న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు వసూలు కాని మొండి బకాయిలను (ఎన్‌పీఏలు) మాఫీ చేస్తుండడాన్ని (రైటాఫ్) కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమర్థించుకున్నారు. ఇలా చేయడం ఎన్‌పీఏలపై హక్కులు వదులుకోవడానికి దారితీయదన్నారు. బ్యాంకులు తమ బ్యాలన్స్ షీట్లను ప్రక్షాళించుకోవడానికి, పన్ను ప్రయోజనం పొందడానికి వీలు పడుతుందని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) రూ.36,551 కోట్ల ఎన్‌పీఏలను వసూలు చేసినట్టు చెప్పారు.
2017–18 ఆర్థిక సంవత్సరంలో ఇలా వసూలైన మొత్తం ఎన్‌పీఏలు రూ.74,562 కోట్లుగా ఉన్నాయని తెలియజేశారు. బీజేపీ పాలనలోని నాలుగు సంవత్సరాల్లో 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.3.16 లక్షల కోట్ల ఎన్‌పీఏలను మాఫీ చేశాయని, అదే సమయంలో రూ.44,900 కోట్ల మేర రద్దు చేసిన రుణాలను రికవరీ చేశాయని వచ్చిన వార్తలపై జైట్లీ ఫేస్‌బుక్‌లో స్పందించారు. ‘‘ఆర్‌బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగానే సాంకేతికపరమైన రైటాఫ్‌లను బ్యాంకులు చేస్తుంటాయి. ఎన్‌పీఏల మాఫీ అన్నది బ్యాంకులు తమ బ్యాలన్స్ షీట్లను ప్రక్షాళించేందుకు తరచుగా చేసే పనే. ఇది పన్ను పరంగా ప్రయోజనం కలిగిస్తుంది.
అయినప్పటికీ ఇది ఏ రుణంపైనా హక్కులు వదిలేసుకోవటానికి దారితీయదు. రుణాల రికవరీని బ్యాంకులు కఠినంగా కొనసాగిస్తూనే ఉంటాయి’’ అని జైట్లీ వివరించారు. డీమోనిటైజేషన్, రూ.3.16 లక్షల కోట్ల ఎన్‌పీఏల మాఫీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించడంతో జైట్లీ ఇలా స్పందించారు. మాఫీ చేసినప్పటికీ, రుణాలు తీసుకున్న వారిపై తిరిగి చెల్లించాల్సిన బాధ్యత ఉంటుందని జైట్లీ స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌బీలకు రూ.1,81,034 కోట్ల రికవరీ లక్ష్యాన్ని విధించినట్టు జైట్లీ తెలిపారు.
సెప్టెంబర్ జీఎస్‌టీ వసూళ్లలో స్వల్ప వృద్ధి!
వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు సెప్టెంబర్‌లో స్వల్పంగా పెరిగి రూ.94,442 కోట్లుగా నమోదయ్యాయి. ఆగస్టులో ఈ వసూ ళ్లు రూ.93,960 కోట్లు. అయితే పండుగల సీజన్ వల్ల సెప్టెంబర్ తరువాతి నెలల్లో ఈ వసూళ్లు మరింత పెరుగుతాయన్న అంచనాలున్నాయి.
67 లక్షల వ్యాపార వర్గాల నుంచి సెప్టెంబర్‌లో తాజా డిపాజిట్లు వచ్చినట్లు ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. విడివిడిగా చూస్తే.. సెంట్రల్ జీఎస్‌టీ వాటా రూ.15,318 కోట్లు. స్టేట్ జీఎస్‌టీ వాటా రూ.21,061 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ వాటా రూ.50,070 కోట్లు (దిగుమతులపై రూ. 25,305కోట్లు కలిపి), సెస్ రూ.7,993 కోట్లు . ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటున నెలకు లక్ష కోట్ల జీఎస్‌టీ వసూళ్లు జరగాలన్నది కేంద్రం లక్ష్యమైనా ఏప్రిల్ మినహా మరే నెలలో ఇది సాధ్యపడలేదు.
Comments
Please login to add a commentAdd a comment