అదేమీ ‘బ్యాడ్’ ఆలోచన కాదు..!
• బ్యాడ్ బ్యాంక్ ప్రతిపాదనపై
• హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎండీ ఆదిత్యపురి
• వ్యాలెట్లకు భవిష్యత్తు లేదంటూ సంచలన వ్యాఖ్యలు
ముంబై: జాతీయ స్థాయిలో బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు ప్రతిపాదనను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎండీ, సీఈవో ఆదిత్యపురి సమర్థించారు. నిత్యంగా మారిన మొండి బకాయిల (ఎన్‌పీఏ) సమస్యకు పరిష్కారం ఏదైనా దానికి ఆహ్వానం పలుకుతున్నట్టు చెప్పారు. జాతీయ బ్యాడ్ బ్యాంక్ ఆలోచన తన దృష్టిలో బ్యాడ్ ఐడియా (చెడు ఆలోచన) ఏ మాత్రం కాదన్నారు. ఎన్‌పీఏల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు పలు సంప్రదింపులతో ముందుకు వస్తున్నాయని, ఈ ప్రయత్నాలు ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్‌పీఏలకు సంబంధించి బ్యాడ్ బ్యాంక్ ఓ ఆలోచనేనని, దివాళా కోడ్ కూడా ఈ దిశగా మేలు చేస్తుందన్నారు. బ్యాంకర్లుగా తాము సైతం ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన నాస్కామ్ వార్షిక నాయకత్వ సదస్సులో భాగంగా ఆదిత్య పురి పలు అంశాలపై మాట్లాడారు.
‘‘20% బ్యాంకుల ఆస్తులు ఒత్తిడిలో ఉన్నవే. వీటిలో ఎన్‌పీఏలే సెప్టెంబర్ త్రైమాసికం వరకు 13.5%గా ఉన్నాయి. 70%కిపైగా వ్యవస్థ అంతా ప్రభుత్వ రంగ బ్యాంకుల నిర్వహణలో ఉన్నదే. 90%కి పైగా ఒత్తిడిలో ఉన్న ఆస్తులు వాటివే’’ అని ఆదిత్యపురి వివరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు నగదు కొరత ఎదుర్కొంటుంటే వాటికి ప్రభుత్వ సాయం చాలినంత లేదన్నారు. 24 పీఎస్‌బీలకు కేవలం రూ.10వేల కోట్లను 2018 బడ్జెట్‌లో కేటాయించడాన్ని ఆయన గుర్తుచేశారు. 2017, అంతకుముందు సంవత్సరాల్లో ఈ సాయం రూ.25వేల కోట్లుగా ఉందన్నారు. అదే సమయంలో వచ్చే రెండేళ్లలో పీఎస్‌బీలకు రూ.91,000 కోట్ల అవసరం ఉందని ఆదిత్యపురి పేర్కొన్నారు. బాసెల్–3 నియమాలకు అనుగుణంగా 2015 నుంచి 2019 వరకు బ్యాంకులకు రూ.3.9 లక్షల కోట్లు అవసరమని చెప్పారు.
కోటక్ బ్యాంక్ సైతం మద్దతు
బ్యాడ్ బ్యాంక్ తరహా ఏర్పాటు అవసరాన్ని ఇటీవలి ఆర్థిక సర్వే కూడా నొక్కి చెప్పిన విషయం తెలిసిందే. అలాగే, కోటక్ మహింద్రా బ్యాంకు వైస్ చైర్మన్ ఉదయ్‌కోటక్ సైతం జాతీయ బ్యాడ్ బ్యాంకు ఏర్పాటుకు అనుకూలంగా గురువారం ప్రకటన చేసిన విషయం విదితమే. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దీని అవసరం ఉందని ఆయన చెప్పడం గమనార్హం. వివిధ రంగాలకు రుణాలిచ్చేందుకు వీలుగా బ్యాంకింగ్ వ్యవస్థపై ఉన్న ఒత్తిడిని తప్పనిసరిగా తొలగించాల్సిన అవసరం ఉందని ఉదయ్‌కోటక్ చెప్పారు. కనుక బ్యాడ్ బ్యాంక్ అనేది మంచి ఆలోచనగా ఆయన పేర్కొన్నారు. వ్యవస్థలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎక్కువ సంఖ్యలో ఉండాల్సిన అవసరం ఏంటని కూడా ఆయన ప్రశ్నించారు. ఆర్థిక రంగానికి 24 ప్రభుత్వ రంగ బ్యాంకులు అవసరం లేదని, బలమైన బ్యాంకులు కొన్ని సరిపోతాయన్నారు.
‘వ్యాలెట్లు’ మూసుకోవాల్సిందే..!
పేటీఎం తరహా ప్రీపెయిడ్ వ్యాలెట్ల విషయంలో ఆదిత్యపురి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యాష్ బ్యాక్ ఆఫర్ల ద్వారా వ్యాలెట్ కంపెనీలు కస్టమర్లను అట్టిపెట్టుకోవడం నష్టాలకు దారి తీస్తుందని, ఆ తర్వాత వాటికి భవిష్యత్తు ఉండదన్నారు. ‘‘వ్యాలెట్లకు భవిష్యత్తు లేదన్నది నా అభిప్రాయం. చెల్లింపుల వ్యాపారంలో భవిష్యత్తులోనూ కొనసాగేందుకు వీలుగా వాటికి తగినంత మార్జిన్ లేదు. వ్యాలెట్లు ఆర్థికంగా గిట్టుబాటవుతాయన్నది సందేహమే. ప్రస్తుతం మార్కెట్ లీడర్‌గా ఉన్న పేటీఎం రూ.1,651 కోట్ల నష్టాలను నమోదు చేసింది. రూ.500 చెల్లించి రూ.250 క్యాష్ బ్యాక్ వెనక్కి తీసుకో తరహా వ్యాపారం మనుగడ సాగించదు’’ అని ఆదిత్యపురి పేర్కొన్నారు. నిజానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సైతం చిలర్ పేరుతో వ్యాలెట్ కలిగి ఉండగా, ఆదిత్యపురి వీటికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది.