ఐడీబీఐ బ్యాంక్‌కు సీబీఐ నోటీసు
న్యూఢిల్లీ/ముంబై: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఐడీబీఐ బ్యాంక్ రుణం ఇవ్వడంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు ప్రారంభించింది. బ్యాంకుకు ఎంక్వైరీ నోటీసు జారీ చేసింది. ఆర్థిక భారంతో సర్వీసులు నిలిచిపోయిన విజయ్‌మాల్యా నియంత్రణలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఐడీబీఐ బ్యాంక్ రూ.950 కోట్ల రుణం మంజూరు చేసింది. ఇంతభారీ మొత్తం రుణం మంజూరు చేయడంలో విశ్వసనీయత కొరవడిందన్నది సీబీఐ నోటీసుల సారాంశంగా తెలుస్తోంది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ నెట్‌వర్త్ ప్రతికూలంగా ఉన్నప్పుడు రూ.950 కోట్ల భారీ రుణాన్ని ఐడీబీఐ బ్యాంక్ ఎలా మంజూరు చేసిందో తేలాల్సి ఉందని సీబీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇందుకోసమే ప్రాథమిక విచారణ (పీఈ)కు నోటీసులు జారీ అని తెలిపారు.
వివరణ పంపుతాం: బ్యాంక్ సీఎండీ
కాగా తాజా వ్యవహారంపై ఐడీబీఐ బ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ) ఎంఎస్ రాఘవన్ వివరణ ఇచ్చారు. ‘‘దీని గురించి సమాచారం అంతా ఉంది. కొన్ని ప్రశ్నలకు సమాధానాలను సీబీఐ కోరింది. వాటికి మేము రానున్న కొద్ది రోజుల్లో సమాధానం ఇవ్వాల్సి ఉంది. గతంలో కూడా ఈ తరహాలోనే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కోరడం జరిగింది. బ్యాంకు కూడా సమాధానాలు పంపింది. ఇక్కడ దాయడానికి ఏమీ లేదు. కన్సార్షియం లేదా మల్టిప్లై బ్యాంకింగ్‌లో భాగంగా రుణాలను బ్యాంక్ సమకూర్చింది’’ అని ఆయన అన్నారు.
సిండికేట్ బ్యాంక్ నేపథ్యం... ప్రాధాన్యత
నిబంధనలకు విరుద్ధంగా కంపెనీల రుణ పరిమితి పెంచేందుకు లంచం తీసుకున్న కేసులో సిండికేట్ బ్యాంక్ సీఎండీ ఎస్.కె.జైన్‌తో పాటు మరో ఏడుగురి అరెస్ట్, రిమాండ్ నేపథ్యంలో సీబీఐ తాజా నోటీసులకు ప్రాధాన్యత ఏర్పడింది. భూషణ్ స్టీల్ కంపెనీ సిండికేట్ బ్యాంకుకు కోట్లాది రూపాయల రుణాలకు సంబంధించిన వాయిదాలను చెల్లించకపోయిన్పటికీ ఆ కంపెనీ రుణ పరిమితిని పెంచేందుకు రూ.50 లక్షల కోసం సంప్రదింపులు జరుపుతున్న జైన్‌ను సీబీఐ అధికారులు ఇటీవలే అరెస్ట్ చేశారు.
ప్రభుత్వ రంగ బ్యాం కుల్లో పాలనాపరమైన కొన్ని సమస్యలున్నాయని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇటీవలి పాలసీ విధాన ప్రకటన సందర్భంలోనూ పేర్కొన్నారు. రుణాల మంజూరులో మరింత పారదర్శకత అవసరమన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల పాలన వ్యవస్థపై మరోమారు దృష్టిసారించి లోపాలను సరిదిద్దాల్సి ఉందన్నారు. రుణ బకాయిల్లో కూరుకుపోయిన కింగ్‌ఫిషర్ 2012 అక్టోబర్ నుంచీ కార్యకలాపాలను నిలిపివేసింది. ఎస్‌బీఐ సారథ్యంలోని 17 బ్యాంకుల బృం దానికి కేఎఫ్‌ఏ దాదాపు రూ.7,000 కోట్ల బకాయి ఉంది. దీనిలో ఎస్‌బీఐ వాటా దాదాపు 1,600 కోట్లు.