ఆదిత్య పురి జీతం 9.73 కోట్లు!
⇔ ప్రయివేటు బ్యాంకుల చీఫ్‌లలో టాప్
⇔ గతేడాదితో పోలిస్తే 32% పెరుగుదల
ముంబై: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మేనేజింగ్ డెరైక్టరు ఆదిత్య పురి వార్షిక వేతనం 32 శాతం పెరిగింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ప్రయివేటు బ్యాంకు చీఫ్‌లందరిలోనూ రూ.7.39 కోట్ల వేతనం తీసుకుని నెంబర్-1గా నిలిచిన పురి... ఈ ఏడాది కూడా దాన్ని కొనసాగించారు. 2015-16లో కూడా దానికన్నా 32% అధికంగా రూ.9.73 కోట్ల వేతనాన్ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు చెల్లించింది. ఆదిత్య పురి తరవాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉన్నత స్థానంలో ఉన్న డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టరు పరేష్ సుక్తాంకర్‌కు రూ.5.14 కోట్లు, ఎగ్జిక్యూటివ్ డెరైక్టరు కైజాద్ భరూచాకు 3.46 కోట్లు చెల్లించినట్లు బ్యాంకు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు నికరలాభం 20 శాతం పెరిగి రూ.12,296 కోట్లకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఎన్‌పీఏలు 0.94 శాతానికి పరిమితం కాగా... బ్యాంకు ఆస్తుల నాణ్యత కూడా స్థిరంగా ఉంది. అంతకు ముందటి సంవత్సరంతో పోలిస్తే ఎన్‌పీఏలు 0.97 శాతం నుంచి 0.94 శాతానికి తగ్గింది.