న్యూఢిల్లీ/ముంబై: మొండిబాకీలు భారీగా పేరుకుపోయిన కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్‌బీ) మూసివేసే అవకాశముందంటూ వస్తున్న వార్తలను కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ కొట్టిపారేశాయి. ఇవన్నీ వదంతులేనని, వీటిని నమ్మొద్దని స్పష్టం చేశాయి. ఏ ఒక్క ప్రభుత్వ రంగ బ్యాంకునూ మూసివేసే యోచనేదీ లేదని పేర్కొన్నాయి.
ప్రభుత్వ రంగ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ ఇండియాపై రిజర్వ్ బ్యాంక్ సత్వర పరిష్కార చర్యలు (పీసీఏ) చేపట్టిన దరిమిలా.. ప్రభుత్వం కొన్ని బ్యాంకులను మూసివేయబోతోందంటూ ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం, ఆర్‌బీఐ వివరణ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులను మరింత పటిష్టం చేసేందుకే చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం తెలిపింది. ‘ఏ బ్యాంకునూ మూసివేసే ప్రసక్తే లేదు. పైగా రూ. 2.11 లక్షల కోట్ల అదనపు మూలధనాన్ని సమకూర్చడం ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్రం మరింత పటిష్టం చేస్తోంది. కాబట్టి వదంతులను నమ్మొద్దు. పీఎస్‌బీల రీక్యాపిటలైజేషన్, సంస్కరణల ప్రణాళిక కొనసాగుతోంది‘ అని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్.. మైక్రోబ్లాగింగ్ సైటు ట్వీటర్‌లో ట్వీట్ చేశారు.
బ్యాంకులను పటిష్టం చేసేందుకే పీసీఏ..
పీసీఏ చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కొన్నింటిని మూసివేయనున్నారంటూ సోషల్ మీడియా సహా కొన్ని ప్రసారమాధ్యమాల్లో ’తప్పుడు సమాచార’ ప్రచారం జరుగుతోందని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. బ్యాంకులను పటిష్టం చేసేందుకు తాము వివిధ పర్యవేక్షణ సాధనాలు ఉపయోగిస్తుంటామని, పీసీఏ కూడా అందులో ఒకటని ఆర్‌బీఐ పేర్కొంది.
ఆయా బ్యాంకుల పనితీరును తెలియజేసే అంశాలను పరిశీలించి, తర్వాత దశల్లో తలెత్తబోయే సమస్యల గురించి ముందస్తుగా హెచ్చరించేందుకు పీసీఏని ఉపయోగించడం జరుగుతుందని తెలిపింది. మూలధనం, అసెట్ క్వాలిటీ మొదలైనవి నిర్దేశిత ప్రమాణాలను అతిక్రమించిన పక్షంలోనే దీన్ని ప్రయోగిస్తామని వివరించింది. తగు దిద్దుబాటు చర్యలు తీసుకోవడం ద్వారా ఆయా బ్యాంకులు కాలక్రమేణా ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చుకునేందుకు తోడ్పాటు అందించడమే ఈ సాధనాల లక్ష్యమని పేర్కొంది.
డిఫాల్టర్ల పేర్లు బయటకు రావాలి
బ్యాంకింగ్ చట్టాల్లో తగు సవరణలు చేయాలి..
పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ వ్యవస్థలో మొండిబాకీలు (ఎన్‌పీఏ) ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో ఎగవేతదారుల పేర్లు బయటకు వచ్చేలా బ్యాంకింగ్ చట్టాల్లో తగు సవరణలు చేయాల్సిన అవసరం ఉందని పార్లమెంటరీ కమిటీ సూచించింది. నిరర్థక ఆస్తుల పరిమాణాన్ని తగ్గించుకునేలా బ్యాంకులు తమ ఖాతాలను ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉందని, దీనితో వాటి విశ్వసనీయత పెరిగి నిధుల సమీకరణ సామర్థ్యాలు మెరుగుపడతాయని పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కమిటీ ఆన్ పిటిషన్స్ (సీవోపీ) పేర్కొంది.
‘బ్యాంకులకు బాకీపడిన వారు లేదా రుణాలు తిరిగి చెల్లించకుండా మొండిబాకీలకు కారణమైన వారి పేర్లు బయటకు వచ్చే విధంగా ఎస్‌బీఐ యాక్ట్ సహా ఇతర చట్టాల్లో పాతబడిన నిబంధనలను సవరించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది‘ అని సిఫార్సు చేసింది. పెరుగుతున్న ఎన్‌పీఏలకు చెక్ చెప్పేందుకు ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ సరైన చర్యలు తీసుకుంటున్నాయని కితాబిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment