బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుపై ఏకాభిప్రాయం
ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం
న్యూఢిల్లీ: మొండిబకాయిల పరిష్కారానికి ప్రభుత్వం నేతృత్వంలోనే ఒక అసెట్ రికన్‌స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్‌సీ) లేదా బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు ప్రతిపాదనపై ఏకాభిప్రాయం బలపడుతున్నట్లు ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పారు. అయితే తక్షణం ఇప్పటికిప్పుడు దీనిపై ఒక తుది నిర్ణయం ఏదీ ఉండబోదని స్పష్టం చేశారు.
బ్యాంకింగ్‌కు పక్షం రోజుల్లో రూ.8,000 కోట్లు
కేంద్రం మరో పక్షం రోజుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.8,000 కోట్ల మూలధనాన్ని సమకూర్చనుందని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2016–17) సంబంధించి కేటాయించిన మూలధనంతో ఇది చివరివిడతని సంబంధిత వర్గాలు వివరించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాజా మూలధనంగా కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవ్సవత్సరం రూ.25,000 కోట్లు కేటాయించింది. వీటిలో రూ.22,915 కోట్లను ఇప్పటికే 13 ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రకటించిన మొత్తంలో 75 శాతాన్ని ఇప్పటికే కేంద్రం బ్యాంకులకు అందజేసింది. రానున్న ఆర్థిక సంవత్సరం బ్యాంకింగ్‌కు రూ.10,000 కోట్ల తాజా మూలధనాన్ని అందించనున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.