
మూడు ఎమ్మెల్సీ స్థానాలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం మూడు (రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్) సీట్లనూ గెలుచుకుని సత్తా చాటాలని బీజేపీ తీర్మానించింది. ఈ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల వ్యూహం, ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని, ఇందుకోసం వెంటనే రంగంలో దిగాలని నిర్ణయించింది. కేంద్రమంత్రులు, ఎంపీస్థాయి నేతలు మొదలుకుని కిందిస్థాయి కార్యకర్త వరకు పూర్తిగా ఈ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించి, అనుకున్న ఫలితాలను సాధించాలని రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది.
కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ, రేవంత్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న మోసాలను ప్రజలకు వివరించేలా ప్రచారాన్ని ఉధృతం చేయాలని సూచించింది. శనివారం ఓ స్టార్ హోటల్‌లో తొలుత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు, ఆ తర్వాత రాష్ట్రపదాధికారులతో జరిగిన కీలక సమావేశాల్లో.. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
ఈ సందర్భంగా కరీంనగర్– నిజామాబాద్– మెదక్– ఆదిలాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య, ఇదే నియోజకవర్గం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి సి.అంజిరెడ్డి, నల్లగొండ– ఖమ్మం– వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తంరెడ్డిలను రాష్ట్ర నాయకత్వం పరిచయం చేసింది. ఈ సమావేశాలకు అధ్యక్షత వహించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘రానున్న రోజుల్లో కర్ణాటక, తెలంగాణలో స్వతంత్రంగా అధికారంలోకి వస్తాం. కేరళ, తమిళనాడులో కూడా బీజేపీ బలం పెరిగింది.
తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు గెలవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు, యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగుల పట్ల వివక్షతో వ్యవహరిస్తోంది’అని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగులు, మేధావులు, నిరుద్యోగులు, విద్యార్థులు.. ప్రతిఒక్కరూ చైతన్యంతో ఆలోచించి ప్రజల పక్షాన నిలిచిన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు డా.కె.లక్ష్మణ్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఈటల రాజేందర్, ఎం.రఘునందన్‌రావు, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, కాటపల్లి వెంకటరమణారెడ్డి, రామారావు పటేల్, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు ఎన్.రామచంద్రరావు, పొంగులేటి సుధాకరరెడ్డి, పారీ్టనేతలు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, డా.కాసం వెంకటేశ్వర్లు, డా.ప్రకాశ్‌రెడ్డి, ఎస్.కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment