
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు ఎదుర్కొంటున్న మొండి బకాయిల సమస్య పరి ష్కారానికి పలు బ్యాడ్ బ్యాంకుల అవసరం ఉందని, దీనిని ప్రభుత్వం పరిశీలించాలంటూ పరిశ్రమల మండలి సీఐఐ కోరింది. బడ్జెట్ ముందు ప్రభుత్వానికి వినతిపత్రం రూపంలో పలు సూచనలు చేసింది. బ్యాంకుల బ్యాలన్స్‌షీట్లలోని నిరర్థక ఆస్తుల కొనుగోలుకు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ), ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్)ను అనుమతించాలని కోరింది. ‘‘కరోనా పరిణామం తర్వాత మార్కెట్ ఆధారితంగా సరైన ధర నిర్ణయించే యాంత్రాంగం అవసరం. అంతర్జాతీయంగా, దేశీయంగా నిధుల లభ్యత భారీగా ఉన్నందున ఒకటికి మించిన బ్యాడ్ బ్యాంకులు ఈ సమస్యను పారదర్శకంగా పరిష్కరించగలవు.
రుణ క్రమాన్ని తిరిగి గాడిన పెట్టగలవు’’ అంటూ సీఐఐ ప్రెసిడెంట్ ఉదయ్‌కోటక్ చెప్పారు. మార్కెట్ ఆధారిత బలమైన యంత్రాంగం ఉంటే.. ప్రభుత్వరంగ బ్యాంకులు తమ మొండి బకాయిలను ఎటువంటి భయాలు లేకుండా విక్రయించుకోగలవన్నారు. స్వచ్ఛమైన బ్యాలన్స్ షీట్లతో అప్పుడు ప్రభుత్వరంగ బ్యాంకులు మార్కెట్ నుంచి నిధులు సమీకరించుకోగలవని.. దాంతో ప్రభుత్వం మూలధన నిధుల సాయం చేయాల్సిన అవసరం తప్పుతుందని సూచించారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ చెందుతుండడంతో పరిశ్రమ నుంచి రుణాల కోసం వచ్చే డిమాండ్‌లను బ్యాంకులు తీర్చాల్సి ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment