డీసీబీ బ్యాంక్ నికర లాభం 61% అప్
ముంబై: ప్రైవేట్ రంగంలోని డీసీబీ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.63 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నికర లాభం(రూ.39 కోట్లు)తో పోల్చితే 61 శాతం వృద్ధి సాధించామని డీసీబీ బ్యాంక్ తెలిపింది. రూ.10 కోట్ల పన్ను ప్రయోజనాలు, మొండి బకాయిలకు కేటాయించిన రూ.7 కోట్లను వెనక్కి తీసుకోవడం వల్ల ఈ స్థాయి నికర లాభం ఆర్జించామని డీసీబీ బ్యాంక్ ఎండీ, సీఈఓ మురళి నటరాజన్ చెప్పారు. 2013-14 క్యూ4లో రూ.100 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం 2014-15 క్యూ4లో రూ.130 కోట్లకు పెరిగిందని వివరించారు. వడ్డీయేతర ఆదాయం రూ.33 కోట్ల నుంచి రూ.46 కోట్లకు వృద్ధి చెందిందని తెలిపారు. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 1.87 నుంచి 1.76కు మెరుగుపడిందని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.62 కోట్ల మొండిబకాయిలను అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ(ఏఆర్‌సీ)కి విక్రయించామని పేర్కొన్నారు. సెంటిమెంట్ సానుకూలంగానే ఉన్నప్పటికీ, పరిస్థితులు గడ్డుగానే ఉన్నాయని వివరించారు.