూపంలో కూడా ఈ డీల్ ఉండొచ్చని పేర్కొన్నాయి. ఐడీబీఐ బ్యాంకులో వాటాలను 50 శాతం కన్నా దిగువకి తగ్గించుకోవాలని కేంద్రం యోచిస్తోందంటూ 2016 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించడం, ఇటీవల కొద్ది రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు ఈ వార్తలకు ఊతమిస్తున్నాయి. బోర్డు సమావేశంలో అదనపు మూలధన సమీకరణకు సంబంధించి ప్రత్యేక తీర్మానాన్ని పరిశీలించనున్నట్లు ఐడీబీఐ బ్యాంకు స్టాక్ ఎక్సే ్చంజీలకు తెలియజేసింది. అధీకృత మూలధనాన్ని ప్రస్తుతమున్న రూ. 4,500 కోట్ల నుంచి రూ. 8,000 కోట్లకు పెంచుకోవాల్సి ఉంటుందని స్క్రూటినైజర్ ఒక నివేదిక ఇచ్చినట్లు కూడా ఆ తర్వాత పేర్కొంది. అధీకృత మూలధనం పెరిగితే, ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా ఇన్వెస్టర్లకు 51% లేదా అంతకు మించి వాటాలను విక్రయించడానికి వీలవుతుందనేది పరిశీలకుల అభిప్రాయం. అయితే, ప్రభుత్వ వర్గాలు మాత్రం ఈ వార్తలపై స్పందించడానికి నిరాకరించాయి. ‘ఎన్పీఏ’లకు ప్రణాళిక సిద్ధం చేయండి ♦ బ్యాంకులకు పార్లమెంటరీ కమిటీ ఆదేశం ♦ ‘యూపీఏ’ రుణాలపై ఆరా ♦ మొండిబాకీలపైవివరణనిచ్చిన బ్యాంకర్లు న్యూఢిల్లీ: బ్యాంకింగ్ వ్యవస్థలో భారీగా పేరుకుపోతున్న మొండి బాకీలను రాబట్టేందుకు తగిన మార్గదర్శక ప్రణాళికను రూపొందించాలంటూ ప్రభుత్వ రంగ బ్యాంకులకు పార్లమెంటరీ కమిటీ ఆదేశించింది. అయితే, కొన్ని సంస్థలు ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టినంత మాత్రాన కార్పొరేట్లందరినీ అదే గాటన కట్టరాదని అభిప్రాయపడింది. ఎంపీ వీరప్ప మొయిలీ సారథ్యంలోని పార్లమెంటరీ స్థాయి సంఘం(ఆర్థిక).. సోమవారం బ్యాంకర్లతో నిర్వహించిన భేటీలో ఈ మేరకు సూచనలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. యూపీఏ ప్రభుత్వాల హయాంలో దూకుడుగా రుణాలిచ్చే ధోరణులే.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండిబాకీలు భారీగా పెరిగిపోవడానికి దారి తీశాయా అన్న కోణంలో బ్యాంకర్లను కమిటీ సభ్యులు ప్రశ్నించారు. కార్పొరేట్ల మోసాలు, ఎగవేతలతో పెరిగిపోతున్న మొండిబాకీలను భర్తీ చేయడానికి ప్రజాధనాన్ని ఎందుకు ఉపయోగించాల్సి వస్తోందన్నది అర్ధం కాకుండా ఉందంటూ కమిటీలో సభ్యుడైన టీఎంసీ ఎంపీ దినేష్ త్రివేది వ్యాఖ్యానించినట్లు పేర్కొన్నాయి. ఎస్బీఐ చైర్పర్సన్, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) డిప్యుటీ చైర్మన్ రజనీష్ కుమార్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఎండీ సునీల్ మెహతా, ఐబీఏ సీనియర్ అడ్వైజర్ అలోక్ గౌతమ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బ్యాంకింగ్ రంగంలో మోసాలు, ఎన్పీఏలకు సంబంధించిన వివిధ అంశాల గురించి కమిటీకి వారు వివరించారు. ఐసీఐసీఐ బ్యాంక్ చందా కొచర్ ప్రస్తావన.. ఐసీఐసీఐ సీఈవో చందా కొచర్‌పై వస్తున్న ఆరోపణలపైనా పార్లమెంటరీ కమిటీలోని కొందరు సభ్యులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో కూడా ’ఆశ్రిత పక్షపాతం’ లావాదేవీలు జరుగుతున్నాయన్న కోణంలోనూ ఒక సభ్యుడు ప్రశ్నించారు. వీడియోకాన్‌కు రుణాలివ్వడం ద్వారా తన భర్త దీపక్ కొచర్ సంస్థకు లబ్ధి చేకూర్చేలా చందా కొచర్ వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. -
అడ్డూఅదుపూ లేని ఎన్పీఏలు!
న్యూఢిల్లీ: బ్యాంకుల రుణాల్లో మొండి బకాయిల వాటా అడ్డు, అదుపు లేకుండా పెరిగిపోతోంది. ఒక్క ఏడాదిలోనే 26 బ్యాంకుల స్థూల ఎన్పీఏలు ఏకంగా 50 శాతం పెరగడం పరిస్థితికి అద్దం పడుతోంది. 26 బ్యాంకుల ఉమ్మడి స్థూల మొండి బకాయిలు 2017–18లో ఏకంగా రూ.7.31 లక్షల కోట్లకు చేరాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం గణాంకాలతో పోల్చి చూస్తే 50 శాతం పెరిగినట్లు లెక్క. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదు. ఒక్క పీఎస్‌యూ బ్యాంకుల నుంచి డిసెంబర్ త్రైమాసిక కాలంలోనే రూ.లక్ష కోట్ల ఎన్పీఏలు జత కాగా, మార్చి త్రైమాసికంలో మరో రూ.1.1 లక్షల కోట్ల మేర పెరిగాయని కేర్ రేటింగ్స్ నివేదిక తెలియజేసింది. మొత్తం ఎన్‌పీఏల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా సుమారు రూ.6.6 లక్షల కోట్లు కావడం గమనార్హం. అంతకుముందు ఏడాదితో పోల్చి చూస్తే 26 బ్యాంకుల ఎన్పీఏలు నికరంగా రూ.2.5 లక్షల కోట్ల మేర పెరిగినట్టు తెలుస్తోంది. గత ఏడాది జూన్ క్వార్టర్లో స్థూల ఎన్పీఏల శాతం 9.04గా ఉంటే, అది సెప్టెంబర్ క్వార్టర్లో 8.93 శాతానికి తగ్గింది. పోనీలే పరిస్థితి కాస్త మెరుగుపడుతోందని అనుకుంటే... మార్చి త్రైమాసికం నాటికి ఇది ఏకంగా 10.14 శాతానికి పెరిగిపోయింది. అంటే... బ్యాంకులిస్తున్న ప్రతి 100 రూపాయల అప్పులో రూ.10కిపైనే మొండి బాకీగా మారపోతోందన్న మాట. ప్రభుత్వరంగ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు మొత్తం రుణాల్లో 13.41 శాతానికి చేరాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల ఎన్పీఏల రేషియో 2017 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 11–12 శాతం మధ్యనే ఉండగా... ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో 1.63 శాతం పెరిగి 13.41 శాతానికి చేరింది. ప్రైవేటు బ్యాంకుల్లోనూ... మార్చి త్రైమాసికంలో ప్రైవేటు రంగ బ్యాంకుల్లోనూ ఎన్పీఏలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. డిసెంబర్ క్వార్టర్లో ఇవి మోస్తరుగానే ఉన్నాయి. మార్చి చివరికి ప్రైవేటు రంగ బ్యాంకులు రూ.18,000 కోట్ల ఎన్పీఏల పెరుగుదలను చూపించాయి. అదే డిసెంబర్ త్రైమాసికంలో పెరిగిన ఎన్పీఏలు కేవలం రూ.1,200 కోట్లే. ఇక 2017–18లో ఎన్పీఏలకు చేసిన కేటాయింపులు అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.43,611 కోట్ల నుంచి రూ.1,05,150 కోట్లకు పెరిగాయని కేర్ రేటింగ్స్ నివేదిక తెలియజేస్తోంది. పది ప్రభుత్వరంగ బ్యాంకుల్లో స్థూల ఎన్పీఏల రేషియో 10 శాతం పైన ఉంటే, ఐదు ప్రైవేటు రంగ బ్యాంకుల ఎన్పీఏల రేషియో మొత్తం రుణాల్లో 2–5 శాతంగా ఉంది. మరో ఐదు ప్రైవేటు రంగ బ్యాంకుల ఎన్పీఏలు 2 శాతంలోపు ఉన్నాయి. ఇతర బ్యాంకుల ఫలితాలు రావాల్సిఉంది. ఎన్పీఏల పరిస్థితి ఇదీ... ♦ రూ.7.31 లక్షల కోట్లు (26 బ్యాంకుల స్థూల ఎన్పీఏలు) ♦ రూ.2.5 లక్షల కోట్లు (గడిచిన ఏడాదిలో 26 బ్యాంకుల్లో పెరిగిన ఎన్పీఏలు) ♦ రూ.18,000 కోట్లు (మార్చి క్వార్టర్లో ప్రైవేటు బ్యాంకుల్లో పెరిగిన నికర ఎన్పీఏలు) ♦ రూ.1,05,150 కోట్లు (2017–18లో ఎన్పీఏలకు చేసిన కేటాయింపులు) -
మరో ఫేక్ న్యూస్ సంచలనం
సాక్షి, న్యూఢిల్లీ : నకిలీ వార్తల ప్రచారం పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు నకిలీ వార్తలు రాసిన జర్నలిస్టుల పీఐబీ గుర్తింపు కార్డులను తక్షణం రద్దు చేయాలంటూ కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రి స్మృతి ఇరానీ సర్కులర్ జారీ చేయడం, దాన్ని సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రద్దు చేయడం తదితర పరిణామాలు తెల్సినవే. పీఐబీ గుర్తింపు కార్డులు కలిగిన జర్నలిస్టులు నకిలీ వార్తలు రాయరని, సోషల్ మీడియా ఊపందుకున్న నేపథ్యంలో ఆకాశ రామన్నలు, అజ్ఞాతవ్యక్తులే అలాంటి వార్తలు రాస్తారని కాబోలు స్మృతి ఇరానీ సర్కులర్ విషయంలో నరేంద్ర మోదీ తక్షణం స్పందించారు. ఇప్పుడు మరో నకిలీ వార్త సంచలనం సృష్టించింది. యూపీఏ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ బ్యాంకుల నుంచి కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున రుణాలు తీసుకొని ఎగ్గొట్టడంతో పేరుకు పోయిన 9 లక్షల కోట్ల బ్యాంకుల నిరర్థక ఆస్తుల్లో నాలుగు లక్షల నిరర్థక ఆస్తులు లేదా రుణాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) 2016’ వసూలు చేసిందన్నది ఆ నకిలీ వార్త. ఈ వార్తను ముందుగా పాలకపక్ష భారతీయ జనతా పార్టీ ఏప్రిల్ 14వ తేదీన పోస్ట్ చేయగా, ప్రధాన మంత్రి వెబ్సైట్ కూడా ఈ వార్తను మీడియా విభాగంలో ప్రముఖంగా పేర్కొంది. ఆ తర్వాత ప్రధాన మంత్రి ‘నమో’ యాప్ విస్తతంగా షేర్ చేసింది. బీజేపీతోపాటు ఎన్డీయే ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికీ ఈ వార్తను షేర్ చేస్తున్నారు. ఈ వార్త నకిలీదని తెలుసుకోగానే బీజేపీ పార్టీ, ప్రధాని వెబ్సైట్ దాన్ని తొలగించాయి. గత కొన్నేళ్లుగా ప్రభుత్వ బ్యాంకుల్లో పేరుకుపోయిన 9 లక్షల కోట్ల నిరర్థక ఆస్తుల్లో నాలుగు లక్షల కోట్ల రూపాయలు వసూలు చేయడమంటే మాటలు కాదు. అది ఏ ప్రభుత్వం చేసినా దాన్ని ఆ ప్రభుత్వం ఘనతగానే పరిగణించవచ్చు. సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు. ఈ నకిలీ వార్త ముందుగా ఎక్కడ పుట్టిందో తెలుసుకునేందుకు ‘ఆల్టర్ న్యూస్’ వెబ్సైట్ నెట్లో తూర్పార పట్టగా, ఎకనామిక్ టైమ్స్ పత్రికలో ఏప్రిల్ నాలుగవ తేదీతో ‘4 లాక్ క్రోర్ రూపీస్ ఎన్పీఏఎస్ రిటర్న్ డ్యూ టూ ఇన్సాల్వెన్సీ సిస్టమ్: అఫీషియల్’ అనే శీర్షికతో ఓ వార్త ఉంది. ప్రభుత్వ బ్యాంకుల్లో పేరుకుపోయిన 9 లక్షల కోట్ల నిరర్థక లేదా చెడ్డ రుణాల్లో సగానికి కొంచెం తక్కువగా, 4 లక్షల కోట్ల రూపాయలు ‘ఐబీసీ–2016’ కింద వసూలయ్యాయన్నది ఆ వార్త. ఆ వార్త కూడా ఓ అధికారి చెప్పినట్లు ఉంది. ఆ వార్తను ఎకనామిక్ టైమ్స్ పత్రిక ‘ఐఏఎన్ఎస్’ అనే వార్తా సంస్థ నుంచి తీసుకొంది. ‘ఇండస్ట్రీ ఛాంబర్ కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ’ పరిశ్రమలు దివాలా సమస్యను ఎలా అధిగమించాలనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి ఇంజేటీ శ్రీనివాస్ మాట్లాడుతూ నాలుగు లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు చెప్పారట. ఆ తర్వాత ఈ వార్తకు మరింత మసాలా అద్ది నకిలీ వార్తలను ప్రచారం చేయడంలో ప్రసిద్ధి చెందిన వెబ్సైట్ ‘పోస్ట్‌కార్డ్ న్యూస్’ ప్రచురింది. ‘మాసివ్ క్రాక్‌డౌన్ బై మోదీ గవర్నమెంట్ ఆన్ ఎన్పీఎస్’ శీర్షికన ప్రచురించింది. ‘కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన 9 లక్షల కోట్ల మొండి రుణాల్లో నాలుగు లక్షల కోట్ల రూపాయలను అంటే, 44.44 శాతం రుణాలను ఇటీవల ప్రవేశపెట్టిన ఐబీసీ విధానం ద్వారా మోదీ వసూలు చేశారు’ అని అందులో ఉంది. పోస్ట్‌కార్డ్ న్యూస్‌ను ఎక్కువగా నమ్ముకునే బీజేపీ, దాని అనుబంధ సంఘాలు ఈ వార్తను పిక్ చేశాయి. షేర్ చేశాయి. నకిలీ వార్తల కేసులో పోస్ట్‌కార్డ్ న్యూస్ ఎడిటర్ మహేశ్ విక్రమ్ హెగ్డేను మార్చి 30వ తేదీన బెంగుళూరులో పోలీసులు అరెస్ట్ చేయడం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం 9.5 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్న బ్యాంకుల నిరర్థక ఆస్తులు ఎక్కువగా పెరిగినది 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాకే. ఏదైమైనా నాలుగు లక్షల కోట్ల రూపాయల చెడ్డ రుణాలు వసూలయ్యాయంటే సాధారణ చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆర్బీఐ ప్రకటించిన డేటాను సేకరించేందుకు ప్రయత్నించగా, రాజ్యసభలో మార్చి నెలలోనే ఆర్థిక సహాయ మంత్రి శివ ప్రసాద్ శుక్లా ఆర్బీఐ డేటాను వెల్లడించిన విషయం వెలుగుచూసింది. రిటెన్ ఆఫ్ చేసిన 2. 73 లక్షల కోట్ల రూపాయల చెడ్డ రుణాల్లో 29, 343 కోట్ల రూపాయలు వసూలయ్యాయని మంత్రి తెలిపారు. బ్యాంక్ రుణాల రైటాఫ్‌కు, రుణాల వేవర్‌కు తేడా ఉంది. ఈ రెండింటి మధ్య తేడా లేకుండా సోషల్ మీడియాలో వార్తలు వస్తుంటాయి. రైటాఫ్ చేసిన రుణాలను వసూలు చేసేందుకు వివిధ రకాల పద్ధతుల్లో ప్రయత్నిస్తూనే ఉంటారు. రైటాఫ్ చేసిన రుణాలను వసూలు చేసేందుకే మోదీ ప్రభుత్వం ‘ఐబీసీ–2016’ విధానాన్ని తీసుకొచ్చింది. అయినప్పటికీ నిరర్థక ఆస్తుల్లో వసూలు ఎప్పటిలాగే 10.77 శాతం మాత్రమే ఉందని శుక్లా వివరించారు. తుది వివరణ కోసం ‘ఆల్టర్ న్యూస్’ రిపోర్టర్, కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి శ్రీనివాస్‌ను ప్రశ్నించగా, తన వార్తను మీడియా తప్పుగా అర్థం చేసుకొందని చెప్పారు. ‘బ్యాంకుల మొత్తం నిరర్థక ఆస్తుల్లో 50 శాతం ఆస్తులను ఐబీసీ పరిధిలోకి తెచ్చాం. 3.30 లక్షల కోట్ట రూపాయలను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు అప్పగించాం, ట్రిబ్యునల్‌కు నివేదించడానికి ముందే 83,000 కోట్ల రూపాయలు సెటిల్ అయ్యాయి. వాటిని కలుపుకుంటే నాలుగు లక్షలు దాటుతుంది’ అని మాత్రమే తాను చెప్పానన్నారు. వసూలైన 83వేల కోట్ల రూపాయలను వసూలుకాని రుణాలకు ఎందుకు కలుపుకోవాలో ఆయనకే తెలియాలి. ఈ అసలు వార్త అలా, అలా నకిలీ వార్తగా మారిపోయింది. ఎకనామిక్ టైమ్స్లాగానే శ్రీనివాస్ వార్తను ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఫస్ట్‌పోస్ట్ పత్రికలు ప్రచురించినప్పటికీ వసూలైన మొత్తం కచ్చితంగా అంత ఉండదని సందేహం వ్యక్తం చేశాయి. -
ఈసారి చిన్న సంస్థల వంతు..!
ముంబై: మొండిబాకీల సమస్య కేవలం పెద్ద కార్పొరేట్లకే పరిమితం కాదని... ఈసారి చిన్న సంస్థల వంతూ రానుందని ప్రముఖ బ్యాంకరు, కొటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కొటక్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎస్ఎంఈ) ఇచ్చిన రుణాల నాణ్యతపై మరింతగా దృష్టి సారించాల్సి ఉందన్నారు. ‘మొండిబాకీలన్నీ పెద్దపెద్ద కార్పొరేట్లవేనన్న అభిప్రాయం ఉంది. అయితే, ఎస్ఎంఈ వ్యాపారాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. అదింకా పూర్తి స్థాయిలో బయటపడటం లేదు అంతే..‘ అని ఉదయ్ పేర్కొన్నారు. ఐటీ దిగ్గజం నందన్ నీలేకని సమక్షంలో మంగళవారమిక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన కొటక్ మహీంద్రా బ్యాంకు ‘విజన్’ను ఆవిష్కరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) వర్గీకరణ విషయంలో ఫిబ్రవరి 12న ఆర్బీఐ ఇచ్చిన సర్క్యులర్‌తో మొండిబాకీల సమస్య మరింతగా ముదిరే అవకాశం ఉందన్నారు. ‘‘ఎన్పీఏల విషయంలో యూరోపియన్ దేశాలైన గ్రీస్, ఇటలీ తర్వాత మూడో స్థానానికి భారత్ చేరింది. దీన్ని చక్కదిద్దే చర్యలు అవసరం’’ అని ఉదయ్ కొటక్ వ్యాఖ్యానించారు. టెక్నాలజీతో కొటక్ ఛార్టర్... తక్కువ నగదున్న వ్యవస్థలో వినియోగదారులకు టెక్నాలజీ ఆధారంగా మరింత మెరుగైన సేవలందించటమే లక్ష్యంగా కొటక్‌మహీంద్రా బ్యాంకు తాలూకు ఏబీసీడీ ఛార్టర్ను నీలేకనితో కలసి ఉదయ్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఇవి...ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ముడిపడ్డ యాప్, బయో మెట్రిక్ బ్రాంచ్‌లు, కస్టమర్‌కు తగ్గ సేవలు, డేటాతో నిండిన డిజైన్. ఈ సందర్భంగా నీలేకని మాట్లాడుతూ ‘‘గడిచిన దశాబ్దంలో టెక్నాలజీతో అంతరాలు తగ్గాయి. ప్రపంచమంతా ఒక్క మొబైల్లో ఒదిగిపోవటంతో మనం ముందెన్నడూ ఊహించని సేవలు, ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నాయి’’ అన్నారు. అందరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో ఏడాది కిందట 811 సేవింగ్స్ ఖాతాను ప్రారంభించామని, ఇపుడు పూర్తి స్థాయి ఉత్పత్తులు, సేవలను దేశం నలుమూలలకూ అందించాలన్న లక్ష్యాన్ని విధించుకున్నామని ఉదయ్ కొటక్ తెలియజేశారు. ‘‘ఆధార్ ఓటీపీ గుర్తింపును ఆర్బీఐ ఆమోదించిన మూడునెలలకు మేం 811 సేవల్ని ఆరంభించాం. అప్పటికి 80 లక్షల మంది ఖాతాదారులున్నారు. డిసెంబర్ 31నాటికి ఈ సంఖ్య 1.2 కోట్లకు చేరింది. దేశంలోని డిపాజిట్లలో 2 శాతం... మొబైల్ లావాదేవీల్లో 8 శాతం మా సొంతం. వచ్చే ఐదేళ్లలో ప్రయివేటు బ్యాంకుల వాటా 30 నుంచి 50 శాతానికి చేరుకుంటుందనే నమ్మకం నాకుంది’’ అన్నారాయన. మొండి బాకీలకూ టెక్నాలజీ పరిష్కారం 2008 ఆర్థిక సంక్షోభం తరవాత సరైన మదింపు లేకుండా ఇన్ఫ్రా తదితర రంగాలకు భారీ రుణాలిచ్చారని, వాటి చెల్లింపులను ఎనిమిదేళ్లుగా పొడిగించుకుంటూ రావడం మొండిబాకీల సంక్షోభానికి ప్రధాన కారణమని ఉదయ్ వ్యాఖ్యానించారు. సంక్షోభానంతరం ఇచ్చిన రుణాల అసలు మొత్తంలో కనీసం 40 శాతం వెనక్కి వచ్చినా సంతోషించవచ్చన్నారు. ప్రస్తుతం రిటైల్ రుణాల మంజూరులో టెక్నాలజీని వినియోగిస్తుండటం.. భవిష్యత్‌లో మొండిబాకీల సమస్యలను తగ్గించేందుకు తోడ్పడగలదని చెప్పారు. బ్యాంకుల జాతీయీకరణతో ఒరిగిందేమిటి .. బ్యాంకుల జాతీయీకరణ జరిగి 50 ఏళ్లు గడిచినా... అనేక కుంభకోణాలు బయటపడుతూనే ఉన్నాయని ఉదయ్ తెలిపారు. ఈ నేపథ్యంలో బ్యాంకుల జాతీయీకరణతో ఒనగూరిన ప్రయోజనాలేమిటని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వజ్రాభరణాల వ్యాపారస్తులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు .. పంజాబ్ నేషనల్ బ్యాంకును (పీఎన్బీ) భారీగా మోసగించిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. ఇలాంటివి అసాధారణ పరిస్థితులన్నారు. ఈ స్కాంతో బ్యాంకింగ్ వ్యవస్థపై పోయిన నమ్మకాన్ని పునరుద్ధరించడానికి బ్యాంకర్లతో పాటు నియంత్రణ సంస్థ, ప్రభుత్వం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది డిసెంబరు ఆఖరు నాటికి యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) చెల్లింపుల వ్యవస్థ ద్వారా లావాదేవీలు వంద కోట్ల స్థాయికి చేరగలవని నీలేకని చెప్పారు. గతేడాది డిసెంబర్ ఆఖరు నాటికి ఈ లావాదేవీలు 14.5 కోట్లకు చేరాయి. -
కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకుల్లో రుణాల ఎగవేత కేసులు, ఆర్థిక మోసాలు పెరుగుతున్న క్రమంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రూ 50 కోట్ల పైబడిన రాని బాకీలపై దృష్టి సారించాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆర్థిక శాఖ కోరింది. రుణాలు తీసుకున్న వారు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడినట్టు గమనిస్తే దర్యాప్తు ఏజెన్సీల సహకారం తీసుకోవాలని ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌కుమార్ బ్యాంకర్లకు సూచించారు. బ్యాంకు మోసాలు, ఉద్దేశపూరిత ఎగవేతలను ఎప్పటికప్పుడు గుర్తించి..ఆయా కేసులను సీబీఐకి నివేదించాలని కోరారు. నిరర్థక ఆస్తులుగా మారిన ఖాతాలకు సంబంధించి సెంట్రల్ ఎకనమిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి బ్యాంకులు రుణగ్రహాత స్టేటస్ రిపోర్టును పొందాలని సూచించారు. మరోవైపు నిర్వహణ సవాళ్లు, సాంకేతిక రిస్క్‌లను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యేలా ప్రభుత్వ రంగ బ్యాంకులు 15 రోజుల్లోగా బ్లూప్రింట్‌ను రూపొందించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ పీఎస్‌యూ బ్యాంకులను కోరింది. -
ఏ బ్యాంకునూ మూసే యోచన లేదు
న్యూఢిల్లీ/ముంబై: మొండిబాకీలు భారీగా పేరుకుపోయిన కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్బీ) మూసివేసే అవకాశముందంటూ వస్తున్న వార్తలను కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ కొట్టిపారేశాయి. ఇవన్నీ వదంతులేనని, వీటిని నమ్మొద్దని స్పష్టం చేశాయి. ఏ ఒక్క ప్రభుత్వ రంగ బ్యాంకునూ మూసివేసే యోచనేదీ లేదని పేర్కొన్నాయి. ప్రభుత్వ రంగ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ ఇండియాపై రిజర్వ్ బ్యాంక్ సత్వర పరిష్కార చర్యలు (పీసీఏ) చేపట్టిన దరిమిలా.. ప్రభుత్వం కొన్ని బ్యాంకులను మూసివేయబోతోందంటూ ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం, ఆర్బీఐ వివరణ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులను మరింత పటిష్టం చేసేందుకే చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం తెలిపింది. ‘ఏ బ్యాంకునూ మూసివేసే ప్రసక్తే లేదు. పైగా రూ. 2.11 లక్షల కోట్ల అదనపు మూలధనాన్ని సమకూర్చడం ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్రం మరింత పటిష్టం చేస్తోంది. కాబట్టి వదంతులను నమ్మొద్దు. పీఎస్‌బీల రీక్యాపిటలైజేషన్, సంస్కరణల ప్రణాళిక కొనసాగుతోంది‘ అని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్.. మైక్రోబ్లాగింగ్ సైటు ట్వీటర్లో ట్వీట్ చేశారు. బ్యాంకులను పటిష్టం చేసేందుకే పీసీఏ.. పీసీఏ చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కొన్నింటిని మూసివేయనున్నారంటూ సోషల్ మీడియా సహా కొన్ని ప్రసారమాధ్యమాల్లో ’తప్పుడు సమాచార’ ప్రచారం జరుగుతోందని ఆర్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. బ్యాంకులను పటిష్టం చేసేందుకు తాము వివిధ పర్యవేక్షణ సాధనాలు ఉపయోగిస్తుంటామని, పీసీఏ కూడా అందులో ఒకటని ఆర్బీఐ పేర్కొంది. ఆయా బ్యాంకుల పనితీరును తెలియజేసే అంశాలను పరిశీలించి, తర్వాత దశల్లో తలెత్తబోయే సమస్యల గురించి ముందస్తుగా హెచ్చరించేందుకు పీసీఏని ఉపయోగించడం జరుగుతుందని తెలిపింది. మూలధనం, అసెట్ క్వాలిటీ మొదలైనవి నిర్దేశిత ప్రమాణాలను అతిక్రమించిన పక్షంలోనే దీన్ని ప్రయోగిస్తామని వివరించింది. తగు దిద్దుబాటు చర్యలు తీసుకోవడం ద్వారా ఆయా బ్యాంకులు కాలక్రమేణా ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చుకునేందుకు తోడ్పాటు అందించడమే ఈ సాధనాల లక్ష్యమని పేర్కొంది. డిఫాల్టర్ల పేర్లు బయటకు రావాలి బ్యాంకింగ్ చట్టాల్లో తగు సవరణలు చేయాలి.. పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు న్యూఢిల్లీ: బ్యాంకింగ్ వ్యవస్థలో మొండిబాకీలు (ఎన్పీఏ) ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో ఎగవేతదారుల పేర్లు బయటకు వచ్చేలా బ్యాంకింగ్ చట్టాల్లో తగు సవరణలు చేయాల్సిన అవసరం ఉందని పార్లమెంటరీ కమిటీ సూచించింది. నిరర్థక ఆస్తుల పరిమాణాన్ని తగ్గించుకునేలా బ్యాంకులు తమ ఖాతాలను ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉందని, దీనితో వాటి విశ్వసనీయత పెరిగి నిధుల సమీకరణ సామర్థ్యాలు మెరుగుపడతాయని పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కమిటీ ఆన్ పిటిషన్స్ (సీవోపీ) పేర్కొంది. ‘బ్యాంకులకు బాకీపడిన వారు లేదా రుణాలు తిరిగి చెల్లించకుండా మొండిబాకీలకు కారణమైన వారి పేర్లు బయటకు వచ్చే విధంగా ఎస్బీఐ యాక్ట్ సహా ఇతర చట్టాల్లో పాతబడిన నిబంధనలను సవరించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది‘ అని సిఫార్సు చేసింది. పెరుగుతున్న ఎన్పీఏలకు చెక్ చెప్పేందుకు ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ సరైన చర్యలు తీసుకుంటున్నాయని కితాబిచ్చింది. -
ఎన్సీఎల్టీ ముందుకు మరో 23 భారీ ఎన్పీఏలు
ముంబై: బ్యాంకులకు భారీగా రుణపడిన 23 నిరర్థక ఆస్తుల ఖాతాలు (ఎన్పీఏలు) ఎన్సీఎల్టీ ముందుకు చేరాయి. మొత్తం 28 అతిపెద్ద ఎన్పీఏ ఖాతాల జాబితాను ఆర్బీఐ ఖరారు చేసి వీటి విషయంలో పరిష్కారానికి ఇచ్చిన గడువు ఈ నెల 13తో ముగిసింది. డిసెంబర్ 13వ తేదీ లోగా వీటి పరిష్కారానికి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో వాటిని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు (ఎన్సీఎల్టీ) నివేదించాలని ఆగస్టులోనే బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. గడువు ముగిసిపోవటంతో... వీటిలో 23 ఖాతాలకు సంబంధించి దివాలా చర్యలు ఆరంభించాలని కోరుతూ బ్యాంకులు ఎన్సీఎల్టీలో పిటిషన్ వేయనున్నాయి. దేశ బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న మొత్తం ఎన్‌పీఏల్లో ఈ 28 ఖాతాల తాలూకు మొత్తమే రూ.4 లక్షల కోట్లుగా ఉంది. ఇదీ కంపెనీల జాబితా... ఎన్సీఎల్టీ ముందు దివాలా విచారణ ఎదుర్కోనున్న కంపెనీల్లో... ఏషియన్ కలర్కోటెడ్ ఇస్పాత్, క్యాస్టెక్స్ టెక్నాలజీస్, కోస్టల్ ప్రాజెక్ట్స్, ఈస్ట్‌కోస్ట్ ఎనర్జీ, ఐవీఆర్సీఎల్, ఆర్కిడ్ ఫార్మా, ఎస్ఈఎల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, ఉత్తమ్ గాల్వా మెటాలిక్, ఉత్తమ్ గాల్వా స్టీల్, విసా స్టీల్, ఎస్సార్ ప్రాజెక్ట్స్, జై బాలాజీ ఇండస్ట్రీస్, మోనెత్ పవర్, నాగార్జున ఆయిల్ రిఫైనరీ, రుచి సోయా ఇండస్ట్రీస్, విండ్ వరల్డ్ ఇండియా ఉన్నాయి. ♦ కాగా సోమా ఎంటర్ప్రైజెస్ వ్యవహారం పరిష్కారానికి దగ్గరగా వచ్చినట్టు బ్యాంకులు చెబుతున్నాయి. కాబట్టి ఈ కంపెనీ వ్యవహారాన్ని ఎన్సీఎల్టీకి ప్రస్తుతానికి నివేదించటం లేదని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ♦ ఇక ఆన్‌రాక్ అల్యూమినియం కూడా ఎన్సీఎల్టీ ముందుకు వెళ్లాల్సి ఉన్నా... రుణదాతలు ఏకకాల పరిష్కారానికి (ఓటీఎస్) మొగ్గు చూపుతున్నారని, దీంతో ఈ సంస్థ కూడా ఎన్సీఎల్టీకి సమర్పించే జాబితాలో లేదని సమాచారం. ♦ జైప్రకాష్ అసోసియేట్స్‌కు కూడా ఆర్బీఐ ఇచ్చిన గడువు ముగిసింది. అయితే ఈపీసీ వ్యాపార విభాగాన్ని పునర్వ్యవస్థీకరించటానికి అనుమతివ్వాలని ఆర్బీఐని బ్యాంకులు అడిగాయి. తొలి దశలో 12 భారీ ఎన్పీఏ ఖాతాలకు గాను 11 కేసుల్లో ఆర్బీఐ ఆదేశాల మేరకు బ్యాంకులు ఎన్సీఎల్టీని ఆశ్రయించిన విషయం తెలిసిందే. -
ప్రభుత్వ బ్యాంక్‌ల నిధుల వేట..
బ్యాంక్‌లకు కలసివచ్చే కాలం అంటే మొత్తం మొండి బకాయిలు వసూళ్లైనట్లేనని విశ్లేషకులు అంటూ వుంటారు. ఆ స్థాయి లో కాకపోయినా, ఇప్పుడు బ్యాంక్‌లకు ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు కొంచెం కాలం కలసివస్తోందని చెప్పవచ్చు. మొండి బకాయిలతో కుదేలవుతున్న బ్యాంక్‌లను గట్టెక్కించడానికి ప్రభుత్వం వివిధ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా 2.11 లక్షల కోట్ల మేర మూలధన నిధులు అందించనున్నామని ప్రకటించింది. ఇక తాజాగా అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ భారత రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయడం కూడా సానుకూల ప్రభావం చూపుతోంది. దీంతో బ్యాంక్ షేర్లపై ఇన్వెస్టర్ల మక్కువ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బ్యాంక్‌లు స్టాక్ మార్కెట్ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమవుతున్నాయి. మూడీస్ రేటింగ్ అప్‌గ్రేడ్‌తో ఇన్వెస్టర్ల ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగుపడిన నేపథ్యంలో వివిధ బ్యాంక్‌లు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్స్(క్విప్) ద్వారా నిధుల సమీకరణకు క్యూ కడుతున్నాయి. రూ.13,500 కోట్ల నిధులు.. ప్రభుత్వం రూ.2.11 లక్షల కోట్ల మూలధన నిధుల ప్రణాళికను వెల్లడించిన తర్వాత బ్యాంక్‌లు కూడా క్విప్ విధానంలో నిధులు సమీకరిస్తామని వెల్లడించాయి. గత నాలుగేళ్లలో క్విప్ విధానంలో రూ.8,419 కోట్లు మాత్రమే బ్యాంక్‌లు సమీకరించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు క్విప్ విధానంలో రూ.16,000 కోట్లు సమీకరించాయి. వీటిల్లో ఒక్క ఎస్బీఐ వాటానే రూ.15,000 కోట్లుగా ఉంది. ఇప్పుడు మరిన్ని బ్యాంక్‌లు ఈ బాట పడుతున్నాయి. గత నెల 24 నుంచి బ్యాంక్‌లు వెల్లడించిన ప్రకటనలను పరిగణనలోకి తీసుకుంటే మొత్తం రూ.13,500 కోట్ల మేర నిధుల సమీకరణకు బ్యాంక్‌లు సిద్ధమవుతున్నాయని అర్థమవుతోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా.. రూ.6,000 కోట్లు తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా.. క్విప్ ద్వారా గానీ, రైట్స్ ఇష్యూ ద్వారా గానీ రూ.6,000 కోట్లు సమీకరించనున్నామని పేర్కొంది. ఇక యూనియన్ బ్యాంక్ రూ.2,000 కోట్ల నిధుల సమీకరణ కోసం ఇప్పటికే హాంకాంగ్, సింగపూర్, లండన్, న్యూయార్క్‌ల్లో రోడ్‌షోలు మొదలు పెట్టేసింది. క్విప్ విధానంలో రూ.5,000కోట్ల సమీకరణ కోసం తమ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని ఈ వారం మొదట్లోనే పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్ సునీల్ మెహతా చెప్పారు. మరికొన్ని నెలల్లో ఈ నిధుల సమీకరణ కోసం మార్కెట్‌కు వస్తామని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలోనే రూ.500 కోట్లు సమీకరించనున్నామని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. బ్యాంక్‌ల ధీమా.. మొత్తం రూ.2.11 లక్షల కోట్ల రీక్యాపిటలైజేషన్ ప్రణాళికలో భాగంగా రూ.1.35 లక్షల కోట్లను రీక్యాపిటలైజేషన్ బాండ్ల ద్వారా బ్యాంక్‌లకు అందిస్తారు. బడ్జెట్ కేటాయింపులు, మార్కెట్ల నుంచి సమీకరించడం ద్వారా మిగిలిన రూ.76,000 కోట్లు వస్తాయి. అయితే మార్కెట్ ద్వారా ముఖ్యంగా క్విప్ ద్వారా నిధులు సమీకరించే విషయంలో బ్యాంక్‌లు ధీమాగా ఉన్నాయి. రూ.2,000 కోట్లు ఎల్ఐసీ వంటి సంస్థలపై ఆధారపడకుండానే పూర్తిగా ఇతర ఇన్వెస్టర్ల నుంచే సమీకరించగలమని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేస్తోంది. విదేశీ ఇన్వెస్టర్లలో ముఖ్యంగా సింగపూర్ ఇన్వెస్టర్లలో తమ క్విప్పై మంచి ఆసక్తి ఉందని బ్యాంక్ ఉన్నతాధికారొకరు పేర్కొన్నారు. కాగా బ్యాంక్‌లకు మూలధన నిధులందించాలని ప్రభుత్వం నిర్ణయించడం, మూడీస్ సంస్థ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయడం అతి పెద్ద సానుకూలాంశమని ఎడిల్‌వేజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకులు రాజీవ్ వర్మ వ్యాఖ్యానించారు. టాప్ 4 బ్యాంక్‌లపై విదేశీ ఇన్వెస్టర్ల ఆసక్తి గతంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒక్క స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ)కి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేవారని కోటక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుభ్రజిత్ రాయ్ పేర్కొన్నారు. ప్రభుత్వ రీక్యాపిటలైజేషన్ ప్రణాళిక కారణంగా పెద్ద బ్యాంక్‌లకు భారీగా ప్రయోజనాలు దక్కే అవకాశాలు ఉండటంతో ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న ఇతర బ్యాంక్‌ల (బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లు.. రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి) పట్ల కూడా ఆసక్తి వ్యక్తం చేస్తున్నారని వివరించారు. క్విప్ అంటే.. క్విప్ (క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్)..నిధులు సమీకరించడానికి ఇదొక మార్గం. దీనిద్వారా ఏదైనా లిస్టెడ్ కంపెనీ ఈక్విటీ షేర్లు/ పూర్తిగా లేదా పాక్షికంగా ఈక్విటీగా మార్చుకునే డిబెంచర్లు/వారంట్లు మినహా ఈక్విటీ షేర్లుగా మార్చుకునే ఏ ఇతర సెక్యూరిటీలనైనా జారీ చేయడం ద్వారా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్(క్విబ్)ల ద్వారా నిధులు సమీకరిస్తుంది. సెబీ వద్ద నమోదైన విదేశీ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్లు, ఎల్ఐసీ వంటి బీమా కంపెనీలు, కనీసం రూ.25 కోట్ల మూలధనం ఉన్న పెన్షన్ ఫండ్స్.. తదితర సంస్థలు/వ్యక్తులను క్విబ్లుగా వ్యవహరిస్తారు. బ్యాంక్‌ల క్విప్ బాట బ్యాంక్ మొత్తం (రూ.కోట్లలో) బ్యాంక్ ఆఫ్ బరోడా 6,000 యూనియన్ బ్యాంక్ 2,000 పంజాబ్ నేషనల్ బ్యాంక్ 5,000 బ్యాంక్ ఆఫ్ ఇండియా 500 -
కెనరా బ్యాంక్‌కు కేటాయింపుల భారం
ముంబై: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 27 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.357 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.260 కోట్లకు తగ్గినట్లు కెనరా బ్యాంక్ తెలిపింది. ఆదాయం తగ్గడం, కేటాయింపులు అధికంగా ఉండటం వల్ల నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.12,187 కోట్ల నుంచి రూ.11,995 కోట్లకు తగ్గింది. స్థూల మొండి బకాయిలు 9.81 శాతం నుంచి 10.51 శాతానికి, నికర మొండి బకాయిలు 6.69 శాతం నుంచి 7.02 శాతానికి పెరిగాయి. అయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన చూస్తే స్థూల మొండి బకాయిలు ఆదే స్థాయిలో ఉండగా, నికర మొండి బకాయిలు తగ్గాయి. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.1,558 కోట్ల నుంచి రూ.1,950 కోట్లకు పెరిగాయని తెలిపింది. నికర వడ్డీ ఆదాయం 14 శాతం వృద్ధితో రూ.2,783 కోట్లకు పెరిగింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కెనరా బ్యాంక్ షేర్ 5 శాతం తగ్గి రూ.404 వద్ద ముగిసింది. ఈ షేర్ ఏడాది కనిష్ట స్థాయి రూ.250, గరిష్ట స్థాయి రూ.463గా ఉన్నాయి. -
యాక్సిస్ బ్యాంక్‌కు మొండి బాకీల సెగ..
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగంలోని యాక్సిస్ బ్యాంక్ ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 38 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.319 కోట్లుగా ఉన్న బ్యాంక్ నికర లాభం ఈ క్యూ2లో రూ.432 కోట్లకు ఎగసిందని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలు బాగా పెరగడం, లెక్కలో చూపని మొత్తాలను ఆర్బీఐ కనిపెట్టడం వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ, లో బేస్ ఎఫెక్ట్ వల్ల ఈ బ్యాంక్ నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని నిపుణులంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో ఈ బ్యాంక్ రూ.1,305 కోట్ల నికర లాభం సాధించింది. ఈ క్యూ2లో మొత్తం ఆదాయం రూ.13,699 కోట్ల నుంచి రూ.13,821 కోట్లకు పెరిగిందని బ్యాంక్ తెలిపింది. మరింత అధ్వానంగా రుణ నాణ్యత... అగ్రశ్రేణి మూడు ప్రైవేట్ బ్యాంక్‌ల్లో ఈ బ్యాంక్‌కే అధికంగా మొండి బకాయిలు ఉన్నాయి. స్థూల మొండి బకాయిలు రూ.16,379 కోట్ల నుంచి రూ.27,402 కోట్లకు, అలాగే నికర మొండి బకాయిలు రూ.8,926 కోట్లకు ఎగిశాయని బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జైరామ్ శ్రీధరన్ చెప్పారు. శాతాల పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 4.17% నుంచి 5.90%కి, అలాగే నికర మొండి బకాయిలు 2.02% నుంచి 3.12%కి ఎగిశాయని పేర్కొన్నారు. రానున్న రెండు క్వార్టర్లలో రుణ నాణ్యతపై మరింత ఒత్తిడి తప్పదని, వచ్చే ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం నుంచి పరిస్థితులు మెరుగుపడే అవకాశాలున్నాయని తెలిపారు. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) రూ.4,514 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగి రూ.4,540 కోట్లకు చేరిందని, నికర వడ్డీ మార్జిన్ 3.45%గా నమోదైందని వివరించారు. ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన రెండు మొండి బకాయిల జాబితాల్లో తమ బ్యాంక్‌కు చెందిన రూ.7,041 కోట్ల ఖాతాలున్నాయని వివరించింది. మరోవైపు తొమ్మిది ఖాతాల్లో రూ.4,800 కోట్ల అక్రమ మళ్లింపును ఆర్బీఐ గుర్తించిందని, వీటిని మొండి బకాయిలుగా పరిగణించాలని ఆదేశించిందని వివరించారు. ఈ ఖాతాల కోసం ఈ క్యూ2లో రూ.505 కోట్ల కేటాయింపులు జరిపామని, దీంతో ఈ మొండి పద్దుల కోసం మొత్తం కేటాయింపులు రూ.3,886 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వచ్చాయి. అయినప్పటికీ, బీఎస్ఈలో యాక్సిస్ బ్యాంక్ షేర్ 1.4 శాతం నష్టపోయి రూ.513కు పడిపోయింది. -
యాక్సిస్ బ్యాంక్ లాభం 16శాతం క్షీణత
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ నికరలాభం 2017 జూన్‌తో ముగిసిన క్వార్టర్లో 16 శాతం క్షీణించి రూ. 1,556 కోట్ల నుంచి రూ. 1,306 కోట్లకు తగ్గింది. అయితే బ్యాంకు ఆదాయం రూ. 13,852 కోట్ల నుంచి రూ. 14,052 కోట్లకు పెరిగింది. బ్యాంకు స్థూల ఎన్పీఏలు 2016 జూన్ క్వార్టర్‌తో పోలిస్తే తాజా త్రైమాసికంలో భారీగా 2.54 శాతం నుంచి 5.03 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు 1.06 శాతం నుంచి 2.30 శాతానికి ఎగిశాయి. విలువపరంగా స్థూల ఎన్పీఏలు రూ. 9,553 కోట్ల నుంచి రూ. 22,030 కోట్లకు, నికర ఎన్పీఏలు రూ.4,010 కోట్ల నుంచి రూ. 9,766 కోట్లకు చేరాయి. ముగిసిన త్రైమాసికంలో అదనంగా రూ. 3,519 కోట్ల స్థూల ఎన్పీఏలు ఏర్పడ్డాయని, రూ. 2,462 కోట్ల మేర రైటాఫ్‌లు చేసినట్లు బ్యాంకు విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ. 2,117 కోట్ల నుంచి రూ. 2,342 కోట్లకు పెరిగాయి. టెలికం, ఇన్ఫ్రా, ఇనుము, ఉక్కు, విద్యుత్ రంగాలకు ఇచ్చిన రుణాలపై కేటాయింపుల్ని 1 శాతం మేర పెంచినట్లు బ్యాంకు తెలిపింది. -
ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ అదరగొట్టింది!
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ దిగ్గజం బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యూ 4 లాభాల్లో అదరగొట్టింది. స్టాండలోన్ నికర లాభాలను మార్చి క్వార్టర్ లో 123 శాతం పెంచుకుని రూ.2,812.82 కోట్లగా నమోదుచేసింది. ఈ లాభాలు విశ్లేషకులు అంచనాలను కూడా అధిగమించాయి. బ్యాంకు లాభాలు రూ.2,701 కోట్లగా మాత్రమే ఉంటాయని విశ్లేషకులు అంచనావేశారు. ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్ లో ఎస్బీఐ లాభాలు రూ.1,263.81 కోట్లగా ఉన్నాయి. నికర వడ్డీ ఆదాయాలు కూడా బ్యాంకువి ఏడాది ఏడాదికి 17.3 శాతం పెరిగాయి. మార్చితో ముగిసిన క్వార్టర్ లో ఈ ఆదాయాలు రూ.18,070.7 కోట్లగా నమోదుచేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో బ్యాంకు వడ్డీ ఆదాయాలు రూ.15,401.30 కోట్లగా ఉన్నట్టు రిపోర్టు చేసింది. క్వార్టర్ క్వార్టర్ కు అసెట్ క్వాలిటీని బ్యాంకు మెరుగుపరుచుకుంది. డిసెంబర్ క్వార్టర్ కంటే ఈ క్వార్టర్ లో స్థూల నిరర్థక ఆస్తులు కూడా 6.90 శాతానికి దిగొచ్చాయి. నికర ఎన్పీఏలు కూడా డిసెంబర్ క్వార్టర్ కంటే తక్కువగానే నమోదయ్యాయి. డిసెంబర్ క్వార్టర్ లో 4.24గా ఉన్న ఎన్పీఏలు ఈ క్వార్టర్ లో3.71 శాతంగా రికార్డయ్యాయి. ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్ లో కూడా బ్యాంకు నికర ఎన్పీఏలు 3.71 శాతమే. లాభాల్లో అదరగొట్టడంతో ఎస్ బీఐ షేరు 52 వారాల గరిష్ట స్థాయిని తాకాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు ఇండెక్స్ లో బ్యాంకు షేరు టాప్ గెయినర్ గా లాభాలు పండిస్తోంది. 2.3 శాతం జంప్ చేసిన షేర్ ధర రూ.310 ని తాకింది. -
అలహాబాద్ బ్యాంక్ నికరలాభం రూ. 111 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ అలహాబాద్ బ్యాంక్ మార్చితో ముగిసిన క్వార్టర్లో రూ. 111 కోట్ల నికరలాభం ఆర్జించింది. 2016 మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 581 కోట్ల నికరనష్టాన్ని చవిచూసిన బ్యాంక్... 2017 మార్చి క్వార్టర్లో మొండి బకాయిలకు కేటాయింపులు తగ్గడంతో లాభాన్ని సంపాదించగలిగింది. బ్యాంకు మొత్తం ఆదాయం రూ. 5,051 కోట్ల నుంచి రూ. 5,105 కోట్లకు చేరింది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ. 2,979 కోట్ల నుంచి రూ. 1,489 కోట్లకు తగ్గింది. అయితే బ్యాంకు స్థూల ఎన్పీఏలు 9.75 శాతం నుంచి 13.09 శాతానికి పెరగ్గా, నికర ఎన్పీఏలు 6.76 శాతం నుంచి 9.76 శాతానికి పెరిగాయి. -
రూ.2.5 లక్షల కోట్ల ఎన్పీఏలు ఏఆర్‌సీల చేతికి
న్యూఢిల్లీ: అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీల(ఏఆర్సీ) కు బ్యాంకులు 2003 నుంచి విక్రయించిన మొండిబకాయిల విలువ రూ.2.44 లక్షల కోట్లు. 23 ఏఆర్సీలకు సంబంధించి ఎస్‌ఐపీఐ–ఎడిల్‌వీజ్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహించిన అసోచామ్ సర్వే ఒకటి ఈ విషయాన్ని తెలిపింది. ఎన్పీఏల కొనుగోళ్ల విషయమై భవిష్యత్తులో కూడా ఏఆర్సీలకు మంచి అవకాశాలు ఉంటాయని అసోచామ్ విశ్లేషించింది. ఆర్థిక వ్యవస్థలో దాదాపు 15 శాతం రుణాలు (9.84 శాతం మొండిబకాయిలు, 4.2 శాతం పునర్వ్యవస్థీకరణ రుణాలు) ఆందోళనకర రీతిలో ఉన్న విషయాన్ని నివేదిక ప్రస్తావించింది. ‘భారత బ్యాంకింగ్ వ్యవస్థలో ఒత్తిడిలో ఉన్న రుణ విలువ దాదాపు రూ.11.80 లక్షల కోట్లు. బ్యాంకింగ్‌కు ఉన్న బకాయిలు.. మొండిబకాయిలుగా మారిన కంపెనీల ప్రమోటర్లతో కఠినంగా వ్యవహరించడానికి ఏఆర్సీలకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేయాలి’ అని నివేదిక ఈ సందర్భంగా సూచించింది. కొత్త విభాగాల్లోకి మోడర్న్ పుడ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్రెడ్ ఉత్పత్తుల తయారీ కంపెనీ మోడర్న్ ఫుడ్ ఎంటర్ప్రైజెస్ కొత్త విభాగాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. కేక్స్, మఫిన్స్ వంటి ఉత్పాదనలను ప్రవేశపెట్టనున్నట్టు కంపెనీ సీఈవో అసీమ్ సోనీ తెలిపారు. కొత్త ప్యాకింగ్‌తో ప్రొడక్టులను ప్రవేశపెట్టిన సందర్భంగా మంగళవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యానికి మేలు చేసే బ్రెడ్ రకాలను పరిచయం చేస్తామన్నారు. ‘టర్నోవరులో బ్రెడ్యేతర ఉత్పత్తుల వాటా ప్రస్తుతం 5 శాతం మాత్రమే. నాలుగేళ్లలో దీనిని మూడింట ఒక వంతు శాతానికి చేరుస్తాం. 2016–17లో కంపెనీ ఆదాయం రూ.270 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25 శాతం వృద్ధి ఆశిస్తున్నాం. భారత బ్రెడ్ ఉత్పత్తుల మార్కెట్ 2–4 శాతం వృద్ధితో రూ.6,000 కోట్లుంది. హెల్త్, వెల్నెస్ విభాగం రెండంకెల వృద్ధి నమోదు చేస్తోంది’ అని వివరించారు. -
ఎన్పీఏలపై ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు
ముంబై: మొండిబకాయిల సమస్య పరిష్కారం దిశగా రిజర్వ్ బ్యాంక్ కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. నిర్దిష్ట పరిస్థితులను బట్టి సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) విధానం అమలుకు సంబంధించిన నిబంధనలు వెల్లడించింది. ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి బ్యాంకుల ఆర్థిక గణాంకాలను బట్టి నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తాయని పేర్కొంది. వీటి ప్రకారం ఆడిటెడ్ వార్షిక ఆర్థిక ఫలితాలు, ఆర్బీఐ పర్యవేక్షణలో మదింపు నివేదికను బట్టి ఆయా బ్యాంకులను పీసీఏ విధానం పరిధిలోకి తెస్తారు. అయితే, పరిస్థితులను బట్టి ఏడాదిలో ఎప్పుడైనా కూడా ఆర్బీఐ.. పీసీఏని ప్రయోగించవచ్చు. ఒకవేళ బ్యాంకు రిస్కు పరిస్థితి మూడో స్థాయిని కూడా దాటేసిన పక్షంలో దాన్ని వేరే బ్యాంకులో విలీనం చేయొచ్చు లేదా ఇతర బ్యాంక్ టేకోవర్ చేయొచ్చు. కాగా గుజరాత్‌లోని గిఫ్ట్‌సిటీలోని ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సర్వీసెస్ సెంటర్లలో (ఐఎఫ్ఎస్సీ) కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టాక్ ఎక్సే్చంజ్‌లు ఈక్విటీ డెరివేటివ్ ట్రేడింగ్ నిర్వహించుకోవచ్చని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ పేర్కొంది. అయితే తమ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవలసి ఉంటుందని పేర్కొంది. తమ వద్ద నమోదైన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు, అర్హత కలిగిన సంస్థలకు డెరివేటివ్ ట్రేడింగ్ చేయడానికి అర్హత ఉంటుందని వివరించింది. సెబి నియమించిన రిస్క్ మేనేజ్మెంట్ రివ్యూ కమిటీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని తన తాజా సర్క్యులర్‌లో సెబీ పేర్కొంది. -
సీడీఆర్ ప్రక్రియ సమీక్షపై కేంద్రం దృష్టి!
ఎన్పీఏల పరిష్కారానికి కసరత్తు న్యూఢిల్లీ: మొండి బాకాయిల (ఎన్పీఏ)ల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించిన కేంద్రం– ఈ దిశలో కార్పొరేట్ రుణ పునర్వ్యవస్థీకరణ (సీడీఆర్) ప్రక్రియను సమీక్షించాలని యోచిస్తున్నట్లు సమాచారం. 2001లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సీడీఆర్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. మూడంచలుగా పనిచేసే ఈ వ్యవస్థను మరింత పటిష్టంగా మలచడంపై కేంద్రం దృష్టి సారించినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ప్రత్యేకించి ఒత్తిడిలో ఉన్న కార్పొరేట్ రుణ సమస్యల పరిష్కారం లక్ష్యంగా సీడీఆర్ వ్యవస్థ సమీక్షకు కేంద్రం శ్రీకారం చుడుతున్నట్లు ఆయా వర్గాలు వెల్లడించాయి. బ్యాంకుల్లో మొండి బకాయిలు పేరుకుపోవడం పెద్ద సవాలుగా మారిందని, ’అత్యంత భారీ కార్పొరేట్లే’ ఈ సమస్యకు మూలకారణమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవలే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 2016 డిసెంబర్ 31వతేదీ నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు రూ.6,06,911 కోట్లుకు చేరాయి. ఒత్తిడిలో ఉన్న రుణ పరిమాణం (పునర్వ్యవస్థీకరించిన రుణాలు, స్థూల ఎన్పీఏలు) మొత్తం రూ. 9.64 లక్షల కోట్లుగా ఉంది. సెప్టెంబర్ నాటికి ఈ మొత్తం రూ.8,97,000 కోట్లు. అంటే నాలుగు నెలలు గడిచే సరికే ఈ పరిమాణం దాదాపు 7.5 శాతం పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. -
మొండి బకాయిల సమస్య...బడా కార్పొరేట్లవల్లే!
ఎన్పీఏల పరిష్కారం అతిపెద్ద సవాలు ⇒ రంగాలవారీగా రికవరీకి చర్యలు ⇒ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ: బ్యాంకుల్లో మొండి బకాయిలు పేరుకుపోవడం పెద్ద సవాలుగా మారిందని.. ‘బడా కార్పొరేట్లే’ ఈ సమస్యకు మూలకారణమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో క్రమంగా తగ్గుతున్నప్పటికీ.. బ్యాంకుల్లో పేరుకుపోయిన మొండి బకాయిల సమస్యను పరిష్కరించడం పెద్ద సవాలుగా మారింది’ అని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక శాఖలో భాగమైన సంప్రదింపుల కమిటీ తొలి సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. మొండిబకాయిలు(ఎన్పీఏ) ఎజెండాగా ఈ సమావేశం జరిగింది. ఎన్‌పీఏల్లో ముఖ్యంగా ఉక్కు, విద్యుత్, ఇన్ఫ్రా, టెక్స్టైల్ రంగాల సంస్థలే ఉన్నట్లు వివరించారు. ఉక్కు రంగం క్రమంగా రికవరీ బాట పట్టిందని.. ఇక ఇన్ఫ్రా, విద్యుత్, టెక్స్టైల్ రంగాల సమస్యల పరిష్కారానికి కూడా తగు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని ఆయన చెప్పారు. 2003–08 మధ్య బూమ్ నెలకొన్నప్పుడు కార్పొరేట్లు ఉత్పత్తి సామర్థ్యాన్ని విపరీతంగా పెంచేసుకున్నారని, కానీ ఆ తర్వాత వచ్చిన అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, మందగమనం ధాటికి ఎదురు నిలవలేకపోయాయని జైట్లీ చెప్పారు. పరిష్కారానికి కమిటీలు..: భారీ రుణాల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం వివిధ రంగాలవారీగా తగు చర్యలు తీసుకుంటోందని జైట్లీ చెప్పారు. బ్యాంకులు తన వద్దకు పంపే కేసులను పరిష్కరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేకంగా ఓవర్‌సైట్ కమిటీ కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. దీని పనితీరు, వస్తున్న స్పందనను బట్టి ఇలాంటి కమిటీలు మరిన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇక ఎన్పీఏల సమస్య పరిష్కారం కోసం ‘బ్యాడ్ బ్యాంక్’ ఏర్పాటు ప్రతిపాదనపై స్పందిస్తూ.. ఇటువంటి ప్రత్యామ్నాయాలు అనేకం ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయన్నారు. పబ్లిక్ సెక్టార్ అసెట్ రీహాబిలిటేషన్ ఏజెన్సీ (పారా) ఏర్పాటు ప్రతిపాదనపై ప్రభుత్వం ముందుకెళ్లాలని సమావేశంలో పాల్గొన్న సభ్యులు సూచించారు. రంగాలవారీగా ప్రవేశపెట్టే సంస్కరణలు కూడా పనిచేయని ఎన్పీఏ కేసులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే స్పెషల్ బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎన్పీఏలన్నింటిని దానికి బదలాయించాలని సభ్యులు సూచించారు. పెరుగుతున్న ఎన్పీఏల ప్రతికూల ప్రభావాలతో ఒత్తిడి ఎదుర్కొంటున్న బ్యాంకుల అధికారుల్లో తిరిగి విశ్వాసం పెంపొందించే చర్యలు కూడా అవసరమని వివరించారు. తద్వారా వారు మళ్లీ సహేతుకమైన, వ్యాపారపరంగా ప్రయోజనకరమైన నిర్ణయాలు తీసుకోగలిగేలా తోడ్పాటు అందించాల్సి ఉందని సభ్యులు సూచించినట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మొండిబకాయిల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఈ సందర్భంగా అరుణ్ జైట్లీ వివరించారు. ఇప్పటికే దివాలా బోర్డును ఏర్పాటు చేసినట్లు, దేశీ ఉక్కు రంగాన్ని ఆదుకునేందుకు కనీస దిగుమతి ధర (ఎంఐపీ)ని గతేడాది డిసెంబర్లో ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. -
కేసులు పెరగడానికి ప్రధాన కారణమిదే!
న్యూఢిల్లీ: విశాఖపట్నంలోని రుణాల రికవరీ ట్రిబ్యునల్ వద్ద కేసుల జాబితా పెరగడానికి ప్రధాన కారణం బ్యాంకులు, ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్స్ విపరీతంగా ఫిర్యాదులు దాఖలు చేయడమేనని ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. స్థూల నిరర్థక ఆస్తులు భారీగా పెరగడంతోనే బ్యాంకులు ఈ ఫిర్యాదులను దాఖలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. డీఆర్టీలో పేరుకుపోతున్న పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించడానికి సెక్యురిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్సియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యురిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002లో ప్రభుత్వం సవరణలు చేపట్టిందన్నారు. రుణాల రికవరీకి సంబంధించి 2016 నవంబర్ 5న సెమినార్ నిర్వమించామని, ఆ సెమినార్లో అప్పీలెట్ ట్రిబ్యునల్స్, ప్రిసైడింగ్ ఆఫీసర్లు పాల్గొన్నట్టు ఆయన చెప్పారు. రికవరీ చట్టాల్లో సవరణలు, ఆర్థికంగా దివాలా కోడ్ 2016 వంటివాటిపై చర్చించామని పేర్కొన్నారు. విశాఖపట్నం డీఆర్టీలో ఏడాది ఏడాదికి కేసులు పెరగడంపై వైస్సార్సీపీ నేత విజయసాయి రెడ్డి మంగళవారం జరిగిన రాజ్యసభలో పలు ప్రశ్నలు సంధించారు. ఒకవేళ అదే నిజమైతే కేసులను సత్వరంగా పరిష్కరించడానికి డీఆర్టీ, మంత్రిత్వశాఖ తీసుకునే చర్యలపై ప్రశ్నించారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. -
వడ్డీ రేట్లు తగ్గించినా మార్జిన్లు పదిలం
• బ్యాంకులకు మొండి బాకీల కష్టాలూ తగ్గొచ్చు • ఎంసీఎల్ఆర్ కోతపై జెఫ్రీస్ నివేదిక ముంబై: భారీ స్థాయిలో డిపాజిట్లు వెల్లువెత్తిన నేపథ్యంలో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించినా కూడా వాటి మార్జిన్లపై పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ జెఫ్రీస్ పేర్కొంది. పైగా సమస్యలతో సతమతమవుతున్న కార్పొరేట్లు.. వడ్డీ భారం తగ్గుదల కారణంగా మళ్లీ రుణాలను తిరిగి చెల్లించడం మొదలుపెట్టడం వల్ల బ్యాంకుల మొండి బకాయిల కష్టాలు కూడా కొంత తీరతాయని వివరించింది. ’ఎస్బీఐ సారథ్యంలో బ్యాంకులు 30–90 బేసిస్ పాయింట్ల మేర ఎంసీఎల్ఆర్ను తగ్గించినా బ్యాంకుల మార్జిన్లు పెద్దగా తగ్గకపోవచ్చు. స్వల్పకాలికంగా ఒకటి లేదా రెండు త్రైమాసికాల్లో ఈ కోతల ద్వారా నికర వడ్డీ మార్జిన్లపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కూడా స్వల్పంగానే ఉండొచ్చు’ అని జెఫ్రీస్ ఒక నివేదికలో తెలిపింది. రేట్లు గానీ తగ్గితే కార్పొరేట్ల లాభదాయకత కొంత మెరుగుపడటం వల్ల రుణాల తిరిగి చెల్లింపునకు వాటికి కాస్త వెసులుబాటు లభించి, బ్యాంకుల మొండిబకాయిల భారం కాస్తయినా తగ్గగలదని వివరించింది. మొత్తం బ్యాంకు రుణాల్లో 56 శాతం, మొత్తం నికర మొండిబకాయిల్లో 88 శాతం వాటా పెద్దఎత్తున రుణాలు తీసుకున్న సంస్థలదే ఉంది. ఎంసీఎల్ఆర్ అమల్లోకి వచ్చినప్పట్నుంచీ చాలా మటుకు బ్యాంకులు 60–90 బీపీఎస్‌ల మేర శ్రేణిని పాటిస్తున్నందున.. తాజాగా రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు రూపంలో.. చౌక వడ్డీ రేట్ల ప్రయోజనాలను అవి ఖాతాదారులకు బదలాయించే అవకాశం ఉందని జెఫ్రీస్ పేర్కొంది. రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎస్బీఐ తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణాల రేటును (ఎంసీఎల్ఆర్) గరిష్టంగా 90 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దాదాపు రూ. 1.65 లక్షల కోట్ల మేర కాసా (కరెంటు అకౌంటు, సేవింగ్స్ అకౌంటు) డిపాజిట్ల సమీకరించిన ఎస్బీఐ .. ఇప్పటికే బేస్ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. పీఎన్బీ, యూనియన్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ మొదలైనవి కూడా అదే బాటలో ఎంసీఎల్ఆర్ తగ్గించాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు ప్రతికూలం..: నిధుల అవసరాలకు ఎక్కువగా హోల్‌సేల్/బాండ్ల మార్కెట్‌పై ఆధారపడిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు(ఎన్బీఎఫ్సీ) రేట్ల కోత పరిణామం ప్రతికూలమని నివేదిక పేర్కొంది. డీమోనిటైజేషన్ అనంతరం ట్రిపుల్ ఎ రేటింగ్ ఉన్న ఒక్క సంవత్సర వ్యవధి బాండ్లపై రాబడులు 15 బీపీఎస్‌లు మాత్రమే తగ్గగా.. ఏడాది వ్యవధి బ్యాంక్ రుణాల వడ్డీ రేట్లు 60–90 బీపీఎస్ మేర తగ్గడంతో వ్యాపార పరిమాణం ఎన్‌బీఎఫ్‌సీల కన్నా బ్యాంకులవైపే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉందని వివరించింది. -
మొండి బకాయిల సమస్యను తక్షణం సరిదిద్దండి
న్యూఢిల్లీ: బ్యాంకుల మొండి బకాయిల సమస్య తక్షణం పరిష్కరించాల్సిన అవసరముందని ఆర్థిక అంశాల పార్లమెంటరీ స్థాయి సంఘం పేర్కొంది. అలా చేయకపోతే ఆర్థిక వ్యవస్థపై మొండి బకాయిలు భారంగా మారతాయని కేంద్ర మాజీ మంత్రి వీరప్పమొయిలీ అధ్యక్షతన గల ఈ సంఘం రూపొందించిన నివేదిక హెచ్చరించింది. 31మంది సభ్యులుగా గల ఈ పార్లమెంటరీ స్థాయీ సంఘం పార్లమెంట్‌కు సమర్పించిన నివేదిక ప్రకారం..రుణాలు మొండి బకాయిలుగా మారకుండానే తగిన సమయంలో బ్యాంకులు జోక్యం చేసుకోవాలి. ఒకవైపు మనం ఆర్థికంగా సంపన్నమైన దేశాలతో పోటీ పడుతున్నాం. మరోవైపు బ్యాంకుల మొండి బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయి. ఈ మొండి బకాయిల సమస్య కారణంగా బ్యాంక్‌ల మూలధనం, లిక్విడిటీ హరించుకుపోతున్నాయి. భవిష్యత్తులో మూలధనం సమీకరించే బ్యాంకుల సత్తా కూడా క్షీణిస్తోంది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల మొండి బకాయిలు రూ.80వేల కోట్లుగా ఉన్నాయి. జూన్ నాటికి రూ.5,50,346 కోట్లుగా ఉన్న బ్యాంక్‌ల మొండి బకాయిలు సెప్టెంబర్‌కి రూ.6,30,323 కోట్లకు పెరిగాయి. -
కొన్ని రాష్ట్రాలపైనే బ్యాంకుల దృష్టి : సిబిల్
అందుకే ఎన్పీఏలు ముంబై: బ్యాంకులు కొన్ని రాష్ట్రాలపైనే దృష్టి పెట్టడం వల్ల రుణ ఎగవేతలు, మైక్రో, ఎస్ఎంఈ వాణిజ్య రంగాల్లో చెల్లింపుల్లో వైఫల్యాలు చోటు చేసు కున్నాయని ట్రాన్స యూనియన్ సిబిల్ సంస్థ పేర్కొంది. ‘‘కేవలం కొన్ని రాష్ట్రాలపైనే దృష్టి కేంద్రీకరించడం వల్ల బ్యాంకులు వాటి రుణ వృద్ధికి ఉన్న అవకాశాలను కోల్పోతున్నారుు. కొన్ని బ్యాంకుల వ్యూహాత్మక దృష్టి ఐదు రాష్ట్రాలు లేదా పది రాష్ట్రాలపైనే ఉంటోంది’’ అని ట్రాన్‌సయూనియన్ సిబిల్ ఇండియా ఎండీ సతీష్ పిళ్లై చెప్పారు. ఉదాహరణకు రాజస్థాన్ రాష్ట్రాన్ని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ వాణిజ్య రుణాలకు సంబంధించిన మొండి బకారుులు (ఎన్పీఏ) అతి తక్కువగా ఉన్నాయని, అవి రెండు శాతమని, అదే సమయంలో రుణాల జారీ కూడా తక్కువగా ఉందన్న విషయాన్ని ఆయన తెలిపారు. సూక్ష్మ సంస్థలకు సంబంధించి ఎన్పీఏలు 6-6.5 శాతం స్థారుులో ఆగిపోగా... ఎస్ఎంఈ విభాగంలో మాత్రం ఆస్తుల నాణ్యత ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్టు పిళ్లై పేర్కొన్నారు. ఈ విభాగంలో ఎన్పీఏల రేటు లోగడ 8 శాతంగా ఉంటే అది 11 శాతానికి పెరిగినట్టు చెప్పారు. -
ఎస్బీఐపై మొండిబకాయిల బండ
• క్యూ2లో లాభం రూ.21 కోట్లే... 99.6 శాతం డౌన్ • స్థూల మొండిబకారుులు 7.14 శాతానికి జంప్... • భారీగా ఎగబాకిన ఎన్పీఏ కేటారుుంపులు... ముంబై: దేశీ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)కు మొండి బకారుులు(ఎన్పీఏ) షాకిచ్చారుు. బ్యాంక్ కన్సాలిడేటెడ్(అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) నికర లాభం ఘోరంగా పడిపోరుుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2016-17, క్యూ2)లో బ్యాంక్ కేవలం రూ.20.7 కోట్ల లాభాన్ని మాత్రమే ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.4,992 కోట్లతో పోలిస్తే... ఏకంగా 99.6 శాతం దిగజారడం గమనార్హం. ప్రధానంగా ఎన్పీఏలకు కేటారుుంపులు(ప్రొవిజనింగ్) భారీగా పెరగడం, నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) స్వల్పంగానే వృద్ధి చెందడం లాభాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. ఇక క్యూ2లో కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.72,918 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో ఆదాయం రూ.66,829 కోట్లతో పోలిస్తే.. 9.1 శాతం వృద్ధి నమోదైంది. స్టాండెలోన్‌గా 35 శాతం తగ్గుదల... ఒక్క బ్యాంకింగ్ కార్యకలాపాల(స్టాండెలోన్) ప్రాతిపదికన ఎస్బీఐ నికర లాభం క్యూ2లో రూ.2,538 కోట్లకు తగ్గిపోరుుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 3,879 కోట్లతో పోలిస్తే 35 శాతం క్షీణించింది. ఆదాయం 8.2 శాతం పెరుగుదలతో రూ. 46,855 కోట్ల నుంచి రూ.50,743 కోట్లకు చేరింది. మార్కెట్ విశ్లేషకులు సెప్టెంబర్ క్వార్టర్లో బ్యాంక్ స్టాండెలోన్ లాభం రూ.2,697 కోట్లుగా, ఆదాయం రూ.57,421 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశారు. రూ. లక్ష కోట్లకు దాటిన ఎన్పీఏలు... సమీక్షా కాలంలో బ్యాంక్ స్థూల ఎన్పీఏలు దాదాపు రెట్టింపు అయ్యారుు. మొత్తం రుణాల్లో 7.14 శాతానికి ఎగబాకారుు. గతేడాది క్యూ2లో ఇవి 4.15 శాతంగా ఉన్నారుు. నికర ఎన్పీఏలు కూడా 2.14 శాతం నుంచి 4.19 శాతానికి రెట్టింపయ్యారుు. విలువ పరంగా బ్యాంక్ స్థూల ఎన్పీఏలు రూ. లక్ష కోట్ల మార్కును దాటారుు. క్యూ2లో రూ.1.05,783 కోట్లకు పేరుకుపోయారుు. గతేడాది ఇదే కాలంలో ఈ మొత్తం రూ.56,834 కోట్లు మాత్రమే. ఇక నికర ఎన్పీఏలు సైతం రూ.28,592 కోట్ల నుంచి రూ.60,013 కోట్లకు దూసుకెళ్లారుు. కాగా, ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో బ్యాంక్ స్థూల ఎన్పీఏలు 6.94 శాతం, నికర ఎన్పీఏలు 4.05 శాతంగా ఉన్నారుు. మొండిబకారుులకు కేటారుుంపులు క్యూ2లో రూ.6,387 కోట్ల నుంచి రూ.8,686 కోట్లకు ఎగబాకారుు. కాగా, ఎస్బీఐ గ్రూప్ మొత్తం స్థూల ఎన్పీఏల నిష్పత్తి(జీఎన్‌పీఏ) రెట్టింపునకు పైగా ఎగసి 4.32 % నుంచి 8.49 శాతానికి చేరింది. నికర ఎన్పీఏలు 2.27% నుంచి 5.1 శాతానికి ఎగసింది. తాజా ఎన్పీఏలు రెట్టింపు... ఈ మూడు నెలల కాలంలో కొత్తగా రూ.10,341 కోట్ల విలువైన రుణాలు ఎన్పీఏలుగా మారారుు. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.5,875 కోట్లతో పోలిస్తే రెట్టింపయ్యారుు. మొండిబకారుులుగా మారే అవకాశం ఉన్న రుణాలకు సంబంధించి పరిశీలన జాబితా(వాచ్‌లిస్ట్) పరిమాణం రూ.25,951 కోట్లుగా నమోదైంది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ⇔ సెప్టెంబర్ క్వార్టర్లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 1.3% పెరిగి రూ.14,253 కోట్ల నుంచి రూ.14,437 కోట్లకు చేరింది. ⇔ ఇతర ఆదాయం 35.9% పెరిగి రూ.8,424 కోట్లుగా నమోదైంది. ⇔ బ్యాంక్ మొత్తం రుణాలు సెప్టెంబర్ చివరినాటికి రూ.14,81,831 కోట్లకు చేరారుు. క్రితం ఏడాది ఇదే కాలంలో రుణాలు రూ.13,37,153 కోట్లతో పోలిస్తే రుణ వృద్ధి 8.1%గా నమోదైంది. ⇔ మొత్తం డిపాజిట్ల పరిమాణం రూ.16,34,114 కోట్ల నుంచి రూ.18,58,999 కోట్లకు ఎగబాకారుు. 13.7 శాతం వృద్ధి చెందారుు. ⇔ ఎస్బీఐ షేరు ధర బీఎస్ఈలో శుక్రవారం 3 శాతం దిగజారి రూ.273 వద్ద స్థిరపడింది. ఎన్పీఏలకు కేటారుుంపులు 36 శాతం ఎగబాకడం లాభాలపై ప్రభావం చూపింది. ప్రధానంగా వాచ్లిస్ట్లోని రుణాల నుంచే కొత్త ఎన్పీఏలు జతయ్యారుు. వాచ్ లిస్ట్ పరిమాణం రానున్న కాలంలో మరో 5,000-7,000 కోట్లు తగ్గే అవకాశం ఉంది. ఇక రెండో త్రైమాసికంలో రుణవృద్ధి అనుకున్నదానికంటే చాలా నెమ్మదించింది. కొన్ని రంగాలకు రుణాల జారీ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించడమే దీనికి కారణం. అరుుతే, మూడో క్వార్టర్ నాటికి 11-12 శాతం రుణ వృద్ధి అంచనాలను చేరుకుంటామని భావిస్తున్నాం. ఇక టాటా గ్రూప్‌లో సైరస్ మిస్త్రీని చైర్మన్‌గా తొలగించిన తర్వాత నెలకొన్న విభేదాలపై మాకేమీ ఆందోళన లేదు(గ్రూప్ కంపెనీలకు ఎస్బీఐ భారీగానే రుణాలిచ్చింది). ఎందుకంటే సమర్థవంతమైన ప్రొఫె షనల్స్ ఉన్న టాటా గ్రూప్... ఈ తాత్కాలిక సమస్యలను వేగంగానే పరిష్కరించుకోగలదన్న విశ్వాసం ఉంది’. - అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చీఫ్ -
‘యాక్సిస్’కు మొండి బకాయిల దెబ్బ..
• క్యూ2లో లాభం 83% తగ్గుదల • రూ.319 కోట్లుగా నమోదు ముంబై: మొండి బకాయిలకు అధిక కేటాయింపులతో యాక్సిక్ బ్యాంకు లాభం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 83 శాతం క్షీణించింది. రూ.319 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసిక కాలంలో బ్యాంకు రూ.1,915 కోట్ల లాభాన్ని ఆర్జించడం గమనార్హం. తాజా త్రైమాసికంలో మొండి బకాయిలకు కేటాయింపులు 5 రెట్లు పెరిగి రూ. 3,623 కోట్లకు చేరడం...బ్యాంకు లాభాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఆదాయం మాత్రం గతేడాది ఇదే కాలంలో పోలిస్తే రూ.12,001 కోట్ల నుంచి రూ.13,698 కోట్లకు పెరిగింది. స్థూల ఎన్పీఏలు 4.17 శాతం, నికర ఎన్పీఏలు 2.02 శాతానికి పెరిగిపోవడం ప్రతికూల ప్రభావాన్ని చూపింది. నికర వడ్డీ ఆదాయం 11 శాతం వృద్ధితో రూ.4,514 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం రూ.4,062 కోట్లుగా ఉండడం గమనార్హం. నికర వడ్డీ మార్జిన్ మాత్రం 3.64 శాతానికి తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలోనూ బ్యాంకు లాభం 52 శాతం క్షీణించి రూ.1,875 కోట్లకు పరిమితం అయింది. ఈ మేరకు యాక్సిక్ బ్యాంకు స్టాక్ ఎక్స్ఛేంజ్లకు సమాచారం ఇచ్చింది. సెప్టెంబర్ 30 నాటికి బ్యాంకు ‘వాచ్‌లిస్ట్’లో ఉన్న వసూలు కాని రుణాలు 32 శాతానికి తగ్గాయి. ఇవి రూ.13,789 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు త్రైమాసికంలో వాచ్‌లిస్ట్‌లో వున్న రుణాల్లో రూ. 7,288 కోట్లు ఎన్పీఏలుగా మారిపోవడంతో సెప్టెంబర్ త్రైమాసికంలో వాచ్‌లిస్ట్‌లో వున్న రుణాల మొత్తం తగ్గింది. -
బ్యాంకుల మొండి బకాయిలు9.24 లక్షల కోట్లు
♦ ఈ ఏడాది జనవరి-జూన్ మధ్యకాలంలో 15% పెరుగుదల ♦ వీటికి కేటాయింపులతో బ్యాంకులకు భారం ♦ అదనపు మూలధన నిధులు కూడా అవసరం ♦ బ్యాంకుల బ్యాలెన్స్ షీట్స్ ప్రక్షాళన మరింత జాప్యం ముంబై: దేశీయ బ్యాంకులకు ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ)కు మొండిబకాయి(ఎన్పీఏ)ల సమస్య అంతకంతకూ పెరిగిపోతుండడంతో బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ ప్రక్షాళనకు చాలా సమయం పట్టేట్టు ఉంది. పైగా అంచనా వేసిన దాని కంటే ఖర్చు కూడా ఎక్కువే అవుతుందని రాయిటర్స్ వార్తా సంస్థ పరిశోధన నివేదికలో వెల్లడైంది. కానీ, మోదీ ప్రభుత్వం ఆశిస్తున్నట్టు బలహీనంగా ఉన్న రుణాలు, పెట్టుబడుల పునరుద్ధరణకు బ్యాంకుల ఎన్పీఏలను తగ్గించడం అనేది కీలకం. బ్యాంకుల ఖాతాల ప్రక్షాళనకు ఆర్బీఐ నిర్దేశించిన గడువు 2017 మార్చి. అప్పటికి బ్యాంకులు తమ ఖాతాల పరంగా వసూలు కాని అన్ని రకాల మొండిబకాయిల గణాంకాలను ప్రకటించాల్సి ఉంటుంది. ఇలా ప్రకటిస్తే బ్యాంకులకు ఆ మేరకు అదనపు నిధులు అవసరం అవుతాయి. ఆరు నెలల్లో 15 శాతం పెరుగుదల రాయిటర్స్ వార్తా సంస్థ ఇటీవల ఆర్బీఐ నుంచి సమాచార హక్కు చట్టం కింద ఒత్తిడిలో ఉన్న బ్యాంకుల రుణాల వివరాలను సేకరించింది. దీని ప్రకారం చూస్తే... గతేడాది డిసెంబర్ నాటికి ఎన్పీఏలు 121 బిలియన్ డాలర్లు ఉండగా.. జూన్ నాటికి 138.5 బిలియన్ డాలర్ల(రూ.9.24 లక్షల కోట్లకుపైగా)కు పెరిగిపోయినట్టు అంచనా. సుమారు 15% పెరుగుదల ఇది. వీటిలో 122 బిలియన్ డాలర్లు ప్రభుత్వ రంగ బ్యాంకులు మోస్తున్నవే. ప్రైవేటు బ్యాంకుల వాటా 14 బిలియన్ డాలర్లు ఉండగా, విదేశీ బ్యాంకుల ఖాతాల్లోని ఎన్పీఏలు 2.3 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఒత్తిడిలో ఉన్న ఆస్తులు అంటే 90 రోజులకుపైగా ఎలాంటి చెల్లింపులు లేని నిరర్థక ఆస్తులు, పునరుద్ధరించిన ఆస్తులు. ఖాతాల ప్రక్షాళనకు ఆర్బీఐ ఆదేశించాక ఎన్పీఏలు పెరుగుతున్నాయేకానీ, ఒత్తిడిలో ఉన్న రుణాల సంఖ్య పెరగడం లేదని, లోగడ పునరుద్ధరించిన ఆస్తులు నిరర్థక ఆస్తుల చిట్టాలోకి వచ్చి చేరుతున్నట్టు బ్యాంకులు ఇప్పటికే స్పష్టం చేశాయి. పీఎస్బీలకే శిరో భారం... బ్యాంకుల మొండి బకాయిల్లో 88 శాతం పీఎస్బీలవే కావడం గమనార్హం. మరోవైపు బాసెల్-3 అంతర్జాతీయ బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకులకు 2019 మార్చి నాటికి 27 బిలియన్ డాలర్లు (రూ.1.80 లక్షల కోట్లు) మేర మూలధన నిధులు అదనంగా కావాల్సి ఉంది. ఎన్పీఏల సమస్య నేపథ్యంలో బ్యాలన్స్ షీటు విలువను పెంచుకునేందుకూ బ్యాంకులకు మరిన్ని నిధులు అవసరం అవుతాయి. ప్రభుత్వం నుంచి నిధుల సాయంతోపాటు స్టాక్స్ లేదా బాండ్ల విక్రయం ద్వారా నిధులు సేకరించే సామర్థ్యం పీఎస్బీలకు ఉన్నప్పటికీ... తక్కువ లాభాలు, బలహీన వేల్యూషన్ల కారణంగా అవరోధాలు ఎదురవుతాయన్నది విశ్లేషణ. ముందున్నవి సవాళ్లు... జూన్ నాటికి బ్యాంకులు 29 బిలియన్ డాలర్ల మేర రుణాలను నిరర్థక ఆస్తులుగా ప్రకటించలేదని, ఈ రుణాలు తీసుకున్న వారు 60 రోజులకు పైగా వడ్డీ, అసలు చెల్లించని వారు కావడంతో వీటిని సైతం నిరర్థక ఆస్తులుగా ప్రకటించాల్సిన పరిస్థితి పొంచి ఉందని తెలుస్తోంది. డెట్-ఈక్విటీ స్వాప్ రేషియో పథకాన్ని ఆర్బీఐ ప్రకటించినప్పటికీ దీన్ని ఉపయోగించుకున్నది ఇప్పటి వరకు కొన్ని బ్యాంకులే. అయితే, ప్రభుత్వం నిబంధనలను సులభతరం చేయడంతో భారత్‌లోని ఒత్తిడిలో ఉన్న ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టనున్నట్టు విదేశీ ఇన్వెస్టర్లు ప్రకటించడం కొంతలో కొంత ఊరటగా భావించవచ్చు. మొండిబకాయిల విషయంలో దృఢంగానే వ్యవహరిస్తామని, అదే సమయంలో వాస్తవికంగా ఉంటామని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది 35% పెరుగుతాయి.. ‘నిరర్థక ఆస్తులు కచ్చితంగా పెరుగుతున్నాయనేదే మా అభిప్రాయం. 2019 మార్చి నాటికి దేశీయ బ్యాంకులకు తక్కువలో తక్కువ 90 బిలియన్ డాలర్ల మూలధనం నిధుల అవసరం ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల నిరర్థక ఆస్తులు 35-40% వరకు పెరుగుతాయి’ అని ఫిచ్ రేటింగ్స్ డెరైక్టర్ సశ్వత్ గుహ అన్నారు. ఇక, బ్యాంకుల ప్రక్షాళణపై దృష్టి సారించడం వల్ల రుణాల వృద్ధి 2 దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయిందని, ఇది ఆర్థికాభివృద్ధి, పెట్టుబడులకు విఘాతం అన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 7.1%కే పరిమితం కావడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. వచ్చే దశాబ్దంలో 25 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తామన్న ప్రధాని మోదీ హామీకి, మరిన్ని ఉద్యోగాల కల్పనకు వృద్ధి రేటు కనీసం 8% ఉండాలన్నది వారి అభిప్రాయం. -
భారీ రుణాలకు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు
♦ అధికంగా రుణాలు జారీ చేస్తే ప్రత్యేక కేటాయింపులు ♦ ఒక కార్పొరేట్ గ్రూపునకు మూలధనంలో 25 శాతమే రుణం ముంబై: బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిల సమస్య (ఎన్పీఏ) పెరిగిపోవడంతో రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ రుణాల విషయంలో బ్యాంకులకు కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. ఇవి 2017 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వీటి ప్రకారం ‘స్పెసిఫైడ్ బారోవర్’కు సాధారణ రుణ జారీ పరిమితి (ఎన్‌పీఎల్‌ఎల్)కి మించి రుణాలు జారీ చేయాలంటే అధిక రిస్క్‌ను భరిస్తూ బ్యాంకులు అందుకు తగినట్టు అదనంగా నిధులు కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. ఎన్‌పీఎల్‌ఎల్‌కు మించి జారీ చేసే రుణాలకు అదనంగా 3 బేసిస్ పాయింట్ల మేర నిధులను ప్రత్యేకించాల్సి ఉంటుంది. ఒక సంస్థకు బ్యాంకుల కూటమి కలసి రుణం జారీ చేసినసందర్భంలో ఒక్కో బ్యాంకు విడిగా ఎంత మేర రుణం ఇస్తే ఆ మేర ఈ రేషియోను పంచుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ నిబంధనలు అమలులోకి వచ్చిన ఏడాది తర్వాత పూర్తి స్థాయిలో సమీక్షిస్తామని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఓ కార్పొరేట్ సంస్థకు 25 శాతమే: కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులు ఏ కార్పొరేట్ గ్రూపునకు కూడా తన మూలధనంలో 25%కి మించి రుణం ఇవ్వరాదు. ఎన్పీఏ రిస్క్‌ను దృష్టిలో ఉంచుకున్న ఆర్బీఐ ప్రస్తుతమున్న 55 శాతం పరిమితిని 25%కి తగ్గించింది. ఈ పరిమితి అన్నది ప్రస్తుత మూలధన నిధుల ప్రకారం కాకుండా టైర్ 1 మూల ధనంపై వర్తిస్తుందని ఆర్బీఐ తన ముసాయిదాలో పేర్కొం ది. దీనిపై ప్రజాభిప్రాయాలకు ఆర్బీఐ ఆహ్వానం పలికింది. ఈ నిబంధనలు 2019 మార్చి 31 నుంచి అమలు చేయనున్నట్టు తెలిపింది. ఆర్బీఐ ప్రతిపాదనలు బాసెల్ కమిటీ ఆన్ బ్యాంకింగ్ సూపర్విజన్ (బీసీబీఎస్) సూచనలకు అనుగుణంగానే ఉన్నాయి. బీసీబీఎస్ సైతం బ్యాంకులను వాటి మూల ధనం ఆధారంగా రుణాల జారీని పరిమితం చేయాలని సూచించింది. ఎస్‌హెచ్‌జీలకు 7% వడ్డీకే రుణాలు: వార్షికంగా ఏడు శాతం వడ్డీకే స్వయం సహాయక మహిళా సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) రుణాలు మంజూరు చేయాలని ఆర్బీఐ బ్యాంకులను కోరింది. 250 జిల్లాల్లో అన్ని రకాల మహిళా ఎస్‌హెచ్‌జీలకు బ్యాంకులు రుణాలు అందించాలని నోటిఫికేషన్లో పేర్కొంది. దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన - నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద అన్ని ఎస్‌హెచ్‌జీలు వడ్డీ రాయితీపై ఏడు శాతానికే రుణాలు పొందడానికి అర్హులుగా పేర్కొంది. మసాలా బాండ్లకు అనుమతి: బ్యాంకులు ద్రవ్య సర్దుబాటు కింద మసాలా బాండ్ల జారీకి, కార్పొరేట్ బాండ్ల స్వీకరణకు ఆర్బీఐ అనుమతించింది. ద్రవ్య సరఫరాను మెరుగుపరిచేందుకు, మార్కెట్ అభివృద్ధికి ఈ చర్యలు తోడ్పడతాయని ఆర్బీఐ పేర్కొంది. -
బలంగా భారత వృద్ధి అవకాశాలు
♦ వచ్చే రెండేళ్లపాటు వృద్ధి 7.5% ♦ భారత్ సౌర్వభౌమ రేటింగ్ బీఏఏ3గా కొనసాగింపు న్యూఢిల్లీ: సంస్కరణల కొనసాగింపుతో భారత వృద్ధి అవకాశాలు స్వల్పకాలానికి బలంగానే ఉన్నాయని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తెలిపింది. కానీ, కొండలా పేరుకుపోతున్న మొండి బకాయిలే సమస్యాత్మకమని పేర్కొంది. వచ్చే రెండేళ్లపాటు వృద్ధి రేటు 7.5% స్థాయిలో ఉండవచ్చని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. సార్వభౌమ రేటింగ్‌ను బీఏఏ3 గానే కొనసాగించింది. ఈ రేటు అధిక స్థాయిలో ఉంటే రుణాలు తిరిగి చెల్లించడంలో విఫలమయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని అర్థం. దీంతో ఆ దేశం పెట్టుబడులకు అనుకూలమనే సందేశం వెళుతుంది. రుణాల ఎగవేతను అరికట్టేందుకు దివాళా చట్టాన్ని తీసుకురావడం, జీఎస్టీ అమలు చివరి దశలో ఉండడం సానుకూలాంశాలుగా మూడీస్ తెలిపింది. బ్యాంకులు మొండి బకాయిలను గుర్తిస్తూ ఉండడంతో నిరర్థక ఆస్తుల (ఎన్పీఏలు) ఇక ముందూ పెరుగుతాయని, ఈ పరిస్థితులు ముఖ్యం గా ప్రభుత్వ రంగ బ్యాంకులకు మందగమనంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో వచ్చే నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వం ప్రతిపాదించిన రూ.70వేల కోట్ల మూల దనం కంటే అధికంగానే నిధులు అవసరం అవుతాయని తాము అంచనా వేస్తున్నట్లు మూడీస్ తన నివేదికలో వెల్లడించింది. నివేదికలోని అంశాలు... ⇒ సంస్కరణలను కొనసాగించడం వల్ల వ్యాపార వాతావరణం మెరుగవుతుంది. ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయిలో కొనసాగడం వల్ల భారత్ బలమైన వృద్ధి సాధించడానికి తోడ్పడుతుంది. కానీ, బ్యాంకింగ్ రంగంలో సవాళ్లు పెరగడం భారత పరపతి నాణ్యతపై ప్రభావం చూపుతాయి. వృద్ధికి ఊతమిచ్చే ఆర్థిక, సంస్థాగత సంస్కరణల దిశగా విధాన నిర్ణేతల చర్యలు సత్ఫలితాలు ఇస్తే రేటింగ్ అప్‌గ్రేడ్ చేస్తాం. ⇒ బ్యాంకింగ్ రంగానికి మొండి బకాయిల సమస్య ఏర్పడడానికి వృద్ధి మందగించడం, ప్రాజెక్టుల అమలు నిదానించడం, ఎక్కువ మంది ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగవేయడమే కారణాలు. గత 12 నెలల్లో 39 లిస్టెడ్ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు 96% పెరిగి 2015 జూన్ నుంచి 2016 జూన్ నాటికి రూ.6.3 లక్షల కోట్ల స్థాయికి చేరాయి. ⇒ మొండి బకాయిల గుర్తింపు, దివాళా చట్టంపై దృష్టి పెట్టడం భారత సార్వభౌమ రుణ అర్హతను పెంచుతుంది. -
ఎన్పీఏలపై నేను దృష్టిపెట్టలేదు
కాస్త పట్టించుకుని ఉండాల్సింది: దువ్వూరి సుబ్బారావు న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించేటపుడు బ్యాంకుల మొండిబకాయిల సమస్య పరిష్కారానికి ఆర్బీఐ గవర్నరుగా తాను తగిన దృష్టి పెట్టలేదని మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చెప్పారు. ఈ విషయాన్ని తాను మరికొంత పట్టించుకుని ఉండాల్సిందని శుక్రవారమిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ సమస్య ఇంత తీవ్రరూపం దాల్చడానికి అప్పట్లో తగిన దృష్టి సారించకపోవడం కూడా కారణం కావచ్చని ఆయన చెప్పారు. మొండిబకాయిల సమస్య కట్టడికి ఇంతకుముందే ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుని ఉండాల్సిందని ఆర్బీఐ గవర్నర్ రాజన్ చేసిన ప్రకటన నేపథ్యంలో సుబ్బారావు తాజా వాఖ్యలు చేశారు. ప్రపంచం తిరిగి లేమన్ తరహా సంక్షోభాన్ని చూస్తుందా? అన్న ప్రశ్నకు సుబ్బారావు సమాధానమిస్తూ... అంత తీవ్రస్థాయి కాకున్నా మరొక ఆర్థిక సంక్షోభం ఉంటుందన్నది తన అభిప్రాయమని తెలిపారు. -
ఐసీఐసీఐ లాభం 25% డౌన్
♦ క్యూ1లో రూ. 2,232 కోట్లు... ♦ ఆదాయం రూ.16,760 కోట్లు; 6 శాతం వృద్ధి ♦ 5.87 శాతానికి ఎగబాకిన మొండిబకాయిలు న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకును మొండిబకాయిలు(ఎన్పీఏ) వెంటాడుతూనే ఉన్నాయి. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం(2016-17, క్యూ1)లో బ్యాంక్ స్టాండెలోన్(ఒక్క బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించి) నికర లాభం 25 శాతం దిగజారి రూ. 2,232 కోట్లకు పడిపోయింది. క్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ. 2,976 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా ఎన్పీఏలు భారీగా ఎగబాకడంతో కేటాయింపుల(ప్రొవిజనింగ్) భారం పెరగడం... లాభాలపై ప్రతికూల ప్రభావం చూపింది. ఇక మొత్తం ఆదాయం క్యూ1లో రూ.16,760 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే క్వార్టర్లో లాభం రూ. 15,802 కోట్లతో పోలిస్తే 6 శాతం వృద్ధి చెందింది. కాగా, బీమా అనుబంధ సంస్థలో వాటా విక్రయం ద్వారా రూ.617 కోట్లమేరకు అదనపు రాబడి లాభాలకు కొంత దన్నుగా నిలిచింది. ఎన్పీఏలు పైపైకి... బ్యాంక్ మొత్తం రుణాల్లో స్థూల మొండిబకాయిలు జూన్ క్వార్టర్ నాటికి 5.87 శాతానికి(రూ.27,194 కోట్లు) పెరిగిపోయాయి. క్రితం ఏడాది క్యూ1లో స్థూల ఎన్పీఏలు 3.68 శాతం(రూ.15,138 కోట్లు) కాగా, మార్చి క్వార్టర్‌కు 5.82 శాతం(రూ.26,221 కోట్లు)గా నమోదయ్యాయి. ఇక నికర ఎన్పీఏల విషయానికొస్తే.. గతేడాది జూన్ చివరినాటికి 1.58 శాతం(రూ.6,333 కోట్లు) కాగా, ఈ ఏడాది జూన్ నాటికి 3.35 శాతానికి(రూ.15,041 కోట్లు) ఎగబాకాయి. మార్చి క్వార్టర్ నాటికి నికర ఎన్పీఏలు 2.98 శాతం(రూ.12,963 కోట్లు)గా ఉన్నాయి. ఇక ఎన్పీఏలకు మొత్తం కేటాయింపులు గతేడాది జూన్ క్వార్టర్లో రూ.956 కోట్లతో పోలిస్తే ఈ క్యూ1లో మూడింతలు ఎగబాకి రూ.2,515 కోట్లకు చేరాయి. క్యూ1లో పునర్వ్యవస్థీకరించిన కార్పొరేట్ రుణాలు రూ.7,241 కోట్లుగా నమోదయ్యాయి. మార్చి క్వార్టర్(క్యూ4)లో ఈ మొత్తం విలువ రూ.8,573 కోట్లుగా ఉంది. కాగా, మొండిబకాయిల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రూ.3,600 కోట్ల రిజర్వు నిధి నుంచి క్యూ1లో రూ.865 కోట్లను ప్రొవిజనింగ్ కోసం బ్యాంక్ వినియోగించుకుంది. అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ(ఏఆర్సీ)లకు రూ.2,232 కోట్ల విలువైన రుణాలను విక్రయించింది. కన్సాలిడేటెడ్‌గా చూస్తే... బీమా వ్యాపారం, మ్యూచువల్ ఫండ్ ఇతరత్రా అనుబంధ సంస్థలన్నింటినీ కలిపి చూస్తే(కన్సాలిడేటెడ్) ఐసీఐసీఐ నికర లాభం క్యూ1లో రూ. 2,516 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,232 కోట్లతో పోలిస్తే 22.1 శాతం దిగజారింది. మొత్తం ఆదాయం రూ.22,456 కోట్ల నుంచి రూ.24,483 కోట్లకు పెరిగింది. 9 శాతం వృద్ధి నమోదైంది. ఇతర ముఖ్యాంశాలివీ.. ⇔ క్యూ1లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ)లో వృద్ధి నమోదుకాలేదు. రూ.5,115 కోట్ల నుంచి రూ.5,159 కోట్లకు చేరింది. ⇔ వడ్డీయేతర ఇతర ఆదాయం 15 శాతం వృద్ధితో రూ. 2,990 కోట్ల నుంచి రూ.3,429 కోట్లకు పెరిగింది. ⇔ రిటైల్ రుణాల్లో 22 శాతం భారీ వృద్ధి నేపథ్యంలో జూన్ క్వార్టర్లో మొత్తం రుణ వృద్ధి 12.5 శాతంగా నమోదైంది. ⇔ అనుబంధ సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ నికర లాభం రూ.116 కోట్ల నుంచి రూ.131 కోట్లకు పెరిగింది. 13 శాతం వృద్ధి చెందింది. ⇔ ఇక మరో సబ్సిడరీ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ నికర లాభం స్వల్ప వృద్ధితో రూ.397 కోట్ల నుంచి రూ.405 కోట్లకు చేరింది. పబ్లిక్ ఆఫర్ కోసం సంస్థ ఇటీవలే సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ⇔ ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ షేరు ధర శుక్రవారం బీఎస్ఈలో 3.4 శాతం క్షీణించి రూ.263 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. కాగా, అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీలో ఐసీఐసీఐ బ్యాంక్ ఏడీఆర్ కడపటి సమాచారం మేరకు 6 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ‘జూన్ క్వార్టర్లో కొత్తగా రూ.8,249 కోట్లు మొండిబకాయిల్లోకి చేరాయి. ప్రధానంగా ప్రత్యేక పరిశీలనలో ఉంచిన ఖాతాల నుంచి ఇందులో 76 శాతం నమోదైంది. ఈ జాబితాలో మార్చి 30 నాటికి రూ.44,000 కోట్ల విలువైన రుణాలను చేర్చాం. ప్రస్తుతం ఈ మొత్తం రూ.38,723 కోట్లుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే మొండిబకాయిల్లో 30 శాతం మేర మళ్లీ గాడిలోకి వస్తాయని భావిస్తున్నాం. అయితే, దేశీయంగా ఆర్థిక రికవరీ నెమ్మదిగానే జరుగుతుండటం, బలహీన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, కమోడిటీ ధరల తగ్గుదల వంటి పరిణామాల నేపథ్యంలో కొన్ని రంగాల్లో అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే, ఎన్పీఏలకు అడ్డుకట్టపడకపోవడంతో మార్జిన్లపై ఒత్తిడి కొనసాగవచ్చు. ప్రస్తుతానికి కాస్త సురక్షితంగా కనబడుతున్న రిటైల్ రుణాలపైనే అధికంగా దృష్టిసారిస్తున్నాం. ఈ ఏడాది దేశీ రుణాల్లో 18 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం. - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ -
బకాయిలు.. బాబోయ్!
♦ ఎన్పీఏలు మరింత పెరిగే అవకాశం ♦ బోలెడన్ని ఖాతాల్ని వాచ్‌లిస్ట్‌లో ఉంచామంటున్న బ్యాంకులు ♦ ఇప్పటికే రూ.5.8 లక్షల కోట్లకు చేరిన లిస్టెడ్ బ్యాంకుల ఎన్పీఏలు ♦ మొండిబకాయిలు, నష్టాలతో ప్రభుత్వ రంగ బ్యాంకుల కుదేలు ♦ మున్ముందు పరిస్థితిపై మార్కెట్ వర్గాల ఆందోళన హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : తాజాగా దేశీ పీఎస్‌యూ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... ఏకంగా లక్ష కోట్ల రూపాయల మొండి బకాయిలు(ఎన్పీఏ) ప్రకటించింది. ఇక మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని చూస్తే గుండె గుభేలుమంటుంది. కొన్ని బ్యాంకులైతే ఏకంగా తమ వ్యాపారంలో 13-15% వరకూ మొండి బకాయిలున్నట్లు తేల్చాయి. అసలు 15% మొండి బకాయిలుంటే ఇక ఆ బ్యాంకుల నిర్వహణ ఖర్చులెంత? అవి ఇచ్చే రుణాలెంత? ఇవన్నీ చూస్తే అవి బతికి బట్టకట్టగలవా? అని సందేహాలు రేగుతున్నాయి. సాధారణంగా 90 రోజులు దాటిన తరవాత కూడా వాయిదా మొత్తం లేదా వడ్డీ చెల్లింపులు రాకపోయిన పక్షంలో సదరు ఖాతాలను ఎన్పీఏలుగా వర్గీకరిస్తారు. ఎందుకంటే వీటిద్వారా బ్యాంకులకు రావాల్సిన ఆదాయం రావడం ఆగిపోతుంది. దీంతో వాటి దృష్టిలో ఇవి నిరర్ధక ఆస్తులుగా మారతాయి. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభానంతరం ఎకానమీ మందగించటం, ప్రాజెక్టుల అమల్లో జాప్యం... వంటి అంశాలవల్లే చాలా కంపెనీలు రుణాల్ని తిరిగి చెల్లించలేకపోతున్నాయి. మరోవంక ఉద్దేశపూర్వక ఎగవేతదారులు దీనికి తోడవుతుండటంతో బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. అయితే, లాభాలు చూపించుకోక తప్పని ఒత్తిళ్లు, తాపత్రయంలో బ్యాంకులు వీటిని చాన్నాళ్లుగా మరుగున పెడుతూ వచ్చాయి. ఇవి ఏదో ఒక రోజున ఆటంబాంబుల్లా పేలక తప్పదని గుర్తించిన ఆర్బీఐ... నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా మొండిబకాయిలకు ప్రొవిజనింగ్ చేసేలా అసెట్ క్వాలిటీ సమీక్షకు (ఏక్యూఆర్) ఆదేశించింది. దీంతో బ్యాంకులు ఎన్పీఏ గణాంకాలు బయటకు తియ్యకతప్పలేదు. రికార్డు స్థాయి నష్టాలు... మొండి బకాయిల్లాంటి వాటికి ప్రొవిజనింగ్‌లు తదితర కారణాలతో ఈ మార్చి క్వార్టర్లో 25 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 15 నష్టాలు ప్రకటించాయి. ఇవి ప్రకటించిన నష్టాలు మొత్తం దాదాపు రూ. 23,493 కోట్ల పైచిలుకే. అంతక్రితం క్యూ4లో ఇవి రూ. 8,800 కోట్ల పైగా లాభాలు నమోదు చేశాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)... నష్టాల్లో రికార్డులు సృష్టించింది. దేశీయంగా ఏ బ్యాంకూ ఎరగనంత స్థాయిలో రూ.5,367 కోట్లు నష్టాన్ని ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర బ్యాంకులు కూడా అదే బాటలో నడిచాయి. రాష్ట్రానికి వస్తే.. ప్రొవిజనింగ్ తదితరాలకు కేటాయింపులు రూ. 1,023 కోట్లు కేటాయించడంతో క్యూ4లో ఆంధ్రా బ్యాంకు నికర లాభం ఏకంగా 72 శాతం క్షీణించి రూ. 52 కోట్లకు తగ్గిపోయింది. ఇంకా పెరుగుతాయ్..! గతేడాది ఆగస్టులో ప్రభుత్వ బ్యాంకులకు దాదాపు రూ. 70,000 కోట్ల మూలధనం సమకూర్చేలా ఆర్థిక మంత్రి జైట్లీ ప్రతిపాదన చేశారు. 2017 నాటికి బ్యాంకులు బ్యాలెన్స్ షీట్లను ప్రక్షాళన చేసుకోవాలనీ చెప్పారాయన. అయితే బ్యాంకులు కుస్తీ పడుతున్నప్పటికీ.. ఎన్పీఏల సమస్య ఇప్పుడే తీరేట్లు కనిపించడం లేదు. వచ్చే ఏడాది మార్చి దాకా ఇది కొనసాగవచ్చని ఆంధ్రా బ్యాంకు ఎండీ సురేశ్ ఎన్ పటేల్ వ్యాఖ్యానించారు. దాదాపు రూ.2,500-3,000 కోట్ల దాకా విలువ చేసే ఏడెనిమిది ఖాతాలు అనుమానాస్పదంగానే ఉన్నట్లు చెప్పారాయన. ఎస్బీఐ సుమారు రూ.31,000 కోట్ల అసెట్స్‌ను వాచ్ లిస్టులో ఉంచింది. ఇందులో దాదాపు 70% ఖాతాలు సందేహాస్పదమైనవేనని బ్యాంకు చైర్మన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. ఇతరత్రా ప్రైవేట్ బ్యాంకులూ ఇలాంటి హెచ్చరికలే చేశాయి. ఐసీఐసీఐ బ్యాంకు రూ. 52,638 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ రూ. 22,000 కోట్ల విలువైన ఖాతాలను వాచ్ లిస్టులో ఉంచినట్లు చెప్పాయి. ఐతే చాలా బ్యాంకులు ఇప్పటికే పెద్ద ఎత్తున దిద్దుబాటు చర్యలు తీసుకున్నందున రాబోయే రోజుల్లో మొండి బాకీలు, నష్టాల తీవ్రత తగ్గొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్పీఏలు రూ.5.8 లక్షల కోట్లు.. ♦ ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2004-2012 మధ్య సుమారు 4% మాత్రమే ఉన్న ఎన్పీఏల పెరుగుదల 2013-15 మధ్య ఏకంగా 60 %కి ఎగిసింది. ♦ పీఎస్బీల్లో 2011లో రూ. 71,000 కోట్లుగా ఉన్న ఎన్పీఏలు 2015 నాటికి అయిదు రెట్లు పెరిగి రూ. 3.6 లక్షల కోట్లకు చేరాయి. ♦ 2013-15 మధ్య 29 పీఎస్‌యూలు దాదాపు రూ.1.14 లక్షల కోట్ల విలువైన మొండిబకాయిలను రైటాఫ్ చేసేశాయి. ♦ 2015-16 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రొవిజనింగ్ ఏకంగా 87 శాతం పెరుగుదలతో రూ. 96,698 కోట్ల నుంచి రూ. 1.75 లక్షల కోట్లకు ఎగిసింది. ♦ {పస్తుతం స్టాక్ మార్కెట్లో లిస్టయిన 38 బ్యాంకుల స్థూల మొండిబకాయిలు 95 శాతం ఎగిసి రూ. 5.8 లక్షల కోట్లకు చేరాయి. -
బ్యాంకులకు ‘ఉక్కు’ సంకెళ్లు..!
♦ ఎన్పీఏలుగా మారనున్నమరో రూ. 50 వేల కోట్ల రుణాలు ♦ స్టీల్ రంగానికి ప్రత్యేక ఫండింగ్ ఏజెన్సీ ♦ ఏర్పాటు చేయాలంటున్న బ్యాంకులు ♦ కొత్త రుణాలు ఇవ్వడం సాధ్యం కాదని గగ్గోలు కొండలా పేరుకుపోతున్న మొండిబకాయిలతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న దేశీ బ్యాంకింగ్ రంగానికి ఇప్పుడు ‘స్టీల్’ భయం పట్టుకుంది. అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం, ధర పతనంతో తీవ్ర సమస్యల్లో కూరుకుపోయిన ఇనుము-ఉక్కు రంగ కంపెనీలు బ్యాంకర్లకు దడ పుట్టిస్తున్నాయి. ఎందుకంటే.. రానున్న కాలంలో ఈ రంగానికి ఇచ్చిన రుణాల్లో దాదాపు మరో రూ.50 వేల కోట్ల రుణాలు మొండిబకాయిలు(ఎన్పీఏ)లుగా మారనున్నట్లు అంచనా. ఆర్థిక సంవత్సరం ముగియడంతో భారీగా రుణాలు తీసుకున్న ఉక్కు కంపెనీల నుంచి బకాయిలు వసూలు చేసుకోవడంపై బ్యాంకులు దృష్టిసారిస్తున్నాయి. అవసరమైతే వాటిని డిఫాల్టర్ల జాబితాలో చేర్చేందుకు సైతం సమాయత్తమవుతున్నాయి. దీనివల్ల ప్రొవిజనింగ్ కేటాయింపులు పెరిగిపోయి బ్యాంకుల లాభాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయినప్పటికీ.. ఆర్బీఐ, ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు బ్యాంకులు రికవరీ ప్రక్రియను ప్రారంభించాల్సిన పరిస్థితి నెలకొందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోపక్క, తీవ్ర అనిశ్చితిలో ఉన్న స్టీల్ రంగానికి ఇకపై తాము కొత్తగా రుణాలిచ్చే పరిస్థితి లేదని కూడా బ్యాంకర్లు స్పష్టం చేస్తుండటం గమనార్హం. ఈ త్రైమాసికంలోనే... స్టీల్ రంగ రుణాలకు సంబంధించి ఎన్పీఏలుగా మారనున్న రూ.50 వేల కోట్లను చాలా వరకూ ఈ ఏడాది(2016-17) తొలి త్రైమాసికంలో తమ ఖాతా పుస్తకాల్లో మొండిబకాయిలుగా చూపనున్నాయి. కొన్ని బ్యాంకులు మాత్రం కొన్ని స్టీల్ రుణాలను గతేడాది ఆఖరి త్రైమాసికం(క్యూ4)లోనే ఎన్పీఏలుగా పరిగణించినట్లు సమాచారం. భారీ రుణ భారంతో ఇప్పటికే ఉన్న భూషణ్ స్టీల్, ఎస్సార్, విసా స్టీల్, ఎలక్ట్రో స్టీల్ వంటి కొన్ని కంపెనీలతో ఇప్పటికే బ్యాంకర్లు చర్చలు జరిపినట్లు ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఇందులో చాలా వరకూ కంపెనీలకు ఇచ్చిన రుణాలను బ్యాంకులు 5/25 స్కీమ్ కింద పునర్వ్యవస్థీకరించడం గమనార్హం. ఆర్బీఐ 2014లో తీసుకొచ్చిన ఈ స్కీమ్ ప్రకారం ఏదైనా కంపెనీకి ఇచ్చిన రుణాలను బ్యాంకులు అవసరమైతే మరో 25 ఏళ్ల వరకూ పొడిగించే అవకాశం ఉంటుంది. అయితే, ప్రతి ఐదేళ్లకోసారి వడ్డీరేట్లను సవరించే షరతు విధిస్తారు. దీనివల్ల రుణ గ్రహీతలకు రీపేమెంట్ సులభం అవడమే కాకుండా చెల్లించాల్సిన కిస్తీ(ఇన్స్టాల్మెంట్) మొత్తం కూడా తగ్గుతుంది. గతేడాది డిసెంబర్ నాటికి మొత్తం బ్యాంకుల పునర్వ్యవస్థీకరణ రుణాల్లో 21 శాతం(దాదాపు రూ.54,051 కోట్లు) ఇనుము-ఉక్కు రంగ కంపెనీలవే. 2015 సెప్టెంబర్ చివరివరకూ చూస్తే స్టీల్ రంగం స్థూల ఎన్పీఏలు 8.4 శాతం కాగా, వచ్చే ఏడాది మార్చికల్లా ఇవి 12 శాతానికి ఎగబాకవచ్చని అంచనా. దేశవ్యాప్తంగా ఇప్పుడు అత్యధికంగా రుణభారం ఉన్న రంగం కూడా ఇదే కావడం గమనార్హం. ప్రత్యేక ఏజెన్సీయే శరణ్యం... రానున్న కాలంలో తాము ఇక స్టీల్ రంగానికి రుణాలివ్వడం అసాధ్యమని... అందువల్ల ప్రభుత్వం ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టాలని బ్యాంకర్లు సూచిస్తున్నారు. విద్యుత్ రంగానికి రుణకల్పన కోసం ఏర్పాటు చేసిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ) తరహాలో స్టీల్ రంగానికి కూడా ఒక ఫండింగ్ ఏజెన్సీని నెలకొల్పే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని ఎస్బీఐ ఎండీ బి. శ్రీరామ్ ఇటీవల ఒక నోట్లో అభిప్రాయపడ్డారు. ఎందుకంటే 2025 నాటికి ఈ రంగం వార్షిక ఉత్పాదక సామర్థ్యం 300 మిలియన్ టన్నులకు చేరాలన్న లక్ష్యం సాకారమవ్వాలంటే.. రూ.10 లక్షల కోట్ల రుణాలు అవసరమవుతాయన్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు. స్టీల్ రంగాన్ని ఆదుకోవడం కోసం ప్రభుత్వం కనీస దిగుమతి ధర(ఎంఐపీ), రక్షణాత్మక దిగుమతి సుంకం వంటి చర్యలు తీసుకుంటోందని.. దీనివల్ల పరిశ్రమకు కొంత ప్రయోజనం ఉంటున్నప్పటికీ, ఉక్కు వినియోగ రంగాలైన ఆటోమొబైల్, గృహోపకరణాలు, ఇంజినీరింగ్ కంపెనీల మార్జిన్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు ఎస్బీఐ నోట్ ప్రస్తావించింది. ఇనుము-ఉక్కు రంగం పరిస్థితి ఇదీ ♦ బ్యాంకుల మొత్తం రుణాలు: రూ. 3 లక్షల కోట్లు ♦ మొండిబకాయిలుగా మారిన రుణాల పరిమాణం: 27 శాతం ♦ బ్యాంకుల మొత్తం రుణాల్లో స్టీల్ రంగం వాటా: 4.7 శాతం ♦ మొత్తం ఎన్‌పీఏల్లో దీని వాటా: 6.9%