ARC
-
ఏఆర్సీ నిబంధనలు కఠినతరం
ముంబై: మొండి రుణాల నిర్వహణలో కీలకపాత్ర పోషించే సెక్యూరిటైజేషన్ రంగాన్ని పటిష్టం చేసే దిశగా అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీల (ఏఆర్సీ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ కఠినతరం చేసింది. కనీస మూలధన (ఎన్వోఎఫ్) పరిమితిని రూ. 100 కోట్ల నుంచి రూ. 300 కోట్లకు పెంచింది. ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న ఏఆర్‌సీలు సదరు నిబంధనలకు అనుగుణంగా నిధులను సమకూర్చుకు నేందుకు 2026 ఏప్రిల్ వరకూ వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆర్బీఐ ఒక సర్క్యులర్‌లో తెలిపింది. ఈ మార్గదర్శకాలు వెంటనే అమల్లోకి వస్తాయని, సర్క్యులర్ చేసిన తేదీ తర్వాత నుంచి ఏఆర్సీ కోసం దరఖాస్తు చేసుకునే సంస్థలు తప్పనిసరిగా రూ. 300 కోట్ల ఎన్వోఎఫ్ నిబంధన పాటించాల్సి ఉంటుందని పేర్కొంది. మరోవైపు, పునర్వ్యవస్థీకరణ ద్వారా రుణగ్రహీతల అప్పుల సెటిల్మెంట్ నిబంధనను కూడా మార్చింది. ఆయా ప్రతిపాదనలను స్వతంత్ర సలహాదార్ల కమిటీ (ఐఏసీ) పరిశీలించిన మీదటే బాకీల సెటిల్మెంట్ చేయాల్సి ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. ఈ కమిటీలో టెక్నిక ల్, ఆర్థిక, లీగల్ నేపథ్యం గల నిపుణులు ఉంటారు. -
ఏఆర్‌సీల క్రమబద్ధీకరణకు ఆర్బీఐ కమిటీ సిఫార్సులు
ముంబై: అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీల (ఏఆర్సీ) పనితీరును క్రమబద్ధీకరించే దిశగా రిజర్వ్ బ్యాంక్ కమిటీ పలు సిఫార్సులు చేసింది. మొండి అసెట్స్‌ను విక్రయించేందుకు ఆన్లైన్ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయడం, దివాలా కోడ్ ప్రక్రియలో పరిష్కార నిపుణులుగా వ్యవహరించేందుకు ఏఆర్‌సీలను కూడా అనుమతించడం తదితర అంశాలు ఇందులో ఉన్నాయి. అలాగే రూ. 500 కోట్లు పైబడిన ఖాతాల విషయంలో వాటిని విక్రయిస్తే వచ్చే విలువ, సముచిత మార్కెట్ ధరను బ్యాంకులు ఆమోదించిన ఇద్దరు వేల్యుయర్లతో లెక్క గట్టించాలని కమిటీ సూచించింది. రూ. 100 కోట్లు –500 కోట్ల మధ్య అకౌంట్లకు ఒక్క వేల్యుయర్‌ను నియమించవచ్చని పేర్కొంది. రుణాన్ని రైటాఫ్ చేయగలిగే అధికారాలు ఉన్న అత్యున్నత స్థాయి కమిటికే.. రిజర్వ్ ధరపై తుది నిర్ణయాధికారం ఉండాలని తెలిపింది. సంబంధిత వర్గాలు డిసెంబర్ 15లోగా ఆర్బీఐకి తమ అభిప్రాయాలు పంపాల్సి ఉంటుంది. ఇటు బాకీల రికవరీ, అటు వ్యాపారాలను పునరుద్ధరణ అంశాల్లో ఏఆర్‌సీల పనితీరు అంత ఆశావహంగా లేకపోతున్న నేపథ్యంలో వాటి పనితీరును మెరుగుపర్చేందుకు తీసుకోతగిన చర్యలపై ఆర్బీఐ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుదర్శన్ సేన్ సారథ్యంలో కమిటీ ఏర్పడింది. -
మొండిబాకీల వసూళ్లు,లైసెన్సు కోసం సన్నాహాలు
న్యూఢిల్లీ: మొండిబాకీల వసూళ్ల కోసం ఉద్దేశించిన బ్యాడ్ బ్యాంక్ (నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ–ఎన్ఏఆర్సీఎల్)ని ముంబైలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మిగతా లాంఛనాలు పూర్తి చేసే ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నాయి. తదుపరి ఆర్బీఐ నుంచి అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్సీ)గా లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుందని వివరించాయి. కెనరా బ్యాంకు సారథ్యంలోని ప్రభుత్వ బ్యాంకులకు ఇందులో మెజారిటీ వాటాలు ఉంటాయి. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్ మొదలైనవి మూలధనం సమకూర్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్ఏఆర్సీఎల్ మూలధనం రూ. 7,000 కోట్లుగా ఉండనుంది. ఇందులో కేంద్రం నేరుగా వాటాలు తీసుకోకపోయినప్పటికీ ఎన్ఏఆర్సీఎల్ జారీ చేసే సెక్యూరిటీ రిసీట్స్‌కు పూచీకత్తు మాత్రం ఇస్తుంది. ఇందుకు ప్రభుత్వం రూ. 31,000 కోట్లు కేటాయించింది. బ్యాంకుల నుంచి మొండిబాకీలను కొనుగోలు చేసి, వాటిని రికవర్ చేయడంపై ఎన్ఏఆర్సీఎల్ కసరత్తు చేస్తుంది. దీనికి బదలాయించేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికే రూ. 82,500 కోట్ల విలువ చేసే 22 అసెట్స్‌ను గుర్తించాయి. -
ఆస్ట్రా మైక్రో–రఫేల్ తయారీ కేంద్రం షురూ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇకపై భారత రక్షణ సమాచార ఉత్పత్తులు హైదరాబాద్ కేంద్రంగా తయారు కాబోతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్టŠస్ (ఏఎంపీఎల్), ఇజ్రాయల్‌కు చెందిన రఫేల్ అడ్వాన్డ్స్ డిఫెన్స్ సిస్టమ్ (ఆర్‌ఏడీఎస్‌ఎల్) కలిసి ఆస్ట్రా రఫేల్ కమ్యూనికేషన్ సిస్టమ్ (ఏఆర్సీ) సెంటర్‌ను ఏర్పాటు చేశాయి. ఈ ఏఆర్సీ డిఫెన్స్ కమ్యూనికేషన్లో కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ బలగాలకు ట్యాక్టికల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌ను (బీఎన్‌ఈటీ) అభివృద్ధి చేస్తుంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువలోని హార్డ్‌వేర్ టెక్నాలజీ పార్క్‌లో 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయిన ఏఆర్సీ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సెంటర్‌ను మంగళవారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ ఎండీ ఎస్.గుర్నాత్ రెడ్డి, ఇండియాలోని ఇజ్రాయల్ రాయబారి రాన్ మల్కా, రఫేల్ అడ్వాన్స్ సిస్టమ్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ మేజర్ జనరల్ యోవ్ హర్–ఈవెన్, తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు. ఏం తయారు చేస్తారంటే? ఈ ఏఆర్సీ కేంద్రంలో అత్యాధునిక మిలటరీ గ్రేడ్ ఎస్డీఆర్ (సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియో) తయారీ చేస్తారు. ఎస్డీఆర్ ఉత్పత్తుల తయారీ తొలి ప్రైవేట్ కంపెనీ ఈ ఏఆర్సీ. తొలి దశలో ప్రత్యేక సాఫ్ట్వేర్ ఆధారిత రేడియోల తయారీతో ప్రారంభమై.. తర్వాత రక్షణ సమాచార మార్పిడి కోసం వివిధ రకాల ఉత్పత్తులను అభివృద్ధి చేస్తామని రఫేల్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ మేజర్ జనరల్ యోవ్ హర్–ఈవెన్ తెలిపారు. ఎలక్ట్రానిక్ వార్ఫేర్, సిగ్నల్ ఇంటెలిజెంట్ వ్యవస్థలో కూడా ఉత్పత్తులను అభివృద్ధి చేస్తామన్నారు. తొలి దశలో రూ.35 కోట్ల పెట్టుబడి.. ఏఆర్సీ సెంటర్లో ఆస్ట్రాకు 51 శాతం, రఫేల్‌కు 49 శాతం వాటాలున్నాయి. తొలి దశలో రెండు జేవీ కంపెనీలు రూ.35 కోట్ల పెట్టుబడి పెట్టాయని, మున్ముందు పెట్టుబడుల స్థాయిని పెంచుతామని ఆస్ట్రా మైక్రోవేవ్ ఎండీ గుర్నాత్ రెడ్డి చెప్పారు. తొలి దశలో ఈ యూనిట్లో దేశీయ అవసరాలకే ఉత్పత్తుల్ని తయారు చేస్తామని, ఆ తర్వాతే ఎగుమతులుంటాయని చెప్పారాయన. ప్రస్తుతం ఈ యూనిట్లో 32 మంది సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారని.. రెండేళ్లలో ఈ సంఖ్యను 185కి పెంచుతామని చెప్పారు. ప్రస్తుతం రఫేల్ నుంచి 30 మిలియన్ డాలర్ల ఆర్డర్ ఉందని, వచ్చే 24 నెలల్లోగా డెలివరీ చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశీయ రక్షణ, రైల్వే రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెరుగుతున్నాయని, కేంద్రం ఎఫ్‌డీఐలను అందిస్తున్న ప్రోత్సాహకాలే కారణమని చెప్పారు. గతంలో కల్యాణి గ్రూప్‌తో రఫేల్.. ఇప్పటికే రఫేల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కల్యాణి గ్రూప్‌తో జాయింట్ వెంచర్‌గా హైదరాబాద్‌లో కల్యాణి రఫేల్ అడ్వాన్డ్స్ సిస్టమ్స్‌ను (కేఆర్ఏఎస్) ఏర్పాటు చేసింది. దీనికి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) నుంచి 100 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ లభించింది. వెయ్యి యూనిట్ల బరాక్–8 ఎంఆర్ శామ్ క్షిపణి కిట్స్‌ను సరఫరా చేయాల్సి ఉంది. -
1.16 లక్షల కోట్ల రికవరీపై చేతులెత్తేసిన బ్యాంకులు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ 16 బ్యాంకులు కలిసి పేరుకుపోయిన రూ 1.16 లక్షల కోట్ల రుణ బకాయిలను రాబట్టలేక చేతులెత్తేశాయి. డెట్ రికవరీ ట్రిబ్యునల్, దివాలా చట్టం 2016 వంటి పలు యంత్రాంగాల ద్వారా ఈ రుణ మొత్తాలను వసూలు చేయలేకపోయిన బ్యాంకులు చివరి అస్త్రంగా వీటిని అసెట్ రీకన్స్ర్టక్షన్ కంపెనీ (ఏఆర్సీ)లకు అమ్ముకుని చేతులు దులుపుకున్నాయి. రుణాలను వేగంగా రికవరీ చేసేందుకు ప్రభుత్వం పకడ్బందీగా తీసుకువచ్చిన దివాలా చట్టం 2016 కింద రుణ రికవరీ ప్రక్రియ జాప్యం జరుగుతుండటంతో బ్యాంకులు మొండి బకాయిలను తెగనమ్మి బ్యాలెన్స్ షీట్లను ప్రక్షాళన చేసుకునేందుకు మొగ్గుచూపుతున్నాయి. గత వారం ఎస్బీఐ ఎస్సార్ స్టీల్‌కు ఇచ్చిన రూ 15,000 కోట్ల రుణాలను 18 శాతం రాయితీతో విక్రయించి మార్కెట్ వర్గాలను విస్మయానికి లోనుచేసింది. డిస్కాంట్‌కు తాము రుణాలను విక్రయించినా బ్యాంకుకు రూ 9,500 కోట్ల నగదు లభించిందని, ఇది ఇతరులకు రుణాలు ఇచ్చేందుకు వెసులుబాటు కలిగిస్తుందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. రుణాలు పేరుకుపోతే దానికి కేటాయింపులూ పెరుగుతాయని, మూలధనం ఎక్కువకాలం నిలిచిఉండటం మంచిదికాదని ఆయన చెప్పుకొచ్చారు. 62 ఖాతాలకు చెందిన రూ 27,953 కోట్ల రుణాలను ఎస్బీఐ వేలం ప్రక్రియలో అమ్మకానికి ఉంచింది. ఈ తరహా రుణాలను కొనుగోలు చేసేందుకు డచ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెడ్జ్ ఫండ్స్‌లు ఆసక్తి చూపుతున్నాయి. ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం రూ 29,801 కోట్ల రుణాలను అమ్మకానికి పెట్టగా, కెనరా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, దేనా బ్యాంక్‌లూ నిరర్ధక ఆస్తుల విక్రయానికి మొగ్గుచూపుతున్నాయి. -
ఏఆర్‌సీలో ఆడ సింహం మృతి
ఆరిలోవ (విశాఖ తూర్పు): జంతు పునరావాస కేంద్రం (ఏఆర్సీ)లో శుక్రవారం ఆడ సింహం అనారోగ్యంతో మృతి చెందింది. ఇక్కడ 16 సంవత్సరాల 3 నెలల వయసు గల ‘లత’ అనే ఆడ సింహం కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీని గర్భాశయం పాడయినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైందని జూ ఇన్చార్జి క్యూరేటర్ బి.జానకిరావు తెలిపారు. దీనిని 2002 జూన్ 12న కోల్‌కతాలో ఫేమస్ సర్కస్ నుంచి ఇక్కడ తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. జూలో బేబీ బైసన్ మృతి ఆరిలోవ(విశాఖతూర్పు): జూ పార్కులో వారం రోజుల క్రితం పుట్టిన బైసన్(అడవిదున్న) పిల్ల శుక్రవారం మృతి చెందింది. ఇక్కడ అనుష్క అనే బైసన్‌కు ఈ నెల 6న పిల్ల పుట్టింది. ఇది పుట్టిన నుంచి నీరసంగా ఉండటంతో పాటు తల్లి వద్ద పాలు సరిగా తాగేది కాదు. దీంతో నీరసించిపోయింది. ఇదిలా ఉండగా గురువారం రాత్రి ఇది మృతి చెందింది. తల్లి బైసన్ కాళ్లతో తొక్కేయడంతో ఈ పిల్ల మృతి చెందినట్లు ఇక్కడ వైద్యులు గుర్తించారు. దీని పొట్టపై తల్లి బైసన్ కాళ్లతో తొక్కేసిన పెద్ద గాయాలున్నట్లు గుర్తించామని వైద్యుడు శ్రీనివాస్ తెలిపారు. -
రూ.2.5 లక్షల కోట్ల ఎన్పీఏలు ఏఆర్‌సీల చేతికి
న్యూఢిల్లీ: అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీల(ఏఆర్సీ) కు బ్యాంకులు 2003 నుంచి విక్రయించిన మొండిబకాయిల విలువ రూ.2.44 లక్షల కోట్లు. 23 ఏఆర్సీలకు సంబంధించి ఎస్‌ఐపీఐ–ఎడిల్‌వీజ్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహించిన అసోచామ్ సర్వే ఒకటి ఈ విషయాన్ని తెలిపింది. ఎన్పీఏల కొనుగోళ్ల విషయమై భవిష్యత్తులో కూడా ఏఆర్సీలకు మంచి అవకాశాలు ఉంటాయని అసోచామ్ విశ్లేషించింది. ఆర్థిక వ్యవస్థలో దాదాపు 15 శాతం రుణాలు (9.84 శాతం మొండిబకాయిలు, 4.2 శాతం పునర్వ్యవస్థీకరణ రుణాలు) ఆందోళనకర రీతిలో ఉన్న విషయాన్ని నివేదిక ప్రస్తావించింది. ‘భారత బ్యాంకింగ్ వ్యవస్థలో ఒత్తిడిలో ఉన్న రుణ విలువ దాదాపు రూ.11.80 లక్షల కోట్లు. బ్యాంకింగ్‌కు ఉన్న బకాయిలు.. మొండిబకాయిలుగా మారిన కంపెనీల ప్రమోటర్లతో కఠినంగా వ్యవహరించడానికి ఏఆర్సీలకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేయాలి’ అని నివేదిక ఈ సందర్భంగా సూచించింది. కొత్త విభాగాల్లోకి మోడర్న్ పుడ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్రెడ్ ఉత్పత్తుల తయారీ కంపెనీ మోడర్న్ ఫుడ్ ఎంటర్ప్రైజెస్ కొత్త విభాగాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. కేక్స్, మఫిన్స్ వంటి ఉత్పాదనలను ప్రవేశపెట్టనున్నట్టు కంపెనీ సీఈవో అసీమ్ సోనీ తెలిపారు. కొత్త ప్యాకింగ్‌తో ప్రొడక్టులను ప్రవేశపెట్టిన సందర్భంగా మంగళవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యానికి మేలు చేసే బ్రెడ్ రకాలను పరిచయం చేస్తామన్నారు. ‘టర్నోవరులో బ్రెడ్యేతర ఉత్పత్తుల వాటా ప్రస్తుతం 5 శాతం మాత్రమే. నాలుగేళ్లలో దీనిని మూడింట ఒక వంతు శాతానికి చేరుస్తాం. 2016–17లో కంపెనీ ఆదాయం రూ.270 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25 శాతం వృద్ధి ఆశిస్తున్నాం. భారత బ్రెడ్ ఉత్పత్తుల మార్కెట్ 2–4 శాతం వృద్ధితో రూ.6,000 కోట్లుంది. హెల్త్, వెల్నెస్ విభాగం రెండంకెల వృద్ధి నమోదు చేస్తోంది’ అని వివరించారు. -
బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుపై ఏకాభిప్రాయం
ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం న్యూఢిల్లీ: మొండిబకాయిల పరిష్కారానికి ప్రభుత్వం నేతృత్వంలోనే ఒక అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్సీ) లేదా బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు ప్రతిపాదనపై ఏకాభిప్రాయం బలపడుతున్నట్లు ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పారు. అయితే తక్షణం ఇప్పటికిప్పుడు దీనిపై ఒక తుది నిర్ణయం ఏదీ ఉండబోదని స్పష్టం చేశారు. బ్యాంకింగ్‌కు పక్షం రోజుల్లో రూ.8,000 కోట్లు కేంద్రం మరో పక్షం రోజుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.8,000 కోట్ల మూలధనాన్ని సమకూర్చనుందని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2016–17) సంబంధించి కేటాయించిన మూలధనంతో ఇది చివరివిడతని సంబంధిత వర్గాలు వివరించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాజా మూలధనంగా కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవ్సవత్సరం రూ.25,000 కోట్లు కేటాయించింది. వీటిలో రూ.22,915 కోట్లను ఇప్పటికే 13 ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రకటించిన మొత్తంలో 75 శాతాన్ని ఇప్పటికే కేంద్రం బ్యాంకులకు అందజేసింది. రానున్న ఆర్థిక సంవత్సరం బ్యాంకింగ్‌కు రూ.10,000 కోట్ల తాజా మూలధనాన్ని అందించనున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. -
వేలానికి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఆస్తులు
ఏఆర్‌సీలతో చర్చిస్తున్న నాలుగు బ్యాంకులు న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కి ఇచ్చిన రుణాల్లో కొంతైనా రాబట్టుకునేందుకు.. ఆ సంస్థ ఆస్తులను అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలకు (ఏఆర్సీ) వేలం వేసేందుకు దాదాపు నాలుగు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. మూడు-నాలుగు బ్యాంకులు ఇందుకోసం ఏఆర్‌సీలతో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ సారథ్యంలోని 17 బ్యాంకుల కన్సార్షియం.. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కి ఇచ్చిన దాదాపు రూ. 6,963 కోట్లు పైగా రుణాలను రాబట్టుకునేందుకు తంటాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఎయిర్‌లైన్స్‌తో పాటు దాని ప్రమోటరు విజయ్ మాల్యా, యునెటైడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్‌ను ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా (విల్‌ఫుల్ డిఫాల్టర్లు) ఎస్బీఐ, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకులు ఇప్పటికే ప్రకటించాయి. రికవరీ ప్రక్రియలో భాగంగా ముంబైలోని కింగ్‌ఫిషర్ హౌస్‌ను వచ్చే నెల వేలం వేయాలని ఎస్బీఐ కన్సార్షియం నిర్ణయించింది. ఈ ప్రాపర్టీకి సంబంధించిన అధికారాలున్న ఎస్బీఐ క్యాప్ ట్రస్టీ కంపెనీ .. ఈ-వేలాన్ని మార్చి 17న నిర్వహించనుంది. దీనికి రిజర్వు ధరను రూ. 150 కోట్లుగా నిర్ణయించింది. కన్సార్షియంలో అత్యధికంగా రూ. 1,600 కోట్ల మొత్తాన్ని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కి ఎస్బీఐ ఇచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంకులు చెరో రూ. 800 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 650 కోట్లు ఇచ్చాయి. -
డీసీబీ బ్యాంక్ నికర లాభం 61% అప్
ముంబై: ప్రైవేట్ రంగంలోని డీసీబీ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.63 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నికర లాభం(రూ.39 కోట్లు)తో పోల్చితే 61 శాతం వృద్ధి సాధించామని డీసీబీ బ్యాంక్ తెలిపింది. రూ.10 కోట్ల పన్ను ప్రయోజనాలు, మొండి బకాయిలకు కేటాయించిన రూ.7 కోట్లను వెనక్కి తీసుకోవడం వల్ల ఈ స్థాయి నికర లాభం ఆర్జించామని డీసీబీ బ్యాంక్ ఎండీ, సీఈఓ మురళి నటరాజన్ చెప్పారు. 2013-14 క్యూ4లో రూ.100 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం 2014-15 క్యూ4లో రూ.130 కోట్లకు పెరిగిందని వివరించారు. వడ్డీయేతర ఆదాయం రూ.33 కోట్ల నుంచి రూ.46 కోట్లకు వృద్ధి చెందిందని తెలిపారు. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 1.87 నుంచి 1.76కు మెరుగుపడిందని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.62 కోట్ల మొండిబకాయిలను అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ(ఏఆర్సీ)కి విక్రయించామని పేర్కొన్నారు. సెంటిమెంట్ సానుకూలంగానే ఉన్నప్పటికీ, పరిస్థితులు గడ్డుగానే ఉన్నాయని వివరించారు.