ఎల్‌ఐసీ మెడకు ‘మొండి’బండ! | IDBI Bank employees oppose proposed take over by LIC | Sakshi
Sakshi News home page

ఎల్‌ఐసీ మెడకు ‘మొండి’బండ!

Published Wed, Jul 4 2018 12:04 AM | Last Updated on Wed, Jul 4 2018 4:51 AM

IDBI Bank employees oppose proposed take over by LIC - Sakshi

షేర్లు.. బంగారం.. డిపాజిట్లు... ఇలా ఎందులోనైనా ఎవరైనా లాభాలను ఆశించే పెట్టుబడి పెడతారు! అయితే, లాభాల మాట దేవుడెరుగు... నష్టాలొస్తున్నా పదేపదే వాటిలోనే పెట్టుబడి పెట్టేవారినేమంటారు? మన దేశంలోనైతే ‘ఎల్‌ఐసీ’ అంటారేమో!! ఈ ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఇప్పుడు సర్కారుకు ఆపద్బాంధవుడిగా మారింది. తీవ్రమైన మొండిబాకీలతో కుదేలైన ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లలో ఎల్‌ఐసీ పెట్టిన పెట్టుబడులన్నీ నష్టాలనే మిగులుస్తున్నాయి. అయినా, ఎక్కడా వెనక్కి తగ్గకుండా నష్టాల ప్రయాణంలో మరింత కూరుకుపోతుండటం ఒక్క ఎల్‌ఐసీకే చెల్లుతుందేమో. వేల కోట్ల రూపాయల మొండిబాకీలతో గుదిబండగా మారిన ఐడీబీఐ బ్యాంకులో రూ.13 వేల కోట్ల పెట్టుబడులకు ఎల్‌ఐసీ సిద్ధం కావడం ఇందుకు నిదర్శనం. ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండిబాకీలను భరించే ‘బ్యాడ్‌’ బ్యాంక్‌గా ఎల్‌ఐసీ మారుతోందన్నది కొంత మంది విశ్లేషకుల మాట!!


సాక్షి, బిజినెస్‌ విభాగం :  స్టాక్‌ మార్కెట్లో ఎల్‌ఐసీ జోరుగానే పెట్టుబడులు పెడుతూ ఉంటుంది. కొన్నింటిపై లాభాలు కూడా దండిగానే వస్తున్నాయి. అయితే, ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ) షేర్లలో వెచ్చించిన ఇన్వెస్ట్‌మెంట్‌లు మాత్రం ఎల్‌ఐసీ జేబుకు చిల్లుపెడుతూనే ఉన్నాయి.

గడిచిన రెండున్నరేళ్లలో మొత్తం 21 పీఎస్‌బీలకు గాను 18 పీఎస్‌బీల్లో చేసిన పెట్టుబడులపై ఎల్‌ఐసీ భారీస్థాయిలోనే నష్టాలను మూటగట్టుకోవడం గమనార్హం. ఈ 21 పీఎస్‌బీల్లో ఎల్‌ఐసీకి 1 శాతం కంటే ఎక్కువ వాటానే ఉంది. 2015 డిసెంబర్‌ నాటి షేర్ల ధరలతో పోలిస్తే... కేవలం 3 ప్రభుత్వ బ్యాంకుల్లో పెట్టుబడులు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి. వీటిలో ఇండియన్‌ బ్యాంక్‌(షేరు 168 శాతం పెరిగింది), విజయా బ్యాంక్‌(43 శాతం అప్‌), ఎస్‌బీఐ(4 శాతం అప్‌) ఉన్నాయి.  

ఆర్‌బీఐ మేలుకొలిపినా...
2015 డిసెంబర్‌ నుంచి చూస్తే... ఎల్‌ఐసీ ఇప్పటివరకూ పీఎస్‌బీ షేర్లలో చేసిన పెట్టుబడుల విలువ 8 శాతం పైగానే హరించుకుపోయింది. ఈ పీఎస్‌బీలన్నీ మొండిబకాయిల(ఎన్‌పీఏ) ఊబిలో కూరుకుపోయి తీవ్రమైన నష్టాలను మూటగట్టుకుంటుండంతో వాటి షేర్ల విలువలు రోజురోజుకూ కుదేలైపోతున్నాయి. అయినాసరే ఎల్‌ఐసీ మాత్రం కొత్తగా వాటి షేర్లను కొనుగోలు చేస్తూనే ఉంది.

విచిత్రం ఏంటంటే... మొండి బకాయిలపై ఆర్‌బీఐ కొరడా ఝుళిపించడం మొదలెట్టిన తర్వాత(2015 ద్వితీయార్థం నుంచి) కూడా పీఎస్‌బీ షేర్లలో ఎల్‌ఐసీ కొత్తగా పెట్టుబడులు పెట్టడం!! అప్పటినుంచి చూస్తే దేనా బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర షేర్ల విలువలు 60 శాతంపైగా పడిపోయాయి. మొత్తం 9 ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్ల ధరలు 50 శాతంపైగా క్షీణించగా... ఆరు బ్యాంకుల షేర్ల విలువ 30–50 శాతం మేర పతనమైంది.

ఎల్‌ఐసీ పెట్టుబడులపై ఆధారపడొద్దని, బ్యాంకింగ్‌ వ్యవస్థకు ఇది మంచిదికాదంటూ ఆర్‌బీఐ చాన్నాళ్ల క్రితమే హెచ్చరించడం గమనార్హం. కాగా, మొండిబకాయిలు తారస్థాయికి ఎగబాకిన 11 బ్యాంకులను ఆర్‌బీఐ దిద్దుబాటు చర్యల్లో భాగంగా(పీసీఏ) తన పర్యవేక్షణలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీటి ఎన్‌పీఏలు రూ.10,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్ల స్థాయిలో ఉన్నాయి. అంటే ఇవి కొత్తగా రుణాలివ్వడం ఇతరత్రా అంశాలపై ఆర్‌బీఐ ఆంక్షలు కొనసాగుతాయి.

ఈ 11 బ్యాంకు షేర్లలో ఎల్‌ఐసీ భారీగానే పెట్టుబడులు పెట్టింది. ఎల్‌ఐసీకి 10 శాతంపైగా వాటా ఉన్న ఆరు ప్రభుత్వ బ్యాంకుల మొండిబకాయిలు... వ్యవస్థలోని మొత్తం ఎన్‌పీఏల్లో 8 శాతానికి సమానం. అంటే.. ఈ మొండిబకాయిలన్నీ ఒకరకంగా ఎల్‌ఐసీ మెడకు చుట్టుకున్నట్లే!!

ఎస్‌బీఐలో అత్యధిక పెట్టుబడి...
ఈ ఏడాది మార్చి నాటికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)షేర్లలో ఎల్‌ఐసీకి రూ.22,770 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. అయితే, వాటా పరంగా చూస్తే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) టాప్‌లో ఉంది. ఇందులో ఎల్‌ఐసీకి అత్యధికంగా 14.2 శాతం వాటా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో కార్పొరేషన్‌ బ్యాంక్‌(ఎల్‌ఐసీ వాటా 13 శాతం), అలహాబాద్‌ బ్యాంక్‌(12.4 శాతం వాటా) ఉన్నాయి.

ఇక ఐడీబీఐ బ్యాంక్, సిండికేట్‌ బ్యాంక్, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాల్లో కూడా 10 శాతం పైగానే వాటాలు ఎల్‌ఐసీకి ఉండటం గమనార్హం. 2015 డిసెంబర్‌ నాటికి మొత్తం బ్యాంకింగ్‌ షేర్లలో ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ రూ.78,000 కోట్లు. ఇందులో పీఎస్‌బీల వాటా రూ.42,480 కోట్లు కాగా, ప్రైవేటు బ్యాంకుల వాటా రూ.35,520 కోట్లు. ఈ ఏడాది మార్చి నాటికి బ్యాంకుల్లో ఎల్‌ఐసీ పెట్టుబడి విలువ రూ.92,730 కోట్లకు ఎగబాకింది.

అయితే, పీఎస్‌బీల్లో వాటాలను పెంచుకున్నప్పటికీ.. వాటి విలువ రూ.38,830 కోట్లకు పడిపోగా, ప్రైవేటు బ్యాంకుల్లో పెట్టుబడుల విలువ మాత్రం రూ.53,900 కోట్లకు చేరడం గమనార్హం. వాస్తవానికి మొత్తం ఎల్‌ఐసీ పెట్టుబడుల్లో పీఎస్‌బీల వాటా చాలా తక్కువనే చెప్పాలి. 2017 డిసెంబర్‌ నాటికి ఎల్‌ఐసీ తనదగ్గరున్న పాలసీదారుల నిధుల్లో రూ.15.4 లక్షల కోట్లను ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడిగా పెట్టింది. ఇక షేర్లలో రూ.4.8 లక్షల కోట్లు, డిబెంచర్లు–బాండ్లలో రూ.76,100 కోట్లను ఇన్వెస్ట్‌ చేసింది.

ప్రైవేటు బ్యాంకులతో లాభాలు...
ప్రభుత్వ బ్యాంకు షేర్లలో చేతులుకాల్చుకుంటున్న ఎల్‌ఐసీకి ప్రైవేటు బ్యాంకులు మాత్రం ఆదుకుంటుండటం విశేషం. ఎల్‌ఐసీకి ఒక శాతం కంటే అధికంగా వాటా ఉన్న 9 ప్రైవేటు బ్యాంకుల్లో పెట్టుబడులన్నీ ప్రస్తుతం లాభాల్లోనే ఉన్నాయి. 2015 డిసెంబర్‌ నుంచి చూస్తే... ప్రైవేటు బ్యాంకుల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ విలువ 50 శాతం మేర ఎగబాకింది. ఇందులో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(షేరు ధర 95 శాతం వృద్ధి), యస్‌ బ్యాంక్‌(134 శాతం అప్‌) ప్రధానంగా ఉన్నాయి.


బ్యాడ్‌ బ్యాంకా.. ఎందుకు ఎల్‌ఐసీ ఉందిగా!
పీఎస్‌బీల మొండిబకాయిల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఒక అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ(దీన్నే బ్యాడ్‌ బ్యాంక్‌గా పేర్కొంటున్నారు) ఏర్పాటు చేయాలంటూ తాజాగా ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇవ్వడం తెలిసిందే. అయితే, ఇలాంటి బ్యాంకులన్నింటిలో మెజారిటీ వాటాను ఎల్‌ఐసీ చేత కొనిపించి.. చేతులుదులుపుకుంటే సరిపోయేదానికి మళ్లీ బ్యాడ్‌ బ్యాంక్‌ పేరుతో కొత్తగా ఒక సంస్థను ఏర్పాటు చేయడమెందుకంటూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నవారు కూడా ఉన్నారు.

ఎందుకంటే మొండిబాకీలతో చతికిలపడిన ఐడీబీఐ బ్యాంక్‌లో ఇప్పుడు 51% మెజారిటీ వాటాను ఎల్‌ఐసీకి కట్టబెట్టేందుకు(దాదాపు రూ.13,000 కోట్లు పెట్టుబడి పెట్టించేందుకు) చకచకా పావులు కదుపుతుండటమే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. ఎల్‌ఐసీ చేసే ఈ పెట్టుబడి కూడా నిరర్థకంగా మారుతుందని... ఉద్యోగ సంఘాలు లబోదిబోమంటున్నా ప్రభుత్వం ముందుకే వెళ్తోంది. ఎల్‌ఐసీ కోసం తాజాగా బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ ప్రత్యేకంగా పెట్టుబడి పరిమితి నిబంధనలను కూడా సవరించింది(15 శాతం నుంచి 51 శాతానికి).

కాగా, 2015–16 నుంచి 2017–18 మధ్య ఐడీబీఐ బ్యాంక్‌ రూ.13,396 కోట్ల నికర నష్టాలను మూటగట్టుకుంది. రూ.55,000 కోట్ల ఎన్‌పీఏలతో కుదేలైంది. మరో రూ.60,000 కోట్ల రుణాలు ఎన్‌పీఏలుగా మారే ప్రమాదం ఉంది. ఇంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్న బ్యాంకు షేరు ఇప్పట్లో కోలుకోవడం కష్టమే. అయినా, కూడా ఎల్‌ఐసీకి మెజారిటీ వాటా కట్టబెట్టేందుకు ప్రభుత్వం పావులు కదుపుతుండటాన్ని నిపుణులు తప్పుబడుతున్నారు.

ఐడీబీఐ డీల్‌కు పార్లమెంట్‌ ఆమోదం అక్కర్లేదు!
ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీ ప్రతిపాదిత 51 శాతం మెజారిటీ వాటా కొనుగోలు విషయంలో ఎల్‌ఐసీ చట్టంలో సవరణ, పార్లమెంట్‌ ఆమోదం అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇది ఫైనాన్షియల్‌ ఒప్పందం అయినందున చట్టంలో మార్పులు చేయనక్కర్లేదని, అయితే, దీనికి కేబినెట్‌ ఆమోదంతో పాటు ఇతర నియంత్రణ సంస్థల అనుమతి తీసుకోవా ల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

ఎందుకంటే ఎల్‌ఐసీకి ఐడీబీఐ బ్యాంక్‌ తాజాగా ప్రిఫరెన్షియల్‌ ప్రాతిపదికన షేర్లను జారీ చేస్తుంది. ఎల్‌ఐసీ వెచ్చించే రూ.10,000–13,000 కోట్ల మూలధన నిధులతో ఆ సంస్థ వాటా 51 శాతానికి చేరుతుంది. ఈ నిధులు ప్రభుత్వ ఖజానాకు చేరవు. మరోపక్క, ప్రభుత్వ వాటా ఇప్పుడున్న 80.96% నుంచి 51% దిగువకు తగ్గుతుంది. ఈ డీల్‌తో ఐడీబీఐ బ్యాంక్‌ ప్రభుత్వ రంగ హోదాను కోల్పోయి ప్రైవేటు బ్యాంకు అవతారమెత్తుతుంది. ఎల్‌ఐసీకి అనుబంధ సంస్థగా మారుతుంది.

కాగా, ఈ డీల్‌తో బ్యాంకింగ్‌ రంగంలోకి అడుగుపెట్టాలన్న ఎల్‌ఐసీ చిరకాల కోరిక నెరవేరుతుందన్నది మరికొందరి వాదన. మరోపక్క, ఈ డీల్‌ను ఐడీబీఐ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రైవేటు బ్యాంకుగా మార్చేందుకే ఈ చర్యలని ధ్వజమెత్తాయి. బ్యాంకులో ప్రభుత్వ వాటాను 51% కంటే దిగువకు తగ్గించుకోబోమంటూ మోదీ సర్కారు పార్లమెంటులో ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కుతోందని ఐడీబీఐ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ విఠల్‌ కోటేశ్వర రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి తమ డిమాండ్లను నివేదించినట్లు ఆయన వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement