ఏఆర్‌సీ సెంటర్‌ను ప్రారంభిస్తున్న కిషన్ రెడ్డి. చిత్రంలో జయేష్ రంజన్, జేవీ కంపెనీల ప్రతినిధు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇకపై భారత రక్షణ సమాచార ఉత్పత్తులు హైదరాబాద్ కేంద్రంగా తయారు కాబోతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్టŠస్ (ఏఎంపీఎల్), ఇజ్రాయల్‌కు చెందిన రఫేల్ అడ్వాన్డ్స్ డిఫెన్స్ సిస్టమ్ (ఆర్‌ఏడీఎస్‌ఎల్) కలిసి ఆస్ట్రా రఫేల్ కమ్యూనికేషన్ సిస్టమ్ (ఏఆర్‌సీ) సెంటర్‌ను ఏర్పాటు చేశాయి. ఈ ఏఆర్‌సీ డిఫెన్స్ కమ్యూనికేషన్‌లో కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ బలగాలకు ట్యాక్టికల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌ను (బీఎన్‌ఈటీ) అభివృద్ధి చేస్తుంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువలోని హార్డ్‌వేర్ టెక్నాలజీ పార్క్‌లో 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయిన ఏఆర్‌సీ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సెంటర్‌ను మంగళవారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ ఎండీ ఎస్.గుర్నాత్ రెడ్డి, ఇండియాలోని ఇజ్రాయల్ రాయబారి రాన్ మల్కా, రఫేల్ అడ్వాన్స్ సిస్టమ్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ మేజర్ జనరల్ యోవ్ హర్–ఈవెన్, తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు.
ఏం తయారు చేస్తారంటే?
ఈ ఏఆర్‌సీ కేంద్రంలో అత్యాధునిక మిలటరీ గ్రేడ్ ఎస్‌డీఆర్ (సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ రేడియో) తయారీ చేస్తారు. ఎస్‌డీఆర్ ఉత్పత్తుల తయారీ తొలి ప్రైవేట్ కంపెనీ ఈ ఏఆర్‌సీ. తొలి దశలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఆధారిత రేడియోల తయారీతో ప్రారంభమై.. తర్వాత రక్షణ సమాచార మార్పిడి కోసం వివిధ రకాల ఉత్పత్తులను అభివృద్ధి చేస్తామని రఫేల్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ మేజర్ జనరల్ యోవ్ హర్–ఈవెన్ తెలిపారు. ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్, సిగ్నల్ ఇంటెలిజెంట్ వ్యవస్థలో కూడా ఉత్పత్తులను అభివృద్ధి చేస్తామన్నారు.
తొలి దశలో రూ.35 కోట్ల పెట్టుబడి..
ఏఆర్‌సీ సెంటర్‌లో ఆస్ట్రాకు 51 శాతం, రఫేల్‌కు 49 శాతం వాటాలున్నాయి. తొలి దశలో రెండు జేవీ కంపెనీలు రూ.35 కోట్ల పెట్టుబడి పెట్టాయని, మున్ముందు పెట్టుబడుల స్థాయిని పెంచుతామని ఆస్ట్రా మైక్రోవేవ్ ఎండీ గుర్నాత్ రెడ్డి చెప్పారు. తొలి దశలో ఈ యూనిట్లో దేశీయ అవసరాలకే ఉత్పత్తుల్ని తయారు చేస్తామని, ఆ తర్వాతే ఎగుమతులుంటాయని చెప్పారాయన. ప్రస్తుతం ఈ యూనిట్‌లో 32 మంది సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారని.. రెండేళ్లలో ఈ సంఖ్యను 185కి పెంచుతామని చెప్పారు. ప్రస్తుతం రఫేల్ నుంచి 30 మిలియన్ డాలర్ల ఆర్డర్ ఉందని, వచ్చే 24 నెలల్లోగా డెలివరీ చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశీయ రక్షణ, రైల్వే రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెరుగుతున్నాయని, కేంద్రం ఎఫ్‌డీఐలను అందిస్తున్న ప్రోత్సాహకాలే కారణమని చెప్పారు.
గతంలో కల్యాణి గ్రూప్‌తో రఫేల్..
ఇప్పటికే రఫేల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కల్యాణి గ్రూప్‌తో జాయింట్ వెంచర్‌గా హైదరాబాద్‌లో కల్యాణి రఫేల్ అడ్వాన్డ్స్ సిస్టమ్స్‌ను (కేఆర్‌ఏఎస్) ఏర్పాటు చేసింది. దీనికి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) నుంచి 100 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ లభించింది. వెయ్యి యూనిట్ల బరాక్–8 ఎంఆర్ శామ్ క్షిపణి కిట్స్‌ను సరఫరా చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment