Bad Bank
-
‘బ్యాడ్ బ్యాంక్’లు మంచివే..?
రూ.లక్ష లేదా రెండు లక్షల రూపాయలు బ్యాంకులు అప్పుగా ఇవ్వాలంటే సవాలక్ష పత్రాలు అడిగి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తాయి. కానీ కార్పొరేట్లు అప్పుకోసం బ్యాంకులకు వెళితే మర్యాదలు చేసిమరీ కోరి అప్పిస్తాయి. కానీ లక్షల్లో అప్పుతీసుకునే సామాన్యులే నెల కిస్తీలు సవ్యంగా చెల్లిస్తారు. కోట్లల్లో అప్పులు తీసుకునే కొందరు కార్పొరేట్లు, ఇతరులు పూర్తిగా చెల్లించేవరకు అనుమానమే. అలా తీసుకున్న అప్పు చెల్లించకుండా బ్యాంకుల వద్ద పోగవుతున్న నిరర్ధక ఆస్తుల(తిరిగి చెల్లించని అప్పులు) చిట్టా 2019 వరకు ఏకంగా రూ.9,33,779 కోట్లుగా ఉందని కేంద్ర మంత్రి కరాద్ తెలిపారు. బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు(ఎన్పీఏలు) రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం (పీఎంఈజీపీ) కింద ఇచ్చిన లోన్లను కలుపుకొని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్పీఏలు) 2019 మార్చి 31 నాటికి రూ.9,33,779 కోట్లుగా రికార్డయ్యాయని కేంద్ర మంత్రి కరాద్ ఇటీవల పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇది బ్యాంకుల అడ్వాన్స్‌ల్లో 9.07 శాతానికి సమానం. ద్రవ్యోల్బణం కారణంగా పరిస్థితులు దిగజారితే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ మరింత పెరగొచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోంది. ఇదే జరిగితే భారత బ్యాంకింగ్ రంగం తీవ్ర సంక్షోభంలోకి జారిపోయే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థకు బ్యాంకింగ్ రంగ సంక్షోభం పెను సవాల్‌గా పరిణమించే అవకాశం ఉంది. ఈ సమస్య పరిష్కారానికి నిపుణులు చూపిస్తున్న మార్గమే బ్యాడ్ బ్యాంక్. బ్యాడ్ బ్యాంక్ అంటే.. సాధారణంగా వాణిజ్య బ్యాంకులు వాటి రుణాలపై వచ్చే వడ్డీ ఆధారంగా మనుగడ సాగిస్తుంటాయి. బ్యాంకులు ఇచ్చే రుణాల ఫలితంగా కొత్త పరిశ్రమలు పుట్టుకొచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. తద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. ఒకవేళ అవే రుణాలు నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ)గా అంటే.. మొండి బకాయిలుగా మారితే బ్యాంకింగ్ వ్యవస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో బ్యాడ్ బ్యాంక్‌ల పేరిట ఓ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. వివిధ వాణిజ్య బ్యాంకుల్లో ఎటూ తేలకుండా ఉండిపోయిన ఎన్పీఏలను దీనికి బదిలీ చేస్తారు. ఏమిటి లాభం.. బ్యాడ్ బ్యాంకుల ఏర్పాటు వల్ల ఆయా ఖాతాల నుంచి రుణాలను రికవరీ చేయడం, రుణాలు తీసుకున్న సంస్థలతో చర్చలు జరపడం, లేదా ఈ మొండి బకాయిలను ఎలా తిరిగి రాబట్టాలో వంటి అంశాలపై బ్యాడ్ బ్యాంక్ దృష్టి సారిస్తుంది. ఎన్పీఏ ఖాతాలు బ్యాడ్ బ్యాంక్‌కు వెళ్లడంతో వాణిజ్య బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లో వాటి ప్రస్తావన ఉండదు. ఫలితంగా బ్యాంకు పనితీరు మెరుగుపడుతుంది. బ్యాంకు మూలధనం, డిపాజిట్లు పెరిగి బ్యాంకు అభివృద్ధికి బాటలు పడతాయి. ఏఆర్సీ ఉండగా బ్యాడ్ బ్యాంక్ ఎందుకు? బ్యాంకులు తమ వద్ద ఉన్న ఎన్పీఏలను క్లియర్ చేసుకునేందుకు ‘అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ’(ఏఆర్సీ)లను ఆశ్రయిస్తుంటాయి. ఏఆర్‌సీలు బ్యాంకుల వద్ద చౌకగా ఎన్పీఏలను కొని వాటి ఆర్థిక కార్యకలాపాలు సాగిస్తుంటాయి. అలా బ్యాంకులు ఏఆర్సీలకు ఎంతో కొంతకు ఎన్పీఏలను అమ్మడం వల్ల నష్టాలను మూటగట్టుకుంటాయి. బ్యాడ్ బ్యాంకు కూడా దాదాపు ఏఆర్సీ లాంటిదే. కానీ, బ్యాడ్ బ్యాంక్‌లకు వాణిజ్య బ్యాంకులు ఎన్పీఏలను విక్రయించవు. కేవలం బదిలీ మాత్రమే చేస్తాయి. తద్వారా సాధారణ బ్యాంకులు వాటి ప్రధాన కార్యకలాపాలపై దృష్టి సారించే అవకాశం ఏర్పడుతుంది. ఇక బ్యాడ్ బ్యాంకు ఎన్పీఏలపై పనిచేసి తిరిగి వాటిని ఎలా రాబట్టాలి... అందుకు ఉన్న వెసులుబాట్లపై దృష్టి సారిస్తుంది. రుణగ్రహీతల చెల్లింపు సామర్థ్యాన్ని అంచనా వేసి వీలైనంత మొత్తాన్ని రాబట్టేందుకు కృషి చేస్తాయి. దీని ఏర్పాటు ఇలా.. ఎన్పీఏల సమస్యను పరిష్కరించేందుకు 2017 ఆర్థిక సర్వే ‘పబ్లిక్ సెక్టార్ అసెట్ రిహాబిలిటేషన్ ఏజెన్సీ(పారా)’ను ఏర్పాటు చేయాలని అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్‌కు ప్రతిపాదించింది. దీనికి ప్రతిరూపమే బ్యాడ్ బ్యాంక్. అప్పటి నుంచి బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుపై చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో పేరుకుపోయిన నిరర్థక ఆస్తుల (ఎన్పీఏలు) ప్రభావం బ్యాంకులపై పడకుండా ఉండాలంటే ప్రభుత్వం చాలా బ్యాడ్ బ్యాంకుల్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) పేర్కొంది. ప్రముఖులు ఏమంటున్నారంటే.. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగంలో బ్యాడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయడాన్ని ఆయన రాసిన ‘ఐ డూ వాట్ ఐ డూ’ పుస్తకంలో వ్యతిరేకించారు. ప్రభుత్వానికి చెందిన ఓ ఖజానా నుంచి రుణాలను మరో ఖజానాను మార్చడం తప్ప పెద్దగా మార్పేమీ ఉండదని వ్యాఖ్యానించారు. కేవలం ప్రభుత్వ బ్యాంకులు వసూలు చేసే అసమర్థత మాత్రమే బ్యాడ్ బ్యాంకులకు బదిలీ అవుతుందని విమర్శించారు. అయితే బ్యాడ్ బ్యాంకులు ఏర్పాటు చేయాలనుకుంటే ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించాలని ‘ఇండియన్ బ్యాంక్స్: ఏ టైం టు రిఫార్మ్’ పుస్తకంలో రాజన్ సూచించారు. అప్పుడు ఎన్పీఏలను బ్యాడ్ బ్యాంకులకు తరలించాలన్నారు. మరోవైపు, ప్రముఖ వ్యాపారవేత్త ఉదయ్ కోటక్ బ్యాడ్ బ్యాంక్ ప్రతిపాదనపై ఓ సందర్భంలో అఇష్టతను చూపించారు. రికవరీలు భారీగా చేయగలిగితే తప్ప వీటివల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చునని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఎస్బీఐ మాజీ ఛైర్మన్ రజనీష్ కుమార్ బ్యాడ్ బ్యాంక్ ప్రతిపాదనను బలంగా సమర్థించారు. ఇదీ చదవండి: కస్టమర్లకు రూ.5800 కోట్లు చెల్లించనున్న గూగుల్.. ఎందుకంటే.. పెట్టుబడిదారీ వ్యవస్థను సమర్థిస్తున్నవారే బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు ప్రతిపాదనను సమర్థిస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు. ఎగవేతదార్లకు అండగా నిలవడమే దీని లక్ష్యమని ఆరోపిస్తున్నారు. ప్రత్యేక బ్యాంక్ ఏర్పాటు చేయడం కంటే ఎగవేతదార్లపై చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం చేతిలో బ్యాడ్ బ్యాంక్ కీలుబొమ్మగా మారితే ఇప్పటికే రుణాలు ఎగ్గొట్టిన కార్పొరేట్లకు మేలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. -
బడా వ్యాపారులకే ‘బ్యాడ్ బ్యాంక్’
బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఎస్బీఐ, పీఎన్బీ తదితర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ మూసివేయాలని లేక అమ్మివేయాలని కోరుకుంటున్న పార్లమెంటరీ పండితులు వాస్తవానికి ఏకాంతంలో ఉన్న సోషలిస్టులు అని చెప్పాలి. సోషలిజం అనేది బడా వ్యాపార వర్గాలకోసం ప్రత్యేకించినంత కాలం వీరు సోషలిజాన్ని గాఢంగా ప్రేమిస్తారు. అయినా సోషలిజం అంటే అర్థం ఏమిటి? పెట్టుబడులు, వనరులపై సామాజిక యాజమాన్యమే కదా. మనం సోషల్ అని చెబుతున్నప్పుడు తప్పనిసరిగా దాన్ని ప్రభుత్వ లేక రాజ్య యాజమాన్యం అనే అర్థంలోనే తీసుకుంటాం మరి. ప్రైవేట్ కంపెనీలు నిరర్థక పెట్టుబడులను పెడతాయి. నిష్ఫలమైన వ్యాపార నిర్ణయాలు తీసుకుంటాయి. కానీ వాటి ఫలితాన్ని మాత్రం పన్ను చెల్లింపుదారులే తప్పకుండా భరించాల్సి వస్తోంది. సాంప్రదాయికంగా, కంపెనీలపై, ఆస్తులపై ప్రభుత్వ యాజమాన్యం అనే భావనను ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలే పెంచి పోషించారు. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర ఉండరాదని వీరు చెబుతుంటారు. కానీ ఈ వ్యాపారస్తులు పెట్టుబడులపై తప్పుడు నిర్ణయాలు తీసుకుని, భారీ నష్టాలకు కారకులై సంస్థ మూలాలను క్షీణింపచేస్తే ఏం చేయాలి? ఇక్కడే మన ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు రంగంలోకి దిగి ఈ కంపెనీలను ప్రభుత్వం స్వాధీనపర్చుకుని వారిని శిక్షించకుండా వదిలేయాలని చెప్పేస్తుంటారు. దీని ఫలితమేంటి? పెట్టుబడిదారుల కోసం సోషలిజాన్ని ఆచరించడమే కదా! ఇప్పుడు మన దేశంలో జరుగుతున్నది అక్షరాలా ఇలాంటి సోషలిజమే. టెలికాం రంగ సంస్కరణల రూపంలో మొట్టమొదటి అమ్మకం జరిగిపోయింది. ఈ సంస్కరణల సారం ఏమిటి? టెలికాం రంగంలో ప్రైవేట్ కంపెనీలు మరింతమంది వినియోగదార్లను చేజిక్కించుకునే పరుగుపందెంలో కారుచౌక ధరలకు స్పెక్ట్రమ్ కొనుగోలు, ఎయిర్ వేవ్స్ అమ్మకాలకోసం భారీ మదుపులు పెడుతూ ఉంటాయి. రిలయన్స్, జియో రంగంలోకి వచ్చి టెలికాం రంగ పరిస్థితిని మార్చివేయడానికి ముందుగానే ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా వంటి సంస్థలు రాయితీలతో కూడిన ప్యాకేజీలు ప్రతిపాదించి, అసంఖ్యాక జీబీలకొద్దీ డేటాను ఉపయోగించుకుంటూ, సుదీర్ఘ ఫోన్ కాల్స్ చేసుకునే వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించేవి. అయితే తన వినియోగదారులకు పరిమిత కాలానికి ఉచిత డేటా ఇస్తానని ప్రతిపాదించడం ద్వారా రిలయన్స్ జియో తన పోటీ కంపెనీల కాళ్లకింది భూమిని లాగిపడేసింది. జియో శరవేగంగా విస్తరించడం ప్రారంభించగానే, ఇతర బడా టెలికాం కంపెనీలు కూడా ఇదేరకమైన తాయిలాలను అందించడానికి ప్రయత్నించాల్సి వచ్చింది. దీంతో వినియోగదారునుంచి వచ్చే సగటు రాబడి పడిపోయింది. పైగా డేటా వినియోగం పెరిగిపోయింది. దీంతో ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా కంపెనీలు అనేక త్రైమాసికాల పాటు భారీ నష్టాల బారినపడ్డాయి. జియోతో నేరుగా తలపడుతూ వొడాఫోన్, ఐడియా సంస్థలు విలీనమైనప్పుడు, భారత్‌లోనే అతిపెద్ద టెలికాం కంపెనీ (వీఐ) ఆవిర్భావానికి నాంది అయ్యింది. కానీ జియో ప్రత్యేకమైన బిజినెస్ నమూనాని పాటించడమే అసలు సమస్య అయింది. దీంతో జియో విజృంభణ ముందు నిలబడలేక, వొడాఫోన్–ఐడియా లేదా వీఐకి ఇప్పటికీ రక్తమోడటమే తప్ప మరొక అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడది రూ. 1.9 లక్షల కోట్ల భారీ రుణ ఊబిలో చిక్కుకుపోయింది. ఇప్పుడు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంస్కరణలకు కృతజ్ఞతలు చెప్పాల్సిందే మరి. అయితే, నాలుగేళ్ళ రుణ విరామ సమయం తర్వాత కూడా టెలికాం కంపెనీలు తమ బకాయిలను చెల్లించలేకపోతే, ఇవి ప్రభుత్వానికి ఈక్విటీల రూపంలో చెల్లించవచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దీంతో వొడాఫోన్–ఐడియా ప్రభుత్వ కంపెనీగా మారే అవకాశం కూడా ఉందని ఊహాగానాలు మొదలైపోయాయి కూడా. ఇన్నాళ్లుగా ప్రభుత్వ రంగం అసమర్థంగా ఉందని, ప్రైవేట్ రంగం అత్యంత సమర్థంగా పనిచేస్తోందని మనం వింటూ వచ్చాం. కానీ ఇప్పుడు మాత్రం ప్రజా ప్రయోజనాల రీత్యా వొడాఫోన్, ఐడియా సంస్థ మూతపడటాన్ని అనుమతించకూడదని మనకు చెబుతున్నారు. ఇప్పటికీ అనేకమంది చందాదారులను కలిగిన ఈ సంస్థను కాపాడాల్సిన అవసరముందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అది కూడా ప్రజా శ్రేయస్సు పేరిట పన్ను చెల్లింపుదారుల డబ్బును ఉపయోగించాలట. కాబట్టి ప్రైవేట్ టెలికాం కంపెనీలు నిరర్థక పెట్టుబడులు పెడతాయి, నిష్ప్రయోజనకరమైన నిర్ణయాలు తీసుకుంటాయి. ప్రజలు మాత్రం పన్ను చెల్లింపుదారులుగా వాటిని తాము చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవలే ప్రకటించిన బ్యాడ్ బ్యాంక్ అనే రూపంలోని మరొక సాహసోపేతమైన సంస్కరణ వెనుకఉన్న ఆలోచన కూడా ఇదే మరి. రెగ్యులర్ వాణిజ్య బ్యాంకుల ఖాతాల్లో పేరుకుపోయిన 2 లక్షల కోట్ల రూపాయల నిరర్థక రుణాలను ఈ బ్యాడ్ బ్యాంకు తీసుకుం టుంది. నిర్దిష్ట కాలంలో వాటిని రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇదెలా పనిచేస్తుంది? వ్యాపారంలో విఫలమైన కంపెనీకి కొన్ని బ్యాంకుల సముదాయం రూ. 500 కోట్లను రుణంగా ఇచ్చిందని ఊహిద్దాం. ఇలా విఫలమైన కంపెనీకి తామిచ్చిన రుణం తిరిగి రాబట్టుకోవడంపై బ్యాంకులకు ఏమాత్రం ఆసక్తి లేదనుకోండి. అప్పుడు ఈ రూ. 500 కోట్ల రుణాన్ని అవి రూ. 300 కోట్లకు అమ్మేయాలని నిర్ణయించుకుంటాయి. అంటే ఏకకాలంలో బ్యాంకులు 200 కోట్ల రూపాయలను నష్టపోతాయి. కానీ తాము ఇచ్చిన రుణంలో 60 శాతాన్ని పొందుతాయి. బ్యాడ్ బ్యాంక్ ఇలా నష్టపోయిన కంపెనీ ఆస్తులను తీసుకుని తాను బ్యాంకులకు చెల్లించిన దానికంటే ఎక్కువ మొత్తానికి వాటిని అమ్మడానికి ప్రయత్నిస్తుంది. ఇక బ్యాంకులు తాము తీసుకున్న రుణాల్లో కొంత భాగాన్ని రద్దు చేసుకుని తమ ఖాతా పుస్తకాలను క్లీన్ చేసుకుంటాయి. తొలిదశలో బ్యాడ్ బ్యాంక్ దాదాపు రూ. 90,000 కోట్ల మొండి బకాయిలను తీసుకుంటుందని భావిస్తే, దానికి చాలా మొత్తం నగదు అవసరమవుతుంది. తమ మొండి బకాయిలను బ్యాడ్ బ్యాంకుకు అమ్మివేసిన బ్యాంకులకు కనీసం 15 శాతం డబ్బు నగదు రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాలు సెక్యూరిటీ రిసిప్టులుగా ఉంటాయి. బ్యాడ్ బ్యాంకు తాను చేసిన వాగ్దానం మేరకు డబ్బు చెల్లించకలేకపోతే భారత ప్రభుత్వం దాన్ని పూరించి సార్వభౌమాధికార గ్యారంటీతో ఈ రిసిప్టులకు మద్దతిస్తుంది. అయితే దీనివల్ల లాభపడేది ఎవరు? మొండి బకాయిల్లో మెజారిటీని తమ స్వాధీనంలో ఉంచుకున్న ప్రభుత్వ రంగ బ్యాంకులే లాభపడతాయని పైకి కనిపిస్తుంది కానీ, వాస్తవానికి బడా కార్పొరేట్ సంస్థలే అతిపెద్ద లబ్ధిదారులుగా ఉంటాయి. తమ ఖాతాల నుంచి మొండి బకాయిలను పూర్తిగా పరిష్కరించిన తర్వాతే ఈ బ్యాంకులు కార్పొరేట్లకు సులువుగా రుణాలు ఇవ్వగలుగుతాయి. దీంతో అవి ఆచరణాత్మక అంచనాలతో పనిలేకుండానే మళ్లీ జూదమాడటం మొదలెడతాయి. ఈ బడా కంపెనీలే తొలి దశలో దేశంలో మొండి బకాయిల సంక్షోభానికి అసలు కారకులు అనే విషయం మర్చిపోకూడదు. మరోమాటలో చెప్పాలంటే, ఈ బ్యాంకింగ్, టెలికాం సంస్కరణలు ‘సోషలిజం’ నూతన రూపమే తప్ప మరొకటి కాదు. కానీ ఈసారి మాత్రం ఈ సోషలిజం ప్రత్యేకించి పెట్టుబడిదారులకే వర్తిస్తుంది. బ్యాడ్ బ్యాంక్ అంటే ఏమిటి? దేశంలో తొలి బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో గత నాలుగేళ్లుగా దీనిపై సాగుతున్న చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లయింది. గత ఏడాది బడ్జెట్లోనే నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏఆర్సీఎల్) గురించి ప్రస్తావించారు. ఇంతకీ బ్యాడ్ బ్యాంక్ అంటే ఏమిటి? దేశంలో వ్యాపారసంస్థల వద్ద పేరుకుపోయిన మొండి బకాయిలను తీసుకుని వాటికి పరిష్కారం చూపే ఒక రకమైన ఆర్థిక సంస్థ బ్యాండ్ బ్యాంక్. కంపెనీలు పేరుకుపోయిన మొండిబకాయిలను ఈ బ్యాడ్ బ్యాంకుకి అప్పగిస్తే వాటిని ఎన్ఏఆర్సీఎల్ స్వాధీనపర్చుకుని వాటిని మార్కెట్లో విక్రయించేందుకు ప్రయత్నిస్తుంది. కంపెనీలు కాస్త నష్టానికి తమ అప్పులను బ్యాడ్ బ్యాంకుకు స్వాధీనపరిస్తే, వాటిని అధిక ధరకు అమ్మడంద్వారా లబ్ధిపొందాలనేది బ్యాడ్ బ్యాంక్ లక్ష్యం. మొత్తం ఎలా పరిణమిస్తుందనేది భవిష్యత్తులో తేలాల్సి ఉంది. -అనింద్యో చక్రవర్తి, సీనియర్ ఆర్థిక విశ్లేషకులు -
బ్యాడ్ బ్యాంక్‌కు సావరిన్ గ్యారంటీ
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ మొండిబకాయిల భారం తగ్గించేందుకు ఏర్పాటుకానున్న ప్రతిపాదిత నేషనల్ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఏఆర్సీఎల్) లేదా బ్యాడ్ బ్యాంక్ జారీ చేసే రిసిట్స్‌కు ప్రభుత్వ (సావరిన్) గ్యారంటీ లభించింది. ఇందుకు సంబంధించి రూ.30,600 కోట్లు కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విలేకరులకు గురువారం ఈ విషయాన్ని తెలిపారు. ప్రతిపాదిత బ్యాడ్ బ్యాంక్... ఎన్ఏఆర్సీఎల్ జారీ చేసే సెక్యూరిటీ రిసిట్స్‌కు ప్రభుత్వం గ్యారెంటీగా ఉండే ప్రతిపాదనకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని క్యాబినెట్ సమావేశం బుధవారమే ఆమోదముద్ర వేసింది. అయితే ఇందుకు సంబంధించి రూ.30,600 కోట్ల నిధుల కేటాయింపు జరుపుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థికమంత్రి తాజాగా తెలిపారు. గత ఆరు సంవత్సరాల్లో బ్యాంకులు రూ.5.01 లక్షల కోట్ల రుణ రికవరీ చేశాయని నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా తెలిపారు. 2018 మార్చి నుంచీ చూస్తే ఈ విలువ రూ.3.1 లక్షల కోట్లుగా ఉందని పేర్కొన్నారు. నవంబర్‌కల్లా లైసెన్సులు బ్యాంకింగ్ మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్య పరిష్కారం దిశలో ఇండియన్ బ్యాంక్స్ అసోషియేషన్ (ఐబీఏ) బ్యాడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. లైసెన్స్ మంజూరీకి గత నెల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు ఐబీఏ దరఖాస్తు చేసింది. వచ్చే రెండు నెలల్లో దీనికి ఆర్బీఐ ఆమోదముద్రవేసే అవకాశాలు కూడా ఉన్నాయని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. నిర్వహణా తీరు ఇది... ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం, ఒక బ్యాంక్ నుంచి మొండిబకాయి (ఎన్పీఏ) కొనే సందర్భంలో, అంగీకరించిన విలువలో 15 శాతం వరకూ ఎన్ఏఆర్సీఎల్ నగదు రూపంలో చెల్లిస్తుంది. మిగిలిన 85 శాతం కేంద్ర హామీతో కూడిన సెక్యూరిటీ రిసిట్స్ ఉంటాయి. ఏదైనా ఎన్పీఏ కొనుగోలుకు సంబంధించి ప్రవేశ విలువలో నష్టం జరిగితే ప్రభుత్వ హామీ భరోసాగా ఉంటుంది. రిసిట్స్‌కు గ్యారంటీ ఐదేళ్లు... ఆర్థిక సేవల కార్యదర్శి దేబాíÙష్ పాండా తెలిపిన సమాచారం ప్రకారం, రిసిట్స్‌కు సావరిన్ గ్యారంటీ ఐదేళ్ల కాలానికి వర్తిస్తుంది. రిసిట్స్ విలువకు ఎన్ఏఆర్సీఎల్ ఫీజుకూడా చెల్లించాలి. తొలి దశలో దీనికి 0.25 శాతం ఫీజు ఉంటుంది. మొండిబకాయిల పరిష్కారం విషయంలో ఆలస్యం అయితే ఈ ఫీజు 0.5 శాతం వరకూ పెరుగుతంది. ఈ బ్యాకప్ వ్యవస్థ మొత్తం మొండిబకాయిల భారం సత్వర పరిష్కారానికి, బ్యాంకింగ్‌కు త్వరిత గతిన నిధుల లభ్యతకు, తద్వారా తదుపరి బ్యాంకింగ్ రుణ పంపిణీ పురోగతికి దోహదపడే అంశమని ఆయన వివరించారు. 2021–22 బడ్జెట్ చూస్తే... 2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఆర్థికమంత్రి బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు ప్రతిపాదన చేశారు. ‘‘మొండిబకాయిల నిర్వహణకు అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ ఏర్పాటు జరుగుతుంది. ఒత్తిడిలో ఉన్న రుణ బకాయిని ఈ కంపెనీ తన ఆ«దీనంలోనికి తీసుకుని నిర్వహిస్తుంది లేదా ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ లేదా ఇతర అర్హత కలిగిన ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ ప్రాతిపదికన విక్రయిస్తుంది. తద్వారా రుణ బకాయికి తగిన విలువను పొందుతుంది’’ అని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. వాటాలు ఇలా.. ఎన్ఏఆర్సీఎల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 51 శాతంగా ఉండనుంది. మిగిలిన వాటాను ప్రైవేటు రంగ బ్యాంకులు కలిగిఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేటు, ఎన్‌బీఎఫ్‌సీలుసహా ఎన్ఏఆర్సీఎల్లో 16 మంది షేర్హోల్డర్లు ఉంటారు. ఎన్ఏఆర్సీఎల్లో 12 శాతం వాటాతో లీడ్ స్పాన్సర్‌గా ఉండామన్న ఆకాంక్షను ప్రభుత్వ రంగ కెనరాబ్యాంక్ వ్యక్తం చేసింది. తొలి దశలో బ్యాడ్ బ్యాంక్‌కు బదలాయించడానికి 22 మొండి బకాయిలను గుర్తించినట్లు సమాచారం. వీటి విలువ దాదాపు రూ.89,000 కోట్లు. రానున్న కొద్ది కాలంలో దాదాపు రూ.2 లక్షల కోట్ల మొండిబకాయిలను ఎన్ఏఆర్సీఎల్ నిర్వహిస్తుందని (కొనుగోలు చేస్తుందని) అంచనా. ‘4ఆర్’ విధానం ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు మరింత మెరుగుపడ్డానికి ‘4ఆర్’ వ్యూహాన్ని కేంద్రం అనుసరిస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. సమస్య గుర్తింపు (రికగ్నేõÙన్), పరిష్కారం (రిజల్యూషన్), అవసరమైన మూలధన కల్పన (రీక్యాపిటలైజేషన్), సంస్కరణలు (రిఫార్మ్) ‘4ఆర్’లో ఉన్నట్లు వివరించారు. కాగా, బ్యాడ్ బ్యాంక్ ఏదైనా ఎన్పీఏ కొనుగోలుకు సంబంధించి ప్రవేశ విలువలో నష్టం జరిగే సందర్భాలు తక్కువగానే ఉండవచ్చని, ఆ నష్టం ఏ స్థాయిలో ఉంటుందని ఇప్పుడు ఊహించడం సరికాదని ఈ సందర్భంగా సూచించారు. అందువల్ల రిసిట్స్‌కు ప్రభుత్వ గ్యారెంటీ వల్ల ప్రస్తుతానికి ఆర్థిక భారం కేంద్రంపై ఉండబోదని స్పష్టం చేశారు. -
ఎన్ఏఆర్సీఎల్ జారీ చేసే సెక్యూరిటీ రిసిప్ట్స్‌కు కేంద్రం గ్యారంటీ
-
ఎన్ఏఆర్సీఎల్ జారీ చేసే సెక్యూరిటీ రిసిప్ట్స్‌కు కేంద్రం గ్యారంటీ
ఎన్ఏఆర్సీఎల్ రూ.30,600 కోట్ల వరకు జారీ చేసే సెక్యూరిటీ రిసిప్ట్స్‌కు ప్రభుత్వం గ్యారంటీగా ఉండే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం సెప్టెంబర్ 16న ఆమోదం తెలిపింది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఎన్ఏఆర్సీఎల్(నేషనల్ అసెట్ రీకన్ స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్) జారీ చేసే సెక్యూరిటీ రిసిట్స్‌కు సావరిన్(ప్రభుత్వ) గ్యారంటీ లభించనుంది. మొండిబకాయిలకి సంబంధించి ఆమోదిత విలువలో 15 శాతం ఎన్ఏఆర్సీఎల్ నగదు రూపంలో చెల్లిస్తుంది. మిగిలిన 85 శాతం ప్రభుత్వ హామీతో కూడిన సెక్యూరిటీ రిసిప్ట్స్ ఉంటాయని కేంద్రం పేర్కొంది. గత ఆరు ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు రూ.5,01,479 కోట్లు రికవరీ చేసినట్లు ఆర్ధిక మంత్రి తెలిపారు. ఇందులో రూ.3.1 లక్షల కోట్లు 2018 మార్చి నుంచి రికవరీ చేయబడ్డాయి. ఏదైనా ఎన్పీఏ కొనుగోలుకు సంబంధించి ప్రవేశ విలువలో నష్టం జరిగితే ప్రభుత్వ హామీ భరోసాగా ఉంటుంది అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి మీడియాతో మాట్లాడుతూ.."ఎన్పీఏలను నిర్వహించడం కోసం మేము ఇండియా డెట్ రిజల్యూషన్ కంపెనీ లిమిటెడ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ కంపెనీలో పీఎస్బిలు, ప్రభుత్వ యాజమాన్యంలోని ఆర్థిక సంస్థలు 49% వాటాను కలిగి ఉంటాయి. అలాగే, ప్రైవేటు రంగ బ్యాంకులు కూడా వాటాను కలిగి ఉంటాయని" ఆమె తెలిపారు. (చదవండి: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫెస్టివల్ బొనాంజా ఆఫర్లు..!) "మొండిబకాయిలకి సంబంధించి బ్యాంకులకు 15 శాతం నగదు చెల్లింపు చేయనున్నాము. 85 శాతం ప్రభుత్వ హామీతో కూడిన సెక్యూరిటీ రిసిప్ట్స్ జారీ చేస్తాము. ఆ బ్యాంకులకు బ్యాక్ స్టాప్ గ్యారెంటీ ఉంటుంది" అని ఆమె తెలిపింది. భద్రతా రసీదులు బ్యాక్ స్టాప్ నిధులను అందిస్తాయని, ఐదేళ్లపాటు మాత్రమే బాగుంటుందని సీతారామన్ తెలిపారు. ఆర్థిక సేవల కార్యదర్శి దేబాషిష్ పాండా మాట్లాడుతూ.. ఎన్ఏఆర్సీఎల్ ను ఇప్పటికే ఒక సంస్థగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తొలి దశలో రూ.90,000 కోట్ల విలువైన ఎన్పీఏలను ఎన్ఏఆర్సీఎల్ కు బదిలీ చేస్తామని ఆయన చెప్పారు. -
బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటులో కీలక అడుగు
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ మొండి బకాయిల (ఎన్పీఏ) పరిష్కారంలో భాగంగా ప్రతిపాదిత బ్యాడ్ బ్యాంక్ లేదా నేషనల్ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఏఆర్సీఎల్) ఏర్పాటు దిశలో కీలక అడుగు పడింది. ఎన్ఏఆర్సీఎల్ జారీ చేసే సెక్యూరిటీ రిసిప్ట్స్‌కు ప్రభుత్వం గ్యారంటీగా ఉండే ప్రతిపాదనకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని క్యాబినెట్ సమావేశం బుధవారం ఆమోదముద్ర వేసింది. తాజా నిర్ణయంతో ఎన్ఏఆర్సీఎల్ జారీ చేసే సెక్యూరిటీ రిసిట్స్‌కు సావరిన్ (ప్రభుత్వ) గ్యారంటీ లభించనుంది. ప్రభుత్వ గ్యారెంటీ తొలి దశలో దాదాపు రూ.31,000 కోట్లు ఉంటుందని బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు బాధ్యతలను పర్యవేక్షిస్తున్న ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) అంచనావేస్తోంది. మొండిబకాయికి సంబంధించి ఆమోదిత విలువలో 15 శాతం ఎన్ఏఆర్సీఎల్ నగదులో చెల్లిస్తుంది. మిగిలిన 85 శాతం ప్రభుత్వ హామీతో కూడిన సెక్యూరిటీ రిసిప్్ట్స’ ఉంటాయని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. ఏదైనా ఎన్పీఏ కొనుగోలుకు సంబంధించి ప్రవేశ విలువలో నష్టం జరిగితే ప్రభుత్వ హామీ భరోసాగా ఉంటుంది. లైసెన్స్‌కు ఇప్పటికే దరఖాస్తు.. రూ.6,000 కోట్ల బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుకు సంబంధించి లైసెన్స్‌కు ఐబీఏ గతవారం ఆర్బీఐని సంప్రదించింది. వచ్చే రెండు నెలల్లో ఈ లైసెన్స్ జారీ అవకాశం ఉంది. ఎన్ఏఆర్సీఎల్ ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 51 శాతంగా ఉండనుంది. మిగిలిన వాటాను ప్రైవేటు రంగ బ్యాంకులు కలిగిఉంటాయి. ఎన్ఏఆర్సీఎల్లో 12 శాతం వాటాతో లీడ్ స్పాన్సర్‌గా ఉందామన్న ఆకాంక్షను ప్రభుత్వ రంగ కెనరాబ్యాంక్ వ్యక్తం చేసింది. తొలి దశలో బ్యాడ్ బ్యాంక్‌కు బదలాయించడానికి 22 మొండి బకాయిలను గుర్తించినట్లు సమాచారం. వీటి విలువ దాదాపు రూ.89,000 కోట్లు. -
ఆర్బీఐ ముందుకు బ్యాడ్‌బ్యాంక్ లైసెన్స్ దరఖాస్తు!
న్యూఢిల్లీ: నేషనల్ అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏఆర్సీఎల్)కు సంబంధించి లైసెన్స్ కోసం ఆర్బీఐకి త్వరలోనే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) దరఖాస్తు చేసుకోనుంది. ఈ విషయాన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బ్యాంకింగ్, ఎన్బీఎఫ్సీ రంగంలో వసూలు కాని మొండి బకాయిల సమస్యకు పరిష్కారంగా ఎన్ఏఆర్సీఎల్ఎల్ (బ్యాడ్ బ్యాంకు) ఏర్పాటును 2021–22 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రతిపాదించిన విషయం తెలిసిందే. రూ.100 కోట్ల అధీకృత మూలధనంతో కేంద్ర ప్రభుత్వ సంస్థగా ఈ నెల 7న ఎన్ఏఆర్సీఎల్ను ఏర్పాటు చేసినట్టు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఫైలింగ్స్ చెబుతున్నాయి. ఆర్బీఐ నుంచి అనుమతి వచ్చినట్టయితే ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించేందుకు మార్గం సుగమం అవుతుంది. -
మొండిబాకీల వసూళ్లు,లైసెన్సు కోసం సన్నాహాలు
న్యూఢిల్లీ: మొండిబాకీల వసూళ్ల కోసం ఉద్దేశించిన బ్యాడ్ బ్యాంక్ (నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ–ఎన్ఏఆర్సీఎల్)ని ముంబైలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మిగతా లాంఛనాలు పూర్తి చేసే ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నాయి. తదుపరి ఆర్బీఐ నుంచి అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్సీ)గా లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుందని వివరించాయి. కెనరా బ్యాంకు సారథ్యంలోని ప్రభుత్వ బ్యాంకులకు ఇందులో మెజారిటీ వాటాలు ఉంటాయి. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్ మొదలైనవి మూలధనం సమకూర్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్ఏఆర్సీఎల్ మూలధనం రూ. 7,000 కోట్లుగా ఉండనుంది. ఇందులో కేంద్రం నేరుగా వాటాలు తీసుకోకపోయినప్పటికీ ఎన్ఏఆర్సీఎల్ జారీ చేసే సెక్యూరిటీ రిసీట్స్‌కు పూచీకత్తు మాత్రం ఇస్తుంది. ఇందుకు ప్రభుత్వం రూ. 31,000 కోట్లు కేటాయించింది. బ్యాంకుల నుంచి మొండిబాకీలను కొనుగోలు చేసి, వాటిని రికవర్ చేయడంపై ఎన్ఏఆర్సీఎల్ కసరత్తు చేస్తుంది. దీనికి బదలాయించేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికే రూ. 82,500 కోట్ల విలువ చేసే 22 అసెట్స్‌ను గుర్తించాయి. -
బ్యాడ్ బ్యాంక్‌కు రంగం సిద్ధం!
న్యూఢిల్లీ: మొండి బకాయిల పరిష్కారంలో భాగంగా ప్రతిపాదిత బ్యాడ్ బ్యాంక్ లేదా నేషనల్ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఏఆర్సీఎల్) ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోంది. ఇందుకు తొలి అడుగుగా ఎన్ఏఆర్సీఎల్ జారీ చేసే సెక్యూరిటీ రిసిప్‌్ట్సకు ప్రభుత్వం గ్యారెంటీగా ఉండే ప్రతిపాదనకు త్వరలో కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర పడే అవకాశం ఉందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ గ్యారెంటీ తక్షణం దాదాపు రూ.31,000కోట్లు ఉంటుందని బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు బాధ్యతలను పర్యవేక్షిస్తున్న ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) అంచనావేసింది. మొండిబకాయికి సంబంధించి ఆమోదిత విలువలో 15 శాతం ఎన్ఏఆర్సీఎల్ నగదులో చెల్లిస్తుంది. మిగిలిన 85 శాతం ప్రభుత్వ హామీతో కూడిన సెక్యూరిటీ రిసిప్‌్ట్సగా ఉంటాయని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్ఏఆర్సీఎల్ జారీ చేసే సెక్యూరిటీ రిసిట్స్‌కు సావరిన్ (ప్రభుత్వ) గ్యారెంటీ లభించేందుకు క్యాబినెట్ ఆమోదం తప్పనిసరని సంబంధిత వర్గాలు తెలిపాయి. అమల్లో కీలక అడుగు! : 2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బ్యాడ్ బ్యాంక్ ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదన అమలుకు తొలుత సెక్యూరిటీ రిసిప్‌్ట్సకు ప్రభుత్వం గ్యారెంటీకి సంబంధించి క్యాబినెట్ ఆమోదం కీలకం. ‘‘ప్రస్తుత మొండిబకాయిల నిర్వహణకు అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ ఏర్పాటు జరుగుతుంది. ఒత్తిడిలో ఉన్న రుణ బకాయిని ఈ కంపెనీ తన ఆ«దీనంలోనికి తీసుకుని నిర్వహిస్తుంది లేదా ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ లేదా ఇతర అర్హత కలిగిన ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ ప్రాతిపదికన విక్రయిస్తుంది. తద్వారా రుణ బకాయికి తగిన విలువను పొందుతుంది’’ అని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం పేర్కొంది. ఎన్ఏఆర్సీఎల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 51 శాతంగా ఉండనుంది. మిగిలిన వాటాను ప్రైవేటు రంగ బ్యాంకులు కలిగిఉంటాయి. ఎన్‌ఏఆర్‌సీల్‌లో 12 శాతం వాటాతో లీడ్ స్పాన్సర్‌గా ఉండామన్న ఆకాంక్షను ప్రభుత్వ రంగ కెనరాబ్యాంక్ వ్యక్తం చేసింది. తొలి దశలో బ్యాడ్ బ్యాంక్‌కు బదలాయించడానికి 22 మొండి బకాయిలను గుర్తించినట్లు సమాచారం. వీటి విలువ దాదాపు రూ.89,000 కోట్లు. రానున్న కొద్ది కాలంలో దాదాపు రూ.2 లక్షల కోట్ల మొండిబకాయిలను నేషనల్ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ నిర్వహిస్తుందని అంచనా. ఎన్పీఏల పరిష్కారంలో ఇది మంచి పురోగతి అవుతుందని అంచనా. -
బ్యాడ్ బ్యాంక్‌లు ఎక్కువే కావాలి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు ఎదుర్కొంటున్న మొండి బకాయిల సమస్య పరి ష్కారానికి పలు బ్యాడ్ బ్యాంకుల అవసరం ఉందని, దీనిని ప్రభుత్వం పరిశీలించాలంటూ పరిశ్రమల మండలి సీఐఐ కోరింది. బడ్జెట్ ముందు ప్రభుత్వానికి వినతిపత్రం రూపంలో పలు సూచనలు చేసింది. బ్యాంకుల బ్యాలన్స్షీట్లలోని నిరర్థక ఆస్తుల కొనుగోలుకు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ), ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్)ను అనుమతించాలని కోరింది. ‘‘కరోనా పరిణామం తర్వాత మార్కెట్ ఆధారితంగా సరైన ధర నిర్ణయించే యాంత్రాంగం అవసరం. అంతర్జాతీయంగా, దేశీయంగా నిధుల లభ్యత భారీగా ఉన్నందున ఒకటికి మించిన బ్యాడ్ బ్యాంకులు ఈ సమస్యను పారదర్శకంగా పరిష్కరించగలవు. రుణ క్రమాన్ని తిరిగి గాడిన పెట్టగలవు’’ అంటూ సీఐఐ ప్రెసిడెంట్ ఉదయ్‌కోటక్ చెప్పారు. మార్కెట్ ఆధారిత బలమైన యంత్రాంగం ఉంటే.. ప్రభుత్వరంగ బ్యాంకులు తమ మొండి బకాయిలను ఎటువంటి భయాలు లేకుండా విక్రయించుకోగలవన్నారు. స్వచ్ఛమైన బ్యాలన్స్ షీట్లతో అప్పుడు ప్రభుత్వరంగ బ్యాంకులు మార్కెట్ నుంచి నిధులు సమీకరించుకోగలవని.. దాంతో ప్రభుత్వం మూలధన నిధుల సాయం చేయాల్సిన అవసరం తప్పుతుందని సూచించారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ చెందుతుండడంతో పరిశ్రమ నుంచి రుణాల కోసం వచ్చే డిమాండ్లను బ్యాంకులు తీర్చాల్సి ఉంటుందన్నారు. -
అది ‘బ్యాడ్’ ఐడియా..!
న్యూఢిల్లీ: కొన్ని కీలక అంశాల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా మొండిబాకీల వసూళ్ల కోసం ప్రత్యేకంగా బ్యాంక్ (బ్యాడ్ బ్యాంక్) ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం లేదని కొటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కొటక్ అభిప్రాయపడ్డారు. ‘వ్యవస్థ స్థాయిలో బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలంటే రెండు, మూడు కీలక సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. మొండిబాకీలను బ్యాడ్ బ్యాంక్‌కు ఏ రేటుకు విక్రయిస్తారనేది మొదటి అంశం. పారదర్శకంగా, సముచితమైన విధంగా విలువను నిర్ధారించడం జరగాలి. ఇక బ్యాడ్ బ్యాంక్ గవర్నెన్స్‌పై అత్యంత స్పష్టత ఉండాలి. చివరిగా రికవరీ రేటు ఎలా ఉంటుందనే దానిపైనా స్పష్టత ఉండాలి. ఇదంతా ప్రజాధనం. రికవరీ బాగా ఉంటుందంటే బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేయొచ్చు. లేకపోతే అర్థం లేదు’ అని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కొత్త ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సందర్భంగా సోమవారం కొటక్ తెలిపారు. గతంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) కూడా ఇలాగే మొండి బాకీల వసూలు కోసం స్ట్రెస్డ్ అసెట్స్ స్థిరీకరణ ఫండ్ (ఎస్‌ఏఎస్‌ఎఫ్) ఏర్పాటు చేసినప్పటికీ పెద్దగా ప్రయోజనం కనిపించని విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 2004–05లో ఏర్పాటైన ఎస్‌ఏఎస్‌ఎఫ్‌కు 636 మొండి పద్దులకు సంబంధించి సుమారు రూ. 9,000 కోట్ల ఎన్పీఏలను బదలాయించారు. 2013 మార్చి ఆఖరునాటికి దీని ద్వారా సగానికన్నా తక్కువగా కేవలం రూ. 4,000 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఎన్పీఏల రికవరీకి ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన మూడు–నాలుగేళ్లకోసారి తెరపైకి వస్తూనే ఉంది. తాజాగా గత నెలలో జరిగిన ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ) సమావేశంలో కూడా ఇది చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఉదయ్ కొటక్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కార్పొరేట్లు మారాలి..: ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించే దిశగా దేశీ కార్పొరేట్లు ఆలోచనా ధోరణిని కొంత మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని కొటక్ చెప్పారు. పెట్టుబడుల విషయంలో సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. స్థాయికి మించిన రుణాలు లేని కంపెనీలు ప్రస్తుత కరోనా వైరస్ సంక్షోభంలోనూ కనిపిస్తున్న వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని కొటక్ సూచించారు. కొత్తగా వ్యూహాత్మక రంగాల్లో సాహసోపేతంగా మరిన్ని పెట్టుబడులు పెట్టాలన్నారు. కరోనా పరిణామాలతో గణనీయంగా కన్సాలిడేషన్ జరగవచ్చని, పలు రంగాల్లో కేవలం కొన్ని సంస్థలు మాత్రమే మిగలవచ్చని కొటక్ చెప్పారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ నిర్వహణ వ్యయాలు, తక్కువ రుణభారం ఉన్న సంస్థలు కొత్త అవకాశాలను అందిపుచ్చుకునే స్థితిలో ఉన్నాయని విశ్వసిస్తున్నాను‘ అని ఆయన పేర్కొన్నారు. విద్య, వైద్యంపై పెట్టుబడులు పెరగాలి.. ఆత్మనిర్భర భారత్ లక్ష్యాన్ని సాధించాలంటే వైద్యం, విద్య, పర్యావరణం, గ్రామీణ మౌలిక సదుపాయాలు మొదలైన సామాజిక రంగాల్లో పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందని కొటక్ తెలిపారు. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 1.3%గా ఉన్న వైద్య రంగ పెట్టుబడులు కనీసం 5 నుంచి 10%కి పెరగాలని చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్ట్మెంట్లు ఉండాలని కొటక్ సూచించారు. -
ఎల్ఐసీ మెడకు ‘మొండి’బండ!
షేర్లు.. బంగారం.. డిపాజిట్లు... ఇలా ఎందులోనైనా ఎవరైనా లాభాలను ఆశించే పెట్టుబడి పెడతారు! అయితే, లాభాల మాట దేవుడెరుగు... నష్టాలొస్తున్నా పదేపదే వాటిలోనే పెట్టుబడి పెట్టేవారినేమంటారు? మన దేశంలోనైతే ‘ఎల్ఐసీ’ అంటారేమో!! ఈ ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఇప్పుడు సర్కారుకు ఆపద్బాంధవుడిగా మారింది. తీవ్రమైన మొండిబాకీలతో కుదేలైన ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లలో ఎల్ఐసీ పెట్టిన పెట్టుబడులన్నీ నష్టాలనే మిగులుస్తున్నాయి. అయినా, ఎక్కడా వెనక్కి తగ్గకుండా నష్టాల ప్రయాణంలో మరింత కూరుకుపోతుండటం ఒక్క ఎల్ఐసీకే చెల్లుతుందేమో. వేల కోట్ల రూపాయల మొండిబాకీలతో గుదిబండగా మారిన ఐడీబీఐ బ్యాంకులో రూ.13 వేల కోట్ల పెట్టుబడులకు ఎల్ఐసీ సిద్ధం కావడం ఇందుకు నిదర్శనం. ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండిబాకీలను భరించే ‘బ్యాడ్’ బ్యాంక్‌గా ఎల్ఐసీ మారుతోందన్నది కొంత మంది విశ్లేషకుల మాట!! సాక్షి, బిజినెస్ విభాగం : స్టాక్ మార్కెట్లో ఎల్ఐసీ జోరుగానే పెట్టుబడులు పెడుతూ ఉంటుంది. కొన్నింటిపై లాభాలు కూడా దండిగానే వస్తున్నాయి. అయితే, ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్బీ) షేర్లలో వెచ్చించిన ఇన్వెస్ట్మెంట్లు మాత్రం ఎల్ఐసీ జేబుకు చిల్లుపెడుతూనే ఉన్నాయి. గడిచిన రెండున్నరేళ్లలో మొత్తం 21 పీఎస్బీలకు గాను 18 పీఎస్బీల్లో చేసిన పెట్టుబడులపై ఎల్ఐసీ భారీస్థాయిలోనే నష్టాలను మూటగట్టుకోవడం గమనార్హం. ఈ 21 పీఎస్బీల్లో ఎల్ఐసీకి 1 శాతం కంటే ఎక్కువ వాటానే ఉంది. 2015 డిసెంబర్ నాటి షేర్ల ధరలతో పోలిస్తే... కేవలం 3 ప్రభుత్వ బ్యాంకుల్లో పెట్టుబడులు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి. వీటిలో ఇండియన్ బ్యాంక్(షేరు 168 శాతం పెరిగింది), విజయా బ్యాంక్(43 శాతం అప్), ఎస్బీఐ(4 శాతం అప్) ఉన్నాయి. ఆర్బీఐ మేలుకొలిపినా... 2015 డిసెంబర్ నుంచి చూస్తే... ఎల్ఐసీ ఇప్పటివరకూ పీఎస్బీ షేర్లలో చేసిన పెట్టుబడుల విలువ 8 శాతం పైగానే హరించుకుపోయింది. ఈ పీఎస్బీలన్నీ మొండిబకాయిల(ఎన్పీఏ) ఊబిలో కూరుకుపోయి తీవ్రమైన నష్టాలను మూటగట్టుకుంటుండంతో వాటి షేర్ల విలువలు రోజురోజుకూ కుదేలైపోతున్నాయి. అయినాసరే ఎల్ఐసీ మాత్రం కొత్తగా వాటి షేర్లను కొనుగోలు చేస్తూనే ఉంది. విచిత్రం ఏంటంటే... మొండి బకాయిలపై ఆర్బీఐ కొరడా ఝుళిపించడం మొదలెట్టిన తర్వాత(2015 ద్వితీయార్థం నుంచి) కూడా పీఎస్బీ షేర్లలో ఎల్ఐసీ కొత్తగా పెట్టుబడులు పెట్టడం!! అప్పటినుంచి చూస్తే దేనా బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర షేర్ల విలువలు 60 శాతంపైగా పడిపోయాయి. మొత్తం 9 ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్ల ధరలు 50 శాతంపైగా క్షీణించగా... ఆరు బ్యాంకుల షేర్ల విలువ 30–50 శాతం మేర పతనమైంది. ఎల్ఐసీ పెట్టుబడులపై ఆధారపడొద్దని, బ్యాంకింగ్ వ్యవస్థకు ఇది మంచిదికాదంటూ ఆర్బీఐ చాన్నాళ్ల క్రితమే హెచ్చరించడం గమనార్హం. కాగా, మొండిబకాయిలు తారస్థాయికి ఎగబాకిన 11 బ్యాంకులను ఆర్బీఐ దిద్దుబాటు చర్యల్లో భాగంగా(పీసీఏ) తన పర్యవేక్షణలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీటి ఎన్పీఏలు రూ.10,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్ల స్థాయిలో ఉన్నాయి. అంటే ఇవి కొత్తగా రుణాలివ్వడం ఇతరత్రా అంశాలపై ఆర్బీఐ ఆంక్షలు కొనసాగుతాయి. ఈ 11 బ్యాంకు షేర్లలో ఎల్ఐసీ భారీగానే పెట్టుబడులు పెట్టింది. ఎల్ఐసీకి 10 శాతంపైగా వాటా ఉన్న ఆరు ప్రభుత్వ బ్యాంకుల మొండిబకాయిలు... వ్యవస్థలోని మొత్తం ఎన్‌పీఏల్లో 8 శాతానికి సమానం. అంటే.. ఈ మొండిబకాయిలన్నీ ఒకరకంగా ఎల్ఐసీ మెడకు చుట్టుకున్నట్లే!! ఎస్బీఐలో అత్యధిక పెట్టుబడి... ఈ ఏడాది మార్చి నాటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)షేర్లలో ఎల్ఐసీకి రూ.22,770 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. అయితే, వాటా పరంగా చూస్తే పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) టాప్‌లో ఉంది. ఇందులో ఎల్ఐసీకి అత్యధికంగా 14.2 శాతం వాటా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో కార్పొరేషన్ బ్యాంక్(ఎల్ఐసీ వాటా 13 శాతం), అలహాబాద్ బ్యాంక్(12.4 శాతం వాటా) ఉన్నాయి. ఇక ఐడీబీఐ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల్లో కూడా 10 శాతం పైగానే వాటాలు ఎల్ఐసీకి ఉండటం గమనార్హం. 2015 డిసెంబర్ నాటికి మొత్తం బ్యాంకింగ్ షేర్లలో ఎల్ఐసీ పెట్టుబడుల విలువ రూ.78,000 కోట్లు. ఇందులో పీఎస్‌బీల వాటా రూ.42,480 కోట్లు కాగా, ప్రైవేటు బ్యాంకుల వాటా రూ.35,520 కోట్లు. ఈ ఏడాది మార్చి నాటికి బ్యాంకుల్లో ఎల్ఐసీ పెట్టుబడి విలువ రూ.92,730 కోట్లకు ఎగబాకింది. అయితే, పీఎస్బీల్లో వాటాలను పెంచుకున్నప్పటికీ.. వాటి విలువ రూ.38,830 కోట్లకు పడిపోగా, ప్రైవేటు బ్యాంకుల్లో పెట్టుబడుల విలువ మాత్రం రూ.53,900 కోట్లకు చేరడం గమనార్హం. వాస్తవానికి మొత్తం ఎల్ఐసీ పెట్టుబడుల్లో పీఎస్‌బీల వాటా చాలా తక్కువనే చెప్పాలి. 2017 డిసెంబర్ నాటికి ఎల్ఐసీ తనదగ్గరున్న పాలసీదారుల నిధుల్లో రూ.15.4 లక్షల కోట్లను ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడిగా పెట్టింది. ఇక షేర్లలో రూ.4.8 లక్షల కోట్లు, డిబెంచర్లు–బాండ్లలో రూ.76,100 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. ప్రైవేటు బ్యాంకులతో లాభాలు... ప్రభుత్వ బ్యాంకు షేర్లలో చేతులుకాల్చుకుంటున్న ఎల్ఐసీకి ప్రైవేటు బ్యాంకులు మాత్రం ఆదుకుంటుండటం విశేషం. ఎల్ఐసీకి ఒక శాతం కంటే అధికంగా వాటా ఉన్న 9 ప్రైవేటు బ్యాంకుల్లో పెట్టుబడులన్నీ ప్రస్తుతం లాభాల్లోనే ఉన్నాయి. 2015 డిసెంబర్ నుంచి చూస్తే... ప్రైవేటు బ్యాంకుల్లో ఇన్వెస్ట్మెంట్ విలువ 50 శాతం మేర ఎగబాకింది. ఇందులో హెచ్డీఎఫ్సీ బ్యాంక్(షేరు ధర 95 శాతం వృద్ధి), యస్ బ్యాంక్(134 శాతం అప్) ప్రధానంగా ఉన్నాయి. బ్యాడ్ బ్యాంకా.. ఎందుకు ఎల్ఐసీ ఉందిగా! పీఎస్‌బీల మొండిబకాయిల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఒక అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ(దీన్నే బ్యాడ్ బ్యాంక్‌గా పేర్కొంటున్నారు) ఏర్పాటు చేయాలంటూ తాజాగా ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇవ్వడం తెలిసిందే. అయితే, ఇలాంటి బ్యాంకులన్నింటిలో మెజారిటీ వాటాను ఎల్ఐసీ చేత కొనిపించి.. చేతులుదులుపుకుంటే సరిపోయేదానికి మళ్లీ బ్యాడ్ బ్యాంక్ పేరుతో కొత్తగా ఒక సంస్థను ఏర్పాటు చేయడమెందుకంటూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నవారు కూడా ఉన్నారు. ఎందుకంటే మొండిబాకీలతో చతికిలపడిన ఐడీబీఐ బ్యాంక్‌లో ఇప్పుడు 51% మెజారిటీ వాటాను ఎల్ఐసీకి కట్టబెట్టేందుకు(దాదాపు రూ.13,000 కోట్లు పెట్టుబడి పెట్టించేందుకు) చకచకా పావులు కదుపుతుండటమే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. ఎల్ఐసీ చేసే ఈ పెట్టుబడి కూడా నిరర్థకంగా మారుతుందని... ఉద్యోగ సంఘాలు లబోదిబోమంటున్నా ప్రభుత్వం ముందుకే వెళ్తోంది. ఎల్ఐసీ కోసం తాజాగా బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ ప్రత్యేకంగా పెట్టుబడి పరిమితి నిబంధనలను కూడా సవరించింది(15 శాతం నుంచి 51 శాతానికి). కాగా, 2015–16 నుంచి 2017–18 మధ్య ఐడీబీఐ బ్యాంక్ రూ.13,396 కోట్ల నికర నష్టాలను మూటగట్టుకుంది. రూ.55,000 కోట్ల ఎన్పీఏలతో కుదేలైంది. మరో రూ.60,000 కోట్ల రుణాలు ఎన్పీఏలుగా మారే ప్రమాదం ఉంది. ఇంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్న బ్యాంకు షేరు ఇప్పట్లో కోలుకోవడం కష్టమే. అయినా, కూడా ఎల్ఐసీకి మెజారిటీ వాటా కట్టబెట్టేందుకు ప్రభుత్వం పావులు కదుపుతుండటాన్ని నిపుణులు తప్పుబడుతున్నారు. ఐడీబీఐ డీల్‌కు పార్లమెంట్ ఆమోదం అక్కర్లేదు! ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్ఐసీ ప్రతిపాదిత 51 శాతం మెజారిటీ వాటా కొనుగోలు విషయంలో ఎల్ఐసీ చట్టంలో సవరణ, పార్లమెంట్ ఆమోదం అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇది ఫైనాన్షియల్ ఒప్పందం అయినందున చట్టంలో మార్పులు చేయనక్కర్లేదని, అయితే, దీనికి కేబినెట్ ఆమోదంతో పాటు ఇతర నియంత్రణ సంస్థల అనుమతి తీసుకోవా ల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఎల్ఐసీకి ఐడీబీఐ బ్యాంక్ తాజాగా ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన షేర్లను జారీ చేస్తుంది. ఎల్ఐసీ వెచ్చించే రూ.10,000–13,000 కోట్ల మూలధన నిధులతో ఆ సంస్థ వాటా 51 శాతానికి చేరుతుంది. ఈ నిధులు ప్రభుత్వ ఖజానాకు చేరవు. మరోపక్క, ప్రభుత్వ వాటా ఇప్పుడున్న 80.96% నుంచి 51% దిగువకు తగ్గుతుంది. ఈ డీల్‌తో ఐడీబీఐ బ్యాంక్ ప్రభుత్వ రంగ హోదాను కోల్పోయి ప్రైవేటు బ్యాంకు అవతారమెత్తుతుంది. ఎల్ఐసీకి అనుబంధ సంస్థగా మారుతుంది. కాగా, ఈ డీల్‌తో బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టాలన్న ఎల్ఐసీ చిరకాల కోరిక నెరవేరుతుందన్నది మరికొందరి వాదన. మరోపక్క, ఈ డీల్‌ను ఐడీబీఐ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రైవేటు బ్యాంకుగా మార్చేందుకే ఈ చర్యలని ధ్వజమెత్తాయి. బ్యాంకులో ప్రభుత్వ వాటాను 51% కంటే దిగువకు తగ్గించుకోబోమంటూ మోదీ సర్కారు పార్లమెంటులో ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కుతోందని ఐడీబీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ విఠల్ కోటేశ్వర రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి తమ డిమాండ్లను నివేదించినట్లు ఆయన వెల్లడించారు. -
‘బ్యాడ్ బ్యాంక్’కు బ్యాంకర్ల సై
ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థలో భారీగా పేరుకుపోతున్న మొండిబాకీల సమస్య పరిష్కారం కోసం ప్రత్యేకంగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) లేదా అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్సీ)ని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు బ్యాంకర్ల నుంచి మద్దతు లభించింది. వ్యావహారికంగా ’బ్యాడ్ బ్యాంక్’ కింద పరిగణిస్తున్న ఈ సంస్థ సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు ఏర్పాటైన సునీల్ మెహతా కమిటీ ఇందుకు సంబంధించిన నివేదికను కేంద్ర ఆర్థిక శాఖకు సోమవారం సమర్పించింది. ఇప్పటికే బ్యాంకులు ప్రమోట్ చేస్తున్న అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఆర్సిల్ కింద ఈ తరహా ఏఎంసీని ఏర్పాటు చేయొచ్చని పేర్కొంది. అలాగే, ఇందులో వెలుపలి నిపుణులను నియమించాలని ఇందులో సిఫార్సు చేసింది. అలాగే కొన్ని వర్గాలు సూచిస్తున్నట్లుగా.. దీని ఏర్పాటుకు ప్రజాధనం లేదా విదేశీ మారక నిల్వల నిధులను వినియోగించుకోవడం కాకుండా బ్యాంకులు, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి నిధులను సమకూర్చుకోవాలని సిఫార్సు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏఎంసీ పనితీరు ఇలా.. కమిటీ సిఫార్సుల ప్రకారం చూస్తే ప్రతిపాదిత నేషనల్ ఏఎంసీ పనితీరు ఇలా ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ♦ బ్యాంకుల నుంచి కొనుగోలు చేసే మొండి ఖాతాలను మదింపు చేసిన తర్వాత నేషనల్ ఏఎంసీ నిర్దిష్ట ధరను ఖరారు చేస్తుంది. ♦ సదరు అసెట్‌కి సంబంధించి ముందస్తుగా 15 శాతం మొత్తాన్ని బ్యాంకులకు చెల్లిస్తుంది. ♦ ఆ తర్వాత అసెట్ విక్రయానికి ప్రైవేట్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు, అసెట్ ఫండ్స్ మొదలైన వాటి నుంచి స్విస్ చాలెంజ్ పద్ధతిలో బిడ్లు ఆహ్వానిస్తుంది. ♦ ఒకవేళ ప్రైవేట్ సంస్థ గానీ బిడ్ దక్కించుకున్న పక్షంలో.. నేషనల్ ఏఎంసీ ముందస్తుగా బ్యాం కులకు ఇచ్చిన 15% మొత్తాన్ని కూడా దానికి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా వేలంలో ప్రైవేట్ బిడ్డరు ఎవరూ ముందుకు రాని పక్షంలో బ్యాంకులకు ఇవ్వాల్సిన మిగతా 85% మొత్తాన్ని ఏఎంసీనే చెల్లించేస్తుంది. ♦ ఆ తర్వాత బ్యాంకుల నుంచి తీసుకున్న అసెట్స్‌ను నిపుణుల పర్యవేక్షణలో క్రమానుగతంగా విక్రయించి నిధులు రాబట్టుకుంటుంది. గుదిబండలా మొండిబాకీలు .. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బాకీలు 11.6 శాతానికి ఎగిశాయి. ఇవి వచ్చే మార్చి నాటికి 12.2 శాతానికి ఎగియొచ్చంటూ ఆర్థిక స్థిరత్వ నివేదికలో రిజర్వ్ బ్యాంక్ అంచనా వేస్తోంది. సుమారు రూ. 11 లక్షల కోట్ల పైగా పేరుకుపోయిన మొండిబాకీల్లో.. భూషణ్ స్టీల్, అలోక్ ఇండస్ట్రీస్, ఎస్సార్ స్టీల్ వంటి కేవలం 40 కంపెనీల వాటానే దాదాపు 40 శాతం పైచిలుకు ఉంది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు కఠినతరం చేయడంతో వీటి నుంచి బకాయిలు రాబట్టుకునే ప్రక్రియ కొనసాగుతోంది. మొండి బాకీల సమస్యను వేగవంతంగా పరిష్కరించే దిశగా స్వతంత్ర అసెట్ మేనేజ్మెంట్ సంస్థలను (ఏఎంసీ), స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి పియుష్ గోయల్ వెల్లడించారు. రూ. 500 కోట్ల పైబడిన నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) పరిష్కారానికి ఏఎంసీ లేదా ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌ను నెలకొల్పాలంటూ సునీల్ మెహతా కమిటీ సిఫార్సు చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ కోవకి చెందిన ఖాతాలు దాదాపు 200 పైచిలుకు ఉన్నాయి. ఈ సంస్థలు బ్యాంకులకు సుమారు రూ. 3.1 లక్షల కోట్లు బాకీపడ్డాయి. మెహతా కమిటీ నిర్దిష్టంగా బ్యాడ్ బ్యాంక్‌ను సిఫార్సు చేయలేదని, ఏఎంసీ ఏర్పాటే ప్రతిపాదించిందని మంత్రి తెలిపారు. కమిటీ సిఫార్సుల ప్రకారం రూ. 50 కోట్ల దాకా మొండిబాకీలపై స్టీరింగ్ కమిటీలు, రూ. 50 కోట్ల నుంచి రూ. 500 కోట్ల దాకా బాకీలపై అంతర్‌బ్యాంకుల కమిటీలు నిర్ణయాలు తీసుకుంటాయి. -
బ్యాడ్ బ్యాంకుపై త్వరలోనే నివేదిక: ఎస్బీఐ చైర్మన్
ముంబై: మొండిబకాయిల పరిష్కారానికి బ్యాడ్ బ్యాంకు ఏర్పాటుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్యానల్ త్వరలోనే నివేదిక అందించనుందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. ప్రభుత్వ రంగంలో బ్యాడ్‌బ్యాంకు ఏర్పాటుకు సూచనలను తెలియజేసేందుకు గాను పీఎన్బీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సునీల్ మెహతా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీలో రజనీష్ కుమార్‌తోపాటు బ్యాంకు ఆఫ్ బరోడా ఎండీ పీఎస్ జయకుమార్ సభ్యులుగా ఉన్నారు. ఈ ఏడాది జూన్ 8న ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆదేశించారు. ఎన్పీఏ సత్వర పరిష్కారానికి గాను బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు సాధ్యా సాధ్యాలపై కమిటీ సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. ‘‘ప్రభుత్వం ఇచ్చిన గడువు దాటిపోయింది. అయితే, 99 శాతం పని పూర్తయింది. దీనికి ముగింపు ఇచ్చి త్వరలోనే ఆర్థిక శాఖకు నివేదిక అందజేస్తాం’’ అని రజనీష్ కుమార్ తెలిపారు. -
బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుపై ఏకాభిప్రాయం
ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం న్యూఢిల్లీ: మొండిబకాయిల పరిష్కారానికి ప్రభుత్వం నేతృత్వంలోనే ఒక అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్సీ) లేదా బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు ప్రతిపాదనపై ఏకాభిప్రాయం బలపడుతున్నట్లు ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పారు. అయితే తక్షణం ఇప్పటికిప్పుడు దీనిపై ఒక తుది నిర్ణయం ఏదీ ఉండబోదని స్పష్టం చేశారు. బ్యాంకింగ్‌కు పక్షం రోజుల్లో రూ.8,000 కోట్లు కేంద్రం మరో పక్షం రోజుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.8,000 కోట్ల మూలధనాన్ని సమకూర్చనుందని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2016–17) సంబంధించి కేటాయించిన మూలధనంతో ఇది చివరివిడతని సంబంధిత వర్గాలు వివరించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాజా మూలధనంగా కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవ్సవత్సరం రూ.25,000 కోట్లు కేటాయించింది. వీటిలో రూ.22,915 కోట్లను ఇప్పటికే 13 ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రకటించిన మొత్తంలో 75 శాతాన్ని ఇప్పటికే కేంద్రం బ్యాంకులకు అందజేసింది. రానున్న ఆర్థిక సంవత్సరం బ్యాంకింగ్‌కు రూ.10,000 కోట్ల తాజా మూలధనాన్ని అందించనున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. -
అదేమీ ‘బ్యాడ్’ ఆలోచన కాదు..!
• బ్యాడ్ బ్యాంక్ ప్రతిపాదనపై • హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎండీ ఆదిత్యపురి • వ్యాలెట్లకు భవిష్యత్తు లేదంటూ సంచలన వ్యాఖ్యలు ముంబై: జాతీయ స్థాయిలో బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు ప్రతిపాదనను హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎండీ, సీఈవో ఆదిత్యపురి సమర్థించారు. నిత్యంగా మారిన మొండి బకాయిల (ఎన్పీఏ) సమస్యకు పరిష్కారం ఏదైనా దానికి ఆహ్వానం పలుకుతున్నట్టు చెప్పారు. జాతీయ బ్యాడ్ బ్యాంక్ ఆలోచన తన దృష్టిలో బ్యాడ్ ఐడియా (చెడు ఆలోచన) ఏ మాత్రం కాదన్నారు. ఎన్పీఏల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు పలు సంప్రదింపులతో ముందుకు వస్తున్నాయని, ఈ ప్రయత్నాలు ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్పీఏలకు సంబంధించి బ్యాడ్ బ్యాంక్ ఓ ఆలోచనేనని, దివాళా కోడ్ కూడా ఈ దిశగా మేలు చేస్తుందన్నారు. బ్యాంకర్లుగా తాము సైతం ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన నాస్కామ్ వార్షిక నాయకత్వ సదస్సులో భాగంగా ఆదిత్య పురి పలు అంశాలపై మాట్లాడారు. ‘‘20% బ్యాంకుల ఆస్తులు ఒత్తిడిలో ఉన్నవే. వీటిలో ఎన్పీఏలే సెప్టెంబర్ త్రైమాసికం వరకు 13.5%గా ఉన్నాయి. 70%కిపైగా వ్యవస్థ అంతా ప్రభుత్వ రంగ బ్యాంకుల నిర్వహణలో ఉన్నదే. 90%కి పైగా ఒత్తిడిలో ఉన్న ఆస్తులు వాటివే’’ అని ఆదిత్యపురి వివరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు నగదు కొరత ఎదుర్కొంటుంటే వాటికి ప్రభుత్వ సాయం చాలినంత లేదన్నారు. 24 పీఎస్బీలకు కేవలం రూ.10వేల కోట్లను 2018 బడ్జెట్లో కేటాయించడాన్ని ఆయన గుర్తుచేశారు. 2017, అంతకుముందు సంవత్సరాల్లో ఈ సాయం రూ.25వేల కోట్లుగా ఉందన్నారు. అదే సమయంలో వచ్చే రెండేళ్లలో పీఎస్బీలకు రూ.91,000 కోట్ల అవసరం ఉందని ఆదిత్యపురి పేర్కొన్నారు. బాసెల్–3 నియమాలకు అనుగుణంగా 2015 నుంచి 2019 వరకు బ్యాంకులకు రూ.3.9 లక్షల కోట్లు అవసరమని చెప్పారు. కోటక్ బ్యాంక్ సైతం మద్దతు బ్యాడ్ బ్యాంక్ తరహా ఏర్పాటు అవసరాన్ని ఇటీవలి ఆర్థిక సర్వే కూడా నొక్కి చెప్పిన విషయం తెలిసిందే. అలాగే, కోటక్ మహింద్రా బ్యాంకు వైస్ చైర్మన్ ఉదయ్‌కోటక్ సైతం జాతీయ బ్యాడ్ బ్యాంకు ఏర్పాటుకు అనుకూలంగా గురువారం ప్రకటన చేసిన విషయం విదితమే. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దీని అవసరం ఉందని ఆయన చెప్పడం గమనార్హం. వివిధ రంగాలకు రుణాలిచ్చేందుకు వీలుగా బ్యాంకింగ్ వ్యవస్థపై ఉన్న ఒత్తిడిని తప్పనిసరిగా తొలగించాల్సిన అవసరం ఉందని ఉదయ్‌కోటక్ చెప్పారు. కనుక బ్యాడ్ బ్యాంక్ అనేది మంచి ఆలోచనగా ఆయన పేర్కొన్నారు. వ్యవస్థలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎక్కువ సంఖ్యలో ఉండాల్సిన అవసరం ఏంటని కూడా ఆయన ప్రశ్నించారు. ఆర్థిక రంగానికి 24 ప్రభుత్వ రంగ బ్యాంకులు అవసరం లేదని, బలమైన బ్యాంకులు కొన్ని సరిపోతాయన్నారు. ‘వ్యాలెట్లు’ మూసుకోవాల్సిందే..! పేటీఎం తరహా ప్రీపెయిడ్ వ్యాలెట్ల విషయంలో ఆదిత్యపురి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యాష్ బ్యాక్ ఆఫర్ల ద్వారా వ్యాలెట్ కంపెనీలు కస్టమర్లను అట్టిపెట్టుకోవడం నష్టాలకు దారి తీస్తుందని, ఆ తర్వాత వాటికి భవిష్యత్తు ఉండదన్నారు. ‘‘వ్యాలెట్లకు భవిష్యత్తు లేదన్నది నా అభిప్రాయం. చెల్లింపుల వ్యాపారంలో భవిష్యత్తులోనూ కొనసాగేందుకు వీలుగా వాటికి తగినంత మార్జిన్ లేదు. వ్యాలెట్లు ఆర్థికంగా గిట్టుబాటవుతాయన్నది సందేహమే. ప్రస్తుతం మార్కెట్ లీడర్‌గా ఉన్న పేటీఎం రూ.1,651 కోట్ల నష్టాలను నమోదు చేసింది. రూ.500 చెల్లించి రూ.250 క్యాష్ బ్యాక్ వెనక్కి తీసుకో తరహా వ్యాపారం మనుగడ సాగించదు’’ అని ఆదిత్యపురి పేర్కొన్నారు. నిజానికి హెచ్డీఎఫ్సీ బ్యాంకు సైతం చిలర్ పేరుతో వ్యాలెట్ కలిగి ఉండగా, ఆదిత్యపురి వీటికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
మొండి బకాయిలకు ‘బ్యాడ్ బ్యాంక్’!
పరిశీలిస్తున్న ప్రభుత్వం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెరిగిపోతున్న మొండి బకాయిల సమస్య పరిష్కారంపై సర్కారు కసరత్తు చేస్తోంది. దీనికోసం ప్రత్యేక బ్యాంకునో లేదా కంపెనీనో ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ‘అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఏర్పాటుపై చర్చించాం. అయితే బ్యాంకర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి’ అని సీనియర్ ప్రభుత్వాధికారి తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులున్న పరిస్థితులు చూస్తే ‘బ్యాడ్ బ్యాంక్’ ఏర్పాటు యోచన అంత తీసిపారేయదగ్గది కాదని పీఎన్బీ ఎండీ ఉషా అనంతసుబ్రమణ్యన్ చెప్పారు. అయితే దీనివల్ల బ్యాంకుల్లో అలసత్వం పెరిగే ప్రమాదం కూడా ఉందని మరికొందరు అభిప్రాయపడ్డారు. బ్యాంకులు తమ మొండి బకాయిలను రాబట్టుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించకుండా సదరు ‘బ్యాడ్ బ్యాంక్’కు బదలాయించే సే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. మొండి బకాయిల సమస్య పరిష్కారానికి ‘బ్యాడ్ బ్యాంక్’ ఏర్పాటులాంటివేవీ అక్కర్లేదని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇటీవలే వ్యాఖ్యానించారు. బ్యాంకులు ఇప్పటికే వీటి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. మొండి బకాయిలు రాబట్టుకునేందుకు బ్యాంకులకు మరిన్ని అధికారాలు ఇవ్వడాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు అటు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సైతం వెల్లడించారు. ఈ నేపథ్యంలో బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు ప్రతిపాదన చర్చనీయాంశమయింది.