ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థలో భారీగా పేరుకుపోతున్న మొండిబాకీల సమస్య పరిష్కారం కోసం ప్రత్యేకంగా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఏఎంసీ) లేదా అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్‌సీ)ని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు బ్యాంకర్ల నుంచి మద్దతు లభించింది. వ్యావహారికంగా ’బ్యాడ్ బ్యాంక్’ కింద పరిగణిస్తున్న ఈ సంస్థ సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు ఏర్పాటైన సునీల్ మెహతా కమిటీ ఇందుకు సంబంధించిన నివేదికను కేంద్ర ఆర్థిక శాఖకు సోమవారం సమర్పించింది.
ఇప్పటికే బ్యాంకులు ప్రమోట్ చేస్తున్న అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ ఆర్సిల్ కింద ఈ తరహా ఏఎంసీని ఏర్పాటు చేయొచ్చని పేర్కొంది. అలాగే, ఇందులో వెలుపలి నిపుణులను నియమించాలని ఇందులో సిఫార్సు చేసింది. అలాగే కొన్ని వర్గాలు సూచిస్తున్నట్లుగా.. దీని ఏర్పాటుకు ప్రజాధనం లేదా విదేశీ మారక నిల్వల నిధులను వినియోగించుకోవడం కాకుండా బ్యాంకులు, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి నిధులను సమకూర్చుకోవాలని సిఫార్సు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఏఎంసీ పనితీరు ఇలా..
కమిటీ సిఫార్సుల ప్రకారం చూస్తే ప్రతిపాదిత నేషనల్ ఏఎంసీ పనితీరు ఇలా ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
♦ బ్యాంకుల నుంచి కొనుగోలు చేసే మొండి ఖాతాలను మదింపు చేసిన తర్వాత నేషనల్ ఏఎంసీ నిర్దిష్ట ధరను ఖరారు చేస్తుంది.
♦ సదరు అసెట్‌కి సంబంధించి ముందస్తుగా 15 శాతం మొత్తాన్ని బ్యాంకులకు చెల్లిస్తుంది.
♦ ఆ తర్వాత అసెట్ విక్రయానికి ప్రైవేట్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీలు, అసెట్ ఫండ్స్ మొదలైన వాటి నుంచి స్విస్ చాలెంజ్ పద్ధతిలో బిడ్లు ఆహ్వానిస్తుంది.
♦ ఒకవేళ ప్రైవేట్ సంస్థ గానీ బిడ్ దక్కించుకున్న పక్షంలో.. నేషనల్ ఏఎంసీ ముందస్తుగా బ్యాం కులకు ఇచ్చిన 15% మొత్తాన్ని కూడా దానికి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా వేలంలో ప్రైవేట్ బిడ్డరు ఎవరూ ముందుకు రాని పక్షంలో బ్యాంకులకు ఇవ్వాల్సిన మిగతా 85% మొత్తాన్ని ఏఎంసీనే చెల్లించేస్తుంది.
♦ ఆ తర్వాత బ్యాంకుల నుంచి తీసుకున్న అసెట్స్‌ను నిపుణుల పర్యవేక్షణలో క్రమానుగతంగా విక్రయించి నిధులు రాబట్టుకుంటుంది.
గుదిబండలా మొండిబాకీలు ..
ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బాకీలు 11.6 శాతానికి ఎగిశాయి. ఇవి వచ్చే మార్చి నాటికి 12.2 శాతానికి ఎగియొచ్చంటూ ఆర్థిక స్థిరత్వ నివేదికలో రిజర్వ్ బ్యాంక్ అంచనా వేస్తోంది. సుమారు రూ. 11 లక్షల కోట్ల పైగా పేరుకుపోయిన మొండిబాకీల్లో.. భూషణ్ స్టీల్, అలోక్ ఇండస్ట్రీస్, ఎస్సార్ స్టీల్ వంటి కేవలం 40 కంపెనీల వాటానే దాదాపు 40 శాతం పైచిలుకు ఉంది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు కఠినతరం చేయడంతో వీటి నుంచి బకాయిలు రాబట్టుకునే ప్రక్రియ కొనసాగుతోంది.
మొండి బాకీల సమస్యను వేగవంతంగా పరిష్కరించే దిశగా స్వతంత్ర అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థలను (ఏఎంసీ), స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి పియుష్ గోయల్ వెల్లడించారు. రూ. 500 కోట్ల పైబడిన నిరర్ధక ఆస్తుల (ఎన్‌పీఏ) పరిష్కారానికి ఏఎంసీ లేదా ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌ను నెలకొల్పాలంటూ సునీల్ మెహతా కమిటీ సిఫార్సు చేసిందని ఆయన పేర్కొన్నారు.
ఈ కోవకి చెందిన ఖాతాలు దాదాపు 200 పైచిలుకు ఉన్నాయి. ఈ సంస్థలు బ్యాంకులకు సుమారు రూ. 3.1 లక్షల కోట్లు బాకీపడ్డాయి. మెహతా కమిటీ నిర్దిష్టంగా బ్యాడ్ బ్యాంక్‌ను సిఫార్సు చేయలేదని, ఏఎంసీ ఏర్పాటే ప్రతిపాదించిందని మంత్రి తెలిపారు. కమిటీ సిఫార్సుల ప్రకారం రూ. 50 కోట్ల దాకా మొండిబాకీలపై స్టీరింగ్ కమిటీలు, రూ. 50 కోట్ల నుంచి రూ. 500 కోట్ల దాకా బాకీలపై అంతర్‌బ్యాంకుల కమిటీలు నిర్ణయాలు తీసుకుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment