Aditya Puri
-
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాజీ సీఈవోకు డెలాయిట్‌లో కీలక పదవి
ప్రముఖ బ్యాంకర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఆదిత్య పూరి (Aditya Puri)కి ప్రముఖ ప్రొఫెషనల్ సర్వీసెస్ నెట్వర్క్ డెలాయిట్ (Deloitte) కీలక పదవి ఇచ్చింది. కంపెనీ సీనియర్ సలహాదారుగా నియమించినట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి బిజినెస్ లీడర్లలో ఒకరిగా పేరుపొందిన ఆదిత్య పూరి 1994లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈవోగా నియమితులయ్యారు. సంస్థలో 26 సంవత్సరాలపాలు సేవలందించారు. 2020లో పదవీ విరమణ చేశారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ అయిన డెలాయిట్‌లో చేరినందుకు సంతోషిస్తున్నానని ఆదిత్య పూరి పేర్కొన్నారు. విశేష అనుభవం, దూరదృష్టి గల ఆదిత్యపూరి నియామకంపై డెలాయిట్ సౌత్ ఏషియా సీఈఓ రోమల్ శెట్టి సంతోషం వ్యక్తం చేశారు. అంతకు ముందు జూన్‌లో భారతి ఎయిర్టెల్, సాఫ్ట్‌బ్యాంక్ ఇండియా మాజీ సీఈవో మనోజ్ కోహ్లీని సీనియర్ సలహాదారుగా డెలాయిట్ నియమించుకుంది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆదిత్య పురికి రూ. 13.82 కోట్ల ప్యాకేజీ
ముంబై: ప్రైవేట్ రంగంలోని టాప్ 3 ప్రైవేట్ బ్యాంకుల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చీఫ్ ఆదిత్య పురి అత్యధిక వేతన ప్యాకేజీ అందుకున్నారు. ఆయన రిటైర్ అయిన గత ఆర్థిక సంవత్సరంలో(2020–21) రూ. 13.82 కోట్లు జీతభత్యాల రూపంలో పొందారు. ఇందులో రూ. 3.5 కోట్ల మేర పదవీ విరమణ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పురి రిటైర్మెంట్ తర్వాత సీఈవో, ఎండీగా నియమితులైన శశిధర్ జగదీశన్ రూ. 4.77 కోట్లు వేతనం అందుకున్నారు. మరోవైపు, కోవిడ్–19పరమైన పరిస్థితుల నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో సందీప్ బక్షి స్వచ్ఛందంగా తన జీత భత్యాల్లో ఫిక్స్డ్ భాగాన్ని, కొన్ని అలవెన్సులను వదులుకున్నారు. రూ. 38.38 లక్షల అలవెన్సులు అందుకోగా .. 2017, 2018 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రూ. 63.60 లక్షలు పనితీరు ఆధారిత బోనస్ పొందారు. అటు యాక్సిస్ బ్యాంక్ ఎండీ అమితాబ్ చౌదరి రూ. 6.52 కోట్ల ప్యాకేజీ అందుకున్నారు. -
స్ట్రైడ్స్కు సలహాదారుగా ఆదిత్య పురీ
న్యూఢిల్లీ, సాక్షి: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు విశేష సేవలందించిన ఆదిత్య పురీ తాజాగా ఫార్మా కంపెనీ స్డ్రైడ్స్ గ్రూప్‌లో చేరారు. తద్వారా స్ట్రైడ్స్ గ్రూప్‌నకు సలహాదారుగా సేవలిందించనున్నారు. అంతేకాకుండా సహచర కంపెనీ స్టెలిస్ బయోఫార్మా బోర్డులో డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. గ్రూప్‌నకు సలహదాదారుగా సేవలందించేందుకు సుప్రసిద్ధ కార్పొరేట్ దిగ్గజం ఆదిత్య పురీ సంస్థలో చేరినట్లు స్ట్రైడ్స్ నియంత్రణ సంస్థలకు తెలియజేసింది. అంతేకాకుండా సహచర కంపెనీ స్టెలిస్ బయోఫార్మాలో డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినట్లు వెల్లడించింది. (పురీ వేవ్- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రికార్డ్స్) ట్రాన్సిషన్ దశలో కంపెనీ ప్రాథమిక దశ నుంచి కన్సాలిడేషన్, వృద్ధి దశకు చేరుకుంటున్న సందర్భంలో పురీ చేరిక గ్రూప్‌నకు మరింత ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ పేర్కొంది. అంతర్జాతీయ కంపెనీలు అందుబాటు ధరల్లో ప్రపంచ స్థాయి చికిత్సలను అందించడంలో భాగస్వామిగా సేవలందించే దిశలో కంపెనీ సాగుతున్నట్లు తెలియజేసింది. తద్వారా వర్ధమాన, అభివృద్ధి చెందిన మార్కెట్లలో విస్తరించనున్నట్లు వివరించింది. ఇప్పటికే గ్లోబల్ స్థాయిలో పట్టుసాధించిన స్ట్రైడ్స్ గ్రూప్‌తోపాటు, స్టెలిస్ బయోఫార్మా మరింత వృద్ధి సాధించేందుకు వీలుగా సేవలందించనున్నట్లు పురీ పేర్కొన్నారు. గ్రూప్ సలహాదారుగా, స్టెలిస్ బోర్డు డైరెక్టర్‌గా సేవలందించనున్న ఆదిత్య పురీకి స్వాగతం పలుకుతున్నట్లు స్ట్రైడ్స్ వ్యవస్థాపక చైర్మన్ అరుణ్ కుమార్ పేర్కొన్నారు. పురీ రాకతో గ్రూప్‌పట్ల నమ్మకం మరింత బలపడనున్నట్లు చెప్పారు. పురీ అనుభవం గ్రూప్‌నకు ఎన్నో విధాల ఉపయోగపడనున్నట్లు పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు ప్రారంభం నుంచీ ఆదిత్య పురీ 25 ఏళ్లపాటు సేవలందించిన విషయం విదితమే. పురీ హయాంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రయివేట్ రంగంలో టాప్ ర్యాంకుకు చేరుకుంది. (హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు కొత్త చైర్మన్!) షేరు రికార్డ్ ఆదిత్య పురీ బోర్డులో చేరుతున్న వార్తలతో స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ కౌంటర్‌కు డిమాండ్ ఏర్పడింది. ఎన్ఎస్ఈలో స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ షేరు తొలుత 2.6 శాతం ఎగసి రూ. 999ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. తదుపరిలాభాల స్వీకరణతో వెనుకంజ వేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం 3 శాతం క్షీణించి రూ. 945 దిగువన ట్రేడవుతోంది. 2020 మార్చి 20న ఈ షేరు రూ. 268 వద్ద 52 వారాల కనిష్టానికి చేరింది. గత ఆరు నెలల్లో ఈ షేరు 130 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! -
పురీ వేవ్- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రికార్డ్స్
ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ను రెండున్నర దశాబ్దాలపాటు ముందుండి నడిపించిన ఆదిత్య పురీ సోమవారం(26న) పదవీ విరమణ చేశారు. దీంతో కొత్త ఎండీ, సీఈవోగా శశిధర్ జగదీశన్ బాధ్యతలు చేపట్టారు. బ్యాంకు అదనపు డైరెక్టర్, ఫైనాన్స్ హెడ్‌గా విధులు నిర్వహిస్తున్న శశిధర్ ఎండీ, సీఈవో బాధ్యతలను పురీ నుంచి స్వీకరించారు. పురీ 1994 సెప్టెంబర్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీగా పదవిని చేపట్టారు. ఆపై బ్యాంక్ పలు విధాలుగా వృద్ధి బాటలో పరుగు పెట్టింది. తద్వారా తీవ్రమైన పోటీలోనూ బ్యాంకు తొలి స్థానంలో నిలుస్తూ వచ్చింది. ప్రస్థానమిలా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1995 మే 19న బీఎస్ఈలో లిస్టయ్యింది. అప్పట్లో బ్యాంకు ఆస్తులు రూ. 3,394 కోట్లుగా నమోదుకాగా.. ప్రస్తుతం రూ. 16 లక్షల కోట్లకుపైగా విస్తరించాయి. మొత్తం డిపాజిట్లు రూ. 642 కోట్ల నుంచి రూ. 12.29 లక్షల కోట్లకు ఎగశాయి. ఇదేవిధంగా 1995 మార్చిలో రూ. 98 కోట్లుగా ఉన్న రుణాలు(అడ్వాన్సులు) 2020 సెప్టెంబర్‌కల్లా రూ. 10.38 లక్షల కోట్లను తాకాయి. వెరసి పురీ హయాంలో బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 7 లక్షల కోట్లకు చేరింది. వెరసి ప్రయివేట్ రంగ బ్యాంకులలో టాప్ ర్యాంకుకు చేరుకుంది. 1997లో బ్యాంక్ మార్కెట్ క్యాప్ తొలిసారి రూ. 1,000 కోట్లను అధిగమించింది. గత 25 సంవత్సరాలలో బ్యాంకు షేరు రూ. 3 నుంచి రూ. 1,200కు దూసుకెళ్లింది. అంటే 1995 నుంచి చూస్తే 30,000 శాతానికిపైగా రిటర్నులు అందించింది. లాభాల బాటలో ఏస్ ఈక్విటీ వివరాల ప్రకారం 1995 మే చివర్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 432 కోట్లను తాకింది. ఆపై 1997 కల్లా రూ. 1,000 కోట్లను అధిగమించగా.. 2005 జులై 6న రూ. 20,130 కోట్లకు చేరింది. ఈ బాటలో 2007 కల్లా రూ. 50,000 కోట్లు, 2010 ఆగస్ట్‌లో రూ. లక్ష కోట్ల మార్క్‌ను దాటేసింది. తిరిగి 2018 జనవరిలో మరింత వృద్ధి చూపుతూ రూ. 5 లక్షల కోట్లను తాకింది. ఇక ప్రస్తుతం అంటే 2020 అక్టోబర్ 27కల్లా బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ. 6.73 లక్షల కోట్లకు చేరింది.ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం పుంజుకుని రూ. 1,223 వద్ద ట్రేడవుతోంది. షేర్ల విభజన గతంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెండుసార్లు షేర్ల ముఖ విలువను విభజించింది. 2011లో రూ. 10 ముఖ విలువను రూ. 2కు, తిరిగి 2019లో రూ. 2 నుంచి రూ. 1కు షేర్ల విభజన చేపట్టింది. ప్రస్తుతం బీఎస్ఈ డేటా ప్రకారం హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో ప్రమోటర్ల వాటా ప్రస్తుతం 26.02 శాతంగా నమోదైంది. పబ్లిక్ వాటా దాదాపు 74 శాతానికి చేరింది. వీటిలో మ్యూచువల్ ఫండ్స్ 13.95 శాతం, ఎల్ఐసీ 3.79 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) 37.43 శాతం వాటాను సొంతం చేసుకున్నారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అపోలో భాగస్వామ్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్‌తో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా అపోలో ఆసుపత్రుల్లో వైద్యానికి రూ.40 లక్షల వరకు రుణాన్ని బ్యాంకు తన కస్టమర్లకు అందిస్తుంది. అవసరమైన వెంటనే ఈ లోన్‌ను మంజూరు చేస్తారు. అపోలో 24/7 డిజిటల్ ప్లాట్‌ఫాంపై వైద్యులను ఉచితంగా సంప్రదించవచ్చు. చికిత్స విషయంలో తమ కస్టమర్లకు ప్రాధాన్యత ఉంటుందని హెచ్డీఎఫ్సీ సీఈవో, ఎండీ ఆదిత్య పురి బుధవారం మీడియాకు తెలిపారు. ఆరోగ్య, ఆర్థిక రంగంపై ఈ భాగస్వామ్యం సానుకూల ప్రభావం చూపిస్తుందని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు ఉన్న 6.5 కోట్ల మంది కస్టమర్లకు ఇది ప్రయోజనమని అపోలో ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ శోభన కామినేని తెలిపారు. -
మీ ఉద్యోగాలు, ఇంక్రిమెంట్లు, బోనస్‌లు భద్రం
ముంబై: దేశంలోని ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆదిత్యపురి తమ ఉద్యోగులకు ఉద్యోగాలు, ఇంక్రిమెంట్లు, బోనస్‌ల విషయంలో కొండంత భరోసాను ఇచ్చారు. అవన్నీ భద్రమని, ఆందోళనలు అర్థరహితమని ఆయన పేర్కొన్నారు. కరోనా ప్రేరిత అంశాలు ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఆదిత్యపురి 1.15 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులకు ఇటీవల 10 నిముషాల వీడియో సందేశం పంపా రు. ‘‘మీకు ఉద్యోగ భద్రతేకాదు. ప్రమోషన్లు, ఇంక్రిమెం ట్లు, బోనస్‌లూ అన్నీ భద్రం’ అని ఆయన సందేశంలో పేర్కొన్నారు. తన వారసుడు శశిధర్ జగదీశన్సహా మేనేజ్మెంట్ తరఫున తాను ఈ హామీ ఇస్తున్నట్లు తెలిపారు. 25 సంవత్సరాల సుదీర్ఘ బాధ్యతల నుంచి ఈ నెలాఖరున పదవీవిరమణ చేస్తున్న పురి, బ్యాంకు పండుగల ఆఫర్ ప్రకటనను (సెకండ్ ఎడిషన్) పురస్కరించుకుని చేసిన తాజా సందేశంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ⇔ కోవిడ్–19 ప్రతికూల ప్రభావాల సమయాల్లోనూ బ్యాంక్ చక్కటి పనితీరును ప్రదర్శిస్తోంది. తగిన మూలధన నిల్వలను నిర్వహిస్తోంది. తాను మంజూరు చేసిన రుణాల విషయంలో ఎటువంటి ఒత్తిడినీ ఎదుర్కొనడంలేదు. ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో చక్కటి ఫలితాలను నమోదుచేసుకుంది. భవిష్యత్తులోనూ ఇదే ధోరణి కొనసాగుతుంది. ⇔ రుణాల పంపిణీ, వసూళ్లు వంటి అంశాలతో పాటు పలు విభాగాల్లో బ్యాంక్ సాంకేతికత వినియోగం ఎంతో ముందుంది. ⇔ ఉద్యోగులుగా మీరు చేయాల్సింది ఒకటే. ‘టీమ్ వర్క్’ చేయండి. పనిలో దార్శినికతను ప్రదర్శించండి. పోటీ తత్వంలో ఇది కీలకమైన అంశం. ఈ విషయంలో మనం నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు కృషి చేయండి. ⇔ కరోనా వైరస్ ప్రతికూల ప్రభావాల విషయంలో ఓటమిని బ్యాంక్ ఎప్పుడూ అంగీకరించలేదు. రెండు త్రైమాసికాల నుంచీ మంచి ఫలితాలను బ్యాంక్ నమోదుచేసుకుంటున్న విషయం ఇక్కడ ప్రస్తావనాంశం. ⇔ బ్యాంక్ ప్రకటించిన పండుగల సీజన్ ఆఫర్లను మార్కెట్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడానికి సోషల్ మీడియాను ఉద్యోగులు వినియోగించుకోవాలి. ⇔ బ్యాంకు వ్యాపార కార్యకలాపాలు కరోనా–19 పూర్వపు స్థితికి క్రమంగా చేరుకుంటున్నాయి. అతి త్వరలోనే సాధారణ స్థాయికి చేరుకుంటాయి. ⇔ కరోనా వైరస్ మన అందరి జీవితాల్లోనూ అవరోధాలు కల్పించింది. ఈ వైరస్‌తోనే కొన్నాళ్లు జీవించాల్సి ఉంటుంది. కాకపోతే వాతావరణాన్ని, ఈ పరిస్థితిని భద్రం గా మార్చుకోవడం అన్నది మీపైనే ఉంటుంది. కష్టాల్లోనూ ఆశావాదంవైపు నడవాలి. అవకాశాలు వెతుక్కోవాలి. వైరస్ ఏదో ఒక రోజు వెళ్లిపోతుంది. ఆందోళన అక్కర్లేదు. ప్రత్యేక ఆఫర్లకు చక్కటి స్పందన... పండుగల సీజన్‌ను పురస్కరించుకుని ప్రకటించిన ‘ఫెస్టివ్ ట్రీట్స్’ గురించి హెచ్డీఎఫ్సీ బ్యాంకు పేమెంట్ బిజినెస్ కంట్రీ హెడ్ పరాగ్‌రావు వివరిస్తూ, ఈ ప్లాట్‌ఫామ్ నుంచి బ్యాంకుకు సంబంధించిన అన్ని రకాల ప్రొడక్టులపై ప్రత్యేక ఆఫర్లను పొందొచ్చని తెలిపారు. రుణాల నుంచి క్రెడిట్ కార్డుల వరకు, ప్రముఖ విక్రేతలకు సంబంధించి 1,000 రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నట్టు ప్రకటించారు. ఎంతో అద్భుతమైన డిమాండ్ కనిపిస్తోందంటూ.. ఫెస్టివ్ ట్రీట్స్ ప్లాట్‌ఫామ్‌పై 30–35 శాతం తగ్గింపులను ఇస్తున్నట్టు చెప్పారు. మొబైల్స్, కన్జ్యూమర్ డ్యురబుల్స్, వస్త్రాలు, జ్యుయలరీ, డైనింగ్ విభాగాల్లో గత 2–3 నెలల్లో కస్టమర్ల ఆసక్తి పెరిగిందని, పండుగల సీజన్లోనూ ఇది కొనసాగుతుందని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. -
హెచ్డీఎఫ్సీ బంపర్ ఆఫర్..
ముంబై: రానున్న పండగ సీజన్లో కస్టమర్లను ఆకర్షించేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (దేశీయ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్) బంపర్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లను లోన్స్, ఈఎమ్ఐ, క్యాష్‌బ్యాక్స్, క్రెడిట్ కార్డ్స్, గిఫ్ట్ వోచర్స్, తదితర విభాగాలలో వర్తింప చేయనున్నట్లు ప్రకటించింది. కాగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆటో, పర్సనల్ తదితర రుణాలలో ప్రాసెసింగ్ ఫీజు తగ్గించనున్నట్లు ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దిగ్గజ రిటైల్ బ్రాండ్లతో ఒప్పందం కుదుర్చుకుంది. డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్‌లు, అదనపు రివార్డ్ పాయింట్లు, ఆన్-లైన్ కొనుగోళ్లలో అందిస్తుంది. ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, టాటాక్లిక్, మైంట్రా, పెప్పర్ఫ్రై, స్విగ్గీ, గ్రోఫర్స్ వంటి ఆన్లైన్ మేజర్లతో ఈ బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు విజయ్ అమ్మకాలు, కోహినూర్, జీఆర్టీ, ఓఆర్ఆర్ఏ వంటి వివిధ ఉత్పత్తులు, సేవలపై 5 నుంచి 15 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను హెడ్ఎఫ్సీ అందిస్తుంది. ఈ ఆఫర్లపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ ఆదిత్య పురి స్పందిస్తు.. ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందే విధంగా దేశ ప్రజలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. పండగల వేళ దేశంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుందని, అందుకు గాను దేశ ప్రజల కొనుగోలు శక్తి మరింత పెంచేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తక్కువ రుణాల ఆఫర్లను ప్రకటించిందని ఆదిత్య పురి పేర్కొన్నారు. కాగా గత రెండు, మూడు నెలలుగా బ్యాంక్ రుణాలు తీసుకునేందుకు ప్రజలు మక్కువ చూపుతున్నారని, పండగ సీజన్లో కస్టమర్లు సంతృప్తి పరచే విధంగా తమ ఆఫర్లు ఉంటాయని ఆదిత్య పురి పేర్కొన్నారు. (చదవండి: కొత్తగా 14వేల మంది కరస్పాండెంట్ల నియామకం) -
పురి.. వారసుడొచ్చాడు!
ముంబై: ప్రైవేటు రంగంలో రెండవ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం– హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఈఓ అండ్ ఎండీ)గా శశిధర్ జగ్దీశన్ నియమితులయ్యారు. ఆదిత్యపురి స్థానంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్త చీఫ్ నియామకానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆమోదముద్ర పడినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మంగళవారం తెలిపింది. అక్టోబర్ 27 నుంచీ మూడేళ్లపాటు జగ్దీశన్ ఈ బాధ్యతల్లో ఉంటారు. 25 యేళ్ల అనుబంధం హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో గత 25 సంవత్సరాలుగా జగ్దీశన్ వివిధ కీలక బాధ్యతలను నిర్వహించారు. బ్యాంక్‌లో అత్యుత్తమ రీతిలో ‘స్ట్రేటజిక్ చేంజ్ ఏజెంట్’గా పనిచేస్తున్న ఘనత ఆయనకు ఉంది. ఇండియన్ బ్యాంకింగ్ రంగంలో అపార అనుభవం ఉన్న కొద్ది మందిలో 55 సంవత్సరాల జగ్దీశన్ ఒకరు. అత్యున్నత స్థాయి వర్గాల సమాచారం ప్రకారం– సోమవారం సాయంత్రం మొత్తం మూడు పేర్లను ఆమోదం నిమిత్తం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బోర్డ్ ఆర్బీఐకి పంపింది. ఇందులో జగ్దీశన్ పేరు బ్యాంక్ బోర్డ్ మొదటి ప్రాధాన్యతలో ఉంది. హోల్‌సేల్ లెండింగ్ చీఫ్ కజాద్ బారూచా, సిటీ కమర్షియల్ బ్యాంక్ సీఈఓ సునీల్ గార్గ్‌లు బ్యాంక్ బోర్డ్ ఆర్బీఐకి పంపిన జాబితాలో మరో రెండు పేర్లు. జర్మన్ బ్యాంక్ డాయిష్ బ్యాంక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 1996లో జగ్దీశన్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫైనాన్స్ శాఖలో మేనేజర్‌గా చేరారు. 1999లో ఫైనాన్స్ విభాగం బిజినెస్ హెడ్ అయ్యారు. 2008లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ స్థాయికి ఎదిగారు. తరువాత బ్యాంక్ అన్ని విభాగాల అత్యుత్తమ నిర్వహణ, పర్యవేక్షణకు సంబంధించి ‘చేంజ్ ఏజెంట్’గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ బాధ్యతలతోపాటు ఫైనాన్స్, మానవ వనరులు, న్యాయ, సెక్రటేరియల్, అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్, కార్పొరేట్ సామాజిక బాధ్యతల వంటి కీలక విభాగాలు ఆయన కనుసన్నల్లో ఉన్నాయి. బ్యాంక్ లాభాల బాట... ఆదిత్యపురి సుదీర్ఘ బాధ్యతల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎన్నో విజయాలు సాధించింది. ఇన్వెస్టర్లకు విశ్వసనీయ బ్యాంక్‌గా మార్కెట్క్యాప్ రూ.5.71 లక్షల కోట్లకుపైగా చేరింది. మొండిబకాయిల భారం భారీగా పెరిగిపోకుండా పటిష్ట నియంత్రణలు ఇక్కడ చెప్పుకోవచ్చు. 70 సంవత్సరాల పురి పదవీ కాలంలోని తొలి పదేళ్లలో బ్యాంక్ 30 శాతంపైగా లాభాల వృద్ధిని నమోదుచేసుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థ మందగించిన నేపథ్యంలో ఇటీవలి సంవత్సరాల్లో ఈ శాతం 20కి తగ్గింది. ఈ ఏడాది జూన్ నాటికి బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ 15.45 లక్షల కోట్లు. ఇందులో రూ.10 లక్షల కోట్ల రుణాల పోర్ట్‌ఫోలియో ఉంది. బ్యాం క్కు ప్రస్తుతం ఉన్న నాన్–బ్యాంక్ అనుబంధ సంస్థ హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ త్వరలో లిస్ట్‌కానుంది. పురి బాధ్య తలు అక్టోబర్ 26తో ముగుస్తాయనీ, తరువాతి రోజు నుంచీ జగ్దీశన్ ఆ చైర్‌లోకి వస్తారనీ స్టాక్ ఎక్సే్చంజీలకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. సవాళ్లున్నాయ్... బ్యాంక్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కీలక సవాళ్లు జగ్దీశన్కు ఎదురుకానున్నాయి. అనిశ్చితి ఆర్థిక వాతావరణంలో బ్యాంక్ నిర్వహణ ఇందులో మొదటిది. కరోనా మహమ్మారి తీవ్రత నేపథ్యంలో గత లాభాల బాటలో కొనసాగడానికి బ్యాంక్ కొత్త వ్యాపార వ్యూహాలను రచించాల్సి ఉంటుంది. ఇక బ్యాంక్ వాహన ఫైనాన్స్ బిజినెస్‌లో అసమంజస రుణ విధానాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై ఇప్పటికే పలువురు ఎగ్జిక్యూటివ్‌ల తొలగింపులు, బదిలీలు జరిగాయి. ఈ తరహా ఆందోళనలను జగ్దీశన్ పూర్తిస్థాయిలో నివారించాల్సి ఉంటుంది. దూసుకుపోయిన షేర్... కొత్త సీఈఓ నియామకం పట్ల ఇన్వెస్టర్లలో హర్షం వ్యక్తమైంది. మంగళవారం బాంబే స్టాక్ ఎక్సే్చంజ్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ 3.94 శాతం (రూ.39.45) ఎగసి రూ.1,041కి చేరింది. హర్షణీయం... ఈ నియామకం నాకు సం తోషాన్ని ఇచ్చింది. చేంజ్ ఏజెంట్‌గా నియమితులైననాటి నుంచీ ఆయనతో నేను ఎంతో సన్నిహితంగా పనిచేశాను. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడానికి తగిన అన్ని శక్తిసామర్థ్యాలు, నైపుణ్యత శశిధర్ జగదీశన్‌కు ఉన్నాయని నేను విశ్వసిస్తున్నాను. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అత్యుత్తమ వ్యక్తి చేతుల్లో ఉందని భావిస్తున్నాను. మరిన్ని విజయాలు సాధిస్తారని విశ్వసిస్తున్నాను. – ఆదిత్యపురి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈఓ -
వాటాను విక్రయించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈవో
దేశీయ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఆదిత్య పురి ఇదే బ్యాంకులో కొంత మొత్తంలో తన వాటాను విక్రయించారు. ఆదిత్య ఈ జూలై 21-24 తేదిల మధ్య 74.2లక్షల ఈక్విటీ షేర్లను రూ.843 కోట్లను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆదిత్య గతకొన్నేళ్లుగా ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్(ఈఎస్ఓపీ)ద్వారా దాదాపు 78లక్షల షేర్లను దక్కించుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020లో ఈఎస్ఓపీ ద్వారా 6.82 లక్షల ఈక్విటీ షేర్లను పొందారు. గత ఆర్థిక సంవత్సరం 2019-20లో స్టాక్ ఆప్షన్లను మినహాయించి ఆదిత్య రూ.18.92 కోట్ల జీతాభత్యాన్ని అందుకున్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకును 1994లో స్థాపించారు. నాటి నుంచి ఆదిత్యపురి బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పనిచేస్తారు. ఏడాది అక్టోబర్ 20తో ఆయన పదవీకాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో గతేడాది నవంబర్‌లో తదుపరి సీఈవో ఎంపిక కోసం బ్యాంకు బోర్డు సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటిలో 6గురు సభ్యులున్నారు. ఈ పదవిలో రేసులో శశిధర్ జగ్‌దీషన్, కైజద్ బరుచా, సునీల్ గార్గ్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ బ్యాంక్ షేరు 3.50శాతం క్రాష్: బ్యాంక్ సీఈవో వాటా విక్రయంతో నేడు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు సోమవారం 3.50శాతం నష్టాన్ని చవిచూసి రూ.1079.30 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మిడ్‌సెషన్ కల్లా 3.22శాతం నష్టంతో రూ.1082.80 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.738.90, రూ.1304.10గా ఉన్నాయి. ఈ మార్చి 24లో రూ.765 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. నాటి నుంచి ఏకంగా నేటి వరకు 46శాతం రికవరిని సాధించింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం రూ.6,659 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2020–21) తొలి త్రైమాసిక కాలంలో 20 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2019–20) క్యూ1లో రూ.5,568 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.6,659 కోట్లకు పెరిగిందని బ్యాంక్ తెలిపింది. ఆదాయం రూ.32,362 కోట్ల నుంచి రూ.34,453 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మరిన్ని వివరాలు... రుణ నాణ్యత మెరుగుపడింది. స్థూల మొండి బకాయిలు 1.40 శాతం నుంచి 1.36 శాతానికి, నికర మొండి బకాయిలు 0.43 శాతం నుంచి 0.33 శాతానికి తగ్గాయి. కేటాయింపులు రూ.2,614 కోట్ల నుంచి రూ.3,892 కోట్లకు పెరిగాయి. కాగా ఫలితాలపై సానుకూల అంచనాలతో శుక్రవారం ఈ షేర్ ధర బీఎస్ఈలో 3% లాభంతో రూ.1,099 వద్ద ముగిసింది. వారసుడు సొంత సంస్థ నుంచే... హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎమ్డీ, సీఈఓ ఆదిత్య పురి త్వరలో రిటైర్కాబోతున్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లోనే 25 ఏళ్లుగా పనిచేస్తున్న వ్యక్తే తన వారసుడయ్యే అవకాశాలున్నాయని ఆదిత్య పురి పేర్కొన్నారు. ఆ వ్యక్తి పేరును మాత్రం ఆయన వెల్లడించలేదు. శశిధర్ జగదీశన్, కైజాద్ బరూచాలు బ్యాంక్ సీఈఓ రేసులో ఉన్నారని సమాచారం. -
స్నేహం, బ్యాంకింగ్ వేర్వేరు
ముంబై: వ్యక్తిగత స్నేహాన్ని బ్యాంకింగ్ విధులకు దూరంగా ఉంచుకోవాలని తన సహచరులకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ ఆదిత్య పురి సూచించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యాకు గతంలో రుణ అభ్యర్థనను హెచ్డీఎఫ్సీ బ్యాంకు తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ... ‘‘ఒక బ్యాంకర్ ఏ వ్యక్తితోనైనా కలసి కాఫీ తాగొచ్చు. ఆ తర్వాత అతడు కోరుకున్నది చేయవచ్చు’’ అని చెబుతూ, తన చిరకాల సహోద్యోగి అయిన పరేష్ సుక్తాంకర్ గుర్తించి తెలియజేశారు. గతంలో విజయ్‌మాల్యాకు రుణ అభ్యర్థనను తిరస్కరించినది ఆయనే. ‘‘మీ సమాచారం కోసమే చెబుతున్నాను. వారు (మాల్యా ఉద్యోగులు) రుణం కోసం నా దగ్గరకు వచ్చారు. నేను వారికి కాఫీ అందించి, వారి అభ్యర్థనను పరిశీలిస్తానని చెప్పా. ఆ తర్వాత పరేష్ దాన్ని తోసిపుచ్చాడు’’ అని ఆదిత్య పురి పేర్కొన్నారు. -
ప్రపంచ టాప్–30 సీఈవోల్లో ఆదిత్యపురి
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాం కు ఎండీ ఆదిత్యపురి(66) మరోసారి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు సొం తం చేసుకున్నారు. ప్ర పంచంలోని అత్యుత్తమ 30 మంది సీఈవోల్లో ఆదిత్యపురిని ఒకరిగా అమెరికాకు చెందిన ఫైనాన్షియల్ మేగజైన్ బారన్స్ గుర్తించింది. ‘‘హెచ్డీఎఫ్సీ బ్యాంకును పురి ఒక స్టార్టప్ నుంచి ప్రపంచంలోనే అత్యధిక నాణ్యత గల బ్యాంకుల్లో ఒకటిగా మార్చా రు. రుణ ప్రమాణాలను పాటిస్తూ అద్భుతమైన లాభాలను తెచ్చిపెట్టారు. కార్పొరేట్ రుణాల నుంచి పూర్తి స్థాయి సేవలు అందించే రిటైల్ బ్యాంకుగా మార్చారు’’ అని బారన్స్ ప్రశంసించింది. -
అదేమీ ‘బ్యాడ్’ ఆలోచన కాదు..!
• బ్యాడ్ బ్యాంక్ ప్రతిపాదనపై • హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎండీ ఆదిత్యపురి • వ్యాలెట్లకు భవిష్యత్తు లేదంటూ సంచలన వ్యాఖ్యలు ముంబై: జాతీయ స్థాయిలో బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు ప్రతిపాదనను హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎండీ, సీఈవో ఆదిత్యపురి సమర్థించారు. నిత్యంగా మారిన మొండి బకాయిల (ఎన్పీఏ) సమస్యకు పరిష్కారం ఏదైనా దానికి ఆహ్వానం పలుకుతున్నట్టు చెప్పారు. జాతీయ బ్యాడ్ బ్యాంక్ ఆలోచన తన దృష్టిలో బ్యాడ్ ఐడియా (చెడు ఆలోచన) ఏ మాత్రం కాదన్నారు. ఎన్పీఏల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు పలు సంప్రదింపులతో ముందుకు వస్తున్నాయని, ఈ ప్రయత్నాలు ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్పీఏలకు సంబంధించి బ్యాడ్ బ్యాంక్ ఓ ఆలోచనేనని, దివాళా కోడ్ కూడా ఈ దిశగా మేలు చేస్తుందన్నారు. బ్యాంకర్లుగా తాము సైతం ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన నాస్కామ్ వార్షిక నాయకత్వ సదస్సులో భాగంగా ఆదిత్య పురి పలు అంశాలపై మాట్లాడారు. ‘‘20% బ్యాంకుల ఆస్తులు ఒత్తిడిలో ఉన్నవే. వీటిలో ఎన్పీఏలే సెప్టెంబర్ త్రైమాసికం వరకు 13.5%గా ఉన్నాయి. 70%కిపైగా వ్యవస్థ అంతా ప్రభుత్వ రంగ బ్యాంకుల నిర్వహణలో ఉన్నదే. 90%కి పైగా ఒత్తిడిలో ఉన్న ఆస్తులు వాటివే’’ అని ఆదిత్యపురి వివరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు నగదు కొరత ఎదుర్కొంటుంటే వాటికి ప్రభుత్వ సాయం చాలినంత లేదన్నారు. 24 పీఎస్బీలకు కేవలం రూ.10వేల కోట్లను 2018 బడ్జెట్లో కేటాయించడాన్ని ఆయన గుర్తుచేశారు. 2017, అంతకుముందు సంవత్సరాల్లో ఈ సాయం రూ.25వేల కోట్లుగా ఉందన్నారు. అదే సమయంలో వచ్చే రెండేళ్లలో పీఎస్బీలకు రూ.91,000 కోట్ల అవసరం ఉందని ఆదిత్యపురి పేర్కొన్నారు. బాసెల్–3 నియమాలకు అనుగుణంగా 2015 నుంచి 2019 వరకు బ్యాంకులకు రూ.3.9 లక్షల కోట్లు అవసరమని చెప్పారు. కోటక్ బ్యాంక్ సైతం మద్దతు బ్యాడ్ బ్యాంక్ తరహా ఏర్పాటు అవసరాన్ని ఇటీవలి ఆర్థిక సర్వే కూడా నొక్కి చెప్పిన విషయం తెలిసిందే. అలాగే, కోటక్ మహింద్రా బ్యాంకు వైస్ చైర్మన్ ఉదయ్‌కోటక్ సైతం జాతీయ బ్యాడ్ బ్యాంకు ఏర్పాటుకు అనుకూలంగా గురువారం ప్రకటన చేసిన విషయం విదితమే. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దీని అవసరం ఉందని ఆయన చెప్పడం గమనార్హం. వివిధ రంగాలకు రుణాలిచ్చేందుకు వీలుగా బ్యాంకింగ్ వ్యవస్థపై ఉన్న ఒత్తిడిని తప్పనిసరిగా తొలగించాల్సిన అవసరం ఉందని ఉదయ్‌కోటక్ చెప్పారు. కనుక బ్యాడ్ బ్యాంక్ అనేది మంచి ఆలోచనగా ఆయన పేర్కొన్నారు. వ్యవస్థలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎక్కువ సంఖ్యలో ఉండాల్సిన అవసరం ఏంటని కూడా ఆయన ప్రశ్నించారు. ఆర్థిక రంగానికి 24 ప్రభుత్వ రంగ బ్యాంకులు అవసరం లేదని, బలమైన బ్యాంకులు కొన్ని సరిపోతాయన్నారు. ‘వ్యాలెట్లు’ మూసుకోవాల్సిందే..! పేటీఎం తరహా ప్రీపెయిడ్ వ్యాలెట్ల విషయంలో ఆదిత్యపురి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యాష్ బ్యాక్ ఆఫర్ల ద్వారా వ్యాలెట్ కంపెనీలు కస్టమర్లను అట్టిపెట్టుకోవడం నష్టాలకు దారి తీస్తుందని, ఆ తర్వాత వాటికి భవిష్యత్తు ఉండదన్నారు. ‘‘వ్యాలెట్లకు భవిష్యత్తు లేదన్నది నా అభిప్రాయం. చెల్లింపుల వ్యాపారంలో భవిష్యత్తులోనూ కొనసాగేందుకు వీలుగా వాటికి తగినంత మార్జిన్ లేదు. వ్యాలెట్లు ఆర్థికంగా గిట్టుబాటవుతాయన్నది సందేహమే. ప్రస్తుతం మార్కెట్ లీడర్‌గా ఉన్న పేటీఎం రూ.1,651 కోట్ల నష్టాలను నమోదు చేసింది. రూ.500 చెల్లించి రూ.250 క్యాష్ బ్యాక్ వెనక్కి తీసుకో తరహా వ్యాపారం మనుగడ సాగించదు’’ అని ఆదిత్యపురి పేర్కొన్నారు. నిజానికి హెచ్డీఎఫ్సీ బ్యాంకు సైతం చిలర్ పేరుతో వ్యాలెట్ కలిగి ఉండగా, ఆదిత్యపురి వీటికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఆదిత్య పురి జీతం 9.73 కోట్లు!
⇔ ప్రయివేటు బ్యాంకుల చీఫ్‌లలో టాప్ ⇔ గతేడాదితో పోలిస్తే 32% పెరుగుదల ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంకు మేనేజింగ్ డెరైక్టరు ఆదిత్య పురి వార్షిక వేతనం 32 శాతం పెరిగింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ప్రయివేటు బ్యాంకు చీఫ్లందరిలోనూ రూ.7.39 కోట్ల వేతనం తీసుకుని నెంబర్-1గా నిలిచిన పురి... ఈ ఏడాది కూడా దాన్ని కొనసాగించారు. 2015-16లో కూడా దానికన్నా 32% అధికంగా రూ.9.73 కోట్ల వేతనాన్ని హెచ్డీఎఫ్సీ బ్యాంకు చెల్లించింది. ఆదిత్య పురి తరవాత హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఉన్నత స్థానంలో ఉన్న డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టరు పరేష్ సుక్తాంకర్కు రూ.5.14 కోట్లు, ఎగ్జిక్యూటివ్ డెరైక్టరు కైజాద్ భరూచాకు 3.46 కోట్లు చెల్లించినట్లు బ్యాంకు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు నికరలాభం 20 శాతం పెరిగి రూ.12,296 కోట్లకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఎన్పీఏలు 0.94 శాతానికి పరిమితం కాగా... బ్యాంకు ఆస్తుల నాణ్యత కూడా స్థిరంగా ఉంది. అంతకు ముందటి సంవత్సరంతో పోలిస్తే ఎన్పీఏలు 0.97 శాతం నుంచి 0.94 శాతానికి తగ్గింది. -
దేశీ కరెన్సీకి...‘యువాన్’ కష్టాలు
చైనా కరెన్సీ దెబ్బకి మరింత కనిష్టానికి రూపాయి 32 పైసలు డౌన్; 65.10 వద్ద క్లోజ్ ముంబై : చైనా కరెన్సీ యువాన్ డీవేల్యుయేషన్ ప్రభావాలతో రూపాయి కుదేలవుతోంది. వరుసగా ఏడో సెషన్లోనూ క్షీణించి కీలకమైన 65 మార్కు దిగువకి పడిపోయింది. గురువారం డాలర్‌తో పోలిస్తే దేశీ కరెన్సీ మారకం విలువ 32 పైసలు తగ్గి 65.10 వద్ద ముగిసింది. 2013 సెప్టెంబర్ తర్వాత రూపాయి ఈ స్థాయికి క్షీణించడం ఇదే తొలిసారి. 2013 సెప్టెంబర్ 6న రూపాయి 65.24 వద్ద ముగిసింది. మొత్తం మీద ఏడు సెషన్లలో రూపాయి మారకం విలువ 136 పైసలు (2.13 శాతం) మేర పతనమైంది. డీవేల్యుయేషన్తో చైనా కరెన్సీ యువాన్ విలువ మంగళవారం దాదాపు 1.9 శాతం, బుధవారం 1.6 శాతం, గురువారం మరో 1.1 శాతం క్షీణించి ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే 6.4గా ట్రేడవుతోంది. గురువారం ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 64.78తో పోలిస్తే కొంత మెరుగ్గా 64.72 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. ఈక్విటీ మార్కెట్లు కొంత మెరుగుపడి, ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడంతో ఒక దశలో 64.63 గరిష్టాన్ని కూడా తాకింది. కానీ, ఆ తర్వాత బ్యాంకులు, దిగుమతి సంస్థల నుంచి కొత్తగా డాలర్లకు డిమాండ్ రావడంతో రూపాయి క్షీణించింది. ఇంట్రాడేలో 64.63-65.23 శ్రేణిలో రూపాయి తిరుగాడింది. డాలర్‌తో పోలిస్తే స్పాట్ మార్కెట్లో రూపాయి ఇక 64.70-65.70 శ్రేణిలో తిరుగాడవచ్చని వెరాసిటీ గ్రూప్ సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు. యువాన్ డీవేల్యుయేషన్ ప్రమాదకరం .. చైనా తమ కరెన్సీ విలువను తగ్గిస్తుండటం చాలా ప్రమాదకరమైన, అనూహ్యమైన పరిణామమని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ ఆదిత్య పురి వ్యాఖ్యానించారు. ఏవైనా తక్షణ దిద్దుబాటు చర్యలు లేకపోతే.. దీనివల్ల ఎగుమతుల్లో చైనాతో పోటీపడే మిగతా దేశాలు కూడా తమ కరెన్సీలను డీవేల్యూ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని ఆయన చెప్పారు. మరోవైపు, మార్కెట్లు ఇప్పటికే కొంత స్థిరపడ్డాయని, భారతదేశం ఎగుమతులు దెబ్బతినకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోగలదని కొటక్ మహీంద్రా బ్యాంక్ చైర్మన్ ఉదయ్ కొటక్ ధీమా వ్యక్తం చేశారు. వడ్డీ రేట్లు తగ్గితే మంచిది.. ప్రస్తుత పరిస్థితుల్లో దేశీయంగా వడ్డీ రేట్లు తగ్గించాల్సిన అవసరం ఉందని ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి పరోక్షంగా పేర్కొన్నారు. అమెరికా, యూరప్ మొదలైన చోట్ల వడ్డీ రేట్లు అంతగా లేకపోవడం, భారత్‌లో అధిక వడ్డీ రేట్లు ఉండటం ఇన్వెస్టర్లు ఇటువైపు ఆకర్షితులవుతున్నారని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం రూ.2,696 కోట్లు
రేట్ల కోత స్వల్పమేనంటున్న బ్యాంక్ చైర్పర్సన్ న్యూఢిల్లీ/ముంబై : ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కు రూ.2,696 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు సాధించిన నికర లాభం(రూ.2,233 కోట్లు)తో పోల్చితే 21 శాతం వృద్ధి సాధించామని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేర్కొంది. గత క్యూ1లో రూ.13,071 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో 26 శాతం వృద్ధితో రూ.16,503 కోట్లకు పెరిగిందని వివరించింది. నికర వడ్డీ మార్జిన్లు 4.4 శాతం నుంచి 4.3 శాతానికి తగ్గాయని తెలిపింది. నికర వడ్డీ ఆదాయం మాత్రం రూ.5,172 కోట్ల నుంచి 24 శాతం వృద్ధితో రూ.6,389 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఇతర ఆదాయం(వడ్డీయేతర ఆదాయం) 33 శాతం వృద్ధితో రూ.2,462 కోట్లకు చేరిందని వివరించింది. స్థూల మొండి బకాయిలు 1.07 శాతం నుంచి 0.95 శాతానికి తగ్గగా, నికర మొండి బకాయిలు 0.27 శాతంగా ఉన్నాయని తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు వరుసగా రెండో క్వార్టర్లో కూడా పెరిగాయని బ్యాంక్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆదిత్య పురి చెప్పారు. అయితే తమ బ్యాంక్‌పై ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పారు. ఏడాదిచివరి కల్లా వడ్డీరేట్లు 0.75 శాతం మేర తగ్గే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ ఏడాది గరిష్ట స్థాయి(రూ.1,128)ని తాకి 1.5 శాతం నష్టంతో రూ.1,098 వద్ద ముగిసింది. -
శిక్షణతో పాటే సూక్ష్మ రుణాలు
ఇంటర్వ్యూ: ‘సాక్షి’తో హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎండీ ఆదిత్యపురి ఆంధ్రప్రదేశ్‌లో అలా ఇవ్వలేదు కనకే ఆత్మహత్యలు రుణ గ్రహీతలకు శిక్షణ ఏ బ్యాంకూ ఇవ్వటం లేదు ఆంధ్రప్రదేశ్‌లో మా సూక్ష్మ రుణాలు పెరగాల్సి ఉంది ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా ఇవ్వటం మాకిష్టం లేదు దీనిపైనే రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం అన్నీ చూసుకుంటే 26 శాతం వడ్డీ పెద్ద ఎక్కువేమీ కాదు వచ్చే ఐదేళ్లలో గ్రామీణ వాటా 50 శాతానికి తీసుకెళతాం కోటి మంది మహిళలకు సూక్ష్మ రుణాలివ్వాలన్నది లక్ష్యం ఈ ఏడాది రుణాల్లో వృద్ధి 15 శాతం ఉండొచ్చు డిపాజిట్లు కూడా 13 శాతం వరకూ పెరిగే అవకాశముంది ఆదిత్యపురి. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీకి ఎండీ. బ్యాంకు సేవల్ని గ్రామాల దిశగా తీసుకెళుతున్న వ్యక్తి. సస్టెయినబుల్ లైవ్లీహుడ్ ఇనీషియేటివ్ (ఎస్ఎల్ఐ) కింద 20 లక్షల మంది గ్రామీణ మహిళలకు సూక్ష్మ రుణాలిచ్చి... ఈ సందర్భంగా జైపూర్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ సాక్షి బిజినెస్ ఎడిటర్ ఎం.రమణమూర్తితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మ రుణాల తీరుతెన్నులపై సాగిన ఈ ఇంటర్య్వూ... సస్టెయినబుల్ లైవ్లీహుడ్ ఇనీషియేటివ్... పూర్తిగా మైక్రోఫైనాన్స్ మోడల్లోనే ఉందిగా? మేమిస్తున్నది సూక్ష్మ రుణాలే. కానీ దీన్లో కొత్తదనమేంటంటే శిక్షణ. వేరెవ్వరూ రుణాలిస్తూ... రుణగ్రహీతలకు శిక్షణ ఇవ్వటం లేదు. మేం దీన్ని బిజినెస్‌తోపాటు బాధ్యతగా కూడా భావిస్తున్నాం. రుణం కావాల్సిన గ్రామాలను గుర్తించటం, అక్కడి మహిళలతో మాట్లాడి స్వయం సహాయక గ్రూపుల్ని ఏర్పాటు చేయటం... వారికి రుణాలిచ్చేటపుడు కౌన్సెలింగ్ చేయటం, అవసరమైన అంశాల్లో వారికి శిక్షణనివ్వటం... ఇదంతా మా సిబ్బందే చేస్తారు. అంటే దీన్లో స్థానిక నాయకులు, ప్రభుత్వ గ్రూపుల ప్రమేయం ఉండదా? ఉండదు. ఎందుకంటే 3,500 మంది సిబ్బంది దీనికోసమే ప్రత్యేకంగా పనిచేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరాంతానికి ఈ సంఖ్యను మరో 50 శాతం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ సూక్ష్మ రుణాలకు వసూలు చేసే వడ్డీ ఎంత? దాదాపు 26 శాతం. కాకుంటే దీన్లో శిక్షణ వంటివి కూడా ఉంటాయి. వాటికి ఎలాంటి చార్జీలూ వసూలు చేయటం లేదు. మేమే స్థానికంగా ఉన్న శిక్షకులకు పారితోషికం చెల్లించి గ్రామాల్లో పదేసి రోజుల శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ శిక్షణకు మా దగ్గర సూక్ష్మరుణాలు తీసుకున్న మహిళలతో పాటు స్థానికంగా ఆసక్తి ఉన్నవారు కూడా హాజరవుతున్నారు. వారి నుంచి కూడా ఎలాంటి చార్జీలూ వసూలు చేయటం లేదు. శిక్షణకయ్యే ఖర్చు వగైరా కూడా కలిసి ఉంటాయి కనక మొత్తం 26 శాతాన్నీ వడ్డీగా భావించలేం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో వడ్డీపై పరిమితి విధిస్తూ ఆర్డినెన్స్ ఉంది కదా? మా రుణాలపై వసూలు చేస్తున్న వడ్డీ ఈ ఆర్డినెన్స్ నిర్దేశించిన పరిమితిలోపే ఉంది. అంతకన్నా ఎక్కువ వసూలు చేస్తున్నామని నేననుకోవటం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికి 4 క్లస్టర్లలోనే సేవలందిస్తున్నట్లు చెప్పారు? విస్తరణ ఆగిందేం? అలాంటిదేమీ లేదు. అక్కడి చాలా జిల్లాల్లో రుణాల ఆవశ్యకత ఉంది. అక్కడ స్వయం సహాయక బృందాలు కూడా చాలా పటిష్టంగా ఉన్నాయి. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏ సూక్ష్మ రుణాలనైనా అక్కడి ‘సెర్ప్’ వంటి ప్రభుత్వ ఏజెన్సీల ద్వారానే ఇవ్వాలంటోంది. మేం స్వతంత్రంగానే ఇస్తామంటున్నాం. ఈ విషయంపై ఇరువురి మధ్యా చర్చలు జరుగుతున్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మ రుణాలు తీసుకుని, తిరిగి చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే ప్రభుత్వం అలా... కావచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగిందో ఇక్కడ చెప్పాలి. అక్కడ మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఉత్పాదకతను దృష్టిలో పెట్టుకుని రుణాలివ్వలేదు. రుణమనేది ఏ వ్యాపారానికో, స్వయం ఉపాధికో ఇస్తే ఆ రుణం ద్వారా సంపాదించి వారు తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. కానీ టీవీలు, ఫ్రిజ్‌ల వంటి వినియోగ వస్తువులకు కూడా వారు సూక్ష్మ రుణాలిచ్చేశారు. దీనివల్ల రుణాలు తీసుకున్న వారు తిరిగి చెల్లించలేని పరిస్థితి తలెత్తింది. ఒక సంస్థ రుణం తీర్చడానికి వేరే సంస్థ దగ్గర సూక్ష్మ రుణం తీసుకునేవారు. ఇలా వారు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. చివరికి ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. కానీ మేం ఉపాధితో ముడిపడ్డ కార్యకలాపాలకే రుణాలిస్తున్నాం. దీన్లోనే పొదుపును కూడా ప్రోత్సహిస్తున్నాం. వారు సంపాదించిన దాంట్లో కొంత వాయిదాకు పోగా... కొంత పొదుపు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నాం. ఆ పొదుపుతో వారు వినియోగ వస్తువులు కొనుక్కున్నా పర్వాలేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఎంఎఫ్ఐలు మరీ అత్యాశకు పోయాయంటున్నారు కదా? ఏ సంస్థలవి? అందరికీ తెలిసిందే. నేను వాటి పేర్లు ప్రస్తావించటం బాగుండదు. ఎస్ఎల్ఐకి సంబంధించి మీ లక్ష్యాలేంటి? బ్యాంకింగ్ వ్యవస్థ ఎక్కువగా నగరాలు, పట్టణాలకే పరిమితమవుతోంది. దాన్ని గ్రామాలకు తీసుకెళ్లడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మా బ్యాంకింగ్‌ను చూసినా మా శాఖల్లో 56 శాతం సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ వాటి నుంచి వచ్చే ఆదాయం మాత్రం 15 శాతమే. అందుకే వచ్చే ఐదేళ్లలో ఈ సెగ్మెంట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని 50 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గడిచిన మూడేళ్లలో 7వేల గ్రామాల్లో 20 లక్షల మందికి 2,500 కోట్ల రుణాల్ని ఎస్ఎల్ఐ కింద మంజూరు చేశాం. 24 రాష్ట్రాల్లో ఈ సేవలందిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరాంతానికి కోటి కుటుంబాలకు ఈ రుణాలివ్వాలన్నదే లక్ష్యం. దీన్నెందుకు మహిళలకే పరిమితం చేశారు? మహిళలకు ఆర్థిక శక్తి వస్తే వారు శక్తిమంతంగా మారతారు. మహిళ శక్తిమంతంగా మారితే కుటుంబం... తద్వారా సమాజం కూడా బలోపేతమవుతాయి. ఈ ఉద్దేశంతోనే ఎస్‌ఎల్‌ఐని మహిళలకే పరిమితం చేశాం. ఈ ఏడాది రుణాల్లో, డిపాజిట్లలో ఏ స్థాయి వృద్ధిని ఆశిస్తున్నారు? పరిస్థితులు నిరాశాజనకంగా ఉన్నాయి కదా? అలాంటిదేమీ లేదు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా మంచి వర్షాలు పడ్డాయి. పంటలు బావుంటే వ్యవస్థలో నగదు ప్రవాహం పెరుగుతుంది. లిక్విడిటీ మెరుగుపడితే రుణాలు, డిపాజిట్లు రెండూ పెరుగుతాయి. రుణాల్లో 15-16 శాతం వృద్ధి ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. ఆస్తులకన్నా డిపాజిట్ల బేస్ ఎక్కువ కాబట్టి 15 శాతం రుణాల వృద్ధిని తట్టుకోవటానికి డిపాజిట్లు 13 శాతం పెరిగితే చాలు. అది సాధ్యమవుతుందనే మా అంచనా. -
ఉత్పాదకత ఉంటేనే సూక్ష్మ రుణాలు
ఆంధ్రప్రదేశ్‌లో మైక్రో ఫైనాన్స్ సంస్థలు రుణాలిచ్చేటప్పుడు ఉత్పాదకతను విస్మరించాయని, వినియోగవస్తువులకు విరివిగా రుణాలివ్వటం వల్లే జనం అప్పుల ఊబిలో కూరుకుపోయారని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ ఆదిత్య పురి స్పష్టం చేశారు. ఒక రుణాన్ని తీర్చడానికి మరో రుణం తీసుకోవడం వంటి చర్యల వల్ల వారు రుణ ఊబిలో కూరుకుపోయారని, తాము తొలుత ఉత్పాదకతపై ఒక స్పష్టతకు వచ్చిన తరవాతే వారికి రుణాలను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. తమ బ్యాంకు చేపట్టిన సస్టెయినబుల్ లైవ్లీహుడ్ ఇనీషియేటివ్ (ఎస్ఎల్ఐ) కార్యక్రమం కింద ఇప్పటిదాకా 20 లక్షల మందికి రుణాలిచ్చినట్లు పురి తెలియచేశారు. ఈ సందర్భంగా రాజస్థాన్ రాజధాని జైపూర్ శివారు గ్రామం చోములో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న కోటి కుటుంబాల జీవన ప్రమాణాల్ని మెరుగుపర్చాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టామని పురి చెప్పారు. తమ బ్యాంకుకు చక్కని ఆర్థిక మూలాలతో పాటు మంచి మనసు కూడా ఉందని ఈ కార్యక్రమం నిరూపిస్తుందని చెప్పారు. గ్రామీణ రుణాలకు సంబంధించి 2003 నుంచి వివిధ ఫార్ములాలను అనుసరిస్తూ... ఒక దశలో బిజినెస్ కరస్పాండెంట్లను కూడా నియమించిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు... 2010 నుంచి ఎస్ఎల్ఐ ద్వారా వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. ఎస్ఎల్ఐ కింద గ్రామాలను ఎంపిక చేసుకొని అక్కడ సొంత సిబ్బందిని పంపి, వారి ద్వారా గ్రామస్తులకు ఆర్థిక సూత్రాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమంలో ఒక భాగం. తరువాత వారికి ఏయే అంశాలపై అవగాహన ఉందో తెలుసుకున్నాక, రుణంతో పాటు అవసరాన్ని బట్టి వారికి ఆయా అంశాల్లో ఉచిత శిక్షణ కూడా అందచేస్తారు. స్వయం సహాయక సంఘాలను, జాయింట్ లయబిలిటీ గ్రూపుల్ని ఏర్పాటు చేసి... ఆయా గ్రూపులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తారు. తద్వారా వారు తీసుకున్న రుణాన్ని ఉత్పాదకత కోసం ఉపయోగించే వీలుంటుంది. ఇలా చేయటం వల్ల తగిన ఆదాయం వస్తుంది కాబట్టి తిరిగి చెల్లించడానికి వారికెలాంటి ఇబ్బందీ ఉండదని ఆదిత్యపురి చెప్పారు. ఈ మేరకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మీడియా ప్రతినిధుల్ని చోము దగ్గరి ఫతేపురా గ్రామానికి తీసుకెళ్లి, అక్కడ మహిళా సంఘాలు పొందుతున్న శిక్షణను, రుణ వితరణ విధానాన్ని చూపించారు. బృందాలతో ప్రత్యక్షంగా మాట్లాడించారు. రుణం తీసుకోవాలనుకుంటున్న మహిళా గ్రూపుల్ని మొదట తాము ఆర్థిక సూత్రాలపై చైతన్యవంతం చేస్తామని, సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని వాయిదా చెల్లించడంతో పాటు కొంత మొత్తాన్ని ప్రతినెలా రికరింగ్ డిపాజిట్ చేసుకునేలా తామే సేవింగ్స్, ఆర్డీ ఖాతాలన్నీ కూడా వారి పేరిట తెరుస్తామని హెచ్డీఎఫ్సీ ఎస్ఎల్ఐ విభాగ అధిపతి మనోహర రాజ్ చెప్పారు. దానివల్ల ఆయా మహిళలు కొన్నాళ్లపాటు దాచుకున్నాక అవసరమైన వస్తువులను కొనుక్కునే అవకాశం ఉంటుందని చెప్పారాయన. గ్రామంలో మహిళలతో మాట్లాడినప్పుడు తాము నెలకు రూ.4,000 నుంచి రూ.4,500 వరకు సంపాదిస్తున్నామని, దాన్లో రూ.1,300 వాయిదా చెల్లించడానికి పోగా మిగిలిన దాంట్లో కనీసం నెలకు రూ.1,000 వరకు పొదుపు చేయగలుతున్నట్లు చెప్పారు. తదనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆదిత్య పురి, భారతదేశంలో కార్పొరేట్లు, అధికాదాయం కలిగిన వ్యక్తులను మినహాయిస్తే గ్రామాల్లో ఉంటూ ఏ రుణం లభ్యమయ్యే అవకాశం లేనివారే ఎక్కువన్నారు. అత్యధిక సంఖ్యలో ఉన్న ఈ వర్గం కోసమే తాము ఎస్‌ఎల్‌ఐని ఆరంభించామని, వచ్చే నాలుగైదు సంవత్సరాల్లో ఎస్ఎల్ఐ కార్యక్రమం కూడా బ్రేక్ ఈవెన్ దశకు చేరుకుంటుందని చెప్పారాయన. ప్రస్తుతం దేశంలోని 24 రాష్ట్రాల్లో 439 క్లస్టర్లలో ఎస్ఎల్ఐ సేవలు అందుతున్నట్లు చెప్పారు. 20 లక్షలమందికి రుణాలు ఇప్పటిదాకా 20 లక్షల మందికి ఎస్ఎల్ఐ పథకం కింద హెచ్డీఎఫ్సీ బ్యాంకు రుణాలు మంజూరు చేసింది. ఈ సందర్భంగా 20 లక్షల ఖాతాదారైన చోము గ్రామానికి చెందిన సజ్నాదేవిని ఆదిత్యపురి, బ్యాంకు సీనియర్ అధికారులు అభినందించారు. తనకు ఇప్పటిదాకా బ్యాంకు అంటే తెలియదని, తొలిసారి తాను ఎస్ఎల్ఐ పథకం కింద రుణం తీసుకున్నాక దాంతో ఆవుల్ని కొనుగోలు చేశానని, ప్రస్తుతం పొదుపు కూడా చేయగలుగుతున్నానని సజ్నాదేవి చెప్పారు. రుణం తిరిగి చెల్లించడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదని, ఒకవేళ ఆవు మరణించినా దానికి బీమా ఉందని, తన కుటుంబంలోని భార్యాభర్తలిద్దరికీ కూడా బీమా సౌకర్యం కల్పించారని విలేకరులడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారామె. జైపూర్ నుంచి మంథా రమణమూర్తి